Thursday, January 16, 2014

జ్ఞాపకాల 'అంజలి'..ప్రముఖ నటి అంజలీ దేవి స్వర్గతి వార్త విన్నప్పుడు వెంఠనే నాన్న గుర్తుకు వచ్చారు. తనకు ఫోన్ చేసి ఎలా చెప్పాలా అనుకుంటూంటే రేడియో వార్తల్లో విన్ననని తనే చెప్పారు..!ఆయనకు ప్రియమైన నటీమణుల జాబితాలో మొదటిస్థానం అంజలీదేవిదే! అప్పటికి వారం రోజులుగా కాస్త నలతగా ఉండి పండుగకు రానని చెప్పినదాన్ని కూడా ఎలాగో తంటాలు పడి ఇంటికి వెళ్ళి నాన్నగారిని కలిసి, కాసేపు గడిపి వచ్చాను. తిరిగి వస్తూ చిన్నప్పటి నుండీ ఆయన దగ్గర వింటూ వచ్చిన అంజలీదేవి జ్ఞాపకాలు కొన్ని మూటకట్టుకు వచ్చాను. కాస్త కూచుని రాసే ఓపిక వచ్చాకా ఆ జ్ఞాపకాల పూలన్నీ ఈ టపాలో గుమ్మరించేస్తున్నా...! పెద్ద వయసు, సంతృప్తికరమైన పూర్ణజీవితాన్ని చూసినావిడ కనుక చింతపడనవసరం లేకపోయినా తెలుగుతెరపై వెలిగిన ఒక మహానటిగా ఆమె  జ్ఞాపకాలను మరోసారి నెమరువేసుకోవాలని నా అభిలాష..నాన్నావాళ్ళూ చిన్నప్పుడూ వాళ్ళ ఊరు ఖండవిల్లి నుండి ఏడుమైళ్ళు గుర్రబ్బండిలో తణుకు వెళ్ళి సినిమా చూసి వచ్చేవారుట. ఆ కాలంలో సినిమా చూడాలంటే అంత యాతన పడాల్సివచ్చేది. నాన్నకు పదిపన్నెండేళ్ళు ఉన్నప్పుడు చూసిన సినిమాల్లో అంజలీదేవి నటించిన పరదేశి(1951), అనార్కలి(1955), ఇలవేల్పు(1956) చిత్రాలు బాగా గుర్తుండిపోయాయి... రువాత ఎన్ని అంజలి సినిమాలు చూసినా, 'పరదేశి'లో "నేనెందుకు రావాలి ఎవరికోసమో.." అనే పాట, 'అనార్కలి'లో "రావోయీ సిపాయి..’ , 'ఇలవేల్పు' లో "చల్లని రాజా ఓ చందమామ.." పాటలు ఇప్పటికీ బాగా గుర్తుండిపోయాయి అంటారు నాన్న. డాన్స్  బాగా చేసేది.. ప్రేక్షకుల మనసుకు హత్తుకునేలా మంచి క్లోజప్ షాట్స్ ఉండేవి.. పైగా అప్పటి cameramen కెమేరాకి డిఫ్యూజర్లు అవీ వేసి, అంజలి ని బాగా గ్లామరస్ గా చూపించేవారు కూడా అని చెప్తారాయన. అలనాటి అంజలి నుండీ ఇవాళ్టి నిత్యామీనన్ వరకూ తనకెందరో ప్రియమైన నటీమణులున్నా, వారందరిలో తను మొట్టమొదట అభిమానించిన అంజలిదే ప్రధమ స్థానం అంటారు నాన్న!నాన్న స్కూల్లో చదివే కాలంలోనే మద్రాసు చాలాసార్లు వెళ్ళొస్తుండేవారుట. వీనస్ స్టూడియో తాలూకూ కెమేరా డిపార్ట్మెంట్ లో నాగేశ్వర్రావ్ అనే సమీప బంధువు పనిచేస్తూ ఉండడం వల్ల, తరచూ నెల్లూరు నుండి మద్ర్రాసు వెళ్ళి లా షూటింగులు చూస్తూండేవారిట. అక్కడ ఆళ్వార్ పేట లోని వీనస్ స్టూడియోలో 'అంజలీ పిక్చర్స్' వాళ్ల చిత్రాలు షూటింగ్ జరుగుతూ ఉండేవిట. నాన్న కాలేజీ రోజుల్లో ఉండగా ఒకసారి ఎన్.టి.ఆర్,అంజలీదేవి నటించిన స్వర్ణమంజరి(1962) చిత్రం క్లైమాక్స్ సీన్ షూట్ జరుగుతోందిట. ఓ కొండ కొమ్ము మీద ఎన్.టి.ఆర్ వేళ్ళాడుతూండగా, రాజనాల తన కాలుతోటి హీరో చేతిని తొక్కుతూండడం ఆనాటి సన్నివేశం. క్రింద అగాధమైన లోయ.. అదొక ట్రిక్ షాట్. కొంద కొమ్ము వరకూ సినిమా సెట్, అగాధమైన లోయ మాత్రం పెద్ద అద్దం మీద పెయిటింగ్ చేసి, దాని వెనక కెమేరా పెట్టి ఆ ట్రిక్ షాట్ తీస్తున్నారుట. అలానే ఆ సినిమాలోని మిగిలిన ట్రిక్ షాట్స్ కూడా చూసే అవకాశం అప్పుడు నాన్నకు దొరికిందిట. అంజలీ పిక్చర్స్ వారే "ఫూలోం కీ సేజ్" అనే హిందీ చిత్రాన్ని నిర్మించారుట. అందులో మనోజ్ కుమార్ , వైజయంతిమాల ప్రధాన పాత్రధారులు. ఆ షూటింగ్ కూడా వీనస్ స్టూడియోలోనే తీశారుట. ఆదినారాయనరావు దంపతులు పాల్గొన్న ఆ పిక్చర్ ముహుర్తం షాట్ కి కూడా నాన్న హాజరయ్యారుట.ఎనభైల తర్వాత బెజవాడ రేడియో స్టేషన్ కొత్త స్తూడియోల్లోకి మారిన తరువాత ఓసారి ఆదినారాయణరావు గారు, అంజలీ దేవీ బెజవాడ వచ్చారుట. ఆ కాలంలో బెజవాడే సినీపరిశ్రమకు ముఖ్య రంగంగా ఉండేది. ఎందుకంటే సినిమా డిస్ట్రిబ్యూటర్లు, ఫైనాన్షియర్లు మొదలైన కీలక రంగాలవారు అక్కడే ఉండేవారు మరి. బెజవాడలో పిక్చర్ కి హిట్ టాక్ వస్తే, ఆ పిక్చర్ సక్సెస్సయినట్లే అనుకునే కాలం. అందుకని సినీరంగ ప్రముఖులు, నటీనటులు బెజవాడే ఎక్కువ వస్తూండేవారు అప్పట్లో. అలాంటి ఒక సందర్భంలో అంజలీదేవి దాంపతుల్ని రేడియో స్టేషన్ కి ఆహ్వానించారుట.  అప్పట్లో విజయచిత్ర మాస పత్రికవాళ్ళు 'సినీ నేపధ్య సంగీతం' అనే అంశం మీద  వ్యాస రచన పోటీ నిర్వహించారు. అందులో మొదటి బహుమతి నాన్న రాసిన వ్యాసానికి వచ్చింది. ఆ పోటీకి న్యాయనిర్ణేతగా ఆదినారాయణరావు గారు వ్యవహరించారని తర్వాత తెలిసింది. ఆ విషయం ఈ సందర్భంలో ప్రస్తావించారుట నాన్న. అప్పటికే ఆదినారాయనరావు గారు పెద్ద వయసులో ఉన్నందువల్ల, ఆయనకు ఎక్కువ మాట్లాడే అలవాటు లేనందువల్ల ఆయనతో కార్యక్రమం చెయ్యడానికి వీలుపడలేదుట కానీ అంజలీదేవితో మాత్రం వివిధభారతి వాణిజ్యవిభాగంలో, అప్పటికి ప్రజాదరణలో ఉన్న 'ప్రత్యేక జనరంజని' కార్యక్రమాన్ని నాన్న ప్రొడ్యూస్ చేసారుట. అలా తనకత్యంత ప్రియమైన నటీమణిని ఇంటర్వ్యూ చెయ్యడం చాలా సంతోషాన్ని కలిగించిందని నాన్న చెప్తారు.


అలనాటి నటీమణుల్లో సావిత్రి నాకు బాగా ఇష్టమైనా, అంజలీదేవి చిత్రాల్లో సంఘం, లవకుశ, అనార్కలి, చెంచు లక్ష్మి, రంగులరాట్నం, బడిపంతులు, సతీ సక్కుబాయి మొదలైన చిత్రాలు బాగా నచ్చుతాయి నాకు. మేము పుట్టపర్తి వెళ్ళినప్పుడల్లా వి.ఐ.పి ల లైన్స్ లో మొదటి వరుసలో అంజలి, జమున, గాయని సుశీల కనబడుతూ ఉండేవారు మాకు. మా తమ్ముడి కోసం పర్తిలో హాస్టల్ కు వెళ్ళేవాళ్ళం. అక్కడ ఆవిడ మనవడి కోసమనుకుంటా అంజలీదేవి కూడా వచ్చేవారు. అలా చాలాసార్లు దగ్గరగా ఆవిడను చూడటం జరిగింది. చిరునవ్వుతో ఎప్పుడూ ప్రసన్నంగా కనబడే ఆమె మొహం చాలా బావుంటుంది.

మూడు,నాలుగేళ్ల క్రితం ఓసారి మా పాపకు పిల్లల కథల సీడీలు అవీ కొంటూంటే అంజలీదేవి ఉన్న షార్ట్ ఫిల్మ్ సీడీ ఒకటి కనబడి అది కొన్నాం. "చిన్నారి పంతులమ్మ" అనే ఆ కథలో మనవరాలి దగ్గర తెలుగు నేర్చుకునే అమ్మమ్మ పాత్ర అంజలిది. ఇంట్లో పెద్దవాళ్ళున్న తీరే వేరని ఆ సీడీ చూసినప్పుడల్లా అనుకుంటూంటాం మేము. బావుంటుంది ఆ కథ కూడా. చాలాసార్లు ఆ సీడీ పెట్టుకుని చూస్తుంటుంది మా పాప. మొన్న శనివారమే ఆ సీడీ పెట్టుకుని చూస్తూంటే దానితో పాటూ మేమిద్దరం కూడా చూసాం మళ్ళీ! వయసు దాచడానికి మేకప్ బాగా వేసేసారు గానీ అంత వయసులో కూడా ఎలా నటించారో.. ఎంత పెద్దావిడైపోయారో ఈవిడ అనుకున్నాం ఆ రోజు.

హ్మ్..!! కాలమెవరి కోసమూ ఆగదు కదా.. ప్రపంచంలోని వింతలనూ, విశేషాలను, చరిత్రనూ, మనుషులనూ, వారి తాలూకూ స్మృతులనూ కూడా తనలో కలిపేసుకుంటూ పోవడమే దానికి తెలుసు..! మొన్న ఎందరో.. నిన్న అంజలి.. రేపు ఇంకెవరో.. ఇదే కాలచక్రం.. ఇదే జీవనగమనం..