సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Friday, June 14, 2013

ఎలక..!





నాల్రోజుల బట్టి రాత్రిళ్ళు ఏవో చప్పుళ్ళు వినిపిస్తూ పూర్వ స్మృతులను గుర్తుచేస్తున్నాయి. ఇక్కడా.. ఇన్నాళ్ళూ లేనిది ఇప్పుడేమిటీ.. అబ్బే అదయ్యుండదులే.... అని సర్ది చెప్పుకుంటూ వచ్చా కానీ నిన్న రాత్రి మరీ గట్టిగా శబ్దమై మెలకువ వచ్చేసింది. ఫ్రిజ్ ఉన్న గదిలోంచి శబ్దం అని కనిపెట్టి నెమ్మదిగా వెళ్ళి లైట్ వేసాను. ఫ్రిజ్ పక్కన గోడ దగ్గర ఉన్న క్యారమ్స్ బోర్డ్ వెనకాల నుండి శబ్దం. నెమ్మదిగా భయపడుతూనే బోర్డ్ కాస్త కదిపి వెనకవైపు చూశాను. అనుకున్నంతా అయ్యింది.. అదే.. అదే.. 'ఎలక'.. పెద్దదే.. ఇంతింత గుడ్లు వేసుకుని నన్నే చూస్తోంది. ఠక్కున బోర్డ్ వెనక్కి పెట్టేసి లైట్ ఆర్పేసాను.


బెజవాడ వదిలాకా, పెళ్ళయ్యాకా ఈ ఎలకల బాధ తప్పింది. ఇన్నేళ్ళూగా ఏ ఇంట్లోనూ తగల్లేదు. మళ్ళీ ఇప్పుడే.. ఇప్పుడేమిటి దారి? అమ్మలా తరమగలనా? ఎలకల్లేవనే ధైర్యంతో ఇంటి నిండా ఎక్కడ పడితే అక్కడ పుస్తకాలు వదిలేస్తున్నానీ మధ్యన. ఇంటివాళ్ళు గూళ్ళకు వుడ్వర్క్ కూడా చేయించలేదు. ఒక్క గూట్లోకి దూరినా బట్టలు, పుస్తకాలు అన్నీ నాశనం..:( అసలిప్పటికే ఏం కొరికేసిందో ఏమిటో! ఇలా ఆలోచిస్తూ తనతోనూ "ఏమండి ఎలకండి.." అన్నా. మూడో అంతస్తులోకి ఎలకెలా వచ్చిందీ? ఇన్నాళ్ళూ లేదుగా?" అన్నారు. "వస్తాయండి.. మా బెజవాడ క్వార్టర్స్ లో రెండో అంతస్తులోకి కూడా వచ్చేవి.. తెల్సా?! ఇంకా గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నప్పుడైతే నేనూ, అమ్మా కలిసి..."  "ఆపు..ఆపు.. చరిత్ర తవ్వకు. ఎలాగోలా ఎలకని వెళ్లగొడదాంలే.." అనేసారు శ్రీవారు. ఏమిటో అశాంతం చెప్పనివ్వరు కదా..


మేము బెజవాడలో నివాసమున్నక్వార్టర్స్ కట్టక ముందర అక్కడ చెట్లు పుట్టలతో అడవిలా ఉండేదట. అందుకే ఎప్పుడూ ముంగిసలు, పాములు, కప్పలు, ఎలకలు, పందికొక్కులు, చెట్లపై గుంపులుగా గబ్బిలాలు.. ఒకటేమిటీ సమస్త జీవరాసులు మాతో కలిసి కాపురముంటూండేవి. మేం గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నప్పుడు ఎంతగా కన్నాల్లో కర్రలు,గుడ్డముక్కలు కుక్కినా ఇంట్లోకి ఎలకలు తెగ వచ్చేవి. అవి మహా తెలివైనవి. బోనులో కూడా పడేవి కాదు. అప్పుడన్నీ చెక్క బోనులు కదా..పెట్టిన బజ్జీనో, పకోడీనో తినేసి, వాటిని కొరికేసి పారిపోయేవి. అందుకని మా అమ్మ "ఎలక" అనే జీవి కనబడటం ఆలస్యం యుధ్ధానికి రెడీ అయిపోయి నన్ను పిలిచేసేది. చప్పుడుని బట్టి ఎలక ఎక్కడ ఉందో గమనించి, దాన్ని కెలికి, హాల్లోకి వచ్చేలా చేసి, మిగతా గదుల తలుపులన్నీ వేసేసి అటు అమ్మ, ఇటు నేను కర్రలతో నిలబడి ఎలకని హాల్లో ఉన్న తలుపు గుండా బయటకు పారిపోయేలా చెయ్యటానికి బోల్డన్ని కసరత్తులు చేసేవాళ్లం. ఈ పనికి అర్ధరాత్రి అపరాత్రి ఉండేది కాదు. రాత్రి ఒంటిగంట అయినా సరే "ఎలకొచ్చిందే.." అని అమ్మ నిద్ర లేపేసేది. ఇంక మేమిద్దరం కర్రలతో రెడీ అయిపోయేవాళ్లం. అమ్మా,నేనూ ఎలకలని తరమడంలో బాగా అనుభవం గడించామనే చెప్పాలి. నిన్నరాత్రి ఇంట్లో ఎలకని చూసినప్పటి నుండీ ఆ పాత రోజులన్నీ తలుచుకుని, మళ్ళీ ఇప్పుడేమేమి యుధ్ధప్రయత్నాలు చెయ్యాలా అని పొద్దున్నుంచీ తెగ ఆలోచిస్తున్నా..


ఎందుకైనా మంచిదని అమ్మకి ఫోన్ చేసా. "మాకు బాగానే వస్తూంటాయే.. ఇప్పుడు 'రేట్ బిస్కెట్ల్స్' అని వస్తున్నాయి. అవి కొని పెట్టు." అని సలహా ఇచ్చింది అమ్మ. మా కమ్యూనిటీలో కొత్తగా పెట్టిన సూపర్ మార్కెట్లోంచి అది కొని తెచ్చా. ఇంక ఈ రాత్రికి పెట్టాలి. ఏమైన సరే దాన్ని తరిమేదాకా నిద్ర ఉండదు నాకు..




10 comments:

kiran said...

:)

Padmarpita said...

చూడ్డానికి అమాయకంగా ఉంటాయి కానీ అన్నీ నాశనం చేస్తాయి.....ఫోటో ఎలుక భలే ముద్దొస్తుంది:-)

ranivani said...

భలేగా రాస్తారండీ మీరు !బావుంది మీ మూషిక ప్రహసనం .ఎలక చావడానికి మందు పెట్టినపుడు దానికి .నీళ్ళు దొరక్కుండా చేయాలండోయ్!చెప్పారా? మీ అమ్మగారు .

హరేఫల said...

చివరకి విజయం సాధించారా లేదా...?

తృష్ణ said...

@kiran: :)
@padmarpita:అవునండి..
@nagarani yerra:చెప్పలేదండి.. అయినా ఓపెన్ గా నీళ్ళు ఉంచములెండి..
@హరేఫల: రాత్రే పెట్టానండి ఐదు ముక్కలు.. రెండు తింది.. ఇవాళ కనబడకపొతే వెళ్పోయినట్లే లెఖ్ఖ..

మాలా కుమార్ said...

తృష్ణగారు ,
నాలుగు నెలల నుంచి నన్నేడిపిస్తోంది నా చిట్టి శత్రువు. శ్రీలలిత గారు ఆ బిళ్ళలు పెడదామంటే మా అమ్మాయి ఒప్పుకోలేదు , వాటి కి అతుక్కుపోయి నరకయాతన పడతాయి , మనకు పాపం తగులుతుంది వద్దు అంటోంది.అప్పుడప్పుడు బోను తోనే ప్రయత్నిస్తున్నాను:)మొన్న ఎండాకాలం పాపం అదీ డస్సిపోయింది. అప్పుడప్పుడు కనిపిస్తుందికదా నీరసంగా వుండేది, కాని మమ్మలిని చూడగానే మటుకు ఎంత స్పీడ్ గా పరిగెత్తుతుందో:)
http://sahiti-mala.blogspot.in/2013/04/blog-post.html

Ennela said...

bhalE kaLLaku kaTTinaTTu kanipinchindi mee yuddham...I enjoyed it a lot

తృష్ణ said...

@mala kumar:మాల గారూ, భలే మీరు కూడా రాసారా.. బావుంది బావుంది :)

@Ennela: ఎన్నెలగారూ, థాంక్యూలు :)

SpaceCity Maverick said...

తృష్ణ గారూ, ఈ ఎలకతో నాకు వెంటాడే అనుభవం ఒకటి. రెండేళ్ళ క్రితం ఇల్లు మారినప్పుడు, కొత్త ఇంట్లోకి ఎలక ఒకటి వచ్చింది. కంటపడలేదెప్పుడూను.. కానీ పాంట్రీలో అదొచ్చి వెళ్ళిన చాయలు కనపడేవి. పెస్ట్ కంట్రోల్ వాడికి ఫోన్ చేసి ఏం చెయ్యమంటావు అని అడిగితే, విషం పెట్టమన్నాడు. ఇంకో మాట చెప్పమంటే, ట్రాప్ పెట్టమన్నాడు. అందులో దాని కాళ్ళు తోక ఇరుక్కుని నొప్పెడుతుంది, ఇంకోటి చెప్పమంటే, స్టికీపాడ్ లాంటిదేదో చెప్పాడు. అది అన్నిటికంటే దారుణం... ఆ సంగతి నాకు అప్పుడు తెలియదు. తెచ్చి పాంట్రీలో పెట్టాను. మరునాడు ఉదయం చూస్తే ఒక చిట్టి ఎలక ఆ స్టికీపాడ్ కి అతుక్కుని ఉంది. జాగ్రత్తగా స్టికీపాడ్ ఎత్తి, ఒక ప్లాస్టిక్ బాగ్ లో వేసి పార్క్ లోకి తీసుకువెళ్ళి చూద్దును కదా, ఆ స్టికీపాడ్ నుంచి దాన్ని వేరు చెయ్యడం నా వల్ల కాలేదు. అప్పటికే బాగా స్ట్రగుల్ అయ్యి ఉందేమో, పాపం నీరసంగా ఎగశ్వాశ తీస్తూ నావైపు చూస్తూ ఉండిపోయిందే తప్ప నన్ను కనీసం కరవడానికి కూదా ప్రయత్నించలేదు అది. విశ్వప్రయత్నం చేసి, దాన్ని విడిపించడం చేతకాక అక్కడే కూర్చుని ఒక అరగంట ఏడ్చి దానికి ప్రపంచంలో ఉన్న క్షమాపణలన్నీ చెప్పుకుని ఇంటికొచ్చేసాను. అది గుర్తుకొస్తే ఇప్పటికీ గిల్ట్ వెంటాడుతుంది నన్ను. అలాంటి చావు పగవాళ్ళకి కూడా వొద్దు. ఎలకల్ని భరించలేకపోతే విషం పెట్టడమే నయం. రుచిగా తింటూ క్షణంలో పోతాయి.

Unknown said...

smart.