సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Saturday, May 7, 2011

వి.ఐ.పి లు


సమాజంలో లాగే పనిమనుషుల్లో కూడా మార్పులు వచ్చేసాయి. నమ్మకం, విశ్వాసం అనేవి ఏ కోశానా కనబడట్లేదు ఇప్పటి వాళ్ళలో. నువ్వు కాకపోతే ఇంకోరు అన్న ధీమా వాళ్లది. వాళ్లపై ఆధారపడిన బ్రతుకులు మనవి. ఇద్దరూ ఉద్యోగాలు చేసే ఇళ్ళలో పని మనిషి రాకపోతే ఉండే పాట్లు చెప్పనలవి కాదు. మాకేం పనుమనుషులున్నారనీ ? మేం చేసుకోవట్లేదా? అని వాదిస్తుంది అమెరికాలో ఉన్న నా స్నేహితురాలు. కానీ అలవాటైన ఒక చట్రం నుండి బయటపడటం సులభంకాదు. ఇద్దరమే ఉన్నప్పుడు నేనూ కొన్నేళ్ళు అన్ని పనులూ నేనే చేసుకున్నాను. కానీ పెద్ద కుటుంబంలో ఉన్నప్పుడు అన్నీ చెయటానికి పనిమనిషి సాయం తప్పనిసరి. మన అవసర౦ చూసుకుని వాళ్ళ డిమాండ్ పెరిగిపోయింది. నైజం మారిపోయింది. కొన్నేళ్ళుగా నాకు తెలిసిన కొందరు పనివాళ్లను గురించి ...వాళ్ళలో వచ్చిన మార్పుల గురించీ...

ఏభై ఏళ్ళ పాటు ఒకటే ఇల్లు నమ్ముకున్న "సముద్రం" :
"సముద్రం" అమ్మా వాళ్ల ఇంట్లో ఏభై ఏళ్ళు పని చేసింది. పేరు భలేగా ఉంది కదా. ఆ ఇంట్లో ఉన్న పురిటి గదికి నర్సు కూడా సముద్రమే. పదిహేనో ఎన్నో పురుళ్ళయితే ఎనిమిది మంది సంతానం మిగిలారు. అందర్నీ సాకి పెద్దచెయటంలో అమ్మమ్మకు ఎంతో సాయంగా ఉండేదిట సముద్రం. తాతయ్యగారింట్లో ఎప్పుడూ బంధుసమూహం కళకళ్ళాడుతూ ఉండేది. అదికాక ఆయన లాయరవటం వల్ల వచ్చేపోయే క్లైంట్లు, కొందరు పొరుగూరు నుంచి వచ్చి భోజనం చేసేవాళ్ళతో ఇల్లెప్పుడూ సందడిగా ఉండేదిట. అందరి పనులూ తనే చూసుకునేదట ఎప్పుడూ నవ్వుతూ ఉండే సముద్రం. పొద్దుటే వచ్చేసి రాత్రికి ఇంటికి వెళ్ళేదట. తాతగారి పదహారు మంది మనవలనూ ఆమె ఆటలాడించింది. ఓపిక నశించి పని చేయలేకపోయేవరకూ వచ్చేదట. సముద్రం గురించి అమ్మ ఎప్పుడూ బోలెడు కబుర్లు చెప్తూ ఉంటుంది. ఇంట్లో అందరికీ ఎంతో ఇష్టం సముద్రమంటే.

ముఫ్ఫై ఏళ్ళు ఒకే ఇంట్లో పని చేసిన లక్ష్మి:
లక్ష్మిది సణుగుడు స్వభావం. మొగుడు తాగుబోతు. దాదాపు రెండ్రోజులకోసారన్నా తాగొచ్చి చితకబాదుతూంటాడు పెళ్ళాన్ని. ఆర్నెల్లకో మతం మార్చేస్తు ఉంటాడు. ఇంటిల్లిపాది పేర్లనూ కూడా ఆ మతానికి అనుగుణంగా మార్చేస్తూ ఉంటాడు. ఇల్లు గడవటానికి పదిళ్ళలో పాచి పని మొదలెట్టింది లక్ష్మి. కానీ ఏ ఇంట్లోనూ మానకుండా పని చేయటం లక్ష్మికి అలవాటు. చేసే ఇల్లు తన ఇల్లనుకుని పని చేస్తుంది. కాకినాడలో మా మావయ్య ఇంట్లో పని చేసేది. ముఫ్ఫై ఏళ్ల పాటూ అలా చేసింది. ఇల్లు అమ్మేస్తూంటే తన ఇల్లు అమ్మేస్తున్నట్లే బాధపడింది. ఊరు విడిచి వెళ్పోతూంటే తనను మర్చిపోవద్దని కన్నీళ్ళు పెట్టుకుంది .

పదిహేనేళ్ళపాటు పని చేసిన "సరస్వతి" :
విజయవాడలో సూర్యారావుపేటలో మేం ఉన్నన్నాళ్ళు మా ఇంట్లో పని చేసింది. మా ఇంట్లో చేరే సరికే ఏభైఏళ్ళు ఉంటాయి. ఏ రోజూ మానేది కాదు. కుదరకపోతే కూతురుని పంపేది. నాకు పన్నేండేళ్ళు వచ్చేవరకూ తనే. పని అవసరం ఉన్నప్పుడు వాళ్ళింటిదాకా వెళ్ళి సరస్వతిని పిలుచుకు వచ్చేదాన్ని కూడా. ఇంటివాళ్ళు ఆ ఇల్లు అమ్మేసినప్పుడూ అక్కడ ఉంటున్న ఆరువాటాలవాళ్ళం ఇల్లు ఖాళీ చేసాం. వేరే ఏరియాకు వెళ్పోతున్నప్పుడు అంత దూరం నడిచి రాలేనమ్మా అంది పాపం. అప్పటికే చేయలేకపోతోందని అమ్మ కూడా వద్దంది.

పదేళ్ళూ చేసిన "ఐలమ్మ" :
ఐలమ్మ అంటే నాకు చాలా ఇష్టం ఉండేది. "ఐలమ్మ" ఓల్డ్ గా ఉండని నేను తనకి "ఐలూ" అని పేరు పెట్టాను. అలానే పిలిచేదాన్ని. మా ఇంట్లో చేరినప్పుడూ తన వయసు పదిహేనేళ్ళు. నేను కాలేజీలో చదివేదాన్ని. ఐలమ్మ తరువాత వాళ్లమ్మకు ఐదుగురు సంతానం. చివరి ఇద్దరినీ తప్ప మిగిలినందర్నీ పనిలో పెట్టేసింది డబ్బుల కోసం అని. ఐలూ ని చదివించమని నేను దెబ్బలాడితే ఖర్చు తప్ప ఏంముందమ్మా? పని చేస్తే మరో నాలుగొందలు వస్తాయి..అనేది. ఎన్నిసార్లు ఐలూని చదివిద్దామని చూసినా దానికి ఏబిసీడీలు వచ్చేవే కాదు. విసుగొచ్చి మానేసాను. ఏది ఇచ్చినా తమ్ముళ్ళ కోసం, చెల్లెలి కోసం ఇంటికి పట్టుకెళ్ళేది, తినేది కాదు. దానికి పెళ్ళి చేస్తే పదిళ్ళ పని పోతుందని వాళ్ళమ్మ చాలా కాలం పెళ్ళి చేయలేదు. ఊరు మారాకా కూడా ఎవరైనా వెళ్తూంటే బట్టలు పంపేదాన్ని. ఇంకా గుర్తున్నానా పాపగారికి అనేదట. ఈ మధ్యన నేను అనుకోకుండా విజయవాడ వెళ్ళిన రోజున తన పెళ్ళి అని విని చాలా ఆనందించాను.

**** **** ****
ఇక ఇక్కడ్నుంచీ విశ్వాసంగా పని చేయటం అనే మాట మర్చిపొయిన పనివాళ్ళనే చూసాను. మా అత్తగారింట్లో అయితే రెండ్నేల్లకో పనిమనిషిని మారటం చూశాను. మేం బొంబాయిలో ఉన్నప్పుడు మాకు కుదిరిన పనమ్మాయి ఆహార్యం హీరోయిన్ కు ఏ మాత్రం తక్కువ ఉండేది కాదు. జీన్స్ పేంట్, విరబోసుకున్న జుట్టు, రెగులర్గా కట్ చేసుకునే ఐబ్రోస్ తో అసలు పని చేస్తుందా అని అనుమానం వచ్చేది. కొన్నాళ్ళకు దాన్ని భరించలేక మాన్పించేసి నేనే చేసుకోవటం మొదలెట్టాను.

ఇక మళ్ళీ ఇటు వచ్చాకా కుదిరిన "దుర్గ" మాత్రం బాగా చేసేది. అంత నెమ్మదస్తురలిని ఈ కాలంలో నే చూడలేదు. వాళ్లమ్మాయి "మీనా" గురించి ఓసారి టపా రాసాను కూడా. డిగ్రీ అవగానే మీనాకు ఐదువేల ఉద్యోగం వచ్చింది పెళ్ళీ అయిపోయింది. ఆ ఇల్లు మారాకా మాత్రం మళ్ళీ తంటాలు మొదలు. ఇప్పుడు మాకు చేసే పనమ్మాయి కూడా విసిగిస్తుంది. పని వచ్చు కానీ బధ్ధకం. సరిగ్గా చేయకపోయినా ఏం అనకూడదు. ఎక్కువ పని చెప్పకూడదు. ఎంతసేపూ ఏం తీసుకుపోదాం అన్న దురాశే. ఇచ్చినది తీసుకుంటూ ఇంకా అది ఇస్తారా? ఇదిస్తారా అని అడిగితే ఇచ్చేది కూడా ఇవ్వాలనిపించదు. మానేస్తే చెప్పి మానేయదు. వస్తుందో రాదో తెలీక మహా ఇబ్బందిగా ఉంటుంది. రాకపోతే చెప్పి మాను అంటే వినదు. ఒక్కరోజు జ్వరం పనివాళ్ళకే ఎందుకు వస్తుందో నాకస్సలు అర్ధం కాదు.

ఇక అమ్మావాళ్ళకు చేసే "లక్ష్మమ్మ" ది ఒక పెద్ద కథ. లక్ష్మమ్మకు ఏభై ఐదు పైనే వయసు. తల్లికి తండ్రి తాలూకూ పింఛను వస్తుందని తల్లిని దగ్గర బెట్టుకుని సేవ చేస్తుంది. ముగ్గురు కూటుళ్ళకు పెళ్ళిళ్ళూ చేసింది. ముగ్గురివీ మూడు కథలు. తను అమ్మావాళ్ళింట్లో పనికి కుదిరినప్పుడు పెద్దమ్మాయి గొడవ చేసిందని దానికి అమ్మావాళ్ళఇల్లు అప్పజెప్పింది లక్ష్మమ్మ. దానికి ఎంత సేపూ డబ్బు ఆశే. నెల తిరిగేసరికీ జీతం డబ్బుల్లో పావు వంతైనా మిగలదు. అడిగినప్పుడల్లా డబ్బులు ఇవ్వకపోతే పని మానేస్తుంది. ఏవో గొడవలతో అది మానేసింది. ఇప్పుడు దాని చెల్లెల్లు వస్తోందిట పన్లోకి. దానికి చేతివాటుతనం ఉందట. జాగ్రత్తగా చూడకపోతే అంతే సంగతులు. పది రోజులొస్తే వారమ్ రోజులు మానేస్తుందిట. గట్టిగా దెబ్బలాడితే ఆ దిక్కూ ఉండదని నోరు మూసుకోవటం. ఓపిక తగ్గిపోయి చేసుకోలేని అమ్మ అవస్థలు చూడలేక మనసు చివుక్కు మంటుంది.

అడిగినంతా ఇస్తారులే. ఎవరి కోసం అన్న ధీమా ఇవాళ్టి పనివాళ్ళది. ఈ వీ.ఐ.పీ లను కాదని గడుపుకోలేని నిస్సహాయత మనది.

1 comment:

SHANKAR.S said...

మీరు పోస్ట్ హెడింగ్ తప్పు పెట్టారు. వి.వి.ఐ.పి అని ఉండాలి.

పనిమనుషులతో బాధలు పడని ఇల్లు ఈ భారతదేశంలోనే ఉండదండీ. మా పాత పనిమనిషి అయితే మరీ ఘోరం మొన్న ఎలక్షన్ల టైం లో వాళ్ళ ఊరెళ్ళి ఓటేసి వస్తానని అంటే ఓటుకి తనిచ్చే విలువ చూసి మా స్వాతి తెగ ముచ్చట పడిపోయి ఏం పర్వాలేదు నేను చేసుకుంటా నువ్వెళ్ళు అని పంపించింది. ఓటేయడానికి వెళ్ళిన ఆ అమ్మాయి కౌంటింగ్ అయిన రెండు రోజులకి వచ్చింది. ఇంకో పనిమనిషయితే మరీ ఘోరం వాళ్ళ బంధు మిత్ర సపరివారం లో ఎవరికీ వంట్లో బాలేకపోయినా రెండు మూడు రోజులు ఎగ్గొట్టేసేది. ఇలా లాభం లేదని నేను బాచిలర్ గా ఉన్న రోజుల్లో ఉన్న ఇంటి వాళ్ళ పనిమనిషి కనిపిస్తే ఆవిడని ఒక మంచి పనిమనిషిని చూడమని చెప్తే ఒకావిడని పంపించింది (మా ప్రస్తుత పనిమనిషి). ఈవిడ వచ్చినప్పటినుంచీ కాస్త రిలీఫ్ గా ఉంది. పెద్దావిడ కావడం వలన తోమినదే మళ్ళీ తోముతుంది, తుడిచిన ఇల్లే మళ్ళీ తుడుస్తుంది. కాస్త చాదస్తం, అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్దర్ ఉంది ఈవిడకి. పనిమనిషికి అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్దర్ ఉంటే ఎంత మేలో అనిపిస్తోంది ఇప్పుడు. :)