సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Sunday, March 10, 2013

??




ఎన్ని చికాకులు  ఎన్ని గందరగోళాలు
ఎన్ని దిగుళ్ళు  ఎన్ని నిట్టూర్పులో
బతుకుబండి నడవాలంటే
దాటాల్సినవెన్ని టుపోటులో !

ఎన్ని మాటలు  ఎన్ని మౌనాలు
ఎన్ని కూడికలు  ఎన్ని తీసివేతలో.. 
మంచితనపు చట్రంలో నిలవాలంటే
భరించాల్సినవెన్ని సమ్మెటపోటులో !!



Friday, March 8, 2013

ఆడవాళ్ళూ మీకు జోహార్లు(1981)





బాలచందర్ తీసిన "ఆడవాళ్ళూ మీకు జోహార్లు(1981)" ఓసారెప్పుడో టివీలో చూసాను. ఆసక్తికరంగా మొదలుపెట్టి ఉత్కంఠంతో చివరికి ఏమౌతుంది.. అని చివరిదాకా చూస్తే.. చివరికి తన సహజ ధోరణిలో మనసుని భారం చేసేస్తారు బాలచందర్ :( నాకు ఎంతో ఇష్టమైన దర్శకుల్లో బాలచందర్ ఒకరు. ఆయన తీసినవి దాదాపు అన్ని సినిమాలు చూసాను. ఈ క్లైమాక్స్ విషయంలోనే నాకు ఆయనతో పేచీ :) సినిమా అంతా చక్కగా తీసి క్లైమాక్స్ చెడగొట్టడమో లేదా దు:ఖ్ఖాంతం చెయ్యటమో బాలచందర్ కు ఉన్న మహా చెడ్డ అలవాటు.


ఈ సినిమా కథలో నాకు బాగా నచ్చినది దర్శకుడు స్త్రీ కి ఇచ్చిన విలువ. మగవాడి పతనం వెనుకే కాదు విజయం వెనుక కూడా స్త్రీ పాత్ర ఉంటుంది. రాక్షసుడు లాంటి మనిషిని కూడా ఉన్నతుడిలా తీర్చిదిద్దగల ఓర్పూ, నేర్పు స్త్రీకి ఉన్నాయి అని చెప్తుంది ఈ కథ. నర్సింహ మృగంలా మారటానికి కారణం అతని తల్లి. మళ్ళీ అతను మనిషిగా మారటానికీ, అతని జీవితాన్ని అనురాగంతో నింపటానికీ ఇద్దరు స్త్రీలు కారణం. ఈ సినిమా కూడా ఎంతో చక్కగా ఉంటుంది సగానికి పైగా. జయసుధ నటన నిజంగా ఆకట్టుకుంటుంది. ఆ కాలంలో ఉన్న మిగతా నటిమణులంత గ్లామరస్ గా లేకపోయినా, సహజ నటిగా, చాలావరకు చీరకట్టులోనే కనిపిస్తూ, ఆనాటి నటీమణుల్లో తనదంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. అది తాను ఎంచుకున్న పాత్రల ద్వారా నిరూపించుకుంది ఆమె. ఈ చిత్రంలో నర్సింహులు లాంటి కిరాతకుడ్ని ఉన్నతుడిగా తీర్చిదిద్దిన రాణి పాత్రకు జయసుధ ప్రాణం పోసిందని చెప్పాలి. నాకెంతో ఉన్నతంగా కనబడుతుందా పాత్ర. చదువురాని 'దబ్బపండు' పాత్ర కూడా ఎంతో ఉదాత్తంగా ఉంటుంది.


కృష్ణంరాజు సినిమాలు చాలా తక్కువ చూసానేమో.. ఇందులో అతని నటన నన్నాశ్చర్యపరిచింది. ఎంతో చిన్న చిన్న హావభావాలను కూడా సమర్థవంతంగా అభినయిస్తాడతను. కౄర స్వభావం లోంచి చదువుకున్న వివేకవంతుడిగా అతను పాత్రలో నటనలో తీసుకువచ్చిన మార్పులు మనల్ని మెప్పిస్తాయి. రాణి చెప్పే "ఆరడుగుల విగ్రహానికి ఆవగింజంతైనా నిగ్రహం లేదు", "నువ్విలా చూస్తే నే నీరుగారిపోతా" అన్న నర్సింహ డైలాగులు; సారాకొట్టు దబ్బపండు పాత్రలో వై.విజయ,  "క" భాష మాట్లాడే చలాకి పిల్లగా సరిత పాత్రలు కూడా గుర్తుండిపోతాయి.  

"ఎవరికి ఎవరూ సొంతం కాదు. ఇద్దరిదీ ఇచ్చిపుచ్చుకునే బేరం.. అంతే " అనే 'దబ్బపండు' పాత్ర వై.విజయకు లభించిన నటనకు ఆస్కారం ఉన్న అతి తక్కువ పాత్రల్లో  ఒకటి. ఇప్పటి మోడ్రన్ 'లివ్ఇన్ రిలేషన్ షిప్' ను నర్సింహులు-దబ్బపండుల సహజీవనం ద్వారా అప్పట్లోనే చూపెట్టాడు దర్శకుడు.


చివరి పదినిమిషాలు కథ మాత్రం చెత్తగా అయిపోయిందనిపిస్తుంది. రాణి పాత్రను చంపివెయ్యటం నాకస్సలు నచ్చలేదు. తగినంత కారణమూ కనిపించదు. మంటల్లో ఉన్న ఇద్దరు మనుషులని రక్షించిన డైరెక్టరు మరో మనిషిని కూడా రక్షించచ్చు కదా..అనవసరంగా చంపేసారు. ఆ రెండో ఆడమనిషితో హత్య చేయించేసి ఆమెనూ జైలు పాలు చేసేస్తారు డైరెక్టర్ గారు ! 

ఈ సినిమాను యూట్యుబ్ లో క్రింద లింక్ లో చూడవచ్చు:
http://www.youtube.com/watch?v=tUULiZT3AbI

ఇందులో ఒక పాట ఉంటుంది.. "ఆడవాళ్ళూ మీకు జోహార్లు " అని. నాకు చాలా నచ్చే పాటల్లో ఒకటి. ఆత్రేయ మాత్రమే రాయగలరు అలాంటి సాహిత్యం. పైన యూ ట్యూబ్ సినిమా లింక్లో "1:48:27" దగ్గర పాట మొదలౌతుంది. బాలు పాడిన అతి చక్కని పాటల్లో ఇది ఒకటన్నది నా అభిప్రాయం.


సాహిత్యం: ఆత్రేయ
సంగీతం : కె.వి.మహాదేవన్
పాడినది : యస్. పి. బాలసుబ్రహ్మణ్యం

సాహిత్యం:

ఆడాళ్ళూ మీకు జోహార్లు 
ఓపిక ఒద్దిక మీ పేర్లు
మీరు ఒకరికంటే ఒకరు గొప్పోళ్ళూ
((ఆడాళ్ళూ))

ఒకరు దబ్బపండు, ఒకరు పనసపండు
ఒకరిది కనబడే పచ్చదనం
ఒకరిది కానరాని తీయదనం((ఒకరు..))
ఇద్దరి మంచితనం నాకు ఇస్తుంది చల్లదనం
ఇది తలుచుకుంటే మతి పోతుందీ దినం
((ఆడాళ్ళూ))

రవ్వంత పసుపు కాసంత కుంకుమకు
మగవాడిని నమ్మడం, మనిషి చేయడం
మనసు నిదరలేపడం, మమత నింపడం((గోరంత))
ఆ పనిలో బ్రతుకంతా అరగదీయడం
కన్నీళ్ళే నవ్వుగా మర్చుకోవడం
ఇదే పనా మీకు..? ఊ..? ఇందుకే పుట్టారా?
((ఆడాళ్ళూ))


Wednesday, March 6, 2013

'రాజసులోచన' స్మృత్యర్థం..కొన్ని చక్కని పాటలు..



ప్రముఖ నటి, నాట్య కళాకారిణి "రాజసులోచన" నిన్న కన్నుమూసారు. మూడొందలకి పైగా దక్షిణాది భాషాచిత్రాల్లో నటించారు. ఆమె చిత్రాల్లోని ఎక్కువగా నృత్య ప్రధానమైన పాటలు ఉండేవి.  ఆమె నటించిన పాటల్లో కొన్ని చక్కని పాటలు.. ఆమె స్మృత్యర్థం..


1) "జయ జయ జయ శారదా "
మహాకవి కాళిదాసు 
http://www.youtube.com/watch?v=IZ5jKXmg_l8

 


2) నిను వర్ణించిన కవే కవి.. 
"మహాకవి కాళిదాసు" చిత్రం లోదే ఒక హాస్య ప్రధానమైన పాట..


 



"రాజమకుటం" చిత్రంలో వినసొంపైన నాలుగైదు పాటలు :

 3) ఊరేది పేరేది ఓ చందమామ 
http://www.youtube.com/watch?v=SzKHRJHlnrE  


4)"సడిసేయకే గాలి "
 రాజమకుటం
   


5)'రాజమకుటం' లోని " ఏడనున్నాడో ఎక్కడోన్నాడో"
ఇతర పాటలు క్రింద లింక్ లో వినవచ్చు 
http://www.sakhiyaa.com/raja-makutam-1960-%E0%B0%B0%E0%B0%BE%E0%B0%9C-%E0%B0%AE%E0%B0%95%E0%B1%81%E0%B0%9F%E0%B0%82/ 


6) "తియతియ్యని "
ఖైదీ కన్నయ్య 

  















7) "ఈ ముసిముసి నవ్వుల "
 ఇద్దరు మిత్రులు
 http://www.youtube.com/watch?v=EpCgBNdT_To 
 


8)కమ్ కమ్ కమ్.. 
శాంతి నివాసం  

















9) "మెరుపు మెరిసిందోయ్ మావా" 
చిట్టి తమ్ముడు

   


10) ఏస్కో నా రాజా" 
చిట్టి తమ్ముడు
    



11) "చెక్కిలి మీద చెయ్యి "
 మాంగల్య బలం

   


12) "పొద్దైనా తిరగకముందే"
      తోడికోడళ్ళు

  



13) "ఆశలు తీర్చవే ఓ జననీ "
శాంతినివాసం 
http://www.youtube.com/watch?v=3pEymqk93OE 




14) నిదురమ్మా 
బికారి రాముడు 
http://www.sakhiyaa.com/bikari-ramudu-1961-%E0%B0%AC%E0%B0%BF%E0%B0%95%E0%B0%BE%E0%B0%B0%E0%B0%BF-%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AE%E0%B1%81%E0%B0%A1%E0%B1%81/ 



15) "లేదుసుమా లేదుసుమా "
పెంకిపెళ్ళాం 
http://www.sakhiyaa.com/penkipellam-1956-%E0%B0%AA%E0%B1%86%E0%B0%82%E0%B0%95%E0%B0%BF%E0%B0%AA%E0%B1%86%E0%B0%B3%E0%B1%8D%E0%B0%B3%E0%B0%BE%E0%B0%82/ 





" रीत पॆ यॆ पैरॊं की मोहरॆ ना छॊड्ना.."




నిన్ననూ GooglePlusలో హృతిక్ రోషన్ పాటల ముచ్చట్లు చెప్పుకుని, కాలేజీ రోజుల్ని తలుచుకుని ఆనందించాం :-) అలా నిన్నంతా హృతికానందంలో మునిగి తేలాకా రాత్రి రేడియో పెట్టుకుని వాకింగ్ చేస్తుంటే మళ్ళీ మంచి మంచి పాటలు వచ్చి ఎంత ఆనందపెట్టాయో చెప్పలేను. వింటున్నంత సేపు నవ్వుకుంటూనే ఉన్నా. ఆనందం పాటల వల్ల కన్నా వాటి వెనుక దాగున్న గతస్మృతుల పరిమళాల్లోది...! వచ్చినవాటిల్లో మూడు పాటలు మాత్రం గుర్తుండిపోయిన పాటలు. ఏం పాటలొచ్చాయో చెప్పనా మరి..

* రేడియో పెట్టేసరికీ "తన్హా తన్హా యహా పే జీనా.." వస్తోంది..
http://www.youtube.com/watch?v=5qauqHmVqG0
అప్పట్లో ఎంత పిచ్చి అందరికీ ఈ పాటంటే? ఒక్కసారిగా ఊర్మిళ దేశాన్నొక ఊపు ఊపేసింది కదా :)

* ఆ తర్వాత "దిల్ సే రే.." అని రెహ్మాన్ పిచ్చెక్కించేసాడు..
http://www.youtube.com/watch?v=YwfCMvo19s8

 "दिल तो आखिर दिल है ना..
मीठी सी मुश्किल है ना...पिया..पिया.." అని గుల్జార్ మాత్రమే రాయగలిగే సాహిత్యం మత్తులో ములిగితేలనివాళ్ళెవరు?


ఈ సిన్మా పాటలైతే నేను అసలు ఎన్నిసార్లు విన్నామో లెఖ్ఖే లేదు...పాఖీ పాఖీ పర్దేశీ, జియా జలే జా జలే, ఛైయ్యా ఛైయ్యా, సత్రంగీ రే... అన్నీ కూడా అద్భుతమైన పాటలే.

* ఆ తర్వాత ఇంకా ఏవో వచ్చాయి..

* చివరిగా మరో మంచి పాట నన్ను గతస్మృతుల్లో ఊయలలూగించింది. కాలేజీ రోజుల్లో చిత్రహార్ లో, టాప్ టెన్ సాంగ్స్ లో ముందుండేది ఈ పాట.. ఇది కూడా గుల్జార్ దే.. సిన్మా కూడా తనదే.. "హు తు తు"
గుర్తు వచ్చేసిందా పాట.. "ఛై చప్పా ఛై..ఛప్పాక్ ఛై.." !  చక్కని సాహిత్యంతో చాలా సరదాగా ఉంటుంది పాట. టాబూ hair style ఒక్కటే నాకు నచ్చదు ఈ పాటలో :)

"ढूंढा करॆंगॆ तुम्हॆ साहिलॊं पॆ हम
रीत पॆ यॆ पैरॊं की मोहरॆ ना छॊड्ना.." అన్న వాక్యాలు నాకు చాలా ఇష్టం..


singers : lata& hariharan
lyrics: gulzar
music: vishal bharadwaj






Friday, March 1, 2013

“ओ साथी रे..”



పురస్కారాలు అందుకోకపోయినా, కొన్ని పాటలు ఎంతో ఖ్యాతిని సంపాదించేసుకుని సంగీతప్రియుల పెదాలపై ఎప్పుడూ నాట్యం చేస్తూ ఉంటాయి. అటువంటి పాటల్లో ఒకటి “ముకద్దర్ కా సికందర్“(1978) సినిమాలోని “ओ साथी रे..” పాట. అమితాబ్ బచ్చన్ సినిమాల్లో “షోలే” తరువాత అత్యంత జనాదరణ పొందిన సినిమా ఇది. చిత్రంలో “సలామే ఇష్క్ మేరీ జా”, “దిల్ తో హై దిల్”, “రోతే హుయే ఆతే హై సబ్” మొదలైన మిగతా పాటలన్నీ బహుళజనాదరణ పొందినవే. ప్రేమనీ, ఆవేదననీ, ఆర్ద్రతనీ కలగలుపుకున్న “ओ साथी रे..” పాట మాత్రం ఆణిముత్యమనే చెప్పాలి. అమితాబ్ కి ఎన్నో హిట్ సాంగ్స్ ని రాసిన గీత రచయిత “అంజాన్” ఈ పాటని రాసారు. 

బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన గాయకుడు కిశోర్ కుమార్ పాడిన ఉత్తమ చిత్రగీతాల్లో ఈ పాట ఒకటి. సంగీతదర్శకద్వయం “కల్యాణ్ జీ-ఆనంద్ జీ” సంగీతాన్ని అందించిన “ओ साथी रे..” పాట ఇప్పటికీ ఎంతో మంది నోట వినిపిస్తునే ఉంటుంది అనటం అతిశయోక్తి కాదు. కొన్నేళ్ళుగా ఇదే పాట కొందరి నోటి వెంట పాటగా, ఈల గా కొన్ని వందలసార్లు వినీ వినీ విసుగొచ్చిన సందర్భాలు ఉన్నాయి మరి :-)

మిగతా భాగం "వాకిలి" పత్రికలో...
http://vaakili.com/patrika/?p=1531





Monday, February 25, 2013

"అనువాదలహరి" లో



నా బ్లాగ్ రెగులర్ పాఠకుల కోసం:

కవిత్వం అంటే ".....spontaneous overflow of powerful feelings from emotions recollected in tranquility" అని Wordsworth అన్నట్లు ఏవన్నా  స్ట్రాంగ్ ఇమోషన్స్ కలిగినప్పుడు కవిత్వాన్ని రాస్తూంటారు కవులు ,కవయిత్రులూ. కానీ నేను అవలీలగా కవితలు రాయగలిగే కవయిత్రిని కానే కాదు. ఏవైనా అనుభూతులు గాఢంగా మనసుని కదిపినప్పుడు మాత్రమే నాలుగువాక్యాలు రాసుకుంటూంటాను. బ్లాగ్ నా సొంతం కాబట్టి అందులో నే రాసుకున్న వాటిని కూడా పొందుపరిచాను.

"అనువాదలహరి" బ్లాగ్ లో ఉత్తమమైన ఆంగ్ల కవితలను తెలుగులో అనువదిస్తుంటారు ఎన్.ఎస్.మూర్తి గారు.  సాహిత్యంలో తమకంటూ ప్రత్యేక స్థానాలు సంపాదించుకున్న ఎందరో కవులు, కవయిత్రుల రచనల మధ్యన నాకూ కాస్త చోటు ఇచ్చారు "అనువాదలహరి" బ్లాగర్ మూర్తి గారు.. 

http://teluguanuvaadaalu.wordpress.com/2013/02/24/sometimes-trishna-telugu-indian/

 ఆ సంతోషాన్ని నా బ్లాగ్ పాఠకులతో పంచుకుందామనే ఈ టపా.. ఇన్ఫర్మేషన్ కోసమే కాబట్టి కామెంట్ మోడ్ పెట్టడం లేదు.


Thursday, February 21, 2013

నిన్నిలానే చూస్తూ ఉన్నా..



క్రితం వారం ఓ సినిమాకెళ్ళినప్పుడు హాల్లో "జబర్ దస్త్"  ట్రైలర్ వేసాడు. రొమాంటిక్ కామెడి అనుకుంటా. "అలా మొదలైంది" సినిమా తీసిన నందిని రెడ్డి సినిమా. ట్రైలర్ చూస్తే సిన్మా ఎలా ఉంటుందో ఏమో.. అని అనుమానం కలిగింది కానీ ఈ పాట మాత్రం బావుంది. Fm వాళ్ళు సుప్రభాతంలా రోజూ వినిపించేస్తున్నారు. తినగ తినగ వేము.. అన్నట్లుగా పాట వినీ వినీ నాకు బాగా నచ్చేసింది..:) పాటలో హిందీ వాక్యాలు మాత్ర0 పెట్టకపొతే బావుండేది.  ఈ మధ్య ఏమిటో కొత్త పాతల్లో ఆంగ్ల పదాలు..వాక్యాలు, హిందీ పదాలు..వాక్యాలు ఎక్కువయిపోయాయి...:(


 "నిన్నిలానే చూస్తూ ఉన్నా, రోజిలాగే కలుసుకున్నా 
గుండెలో ఈ అలజడేంటో కొత్తగా.. 
ఊహలోనే తేలుతున్నా, ఊసులెన్నో చెప్పుకున్నా 
నాలో నేనే నవ్వుతున్నా వింతగా.. 
నిన్నిలా.. నిన్నిలా.. నిన్నిలా " 

S.S.Thaman సంగీతం. రాసినది 'శ్రేష్ఠ' ట. ఎక్కడో ఎప్పుడో విన్న పాటలా అనిపిస్తోంది. ప్రత్యేకత ఏంటంటే ఈ పాట నటి "నిత్యా మినన్" పాడింది. 'అలా మొదలైంది' సెంటిమెంట్ తో పాడించారేమో... అయినా ఆ అమ్మాయి బాగానే పాడుతుంది. పెక్యులియర్ వాయిస్. ఆ హస్కినెస్ లోనే అందం ఉంది.

.

Thursday, February 14, 2013

"మున్బే వా.. ఎన్ అన్బే వా.. "




గతంలో కొన్నాళ్ళు మా తమ్ముడు చెన్నైలో ఉన్నాడు. ఆ సమయంలో కొన్ని తమిళ్ పాటల గురించి చెప్తుండేవాడు. ఒకరోజు 'చాలా బావుంది వినవే..' అని "మున్బే వా..ఎన్ అన్బే వా.." పాట గురించి చెప్పాడు.. . సినిమా పేరు "Sillunu Oru Kaddhal". పాట అర్థం తెలికపోయినా రెహ్మాన్ ట్యూన్ నచ్చేసి ఆ పాటని ఎన్నిసార్లు విన్నానో లెఖ్ఖలేదు.. !  Shankar Tucker తన "shruthibox" లో పాడించిన ఈ తమిళ పాట ఇక్కడ వినేయండి:






ఆ తర్వాత ఆ పాట తెలుగులో వచ్చింది విను అని మళ్ళీ తమ్ముడే చెప్పాడు.. "నువ్వు నేను ప్రేమ" అనే టైటిల్ తో రీమేక్ చేసినట్లున్నారు ఆ తమిళ్ సినిమాని. సిన్మా చూడలే కానీ వేటూరి అనువదించిన ఆ పాట మాత్రం నాకు బాగా నచ్చేసింది. డిటైల్డ్ గా వింటే సాహిత్యాన్ని వేటూరి ఎంత చక్కగా రాసారో అనిపిస్తుంది. తమిళంలో, తెలుగులో కూడా శ్రేయా ఘోషాల్, నరేష్ అయ్యర్ పాడారు.

చిత్రం: నువ్వు నేను ప్రేమ 
పాడినది: శ్రేయా ఘోషాల్, నరేష్ అయ్యర్ 
సంగీతం: రెహ్మాన్ 
సాహిత్యం: వేటూరి

 


ప్రేమించే ప్రేమవా, ఊరించే ఊహవా 
ప్రేమించే ప్రేమవా, పూవ్వలే పుష్పించే  
నే...నేనా అడిగా నన్ను నేనే   
నే..నీవే హృదయం అన్నదే   

ప్రేమించే ప్రేమవా, ఊరించే ఊహవా 
ప్రేమించే ప్రేమవా, పువ్వలే ఫుష్పించే..  

రంగు రంగోలీ గోరింటే నువ్వు పెట్టే  
రంగే పెట్టిన రేఖలు మెరిసి  
గాజుల సవ్వడి.. ఘల్ ఘల్ ....  
రంగు రంగోలీ గోరింటే నువ్వు పెట్టే  
రంగే పెట్టిన రేఖలు మెరిసి  
సుందరి కన్నుల చందనం అద్దిన
చల్లని పున్నమి వెన్నెల నవ్వులు...  
 ఆఆ..ఆ..ఆఆ....హో...

పువ్వైనా పూస్తున్నా, నీ పరువంగానే పుడతా     
మధుమాసపు మాలల మంటలు రగిలించే ఉసురే...   
నీవే నా మదిలో ఆడా, నేనే నీనటనై రాగా     
నా నాడుల నీ రక్తం, నడకల్లో నీ శబ్దం.. ఉందే... హో.... 
తోడే.... దొరకని నాడు....విల విలలాడే.... ఒంటరి మీనం.... ((ప్రేమించే ప్రేమవా))

నెల నెల వాడొక అడిగి, నెలవంకల గుడి కడదామా
నా పొదరింటికి వేరే అతిథులు రా..తరమా..... 
తుమ్మెద తేనెలు తేలే నీ మదిలో చోటిస్తావా
నే ఒదిగే ఎదపై ఎవ్వరో నిదురించ తరమా........
నీరు... సంద్రము చేరే....గల గల పారే.... నది తెలుసా.... ((ప్రేమించే ప్రేమవా))



Friday, February 8, 2013

Jagjit Singh's "तुम नह़ी.. ग़म नह़ी.."





కంప్యూటర్ తెరవగానే గూగులమ్మ సుప్రసిధ్ధ గజల్ గాయకుడు, సంగీతకారుడు, గీత రచయిత జగ్జీత్ సింగ్ జయంతి అని చూపించింది..! మరి ఇవాళ జగ్జీత్ పాడిన మంచి గజల్ వినేయాలి కదా.. వినేద్దామా.. 

ముందుగా చిన్న కథ: 

అనగనగనగా "మంచుపల్లకీ" అని 1982 లో వంశీ తీసిన ఒక సినిమా ఉంది కదా..అందులో "మేఘమా దేహమా మెరవకే ఈ క్షణం.. మెరిసినా కురిసినా..కరుగులే జీవనం..." అని జానకి గారు అద్భుతంగా పాడేసిన పాట ఉంది కదా.. పాట ఇక్కడ వినవచ్చు: http://www.raaga.com/player4/id=193388&mode=100&rand=0.06678686570376158 

"మంచుపల్లకీ"  సినిమా "palaivana solai(1981)" అనే తమిళ సినిమా రీమేక్ అని వంశీ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ పాట తమిల్ సినిమా లోంచి అదే ట్యూన్ తో దిగుమతి అయిపోయింది. తమిళంలో సంగీతం చేసినది "శంకర్ గణేష్".  పాడినది "వాణి జయరాం".
ఆ పాట ఇక్కడ వినవచ్చు: http://www.raaga.com/player4/id=314831&mode=100&rand=0.9681079862639308

ఇదే సినిమాని మళ్ళీ 2009 లో తమిళ్ లోనే రీమేక్ చేసారు. అప్పుడు పాడినది ప్రముఖ హిందీ చిత్ర నేపధ్యగాయని "సాధనా సర్గం". కానీ అసలు ఈ పాట బాణీకి జగ్జీత్ సింగ్ పాడిన ఒక గజల్ ఆధారం. అదే ఇవాళ మనం తలుచుకోబోతున్న అద్భుతమైన గజల్.. "तुम नह़ी.. ग़म नह़ी.. शराब नह़ी..ऎसी तन्हाई का जवाब नह़ी  " అంటే 
"నువ్వు లేవు.. బాధా లేదు.. మధువూ లేదు.. 
  ఇలాంటి ఏకాంతానికి తిరుగే లేదు.." అని అర్థం.

నాకిష్టమైన సంతూర్ వాదన ఇందులో ఎంత బావుంటుందో చెప్పలేను !!

 

Singer: jagjit singh
Lyrics: Sayeed rahi

Lyrics:

तुम नह़ी.. ग़म नह़ी.. शराब नह़ी..

ऎसी तन्हाई का जवाब नह़ी  

गाहे-गाहे इसे पढ़ा कीजे
दिल से बेहतर कोई किताब नह़ी  

जाने किस किस की मौत आई है
आज रुख पे कोई नक़ाब नह़ी  

वोह करम उँगलियों पे गिनते है
द.. नि.. रि.. सा ..रि.. म.. प.. ध..नि.. सा.. ध.. नि.. प.. ग..
जुल्म का जिनकी कोई हिसाब नह़ी


ఈ గజల్ లో ప్ర్రతి చరణం ఆహా అనిపిస్తుంది.. రెండో చరణంలో "ఇవాళ ఆమె ముఖానికి ముసుగు లేదు.. ఎంతమందిని చావు వరించనుందో..." అంటాడు కవి! దానికి కనెక్టింగ్ మూడో చరణం .. "నిత్యం ఘాతకాలను చేసే వాళ్ళు(అమ్మాయిలు) చేసే మంచిపనులను వేళ్లపై లెఖ్ఖ పెట్టచ్చు.. " అంటే "ఈ అమ్మాయిలు వాళ్ల చూపులతో, చేష్టలతో చేసే ఘాతకాలకు అంతే లేదు.. అందుకే వీళ్ళు(ఈ అమ్మాయిలు) చేసే మంచి పనులను వేళ్లపై లెఖ్ఖపెట్టచ్చు.." అని అర్థం .

Monday, January 28, 2013

Horti Expo 2013



ఇరవై మూడవ ఉద్యానవన ప్రదర్శన (Horti Expo 2013) jan26 న హైదరాబాద్ లో మొదలైంది. జనవరి30 వరకూ ఐదురోజులు కొనసాగుతుందీ ప్రదర్శన. మొదటిరోజూ, నిన్న రెండుసార్లూ వెళ్ళి కనులారా మొక్కలన్నీ చూసి వచ్చాను. 

ప్రదర్శన మొదట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆకారంలో ఆయా జిల్లాల్లో పండే పంటలతో, కూరగాయలతో నింపిన చిత్రం ఆకట్టుకుంది. ప్రదర్శన ఆకట్టుకున్నప్పటికీ ఈసారి కనబడ్డ మార్పులు, తగ్గిపోయిన పూలమొక్కలూ నన్ను నిరాశపరిచాయనే చెప్పాలి. కొత్తవాటికి చోటు పెరగటంతో పూలమొక్కలు తగ్గిపోయాయని కూడా నాకు అనిపించి ఉండచ్చు.





ఈసారి రంగురంగుల కాగితంపూల చెట్లు ఎక్కువగా కనబడ్డాయి. చిన్నపాటి కుండీ కూడా మూడువందల ఏభై చెప్తున్నా కూడా అవే ఎక్కువగా అమ్ముడుపోవటం ఆశ్చర్యపరిచింది. Feng shui పుణ్యమా అని చిన్నా,పెద్దా వెదురు చెట్లు, నీటిలో తాబేళ్ళు కూడా బాగానే కొంటున్నారు. ఫ్లవర్ ఎరేంజ్మెంట్ పోటిలు ఈసారి జరగలేదేమొ..ఆ స్టాల్ లేనేలేదు..:( బోన్సాయ్ విభాగంలో క్రిందటేడాది పెట్టిన చింతచెట్టునే మళ్ళీ పెట్టారు. కొత్తవాటిల్లో ఒక సీమ చీంతకాయ చెట్టు మాత్రం నాకు నచ్చింది. మొక్కలు పెంచేందుకు కొబ్బరిపీచుతో చేసే మట్టి, మరికొన్ని ఎరువులూ విడిగా కేజీలెఖ్ఖన అమ్ముతున్నారు ఒకచోట. ఇదే మట్టి పదికేజీలు పేక్ చేసి ఐదొందలు దాకా భర చెప్తున్నారు మరో చోట.










క్రిందటి ఏటికీ ఈ ఏటికీ ప్రధానంగా వ్యాపారాత్మకమైన మార్పు నాకు కనబడింది. మొదట్లో కేవలం రకరకాల మొక్కలు, పువ్వులు, చెట్లు మాత్రమే ప్రదర్శనలో ఉంచేవారు. తినుబండారాలు, హెర్బల్ టీ స్టాల్, స్టీవియా, హనీ, రకరకాల హోంమేడ్ వడియాలు, ఆమ్లా టీ, పుస్తకాల స్టాల్, గృహాలంకరణ సామగ్రీ, క్రోకరీ ఎప్పుడూ ఉండేవే. ఉద్యానవన పరికరాలు,  పొలాల్లో పనికొచ్చే పరికరాలు, సోలార్ ఎనర్జీ తో పనిచేసే వస్తువులు మొదలైన అభివృధ్ధి కారకాలైన ఎన్నో పరికరాలు,వస్తువులు కూడా కొన్నేళ్ళుగా ప్రదర్శనలో ఉంచుతున్నారు. 

అవన్నీగాక పెద్ద పెద్ద ఇళ్ళల్లో.. ఉద్యానవనాల్లో ఏర్పరుచుకుందుకు విగ్రహాలు, ప్రత్యేకంగా డిజైన్ చేసిన వృక్షాలు, కుర్చీలు, సెట్టింగ్స్, పంజరంలో పక్షులు మొదలైనవి కూడా ఈసారి ప్రదర్శనలో చోటు చేసుకున్నాయి. ఇది మంచి విషయమే కానీ ప్రదర్సనలో ఎక్కువగా ఉండే మొక్కలు, పువ్వులూ తక్కువయిపోయాయి. ఇంతదాకా  కన్నులపండుగగా సాగిన ఈ ప్రదర్శన ఇకమీదట వ్యాపారాత్మకమైన ప్రదర్శనగా మారిపోతుందని స్పష్టమైపోయింది.  










wheat grass




చివరిగా నాకు అర్థమైందేమిటయ్యా అంటే.. ఏ "ప్రదర్శన" అయినా అది జనాల జేబులు ఖాళీ చేసేందుకు మాత్రమే కనుగొనబడ్డ విజయవంతమైన వ్యాపారాత్మక వ్యవహారము అని !


Friday, January 25, 2013

"కుచ్ దిల్ నే కహా.."


ఈ నెల "వాకిలి" పత్రికలో "అనుపమ" చిత్రంలోని "కుచ్ దిల్ నే కహా.." పాట గురించి రాసాను.
వ్యాసం క్రింద లింక్లో చూడవచ్చు...
http://vaakili.com/patrika/?p=823

ఆసక్తి ఉన్నవాళ్ళు అలా "చలువపందిట్లోకి" వెళ్ళిరండి...:))


(టపాకి కామెంట్ మోడ్ పెట్టడం లేదు)

Thursday, January 17, 2013

ఆలోచనలు..




మనం ఇతరులతో మట్లాడే మాటల కన్నా మనతో మనం మాట్లాడుకునేదే ఎక్కువేమో అని చాలాసార్లు నాకనిపిస్తూ ఉంటుంది. ఇంట్లో మనవాళ్లతో; బయట, కాలేజీ, ఆఫీసు.. లాంటి చోట్ల మిత్రులతోనో, ఎదురుపడ్డవాళ్లతోనో మాట్లాడతాం. మిగతా సమయాల్లో అంటే పని చేస్కునేప్పుడు, బస్సులోనో ఆటోలోనో్.. నడచి వెళ్ళేప్పుడో, మనకి మనమే మిగిలే ఏకాంతాల్లో.. ఎక్కువగా మనలో మనమే కదా మాట్లాడుకునేది. అలా చూస్తే మనం అందరికంటే ఎక్కువగా గడిపేది మనతోనే. మన ఆలోచనల్లోనే..! 


ఇంతకీ ఆ ఆలోచించేది ఏమిటీ అంటే కొదిసార్లు మత్రమే సీరియస్ విషయాలు ఉంటాయి. చాలాసార్లు ముఖ్యమైనది ఏమీ ఉండదు. ఎదుటివారు చెప్పేమాటల పట్ల మనకి శ్రధ్ధ లేకపోవటమో, ఆసక్తి లేకపోవటమో ఒక కారణమైతే, మనకి ఏకాగ్రత లేకపోవటం మరో కారణం అవుతూంటుంది. కారణం ఏదైనా ఆలోచనల్లో ములిగిపోవటం అనేది మనకి తెలియకుండానే మనం తరచూ చేసే పని. పుస్తకం చదువుతూ ఆలోచిస్తాం. నడుస్తూ ఆలోచిస్తాం. పని చేస్తూ ఆలోచిస్తాం. ఆఖరికి ఎవరితోనన్నా మాట్లాడుతూ కూడా ఒకోసారి ఆలోచనల్లో పడుతుంటాం. 


నా అనుభవాలు చెప్పాలంటే... కాలేజీలో ఉన్నప్పుడు మా పోలిటిక్స్ లెక్చరర్ పాఠం మొదలు పెట్టగానే ఎక్కడలేని ఆలోచన్లూ ముసిరేసేవి. మహా అయితే ఓ పావుగంట పాఠం తలకెక్కేదేమో.. ఆ తర్వాత నాదారి నాదే. ఏవో ఆలోచనలు.. చూపులు లెక్చరర్ పైనే ఉండేవి కానీ బుర్ర మాత్రం ఎక్కడో తిరుగుతూ ఉండేది. ఎందుకో పాపం ఆవిడ ఒక్క క్లాసే అలా అయ్యేది. మిగతా క్లాసులన్నీ బానే వినేదాన్ని. ఆవిడ క్లాసు కూడా శ్రధ్ధగా వినాలని చాలాసార్లు ప్రయత్నించాను...కానీ ఎప్పుడూ కాసేపయ్యాకా ఆలోచనల్లో ములిగిపోయేదాన్ని. హటాత్తుగా గుర్తుకొచ్చేది.. అయ్యో ఇవాళ కూడా పాఠం వినలేదే అని ..:(  

ఇంకా ఎవరన్నా ఎక్కువసేపు  మాట్లాడితే నా తలకెక్కదు. కాసేపు బుధ్ధిగా వినేసి ఆ తర్వాత నా ఆలోచనల్లో నేను పడిపోతాను. బెజవాడలో ఉండగా తుమ్మలపల్లిలోనో, రోటరీ క్లబ్ లోనో బోలెడు కార్యక్రమాలకి, సభలకీ వెళ్ళేవాళ్ళం. ఆ సభల్లో కార్యక్రమాలకన్నా ముందు ముఖ్య అతిథి వీ, మిగిలిన వక్తల ఉపన్యాసాలు ఉండేవి. ఆ ప్రసంగాలు అయితే అసలు చెవికెక్కేవి కాదు ఏమిటో. పెద్దపెద్దవాళ్లంతా ఏవో చెప్తూండేవారు... నాపాటికి నేను ఏవో ఆలోచిస్తూ ఉండిపోయేదాన్ని. ఇంట్లో కూడా నాన్న ఎప్పుడైనా పెద్ద పెద్ద లెక్చర్లు ఇస్తున్నప్పుడు చెవిలో వేలుపెట్టి ఇలా...ఆడిస్తుంటే... "నీ బుర్రకేమీ ఎక్కటం లేదని అర్ధమైంది ఇక వెళ్ళు.." అనేవారు. "లేదు నే వింటున్నాను.." అని చెప్పినా ఇంకేమీ చెప్పేవారు కాదు. ఆయనకు అర్థమైపోయేది పాపం నేను వినట్లేదని ! 

ఇంకా.. ఒకోసారి ఎవరితోనన్నా ఫోన్ లో మాట్లాడేప్పుడు కూడా అర్జెంట్ గా ఏదో గుర్తొచ్చి దాని గురించి ఆలోచించేస్తాను. కాసేపు మాట్లాడాకా అవతలివాళ్ళు ఏదో ప్రశ్న వేసేసరికి గుర్తుకు వస్తుంది నేను వాళ్ళు చెప్పేది వినట్లేదని...:( ఫోన్లో మాట్లాడేది బాగా తెలిసినవాళ్లైతే ఇందాకా సరిగ్గా వినలేదు..మళ్ళీ చెప్పమని బుధ్ధిగా నిజం చెప్పేస్తాను కానీ కొత్తవాళ్లైతే...:(( పాపం వాళ్ళు !!


అలా రకరకాల సందర్భాల్లో మనం రకరకాల ఆలోచనల్లోకి వెళ్పోతూ ఉంటాం. ఆలోచనల్లోంచి ఒక్కసారిగా మేల్కొని "అరే ఏమిటీ ఇలా ఆలోచించేస్తున్నాం..." అని మనలో మనం అనుకునే సందర్భాలే ఎక్కువ అనటం అతిశయోక్తి కాదు. ఆఖరికి నిద్రను కూడా ఖాళీగా వదలం మనం. మంచివో, చెడ్డవో.. కలలు కనేస్తూ ఉంటాం.   అసలు ఏ పనీ లేకుండా ఎప్పుడన్నా ఉంటామేమో కానీ ఏ ఆలోచనా లేకుండా ఖాళీగా ఎప్పుడైనా ఉంటామా మనం? అసలలా ఉండగలమా అని సందేహం కలుగుతుంది నాకు. అలా ఏమీ ఆలోచించకుండా ఉందామని చాలా సార్లు ప్రయత్నించి విఫలమయ్యను కూడా..:) నిజంగా అసలు ఏమీ ఆలోచించకుండా ఐదు నిమిషాలన్నా ఖాళీగా ఎవరన్నా ఎప్పుడన్నా ఉన్నారా? కాస్త చెప్దురూ...



Monday, January 7, 2013

ముగ్గుల పుస్తకం..




 మా మామ్మయ్య(నాన్నమ్మ) నుండి అత్తకూ, అత్త నుండి అమ్మకూ లభ్యమయ్యి, ఆ తర్వాత మా అమ్మ నుండి నేను అపురూపంగా అందుకున్న విలువైన వారసత్వ సంపద "ముగ్గుల పుస్తకం". నామటుకు నాకు అదో పవిత్ర గ్రంథం. అమ్మ ఇచ్చిన గొప్ప వరం. అయితే అది నాదగ్గర ఇప్పుడు యథాతథంగా లేదు.. ఓ తెల్లకాగితాల కొత్త పుస్తకంలోకి ముగ్గులన్నీ బదిలీ కాబడ్డాయి. పాతకాలం లో వాళ్ళు అయిపోయిన కేలెండర్ చింపి, కుట్టి, వాటిలో పెన్సిల్ తో ముగ్గులు వేసిన ఆ పుస్తకం నా దగ్గరకు వచ్చే సమయానికి చాలా శిధిలావస్థలో ఉంది. ఎన్నో చేతులు మారి, ఎందరో వనితామణుల చేతుల్లోనో నలిగిపోయి.. కొన్ని ముగ్గులు ఎన్ని చుక్కలో కూడా తెలీకుండా.. తయరైంది. అందుకనేనేమో కొత్తగా నే ముగ్గులు వేసుకున్న పుస్తకం మీద అమ్మ ఇలా రాసింది...



విజయవాడలో మా ఇంట్లో వీధి గుమ్మం దాకా  ఓ మూడు నాలుగు పెద్ద ముగ్గులు పట్టేంత స్థలం ఉండేది. నెలపట్టిన రోజు నుంచీ సంక్రాంతి వెళ్ళేదాకా మా సరస్వతి(ఆ ఇంట్లో ఉన్నంతకాలం పని చేసిన పనిమనిషి) రోజూ సందంతా శుభ్రంగా తుడిచి, కళ్ళాపి జల్లి వెళ్ళేది. తడి ఆరకుండా అమ్మ ముగ్గు వేసేది. తడి ఆరితే మళ్ళీ ముగ్గు గాలికి పోతుందని. అమ్మ ఎక్కువగా మెలికల ముగ్గులు పెట్టేది. సన్నటిపోత తో, చకచకా ముగ్గులు పెట్టేసే అమ్మని చూస్తే ఎంతో ఆశ్చర్యంగా ఉండేది.. తప్పులు రాకుండా అలా ఎలా పెట్టగలదా అని. నేన్నెప్పుడు పెద్దయ్యి ముగ్గులు పెడతానా అని ఎదురుచూసేదాన్ని.


ఇక మా కాకినాడ వెళ్ళినప్పుడు మామ్మయ్య, అత్త, అమ్మ ముగ్గురూ పెట్టేస్తూండేవారు ముగ్గులు. ఆ వీధిలో మా అత్త పేరు ఇప్పటికీ ముగ్గులత్తయ్యగారే ! అత్త ముగ్గుల పుస్తకం ఎప్పుడూ ఇంట్లో ఉండేది కాదు. పైనవాళ్ళో, పక్కవాళ్లో అడిగి తీస్కెళ్ళేవారు. 9th,10thక్లాస్ ల్లోకి వచ్చాకా నేనూ వాళ్ల ముగ్గుల పక్కన చిన్న చిన్న ముగ్గులుపెట్టేదాన్ని. ఇంటర్ నుంచీ మొత్తం గ్రౌండ్ నా చేతుల్లోకి వచ్చేసింది. అమ్మలాగ మెలికల ముగ్గులూ, వెడల్పు పోత ముగ్గులు కూడా వచ్చేసాయి. లక్ష్మి(అక్కడి ఆస్థాన పనమ్మాయి) వాకిలి తుడిచి, పేడ నీళ్ళతో కళ్లాపిజల్లి వెళ్ళేది. లక్ష్మి పేడ తెచ్చి చేత్తో తీసి బకెట్నీళ్ళలో కలిపేస్తుంటే.. కంపు కొట్టదా.. అలా ఎలా కలుపుతావు? అనడిగేదాన్ని.


ముగ్గుల పుస్తకంలోంచి సాయంత్రమే ఓ ముగ్గు సెలెక్ట్ చేసుకుని, కాయితమ్మీద వేసుకుని, ముగ్గు పెట్టాలన్నమాట. మా గుమ్మంలోనే వీధి లైటు ఉండేది కాబట్టి లైటు బాగానే ఉండేది కానీ దోమలు మాత్రం తెగ కుట్టేవి. అక్కడేమిటో రాక్షసుల్లా ఉండేవి దోమలు. ముగ్గు పెట్టే డ్యూటి నాకిచ్చేసాకా అమ్మవాళ్లు వంట పనుల్లో ఉండేవారు.. అందుకని ముగ్గు పెట్టినంత సేపూ తోడుకి అన్నయ్యనో, నాన్ననో బ్రతిమాలుకునేదాన్ని.


పెద్ద చుక్కల ముగ్గయితే, అన్నయ్య "నే చుక్కలు పెడతా" అని ముగ్గు తీసుకుని చుక్క చుక్కకీ "చిక్కుం చిక్కుం..." అంటూ చుక్కలు పెట్టేవాడు..:) అలా దాదాపు పెళ్లయ్యేవరకు నెలపట్టి ముగ్గులు పెట్టాను. అ తర్వాత నెలంతా కుదరకపోయినా అప్పుడప్పుడు పెట్టేదాన్ని. అపార్ట్మెంట్ ల్లోకి వచ్చాక గుమ్మంలోనే చిన్న ముగ్గుతో సరిపెట్టేసేదాన్ని. మొన్నటిదాకా రెండేళ్లపాటు ఇండిపెండెంట్ హౌస్ లో ఉన్నాం కాబట్టి కాస్త ముగ్గుసరదా తీరింది. ఈ ఏడు మళ్ళి మామూలే.. అపార్ట్ మెంట్.. చిన్న చాక్పీస్ ముగ్గు..:( ముగ్గులు వెయ్యటం తగ్గిపొయినా, అమ్మ ఇచ్చిన ముగ్గుల పుస్తకం మాత్రం నాకెప్పటికీ అపురూపమే.

 నా ముగ్గుల పుస్తకంలోంచి మరికాసిన ముగ్గులు...













ఇంకొన్ని ముగ్గులు ఈ టపాల్లో ఉంటాయి..
http://trishnaventa.blogspot.in/2009/06/blog-post_16.html
http://trishnaventa.blogspot.in/2010/01/blog-post_12.html
http://trishnaventa.blogspot.in/2010/12/blog-post_16.html


Sunday, January 6, 2013

జంటగా చూసితీరాల్సిన "మిథునం" !





పదిహేనేళ్ళ క్రితం రాయబడిన ఒక కథ.. కథాజగత్తునే ఒక్క ఊపు ఊపింది. ఎంతోమంది సాహితీప్రియుల ఆత్మీయతనీ, ఆదరణనీ, అభిమానాన్ని సంపాదించుకుంది. నాటక రూపంలో రేడియోలోనూ, రంగస్థలం పైనా చోటు సంపాదించుకుంది. ఆంగ్లానువాదం అయి మళయాళ చలనచిత్రంగా  కూడా రూపుదిద్దుకుంది. బాపూ అందమైన చేతివ్రాతలో దస్తూరీ తిలకమై నిలిచింది. ఎందరో సాహితీమిత్రుల శుభకార్యాల్లో, శుభ సందర్భాల్లో వారివారి బంధుమిత్రులకు అందించే అపురూపమైన కానుకైపోయింది కూడా. అటువంటి బహుళప్రాచుర్యం పొందిన కథను తెరపైకెక్కించే ప్రయోగం చేసారు శ్రీ తనికెళ్ల భరణి గారు. 


ఒక భాష నుండి మరో భాషకు చేసే సాహిత్యానువాదాన్ని అనువాదం అనరు.. "ప్రతిసృష్టి" అంటారు. అసలు రచనలోని సారన్ని మార్చకుండానే తనదైన శైలిలో ఎంతో నేర్పుతో అనువదిస్తాడు అనువాదకుడు. అందువల్ల అది "ప్రతిసృష్టి" అవుతుంది. ఆ విధంగా "మిథునం" సినిమా కూడా భరణి గారి ప్రతిసృష్టి అని చెప్పాలి. కాలానుగుణంగా ఉండటానికి శ్రీరమణ గారి కథ కు కాసిన్ని మార్పులు చేసినా కూడా అసలు కథలోని సారానికి ఏమాత్రం లోటు రానీయలేదు ఆయన. జీవితపు బరువు బాధ్యతలు దింపుకున్న ఓ వృధ్ధ జంట, పల్లెటూరిలోని తమ సొంత ఇంటిలో చివరి రోజులు గడపటం ప్రధాన సారాంశం. వాళ్ల వానప్రస్థం అన్నమాట. ఒక జంట అన్యోన్యంగా ఉంటే ఎలా ఉంటుందో అక్షరరూపంలో చూపెట్టారు శ్రీరమణ గారు. అది దృశ్యరూపంలో ఇంకెంత బావుంటుందో కన్నులపండుగగా చూపెట్టారు భరణి గారు.



ఈ కథను సినిమాగా తీస్తున్నారనగానే నన్ను భయపెట్టినవి రెండే విషయాలు. ఒకటి నటీనటులు, రెండోది ఇల్లు. ఆ పాత్రలు ఎవరు చేస్తారో..ఎలా చేస్తారో అనీ;  అసలలాంటి తోట, పెరడు ఉన్న ఇల్లు దొరుకుతుందా అనీనూ! కానీ బాలూ, లక్ష్మి ఇద్దరూ కూడా తమ పరిధుల్లో ఎక్కడా కూడా వారి నిజరూపాల్లో కనబడక, కథలోలాగ ఎనభైల వయసులో లేకపోయినా, కేవలం అప్పదాసు,బుచ్చిలక్ష్మి లాగానే కనబడటం దర్శకుడి ప్రతిభే ! ఇంక అలాంటి తోట, పెరడు, చెట్లు, పాదులు అన్నీ ఉన్న ఇల్లెక్కడ దొరుకుతుందా అని బెంగపెట్టుకున్నాను నేను. అలాంటిది శ్రీకాకుళంలో దొరికిందిట.. ప్రొడ్యూసర్ ఇల్లేనట అని తెలిసి ఆనందించినదాని కంటే సినిమాలో ఆ ఇల్లు చూశాకా ఇంకా ఎక్కువ సంబరపడ్డాను. "ఆ ఇంట్లో నా కూతురి పెళ్ళి చేసాను. సినిమాకి డబ్బులు రాకపోతే ఇంకో కూతురు పెళ్ళి చేసాననుకుంటాను.." అన్నారట ప్రొడ్యూసర్. అలాంటి పెరడు, చెట్లు, ఇల్లే ఉంటే అప్పదాసేమిటి, ప్రపంచాన్ని వదిలేసి నేనే అక్కడ ఉండిపోతాను..:) ఎన్ని లక్షలు, కోట్లు సంపాదించినా అటువంటి ప్రశాంతమైన జీవితం గడపగలమా?





సినిమా గురించి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మరోటుంది.. ఫోటోగ్రఫీ. భరణి గారి అన్నగారి కుమారుడే ఫోటోగ్రఫీ చేసాడుట. యూనిట్ అంతా కూడా అంతకు ముందు భరణితో పనిచేసిఉన్నవారవటం తనకు ఉపయోగపడిందని ఓ ఇంటర్వ్యులో భరణి చెప్పారు. మొదటి చిత్రమే ప్రయోగాత్మకంగా, రెండే పాత్రలతో ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా నడిపించగలగటం ఎంతో సాహసం. దర్శకత్వంలో కొద్దిపాటి లోటుపట్లు కనబడినా చెప్పదలిచిన విషయాన్ని సమర్థవంతంగానే తెలియజేసారు భరణి. సినిమాలో నాకు బాగా నచ్చినది రేడియో ! పొద్దున్న 'శుభోదయం' నుంచీ రాత్రి 'జైహింద్' అనేదాకా రేడియో కార్యక్రమాల టైం ప్రకారం తమ పనులు కూడా చేసుకునేవాళ్ళు అదివరకూ రేడియో శ్రోతలు. మళ్ళీ ఆ సిగ్నేచర్ ట్యూన్స్ వింటుంటే పాతరోజులు గుర్తుకువచ్చాయి..


అమెరికా పిల్లల కబుర్లు వచ్చినప్పుడు హాలులో నవ్వులు, చివర్లో నిట్టూర్పులూ, ముక్కు చీదిన బరబరలు.. ప్రేక్షకులు ఎంతగా లినమయ్యారో చెప్పాయి. మేం కూడా సినిమా అయ్యాకా కాసేపు అలా కూచుండిపోయాం. బయటకు వచ్చాక కూడా చాలా సేపు మట్లాడుకోలేకపోయాం..! మనసు భారం చేసేసావయ్యా భరణీ అని బాధగా మూల్గినా, అదే సత్యం కదా అని గ్రహించుకుని.. నెమ్మదిగా తేరుకున్నాను. అయితే హాలులో నెంబరింగ్ లేకపోవటం, అతితక్కువ హాల్సు లో విడుదల చేయటం, శనివారం అయినా హాలు నిండకపోవటం కలుక్కుమనిపించాయి. తెలుగు ప్రేక్షకులు ఎప్పటికి ఎదుగుతారో.. ఎప్పటికి చిన్న సినిమాలకు ఆదరణ పెరుగుతుందో.. అన్న ప్రశ్నలు ఇంకా వెంటాడుతున్నాయి నన్ను. 



మూలకథలో లేని మార్పులు చేసినా కూడా వృధ్ధజంట అన్యోన్యత, చిలిపి తగదాలు, పరస్పరాఅనురాగం చూసి నేటి తరం జంటలు నేర్చుకోవాల్సినది ఎంతో ఉంది సినిమాలో అనుకున్నా.. అందుకే నాకనిపించింది ఏమిటంటే ప్రతి జంటా జంటగా చూసితీరాల్సిన చిత్రం "మిథునం" అని !





మనసున మొలిచిన సరిగమలే..



"సంకీర్తన" ఎప్పుడో చిన్నప్పుడు చూసిన సినిమా.. కథ పెద్దగా గుర్తులేదు కానీ కొంచెం విశ్వనాథ్ సినిమాలా ఉంటుందని గుర్తు. దర్శకుడు 'గీతాకృష్ణ' విశ్వనాథ్ దగ్గర పనిచేసినందువల్ల ఆ ప్రభావం కనబడిందేమో మరి! ఇళయరాజా పాటలు బావుంటాయి కదా.. అందుకని అవి గుర్తు :)

సినిమాలో అన్ని పాటల్లో నాకు ఈ పాట బావుంటుంది. వేటూరిసాహిత్యం చాలా బావుంటుంది.

సాహిత్యం:

మనసున మొలిచిన సరిగమలే
ఈ గల గల నడకల తరగలుగా
నా కలలను మోసుకు నిను జేరీ
ఓ కమ్మని ఊసుని తెలిపేనే
కవితవు నీవై పరుగున రా
ఎదసడితో నటియించగ రా
స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం

కూకూ చుకుచుకు కూకూ చుకుచుకు కూకూ చుకుచుకు కూకు
రా రా స్వరముల సోపానములకు పాదాలను జత చేసీ
కుకూ కుకూ కీర్తనా తొలి ఆమనివై రా
పిలిచే చిలిపి కోయిలా యెత దాగున్నావు
కూకూ చుకుచుకు కూకూ చుకుచుకు కూకూ చుకుచుకు కూకు
రా రా స్వరముల సోపానములకు పాదాలను జత చేసీ



మువ్వల రవళి పిలిచింది.. కవిత బదులు పలికిందీ
కలత నిదుర చెదిరింది.. మనసు కలను వెతింకిందీ
వయ్యరాల గౌతమీ...
వయ్యరాల గౌతమి ఈ కన్యారూప కల్పనా
వసంతాల గీతినీ నన్నే మేలుకొల్పెనా
భావాల పూల రాగల  బాట నీకై వేచేనే
కూకూ చుకుచుకు కూకూ చుకుచుకు కూకూ చుకుచుకు కూకు


ఏదో స్వరగతి నూతన పదగతి చూపెను నను శృతి చేసీ
ఇది నా మది సంకీర్తనా.. కుకూ కుకూ కూ
సుధలూరే ఆలాపన.. కుకూ కుకూ కూ
ఏదో స్వరగతి నూతన పదగతి చూపెను నను శృతి చేసీ
కూకూ చుకుచుకు కూకూ చుకుచుకు కూకూ చుకుచుకు కూకు

లలిత లలిత పదబంధం మదిని మధుర సుమగంధం
చలిత మృదుల పదలాస్యం  అవని అధర దరహాసం
మరందాల గానమే...
మరందాల గానమే మృదంగాల నాదము
ప్రబంధాల ప్రాణమే నటించేటి పాదము
మేఘాల దారి ఊరేగు వూహ వాలే ఈ మ్రోల
కూకూ చుకుచుకు కూకూ చుకుచుకు కూకూ చుకుచుకు కూకు

ఏదో స్వరగతి నూతన పదగతి చూపెను నను శృతి చేసీ
ఇది నా మది సంకీర్తనా కుకూ కుకూ కూ
సుధలూరే ఆలాపన కుకూ కుకూ కూ
రా రా స్వరముల సోపానములకు పాదాలను జత చేసీ
కూకూ చుకుచుకు కూకూ చుకుచుకు కూకూ చుకుచుకు కూకు




Friday, January 4, 2013

పాటల డైరీలు..




8th క్లాస్ లో నేనూ, తమ్ముడు స్కూల్ మారాం. ఆ స్కూల్ పెద్దది. ప్రతి సబ్జెక్ట్ కీ ఒకో టీచర్ వచ్చేవారు. మ్యూజిక్ క్లాస్ ఉండేది. ఆ టీచర్ ఎవరంటే ప్రసిధ్ధ గాయని వింజమూరి లక్ష్మి గారి చెల్లెలు వింజమూరి సరస్వతిగారు. ఆవిడ రేడియోలో పాడటానికి వస్తూండేవారు. కొత్త పిల్లల పరిచయాల్లో నేను ఫలానా అని తెలిసి " ఏదీ ఓ పాట పాడు.." అని ఆడిగేసి నన్ను స్కూల్ 'choir group'లో పడేసారావిడ. అలా ఆవిడ పుణ్యమా అని నాలోని గాయని నిద్రలేచిందన్నమాట :) ఇక ధైర్యంగా క్లాసులో అడగంగానే పాడటం అప్పటి నుంచీ మొదలైంది. 


క్లాసులో మ్యూజిక్ టీచర్ నేర్పే దేశభక్తి గీతాలూ, లలితగీతాలే కాక  సినిమాపాటలు కూడా అడిగేవారు. పాట పాడాలి అంటే నాకు సాహిత్యం చేతిలో ఉండాల్సిందే. ఇప్పటికీ అదే అలవాటు. అందుకని రేడియోలోనో, కేసెట్ లోనో వినే పాటల్లో నచ్చినవి రాసుకుని, దాచుకునే అలవాటు అప్పటినుండి మొదలైంది. ఇప్పుడు ఏ పాట కావాలన్నా చాలావరకూ ఇంటర్నెట్లో దొరుకుతుంది కానీ చిన్నప్పుడు వెతుక్కుని, రాసుకుని దాచుకోవటమే మర్గం.


డైరీల పిచ్చి కాబట్టి పాటలు రాయటం కూడా డైరీల్లో రాసుకునేదాన్ని. తెలుగు, హిందీ ఒకటి, ఇంగ్లీషు ఇలా మూడు భాషల పాటలకి మూడు డైరీలు. ఈ డైరీల్లో పాటలు నింపటం ఒక సరదా పని. కేసేట్లో ఉన్న పాట ఎలా అయిన వెనక్కి తిప్పి తిప్పి  రాయచ్చు కానీ రేడియోలో వచ్చేపాట రాసుకోవటమే కష్టమైన పని. ఏదో ఒక కాయితం మీద గజిబిజిగా రాసేసుకుని తర్వాత ఖాళీలు పూరించుకుంటూ డైరీలో రాసుకునేదాన్ని. అలా రేడియోలో "మన్ చాహే గీత్" లోనో, "భూలే బిస్రే గీత్" లోనో విని  రాసుకున్న పాటలు చాలా ఉన్నాయి. కానీ అలా రాసుకోవటం భలే సరదాగా ఉండేది. ఏదో ముక్క, లేదా ఒకే చరణమో వినటం..ఆ విన్నది బావుందని రాసేసుకోవటం. కొన్నయితే ఇప్పటిదాకా మళ్ళీ వినటానికి దొరకనేలేదు నాకు. కొన్ని పల్లవులు మటుకు రాసుకుని తర్వాత ఇంట్లో నాన్న కేసెట్లలో ఆ పాట ఎక్కడ ఉందో వెతుక్కోవటం చేసేదాన్ని. మోస్ట్ ఆఫ్ ద సాంగ్స్ అలానే దొరికేవి నాకు. కొన్ని పాత సినిమాపాటల పుస్తకాల్లో దొరికేవి. నాన్నవాళ్ల చిన్నప్పుడు సినిమాహాలు దగ్గర అమ్మేవారుట సినిమాల తాలుకు పాటలపుస్తకాలు. అవన్నీ అమ్మ జాగ్రత్తగా బైండ్ చేయించి దాచింది.






వీటిల్లో సినిమాపాటలే కాక ఆ సినిమా తాలూకూ కథ క్లుప్తంగా రాసి ఉండేది. నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలు కూడా పెద్ద లిస్ట్ ఉండేది వెనకాల అట్ట మీద. ఎన్నో పాత సినిమాల కథలు, పాటల వివరాలు ఆ పుస్తకాల్లో నాకు దొరికేవి. ఇవి తెలుగు హిందీ రెండు భాషల సినిమాలవీ ఉండేవి. చిన్నప్పుడు శెలవు రోజున ఈ పుస్తకాలను తిరగెయ్యటం నాకో పెద్ద కాలక్షేపంగా ఉండేది. ఈ పుస్తకాల్లో నే వెతికే పాటలు ఉన్నా కూడా నచ్చినపాట స్వదస్తూరీతో డైరీలో రాసుకోవటమే ఇష్టంగా ఉండేది నాకు. అలా డైరీల్లో పాటలసాహిత్యం రాసుకోవటం ఓ చక్కని అనుభూతి.


స్కూల్లో, కాలేజీలో వెతుక్కుని వెతుక్కుని రాసుకున్న నచ్చిన పాటల డైరీలు ఇవే... (ఈ ఫోటొల్లోవన్నీ ఇదివరకెప్పుడో పదిహేను ఇరవై ఏళ్ల క్రితం రాసుకున్నవి)






ఇప్పుడు రాసే అలవాటు తప్పి రాత కాస్త మారి ఇలా ఉంది.. క్రింద ఫోటోలోది ఇవాళే రాసినది.




 పైన డైరీలో రాసిన తెలుగు పాట తిలక్ గారి "అమృతం కురిసిన రాత్రి" లో "సంధ్య" అనే కవిత. ఆ పుస్తకంలో కొన్నింటికి వారి మేనల్లుడు ఈ.ఎస్.మూర్తి గారు పాతిక ముఫ్ఫైఏళ్లక్రితం ట్యూన్ కట్టారు.(రేడియో ప్రోగ్రాం కోసం) వాటిల్లో ఒకటే ఈ పాట. చాలా బావుంటుంది. "గగనమొక రేకు" పాటని క్రింద లింక్ లో యూట్యూబ్ లో వినవచ్చు:
http://www.youtube.com/watch?v=1E2kYLnz0VI




Wednesday, January 2, 2013

చిన్న ముఖాముఖి..



రెండ్రోజుల క్రితమనుకుంటా జాజిమల్లి బ్లాగర్ 'మల్లీశ్వరి’ గారి వద్ద నుండి ఒక ప్రశ్నాపత్రం వచ్చింది. బ్లాగ్లో మహిళా బ్లాగర్లతో ముఖాముఖి రాస్తున్నానని... ప్రశ్నలకు సమాధానాలు రాసి పంపమని అడిగారు. 
తోచిన సమాధానాలు రాసి పంపాను.. ఇవాళ ప్రచురించారు:

http://jajimalli.wordpress.com/2013/01/02/%E0%B0%A8%E0%B0%A1%E0%B1%81%E0%B0%A6%E0%B1%8D%E0%B0%A6%E0%B0%BE%E0%B0%AE%E0%B0%BE-%E0%B0%A4%E0%B1%83%E0%B0%B7%E0%B1%8D%E0%B0%A3-%E0%B0%B5%E0%B1%86%E0%B0%82%E0%B0%9F/

నాకీ సదవకాశం ఇచ్చిన మల్లీశ్వరి గారికి బ్లాగ్ముఖంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను.

***

నా బ్లాగ్ తరచూ చదివే పాఠకులు చదువుతారని మాత్రమే ఈ లింక్ ఇస్తున్నాను కాబట్టి కామెంట్ మోడ్ తీసివేస్తున్నాను.

Tuesday, January 1, 2013

ఈరోజు..




క్రిందటి సంవత్సరం ఈరోజున సందడి, సంబరం లేకుండా పాదానికి కుట్లతో,కట్టుతో మంచం మీద ఉన్నా! ఈ ఏడు మా గేటెడ్ కమ్యూనిటీ తాలూకూ బిల్డర్స్ ఏర్పాటు చేసిన న్యూ ఇయర్ పార్టీలో సరదాగా కొత్త సంవత్సరం లోకి అడుగుపెట్టా. రెండు స్థితులకీ ఎంత తేడానో !! ఈ తేడానే ఏదో ఆశనీ, కొత్త ఉత్సాహాన్నీ నింపింది నాలో. 


అసలు న్యూ ఇయర్ పార్టీలో పాల్గొనటం ఇదే మొదలు మాకు. ప్రతి న్యూ ఇయర్ కీ ఎప్పుడూ ఇంట్లోనే గడుపుతాం. ఈసారి గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నాం కాబట్టి మా బిల్డర్స్  ఆహ్వానాలన్నింటికీ తప్పనిసరిగా హాజరుకావాల్సి వస్తోంది. మా కమ్యూనిటీలో మొత్తం ఎనిమిది బిల్డింగ్స్ ప్లాన్ లో ఉన్నాయి. ఆరు పూర్తయ్యాయి. మిగిలినవాటి నిర్మాణం జరుగుతోంది.  ఒకో బిల్డింగ్ కీ ఐదు ఫ్లోర్లు, ఫోరుకి పధ్నాలుగు ఫ్లాట్లు... అంటే దాదాపు ఐదువందలఏభై పైగా కుటుంబాలు ఇక్కడ చేరబోతున్నాయి. ఇదో పల్లెటూరన్నమాట. పిల్లలకీ,పెద్దలకీ స్విమ్మింగ్ పూల్స్; బేడ్మెంటన్ కోర్ట్, ఓపెన్ యెయిర్ పార్టీ ప్లేస్ కాక ఒక షాపింగ్ కాంప్లెక్స్ కూడా కట్టారు. జిమ్నాసియం, క్లబ్ హౌస్, లైబ్రరీ, బ్యూటీ పార్లర్, యోగా రూమ్ మొదలైన ఎన్నో ఎమినిటీస్ తో షాపింగ్ కాంప్లెక్స్ తయారైంది. నిన్న రాత్రి మా షాపింగ్ కాంప్లెక్స్  ఇనాగరల్ ఫంక్షన్, ప్రస్తుతం ఇక్కడ నివాసముంటున్న రెండువందల కుటుంబాలకి డిన్నర్ ఏర్పాటు చేసారు. ఆ తర్వత న్యూ ఇయర్ పార్టీ అన్నారు.


ఎందుకొచ్చిన గోల.. పోదాం పదవే అంటే "నేనిప్పుడే కదా ఇలాంటి పార్టీ చూడటం.. నా ఫ్రెండ్స్ అందరూ డాన్స్ చేస్తున్నారు..ఉందాం.." అని మా పాప పేచీ. ఇక తన కోసం మేమూ తప్పనిసరిగా కూచుండిపోయాం. రోజూ తనతో ఆడుకునే పిల్లలు స్టేజ్ మీద డాన్స్ చేస్తుంటే తనకూ చూడాలని ఉంటుంది కదా. ఇక్కడికి వచ్చి ఐదునెలలౌతున్నా నాకు గట్టిగా అరడజను మంది కూడా తెలీదు. రోజూ ఆడుకుంటారు కాబట్టి పిల్లలందరూ ఫ్రెండ్స్. ఏమిటో మా ఇద్దరికీ ఈ గోల.. పార్టీ హడావుడి పడదు. పాప కోసం తను ఉండిపోయారు కానీ మధ్యలో రెండుమూడు సార్లు నేను ఇంటికి వచ్చి వెళ్ళా. ఆ గోలలో ఉండేకన్నా ఓ పుస్తకం చదువుకుందాం అని కూచున్నా కానీ టైం పావుతక్కువ పదకండు అయ్యాకా.. ఒక్కదాన్ని ఇంట్లో ఎందుకు అని మళ్ళీ తాళం పెట్టి అక్కడికే వెళ్పోయా.


ఏవో సినిమాపాటలకీ, పాప్ సాంగ్స్ కీ పిల్లలు, కొందరు పెద్దలు డాన్సులు చేసారు. మాకు వాటిల్లో ఒకటి అరా తప్ప ఏమీ తెలీవు. పైగా గుండెలదిరిపోయేలా సౌండ్. సరే డాన్సులు అయ్యాకా పన్నెండు దాకా తంబోలా ఆడారు అంతా. చివర్లో మ్యూజిక్ పెట్టి పిల్లలను స్టేజ్  మీద డాన్స్ చెయ్యమంటే అంతా వెళ్ళి గెంతులు మొదలెట్టారు. మా పిల్లనీ వెళ్లమన్నాం కానీ అది వెళ్ళలే. క్రిందనే కూచుని చీర్ చేసింది స్నేహితులని. ఆ పిల్లలేమిటో...ఆ డాన్సులేమిటో !! 'వీళ్ళు పిల్లలా..' అనిపించింది. పిల్లని వెళ్లమన్నానే కానీ ఎక్కడ అది కూడా వాళ్లందరితో పిచ్చి గంతులు వేస్తుందో అని బెంగపడ్డా. అది వెళ్లనందుకు మేమిద్దరం సంతోషించాం. పన్నెండు కొట్టగానే కేక్ కోసి పిల్లలంతా కలిసి చుట్టూరా కట్టిన బెలూన్స్ అన్నీ ఒక్కటి మిగల్చకుండా పగులగొట్టేసారు. 


ఆ సందడి, ఫ్లాట్స్ లో ఉండే వాళ్లందరూ ఒకరినొకరు గ్రీట్ చేసుకోవటం బాగా నచ్చింది నాకు. ఇంతవరకూ పరిచయంలేని వాళ్ళు కూడా పలకరించి విషెస్ చెప్పారు నాకు. పెద్దలు కూడా పిల్లల్లా పరిగెట్టి, ఒకరికొకరు కేక్ పూసుకుని నవ్వుకోవటం చాలా ఆనందాన్ని కలిగించింది. అదంతా శుభసూచికంగా, ఎంతో ఐకమత్యం, స్నేహభావం ఉన్న వీళ్లందరి మధ్యా మా జీవనం తప్పక సరదాగా గడుస్తుందని నమ్మకం కలిగింది. పిల్ల పేచీ పెట్టకపోతే ఈ ఆనందం, ఆశాభావం మిస్సయ్యేదాన్నేమో అనుకున్నా ! ఒంటిగంట దాటాకా అందరం మా మా ఇళ్ళు చేరి నిద్రలో మునిగిపోయాం. 


ఇవాళ పొద్దున్న కూడా సమీప బంధువుల ఆగమనం,  నే వండినది వాళ్ళు ఆనందంగా కడుపునిండా తినటం కూడా నన్నెంతో సంతృప్తి పరిచాయి. కొత్త సంవత్సరారంభంలో నాలాంటి సామాన్య జీవికి ఇంతకు మించిన ఆశావాద ప్రారంభం మరేముంటుంది ?

బ్లాగ్మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.