సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Monday, January 7, 2013

ముగ్గుల పుస్తకం..




 మా మామ్మయ్య(నాన్నమ్మ) నుండి అత్తకూ, అత్త నుండి అమ్మకూ లభ్యమయ్యి, ఆ తర్వాత మా అమ్మ నుండి నేను అపురూపంగా అందుకున్న విలువైన వారసత్వ సంపద "ముగ్గుల పుస్తకం". నామటుకు నాకు అదో పవిత్ర గ్రంథం. అమ్మ ఇచ్చిన గొప్ప వరం. అయితే అది నాదగ్గర ఇప్పుడు యథాతథంగా లేదు.. ఓ తెల్లకాగితాల కొత్త పుస్తకంలోకి ముగ్గులన్నీ బదిలీ కాబడ్డాయి. పాతకాలం లో వాళ్ళు అయిపోయిన కేలెండర్ చింపి, కుట్టి, వాటిలో పెన్సిల్ తో ముగ్గులు వేసిన ఆ పుస్తకం నా దగ్గరకు వచ్చే సమయానికి చాలా శిధిలావస్థలో ఉంది. ఎన్నో చేతులు మారి, ఎందరో వనితామణుల చేతుల్లోనో నలిగిపోయి.. కొన్ని ముగ్గులు ఎన్ని చుక్కలో కూడా తెలీకుండా.. తయరైంది. అందుకనేనేమో కొత్తగా నే ముగ్గులు వేసుకున్న పుస్తకం మీద అమ్మ ఇలా రాసింది...



విజయవాడలో మా ఇంట్లో వీధి గుమ్మం దాకా  ఓ మూడు నాలుగు పెద్ద ముగ్గులు పట్టేంత స్థలం ఉండేది. నెలపట్టిన రోజు నుంచీ సంక్రాంతి వెళ్ళేదాకా మా సరస్వతి(ఆ ఇంట్లో ఉన్నంతకాలం పని చేసిన పనిమనిషి) రోజూ సందంతా శుభ్రంగా తుడిచి, కళ్ళాపి జల్లి వెళ్ళేది. తడి ఆరకుండా అమ్మ ముగ్గు వేసేది. తడి ఆరితే మళ్ళీ ముగ్గు గాలికి పోతుందని. అమ్మ ఎక్కువగా మెలికల ముగ్గులు పెట్టేది. సన్నటిపోత తో, చకచకా ముగ్గులు పెట్టేసే అమ్మని చూస్తే ఎంతో ఆశ్చర్యంగా ఉండేది.. తప్పులు రాకుండా అలా ఎలా పెట్టగలదా అని. నేన్నెప్పుడు పెద్దయ్యి ముగ్గులు పెడతానా అని ఎదురుచూసేదాన్ని.


ఇక మా కాకినాడ వెళ్ళినప్పుడు మామ్మయ్య, అత్త, అమ్మ ముగ్గురూ పెట్టేస్తూండేవారు ముగ్గులు. ఆ వీధిలో మా అత్త పేరు ఇప్పటికీ ముగ్గులత్తయ్యగారే ! అత్త ముగ్గుల పుస్తకం ఎప్పుడూ ఇంట్లో ఉండేది కాదు. పైనవాళ్ళో, పక్కవాళ్లో అడిగి తీస్కెళ్ళేవారు. 9th,10thక్లాస్ ల్లోకి వచ్చాకా నేనూ వాళ్ల ముగ్గుల పక్కన చిన్న చిన్న ముగ్గులుపెట్టేదాన్ని. ఇంటర్ నుంచీ మొత్తం గ్రౌండ్ నా చేతుల్లోకి వచ్చేసింది. అమ్మలాగ మెలికల ముగ్గులూ, వెడల్పు పోత ముగ్గులు కూడా వచ్చేసాయి. లక్ష్మి(అక్కడి ఆస్థాన పనమ్మాయి) వాకిలి తుడిచి, పేడ నీళ్ళతో కళ్లాపిజల్లి వెళ్ళేది. లక్ష్మి పేడ తెచ్చి చేత్తో తీసి బకెట్నీళ్ళలో కలిపేస్తుంటే.. కంపు కొట్టదా.. అలా ఎలా కలుపుతావు? అనడిగేదాన్ని.


ముగ్గుల పుస్తకంలోంచి సాయంత్రమే ఓ ముగ్గు సెలెక్ట్ చేసుకుని, కాయితమ్మీద వేసుకుని, ముగ్గు పెట్టాలన్నమాట. మా గుమ్మంలోనే వీధి లైటు ఉండేది కాబట్టి లైటు బాగానే ఉండేది కానీ దోమలు మాత్రం తెగ కుట్టేవి. అక్కడేమిటో రాక్షసుల్లా ఉండేవి దోమలు. ముగ్గు పెట్టే డ్యూటి నాకిచ్చేసాకా అమ్మవాళ్లు వంట పనుల్లో ఉండేవారు.. అందుకని ముగ్గు పెట్టినంత సేపూ తోడుకి అన్నయ్యనో, నాన్ననో బ్రతిమాలుకునేదాన్ని.


పెద్ద చుక్కల ముగ్గయితే, అన్నయ్య "నే చుక్కలు పెడతా" అని ముగ్గు తీసుకుని చుక్క చుక్కకీ "చిక్కుం చిక్కుం..." అంటూ చుక్కలు పెట్టేవాడు..:) అలా దాదాపు పెళ్లయ్యేవరకు నెలపట్టి ముగ్గులు పెట్టాను. అ తర్వాత నెలంతా కుదరకపోయినా అప్పుడప్పుడు పెట్టేదాన్ని. అపార్ట్మెంట్ ల్లోకి వచ్చాక గుమ్మంలోనే చిన్న ముగ్గుతో సరిపెట్టేసేదాన్ని. మొన్నటిదాకా రెండేళ్లపాటు ఇండిపెండెంట్ హౌస్ లో ఉన్నాం కాబట్టి కాస్త ముగ్గుసరదా తీరింది. ఈ ఏడు మళ్ళి మామూలే.. అపార్ట్ మెంట్.. చిన్న చాక్పీస్ ముగ్గు..:( ముగ్గులు వెయ్యటం తగ్గిపొయినా, అమ్మ ఇచ్చిన ముగ్గుల పుస్తకం మాత్రం నాకెప్పటికీ అపురూపమే.

 నా ముగ్గుల పుస్తకంలోంచి మరికాసిన ముగ్గులు...













ఇంకొన్ని ముగ్గులు ఈ టపాల్లో ఉంటాయి..
http://trishnaventa.blogspot.in/2009/06/blog-post_16.html
http://trishnaventa.blogspot.in/2010/01/blog-post_12.html
http://trishnaventa.blogspot.in/2010/12/blog-post_16.html


11 comments:

శశి కళ said...

మేము కూడా నేను ,అక్క పోటీలు పడి పక్కింటి వాళ్ళకంటే పెద్ద ముగ్గు వేసే వాళ్ళం.ఇదిగో ఇలాగె దాచుకునే వాళ్ళం ...దోమలు మామూలే

జ్యోతిర్మయి said...

మీ ఖజానాలో విలువైనవి చాలా ఉన్నాయండోయ్.

రాధిక(నాని ) said...

నాదగ్గరా ఉంది ముగ్గులపుస్తకం జీర్ణావస్తలో...చాలా బాగున్నాయి ముగ్గులన్నీ ...మా అమ్మ మెలికల ముగ్గులు బాగా పెట్టేది.నాకు మామూలు ముగ్గులేకానీ మెలికల ముగ్గులు అస్సలు రావు.మీ ముగ్గులన్నీ తీసేసుకున్నాను :))

తృష్ణ said...

@శశికళ: సందులో అందరికంటే మీ ముగ్గు బావుంది అని ముగ్గు చూడ్డానికి వచ్చినవాళ్ళు అంటేనే కదా తృప్తి..:)
ధన్యవాదాలు.
@జ్యోతిర్మయి: ఊ... :) ధన్యవాదాలు.
@రాధిక(నాని): మంచిపని చేసారు. మీకు పెట్టడానికి బోల్డు జాగా ఉండి ఉంటుంది. చక్కగా ఇవన్నీ పెట్టేయండి..:)
ధన్యవాదాలు.

R Satyakiran said...

ముగ్గులనగానే Sweet momories. Programming languages నేర్చుకునే time నుండి కుడా graphics programming అంటే సరదా. So ఈ ముగ్గుల season (ధనుర్మాసం)వస్తే ఇంట్లో పెద్దా చిన్నా స్త్రీ లందరూ ముగ్గుల్లోనూ ముగ్గుల పుస్తకాల లోను జీవిస్తుంటే నేను వాళ్ల కోసం ఒక ముగ్గుల software తాయారు చేద్దామనుకునేవాడిని. అది only store చేసుకోడానికి మాత్రం కాదు, గియ్యడానికి కుడా. కాని ఇప్పటికీ చెయ్యలేదు! :-) Rows, Columns, ఇంకొంచెం specifications ఇస్తే చుక్కలు వచ్చేస్తాయి. తర్వాత type అఫ్ line వగైరా సెలెక్ట్ చేసుకోవచ్చు. కొన్ని standard patterns library లోంచి select చేసుకోవచ్చు. Start, end points ఇచ్చుకుంటూ పోతూంటే ముగ్గు తయరైపోతుంది. ఇది చక్కగా ఉందా. మరి ఈపాటికి ప్రపంచంలో ఎవరైనా చేసున్దవచ్చేమో! తెలిస్తే చెప్పండి. ఎందుకంటే మనకొచ్చిన idea ఎక్కడో ఇంకొకళ్ళకి కుడా రావడం కామనే.

శిశిర said...

భలే రాస్తారు తృష్ణగారూ. మీరు ఎంచుకునే టాపిక్స్ భలే ఉంటాయి. బాగుంది టపా. :)

తృష్ణ said...

@R Satyakiran: ముగ్గులంటే స్వీట్ మెమొరీస్..నిజమేనండి !
అలాంటి సాఫ్ట్ వేర్ ఏదైనా చేస్తే మీ దగ్గర మొదట కొనుక్కునేది నేనే! మర్చిపోకండి..:)
Thanks for the comment.

శిశిర: ఏదో ముగ్గుల సీజన్ కదా అని సరదాగా రాసానండి.. :)
ధన్యవాదాలు.

Indira said...

. చాలా రోజులక్రితం ఈనాడు ఆదివారం బుక్ లో ఎవరో గుంటూరు ఆవిడ ముగ్గుల గురించి ఒక వెబ్ సైట్ క్రియేట్ చేశారని ఆ లింక్ కూడా ఇచ్చారు.అందులో చాలా ముగ్గులున్నాయి.అది ఎంత బాగుందంటే కొత్తగా నేర్చుకునే వారికి మూడు చుక్కల ముగ్గు దగ్గర్నుంచి 30 చుక్కల వరకు వున్నాయి.నేను ఆ లింక్ మర్చిపోయాను.

తృష్ణ said...

@ఇందిర: నాకూ తెలీదండీ.. వెతుకుదాం దొరుకుతుందేమో..
ధన్యవాదాలు.

Manasa Chamarthi said...

వావ్ తృష్ణగారూ!!!!!
ఏంటా ముగ్గులు? అన్ని ముగ్గులే! కుళ్ళొచ్చేసిందండీ, నిజం. నిజంగా నిజం. మెయిల్ చేయబట్టి తెలిసింది కానీ, మిస్ అయిపోదును కదా! అసలు మీకు ఇన్ని వచ్చని, ఒక వారసత్వ సంపద మీ దగ్గర ఉందనీ తెలిస్తే, ధనుర్మాసం మొదలవ్వక ముందే మీ ఆస్థి మొత్తం కాపీ తీసుకు తెచ్చుకుందునే! :)))

మరేం పర్లేదు, ఈ ఏడు తప్పకుండా మీ దగ్గరకే శిష్యరికానికి వస్తాను, నేర్చుకుంటాను :)
ముగ్గులు చాలా చాలా చాలా బాగున్నాయండీ..వేసిన చేతులకు జోహార్లు :)
అన్నట్టూ-- నేను ఈ రథం ముగ్గు వేయలేకే..చాలా కష్టాలు పడ్డాను.

తృష్ణ said...

@manasa: :-) మళ్ళీ ఏటికి బోల్డు పంపిస్తాను వేసేద్దూ గాని. ఇంత పిచ్చి ఉంది కాబట్టే నీ పోస్ట్ చూడగానే కామెంట్ పెట్టేసా. కానీ ఏం లాభం ఈ అపార్ట్ మెంట్ కల్చర్ పెరిగిపోయాకా, మట్టి మీద ముగ్గు పెట్టే అదృష్టం ఇంక ఈ జీవితానికి లేదేమో అని దిగులొచ్చేస్తోంది :( ధనుర్మాసం అయిపోయినా సరదాకి చిన్న చిన్నవి పెడుతూనే ఉన్నా. డస్ట్ ఫ్రీ చాక్ పీసెస్ కొనుక్కో నువ్వు కూడా. భలే కలర్స్ ఉంటున్నాయి ఆ బాక్సెస్ లో. బాగా తిక్కగా, చిరాగ్గా ఉన్నప్పుడు ఓ మెలికల ముగ్గు ఓ పేపర్ మీద వేస్తూ కూచుంటాను. అది పూర్తయ్యే టైంకి చిరాకంతా తగ్గిపోతుంది. ఎప్పుడన్నా ట్రై చెయ్యి.. Thank you :)