కొన్ని పుస్తకాలు విజ్ఞానాన్ని పెంచుతాయి. కొన్ని భక్తిని ప్రబోధిస్తాయి. కొన్ని మార్గనిర్దేశం చేస్తాయి. మరికొన్ని తెలివితేటల్ని పెంచుతాయి. ఇన్నింటిలో మనకేది కావాలో ఆ తరహా పుస్తకాల్ని మనం చదవుకుంటూ ఉంటాం. ఇవే కాక కేవలం హాస్యభరితమైన రచనలు కొన్ని ఉంటాయి. అవి కేవలం మానసిక ఉల్లాసాన్ని మాత్రమే అందిస్తాయి. అలాంటి పుస్తకాలు చదువుకునేప్పుడు మన ఒత్తిడులన్నీ మర్చిపోయి కాసేపు హాయిగా నవ్వేసుకోగలం. అలాంటి ఉల్లాసకరమైన రచనలు చెయ్యగల తెలుగు హాస్య రచయితలు బహుతక్కువ మంది ఉన్నారు. వారిలో డా.సోమరాజు సుశీల గారు ఒకరు. పూర్వం మన దర్శక,రచయిత శ్రీ జంధ్యాలగారి రచనల్లో కనిపించే సున్నితమైన వ్యంగ్యంతో కూడిన హాస్యం వీరి రచనల్లోనూ కనిపిస్తుంది. ఏ ఒక్క కథనూ చిన్న నవ్వు నవ్వకుండా, ఓ ఆలోచనలోకి దిగకుండా పూర్తిచెయ్యలేము. ఆ కథల్లో అప్పుడప్పుడూ కనబడే జీవిత సత్యాలను చదువుతుంటే ఓ కన్నీటి పొర కూడా అడ్డుపడుతుంది. రచనావ్యాసంగాన్ని ఎంతో ఆలస్యంగా మొదలుపెట్టినా, ఒక్క ఇల్లేరమ్మ కథలతోటే ఎంతో ప్రఖ్యాతి గడించి, మంచి రచయితగా తెలుగు పాఠకుల హృదయాల్లో పెద్ద పీట వేసుక్కూర్చుండిపోయారు సుశీల గారు.
తన అనుభవాలతో పారిశ్రామిక కథలైన "చిన్న పరిశ్రమలు పెద్ద కథలు(1999)" , తర్వాత సుశీలగారు ఆత్మకథారూపంలో రచించిన "ఇల్లేరమ్మ కథలు(2000)", "దీపశిఖ(2009)" ఎంతో ఆదరణ పొందాయి. ప్రతి తెలుగువారింటా తప్పక ఉండవలసిన పుస్తకాల జాబితాలో చేరిపోవాల్సినటువంటి రచనలివి. ఇనాళ్ళకు మళ్ళీ అదే పంథాలో రచించిన "ముగ్గురు కొలంబస్ లు (2014)" సాహిత్యాభిమానులందరూ చదివి తీరాల్సిన పుస్తకం. ఎంతో ఉల్లాసాన్నీ, ఆనందాన్నీ, తృప్తినీ మనకందించే పుస్తకం. "సోమరాజు సుశీల రచనలు చదువుతుంటే ఏదో అవలీలగా రాసేసారనిపిస్తుంది. కానీ చాలా ఆలోచించి, ఒకటికి రెండుసార్లు తిప్పి తిప్పి రాస్తే గానీ ఆ క్లుప్తత రాదని గ్రహించడం అంత సామాన్యం కాదు. సున్నితమైన హాస్యం తగుపాళ్ళలో మేళవించి, చిక్కటి సీరియస్ నెస్ లని పల్చని చేయడం రచయిత్రికి బాగా తెలుసు. అందుకే సోమరాజు సుశీల కథల్లో అక్షరాలు శాటిన్ మీద ముత్యాల్లా పరుగులు తీస్తాయి. డా.సోమరాజు సుశీల కథల్ని అభిమానించే చాలామంది పాఠకుల్లో నేనూ ఒక్కణ్ణి.." అంటారు శ్రీరమణగారు 'దీపశిఖ' ముందుమాటలో. నాదీ అదే మాట.
ఏవో పన్నుల్లో బిజీగా ఉండి ఈమధ్యన నెట్ ఎక్కువ చూడట్లేదు. చాలా ఆలస్యంగా ఇటీవలే పుస్తకం.నెట్ లో "ముగ్గురు కొలంబస్ లు" పుస్తకానికి జంపాల చౌదరి గారి ముందుమాట ' అంతా మనవాళ్ళే ' చదివాను. వెంఠనే నవోదయాకి ఫోన్ చేసి పుస్తకం గురించి అడిగితే రావడం, కాపీలు అయిపోవడం కూడా అయిపోయింది అన్నారు. వారమంతా రెండుమూడుమాట్లు చేస్తూనే ఉన్నాం కాపీలు తెప్పించారా? అని. ఈలోపూ నాకు తొందర ఎక్కువై మావారిని బయల్దేరదీసి జంపాలగారు తన వ్యాసంలో ఇచ్చిన "ఉమా బుక్స్, 58, న్యూ బోయినపల్లి" అడ్రసు వెతుక్కుంటూ కొలంబస్సుల్లా మేమూ వెళ్ళాం. వీధి అదే కానీ ఎక్కడా ఉమాబుక్స్ అన్న బోర్డు కనబడలే. బయట అడిగితే ఇక్కడే ప్రింటింగ్ ప్రెస్సూ లేదన్నారు. 58 నంబరు ఇంటి సందులో అటుఇటు రెండుమూడుసార్లు తిరిగాం. నే లోపలికి వెళ్ళి అడుగుదామంటే .. రెడిడెన్స్ లాగుంది డిస్టర్బ్ చేస్తే బాగోదేమో.. అని మావారు సందేహించారు. అంత దూరం నుండీ ఉసూరంటూ వెనక్కి వచ్చేసాం. ఇంటికొచ్చాకా నాకనుమానం వచ్చి ఇల్లేరమ్మ కథలు పుస్తకం తీసి చూస్తే అది సుశీల గారి ఇంటి అడ్రసే!! అయ్యో.. ఒక్కసారి లోపలికి వెళ్ళి ఉంటే ఆవిడని కలిసేవాళ్ళం.. అని మావారిని ఆడిపోసేసుకున్నా.. పాపం! మరో నాల్రోజులకి కాపీలు వచ్చాయని తెలిసాకా మొన్న శుక్రవారం మళ్ళీ పొలోమని మూడు బస్సులు అవీ మారి నవోదయాకెళ్ళి, ఎలాగో వెళ్లా కదా అని మరో నాలుగుపుస్తకాలు జతపరిచి ఓ ఐదు పుస్తకాలు కొని తెచ్చేసుకున్నా. మరో నాలుగడుగులేసి విశాలాంధ్రకు కూడా వెళ్దామనుకున్నా కానీ మరీ పర్సు ఖాళీ అయిపోతే పాపం మావారు చిన్నబుచ్చుకుంటారని ఆ సాహసం చెయ్యలేదు..:)
ఇంతకీ ఈ పుస్తకంలో సుశీలగారు ఏం రాసారూ అంటే.. ఆవిడా, వారి శ్రీవారు, అత్తగారూ.. ముగ్గురూ కలిసి వాళ్లమ్మాయి ఇంటికి అమెరికా వెళ్ళి వచ్చిన విధానాన్ని, అక్కడి వింతలూ విశేషాలనూ, అమెరికన్ల జీవన విధానాలనీ హాస్యభరితంగా తెలియబరిచారు. ".. చెమర్చే కన్నుల్లోవి ఏ భాష్పాలో తెలియని అయోమయంలో రోజులు గడిపేస్తున్న అమ్మానాన్నలకు.." అన్న వాక్యం చదవగానే నా కళ్ళ వెంట మా అమ్మానాన్నల కంటి తడి కదిలింది. ఒక గడియారానికి అమెరికా టైం సెట్ చేసి ప్రతి వారాంతం తమ్ముడి ఫోన్ కోసం చెవులు(కళ్ళు కాదు) కాయలు కాసే ఎదురుచూపు + వెళ్ళినవాళ్ళు మళ్ళీ ఎప్పుడొస్తారో తెలియని సందిగ్థం.. కలగలిసిన వాళ్ల ఆత్రం.. నా మదిలో మెదిలాయి. అమెరికాలో పిల్లలున్న ప్రతి తల్లిదండ్రులు ఈ పుస్తకం చదివితే ఇది తమ కథేనని తప్పకుండా ఫీల్ అవుతారు.
నామటుకు నేను ఈ పుస్తకంలో చాలా సారూప్యాల్ని వెతుక్కున్నాను. సుశీలగారిలానే పుట్టినరోజుల్ని అమితంగా ఇష్టపడడం, తెలుగు ఇంగ్లీషు రెండు పుట్టినరోజుల్ని కొత్తబట్టలతో జరుపుకోవడం, కూరల షాపింగ్ అంటే కొట్టుకుపోవడం, వండివార్చడం..భోజనం విషయాలు, మాటనేసి అయ్యో ఎందుకన్నానని తర్వాత ఫీలవ్వడం, కూతురి కబుర్లు, ముఖ్యంగా చిన్నతనంలో అమ్మని ఏడిపించిన సంఘటనలు..మాటలు.. ఇవన్నీ చదువుతుంటే అచ్చంగా నా గురించి నేనే చదువుకుంటున్న భావన. ఇక వారి అత్తగార్ని గురించి చదివితే మా అత్తగారు గుర్తొచ్చి అందరు మొగపిల్లల తల్లులూ ఇంతేనన్నమాట అనుకున్నా. వాళ్లమ్మగారి గురించి చెప్తూంటే నా పెళ్లయి వెళ్పోయాకా ఎలా ఉండేదని మా అమ్మ చెప్పేదో అవే మాటలు గుర్తొచ్చాయ్!
ఓ చోట "ఒకవేళ దైవం రక్షించకో, రక్షించో మన స్వర్ణాంధ్రప్రదేశ్ రెండు ముక్కలైపోతే మేం ఏది లాభమనుకుంటే అటువైపు మాట్లాడచ్చు. మాకా వెసులుబాటు ఉంది.." అంటారు సుశీల గారు. మా మావగారిది కృష్ణాజిల్లా అయినా, ఆయన పదమూడే ఏటే వాళ్ల కుటుంబమంతా హైదరాబాద్ వలస వచ్చేసారు. మావారిక్కడే పెరిగడం వల్ల యాదృచ్ఛికంగా నేనూ అదేమాట అనేదాన్ని..! ఇంకా ఆవిడ శ్రీవారు ముసుగు తన్ని పడుకోవడం, దుప్పట్లోంచే రేడియో వినడం మొదలైనవి చదివితే ఆయన అచ్చంగా నాన్నకు మారురూపేమో అనుకున్నా. ఇప్పటికీ తెల్లారింది మొదలు, రాత్రి జైహింద్ చెప్పేదాకా నాన్న ట్రాన్సిస్టర్ ఆయన పక్కన మోగుతూనే ఉంటుంది. ఆబ్బబ్బా మరీ అన్నీ వినేయాలా.. కట్టేయ్ నాన్నా అని విసుక్కుంటూ ఉంటా నేను వెళ్ళినప్పుడల్లా. అనౌన్సర్ గా తన జీవితంలో మూడొంతుల భాగం రేడియో స్టేషన్లోనే గడిపారు మరి.. రేడియో వినడం ఏలా మానతారు?! ఇంక ఆయనను బయటకు తీసుకువెళ్ళాలంటే సుశీల గారు పడే పాట్లన్నీ మా అమ్మా పడుతుంది పాపం. ఆయన ఇల్లు కదిలి వెళ్ళాలంటే ప్రళయం రావాలి. అన్ని ప్రయాణాలూ రిజర్వేషన్లు చేయించుకోవడం కేన్సిల్ చేయించుకోవడం.. ఇదే పని అమ్మకి. ఇంకా సుశీల గారి అభిప్రాయాలు కొన్ని చదువుతూంటే, ఆరే..ఇలాగే కదా నేనూ అనుకునేది అనుకున్నా చాలాసార్లు. అలాగ చాలా సారూప్యాలు దొరికాయీ పుస్తకంలో నాకు.
సుశీల గారి అమ్మాయి పక్కింటి అమ్మాయి కేరెన్, ఆ అమ్మాయి చదివిన యూనివర్సిటీ మెడికల్ స్కూళ్లో మెడిసన్ చదివే కుర్రాడు, అతని తండ్రీ, ఫార్మసీ స్కూల్ డీన్ అయిన కార్పెంటర్ ఆయనా; జీన్ అనే కాంట్రాక్టర్ జీవితాలను గురించి, ఏణ్ణార్థం పిల్లని ఎంతో డీసిప్లీన్డ్ పెంచుతున్న వాళ్ళమ్మాయి గురించీ తెలుసుకోవడం ఆనందాన్నిచ్చింది.
పుస్తకం మీరు తప్పకుండా కొని చదవండి. పుస్తకంలో బాగా నచ్చిన చాలా వాక్యాలు రాయాలనున్నా.. కొన్ని వాక్యాలు మాత్రం కోట్ చేసి ఆపేస్తాను..
* "మా కన్నతల్లి తన చేతులతో చెరువుమట్టితో వినాయకుడిని చెయ్యకుండానే చవితిపండుగలు, బొమ్మల కొలువులమర్చకుండానే దసరా పండుగలూ, చుక్కల ముగ్గులు పెట్టకుండానే సంక్రాంతి పండుగలూ అలా ఎన్నో సందడి ళేకుండా వచ్చి వెళ్ళిపోవడం చూడడానికి అలవాటుపడిపోయాం."
* "మారిపోతున్న మన దేశకాల పరిస్థితుల్లో నిరాదరణకు గురౌతున్నది పెద్దవాళ్ళే. "
* " జీవితంతో పోరాడుతూ డీలా పడకుండా పదిమందికీ సంతోషాన్ని పంచుతున్న కేరన్ లాంటి అరుదైన వ్యక్తుల గురించి అనవసరపు బెంగలు పెట్టుకుణే అధికారం నాకెవరిచ్చారు?"
* "ఇంతేనా ఈ దేశం గొప్ప. ఈ మాత్రానికేనా ఇళ్ళూ వాకిళ్ళూ, అమ్మలు. నాన్నలూ, అందర్నీ వదిలేసుకుని చలికి వణుక్కుంటూ, పనులు చేసుకుంటూ, బట్టలుతుక్కుంటూ, వారానికోసారి వండుకుంటూ, పిల్లలకోసం ఆరటపడుతూ, ఉద్యోగాల కోసం జాగ్రత్తపడుతూ మెతుకు మిగల్చకుండా, డాలర్ చేజారకుండా...ఇదేనా అమెరికా జీవితం.. ఈ భాగ్యానికేనా మన దేశంలో తల్లలంతా బిడ్డలు పుట్టినప్పటినుంచీ నోములూ వ్రతాలూ చేసి వెంకటేశ్వరుడి హుండీలో చదువు బిళ్ళలేసి, కళ్ళల్లో వత్తులేసుకుని చదివించీ,ఇళ్ళువాకళ్ళు తాకట్టు పెట్టి ఇక్కడికి పంపేది? నిజమే ఇక్కడుంటే అంతా స్వాతంత్రమే. అదేమిటని అడిగే అమ్మలుండరు. ఎండుకని అడిగే అత్తలుండరు. ఆరాలు తీసే చుట్టాలుండరు. గదమాయించే పెద్దవాళ్ళుండరు."
* "వెడితే విసుక్కోకుండా అతిధ్యమివ్వగల నంబర్లు ఓ ముఫ్ఫై పైగా దొరికాయి.."
* "మన ఇండియాలో అమ్మలుంటారు, నాన్నలుంటారు, అన్నదమ్ములుంటారు, భార్యలుంటారు, భర్తలుంటారు. అక్కడ కూడా వాళ్ళంతా ఉంటారు. వీళ్ళు కాకుండా మాజీ భర్తలు, భార్యలు, భావి భర్తలు, భార్యలు, అప్పటికే వాళ్ళు కన్న పిల్లలు ఇట్లా తామరతంపరగా అనంతమయిన పరివారాలుంటాయి.."
* "దేశమేదయినా, పధ్దతులలో తేడాలున్నా మానవస్వభావం మాత్రం ఒకటే అనిపించింది."
*" కొన్ని యూనివర్సలు సత్యాలుంటాయి. అవేమిటంటే ఎక్కడున్నా అల్లుళ్ళు బంగారు తండ్రులు, కొడుకులు చవటవాజమ్మలూ... కూతుళ్ళు అపర లక్ష్మీసరస్వతి అవతారాలు..కోడళ్ళ గురించి మాట్లాడకపోవడమే శ్రేయోదాయకం. వసుదైక కుటుంబం అంటే అదే కాబోలు."
*" భూతల స్వర్గంలాంటి ప్రదేశంలో సన్నటి సెలయేటి ఒడ్డున ఒక చిన్న గూడు. అన్నపూర్ణ లాంటి భార్య. ఏ మనిషికయినా ఇంతకంటే ఏం కావాలి. ఏవరైనా ఏం చేసుకుంటారు లక్షలూ, కోట్లు.."
సుశీల గారు పుస్తకం చివర్లో రాసిన వాక్యం మాత్రం సూపర్!
విమానం దిగాకా ఎయిర్పోట్ లో ఫ్రూటీ తాగాకా..
"ఖాళీ డొక్కులు ఎక్కడ పారేయాలో తెలియక "ట్రాష్ కాన్ కహా హై" అని ఎవర్నో అడిగా. "ఎక్కడైన పడేయండి పర్వాలేదు" అంటూ ఒక తెలుగాయన కాబోలు నవ్వుతూ చెప్పాడు.
విన్నారా! మన దేశం కదా. మనిష్టవే ఇష్టం.
బోలో స్వతంత్ర భారత్ కీ జై! "