Thursday, October 21, 2010

రావుడు నుంచి "రామం" వరకూ...నాన్న కథ !!


Oct 21, 11.30a.m
రావుడు నుంచి "రామం" వరకూ...నాన్న కథ !!

temple in khandavilli



పశ్చిమగోదావరి జిల్లా, తణుకు తాలూకా ఖండవల్లి గ్రామం. అతి చిన్న పల్లేటూరు. ఊళ్ళో "శిష్ఠావారిల్లు" అంటే బోలెడు గౌరవం. వీధి నుంచి వీధి వరకూ వ్యాపించిన ప్రహారి గోడతో పెద్ద ఇల్లు. ఇంటి తాలుకు కధలో ప్రస్తుతానికి నేను రాయబోయేది "రామం" ఒక్కడి గురించే. శిష్ఠా పురుషోత్తంగారి నాలుగవ కుమారుడు "సత్యనారయణ". ఆయన ఏకైన కుమారుడు భాస్కర శ్రీరామ్మూర్తి. ఊళ్ళో అందరూ రావుడు అని పిలిచేవారు. వాళ్ళ నాన్నమ్మ మాత్రం "రాంబాణం" అని పిలిచేది. మనవడు పాకుతూంటే మోకాళ్ళు గీసుకుపోతున్నాయని దొడ్దంతా గచ్చు చేయించిన వెర్రి అప్యాయత ఆమెది.


తెల్లటి తెలుపుతో ఎదుటివారిని ఇట్టే ఆకట్టుకునే అందమైన రూపం రాముడిది. దురదృష్టశాత్తు మూడవ ఏటనే తండ్రిని పోగొట్టుకున్న అతనికి ఇంట్లో ఆదరించే అందరూ ఆడవాళ్ళే. నాన్నమ్మ, అమ్మమ్మ, అమ్మ, ఇద్దరక్కలు, మేనత్త. నాన్న,అన్న, తమ్ముడు, మావయ్యా.... ఇలా బంధాలూ లేవు. తెలియవు. తండ్రి ప్రేమ కానీ, మరో మగదిక్కు కాని లేని ఒంటరి పయనం అక్కడ నుంచే మొదలయ్యింది. తండ్రిని కోల్పోయిన మనవలనూ, లంకంత ఇంట్లో ఒంటరైన కుమార్తెకు తోడుగా ఉండటానికి రాముడి అమ్మమ్మ కూడా ఇంటికి వచ్చి, ఇంటివారి అనుమతితో గదిలో తన వంట తాను వండుకుంటూ అక్కడే ఉండిపోయారు. అమ్మమ్మకూ రాముడికీ ఎంతో అనుబంధం. నిత్యం పాతిక మందికి పైగా ఉండే ఇంట్లోని మనుషులకు వండి పెట్టే అమ్మ ఇంటి పనులతో, అత్తమామల సేవతో సతమతమౌతూ ఉంటే, రావుడికి అమ్మమ్మ బాగా చేరువైపోయింది. ఆవిడకు మనవడే లోకం. అలా తండ్రి లేని లోటు తప్పించి, ఇంట్లోని ఆడవారందరి చేతుల్లో గారంగా, అపురూపంగా గడిచిందతని బాల్యం.

తండ్రి కొని ఉంచిన గ్రామఫోన్ రావుడి ముఖ్య వినోద సాధనం. తణుకు వెళ్ళి ఆయన కొని తెచ్చుకున్న కర్ణాటక సంగీత గ్రామఫోన్ రికార్డులు, డ్రామా సెట్లు, హాస్య గీతాలు రావుడి మొదటి సంపద. తెలిసీ తెలియని జ్ఞానంతో మళ్ళీ మళ్ళీ అవన్నీ ప్లే చేసి వినేవాడు అతను. సంగీతం పట్ల ఆతని ఆసక్తి అక్కడ మొదలైంది. హై స్కూల్లో చేరాకా సైన్స్ పాఠాలు బాగా వంటబట్టాయి అతనికి. మధ్యాహ్నం అందరూ నిద్దరోతూంటే పాత సామాను పడేసిన తడికల గాదె లో దూరి, పాత సామానుతో సైన్స్ ఎక్స్పరిమెంట్లన్నీ చేసేవాడు. ఎండలో అద్దం పెట్టి, చిన్న్ చిన్న ఫిల్మ్ ముక్కలు ఆధారంగా గోడ మీద మూగ సినిమా సొంతంగా వేసేవాడు. అమ్మ నిద్రపోతుంటే మూగ సినిమా, మెళుకువగా ఉంటే గ్రామఫోన్ కూడా జోడించి నిజం సినిమా వేయటం.



ఊళ్ళోకి సినిమా వస్తే, సినిమా ప్రదర్శన గురించి మైకులో చెప్తూ జీప్ తిరిగేది. దాని వెనుక మిగతా పిల్లలతో పాటూ తానూ పరిగెత్తుతూ వెళ్ళేవాడు రావుడు. సినిమాల మీద కూడా అప్పుడే సరదా మొదలైంది. రావుడు ఎస్.ఎస్.ఎల్.సిలోకి వచ్చేదాకా కిర్సనాయిలు దీపాలే చదువుకి ఆధారం.

అప్పటిదాకా ఎవరింట్లోనూ రేడియో లేని ఊళ్ళో, రాముడు హైస్కూలుకు వచ్చే నాటికి వాళ్ల ఎదురిల్లైన మునుసబుగారి ఇంట్లో బ్యాటరీ రేడియో వెలిసింది. ప్రొద్దుటి పూట వాళ్ళ ఇంట్లోంచి రేడియో సిలోన్, తరువాత పురానే ఫిల్మోంకా లోక్ ప్రియ్ సంగీత్, శ్రోతల ఫర్మాయిషీ ఫిలిం గీతాలు వినిపిస్తుంటే గోడ పక్క నించుని అబ్బురంగా వింటూండేవాడు రావుడు. అదే రేడియోతో అతని మొదటి పరిచయం. మరో ఇరవైఏళ్ల తరువాత అదే జీవితంగా మారుతుందని అప్పుడతనికి తెలియదు. హైస్కూల్ చదువయ్యాకా కాలేజీ కోసం నెల్లూరు వెళ్లాడు అతను.


1961లో డిగ్రీ పూర్తయ్యేవరకూ నెల్లూరే అతడి వాసం. అతడికి తోడుగా వండిబెట్టడానికి అమ్మమ్మ తోడు వచ్చింది. చిన్న ఇల్లు అద్దెకు తీసుకుని ఇద్దరూ ఉండేవారు. ఒక రకంగా చెప్పాలంటే బుధ్ధుడికి బోధి వృక్షం లాగ రాముడికి నెల్లూరు విజ్ఞాన కేంద్రం అయ్యింది. అతని మనోవికాశానికి నాంది నెల్లూరే. సినిమాలు, పుస్తకాలు, పత్రికలు, స్నేహితులు అన్నీ అక్కడే పరిచయం. కమ్ సెప్టెంబర్, బేబీ ఎలిఫెంట్ వాక్, లవ్ ఈజ్ బ్లూ వంటి వెస్ట్రన్ మ్యూజిక్ రికార్డ్లు వినటం, కొనటం అక్కడే మొదలైంది.సొంతంగా బొమ్మలు వెయ్యటం, బుల్బుల్, షాహిబాజా, మౌత్ ఆర్గాన్, మాన్డొలీన్ మొదలైన సంగీత వాయిద్యాలను సొంతంగా నేర్చుకున్నదీ ఇక్కడే. తను బుల్బుల్ వాయించుకోవటానికి అప్పుడప్పుడు వాయిద్యాన్ని అరువుగా ఇచ్చే లాయరుగారు, అతను బాగా వాయించడం చూసి ఇన్స్ట్రుమెంట్ నువ్వే ఉంచేసుకో అని బహుమతిగా ఇచ్చేసారు.నలభై ఐదు సంవత్సరాల వయసున్న బుల్బుల్ ఇప్పటికీ భాస్కర్ దగ్గర ఉంది. ఇంకా వాయిస్తూనే ఉంటాడు.




అందుకే ఊరంటే అతనికి ఎంతో ప్రేమ, మమకారం. వాళ్ళ వి.ఆర్.కాలేజీ ఎదురుగా ఉండే లీలామహల్లో వచ్చిన ప్రతి సినిమా విడువకుండా చూసేవాడు. ఇంగ్లీషు సినిమాల పరిచయమూ అక్కడే. ఖండవిల్లి రాముడు కాస్తా స్నేహితుల పిలుపుతో "భాస్కర్"గా మారాడిక్కడ. నెల్లూరులో ఉండగానే మద్రాసులో ఒక సినీ స్టూడియోలో పనిచేసే బంధువు ద్వారా తరచూ సినిమా షూటింగులు చూస్తూ ఉండేవాడు. సినిమా అతని మీద బలమైన ముద్ర వేసింది. ఎలాగైనా సినీ నిర్మాణ రంగంలోకి ప్రవేశించి, మంచి టెక్నీషియన్ అయిపోవాలని ఉవ్విళ్ళూరేవాడు భాస్కర్.


(మొదటి భాగం పూర్తి..)

Tuesday, October 19, 2010

శ్రీ రాజేశ్వరీవిలాస్ కాఫీ క్లబ్ (1976)



చిన్నప్పుడు మా అమ్మ మాకు ఊళ్ళోకి వచ్చిన పాత సినిమాలన్నీ తీసుకెళ్ళి చూపించేది. బాపు తీసిన "శ్రీ రాజేశ్వరీవిలాస్ కాఫీ క్లబ్" అని ఒక సినిమా ఉందే..అది చాలా బావుంటుంది. చూపిద్దామంటే రావట్లేదు" అంటూ ఉండేది. అలా ఆ సినిమా గురించి వినీ వినీ చూడాలన్న ఆసక్తి పెరిగింది. ఎంచేతనో ఆ సినిమాను హాలులో చూడ్డం మాత్రం కుదరలేదు. చాలా ఏళ్ళకు టి.వి లో ఏదో చానల్లో వస్తే చూశాను. ఈ మధ్యన సీడీ కూడా దొరికింది. చక్రపాణి, నాగిరెడ్డి గార్లు నిర్మాతలు. చక్రపాణిగారు నిర్మించిన తుది చిత్రం కావటం వల్ల ఈ చిత్రాన్ని ఆయనకు అంకితమిచ్చారు. విజయావారు తీసిన గుండమ్మ కథ, మిస్సమ్మ, మాయాబజార్ మొదలైన అన్ని చిత్రాలూ విజయవంతంగా ప్రదర్శింపబడినవే. సినిమాకు బాపు, చక్రపాణి కలిపి దర్శకత్వం వహించారు. ఆద్యంతం చక్కని హాస్యంతో, ఆదర్శవంతమైన సందేశంతో, అందమైన పాటలతో, నటీనటుల సమతుల్యమైన నటనతో మనల్ని ఆకట్టుకుంటుంది "శ్రీ రాజేశ్వరీవిలాస్ కాఫీ క్లబ్".


బ్రతుకు తెరువు కోసం పట్నానికి వచ్చిన మాథ్యూస్(కృష్ణ) కు ఉద్యోగం దొరకదు. తప్పనిసరి పరిస్థితుల్లో మతము, పేరు మార్చుకుని "ముత్తయ్య"గా మారతాడు. శ్రీ రాజేశ్వరీవిలాస్ కాఫీ క్లబ్ అనే హోటల్లో సర్వర్ గా చేరి, ఆ తరువాత హోటల్ యజమాని(జగ్గయ్య) కుమార్తె రాజేశ్వరి(జయప్రద)కు పంతులు గా మారతాడు. నిప్పులు కడిగే ఆచారం ఉన్న ఆ ఇంట్లో, ఉద్యోగాన్ని నిలబెట్టుకోవటం కోసం క్రిష్టియన్ అయిన మాథ్యూస్ పడే పాట్లు హాస్యాన్ని పుట్టిస్తాయి. ముత్తయ్య చెల్లెల్లితో పెళ్ళి సంబంధం కుదుర్చుకున్న పెళ్ళికొడుకు తండ్రి(అల్లు రామలింగయ్య) తన కుమార్తెను ముత్తయ్యకు ఇచ్చి వివాహం చేయాలనే ఉద్దేశంతో పట్నం వస్తాడు. స్నేహితుడు నర్సింహాన్నే(పద్మనాభం) ముత్తయ్యగా మామగారికి పరిచయం చేస్తాడు ముత్తయ్య. తారుమారైన పేర్లతో, పాత్రలతో కథ రసవత్తరంగా మారుతుంది. అల్లు రామలింగయ్య కుమార్తెగా రమాప్రభ, ముత్తయ్యగా వేషం ధరించిన సద్బ్రాహ్మణుడైన స్నేహితునిగా పద్మనాభం, అతడినే అల్లుడిగా భావిస్తూ అల్లు రామలింగయ్య చేసే హడావుడి...ఈ ముగ్గురూ పండించే హాస్యం ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్విస్తుంది.


రాజేశ్వరితో వివాహం కుదర్చాలని బామ్మ పడే తాపత్రయం, రాజేశ్వరి చూపే చొరవ వలన ముత్తయ్య పడే ఇబ్బంది అన్నీ చివరికి ఏమౌతుందో అన్న కలవరాన్ని రేపుతాయి. రాజేశ్వరి ప్రేమ ఫలిస్తుందా? ఆమె తండ్రి పెళ్ళికి ఒప్పుకుంటాడా? అసలు విషయం తెలిసాకా ముత్తయ్య చెల్లెలి పెళ్ళి జరుగుతుందా? పద్మనాభం, రమాప్రభల పెళ్ళి కుదురుతుందా? మొదలైన ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే "శ్రీ రాజేశ్వరీవిలాస్ కాఫీ క్లబ్" సినిమా చూడాల్సిందే. సినిమాలో ముఖ్యంగా ఆకట్టుకునేవి పాటలు. పెండ్యాల నాగేశ్వర రావుగారు స్వరపరిచిన ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికీ సంగీతప్రేమికుల పెదాలపై నాట్యమాడుతూ ఉంటాయి. ముఖ్యంగా "ఆకాశపందిరిలో.." పాటను ఆ కాలంలో అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో అద్భుతంగా చిత్రీకరించారని చెప్పాలి. చిత్రీకరణలో బాపూ మార్క్ స్పష్టంగా కనబడుతుంది. బాలు అద్భుతంగా పాడిన "నా పేరు బికారి" , సుశీల గళంలో "ఆకాశ పందిరిలో" రెండు పాటలూ ఎన్నిసార్లు విన్నా విసుగురావు. ఈ రెండు పాటలనూ దేవులపల్లి వారు రాయటం మరో విశేషం. గుర్తుండిపోయే సాహిత్యంతో పాలగుమ్మి పద్మరాజు గారు రచించిన "రాకోయీ అనుకోని అతిథి" పాటలో జయప్రద భావ ప్రకటన, నటన మెప్పిస్తాయి.


ఈ సినిమా చూడటానికి ఆన్లైన్ లింక్స్ ఇక్కడ ఇన్నాయి.




"ఆకాశపందిరిలో.."







"రాకోయీ అనుకోని అతిథి.."





" నా పేరు బికారి.."


పరికిణీ !!




పరికిణీ


"....స్వప్నాల డాబా మీద
నాలుగు చెరుగులూ పరిచి
కుర్రకారు గుండెల్ని
’పిండి’ వడియాలు పెట్టేసిన
జాణ - ఓణీ !!
ఓణీ... పరికిణీ...
తెలుగు కన్నెపిల్లకు
అర్ధాంతన్యాసాలంకారాలు
అప్పుడే మీసాలు మొలుస్తున్న కుర్రాడికి ...
ఓణీయే ఓంకారం !!
పరికిణీయే పరమార్ధం !! "


౮౮౮౮౮ ౮౮౮౮౮ ౮౮౮౮౮


మా ఆవిడకి మంత్రాలొచ్చు !!


ఏడ్చే పసివాడికి
పాలసీసా అయిపోతుంది !
అత్తగారి నడ్డి కింద
పీటైపోతుంది.
మామగారికి కాఫీ
ప్లాస్కయి పోతుంది...
రాత్రి పదగ్గదిలో
నాకు - రగ్గైపోతుంది
ప్రొద్దున్నే వాకిట్లో
ముగ్గై పోతుంది..
మా ఆవిడకి మంత్రాలొచ్చు...


౮౮౮౮౮ ౮౮౮౮౮ ౮౮౮౮౮


మధ్యతరగతి నటరాజు


30 - ఫస్ట్ నైట్ !!


చీర


మూసీనది


నవర’సావిత్రి’


రేఖ


స్వర్గం నుంచి నాన్నకి !



...ఇంతకన్నా ఈ పుస్తకానికి వేరే పరిచయాలవసరం లేదు.
చదివే ప్రతి కవిత మనసుని కదిలిస్తుంది. సామాన్య మధ్యతరగతి బ్రతుకుల్ని ఫ్రేమ్ లో బిగించి చూపిస్తుంది.
అక్షరాన్ని ప్రేమించే ఎవరైనా చదివి తీరాల్సిన పుస్తకం...తనికెళ్ళ భరణి గారి "పరికిణీ".



Friday, October 15, 2010

దసరా శుభాకాంక్షలు

ఇదివరకెప్పుడో వేసిన "Durga eyes"

బ్లాగ్మిత్రులందరికీ దసరా శుభాకాంక్షలు.

Wednesday, October 13, 2010

పూసింది పూసింది మందారం..!


మూడు నాలుగేళ్ళ తరువాత నేను కొన్న మొక్క ! నెల రోజులుగా ఆ దారిలో వెళ్ళినప్పుడల్లా ఓ నర్సరీలో పది రకాల రంగురంగుల మందారాలను చూస్తున్నా. వాటిల్లో ఈ తెలుపు రంగు నన్ను బాగా ఆకట్టుకుంది. చిన్నప్పుడు మామ్మయ్య(నానమ్మ) పెంచిన పదమూడు రకాల మందారాలూ గుర్తుకొచ్చాయి. చూసి చూసి మొత్తానికి ఓ రోజు కొనేసాను. అప్పుడే ఇది మూడో పువ్వు...

Wednesday, October 6, 2010

నాన్న


nanna while in duty

అమ్మ ఫోన్ చేసింది నిన్న సాయంత్రం, "రేపు నాన్నను డిస్చార్జ్ చేస్తాం అన్నారు డాక్టర్..."
ఐదు రోజుల్నుంచీ నిద్రాహారాల్లేక ICU బయట కుర్చీల్లో కూర్చుని కూర్చునీ అమ్మ, అన్నయ్య, తమ్ముడూ...


ఇంట్లో ఉన్నా, ఏమైతుందో...ఏమౌతుందో అని బిక్కు బిక్కుమంటూ గడిపిన నాకూ ప్రాణాలు కుదుట పడ్డాయి...!
ఇవాళ నాన్న ఇంటికి వస్తారు.

*** **** ***

సృష్టిలో జీవితమూ శాశ్వతం కాదు అన్నది జగమెరిగిన సత్యమే. కానీ కొన్నిసార్లు మనకు తెలిసిన సత్యాల్ని మనం విస్మరిస్తాము. నమ్మటానికి మనసు ఒప్పదు. నాన్న గురించి కూడా అంతే...
ఏమొచ్చినా నాకు నాన్న ఉన్నారు...అన్న ధైర్యం ఐదు రోజుల క్రితం వరకూ...
కొండంత అండ, నాకు "నీడ" నాన్న...
నాన్న లేని జీవితం ఒకటి ఉంటుందన్న ఊహే లేదు ఇంతదాకా......
కానీ, ఐదు రోజుల క్రితం హఠాత్తుగా జరిగిన సంఘటన కఠోర సత్యాన్ని ఒప్పుకొమ్మని బలవంతపెట్టింది...
ఇకపై అలాంటి జీవితాన్ని ఎదురుకోవటానికి ఎప్పుడూ సిధ్ధంగా ఉండాలని...

*** *** ****

నాకే కాదు చాలా మంది కూతుళ్ళకు వాళ్ళ వాళ్ళ నాన్నలు అద్భుతాలే..
చాలా మందిలో నేనొకరిని...
"నాన్న" నాకేమిటో చెప్పేదెలా...
నాన్న కళ్ళతో నేను ప్రపంచాన్ని చూసాను
నా ప్రతి ఆలోచననూ, కదలికనూ బాగా అర్ధంచేసుకోగలిగింది నాన్న ఒక్కరే.
నేను మారు మాట్లాడకుండానే ఏమనుకుంటున్నానో చెప్పగలిగిన వ్యక్తి...
ప్రతి చిన్న విషయాన్నీ నేను పంచుకునే మొదటి వ్యక్తి నాన్న..

*** *** ***

" రంగు నీకు బాగుంటుంది. డ్రెస్ కొనుక్కో" అన్నప్పుడూ,
" చెప్పులు బావున్నాయి తీసుకో" అని చెప్పినప్పుడూ,
రకరకాల విషయాల గురించి గంటలు గంటలు చర్చించుకునేప్పుడూ,
ఏది కావాలన్నా నేను అడిగినప్పుడు,
"నువ్వు అడిగిందల్లా నేను కొనను. రేపు పెళ్లయ్యాకా ఏదన్నా కొనుక్కోలేకపోతే బాధపడతావు.." అన్నప్పుడు,


"పెళ్ళి అనేది జీవితంలో ముఖ్యమైనది...నువ్వు ఆడపిల్లవని కాదు...ప్రతి వ్యక్తికీ జీవితంలో ఒక తోడు కావాలి..." అని పెళ్ళి అనేది ఎంత ముఖ్యమో రోజు రాత్రి డాబా మీద నాకు చెపినప్పుడూ,
" అబ్బాయి మంచివాడు. పెళ్ళిచేసుకో..." అని దగ్గర కూచుని మాట్లాడినప్పుడూ...
నాకు నాన్న స్నేహితుడు. ఒక శ్రేయోభిలాషి.
*** *** ****

"నెమ్మదిగా అబధ్ధం చెప్పినా వింటారు. కానీ అరిచి నిజం చెప్పినా ఎవరూ నమ్మరు"
"సమస్య వచ్చినప్పుడు ఎప్పుడూ ముందు ఎదుటి వ్యక్తి దృష్టిలోంచి ఆలోచించాలి.."
"తుఫాను వచ్చినప్పుడు తల వంచుకుంటే పై నుంచి వెళ్పోతుంది. అలా కాదని తల ఎత్తుకు నిలబడితే నువ్వూ కొట్టుకు పోతావు.."
"ఇవాళ బాలేకపోయినా, రేపు బాగుంటుంది.. అనే ఆశతో ఎప్పుడూ ఉండాలి.."
"ఒకోసారి మన తప్పు లేకపోయినా తల వంచుకోవటం వల్ల సమస్యలు పరిష్కారమౌతాయి..."
అంటూ జీవిత సత్యాలు చెప్పినప్పుడు నాన్న నాకు ఒక మార్గ దర్శకుడు.

*** *** ***

నాన్న గురించి బ్లాగ్లో చాలా సార్లు రాయాలని అన్పించినా రాయలేకపోయను..
ఎందుకంటే రాయటానికి ఒకటి రెండు టపాలు చాలని అద్భుతం నాన్న.
నడిచే ఎన్సైక్లోపీడియా నాన్న..
ఒక నిరంతర అన్వేషి నాన్న...
ఒక స్వాప్నికుడు
కళాకారుడు
ఆశావాది.
ఎంత చెప్పినా తనివి తీరదు...ఎంత రాసినా ఇంకా చెప్పవలసింది మిగిలిపోతూనే ఉందనిపిస్తుంది...
నాన్న కూతురుగా పుట్టడం నా అదృష్టం...అంతే..!!

** *** ***
నాన్న గురించి ఇప్పటికైనా కొంతైనా రాయాలని ...
రేడియో కూడా లేని ఒక మారుమూల పల్లెటూర్లో పుట్టి పెరిగిన పిల్లాడి జీవన పయనం
"రాముడు" నుంచీ "రామం" దాకా నాన్న పయనం...రాయలనుకున్నా...
కానీ బ్లాగ్ పై సన్నగిల్లిన ఆసక్తి, రాసినా ఎవరు చదువుతారులే అనే నిర్లిప్తత రాయనివ్వటం లేదు..

*** *** ***
నిన్న కాస్త లేచి కూచోగానే ఏమీ తోచటం లేదని, పుస్తకం పెన్నూ తెప్పించుకుని హాస్పటల్ బెడ్ మీద బొమ్మలు వేస్తూ కూచున్నారుట.(నాన్న స్కెచెస్, పైంటింగ్స్ బాగా వేస్తారు.)
ఇంకొన్నేళ్ళు నాన్న ఆరోగ్యంగా మా మధ్యన తిరగాలని కోరిక. ప్రార్ధన.
*** **** ****


అప్పట్లోని 150 స్టేషన్స్ లో ప్రతి సంవత్సరం జరిగే ఆకాశవాణి వార్షిక పోటీల్లో వరుసగా పది నేషనల్ అవార్డ్స్ వచ్చిన ఏకైన తెలుగు అనౌన్సర్ నాన్న.
తాను చేసిన అవిరామ సేవకూ, కృషికీ, సాధించిన విజయాలకూ ఆకాశవాణి సంస్థ ఏ మాత్రం గుర్తింపునీ ఇవ్వలేదనే బాధ ఆయనలో ఉండిపోయింది. అనామకంగా మిగిలిపోయిన చాలా మందిలా గొప్పవాళ్ళలాగే తెలుగువాడిగా పుట్టడం ఆయన దురదృష్టం అని మేము అనుకుంటాము.

క్రిందన నాన్న చేసిన ప్రోగ్రామ్స్ కు  ఆయా సంవత్సరాల్లోని Information & Broadcasting ministers నేషనల్ అవార్డ్స్ ఇస్తూండగా తీసిన కొన్ని ఫోటోలు.


 
నాన్న బయోడేటా(పెద్దది చేస్తే ఆయన చేసిన కార్యక్రమాల జాబితా ఉంటుంది.)















Thursday, September 30, 2010

Tagore's rare photos from "సంస్కృతి ఎక్స్ ప్రెస్"

in his favourite easy chair


Tagore 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా "సంస్కృతి ఎక్స్ ప్రెస్" అని సికింద్రాబాద్(బోయిగూడా) రైల్వే స్టేషన్లో ఐదు బోగీలు ఉన్న చిన్న రైలుని ప్రదర్శనకు ఉంచారు.మొన్న పేపర్లో వార్త చూసి పోస్ట్ పెట్టాను. ప్రవేశ రుసుము ఏమీ లేదు. వాటిల్లో రవీంద్రునికి సంబంధించిన అరుదైన చిత్రాలు, రచనలకు సంబంధించి విశేషాలు, ఆయన ఉత్తరాలోని కొన్ని భాగాలు, పైంటింగ్స్ అన్నీ పెట్టారు. రేపటివరకూ మాత్రమే ఉన్న ఆ ప్రదర్శనను చూడాలని నిన్న వెళ్ళి చాలా ఆనందించాను. Its a great feeling...!!



కనీసం ఒకరిద్దరయినా ఈ టపా పట్ల ఆసక్తి ఉన్నవారు ఉంటే వాళ్ళతో అయినా నా ఆనందం పంచుకుందామని... అక్కడ నేను తీసుకున్న ఫోటొల్లో కొన్నింటిని ఈ టపాలో పెడుతున్నాను. మేము శాంతినికేతన్ వెళ్ళినప్పుడు అక్కడ ఫోటోలు తీసుకోనివ్వలేదు. ఈసారి ఏ ఆటంకం లేకుండా కావాల్సినన్ని ఫోటోలు తీసుకున్నాను.

Its great great pleasure to have such rare photos and i feel previleged to know atleast a few things about such a great personality. Words can never describe the admiration i have for this man...i just love him for what he is...!!


Tagore and his wife Mrunalini who died at a very young age(29)

.Father of Indian Statistics prasant kumar Mahalonobish& Mrs.Nirmala Devi





With Bernard Shaw




when Gandhiji & kasturiba visited shantiniketan
Tagore's Nobel certificate

tagore's painting
another painting




Wednesday, September 29, 2010

cartoons on CWGames


CWGames గురించి ఇప్పటికే రకరకాల జోక్స్, వ్యంగ్యాలు, కార్టూన్లు ప్రచారం లోకి వచ్చాయి. మొన్న రాత్రి రేడియోలో 11pmనేషనల్ న్యూస్ లో ఒక వార్త మరింత నవ్వు తెప్పించింది. ఒక విదేశీ వెయిట్ లిఫ్టర్ తనకు ఎలాట్ చేసిన గదిలోని మంచం మీద కూచోగానే అది విరిగిపోయిందట....!! బ్రిడ్జీలే కాదు మంచాలు కూడానా అని నవ్వుకున్నాం.

హిందూ న్యూస్ పేపర్లో "కార్టూన్ స్కేప్" అని పదవ పేజీలో వివిధ కార్టున్లు వేస్తూంటారు. వాటిల్లో CWGames కు సంబంధించిన కొన్ని కార్టూన్లు...సరదాకి...


20th Sep cartoonscape


24th sep. cartoonscape


27th Sep.cartoonscape