సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Tuesday, October 19, 2010

శ్రీ రాజేశ్వరీవిలాస్ కాఫీ క్లబ్ (1976)



చిన్నప్పుడు మా అమ్మ మాకు ఊళ్ళోకి వచ్చిన పాత సినిమాలన్నీ తీసుకెళ్ళి చూపించేది. బాపు తీసిన "శ్రీ రాజేశ్వరీవిలాస్ కాఫీ క్లబ్" అని ఒక సినిమా ఉందే..అది చాలా బావుంటుంది. చూపిద్దామంటే రావట్లేదు" అంటూ ఉండేది. అలా ఆ సినిమా గురించి వినీ వినీ చూడాలన్న ఆసక్తి పెరిగింది. ఎంచేతనో ఆ సినిమాను హాలులో చూడ్డం మాత్రం కుదరలేదు. చాలా ఏళ్ళకు టి.వి లో ఏదో చానల్లో వస్తే చూశాను. ఈ మధ్యన సీడీ కూడా దొరికింది. చక్రపాణి, నాగిరెడ్డి గార్లు నిర్మాతలు. చక్రపాణిగారు నిర్మించిన తుది చిత్రం కావటం వల్ల ఈ చిత్రాన్ని ఆయనకు అంకితమిచ్చారు. విజయావారు తీసిన గుండమ్మ కథ, మిస్సమ్మ, మాయాబజార్ మొదలైన అన్ని చిత్రాలూ విజయవంతంగా ప్రదర్శింపబడినవే. సినిమాకు బాపు, చక్రపాణి కలిపి దర్శకత్వం వహించారు. ఆద్యంతం చక్కని హాస్యంతో, ఆదర్శవంతమైన సందేశంతో, అందమైన పాటలతో, నటీనటుల సమతుల్యమైన నటనతో మనల్ని ఆకట్టుకుంటుంది "శ్రీ రాజేశ్వరీవిలాస్ కాఫీ క్లబ్".


బ్రతుకు తెరువు కోసం పట్నానికి వచ్చిన మాథ్యూస్(కృష్ణ) కు ఉద్యోగం దొరకదు. తప్పనిసరి పరిస్థితుల్లో మతము, పేరు మార్చుకుని "ముత్తయ్య"గా మారతాడు. శ్రీ రాజేశ్వరీవిలాస్ కాఫీ క్లబ్ అనే హోటల్లో సర్వర్ గా చేరి, ఆ తరువాత హోటల్ యజమాని(జగ్గయ్య) కుమార్తె రాజేశ్వరి(జయప్రద)కు పంతులు గా మారతాడు. నిప్పులు కడిగే ఆచారం ఉన్న ఆ ఇంట్లో, ఉద్యోగాన్ని నిలబెట్టుకోవటం కోసం క్రిష్టియన్ అయిన మాథ్యూస్ పడే పాట్లు హాస్యాన్ని పుట్టిస్తాయి. ముత్తయ్య చెల్లెల్లితో పెళ్ళి సంబంధం కుదుర్చుకున్న పెళ్ళికొడుకు తండ్రి(అల్లు రామలింగయ్య) తన కుమార్తెను ముత్తయ్యకు ఇచ్చి వివాహం చేయాలనే ఉద్దేశంతో పట్నం వస్తాడు. స్నేహితుడు నర్సింహాన్నే(పద్మనాభం) ముత్తయ్యగా మామగారికి పరిచయం చేస్తాడు ముత్తయ్య. తారుమారైన పేర్లతో, పాత్రలతో కథ రసవత్తరంగా మారుతుంది. అల్లు రామలింగయ్య కుమార్తెగా రమాప్రభ, ముత్తయ్యగా వేషం ధరించిన సద్బ్రాహ్మణుడైన స్నేహితునిగా పద్మనాభం, అతడినే అల్లుడిగా భావిస్తూ అల్లు రామలింగయ్య చేసే హడావుడి...ఈ ముగ్గురూ పండించే హాస్యం ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్విస్తుంది.


రాజేశ్వరితో వివాహం కుదర్చాలని బామ్మ పడే తాపత్రయం, రాజేశ్వరి చూపే చొరవ వలన ముత్తయ్య పడే ఇబ్బంది అన్నీ చివరికి ఏమౌతుందో అన్న కలవరాన్ని రేపుతాయి. రాజేశ్వరి ప్రేమ ఫలిస్తుందా? ఆమె తండ్రి పెళ్ళికి ఒప్పుకుంటాడా? అసలు విషయం తెలిసాకా ముత్తయ్య చెల్లెలి పెళ్ళి జరుగుతుందా? పద్మనాభం, రమాప్రభల పెళ్ళి కుదురుతుందా? మొదలైన ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే "శ్రీ రాజేశ్వరీవిలాస్ కాఫీ క్లబ్" సినిమా చూడాల్సిందే. సినిమాలో ముఖ్యంగా ఆకట్టుకునేవి పాటలు. పెండ్యాల నాగేశ్వర రావుగారు స్వరపరిచిన ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికీ సంగీతప్రేమికుల పెదాలపై నాట్యమాడుతూ ఉంటాయి. ముఖ్యంగా "ఆకాశపందిరిలో.." పాటను ఆ కాలంలో అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో అద్భుతంగా చిత్రీకరించారని చెప్పాలి. చిత్రీకరణలో బాపూ మార్క్ స్పష్టంగా కనబడుతుంది. బాలు అద్భుతంగా పాడిన "నా పేరు బికారి" , సుశీల గళంలో "ఆకాశ పందిరిలో" రెండు పాటలూ ఎన్నిసార్లు విన్నా విసుగురావు. ఈ రెండు పాటలనూ దేవులపల్లి వారు రాయటం మరో విశేషం. గుర్తుండిపోయే సాహిత్యంతో పాలగుమ్మి పద్మరాజు గారు రచించిన "రాకోయీ అనుకోని అతిథి" పాటలో జయప్రద భావ ప్రకటన, నటన మెప్పిస్తాయి.


ఈ సినిమా చూడటానికి ఆన్లైన్ లింక్స్ ఇక్కడ ఇన్నాయి.




"ఆకాశపందిరిలో.."







"రాకోయీ అనుకోని అతిథి.."





" నా పేరు బికారి.."


No comments: