Wednesday, December 17, 2014

కిటికీ బయటి వెన్నెల



కథలు రకరకాలు. ఉల్లాసాన్ని, ఆనందాన్నీ కలిగించే కథలు చాలానే కనిపిస్తూంటాయి కానీ ఆలోచింపచేసే కథలు అరుదుగా కనబడతాయి. వాడ్రేవు వీరలక్ష్మిగారి కథలు చదివినప్పుడల్లా నాకు ఆలోనలతో పాటూ ఆశ్చర్యం కూడా కలుగుతూంటుంది.. దైనందిక జీవితంలో సామాన్యంగా మనం తక్కువగా ఆలోచించే విషయాలపై కథ రాయాలనే ఆలోచన వీరికి ఎలా కలుగుతుందా.. అని! అయితే ఈ విషయాలు తేలికపాటివి కావు. సమాజంలో మార్పు రావాల్సినటువంటి ముఖ్యమైన విషయాలు, అంశాలూనూ. 


వాడ్రేవు వీరలక్ష్మి గారి మూడవ కథాసంపుటి "కిటికీ బయటి వెన్నెల" చదువుతుంటే నాకు అందులో ప్రకృతి, చెట్లు, పువ్వులు తాలూకా సున్నిత భావుకత్వం కన్నా కథల్లో దాగున్న విషయాంశాలూ, వాటిల్లో చర్చించిన గంభీరమైన సమస్యలు ఎక్కువగా ఆలోచింపజేసాయి. బహుశా నా మనసు సున్నితత్వాన్నీ, భావుకత్వాన్నీ దాటి సమాజంలోని సమస్యలను చూసే స్థాయికి ఎదిగి ఉంటుంది! వీరలక్ష్మి గారి "ఆకులో ఆకునై"తో మొదలైన నా అంతర్జాల సాహిత్య వ్యాసాలు పరిణితి చెందుతూ నాలో నాకే ఒక కొత్త కోణాన్ని చూపెడుతున్నాయనుకుంటాను నేను! నాకు లభ్యమైన 'కొండఫలం' , 'మా ఊళ్ళో కురిసిన వాన' , 'భారతీయ నవల' మొదలైన ఆవిడ పుస్తకాల గురించి రాసాను కానీ "సత్యాన్వేషి చలం" గురించి ఇంకా రాసే సాహసం చెయ్యలేదు నేను. అందుకు గానూ ముందు చలం రచనలన్నీ చదవాల్సి ఉంది. చదవగలనో  లేదో ప్రస్తుతానికి తెలీదు. ఇంకా వీరలక్ష్మి గారి 'ఉత్సవ సౌరభం', 'సాహిత్యానుభవం' పుస్తకాలు సంపాదించవలసి ఉంది. 


"జీవితానికి పరిమళం అద్దిన కథలు" అంటూ సత్యవతి గారు ఈ కథానికలకు రాసిన ముందుమాట అసలు ఇంకేమీ రాయక్కర్లేనంతగా, రాయడానికేమీ మిగలనంతగా బాగుంది! వీటిలో మూడు కథల్ని ముందరే చదివాను. "కిటికీ బయటి వెన్నెల" 'పాలపిట్ట ప్రత్యేక కథల సంచిక' లో , "బరువు భారాలు" ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధంలో, "గీతల్ని చెరపవచ్చు" నవ్య పత్రికలోనూ చదివాను. నాలుగు నెలల క్రితం నవ్య పత్రికలో ప్రచురితమైన ఆ కథ బాగుందని నే రాసినప్పుడు, త్వరలో మూడవ సంపుటి రాబోతోందని చెప్పి సభకు ఆహ్వానించారు వీరలక్ష్మిగారు. ఆ తర్వాత కూడా గుర్తుపెట్టుకుని ఎంతో అభిమానంగా "కిటికీ బయటి వెన్నెల" పుస్తకావిష్కరణకు రావలసిందని సాదరంగా ఆహ్వానించారావిడ. నే కూడా పొంగిపోయాను.. కానీ సరిగ్గా సమయానికి ఆరోగ్యం బాగోలేక ఆ సభకు వెళ్లలేకపోయాను :( ఆలస్యంగానన్నా పుస్తకం ఇన్నాళ్ళకు చదవగలిగాను.. నా అభిమాన రచయిత్రి స్వయంగా పంపించబట్టి. ఆవిడ సంబోధన చూసినప్పుడల్లా అనుకుంటాను.. ఆవిడ అక్షరాల్లాగానే మనసు, మాట కూడా మెత్తన అని. ఏదో ముఖస్తుతి కోసం చెప్తున్న మాటలు కావివి. పెద్దగా పరిచయం లేకపోయినా ఎంతో ఆప్యాయంగా పలకరించగలగడం కొందరికే సాధ్యపడుతుంది. 


ఈ కథాసంకలనంలోని పాత్రలు నిత్యం మన చుట్టూ కనబడేవారే. అందుకనే కొన్ని సందర్భాల్లో ఈ కథల్లో పాత్రల ఆలోచనలు కూడా మన ఆలోచనాధోరణి లాగానే ఉంటాయి. ప్రతి కథా ఒకో సమస్యను, వాటి విభిన్న దృక్కోణాలనూ చూపెడుతుంది. సమస్యలన్నీ కూడా ఎక్కువశాతం స్త్రీలవే. పాత్రలు, వాళ్ల ఆలోచనలూ మనల్ని ఆలోచింపచేస్తాయి. కొన్ని కథలు చదువుతుంటే ఈ సమస్యపై ఎవరైనా ఎక్కువ దృష్టి పెడితే బాగుండును.. సమస్య తీరవచ్చు లేదా ఏదైనా పరిష్కారం దొరకచ్చేమో అనిపిస్తుంది. కొన్నింటిలో ఆశావాహమైన ముగింపు పాఠకులకు కూడా చీకటిలో మిణుకుమనే నక్షత్రంలా దారి చూపగలదు.


'పునరుత్థానం' కథలో అన్ని రకాలుగా చిన్నాభిన్నమైపోయిన తన జీవితాన్ని ఆదిలక్ష్మి బాగుచేసుకున్న తీరు మోడులోంచి చిగురించే ఆకుపచ్చని ఆశలా తోస్తుంది. రచయిత్రి చెప్పినట్లు బతుకు బరువైనప్పుడల్లా ఎవరో ఒక ఆదిలక్ష్మి మనకు ప్రేరణ అవ్వగలదేమో.
'ఈ విషానికి ఈ తేనె చాలు' కథానికలో వింధ్య, అనురాధల జీవితాలు ఆలోచింపజేస్తాయి. వింధ్యను నిర్వేదం నుండి బయటకు లాగడానికి అనురాధ పడే తాపత్రయం, ప్రయత్నాలు బాగున్నాయి కానీ చివరలో వినోద మాటలు ఎందుకనో పూర్తిగా ఒప్పుకోలేకపొయాను. 

'దిశానిర్దేశకులు' అన్నింటిలో నాకు బాగా నచ్చిన కథ. కాలేజీ స్టూడెంట్స్ పై సినిమాలు ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయో ఒక అధ్యాపకురాలి కన్నా బాగా ఎవరు చెప్పగలరు? విద్యార్థులను ఈ రాంగ్ నోషన్స్ నుండి, సినిమా ప్రభావం నుండీ తప్పించగలిగితే దేశ భవిష్యత్తు ఎంతో బాగుపడగలదు అని నేను నిరంతరం అనుకుంటూ ఉంటాను. "తన్మయి"లో బామ్మ తాయారు కథ వెనుకటి కాలంలోని ఎందరో నిస్సహాయ స్త్రీల వేదనకు అద్దం పడుతుంది.


"కిటికీ బయటి వెన్నెల" కథ చదివితే నాకు మా పాత ఇంటి ఎదురు వీధిలో మా బాల్కనీ వైపుకు కనబడే మరో బాల్కనీలో రోజూ కనబడుతుండే ఆంటీ గుర్తుకువచ్చారు. రచయిత్రి లాగనే నేనూ ఆ బాల్కనీ లోంచి కనబడే సన్నివేశాలనూ, మనుషులనూ బట్టి ఫలానా కాబోలు.. బహుశా ఇలా జరిగిందేమో అనుకుంటూ ఉండేదాన్ని. ఏ మాత్రం పరిచయం లేకపోయినా రోజూ చూడ్డం వల్ల ఓ వారమెపుడైనా కనబడకపోతే ఏ ఊరెళ్ళారో.. ఎలా ఉన్నారో.. అనుకుంటూ ఉండేదాన్ని. వినాయకచవితి పందిట్లో కనబడితే దగ్గరకు వెళ్ళి పలకరించి నేను ఫలానా అని చెప్తే.. అవును ఇల్లు ఖాళీ చేసేసారుటగా అన్నారావిడ!

'నీడ' కథలో ఈ వాక్యాలు బాగా నచ్చాయి "...ముఖ్యంగా సమాజ సేవ చెయ్యడానికి మనం ఎందుకు ముందుకొస్తున్నామో ఒక్కసారి ఎవరికి వాళ్ళం ఆలోచించుకోవాలి సార్. లోకాన్ని మనం ఒక్కళ్ళం బాగుచెయ్యలేం. కానీ బాగుచెయ్యాలన్న తపనలో మన లోపల కల్మషాలు పోవాలి. పోతాయి కూడా. ఎప్పుడంటే - హృదయం పనిచేసినపుడు, హృదయం మాత్రమే పనిచేసినపుడు.. "


"ఆ రాత్రి" కథలో  "...కానీ ఇది మరెందరో ఆడపిల్లల భద్రతను దెబ్బ తియ్యడం లేదూ.." అన్న రజని ప్రశ్న పుస్తకం మూశాకా కూడా పదే పదే నా మనసులో తిరిగింది. నిజమే! ఇదే అసలు చాలా నేరాలకు మూల కారణం. కానీ ఎవరు మారుస్తారు ఈ అలవాట్లనీ, ఈ సమాజాన్నీ, ఈ పధ్ధతులనీ??


మనుషుల్ని మనుషుల్లా చాలామంది చూస్తారు. కానీ రచయిత్రి తన సునిశితమైన పరిశీలనాదృష్టితో మనిషి మనసులోని భావాల్ని కూడా చదవగలరు. మనుషుల్లో ఇంకా దయ, మానవత అనేవి పుష్కలంగా ఉన్నాయనీ, అవసరమైనప్పుడు అవి తప్పక బయటకు వస్తాయని "గీతల్ని చెరుపుకోవచ్చు" కథ ద్వారా ఒక ఆశావహ దృక్పధాన్ని చూపెడతారు రచయిత్రి. "ఈ విభజన రేఖలూ, సరిహద్దులూ, దూరాలూ ఉంటాయి. కానీ జీవితం అప్పుడప్పుడు వాటిని చెరిపేసి, మనుషుల్ని కలిపే సందర్భాలను కూడా పట్టుకొస్తుంది" అంటారావిడ. మానవత్వం పై , మనుషులపై ఎంత నమ్మకమో వీరికి అనిపించక మానదు ఈ కథ చదివితే.


ఒక బస్సు ప్రయాణంలో పూర్తయిన ఈ కథల పుస్తకం పట్టుకుని ఆలోచిస్తూ కూర్చుండిపోయా.. స్టాప్ వచ్చింది దిగమని శ్రీవారు వెనుకనుండి కదిపేవరకూ!! "బాధలన్నీ పాత గాధలైపోయెనే.." అని బుక్ కవర్ పై ఓ చివర్న రాసినట్లుగా పాతవైనా మెరుపు తగ్గని కథలు ఇవి. మరిన్ని ఆలోచనాత్మకమైన కథల్ని వీరలక్ష్మిగారి నుంచి ఆశిస్తున్నాను..

***    ***     ***

* "మనిషి ఎదుటి మనిషిని రాగద్వేషమిశ్రితమైన మనిషిగా అంగీకరించగలగటం ఎంతో గొప్ప సంగతి. అదే జరిగితే ఈ వాదాలేవి అక్కర్లేదు. ఈ అర్ధం చేసుకోలేకపోవడాల దగ్గరే మానవ దు:ఖమంతా ఉంది."
- వాడ్రేవు వీరలక్ష్మీదేవి.
('ఆకులో ఆకునై', 'మా ఊళ్ళో కురిసిన వాన' రెండు పుస్తకాల్లో ఉన్నాయి నాకెంతో ఇష్టమైన ఈ వాక్యాలు. ఇవొక్కటే చాలు నేనావిడ అభిమానినని గర్వంగా చెప్పుకోవడానికి.)

***    ***    ***

Monday, December 15, 2014

Holy Chants on Lord Ganesha & తోటకాష్టకమ్


క్రితం ఏడాదిలో అనుకుంటా మా అన్నయ్య Sacred Chants, Holy Chants సీరీస్ సీడీలు కొన్ని కొన్నాడు. ఫ్యూజన్ మ్యూజిక్ పధ్దతిలో చేసిన కొన్ని స్తోత్రాలూ, అష్టకాలు ఇందులో ఉన్నాయి. వినడానికి చాలా బావుండి, మనసులో అలజడిగా ఉన్నప్పుడు ప్రశాంతత నింపే విధంగా ఉన్నాయి సీడీలు. అన్నయ్య కొన్న చాలా రోజులకి ఈమధ్యనే అవి కాపీ చేసుకుని తెచ్చుకున్నా నేను. వాకింగ్ కి వెళ్ళినప్పుడు, వంటింట్లో పని చేస్కునేప్పుడు ఎఫ్.ఎం లు వినడం మానేసి ఇవే పెట్టుకుని వింటున్నా! చాలా బావుంటోంది. 

gaana.com లో చాలావరకూ ఈ సీడీలన్నీ వినడానికి దొరుకుతున్నాయి. Holy Chants సిరీస్ లో గణేషుడి మీద చేసిన ఆల్బం చాలా బాగుంది. ఆ లింక్ క్రింద ఇస్తున్నాను. ఇందులో ఎనిమిదవదైన 'Ganesha Stavarajaha' చాలా బావుంది. పాడినది - G. Gayatri Devi, Saindhavi, R. Shruti.

'Holy Chants on Lord Ganesha' మొత్తం సీడీ క్రింద లింక్ లో వినవచ్చు:
http://gaana.com/album/holy-chants-on-lord-ganesha


***


Sacred Chants

Sacred Chants series యూట్యూబ్ లో కూడా చాలానే లింక్స్ ఉన్నాయి.



***    ***


మామూలుగా నాకు తోటకాష్టకమ్ బాగా నచ్చుతుంది.  అష్టకాలు అవీ చదివేప్పుడు ఇది కూడా చదువుతూ ఉంటాము మేము. శంకరాచర్యులవారి శిష్యులైన తోటకాచార్యుడు ఆశువుగా చెప్పినదే ఈ తోటకాష్టకమ్. ఎక్కడో గుర్తురావట్లే కానీ ఈ తోటకాచార్యులవారి కథ ఈమధ్యనే చదివాం కూడా. ఈ ఫ్యూజన్ తోటకాష్టకం బాగుంది, North Indians పలికే విధానం అదే గానీ "భవ షంకర" "దేషిక మే రణం" మొదలైన పదాలే వినడానికి కష్టంగా ఉంది :( 





తోటకాష్టకమ్:
విదితాఖిలశాస్త్రసుధాజలధే మహితోపనిషత్ కథితార్థనిధే 
హృదయే కలయే విమలం చరణం భవశంకర దేశిక మే శరణం 
కరుణావరుణాలయ పాలయమాం భవసాగరదుఃఖవిదూనహృదం 
రచయాఖిలదర్శనతత్త్వవిదం భవశంకర దేశిక మే శరణం ll

భవతా జనతా సుహితా భవితా నిజబోధవిచారణ చారుమతే 
కలయేశ్వరజీవవివేకవిదం భవశంకర దేశిక మే శరణం

భవ ఏవ భవానితి మే నితరాం సమజాయత చేతసికౌతుకితా 
మమవారయ మోహమహాజలధిం భవశంకర దేశిక మే శరణం

సుకృతే ధికృతే బహుధా భవతో భవితా సమదర్శనలాలసతా 
అతిదీనమిమం పరిపాలయమాం భవశంకర దేశిక మే శరణం 

జగతీమవితుం కలితాకృతయో విచరంతి మహామహసశ్ఛలతః 
అహిమాంశురివాత్ర విభాసిగురో భవశంకర దేశిక మే శరణం 

గురుపుంగవ పుంగవకేతన తే సమతామయతాం నహి కోపి సుధీః 
శరణాగతవత్సల తత్త్వనిధే భవశంకర దేశిక మే శరణం

విదితా న మయా విశదైకకలా న చ కించన కాంచనమస్తిగురో
ద్రుతమేవ విధేహి కృపాం సహజాం భవశంకర దేశిక మే శరణం ll

Monday, December 8, 2014

సంగీత కళాశిఖామణికి సంగీత నివాళి..


image from - google

సంగీత కళాశిఖామణి శ్రీ నేదునూరి కృష్ణమూర్తి గారికి సంగీత నివాళి.._/\_

సంగీత విద్వాంసులు ఉన్నారు..ఇంకా పుడతారు... 
కానీ ఇటువంటి మహా విద్వాంసులు ఇక పుట్టబోరేమో...:(
ఈ అద్భుతమైన కచేరీ వినిపిస్తూ, నేను వింటూ ఆనందించడం మినహా ఏమీ చెయ్యగలను... చాలా అల్పురాలిని!



యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో డా.పప్పు వేణుగోపాలరావు గారితో శ్రీ కృష్ణమూర్తి గారి సంభాషణ... చివరలో యూనివర్సిటీవారికి ఆయన చెప్పిన సలహా వాళ్ళు పాటించారో లేదో తెలీదు మరి..

Friday, December 5, 2014

आज भी है मॆरॆ कदमॊं कॆ निशा आवारा..


మధుర గాయకుడు హరిహరన్ స్వయంగా స్వరపరిచిన "Horizon(1988)" అనే గజల్స్ ఆల్బం ఉండేది మా ఇంట్లో. హరిహరన్ వాయిస్ మొదటిసారి విన్నది అందులోనే నేను. ఆ ఆల్బమ్ లో మొత్తం ఎనిమిది గజల్స్ ఉంటాయి. అన్ని బాణీలూ హరిహరన్ వే .అన్నీ కూడా చాలా చాలా బావుంటాయి. గజల్స్ మధ్యన వచ్చే సంతూర్ వాదన వింటుంటే మనసు ఎటో గాల్లో తేలిపోతూ ఉంటుంది. అంత బాగా స్వరపరిచారు హరిహరన్. ఆ కేసెట్లో మొదటి గజల్ "ఆజ్ భీ హై మెరే కద్మోం కే నిషా ఆవారా.." ! సాహిత్యాన్ని రాసినది ముమ్తాజ్ రషీద్

మొదటిసారి విన్న గజల్, అదీ హరిహరన్ వాయిస్ అవడంతో నాకు తెలిసిన గజల్స్ అన్నింటిలోకీ ఇది అత్యంత ప్రీతిపాత్రమైనదైపోయింది. కాస్త ఉదాసీనమైన సాహిత్యమని నేను వినడం మానేసాను కానీ ఇప్పటికీ చాలాసార్లు అప్రయత్నంగా నానోటి వెంట ఈ గజల్ వచ్చేస్తుంటుంది. ఇందులో "जिसकॊ भी चाहा उसॆ टूट कॆ चाहा राशिद.. कम मिलॆंगॆ तुम्हॆं हम जैसॆ यहां आवारा" అన్న వాక్యాలు పాడుకుంటే లోపల దాగున్న వేదనేదో తేలికైనట్లు అనిపిస్తుంది. ఈ గజల్ లో సాహిత్యం కన్నా హరిహరన్ తీసే గమకాలు నాకు చాలా ఇష్టం. మళ్ళి మళ్ళీ విన్నప్పుడు బాగా తెలుస్తాయి. 


Ghazal: Aaj bhi hai mere..
Lyrics: Mumtaz Rashid
Singer & Composer: Hariharan





సాహిత్యం:
ప: आज भी है मॆरॆ कदमॊं कॆ निशा आवारा
तॆरी गिलयॊं में भटकतॆ थॆ जहा आवारा
((आज भी है मॆरॆ..))

1
చ: तुझसॆ क्या बिछ्डॆ तॊ यॆ हॊगई अपनी हालत..
यॆ हॊगई अपनी हालत..
जैसॆ हॊ जाऎ हवावों में धुवां आवारा(२)
((तॆरी गिलयॊं में..))


2చ: मॆरॆ शॆरॊं की थी पेह्चान उसी कॆ दम सॆ..
उसी कॆ दम सॆ..
उसकॊ खॊ कर हुए बॆ­नाम­ निशा आवारा(२)
((तॆरी गिलयॊं में...))


3చ: जिसकॊ भी चाहा उसॆ टूट कॆ चाहा राशिद..
उसॆ टूट कॆ चाहा राशिद..
कम मिलॆंगॆ तुम्हॆं हम जैसॆ यहां आवारा(२)
((तॆरी गिलयॊं में...))


***   ***

ఈ ఆల్బమ్ లో మిగిలిన గజల్స్ లో
* फूल कॆ आस पास रेह्तॆ हैं
* हमनॆ काटी हैं तॆरी याद मॆं रातॆं अक्सर
* शराब ला.. शराब दॆ
* बन नही पाया..
* क्या खबर थी..
మొదలైనవవి చాలా బావుంటాయి. మొత్తమ్ ఆల్బమ్ ని క్రింద లింక్ లో వినవచ్చు:
http://play.raaga.com/hindi/album/ghazals­by­hariharan­horizon­g0000381


 

Wednesday, December 3, 2014

గులాబీల గుబాళింపు.. 3rd Rose Convention at HICC







మొన్న ఆదివారం పొద్దున్నే న్యూస్ పేపర్లో "రోజ్ కన్వెన్షన్" పేరుతో గులాబీల ప్రదర్శన తాలూకూ ఫోటోలు కనబడ్డాయి. ఆదివారంనాడు మేం తెప్పించుకునే నాలుగు పేపర్లలోనూ ఫోటోలు మాత్రమే ఉన్నాయి. వివరాలతో ఆర్టికల్ ఏమీ లేదు :( నెట్లో వెతికినా టైమింగ్స్ కాదు కదా, ఏ వివరాలూ కనబడలేదు. ఆఖరికి నోవొటెల్ హోటల్ లో ప్రదర్శన జరుగుతోంది అన్న వివరం ఒక్కటీ పట్టుకుని, ఆ అడ్రస్ వెతుక్కుంటూ బయల్దేరాం. పొలోమని మా ఇంటి నుండి రకరకాల వాహనాలు మారి ఓ ముఫ్ఫై ఐదు, నలభై కిలోమీటర్లు అలా.......ఆ..... వెళ్పోతే ఉందన్నమాట ఈ హోటేలు ఉన్న ప్రదేశం. 

రెండూ బస్సులు మారాకా మధ్యలో మూడో చోట, శుక్రవారం నాడు సిటీలో రిలీజ్ చేసిన ఎనభై వోల్వో ఏసి బస్సుల్లో ఒక బస్సు ఎక్కే అవకాశం అదృష్టవశాత్తూ  రాబట్టీ బ్రతికిపోయాం. ఎండలో అలసట లేకుండా Hitex Exhibition center చేరాం. ఆ లోపల మరో రెండు, మూడు కిలోమీటర్లు వెళ్ళాకా ఈ నోవోటెల్ హోటేలు ఉంది. షేర్ ఆటో అబ్బాయి సగం దాకా తీస్కెళ్ళి ఆపేసాడు. ఇక వాల్కింగ్ చేసుకుంటూ డెస్టినేషన్ చేరాం. మధ్యలో ఎక్కడా ఓ పోస్టర్ గానీ, ప్రదర్శనశాలకు డైరెక్షన్ చెప్తూ వివరం గానీ లేవు. అసలీ ప్రదర్శన ఉన్నట్లే అక్కడ దారిలో కనబడ్డ కొందరికి తెలీదు. ఇదేదో కారుల్లో వచ్చే పెద్ద పెద్దోళ్ళందరికీనేమో మనలాంటి సామాన్యులకి కాదేమో.. అనుకున్నాం. కానీ ఆ దారిలో నడక మాత్రం చాలా బావుంది. ఎండలో రోడ్డుకిరుపక్కలా నీడనిచ్చే చెట్లు ఆహ్లాదాన్ని కలిగించాయి. హోటల్ దగ్గర్లోకి రాగానే రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ పైన గులాబీ రంగు కాగితంపువ్వుల కుండీలు ఎంత బావున్నాయి.


ఆ పక్కన మహర్షి విద్యాలయం ప్రాంగణం కనబడింది. కుడిపక్కన ఉన్న ఒక ఫంక్షన్ ప్లేస్ లో ఏదో పెళ్ళికి స్టేజ్ అలంకరణ జరుగుతోంది. క్రోటన్ మొక్కలు, బంతి మొక్కలు వేనుల్లోంచి దింపుతున్నారు.




గులాబీ ప్రదర్శన ఎంట్రీ ఫ్రీ నే! పెట్టినా కొనేవాళ్ళం.. ఇంత దూరం వచ్చాం కదా మరి :) ఎంట్రన్స్ లో వేరే దారి నుండి వస్తూ వస్తూ ఉన్న కొందరు జనాలు కనబడ్డారు. పర్వాలేదు జనం ఉన్నారు అనుకున్నాం. హాలు బయట పెద్ద పెద్ద కుండీల్లో అలంకరించిన గులాబీలు మనసు దోచేసాయి. లోపలికి వెళ్ళగానే ఎదురుగా తేబుల్స్ మీద చిన్న చిన్న గాజు సీసాల్లో పెట్టిన రంగురంగుల అందమైన చిన్నా,పెద్దా గులాబీ పువ్వులు రారామ్మని స్వాగతం చెప్పాయి. 




పెద్దగా బాగున్నవి, మంచి ఆకృతిలో ఉన్న గులాబీలకూ ఫోటోలు తీసుకుంటూ ఒక్కో టేబుల్ నుండీ కదులుతున్నాం.. ఇంతలో హాలు మధ్యలో వేల గులాబీలతో నిర్మించిన గులాబీ చార్మినార్ కనబడింది. అందరూ వంతులవారీగా ఫోటోలు తీస్కుంటూన్నారు అక్కడ నిలబడి. ఎందుకనో అది కట్టి అంత అందమైన గులాబీలన్నింటినీ వృధా చేసారనిపించింది. 







ప్రదర్శనలో అన్నింటికన్నా బాగా నచ్చినవి.. చిన్న చిన్న కుండీల్లో ఉన్న గులాబీ వృక్షాలు. అవును వృక్షాలే అవి. సుమారు ఆరడుగుల ఎత్తుకు ఎదిగి చెట్టు నిండా పాతిక, ముఫ్ఫై దాకా పెద్ద పెద్ద గులాబీ పువ్వులు ఉన్నాయి. అలాంటివి ఒక పది రంగుల గులాబీ పువ్వుల కుండీలు మొత్తం ప్రదర్శనకు ఆకర్షణ అనిపించాయి. ఆ చెట్లకు ఏవో పేర్లు కూడా ఉన్నాయి. పువ్వులో రకాలన్నమాట.








ఇంకా ఇకబన, మొరిబన మొదలైన వివిధ రకాల స్కూల్స్ వాళ్ళు ఎరేంజ్ చేసిన ఫ్లవర్ ఎరేంజ్మెంట్ పాట్స్ హాలు చుట్టూతా పెట్టారు. కాంపటీషన్ పెట్టినట్లున్నారు..ప్రైజెస్ రాసి ఉన్నాయి కొన్నిటిపైన. పింగాణీ
జాడీలు, ఇత్తడి బిందెలు,పళ్ళాలూ కూడా ఇలా ఫ్లవర్ ఎరేంజ్మెంట్స్ లో వాడడం కొత్త ఐడియానిచ్చింది నాక్కూడా. ఇంట్లో వాడకుండా పైన పెట్టేసిన పెద్ద పెద్ద పాతకాలం జాడీలు ఇకపై ఇలా వాడచ్చని ఆనందం కలిగింది.










ఒకచోట ఓ మెంబర్ మరెవరితోనో బాధతో హిందీలో అంటున్న మాటలు వినబడ్డాయి.. "బయట అవన్నీ పెట్టదన్నాను.. మీరెవరూ వినలేదు..అందరూ పువ్వులు తీసుకుపోతున్నారు.." అని! బయట వెళ్పోయేప్పుడు చూశాము.. కొందరు వెళ్పోతున్నవాళ్ళు వాజుల్లోంచి యద్ధేచ్ఛగా, నిర్భయంగా, నిస్సిగ్గుగా గులాబీ పువ్వులు గుత్తులు గుత్తులుగా తీసుకుని పోతున్నారు :( ఎంత శ్రమపడి వాళ్ళంతా పాపం వాటిని ఎరేంజ్ చేసి ఉంటారు.. ఎందుకని జనాలకు కొన్ని విషయాల్లో మేనర్స్, సెన్స్ ఉండవు..? అందమైన వాటిని సొంతం చేసుకునే తీరాలనే దుర్బుధ్ధి ఎందుకు? దూరం నుంచి ఆస్వాదించి పోకూడదా? లేదా ఆర్గనైజర్స్ యొక్క అనుమతి అడగకూడదా?.. జవాబు దొరకని ప్రశ్నలివి! 

చివరలో కలిగిన ఈ చిన్న డిస్టర్బెన్స్ తో, గులాబీల తాలూకూ పరిమళాలనూ, ఫోటోలనూ వెంట తీసుకుని ఇంటి దారి పట్టాం.






Monday, December 1, 2014

నవలా నాయకులు - 12



కౌముదిలో 'నవలా నాయకులు' సిరీస్ లో ఆఖరి ఆర్టికల్...’చివరకు మిగిలేది’ నుండి..
http://www.koumudi.net/Monthly/2014/december/dec_2014_navalaa_nayakulu.pdf


ఇన్ని నెలలూ ఆర్టికల్ రాసిన వెంఠనే.. 'చదువుతా విని ఎలా ఉందో చెప్పండని' ఫోన్లో నాన్ననూ, ఇంట్లో మావారినీ కూచోపెట్టి అన్ని ఆర్టికల్స్ వాళ్ళకి వినిపించిన తర్వాతే పంపేదాన్ని! అలా ఓపిగ్గా వినీ నాకు ప్రోత్సాహాన్ని అందించిన వారిద్దరికీ బోలెడు థాంక్యూలు :) మొదట్లో కొన్ని నెలలు నెలలో మూడు ఆర్టికల్స్ రాసిన సమయంలో కూడా ఎంతో ఓపిగ్గా నన్ను, నా clumsinessనీ భరించిన శ్రీవారికి ఈ సిరీస్ తాలూకూ నాకొచ్చిన ప్రశంసలన్నీ చెందుతాయి. 

నాపై నమ్మకంతో ఇంతటి మంచి అవకాశాన్ని నాకు ఇచ్చిన కౌముది ఎడిటర్ కిరణ్ ప్రభ గారికి బ్లాగ్ముఖంగా బోలెడు ధన్యవాదాలు.

Friday, November 21, 2014

हिम्मत करनॆ वालॊं की हार नहीं हॊती..


రోజు ముగిసి, సద్దుమణిగే సమయంలో రేడియో పెట్టుకుని నిద్రపట్టేదాకా వింటూ పడుకునే ఓ అలవాటు చిన్నప్పటి నుండీ! ఇవాళ కూడా ఊపిరి సలపని హడావిడి తరువాత, ఇందాకా రేడియో పెట్టాను.. ఉత్కంఠభరితమైన అమితాబ్ గొంతు ఖంగుమని మోగింది.. గభాలున గుర్తుకొచ్చింది IFFI మొదలైన సంగతి. చేస్తున్న పనులు వదిలేసి వాల్యూమ్ పెంచి, ఆ స్పీచ్  వింటూ కూచుండి పోయాం ఇద్దరం..! ఎంతో ఉత్సాహభరితమైన, ఉద్వేగభరితమైన, స్ఫూర్తిదాయకమైన మాటలు.. వరుసైన, పధ్ధతైన క్రమంలో చాలా ఉత్తేజాన్ని కలిగించాయి. చివరలో తండ్రిగారైన హరివంశరాయ్ బచ్చన్ ప్రేరణాత్మక కవిత.. "హిమ్మత్ కర్నే వాలోం కీ హార్ నహీ హోతీ.." వినిపించారు తన గంభీరమైన గళంలో!

ఆ చివరి వాక్యాలు...

"संघर्ष करॊ मैदान छॊड मत भागॊ तुम
कुछ कियॆ बिना ही जय जयकार नहीं हॊती
हिम्मत करनॆ वालॊं की हार नहीं हॊती"

సమయానుకూలంగా మా కోసమే చెప్పాడేమో అన్నట్లుగా ఉన్నాయి. ఎంత చక్కని కవితని చెప్పావయ్యా.. లవ్ యూ అమిత్ జీ!! అనుకున్నాం. గబగబా మొత్తం కవిత వెతికి మొదలు నుండీ చివరి దాకా చదివాం. 
నిస్పృహను దులిపేస్తూ కొత్త ఉత్సాహాన్ని నింపే వాక్యాలు..!
ఉత్తేజపూరితమైన ఆ కవిత మొత్తం క్రిందన ..


Thursday, November 20, 2014

కొన్ని రోజులు..



కొన్ని రోజులు ఝామ్మని జారిపోతూంటాయి
దూకే జలపాతంలా..

కొన్ని రోజులు సాదాగా నడిచిపోతూంటాయి
నిఠారైన నిలువుగీతలా..

కొన్ని రోజులు గజిబిజిగా ప్రశ్నిస్తూంటాయి
బోలెడు చుక్కల మెలికల ముగ్గులా..

కొన్ని రోజులు నిశ్శబ్దంగా గడిచిపోతుంటాయి
స్తబ్దుగా నిశీధిలా.. 

కొన్ని రోజులు దిశారహితంగా ఉంటాయి 
అచ్చంగా జీవితంలా..


Monday, November 17, 2014

मोहब्बत करनेवाले कम ना होंगे..


ఇందాకా నెట్ లో వార్తలు చదువుతుంటే.. అమితాబ్ చెప్పిన వాక్యాలు విని లతాజీ కళ్ళల్లో నీళ్ళు తిరుగాయని, ఆవిడ ట్వీట్ చేసారన్న వార్త కనబడింది. (http://zeenews.india.com/entertainment/celebrity/when-amitabh-bachchan-made-lata-mangeshkar-cry_1500535.html)
ఆ వాక్యాలు ఒక ప్రముఖ గజల్ లోనివి. వెంఠనే గజల్ రారాజు మెహదీ హసన్ పాడిన "मोहब्बत करनेवाले कम ना होंगे" అనే ఆ అద్భుతమైన గజల్ వెతుక్కుని విని ఆనందించాను. నాలాంటి సంగీతప్రియుల కోసం ఇక్కడ షేర్ చేద్దామనిపించింది.


ఈ గజల్ సాహిత్యాన్ని రాసిన ఉర్దూ కవి పేరు అబ్దుల్ హఫీజ్. 'హోషియార్ పూర్' అనే ఊరివాడవడం వల్ల ఆయనను "హఫీజ్ హోషియార్ పురీ" అని పిలుస్తారు. మెహదీ హసన్ గళమే కాక ఈ గజల్ సాహిత్యం చాలా చాలా బావుంటుంది. ఇదే గజల్ ఇక్బాల్ బానో గారూ, ఫరీదా ఖన్నుమ్ గారూ పాడిన లింక్స్ యూట్యూబ్ లో ఉన్నాయి. కానీ మెహదీ హసన్ పాడినది వింటుంటే మాత్రం గంధర్వ గానం.. అనిపించకమానదు!ఆ ఆలాపనలు.. స్వరం నిలపడం.. ఆహ్.. అంతే!

మెహదీ హసన్ మాటలతో ఉన్న ఓల్డ్ రికార్డింగ్:
http://youtu.be/NQ3rRwSl__8




సాహిత్యం:

मोहब्बत करनेवाले कम ना होंगे
तेरी महफ़िल में लेकिन हम ना होंगे

ज़माने भर के ग़म या इक तेरा ग़म
ये ग़म होगा तो कितने ग़म ना होंगे

अगर तू इत्तफ़ाक़न मिल भी जाये
तेरी फुरक़त के सदमें कम ना होंगे

दिलों की उलझनें बढ़ती रहेंगी
अगर कुछ मशवरे बहम ना होंगे

'हफ़ीज़' उन से मैं जितना बदगुमाँ हूँ
वो मुझ से इस क़दर बरहम ना होंगे

Tuesday, November 11, 2014

కోటి దీపోత్సవం





నాగయ్య గారి 'త్యాగయ్య' సిన్మాలో ఆయన "ఎందరో మహానుభావులు.." పాడాకా, ఆ సభలో ఒకరు "బ్రహ్మానందాన్ని కలిగించారు త్యాగయ్య గారూ.." అంటారు. అలాక నిన్న అనుకోకుండా మాకు బ్రహ్మానందాన్ని కలిగించారు మా గేటేడ్ కమ్యూనిటీ మిత్రులొకరు. నగరంలో ఎన్.టి.ఆర్. గార్డెన్స్ లో పదిహేనురోజులుగా జరుగుతున్న భక్తి టివీ వారి "కోటి దీపోత్సవం" వి.ఐ.పి పాసులు ఇచ్చారు. మొన్న(ఆదివారం) వాళ్ళు వెళ్తూ వెళ్తూ మమ్మల్నీ తీసుకువెళ్దాం అనుకున్నారుట గానీ మావారి ఫోన్ లైన్ దొరక్క వాళ్ళు వెళ్ళివచ్చేసారుట. అదే మాకు మంచిదయింది. నిన్న కార్తీక సోమవారం నాడు వెళ్ళే అవకాశం దొరికింది. పైగా నిన్నటి మూడవ కార్తీకసోమవారం శివరాత్రితో సమానమట +  కోటిదీపోత్సవం ఆఖరిరోజు కూడానూ. 


మాకు కేబుల్ టివీ లేదని; భక్తి టివీ రెగులర్ ప్రేక్షకురాలైన మా అత్తగారు ఫోన్లో మాకు ఈ కార్యక్రమం తాలూకూ అప్డేట్స్ ఇస్తూ ఉన్నారు. జనం బాగా ఉంటారు అని మేము వెళ్ళాలని అనుకోలేదు. వి.ఐ.పి పాస్ అన్నాకా కాస్త దగ్గరగా కూచోవచ్చు కదా అని రెడీ అయ్యాం. ఆఖరిరోజ్ని లేటవుతుందేమో.. మా పాప అంతసేపు కూచుంటుందో లేదో అని భయపడ్డాం కానీ పాపం బానే కూర్చుంది. ఐదింటికి బయల్దేరితే ఆరున్నరకి వెళ్ళాం అక్కడికి. అప్పటికి ఎక్కువ జనం ఇంకా రాలేదు గనుక ముందర్లోనే కూర్చోగలిగాము. గ్రౌండ్ అంతా కార్పెట్లు వేసేసి అందర్నీ క్రిందనే కూచోపెట్టారు. స్టేజ్ మీద వేసిన సెట్ కైలాసం సెట్, అలంకారం బాగున్నాయ్. గ్రౌండ్ లో అక్కడక్కడా శివలింగాలూ, శివుని విగ్రహాలు, పువ్వులతో అలంకరించిన గణేశ, అమ్మవారి ఆకృతులు.. వాటి అంచునే అమర్చిన దీపాలు.. మధ్య మధ్య గుండ్రని స్టాండ్ లలో అమర్చిన ప్రమిదలు.. అరేంజ్మెంట్స్ చాలా బావున్నాయి. చివరి రోజవడం వల్ల బాగా జనం బాగా ఉన్నారు. ఇలాంటి గేదరింగ్స్ కంట్రోల్ చెయ్యడమనేది మాత్రం చాలా కష్టతరమైన సంగతి. 


ప్రమిదల్లో పొయ్యడానికి నూనె బాటిల్స్ పంచారు. జనాలు పదేసి ప్రమిదల్లో ఒక్కళ్ళే  నూనె పోసేయ్యడం.. దీపాలు వెలిగించేప్పుడు కూడా ఒక్కళ్ళే పదేసి దీపాలు వెలిగించెయ్యడం.. కొంచెం నచ్చలా నాకు.:( 
ఎలాగోలా మేమూ ప్రమిదలో నునె పోసి.. చివర్లో తలో దీపం వెలిగించాము.






కార్యక్రమాలు మొదలయ్యాయి. పాటలు, నృత్యాలు అయ్యాకా జొన్నవిత్తుల గారు శివుని గురించీ, కార్తీక దీపాల విశిష్టత గురించీ చెప్పారు. తర్వాత స్టేజీ పైన అందంగా అలంకరించిన మండపంలో "పార్వతీ కల్యాణం" జరిగింది. జరిపించిన పురోహితుడు గారు ఉత్సాహవంతంగా బాగా మట్లాడారు. అది జరుగుతుండగా జనాల మధ్యలో ప్రతిష్టించి ఉన్న శివలింగానికి పెద్దలు అభిషేకాలు చేసారు. కల్యాణం జరిగిన తరువాత శివపార్వతీ విగ్రహాలను జనాల మధ్యకు ఊరేగింపుకు తెచ్చారు. అప్పుడు వెనకాల  
"పౌర్ణమి" చిత్రంలో "భరత వేదముగ" పాట లో లిరిక్స్ రాకుండా మిక్స్ చేసిన మ్యూజిక్ వేసారు. పెద్ద పెద్ద స్పీకర్స్ లో ఆ పాటలోని ఢమరుకనాదాలు, గంటలు, హర హర మహాదేవ నినాదాలు అందరినీ భక్తిసముద్రంలో ముంచేసాయి. నాక్కూడా చాలా ఆవేశం కలిగేసింది ఆ కాసేపు :) 




తర్వాత నిన్న మరొక విశేషం కూడా ఉందిట. "సంకష్టహర చతుర్థి". కాబట్టి గణేశ పూజ కూడా చేసారు. ఆ తర్వాత కార్యక్రమానికి విచ్చేసిన పదకొండు మఠాల పీఠాధిపతులను స్టేజ్ మీదకి ఆసీనులను చేసారు. వారిలో ముగ్గురు పీఠాధిపతులు తమ సందేశాలను క్లుప్తంగా అందించారు. అవన్నీ ఫోన్లో రికార్డ్ చేసుకున్నాను. హంపీ విరూపాక్షపీఠం నుండి వచ్చిన విరూపాక్షసదానంద స్వామి వారు హంపీ విరూపాక్షుడి గురించి, దీపాలు వెలిగించడం ఎంత మంచిదో చెప్పారు. ఉడుపి నుండి వచ్చిన విశ్వేశ్వర తీర్థ స్వామి వారు హిందీలో మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమం జరగడం భాగ్యనగరం యొక్క భాగ్యం అన్నారు. బాగా మాట్లాడారు ఆయన. 




తర్వాత, కార్యక్రమానికి వచ్చిన తమిళ్నాడు గవర్నర్ రోశయ్య గారు చిన్న సందేశాన్ని అందించారు. అప్పుడు, శ్రీపురం బంగారు ఆలయం నుండి వచ్చిన శ్రీలక్ష్మీ అమ్మవారికి  పుష్పయాగం చేసారు. అన్ని రకాల పూలతో పూజ చేయబడి, అందంగా మెరిసిపోతున్న బంగారు అమ్మవారిని చూడడానికి రెండు కళ్ళూ చాలలేదంటే నమ్మాల్సిందే! కార్యక్రమంలో చివరగా దీపోత్సవం మొదలైంది. స్టేడియంలో  లైట్లన్నీ ఆపేసారు. ఇందాకటి మాదిరి ఒక్కరే పదేసి ,ఇంకా ఎక్కువ దీపాలు వెలిగించెయ్యడం. కొందరు వత్తులు తెచ్చుకుని ఆ ప్రమిదల్లో వేసి వెల్గించేస్తున్నారు. మైకులో కార్యకర్తలేమో ఏ చీర కొంగుకి దీపాలు తగలకుండా చూడండీ , 365వత్తులు ప్రమిదల్లో వెయ్యకండి.. దీపాలు ఎక్కువ మంట వెలిగితే ప్రమాదం అని చాలాసార్లు జనాలను అప్రమత్తం చేస్తూ ఉన్నారు పాపం! బంగారు అమ్మవారిని తీసుకు వెళ్ళిపోతున్నప్పుడు కూడా దగ్గరగా చూడడానికి కాస్త తోపులాట అయ్యింది. చక్కగా ఇందాకా పూజ చూశారు కదా ఇంకేం కావాలసలు?! 


ఇక ప్రసాదాల వరకూ ఆగలేదు మేము. జనాలందరూ లేచి తిరిగేస్తున్నారు...  జాగ్రత్తగా బయటపడ్డాము. ఏదేమైనా ఇంతటి మహత్తర కార్యక్రమాన్ని చేపట్టిన "నరేంద్ర చౌదరి"గారు అభినందనీయులు. ఇందరిని ఒక చోట కూర్చడం, ఎరేంజ్మెంట్స్ చేయడం..అన్నీ కూడా అంత సులువైన పనులేమీ కాదు. ఒక గొప్ప సంకల్పం ఇది. ఏ అవాంతరం కలగకుండా మొత్తానికి పదిహేనురోజుల కార్యక్రమాలూ దిగ్విజయంగా జరిగాయి. ఖచ్చితంగా అంతా ఈశ్వరుడి దయ! 



మొత్తమ్మీద..కార్తీకమాసంలో శివమహాపురాణం  చదివిన ఆనందంతో పాటూ, ఇవాళ నిజంగా కైలాసానికి వెళ్లామా.. అనిపించేలాంటి గొప్ప అనుభూతిని హృదయాంతరాళలో నిలుపుకుని, ఒక పర్వదినాన కోటి దీపార్చనలో పాల్గొన్నామన్న తృప్తితో బ్రహ్మానందభరితులమై ఇంటి మొఖం పట్టాము.



హర హర మహాదేవ! 


మరికొన్ని ఫోటోలు ఇక్కడ...
http://lookingwiththeheart.blogspot.com/2014/11/blog-post.html