Saturday, April 6, 2013

వ్యంగ్యాత్మక హాస్యం - JOLLY LLB





ప్రేక్షకులకి రెండో ఆలోచనను రానివ్వకుండా చివరిదాకా వాళ్ల ఆసక్తిని పట్టి ఉంచగలిగిన ప్రతి సినిమా మంచి సినిమానే! అలాంటి మంచి సినిమా ఒకటి ఇవాళ చూసాం. దర్శకుడిగా మారిన ఒకప్పటి జర్నలిస్ట్ 'సుభాష్ కపూర్' తీసిన "JOLLY LLB". ఇది అతని మూడవ సినిమా. కథ, దర్శకత్వం రెండూ సుభాష్ కపూర్ వే. ఎక్కువ భాగం కోర్ట్ లోనే నడిచే ఈ సినిమాను కోర్ట్ రూం కామెడీ అనవచ్చు. ఈ చిత్రం హాస్యప్రధానమైనదే కానీ ఆ హాస్యం ముసుగుతో వ్యవస్థలోని లోటుపాట్లను, పేదల పట్ల ధనిక వర్గాల దాష్టీకం మొదలైవవాటిని ఎత్తిచూపే వ్యంగ్యాత్మక చిత్రం ఇది. 

అర్షాద్ వర్సి, బొమన్ ఇరానీ, సౌరభ్ షుక్లా ముగ్గురూ కూడా అత్యుత్తమ నటన చూపెట్టారు. ముఖ్యంగా జడ్జీ పాత్రలో సౌరభ్ షుక్లా నాకు భలేగా నచ్చాడు. అర్షాద్ వర్సి "జాలీ" పాత్రలో ఇమిడిపోయినా, ఇటువంటి పాత్ర కాస్తంత ముందుగా వచ్చిఉంటే బావుండేదేమో అనిపించింది. ఎందుకంటే హీరోయిన్ అమృతా రావు అసలే సన్నమేమో, ఆమె పక్కన మరీ పెద్దగా కనిపించాడు. చక్కనినటి అయిన అమృత కి పెద్ద పాత్ర ఏమి లేదు :( బొమన్ ఇరాని గురించి ప్రత్యేకంగా చెప్పేదేమీ లేదు. ఎటువంటి పాత్రలో అయినా ఇమిడిపోయే చక్కని నటుడు.


కథలోకి వస్తే జగ్దీష్ త్యాగీ(అర్షాద్ వర్సి) ఒక చిన్నపాటి లాయర్. అతని ప్రేమికురాలు స్కూల్ టీచర్ సంధ్య. ప్రఖ్యాత లాయర్ అవ్వాలన్నది అతని కలను నిజం చేసుకోవటం కోసం అతను ఢిల్లీ చేరతాడు. అక్కడ ఇంచుమించుగా మూసేసిన ఒక రోడ్ ఏక్సిడేంట్ కేసును తిరగతోడతాడు. మద్యం మత్తులో ఫుట్ పాత్ పై నిద్రిస్తున్న ఆరుగురు శ్రమజీవులపై కారు ఎక్కించిన ఒక డబ్బు, పలుకుబడి ఉన్న కుర్రవడిపై కేసు అది. ఆ కేసుపై PIL(public-interest litigation ) వేసి మళ్ళీ తెరిపిస్తాడు జగ్దీష్. ధనికవర్గం కుర్రాడి తరఫున దేశంలో అత్యంత పేరుప్రఖ్యాతలున్న లాయర్ తేజేందర్ రాజ్పాల్(బొమన్ ఇరాని) వాదిస్తుంటాడు. గెలవటానికి ఎటువంటి ఆధారం, ఆస్కారం రెండూ లేని ఈ కేసు తాలూకూ చిక్కుముడులన్నీ జగ్దీష్ త్యాగీ ఎలా విడతీసాడన్నది మిగిలిన సినిమా. 


ఇప్పుడేమి చేస్తాడా అనిపించేంత పెద్ద పెద్ద ఇబ్బందులు ఏమీ ఎదురవవు జగ్దీష్ కి. కానీ చక్కని స్క్రీన్ ప్లే, ఆలోచింపజేసే సంభాషణలు ఈ చిత్రంలో ముఖ్యమైన అంశాలు. ఒకటి రెండు అనవసరమైన పాటలు తప్ప ఎక్కడా విసుగు రాకుండా, ఆసక్తికరంగా మలుపులు తిరుగుతూ ముందుకు వెళ్తుంది కథ. కోర్ట్ సన్నివేశాలూ అందులో వాదోపవాదాలు ఎలా ఉంటాయి, డబ్బుకలవారిదే రాజ్యంగా మరిన వ్యవస్థలో ఎలాంటి లోటుపాట్లు ఉంటాయి, కొన్ని పోలీస్ నియామకాలు ఎలా జరుగుతాయి మొదలైన సంగతులు తెలుసుకోవాలంటే ఈ చిత్రం చూసి తీరాలి. 


కృష్ణ సంగీత దర్శకత్వంలో సినిమాలో ఒక పాటను బప్పీ లహరి పాడారు. 
http://www.youtube.com/watch?v=n_hlvIp8cds 

మోహిత్ చౌహాన్, శ్రేయా ఘోషాల్ పాడిన మరో సరదా పాట కాస్తంత ఇక్కడ:
   


ఈ సినిమా ట్రైలర్ ఇక్కడ: 
   


Thursday, April 4, 2013

"కవులమ్మ ఆడిదేనా?" కథా పరిచయం



"సారంగ సాహిత్య వారపత్రిక " లో నేను రాసిన కథా పరిచయం క్రింద లింక్ లో చదవవచ్చు:
http://www.saarangabooks.com/magazine/?tag=%E0%B0%A4%E0%B1%83%E0%B0%B7%E0%B1%8D%E0%B0%A3

తాయమ్మ కరుణ గారు రచించిన "కవులమ్మ ఆడిదేనా?" కథానికను కుడా అక్కడ చదవవచ్చు. నా కథాపరిచయాన్ని ప్రచురించిన సారంగ పత్రిక వారికి బ్లాగ్ముఖంగా ధన్యవాదాలు.


మొన్నొకరోజు "కొత్త పుస్తకాలు" టపాలో నవోదయా ఆయన ఒక పుస్తకం కొనమన్నారనీ, అందులో కథఒకటి చాలా బావుందన్నారని రాసా కదా.. ఆ కథే ఈ కథ..! ఈ కథ “మధురాంతకం రాజారాం సాహిత్య సంస్థ” ప్రచురించిన “కథావార్షిక 2004″ కథా సంకలనం లోనిది.


Wednesday, April 3, 2013

500 !






మేనెల చివరకి నాలుగేళ్లవుతాయి బ్లాగ్ మొదలుపెట్టి. నా జీవితంలో దాదాపు నాలుగేళ్ళ కాలాన్ని తన సంచీలో వేసేసుకుందీ బ్లాగ్లోకం :)
నాలుగేళ్ల ముందు దాకా నా జీవితం ఒక ఎత్తు. ఇక్కడ అడుగుపెట్టాకా మారిన జీవితం ఒక ఎత్తు ! 
ఈ నలభై ఆరు నెలల్లో ఎన్నో మార్పులు వచ్చాయి నా జీవితంలో... ఆరోగ్యంలో.. మనస్తత్వంలో... !!
ఏదెలా జరిగినా, నేను ఎప్పుడూ - ఎప్పటికీ నమ్మేది ఒక్కటే... "ఏది జరిగినా మన మంచికే" అని. 

ఈ బ్లాగ్జీవనయానంలో, జీవితపు ఒడిదొడుకుల మధ్యన నాకు ఆటవిడుపుని అందించిన ప్రత్యేక నేస్తం నా "తృష్ణ". నాలో జరుగుతూ వచ్చిన మార్పులకి ఒక స్పెక్టేటర్ అన్నమాట. 

"ఈ బ్లాగ్ నా సొంతం. నాకు తోచిన రాతలు రాసుకుంటాను.." అని ఆనందించినంత సేపు పట్టలేదు ఇక్కడ కూడా జీవితంలో మాదిరి ఎంత చీకటి దాగుందో తెలియటానికి. బ్లాగ్లోకంలో ఆనందించిన క్షణాల కన్నా నేర్చుకున్న పాఠాలే ఎక్కువ. ఇక్కడందరు మంచివాళ్ళే! కానీ మంచివాళ్ళు ఇన్నిరకాలుగా  ఉంటారని ఇక్కడే తెలిసింది ! 

ఏదేమైనా నా లోకం నాది. నా లోకంలోకి తొంగి చూసే అవకాశాన్ని మాత్రం నా బ్లాగ్ ద్వారా ఇస్తున్నాను. నచ్చితే చదవండి. లేకపోతే ముందుకి సాగిపొండి. ఈ టపాతో "తృష్ణ" బ్లాగ్లో 500 టపాలు పూర్తవుతాయి! ఎవరికైనా సమయం ఎంతో విలువైనది. నా సమయాన్ని వెచ్చించి రాసిన ఈ టపాలన్నీ మీ విలువైన సమయాన్ని వెచ్చించి చదివి, నన్ను ప్రోత్సహించిన బ్లాగ్మిత్రులకూ, శ్రేయోభిలాషులకూ హృదయపూర్వక ధన్యవాదాలు. 


Tuesday, April 2, 2013

"హమ్ నే దేఖీ హై.. "




హేమంత్ కుమార్ చిరస్మరణీయమైన నేపథ్యసంగీతాన్ని అందించిన "ఖామోషీ" సినిమాకు ప్రముఖ కవి, గేయ రచయిత "గుల్జార్" రాసిన పాటలు బహుళజనాదరణ పొందాయి. హేమంత్ స్వయంగా పాడిన "తుమ్ పుకార్ లో" హాంటింగ్ మెలొడీ ఐతే, "వో షామ్ కుచ్ అజీబ్ థీ", "దోస్త్ కహా కోయి తుమ్ సా.." , "ఆజ్ కి రాత్.." అనే చిన్ని కవితాగానం మూడూ కూడా సంగీతపరంగా, సాహిత్యపరంగా ఆకట్టుకుంటాయి. ఇవి కాక ప్రత్యేకంగా చెప్పుకోవల్సినది "హమ్ నే దేఖీ హై.. " గీతాన్ని గురించి. 

కథలో రోగి(అరుణ్)కి పూర్వ స్మృతి గుర్తుకు తెచ్చే ప్రయత్నంలో, నర్స్(రాధ) గతంలో అరుణ్ రాసిన ఈ పాటను వినిపిస్తుంది. ఈ పాటలో ప్రేమ యొక్క లక్షణాలను తెలిపే ప్రయత్నం చేస్తాడు కవి. లతా మంగేష్కర్ పాడిన అపురూపమైన గీతాల్లో ఒకటైన ఈ గీతార్థాన్ని ఈ నెల "వాకిలి" పత్రికలో చూడండి..
http://vaakili.com/patrika/?cat=28




Monday, April 1, 2013

వేములవాడ - నాంపల్లి





వేములవాడ:

సుప్రసిధ్ధ పుణ్యక్షేత్రం శ్రీ రాజరాజేశ్వరస్వామి క్షేత్రము - ఆంధ్రప్రదేశ్, కరీంనగర్ జిల్లాలోని వేములవాడ మండలంలో ఉంది. ఎప్పటినుండో వెళ్ళాలనుకుంటూ... మొన్నవారాంతలో వెళ్ళివచ్చాము. ఆర్ టి.సి.బస్సులో హైదరాబాద్ నుండి సుమారు మూడున్నర గంటల ప్రయాణం. సిధ్ధిపేట, సిరిసిల్ల ల మీదుగా బస్సు వెళుతుంది. "దక్షిణ కాశీ"గా పిలవబడే వేములవాడలో  శివుడు శ్రీ రాజరాజేశ్వరస్వామి పేరుతో కొలువై, భక్తులచే "రాజన్న"గా పిలుపునందుకుంటున్నాడు. అమ్మవారి పేరు రాజరాజేశ్వరీదేవి. వేములవాడ ఆలయం ఎంతో పురాతనమైనదిగా చెప్తారు. ఆ ప్రాంతంలో దొరికిన శిలాశాసనాలలో ఈ ఊరి పేరు "లేంబులవాటిక" అని ఉన్నదట. తర్వత అది "లేములవాడ" అయి, ఇప్పుడు "వేములవాడ" అయ్యిందిట. ఈ ఊరిని రాజధానిగా చేసుకుని చాళుక్యులు క్రీ.శ.750 నుండీ క్రీ.శ.973 దాకా రాజ్యమేలారని అక్కడి శిలాశాసనాలు తెలుపుతాయి. పంపన, వగరాజు, భీమన మొదలైన మహాకవులు కళాపోషకులు,సాహితీప్రియులైన చాళుక్యుల ఆస్థానంలోవారేనట.






ఇక్కడి ప్రధానాలయ ప్రాంగణంలోని ధర్మకుండము ప్రముఖమైనది. ఇందులో స్నానం గ్రహచార భాధలను,సమస్త బాధలను తొలగించి, మోక్షాన్ని ప్రసాదిస్తుందని నమ్మకం. కానీ పవిత్రమైన ఈ ధర్మకుండాన్ని భక్తులు పరిశుభ్రంగా ఉంచుతున్నట్లు కనబడలేదు :( 

సింహద్వారానికి ఎదురుగా అనంత పద్మనాభస్వామి ఆలయం, ఇంకా కాస్త పక్కగా బాల రాజేశ్వరాలయం,విఠలేశ్వరాలయం, కోటిలింగాలు, సోమేశ్వరాలయం, బాలాత్రిపురసుందరీదేవి ఆలయం ఉన్నాయి. ప్రధాన ఆలయంలో శివలింగానికి ఎడమ పక్కన లక్ష్మీగణపతి విగ్రహం, కుడివైపున అమ్మవారి విగ్రహం ఉన్నాయి. గుడి బయట ఊళ్ళో మరిన్ని ఆలయాలు ఉన్నాయి. వాటిల్లో వేణుగోపాలస్వామి ఆలయం బాగా పెద్దగా కనబడింది.

మేం వెళ్లిననాడు జనం బాగా ఉన్నారు. ఊరు పన్నెండింటికి వెళ్ళాం. దర్శనం అయి బయటకు వచ్చేసరికీ రెండున్నర అయ్యింది. జనం ఉన్నా అదృష్టవశాత్తు ఆ రోజున ఎవరో పీఠాధిపతి వచ్చారు. అయన వచ్చాకా కాసేపు క్యూ నిలిపివేసారు. అందువల్ల ఆయన ఆలయంలో ఉన్నంత సేపు, వేదపఠనాల మధ్యన మాకు చక్కగా దర్శనం అయ్యింది. 






 గుడి బయట దాదాపు చాలా కొట్లలో బెల్లం అచ్చులు అమ్ముతున్నారు. స్వామివారికి మొక్కు తీర్చుకోవటానికి బెల్లం తూకం వేస్తారుట. ఇంకా గుడి చుట్టు ఆవులను,దూడలనూ ప్రదక్షిణ చేయిస్తున్నారు. అది కూడా మొక్కేనట.

గుడి బయట ఒకామె అప్పుడే కుట్టిన విస్తరాకు




నాంపల్లి :

వేములవాడ వస్తోందనగా బస్సులోంచి ఒక చిన్న కొండ, దానిపై ఒక గుడి కనబడ్డాయి. రాజన్న దర్శనం అయ్యాకా, ఆ కొండ మీద గుడికి వెళ్దామన్నాను. వెములవాడ పక్కనే ఉన్న 'నాంపల్లి’ అనే గ్రామంలో ఆ గుడి ఉందట. 'లక్ష్మీనరసింహస్వామి' ఆలయంట. వేములవాడ దేవస్థానంవారిదేట ఆ గుడి కూడా. కొంతదాకా ఆటోలు వెళ్తాయి. తర్వాత మెట్లు ఎక్కాలి అని చెప్పారు. ఎండ విపరీతంగా ఉంది. అయినా కొండపై గుడి చూడాలనే ఉత్సాహంలో బయల్దేరాం.


view from the hill









 కొంతదాకా పైకి ఎక్కాకా కృషుడు కాళీమర్దనం చేస్తున్నట్లున్న పెద్ద నాగవిగ్రహం ఉన్న చోటన ఆటోలు ఆగుతాయి. ఆశ్చర్యం కలిగించేంతటి గొప్ప నిర్మాణం అది. చాలా అందంగా ఉంది. ప్లాన్ చేసి, కట్టిన ఇంజినీరుని తప్పక మెచ్చుకోవాలి. ఆ నాగపడగ  లోపలికి దారి ఉంది. రూపాయి టికెట్టు. టికెట్టు కనీసం ఐదు రూపాయలు చేయండి లేదా ద్వారం మూసేయండి అని ఆలయంవారు వినతిపత్రం ఇచ్చుకున్నారుట. అక్కడ మైంటైనెన్స్ కన్నా డబ్బులు మిగలాలి కదా! అక్కడ నుండీ ఈ వంద మెట్లు ఉంటాయి పైకి. మెట్లు స్టీప్ గానే ఉన్నాయి. చెప్పులు క్రింద వదిలేయటం వల్ల ఎండలో పైకెక్కటం కష్టమే అయ్యింది. ఇక్కడి నరసింహస్వామివారు స్వయంభూ ట. చలికాలంలో అయితే ఈ కొండపైకి రావటం చక్కని అనుభూతిగా మిగలగలదు.


ఇంటికొచ్చాకా నెట్లో వెతికితే ఈ గుడి విశేషాలు ఇక్కడ దొరికాయి:
http://www.youtube.com/watch?v=WA9IcbhaFpY



Sunday, March 31, 2013

Millet Fest - 2013





ఆహారం మరియు పౌష్ఠికాహారం బోర్డ్-భారత ప్రభుత్వం వారు, ఆచార్య ఎన్.జి.రంగా అగ్రికర్చరల్ యూనివర్సిటీ(ANGRAU) సహకారంతో  నెక్లెస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజా లో మూడు రోజులపాటు జరిగే "Millet Fest - 2013" ను నిన్న ప్రారంభించారు. ప్రజలు ఫాస్ట్ ఫుడ్స్ కి, ఇన్స్టెంట్ ఫుడ్స్ కి అలవాటు పడ్డం వల్ల చిరుధాన్యాలను కొనటం తగ్గిందని, అందువల్ల వాటి ఉత్పత్తి శాతం బాగా తగ్గిపోయిందట. రాగులు, జొన్నలు, కొర్రలు, సజ్జలు,సాములు మొదలైన చిరుధాన్యాలపై ప్రజల్లో తగ్గుతున్న ఆసక్తిని పెంచేందుకు, ఈ చిరుధాన్యాల పట్ల ప్రజల్లో మరింత అవగాహన, ఉపయోగాలూ తెలిపేందుకు ఈ ప్రదర్శనను క్రిందటేడు నుండీ నిర్వహిస్తున్నారుట. 





 యూనివర్సిటీ వాళ్ళు పరిశోధనల్లో భాగంగా చిరుధాన్యాలతో తయారు చేసిన పదార్థాలు, బిస్కెట్లు, మురుకులు మొదలైనవి ప్రదర్శనలో ఉంచారు. అవి ఇంకా కావాలంటే యూనివర్సిటీ స్టోర్స్ లో లభ్యమౌతాయని కూడా చెప్పారు. ఇవే కాక వివిధ సంస్థలు(NGOs) చిరుధాన్యాలతో తయారు చేసిన రకరకాల పదార్థాలూ, వారు పండించిన ఆర్గానిక్ చిరుధాన్యాలు మొదలైనవి అమ్మకానికి పెట్టారు. నేటితరం మగ్గు చూపుతున్న పీజాలు,బర్గర్లు మొదలైన ఫాస్ట్ ఫుడ్స్ ఆరోగ్యానికి ఎంత హానికరమో, మన పూర్వీకులు ఎంతగానో ఆస్వాదించిన ఈ చిరుధాన్యాలు, వాటితో ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుచుకోవచ్చునో కూడా ప్రదర్శనలో తెలుపుతున్నారు. నిజానికి ఆరోగ్యానికి హాని చేసే శనగపిండితో చేసిన పదార్థాలకన్నా ఆరోగ్యానికి మేలు చేసే జొన్న పిండి, రాగి పిండి మొదలైనవాటితో చేసిన పదార్థాలు ఎంతో మంచివి. ఎందుకంటే పిల్లలకు కావాల్సిన కేల్షియం, ఇనుము మొదలైనవి చిరుధాన్యాలలోనే ఎక్కువగా లభిస్తాయి.







 ఇంత చక్కని ప్రదర్శన నగరంలో జరగటం, మాకులాగానే ఎంతోమంది విచ్చేసి ఈ వివరాలన్నింటిని తెలుసుకోవటం నాకెంతో ఆనందాన్ని కలిగించింది. ఎందుకంటే గత ఏడాదిగా నేను ఈ చిరుధాన్యాలతో చేయగల వివిధ పదార్థాలను గురించి, వంటకాలను గురించీ విస్తృతమైన పరిశోధన జరుపుతున్నాను. జొన్న రవ్వ ఉప్మా, రాగి పిండి, సజ్జ పిండి, జొన్న పిండి, సోయా పిండి మొదలైనవి చపాతీ పిండి ఏ ఏ పాళ్ళలో కలిపితే చపాతీలు ఎలా వస్తాయో, అట్లల్లో మైదా బదులు జొన్న పిండి, పకోడీల్లో కూడా జొన్న పిండి కలపటం, రాగి పూరీలు మొదలైన ప్రయోగాలు చేస్తూ వస్తున్నా :) అందువల్ల వాళ్ళు అమ్మకానికి పెట్టిన మల్టీ గ్రైన్ ఆటా, మల్టీ గ్రైన్ రవ్వ, మల్టీ గ్రైన్ బ్రెడ్ నాకు కొత్తవి కాదు. కొన్నేళ్ళూగా నేను కొంటున్నవే. కొత్తగా నాకు తెలిసినవి ఏంటంటే మురుకులు, జంతికలు, ఖాక్రా లాంటివి కూడా జొన్న పిండితో చేసుకోవచ్చని. ఇలా కొత్తవి ఏం చేసుకోవచ్చో తెలుసుకోవటానికే మేము ఈ ప్రదర్శనకు వెళ్ళాం. కొన్ని రెసిపి బుక్స్ కూడా కొన్నాను. ఆర్గానిక్ చిరుధాన్యాలన్నింటినీ అమ్మే షాపు వివరాలు కూడా తెలుసుకున్నాం. బేగం పేటలో ఉందట వాళ్ళ షాపు.





మరోవైపున చిరుధాన్యాలతో చెసిన జొన్న రొట్టెలు, రగి రొట్టెలు మొదలైన వంటకాలను అమ్మకానికి పెడుతున్నారు. ఇంకా వంటకాలు తయారవుతున్నాయి. అవి సాయంత్రమే తింటానికి పెడతారుట. 



న్యూస్ పేపర్లో ప్రకటన అయితే వేసారు కానీ ప్రదర్శన సమయం రాయలేదు. మేము నిన్న మధ్యాహ్నం వెళ్ళాము. "స్టాల్స్ చూడండి కానీ అమ్మకాలు సాయంత్రమే" అన్నారు. మళ్ళీ పాతిక కిలోమీటర్లు రాలేము అని రిక్వెస్ట్ చేస్టే కొన్ని స్టాల్స్ లో పదార్థాలు కొనుక్కోనిచ్చారు. ఇటువంటి ఉపయోగకరమైన ప్రదర్శనలు నిర్వహించేప్పుడు  సరైన సమయం, ఎన్నాళ్ళు ఉండేది, ఇలాంటి ప్రదర్శనకు వెళ్ళటం వల్ల ఉపయోగాలు మొదలైనవాటి ప్రచారం సమంగా జరిపితే ప్రదర్శకుల శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. హోమ్ సైన్స్ స్టూడెంట్స్ ఎంతో ఉత్సాహవంతంగా తమతమ ప్రయోగాలను గురించిన వివరాలు తెలియజేసారు.

ప్రదర్శన తాలుకూ ఫోటోలు:




murukus with jowar


like khakhras


recipe books

Monday, March 25, 2013

కోటేశ్వర్ మందిర్



ఆమధ్యన మా పాప స్కూల్ వాళ్ళు ఊళ్ళోనే ఒకచోటకి విహారయాత్రకి తీసుకువెళ్ళారు. 'ఏదో గుడి అమ్మా..చాలా బావుంది' అని చెప్పింది వచ్చాకా. నిన్న ఆ గుడి వెతుక్కుంటూ వెళ్ళాం. సికింద్రాబాద్ లో ఒక మిలటరీ ఏరియాలో కాస్త ఎత్తు మీద ఉంటుందా శివాలయం. పేరు "కోటేశ్వర్ మందిర్". ఆర్మీవాళ్ల పర్యవేక్షణలో ఎంతో శుభ్రంగా, అందంగా ఉంది ఆలయం. సువిశాలమైన ప్రదేశం, అటవీ ప్రాంతమట. మాకు కనబడలేదు కానీ అప్పుడప్పుడు నెమళ్ళు కూడా ఉంటాయట అక్కడ. 

శివలింగం ఉన్న గర్భగుడి వెనకాల వైపున ఒక గుహలో మంచు శివలింగం ఉంది. చాలా బావుంది. 'శివపురాణం'లో ఈ గుడి ప్రస్తావన ఉందిట. జనసందోహం లేని ఇలాంటి ఆలయాలకు వెళ్లతం నాకు చాలా ఇష్టం. ప్రకృతి ఒడిలో ఉన్న ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం మనసుకి ఎంతటి ఉత్తేజాన్ని,కొత్త శక్తినీ ఇస్తుందో! 


ఆ గుడి తాలూకూ చారిత్రాత్మక చరిత్ర  క్రింద ఫోటోలో చదవవచ్చు..



గుడి తాలూకూ మిగిలిన ఫోటోలు.. అక్కడెవరూ అభ్యంతరం పెట్టలేదు.. కొందరు ఫోటోలు తీసుకుంటుంటే నేనూ మొబైల్తో తీసాను...


ఆలయం మెట్ల పక్కన ఉన్న గణేశుడు


ఈ ఇత్తడి గంటలు, గుడి వెనకాల తళతలలాడేలా తోమి బోర్లించిన ఇత్తడి బకెట్టు, ఇత్తడి పూజ సామగ్రీ ముచ్చటగొలిపాయి.


ఆలయం లోపల ఉన్న ఈ గంటలు చాలా అందంగా ఉన్నాయి..


హనుమ..

గుడి వెనకాల ఉన్న గుహ

మంచు లింగం


గర్భగుడిలో శివలింగం

గుడి పైన ఉన్న శివుని విగ్రహం


గుడి వెనకాల ఒక గేటుకి కట్టి ఉన్న చిన్నచిన్న రేకుడబ్బాల్లో సన్నజాజి తీగలు వేసారు. అన్నింటిలో చిన్నచిన్న కొమ్మలకే మొగ్గలు వచ్చి సన్నజాజిపువ్వులు ఉన్నాయి. అసలే నా ఫేవొరేట్ పువ్వులాయే.. భలే సరదా వేసింది వాటిని చూస్తే! 



"ప్రేమించు పెళ్ళాడు" నుండి రెండు పాటలు





వంశీ తీసిన "ప్రేమించు పెళ్ళాడు(1985) " చిత్రంలో ఈ రెండు పాటలూ అత్యద్భుతంగా తోస్తాయి నాకు. ఎన్నిసార్లు విన్నా బోర్ కొట్టవు. జానకి,బాలు ల గళాలు ఒక ఎత్తు, ఇళయరాజా సంగీతం ఒకఎత్తు అయితే, వేటూరి సాహిత్యాన్ని పొగడటానికి మాటలు కూడా దొరకవు అంటే ఒప్పుకోనివారుండరు. 

చివర్లో కాస్త గందరగోళం ఉన్నా సినిమా కూడా హీరోహీరోయిన్ల పెళ్ళి అయ్యేవారకూ సగం దాకా బావుంటుందని గుర్తు.. ఎప్పుడో చూడ్డమే ఈమధ్యన చూడలేదు. ఓసారి ఈ రెండు పాటలూ గుర్తుచేసేసుకుందామా...
 

1.) నిరంతరమూ వసంతములే..
చిత్రం : ప్రేమించు పెళ్ళాడు
సంగీతం: ఇళయరాజా
పాడినది : ఎస్.పి.బాలు, ఎస్.జానకి
సాహిత్యం : వేటూరి
http://www.youtube.com/watch?v=ZT0_lTcb6gE

ఈ పాట ఇంటర్లూడ్స్ లో వాడిన వయోలిన్స్,సితార ఇళయరాజా మార్క్ తో చాలా మనోహరంగా ఉంటాయి. ముఖ్యంగా ఋతువుల స్వభావాలతో కూడిన వర్ణన చాలా చక్కని ప్రయోగం.

 

 సాహిత్యం:

ప: నిరంతరమూ వసంతములే మందారములా మరందములే
స్వరాలు సుమాలుగ పూచే
పదాలు ఫలాలుగ పండే
నిరంతరము వసంతములే మందారములా మరందములే

1చ: హాయిగా పాట పాడే కోయిలే మాకు నేస్తం
తేనెలో తానమాడే తుమ్మెదే మాకు చుట్టం
నదులలో వీణ మీటే తెమ్మెరే మాకు ప్రాణం
అలలపై నాట్యమాడే వెన్నెలే వేణూ గానం
ఆకశానికవి తారలా ఆశకున్న విరి దారులా
ఈ సమయం ఉషోదయమై మా హృదయం జ్వలిస్తుంటే
((నిరంతరము వసంతములే...))

2చ: అగ్నిపత్రాలు రాసి గ్రీష్మమే సాగిపోయే
మెరుపులేఖల్లు రాసి మేఘమే మూగవోయే
మంచు ధాన్యాలు గొలిచి పౌష్యమే వెళ్ళిపోయే..
మాఘ దాహలలోనా అందమే అత్తరాయే
మల్లె కొమ్మ చిరునవ్వులా...
మనసులోని మరుదివ్వెలా...
ఈ సమయం రసోదయమై మా ప్రణయం ఫలిస్తుంటే..
((నిరంతరము వసంతములే...))


2) వయ్యారి గోదారమ్మ..
సంగీతం: ఇళయరాజా 
పాడినది : ఎస్.పి.బాలు, ఎస్.జానకి 
సాహిత్యం : వేటూరి 


 ఈపాటలో బాలు నవ్వు ఓ అద్భుతం ! అలానే "కలవరం.. " "కల వరం"గా విరుపు వేటూరి వారికే సాధ్యం.

 



 సాహిత్యం :
ప: వయ్యారి గోదారమ్మ ఒళ్ళంత ఎందుకమ్మ కలవరం..
కడలి ఒడిలో కలిసిపోతే కల వరం.. 
ఇన్ని కలలిక ఎందుకో కన్నె కలయిక కోరుకో..
కలవరింతే కౌగిలింతై..
వయ్యరి గోదారమ్మ..
 
1చ: నిజము నా స్వప్నం (హొ హొ..)
కలనో (హొ హొ) లేనో (హొ హొ హొ..  )
నీవు నా సత్యం (హొ హొ.. )
ఔనో (హొ హొ) కానో (హొ హొ హొ.. )
ఊహ నీవే.. (ఆహహహా) ఉసురు కారాదా (ఆఅహా.. )
మోహమల్లే.. (ఆహహహా) ముసురు కోరాదా (ఆఅహా..)
నవ్వేటి నక్షత్రాలు మువ్వల్ని ముద్దాడంగ..
మువ్వగోపాలుని రాధిక..
ఆకాశ వీణ గీతాలలోనా..
ఆలాపనై నే కరిగిపోనా..
((వయ్యారి గోదారమ్మ..))

2చ: తాకితే తాపం (హొ హొ.. )
కమలం (హొ హొ) భ్రమరం (హొ హొ హొ..)
సోకితే మైకం అధరం (హొ హొ..) ఆధరం (హొ హొ హొ..)
ఆటవెలది.. (ఆహహహ) ఆడుతూరావే (ఆహా..)
తేటగీతి.. (ఆహహహ) తేలిపోనీవే.. (ఆహా..)
పున్నాగ కోవెల్లోనా పూజారి దోసిళ్ళన్నీ
యవ్వనాలకు కానుక
చుంబించుకుందాం బింబాధరాల
సుర్యోదయాలే పండేటివేళ..
((వయ్యారి గోదారమ్మ..))

Sunday, March 24, 2013

కొత్త పుస్తకాలు

(కొత్త పుస్తకాలకింకా ఫోటో తియ్యలే..ఇది పాత ఫోటోనే)


అప్పుడప్పుడు దాచుకున్న కాయితం ముక్కలతో పర్సు నిండగానే మనసు పుస్తకాల షాపు వైపు పరుగులు తీస్తుంది. గత ఏడాది మూడు దఫాలుగా కొన్న పుస్తకాలన్నీ చదవటం అవ్వనేలేదు.. మళ్ళీ కొనటం ఎందుకని కాస్త ఆగాను. పది పదిహేను రోజుల క్రితం ఒక కొత్త పుస్తకం గురించి విన్నాకా శ్రీవారికి ఫోన్ చేసి అడిగితే, పాపం ఆఫీసు నుండి రెండు ప్రముఖ షాపులకూ వెళ్ళి ఇంకా రాలేదన్నారని వచ్చేసారు. కాస్తాగి మళ్ళీ ఇవాళ చేస్తే నవోదయాలో ఉందని చెప్పారు. సరే పదమని శ్రీవారిని బయల్దేరదీసా. " ఆ పుస్తకమేదో మొన్ననే దొరికి ఉంటే బావుండేది... నువ్వు బయల్దేరితే..." అని పాపం భయపడ్డారు. "అబ్బే మీ జేబుకేం భయంలేదు.. నా పర్సు ఈమధ్యన కాస్త బరువెక్కిందిలెండి" అని అభయమిచ్చాను :)


ఎవరెంత దూరంలో ఉండాలో దేవుడంతే దూరంలో ఉంచుతాడుట. అందుకేనేమో పుస్తకాల షాపులకీ నాకూ మధ్యన  మైళ్ళు బాగా ఎక్కువైపోయాయి. అంచేత బండి పక్కనబెట్టి బస్సు మార్గాన్నేఎంచుకున్నాం. ఎర్రని ఎండలో రెండు బస్సులు మారి గమ్యం చేరాం. పుస్తక ప్రదర్శన తర్వత మీరు మళ్ళీ రాలేదేం అని ఆప్యాయంగా పలుకరించారు షాపులో ఆయన. "మొన్న మిమ్మల్ని ఖాళీ చేతులతో పంపించామని మేము బాగా ఫీలయ్యామండీ.." అంటూ మావారి చేతిలో నాక్కావాల్సిన పుస్తకాన్ని పెట్టారు ఆయన. "అక్కడివ్వండి.. ఈసారి ఆవిడదే బిల్లు.." అంటూ దొరికిందే ఛాన్సని మరో నాలుగు ఛలోక్తులు విసిరారు అయ్యగారు. "అబ్బే ఆవిడ ఖచ్చితంగా అలా అని ఉండరు.." అని షాపాయన నాకు సపోర్టందించారు. నేను తీసుకున్న పుస్తకాలు కాక మరో ఐదారు పుస్తకాలు బిల్లు జాబితాలో చేర్పించాకా "ఈ కథలు కూడా బావుంటాయి చూడండి.." అని మరో పుస్తకాన్ని అందించారు. వద్దు మహాప్రభో...ఇక చాలన్నాను. ఆయన వెంఠనే పుస్తకాన్ని తెరిచి ఓ కథ చూపెట్టి, "ఈ కథ చదవండి. నచ్చకపోతే పుస్తకం వెనక్కి తెచ్చి ఇచ్చేయండి. ఈ ఒక్క కథ కోసం ఈ పుస్తకం కొనచ్చు" అన్నారు. ఇహ అది కూడా కలిపి ఓ పదిపదిహేను పుస్తకాలు రెండు క్లాత్ కవర్లల్లో నింపుకుని, తృప్తిగా మిగతా పనులు ముగించుకుని ఇల్లు చేరేసరికీ రాత్రి భోజనసమయం దాటిపోయింది. 


ఇంటికొచ్చి గబగబా వంటచేసి, తిని, పిల్లని పడుకోబెట్టి, అన్ని పనులూ పూర్తి చేసుకునేసరికీ గడియారం ముల్లు ఇవాళ్టి తేదీ చూపించేసింది. కొత్తగా కొన్నపుస్తకాలు ఇంటికొచ్చాకా ఓసారి మళ్ళీ అన్నీ తిరగేసి, అన్నింటిపై కొన్నతేదీ వేసి, సంతకం పెట్టుకోవటం నాకు అలవాటు. రేపు ఆదివారమే కదా అందుకని లేటయినా తీరుబడిగా అన్నీ ఓసారి తిరగేసి, షాపాయన బాగుంటుందన్న కథ చదువుతూ లోకం మర్చిపోయినా, మధ్యలో ఓసారి తలెత్తి 'నాకు లేటవుతుంది.. మీరు నిద్రోండి..' అని చెప్పేసా! మనసు బరువైపోయినా వెంఠనే రెండవసారి మళ్ళీ చదివా! కథయ్యేసరికీ ఈ సమయమైంది. అసలు ఆ కథ గురించి రాద్దామని బ్లాగు తెరిచా.. కానీ ఈ కథంతా రాయాలనిపించి రాసేసా :) ఎందుకనో ఈసారి కొన్న పుస్తకాలన్నీ చాలా ఆనందాన్నీ, మంచి పుస్తకాలు కొన్నానన్న తృప్తినీ కలిగించాయి. వీటిల్లో ఎన్నింటి గురించి టపాలు రాయగలనో... చూడాలి మరి !


వచ్చేప్పుడు దారిలో నాన్న డాక్టరు దగ్గరకు వెళ్తే, పుస్తకాలు చూపించచ్చు అని అక్కడికి వెళ్ళా. నాన్న అన్నీ చూసి "బావున్నాయే.." అని "మరి చిరిగిన చొక్కా ఏదీ.." అన్నరు :-)

Friday, March 22, 2013

సెల్ ఫోన్ ప్రైవసీ ఎంత?





ఆ మధ్యన చల్లగాలికి బాల్కనీ లో నించుంటే పక్కనెక్కడ్నుంచో ఎవరివో ఆఫీసు కబుర్లు వినబడ్డాయి. ఇంట్లో నెట్వర్క్ లేదని బాల్కనీలోకి వచ్చి మాట్లాడుతున్నారు. ఎవర్నో తిడుతున్నారు, ఎవరి గురించో ఫిర్యాదు చేస్తున్నారు.. ఆఫీసులో జరిగిన గొడవ ఎంతదాకా వెళ్ళిందో చెప్తున్నారు..! విసుగెత్తి లోపలికి వచ్చేసా. మరోసారి వంటింటి బాల్కనీలో బట్టలు ఆరేస్తుంటే.. క్రింద ఇంట్లో ఇల్లాలు సెల్ ఫోన్లో దగ్గటం, తుమ్మటం దగ్గరనుంచీ ఆ రోజు ఏ కూర వండిందో, ఏ కూరలో ఏ కారం, ఏ పొడి వెయ్యాలో విపులంగా వివరిస్తోందెవరికో! ఇక ఎదురు బిల్డింగ్(దగ్గరగా ఉంటుంది) లో ఓ బామ్మగారు ఎప్పుడూ బాల్కనిలోకి వచ్చే ఫోన్ మాట్టాడతారు వారి కూతురితో! కోడలి గురించీ, మనవల గురించీ, బంధువుల గురించీ..ఏవేవో చెబుతూంటారు. వద్దనుకున్నా వంటింట్లోకి వినబడిపోతాయా కబుర్లన్నీ! కారిడార్లోకి  ఏ ముగ్గు వేయటానికో, మొక్కలకి నీళ్ళు పొయ్యటానికో వచ్చామా.. రకరకాల గొంతులు.. వాళ్ల ఫోన్ కబుర్లు వినబడిపోతూనే ఉంటాయి. 


ఇక సిటి బస్సులో వెళ్తుంటే హింసే..! బస్సు చప్పుడులో ఎవరికీ వినబడదనుకుంటారో ఏమో కొందరు.. ఎవరూ వినకూడని కబుర్లు కూడా హాయిగా సెల్ఫోన్లో చెప్పేసుకుంటూంటారు. ముందు సీటులో వాళ్లకి వినబడుతుందేమో, పక్కన నించున్నవాళ్లకి వినబడుతుందేమో అన్న స్పృహే ఉండదు కొందరికి. కాలేజీ అబ్బాయిలు ఏ అమ్మాయిని ఎలా పడేసారో, ఏ అమ్మాయి ఎలా ఉంటుందో మొదలైన అందమైన కబుర్లు చెప్పుకుంటే, అమ్మాయిల టాపిక్కులు ఫిగర్ మైంటైనెన్స్, బ్యూటీ టిప్స్ ! ఉద్యోగస్తులు కొలీగ్స్ గురించి గాసిప్స్, వ్యాపారస్తులు తమతమ లావాదేవీలు... ఒకటేమిటి? సిటీబస్సులో వినబడినన్ని కబుర్లు టివీ వార్తల్లో కూడా వినలేం !! ఇక కొందరు సంగీతప్రియులు తమకిష్టమైన పాటలు బస్సులో అందరికీ వినబడేలా ఫుల్ స్పికర్లో పెట్టి మన సహనాన్ని పరీక్షిస్తూ ఉంటారు :(


ఇలా చెప్పుకుపోతే సెల్ ఫోన్ బాధకాల చిట్టాతో టపా కాదు ఒక పుస్తకం రాయచ్చు. చాలావరకూ సెల్ ఫోన్ల నెట్వర్క్ ఇళ్ళలోకి అందదు. మనమేమో ఊపిరి తోస్కోకుండా అయినా ఉండగలము కానీ సెల్ ఫోన్ లేకుండా అసలు ఉండలేమాయే! ఎవరి పరిమితులను బట్టి వారు హాయిగా సెల్ ఫోన్ వాడుకోవచ్చు.. కానీ ఇలా ఇంటి బయటకో, బాల్కనీలోకో వెళ్లి మాట్టాడితే అందరికీ వినబడుతుంది ఇంటిగుట్టు, ఆఫీసు గుట్టు రట్టే.. అని ఎవరికీ తోచదా? అన్నది నా ప్రశ్న. తప్పనిసరిగా ఎవరితోనైనా ఏదైనా మాట్టాడాల్సి వస్తే కాస్త నెమ్మదిగా మాట్టాడుకుంటే బావుంటుంది కదా! మేమైతే ఓ పధ్ధతి కనిపెట్టాం.. నెట్వర్క్ ఉండదని + సెల్ వాడకం మంచిది కాదని కూడా చెప్తున్నారని, ఇంట్లో వీలైనంత ల్యాండ్ లైన్ వాడుతున్నాం. ఆఫీసు ఫోన్ చేయాలంటే తను క్రింద సెల్లార్ లోకి వెళ్లి మాట్లాడి వస్తారు.


అందరి ఇళ్ళలో టెలీఫోన్ లేని రోజుల్లో ఎదురింట్లోకో, పక్కనే ఉన్న షాపు లోకో వెళ్ళాల్సివస్తే ఎంతో ఇబ్బందిగా ఉండేది. తర్వాతర్వాత అందరి ఇళ్ళలో ల్యాండ్ లైన్ ఫోన్లు వచ్చాయి. కాస్త ప్రైవసీ పెరిగింది. ఎవరింట్లో వాళ్ళు సుఖంగా మంతనాలు,చర్చలు చేసుకునేవారు. ఇప్పుడు సుఖాలు మరీ పెరిగిపోయి, టీనేజీ పిల్లలతో సహా మనిషి మనిషికీ సెల్ ఫోన్లు వచ్చాకా మనుషుల కమ్యూనికేషన్, కనక్టివిటీ బాగా పెరిగాయి. అది సంతోషకరమే. సెల్ ఫోన్ సొంతమే, ఫోన్ కాల్ వ్యక్తిగతమే, కానీ తాము పబ్లిక్లోనో, బాల్కనీల్లోనో మాట్లాడే సెల్ ఫోన్ల మాటలకి ప్రైవసీ లేదన్న సత్యాన్ని జనాలు గమనించగలిగితే బాగుంటుంది కదా !