రామప్ప గుడి తర్వాత నేను అమితంగా చూడాలని ఉత్సాహపడినది ఈ వెయ్యిస్థంభాల గుడిని. 'హనుమకొండ' వచ్చాకా బస్సు డ్రైవరు ఓ చోట బస్సు ఆపి "ఆ కనబడేదే వెయ్యిస్థంభాల గుడి దిగండి.." అన్నాడు. మళ్ళీ ఏ ఆటో ఎక్కాలో, ఎన్ని మైళ్ళు నడవాలో అని భయపడుతున్న నాకు ఎదురుగా గుడి కనబడేసరికీ సంతోషం కలిగింది. ఇలా రోడ్డు మీదకే ఉందే గుడి అని ఆశ్చర్యం కలిగింది.
రామప్ప గుడిలా కాక ఇది పూర్తిగా నల్ల రాతిబండలతో చెక్కబడింది. కానీ నిర్మాణం, గోడలపై పువ్వులు, శిల్పాలూ అన్ని అచ్చం రామప్ప గుడిలో మాదిరిగానే ఉన్నాయి. అక్కడ రాసి ఉన్న బోర్డులను బట్టి రామప్ప గుడి నిర్మాణం పూర్తయిన తర్వాత ఈ గుడి కట్టి ఉంటారు. శిల్పులు కూడా వాళ్ళే అయి ఉంటారు. లేదా అది కట్టే సమయంలోనే ఇది కూడా మొదలెట్టి ఉంటారు. ఎందుకంటే ఈ గుడి ఏకంగా డెభ్భైఏళ్ళు కట్టారని విన్నాను. వివరాలడగటానికి ఇక్కడ మాకు గైడ్ ఎవరూ దొరకలేదు కూడా. కానీ ఈ గుడి బాగా శిధిలమైపోయింది. రామప్ప గుడికి కాస్త బాగానే మరమత్తులు జరిగినట్లున్నాయి కానీ ఈ గుడి దుస్థితి(ఇలానే అనాలనిపించింది) చూస్తే చాలా విచారం కలిగింది :(
అత్యంత వైభవమైన చరిత్ర గల ఈ వెయ్యి స్థంభాల గుడి గురించి, కీర్తి ప్రతిష్టల గురించీ విని ఎంతో గొప్పగా ఊహించుకున్నాను నేను. నెట్లో బ్రౌజింగ్ చేసి ఫోటోలు అవీ చూసేస్తే ఉత్సాహం తగ్గిపోతుందని అలా కూడా చెయ్యలేదు. అందువల్ల వెలవెలబోతున్న గుడిని చూసి చాలా విచారపడ్డాను. ఈ గుడి ముఖ్యంగా శివుడు, సూర్యభగవానుడు, విష్ణువు ఈ ముగ్గురి ఆలయాలు కలిపిన త్రికూటాలయముట. నాలుగో వైపున రామప్ప గుడిలో ఉన్నలాంటి పెద్ద నందీశ్వరుడు అదే రూపంలో, అదే దిక్కులో ఉంటాడు. మొత్తం అలంకారం, మువ్వలు, గొలుసులూ అన్నీ సేమ్ సమ్ అన్నమాట :)
ఆకాశంలో చందమామ కనిపిస్తున్నాడా? |
ఇది కూడా శిధిలంగానే ఉంది :( |
త్రికూటాలయాల మధ్యలో రంగ మంటపం, పై కప్పులో ఉన్న శిల్పాలు, డిజైన్, చుట్టూరా ఉన్న నాలుగు స్థంభాలు, వాటిపై ఉన్న నగిషీ మొత్తం కూడా రామప్ప గుడిలో లాంటిదే. ఈ గుడి ఎక్కువ సార్లు ఓరుగల్లుని ఆక్రమించిన సుల్తానుల దాడికి గురైనదని విన్నాను. బహుశా రామప్ప గుడి బాగా లోపలికి ఉండటం వల్ల మరీ ఇంతగా దాడికి లోనవలేదేమో! కానీ ఎంత పగులగొట్టినా మిగతా గుళ్ళు గోపురాలు లాగ పూర్తిగా మాత్రం ధ్వంసం అవ్వలేదు ఇది. చాలా పకడ్బందీగా, ఎంతో శ్రమతో కట్టినట్లు తెలుస్తోంది చూస్తుంటే.
గుడి ముందర ఇరువైపులా ఉండవలసిన గజాలలో ఒకటే ఉంది.అది కూడా శిధిలమైపోయి ఉంది. రెండో వైపు ఏదో త్రవ్వకాల్లో దొరికిన నందీశ్వరుణ్ణి పెట్టినట్లుగా నాకు తోచింది. అంత గొప్ప నిర్మాణం చేసినవారు ఒక వైపు గజాన్ని, మరో వైపు నందిని పెట్టరు గదా.
గుడి ఆవరణలో ఉన్న పేధ్ధ రావి చెట్టు చాలా బాగుంది. నాకెందుకో చెట్లన్నింటిలోకీ రావిచెట్టు ఇష్టం.
గుడికి కనక్ట్ అవుతు నందీశ్వరుడి వెనకాల ఒక అద్భుతమైన నాట్య మంటపం ఉండేదట. లెఖ్ఖకు చెప్పే వెయ్యి స్థంభాలు ఆ మంటపంలోని నూరుకు పైగా ఉన్న స్థంభాలతో పూర్తి అవుతాయిట. కానీ అది బాగా శిధిమైపోయిందని అక్కడో గోడ కట్టేసి పునర్నిర్మాణం జరుపుతున్నారు. మొత్తం చూడడానికి అది ఎప్పటికి పూర్తి అవుతుందో! అసలు ఎప్పటికన్నా పూర్తి చేస్తారో లేదో తెలీదు. ఎందుకంటే కాకతీయుల భవన నిర్మాణం తాలూకూ టెక్నాలజీ చాలా గట్టిది, క్లిష్టమైనది. రామప్ప గుడిలో చూశాం కదా. అలాగనే ఇదీ ఉంది కాబట్టి ఇక్కడా సేమ్ టెక్నాలజీ వాడి ఉంటారు... తడి ఇసుక, దానిపై పీఠం మొదలైనవి. అలా చెయ్యగలరో లేదో.. అలాకాక మళ్ళీ మరోలా అంటే మనవాళ్ళు ఎలా కడతారో ఏమో!! నేనా గోడవారగా వెళ్ళి గోడ వెనుకకి చెయ్యి బయటకు పెట్టి ఓ రెండు ఫోటోలు తీసాను. "ఫోటోల సంగతి దేవుడెరుగు అంత ఎత్తు మీంచి కాలు జారితే..." అని ఇంటాయన కంగారుపెట్టకపోతే ఇంకొన్ని ఫోతోలు తీద్దును. ఇంటికొచ్చాకా ఆ ఫోటోలు చూస్తే ఆ నాట్య మంటపం ఇంకా ఎంత అద్భుతంగా ఉండేదో అనిపించింది. ఇలా వచ్చాయి ఆ ఫోటోలు..
Place under reconstruction |
place under reconstruction |
ఇంకా గుడి చుట్టూరా అక్కడక్కడా శివలింగాలు ఉన్నాయి.
ఓ పక్కగా శిధిలాలు, ఇంకా తలుపులు వేసేసిన ఏవో శిధిలాలు ఉన్నాయి. గుహలో ఏమో అవి..
(రేపు 'భద్రకాళి ఆలయం' గురించి..)