మా మామ్మయ్య(నాన్నమ్మ) నుండి అత్తకూ, అత్త నుండి అమ్మకూ లభ్యమయ్యి, ఆ తర్వాత మా అమ్మ నుండి నేను అపురూపంగా అందుకున్న విలువైన వారసత్వ సంపద "ముగ్గుల పుస్తకం". నామటుకు నాకు అదో పవిత్ర గ్రంథం. అమ్మ ఇచ్చిన గొప్ప వరం. అయితే అది నాదగ్గర ఇప్పుడు యథాతథంగా లేదు.. ఓ తెల్లకాగితాల కొత్త పుస్తకంలోకి ముగ్గులన్నీ బదిలీ కాబడ్డాయి. పాతకాలం లో వాళ్ళు అయిపోయిన కేలెండర్ చింపి, కుట్టి, వాటిలో పెన్సిల్ తో ముగ్గులు వేసిన ఆ పుస్తకం నా దగ్గరకు వచ్చే సమయానికి చాలా శిధిలావస్థలో ఉంది. ఎన్నో చేతులు మారి, ఎందరో వనితామణుల చేతుల్లోనో నలిగిపోయి.. కొన్ని ముగ్గులు ఎన్ని చుక్కలో కూడా తెలీకుండా.. తయరైంది. అందుకనేనేమో కొత్తగా నే ముగ్గులు వేసుకున్న పుస్తకం మీద అమ్మ ఇలా రాసింది...
విజయవాడలో మా ఇంట్లో వీధి గుమ్మం దాకా ఓ మూడు నాలుగు పెద్ద ముగ్గులు పట్టేంత స్థలం ఉండేది. నెలపట్టిన రోజు నుంచీ సంక్రాంతి వెళ్ళేదాకా మా సరస్వతి(ఆ ఇంట్లో ఉన్నంతకాలం పని చేసిన పనిమనిషి) రోజూ సందంతా శుభ్రంగా తుడిచి, కళ్ళాపి జల్లి వెళ్ళేది. తడి ఆరకుండా అమ్మ ముగ్గు వేసేది. తడి ఆరితే మళ్ళీ ముగ్గు గాలికి పోతుందని. అమ్మ ఎక్కువగా మెలికల ముగ్గులు పెట్టేది. సన్నటిపోత తో, చకచకా ముగ్గులు పెట్టేసే అమ్మని చూస్తే ఎంతో ఆశ్చర్యంగా ఉండేది.. తప్పులు రాకుండా అలా ఎలా పెట్టగలదా అని. నేన్నెప్పుడు పెద్దయ్యి ముగ్గులు పెడతానా అని ఎదురుచూసేదాన్ని.
ఇక మా కాకినాడ వెళ్ళినప్పుడు మామ్మయ్య, అత్త, అమ్మ ముగ్గురూ పెట్టేస్తూండేవారు ముగ్గులు. ఆ వీధిలో మా అత్త పేరు ఇప్పటికీ ముగ్గులత్తయ్యగారే ! అత్త ముగ్గుల పుస్తకం ఎప్పుడూ ఇంట్లో ఉండేది కాదు. పైనవాళ్ళో, పక్కవాళ్లో అడిగి తీస్కెళ్ళేవారు. 9th,10thక్లాస్ ల్లోకి వచ్చాకా నేనూ వాళ్ల ముగ్గుల పక్కన చిన్న చిన్న ముగ్గులుపెట్టేదాన్ని. ఇంటర్ నుంచీ మొత్తం గ్రౌండ్ నా చేతుల్లోకి వచ్చేసింది. అమ్మలాగ మెలికల ముగ్గులూ, వెడల్పు పోత ముగ్గులు కూడా వచ్చేసాయి. లక్ష్మి(అక్కడి ఆస్థాన పనమ్మాయి) వాకిలి తుడిచి, పేడ నీళ్ళతో కళ్లాపిజల్లి వెళ్ళేది. లక్ష్మి పేడ తెచ్చి చేత్తో తీసి బకెట్నీళ్ళలో కలిపేస్తుంటే.. కంపు కొట్టదా.. అలా ఎలా కలుపుతావు? అనడిగేదాన్ని.
ముగ్గుల పుస్తకంలోంచి సాయంత్రమే ఓ ముగ్గు సెలెక్ట్ చేసుకుని, కాయితమ్మీద వేసుకుని, ముగ్గు పెట్టాలన్నమాట. మా గుమ్మంలోనే వీధి లైటు ఉండేది కాబట్టి లైటు బాగానే ఉండేది కానీ దోమలు మాత్రం తెగ కుట్టేవి. అక్కడేమిటో రాక్షసుల్లా ఉండేవి దోమలు. ముగ్గు పెట్టే డ్యూటి నాకిచ్చేసాకా అమ్మవాళ్లు వంట పనుల్లో ఉండేవారు.. అందుకని ముగ్గు పెట్టినంత సేపూ తోడుకి అన్నయ్యనో, నాన్ననో బ్రతిమాలుకునేదాన్ని.
పెద్ద చుక్కల ముగ్గయితే, అన్నయ్య "నే చుక్కలు పెడతా" అని ముగ్గు తీసుకుని చుక్క చుక్కకీ "చిక్కుం చిక్కుం..." అంటూ చుక్కలు పెట్టేవాడు..:) అలా దాదాపు పెళ్లయ్యేవరకు నెలపట్టి ముగ్గులు పెట్టాను. అ తర్వాత నెలంతా కుదరకపోయినా అప్పుడప్పుడు పెట్టేదాన్ని. అపార్ట్మెంట్ ల్లోకి వచ్చాక గుమ్మంలోనే చిన్న ముగ్గుతో సరిపెట్టేసేదాన్ని. మొన్నటిదాకా రెండేళ్లపాటు ఇండిపెండెంట్ హౌస్ లో ఉన్నాం కాబట్టి కాస్త ముగ్గుసరదా తీరింది. ఈ ఏడు మళ్ళి మామూలే.. అపార్ట్ మెంట్.. చిన్న చాక్పీస్ ముగ్గు..:( ముగ్గులు వెయ్యటం తగ్గిపొయినా, అమ్మ ఇచ్చిన ముగ్గుల పుస్తకం మాత్రం నాకెప్పటికీ అపురూపమే.
నా ముగ్గుల పుస్తకంలోంచి మరికాసిన ముగ్గులు...
ఇంకొన్ని ముగ్గులు ఈ టపాల్లో ఉంటాయి..
http://trishnaventa.blogspot.in/2009/06/blog-post_16.html
http://trishnaventa.blogspot.in/2010/01/blog-post_12.html
http://trishnaventa.blogspot.in/2010/12/blog-post_16.html