సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Monday, March 28, 2011

విశ్వనటచక్రవర్తి


తెలుగు సినీ పరిశ్రమ గర్వించదగ్గ గొప్పనటుల్లో ఒకరు శ్రీ ఎస్.వి.రంగారావు గారు. సామర్ల వెంకట రంగారావు. నాకెంతో నచ్చే అభిమాననటుల్లో ఒకరు. గంభీరమైన కంఠం, చక్కని ఒడ్డు పొడుగు, శాంతవదనం, అద్భుతమైన నటన అన్నీ ఆయన పట్ల మన అభిమానాన్ని పెంచేస్తాయి. రచయిత సంజయ్ కిషోర్ గారి మాటల్లో "రంగారావు గారు ధరించని పాత్ర లేదు. అభినయించని రసము లేదు. హాస్య, శృంగార, రౌద్ర, భీభత్స, భయానక, అద్భుత, శాంత , కరుణ రసాలన్నింటిని మనకు చూపించారు". కీచకుడు, రావణుడు,కంసుడు, మాంత్రికుడు మొదలైన పాత్రలైనా, సాంఘిక పాత్రలైనా.. వేసిన ప్రతి పాత్రలో ఒదిగిపోయిన మహా నటుడు ఆయన.


ఇరవై రెండేళ్ళ వయసులో అరవై అయిదేళ్ల వృధ్ధుని పాత్ర ధరించి విమర్శకులను సైతం ఆశ్చర్యపరిచేసారుట రంగారావుగారు. నాటకాలలో నటించేప్పుడూ శ్రీ ఆదినారాయణారావు, శ్రీమతి అంజలీదేవి, శ్రీ రేలంగి వంటి వారి పరిచయ ప్రోత్సాహాలందాయి రంగారవుగారికి. ఇంగ్లీషులో కూడా మంచి ప్రవేశం ఉండటంతో షేక్స్పియర్ నాటకాలలోని ఎన్నో పాత్రలలో ఆయన నటించటం జరిగింది. వైవిధ్యమైన మానవ మనస్థత్వాలకు ప్రతీకలైన అటువంటి పాత్రలలో నటించటం వల్లనే ఎన్నో రకల హావభావాలను, మనస్థత్వాలనూ ఆయన అవగాహన చేస్కున్నారు.


మద్రాసులో స్కూలు చదువు, విశాఖలో ఇంటరు, కాకినాడలో బిఎస్సి పూర్తయ్యాకా ఎమ్మెస్సీ లో చేరాలనుకున్నారు రంగారవుగారు. ఒక నాటకంలో ఆయన విగ్రహం,ఒడ్డు పొడుగు అన్నీ చూసి ఒక ఫైర్ ఆఫీసరు గారు, ఫైర్ ఆఫీసర్ ఉద్యోగానికి అప్లై చేయాల్సిండిగా ఆయనకు సలహా ఇచ్చారు. అప్లై చేసాకా మద్రాసులో ఫైర్ ఆఫీసర్ శిక్షణ పొంది, బందర్లోనూ, విజయనగరం లోనూ, మరికొన్ని ప్రాంతాల్లోనూ పహైర్ ఆఫీసర్ గా ఉద్యోగనిర్వహణ చేసారు రంగారావుగారు. తీరుబడి ఎక్కువ ఉండటంతో నాటకాలను మాత్రం వదలలేదు ఆయన. ఒక బంధువు సహయంతో 1947లో "వరూధిని" అనే సినిమాకు కధానాయకుడిగా నటించారు. ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది. ఆ తరువాత కొన్ని చిన్న పాటి వేషాలు వేసాకా "షావుకారు" సినిమాలో "సున్నపు రంగడి" పాత్ర లభించింది రంగారావుగారికి. ఆ తరువాత వచ్చిన "పాతాళభైరవి"లోని మాంత్రికుడి పాత్ర తో పెద్ద నటుల జాబితాలో చేరిపోయారు రంగారావు. హిందీలో కూడా ఆ పాత్రను వారే పోషించారు. తన పాత్రకు హిందీ డబ్బింగ్ తానే చెప్పుకుని హిందీ ప్రేక్షకులకూ చేరువయి మరికొన్ని హిందీ చిత్రాల్లో కూడా వేసారు. ఆ క్రమం లోనే కన్నడ, మళయాళ చిత్రాలో కూడా నటించారు ఆయన.


"పెళ్ళి చేసి చూడు" సినిమా తమిళ రీ-మేక్ విజయం సాధించటంతో కొన్ని తమిళ ప్రేక్షకులకు కూడా చేరువయ్యారు ఆయన. తెలుగు,తమిళ సినిమాల్లో ఎంతో ప్రఖ్యాతిని పొందారు. ఆయన కదలికలు, హావభావ ప్రకటన, డైలాగ్ చెప్పే విధానమ్, గంభీరమైన గొంతు ఆయనను ఒక అరుదైన నటుడిగా నిలబెట్టాయి. "మాయాబజార్" సినిమాను ఆయన నటన కోసమే చూసినవారు కోకొల్లలు. "మాయాబజార్" లో ఘటోత్కచుడు, "భక్త ప్రహ్లాద" లో హిరణ్య కశిపుడు పాత్ర, "శ్రీ కృష్ణలీలలు" "యశోధ కృష్ణ" లో కంసుడు, "పాండవ వనవాసం"లో దుర్యోధనుడు, "నర్తనశాల" లో కీచకుడు, "మోహినీ భస్మాసుర" లో సొగసైన ఆయన నాట్యం, "హరిశ్చంద్ర"లో హరిశ్చంద్ర మొదలైన పౌరాణిక పాత్రలన్నింటిలో ఆయన నటన నభూతో న భవిష్యతి. ఆ అభినయంలోని స్పష్టత, ఉచ్ఛారణలో వైవిధ్యము మరెవరికీ సాధ్యం కాదేమో. సాంఘిక చిత్రాల విషయానికి వస్తే "బంగారు పాప" ,""లక్ష్మీ నివాసం", "షావుకారు", కత్తుల రత్తయ్య", "తాతా మనవడు", "తోడి కోడళ్ళు", "గుండమ్మ కథ" మొదలైన ఎన్నో చిత్రాల్లో ఆయన నటన అద్భుతం. మరో మాట ఉండదు. ఆయన నటనను ఎంత పొగిడినా సూర్యుని ముందు దివిటీయే అంటారు రచయిత ఈ పుస్తకంలో.

(ఈ క్రింది ఫోటోలో కుడివైపు చివరలో గాయని జానకి గారు) "నమ్మినబంటు" చిత్రం స్పెయిన్ లోని శాన్సెబాస్టియన్ పిల్మ్ ఫెస్టివల్ కు పంపబడింది. మిగిలిన యూనిట్ తో బాటూ రంగారావు గారు కూడా వెళ్ళారు. అక్కడనుంచి జర్మనీ, ఫ్రాన్స్, ఇంగ్లాండ్ మొదలైన దేశాలలో పర్యటించారు వారు. తరువాత జకర్తా ఆఫ్రో ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్లో "నర్తనశాల" బృందం పాల్గొంది. ఆ చిత్రానికి గానూ అక్కడ "ఉత్తమ నటుడిగా" అవార్డ్ ను అంతవరకూ మరే భారతీయ నటుడికీ అందనిది. ఆంధ్రులకు ఆ గర్వాన్ని అందించిన ఘనత రంగారావు గారిదే.

ఇక స్వదేశంలో ఎన్నో ఊళ్ళలో రంగారావుగారికి ఘన సన్మానలు జరిగాయి. "విశ్వనట చక్రవర్తి", "నటసార్వభౌమ", "నటశేఖర", "నట సింహ" మొదలైన బిరుదులు ఆయన అందుకున్నారు. నర్తనశాలకూ, మరిన్ని తమిళ చిత్రాలలో నటనకు గానూ రాష్ట్రపతి పతకాలు కూడా లభించాయి. రంగారావుగారు దర్శకత్వం వహించిన "చదరంగం" చిత్రానికి 1967లో ఉత్తమ చిత్రంగా ద్వితీయ నంది, "బాంధవ్యాలు" చిత్రానికి 1968లో ప్రధమ నంది లభించాయి. ఇటువంటి ఉత్తమ నటుడికి భారత ప్రభుత్వం పద్మశ్రీనో, పద్మ విభూషణ్ నో ఇవ్వక పోవటం ప్రశ్నర్ధకం అంటారు రచయిత.


అరుదైన ఎన్నో మంచి ఫోటోలతో, ఆ మహా నటుడి జీవిత విశేషాలతో ఎంతో చక్కగా రచింపబడినది "విశ్వనట చక్రవర్తి". ఈ వంద పేజీల పుస్తకం చివరలో ఆయన నటించిన సినీగీతాలు కూడా అచ్చువేసారు. రంగారావు గారికి సంబంధించిన వివరాలను సేకరించటానికి మూడేళ్లు పట్టిందనీ, వారి బంధుమిత్రులందరినీ కలిసి వివరలు, ఫోటోలు సేకరించినట్లు, సినీ అభిమానులందరూ అందరూ తేలికగా చదువుకోవటనికి వీలుగా చిన్న పుస్తకన్నే అచ్చువేసినట్లు గా రచయిత తనమాటలో చెప్తారు.


ఎస్.వీ.ఆర్ కు ముళ్ళపూడివారు వేసిన అక్షర మాల:

క్లిష్టమైన పాత్రలో చతురంగారావు
దుష్టపాత్రలో క్రూరంగారావు
హడలగొట్టే భయంకరంగారావు
హాయిగొలిపే టింగురంగారావు
రొమాన్సు లో (చేయిస్తే) పూలరంగారావు
అక్షరాలా 'మధు' రంగారావు
నిర్మాతల కొంగు బంగారావు
స్వభావానికి ఉంగా రంగారావు
కథ నిర్బలం అయితే హావభావాలు పాత్రపరంగారావు
కళ్ళక్కట్టినట్టు కనబడేది ఉత్తి యశ్వీరంగారావు
ఆయన శైలి ఠీవీ అన్యులకు సులభంగారావు
ఒకోసారి డైలాగుల్లో మాత్రం యమకంగారంగారావు


ఈ పుస్తక ప్రచురణకు సినీనటి జయలలిత సహకారం అందించారుట. 1998 లో మొదటి ప్రచురణ పొందిన ఈ పుస్తకం అన్ని విశాలాంధ్ర బ్రాంచీలలోనూ, నవోదయా లోనూ దొరుకుతుంది.