నిరీక్షణకు అంతం ఉండదా?
అన్వేషణకు ఫలితం ఉందా?
చెప్పవూ...
చిరుగాలి సవ్వడికి తల ఊపే
ప్రతి పువ్వు కదలికకి
ఆకురాలు నిశ్శబ్దంలోకి
తొంగి తొంగి చూసాను..
దారి పొడుగునా..అడుగడుగునా
పరీక్షించి...ప్రతీక్షించి
వేచి వేచి చూసాను..
ఎక్కడా నీ పాదాల జాడే లేదు.
ఏ చోటా నీ ఆచూకీ దొరకనేలేదు.
ఏమయ్యావు నువ్వు?
క్రితం జన్మలో ఎప్పుడు విడిచావో
ఈ చేతిని...
ఇంతదాకా మళ్ళీ అందుకోనేలేదు..
ఎక్కడని వెతకేది నీ కోసం?
నిరంతరం అన్వేషిస్తూనే ఉన్నాను..
చినుకురాలినప్పుడు..
కమ్మని మట్టివాసన
గుండెనిండా నిండినప్పుడు..
దూరాన గుడిగంటలు
హృదయంలో ప్రతిధ్వనించినప్పుడు..
చల్లని వెన్నెల కిరణాలు
చెట్లమాటు నుంచి
నావైపు తొంగిచూసినప్పుడూ..
మధురమైన రాగానికి పరవశించి
నా గొంతు శృతికలిపినప్పుడూ..
ఎప్పుడూ..
నిన్ను తలుస్తూనే ఉన్నానూ.
కనుల కలలవాకిల్లో నీ రూపాన్ని
ఊహించ ప్రయత్నిస్తూనే ఉన్నాను.
ఈ నిరీక్షణకూ..ఈ అన్వేషణకూ అంతం ఎప్పుడు?
ఏ నాటికి నీ చేయి
నాకు తోడునిచ్చి అందుకునేది?
నిరీక్షణకు అంతం ఉండదా?
అన్వేషణకు ఫలితం ఉందా?
చెప్పవూ...
*** *** *** *** ***
పైన రాసినది ఇప్పుడు రాసినది కాదు...:) 12ఏళ్ళ క్రితం రాసిన ముచ్చట. ఆ తరువాత నాలుగేళ్ళకు మా పెళ్ళి అయ్యింది. అప్పుడిక గట్టిగా చేయిపట్టేసుకుని ఈ కవితను అంకితమిచ్చేసాను...:) "మేరేజస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్" అని బలంగా నమ్మే మనిషిని నేను. మధ్యాహ్నం "మాల గారి బ్లాగ్" లో పైన చిత్రాన్ని, ఆ తరువాత మాల గారి ఆహ్వానంపై ఈ రాజా రవివర్మగారి చిత్రానికి కవితలు రాసిన బ్లాగ్మిత్రుల ఇతర కవితలు చదివాకా వెంఠనే నాకు ఈ పాత కవిత గుర్తుకు వచ్చింది. మాల గారికి 'నేను రాస్తానని' పర్మిషన్ అడిగేసి, ఇంటికి వచ్చి పాత పుస్తకాలన్నీ తిరగేస్తే దొరికేసిది - కవిత రాసిన చిన్న స్పైరల్ నోట్ పాడ్. కానీ పనులన్నీ అయ్యేసరికీ ఇంత సమయమైంది. సరేలే ఇవాళ్టి వెన్నెల తోడుంది కదా అనేస్కుని టపా రాసేస్తున్నా.
పైన ఫోటో నాకు నెట్లో దొరికిన మరో ఇమేజ్.