సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Thursday, March 17, 2011

త్రిశతం


ఈ మెట్టు మొత్తానికి ఎక్కేసాను. మధ్య మధ్య ఆగిపోతూ ...పడుతూ..లేస్తూ..వగరుస్తూ...ఒకోసారి నెమ్మదిగా పాకుతూ.. మొత్తానికి ఇలా మూడొండలవ టపా పూర్తి చేస్తున్నాను. రెండో మూడో టపాలు తీసేసాకా, కొన్ని డ్రాఫ్ట్ లోకి తోసేసాకా, మరికొన్ని నా ఇతర బ్లాగ్విభజన్లోకి వెళ్పోయాకా ఇదిగో ఇప్పటికి మూడొందలకి చేరాను. మొదట్లో ఉన్న మామూలు స్పీడ్లో వెళ్లి ఉంటే కనీసం ఐదొందలు దాకా చేరేదాన్ని. కానీ నిజ జీవితం లాగే ఈ బ్లాగ్ జీవనం కూడా ఒక roller coaster రైడ్ లాంటిదే. కాబట్టి సీదాగా ప్రయాణం సాగించలేకపోయాను. ఈ మెట్టును చేరటం సులభమైతే కాలేదు. మొదట్లో కొన్ని బ్లాగుల్లో లకారం పైనే ఉన్న విజిటర్స్ నంబర్ చూసి అమ్మో అనుకునేదాన్ని. అలాంటిది క్రితం నెల్లోనే నా అతిధుల జాబితా కూడా లక్ష దాటింది. నామటుకు నాకు అది చాలా ఆనందకరమైన విషయం. ఎక్కువ వ్యాఖ్యలు రావటం వేరు, ఎక్కువమంది బ్లాగును చదవటం వేరు.

దాదాపు ఏడాది పూర్తయ్యేవరకూ వ్యాఖ్యలు వ్యాఖ్యలు అని కలవరించేదాన్ని. ఇప్పుడు కూడా ఎక్కువ వ్యాఖ్యలు వస్తే ఆ రోజంతా సంబరమే. ఎందుకంటే ఏ రచయితకయినా చదివేవారి స్పందనే ఎక్కువ ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇంకా బాగా రాయాలన్న ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది. కాబట్టి వ్యాఖ్యలు తగ్గిపోయినప్పుడు కృంగిపోయేదాన్ని. ప్రముఖ బ్లాగర్లు ఏం రాసినా ఆహా ఓహో అంటారు, సామాన్య బ్లాగర్ మంచి విషయాలు రాసినా ఒక్క వ్యాఖ్యా రాయరు అని తిట్టుకునేదాన్ని. కాబట్టి నాకున్న సమయంలో నేను కొత్త బ్లాగ్ ఏదైనా చదివితే మాత్రం నచ్చిన చోట తప్పక వ్యాఖ్య రాస్తూంటాను. కానీ మెల్లగా నాకు అర్ధమైన సంగతి ఏంటంటే నా బ్లాగ్లో వ్యాఖ్యల కన్నా రీడర్స్ సంఖ్య పెరుగుతోందని. ఒకప్పుడు వందమంది మాత్రమే చదివే ఈ బ్లాగ్ ను రోజుకు మూడొందలు తక్కువ కాకుండా చదువుతున్నారు. అది నాకు విజయమనే చెప్పాలి.

వ్యాఖ్యలు రాయకపోయినా రెగులర్గా నా బ్లాగ్ చదివే నా మిత్రులు, బంధువులు ఎంతో మంది ఉన్నారని ఈ మధ్యనే తెలిసింది. "పొద్దుటే ఆఫీసుకి రాగానే ఇవాళేం రాసావో అని చూడటం అలవాటయిపోయింది...నువ్వు రాయటం మానేస్తే మళ్ళీ ఎప్పుడు రాస్తావు అని చూస్తుంటాను..." అని కొందరు ఇటీవలే చెప్పటం నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. మరి అప్పుడప్పుడు వ్యాఖ్య రాయచ్చుకదా అంటే "ఆఫీసులో ఉంటాకదా కుదరదు..ఒకోసారి బధ్ధకం" అని సమాధానం. ఇలా నాతో చెప్పకపోయినా చదివేవాళ్లు ఇంకా ఉన్నారన్న ఆలోచన రాయాలన్న సంకల్పాన్ని దృఢం చేస్తుంది.

ఇక భాస్కరన్నగారు తన 400వ టపాలో రాసినట్లుగానే ఉంటుంది బ్లాగ్లోకంలో ఈక్వేషన్..
యు రీడ్ మై బ్లాగ్
ఐ రీడ్ యువర్ బ్లాగ్
యు కామెంట్
ఐ కామెంట్
యు నో రిప్లై
ఐ నో కామెంట్
యు నో రీడ్ మైన్
ఐ నో రీడ్ యువర్స్
ఖేల్ ఖతం
దుకాణ్ బంద్
(ఇది భాస్కరన్నగారు రాసిన ఈక్వేషనే)

నేనూ అలా చాలామంది రీడర్స్ ను దూరం చేసుకున్నాను. కామెంట్స్ తగ్గిపోయాయి. కానీ ఇంకా కొందరున్నారు. నేనెప్పుడూ వాళ్ల బ్లాగ్ జోలికన్నా వెళ్ళకపోయినా వ్యాఖ్యలు రాస్తారు. వీళ్ళు చాలా చాలా మంచివాళ్ళు. ఏమాటకామాటే.. నేనంత మంచిదాన్ని కాదు మరి. కొంచెం చెడ్డదాన్నే...:) కొత్తల్లో బ్లాగ్లోకం చాలా బాగుండేది. ఈమధ్యన పాతమిత్రులందరూ నెమ్మదిగా ఒక్కొక్కరే రాయటం మానేస్తున్నారు. ఎంతో దిగులుగా ఉంటుంది. ముఖ పరిచయం లేకపోయినా అల్లుకుపోయిన స్నేహాలను మరిచిపోవటం సాధ్యమా? అలాఅని రాస్తూ ఉండమని ఎంతమందినని అడిగేది? ఎవరి ఇబ్బందులు ఎలా ఉన్నాయో ఎవరికి ఎరుక? నాకూ కుదరటం లేదు. కానీ ఛీ పొమ్మన్నా చూరుపట్టుకుని వేళ్ళాడే దశమగ్రహం లాగ ఎన్ని అడ్డంకులొచ్చినా బ్లాగ్లోకపు చూరును వదలలేదు. ఎంతో ఇష్టమైన కాఫీని వదిలేసిన నాకు బ్లాగింగ్ వదిలేయటం కష్టమైన పని కాదు. ఇదొక వ్యసనమని కాదు.... ఒడిదొడుకుల జీవితానికి బ్లాగింగ్ ఒక ఆటవిడుపు అని.

ఇంకో కొత్త విషయం ఈ మధ్యన బోధపడింది. నా బ్లాగ్ నచ్చనివాళ్ళు, నా రాతల్ని చూసి నవ్వేవాళ్ళు కూడా ఉన్నారని. అవును మరి నాణానికి రెండో వైపు కూడా చూడాలికదా. నా బ్లాగ్ నచ్చనివారికీ, నా రాతలు వేళాకోళంగా అనిపించేవారికీ ఒక్కటే మాట చెప్తాను...దయచేసి నా బ్లాగ్ చదవకండి. నచ్చనివి చదవటం ఎందుకు? మీ విలువైన సమయాన్ని వృధా చేసుకోవటం ఎందుకు? నా రాతలు నచ్చేవారే నా బ్లాగ్ చదువుతారు. నా సొంత బ్లాగ్లో నాకు తోచిన రాతలు రాసుకునే హక్కునీ, అవకాశాన్ని, నాకు తోచిన విషయాలు రాసుకునే స్వేచ్ఛనీ నాకు బ్లాగ్ స్పాట్ వాళ్లు ఇచ్చారు. నే రాసినది మరో పదిమంది చదవాలన్నది నా అభిలాష కాబట్టి అగ్రిగేటర్లలో నా బ్లాగ్ ఏడ్ చేసుకున్నాను. కాబట్టి నా రాతలు నచ్చనివాళ్ళు తమ అమూల్యమైన సమయాన్ని, మేధస్సునీ ఈ బ్లాగ్ చదవటానికి కాకుండా మరో మంచి పనికి వినియోగించుకోవలసినదని సవినయమైన మనవి.

దాదాపు ఇరవై నెలల బ్లాగింగ్ అనుభవంలో చివరిగా నేను చేసుకున్న నిర్ణయం ఒక్కటే. రాయాలని తోచినన్నాళ్ళు, కుదిరినన్నాళ్ళు రాస్తాను. చదివేవాళ్ళు చదువుతారు. అంతే. వ్యాఖ్యలకై ఎదురుచూపులు, చింతించటాలు ఎప్పుడో పోయాయి. ఈ బ్లాగ్ ఒక సామాన్య మధ్యతరగతి స్త్రీ మనోభావాల సమాహరం. నిరంతరం ఘోషించే కెరటాల మాదిరి ఈ ఆలోచనలు విశ్రాంతి నెరుగవు. "బ్లాగనందం" అనే టపాలో చెప్పిన పాటనే ఇప్పుడు కూడా నా బ్లాగ్ కు డెడికేట్ చేస్తున్నాను..

"ఆనందమా.. ఆరాటమా.. ఆలోచనా.. ఏమిటో
పొల్చుకో హృదయమా.. ఎందుకీ అలజడి
దాహానిదా.. స్నేహానిదా.. ఈ సుచన ఏమిటో
తేల్చుకో నయనమా.. ఎవరిదీ తొలి తడి
పట్టుకో పట్టుకో చేయ్యిజారనివ్వక ఇకనైనా..
స్వప్నమే సత్యమై రెప్పదాటిపోయే సమయానా..
కంటికే దూరమై గుండేకే ఇంతగా చేరువైనా ....
...నిన్నలా మొన్నలా నేను లేను నేనులా నిజమేనా
ఇష్టమో కష్టమో ఇష్టమైన కష్టమో ఏమైనా ...."


మరోసారి.. మరోసారి.. మరోసారి.. నా బ్లాగ్ చదివే పాఠకులకూ, వ్యాఖ్యలు రాసి ప్రోత్సహించే అభిమానులకూ శతకోటి వందనాలు.