సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||
Saturday, February 26, 2011
కుంపటి
"కుంపటి". నాకు భలే ఇష్టమైన వస్తువుల్లో ఒకటి. పైన ఫోటోలోది మొన్న అమ్మ దగ్గర నుంచి నేను తెచ్చుకున్న బుజ్జి కుంపటి.కుంపటి పై ఉన్న ఆ ట్రయాంగిల్ చట్రం గిన్నె నిలబడటానికి వాడేది. దీనితో నాకు బోలెడు జ్ఞాపకాలు ఉన్నాయి. మా ఇంట్లో పెద్దది, చిన్నది రెండు కుంపటిలు ఉండేవి. గ్యాస్ స్టౌ మీద వంట చేసినా కూడా కిరోసిన్ స్టవ్, బాయిలర్ స్నానానికి నీళ్ళు కాచేందుకు, కొన్ని పదార్ధాలు చేసేందుకు కుంపటి వాడేది అమ్మ. వంకాయ కాల్చి పచ్చడి చేయటానికీ, తేగలు కాల్చటానికీ, మొక్కజొన్నపొత్తులు కాల్చటానికీ వాడేది. దోసకాయ కూడా కుంపటి మీద కాల్చి పచ్చడి చేస్తారని విన్నాను. అరటికాయ కాల్చి పొడి కూర కూడా చేస్తారు. ఇలా రకరకాలుగా కుంపటి వాడుతూండేది అమ్మ.
మాఘమాసంలో గుండ్రని ఇత్తడిగిన్నెలో పాలు,బియ్యం వేసి కుంపటి మీద అమ్మ చేసే అన్నం పరమాన్నం ఎప్పుడు నైవేద్యం పెడుతుందా అని ఎదురు చూసేదాన్ని...త్వరగా తినేయటానికి. చిక్కుడు కాయలకు పుల్లలు గుచ్చి రథంలా తయారుచేసి, చిక్కుడాకుల మీద వండిన పరమాన్నం పెట్టి నైవేద్యం పెట్టాకా తినటానికి ఇచ్చేది...ఆ రుచే రుచి. గ్యాస్ స్టౌ మీద అన్నం పరమాన్నం చేసినా కుంపటి మీద అమ్మ వండిన ఆ రుచి రాదు. ఇంకా ఉల్లిపాయలు కాల్చి పెట్టేది కుంపటి మీద. గోంగూర పచ్చడి చేసుకుని, కుంపటి మీడ కాల్చిన ఉల్లిపాయలు నంచుకుని తింటే ఉంటుందీ...ఆహా ఏమి రుచీ అని పాడుకోవాల్సిందే.
ఏదైనా చేసే ముందు కుంపటి వెలిగించే డ్యూటీ నాకిచ్చేది అమ్మ. బొగ్గులు వేసి, కాస్తంత కిరసనాయిలు పోసి, కాగితం ముక్కలూ అవీ వేసి కుంపటి వెలిగించి, విసనకర్రతో బొగ్గులు మండేలా చేయటం ఎంత కష్టమైన పనో అసలు. అయినా సరదా కొద్దీ ఎప్పుడూ ఆ పని తమ్ముడికి ఇవ్వకుండా నేనే చేసేదాన్ని. మధ్యలో ఆరిపోతూ ఉండే బొగ్గుల్ని మళ్ళీ మండించటం కూడా ఓ పెద్ద పనే. చాలా రోజుల్నుంచీ అమ్మ దగ్గర నుంచి కుంపటి తెచ్చుకోవాలని. ఇన్నాళ్ళకు కుదిరింది. ఇనుము ఊరికే తీసుకోకూడదని కాస్తంత డబ్బులు ఇచ్చి, అటక పైకెక్కి వెతుక్కుని మరీ అమ్మ దగ్గర నుంచి (పెద్దది అమ్మకు ఉంచేసి)ఈ బుజ్జి కుంపటి తెచ్చుకున్నాను. "తాతా చూడు, బయటవాళ్ళకు ఇచ్చినట్లు అమ్మ అమ్మమ్మకు డబ్బులు ఇస్తోంది" అని మా అమ్మాయి నవ్వు. ప్రస్తుతం బొగ్గులు, కిరసనాయిలు సంపాదించే మార్గం చూడాలి. వీధి చివరి ఇస్త్రీ వాళ్ళని అడిగితే ఇస్తారేమో మరి.
"స్వర్ణకమలం"లో "ఇదేంటి సార్, మీ మొహం ఇలా కుంపట్లో కాలిన కుమ్మొంకాయలాగ అయిపోయింది" డైలాగ్, మొన్న మొన్నటి "అష్టాచెమ్మా" సినిమాలో తనికెళ్ళభరణిగారు స్వయంగా కుంపటిపై వంకాయ కాల్చి పచ్చడి చేసే సీన్ మర్చిపోగలమా? గ్యాస్ స్టౌ లు, కనీసం కిరసనాయిలు స్టౌ లు కూడా లేని పూర్వం మన అమ్మమ్మలు, బామ్మలూ మరి అద్భుతమైన వంటలన్నీ ఈ కుంపటి పైనే చేసేవారు. అంతటి ప్రశస్తమైన చరిత్ర కలిగిందీ కుంపటి. ఐదు నిమిషాల్లో కుక్కర్ కూత రాకపోతే గాభరా పడే మనం అసలు వాళ్ళు అలా ఎలా వండేవారా అని వండరవ్వక మానం. తల్చుకుంటే అమ్మో అనిపిస్తుంది. ఓర్పూ, సహనం అనేవి ఇలా నెమ్మదిగా కుంపటిపై వండటం వల్లనే వాళ్ళకి అలవడేవేమో అని నాకో అనుమానం. అసలు ఇప్పటికీ ప్రతీ ఇంట్లోనూ ఒక కుంపటి ఉండాలని నా అబిప్రాయం. ఏమంటారు?
Subscribe to:
Posts (Atom)