సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||
Monday, August 16, 2010
శ్రీరాముడి విజయం..!!
ఆనందమానందమాయెనే...మన శ్రీరాముడు ఇండియనైడిలు ఆయెనే....!!
***
నిన్న పొద్దున్నే ఫోనులో ముఖ్యమైన విశేషాలు అయిపోయాకా, పిచ్చాపాటి కబుర్లలోకి వచ్చాము...
"ఇవాళ ఇండియన్ ఐడిల్ చూడాలి రాత్రి" అన్నాను.
"ఇండియన్ ఐడిలా..??" తన ప్రశ్న.
"శ్రీరామ్ గురించి ఎక్కడా చదవలేదా..చూడలేదా?"
"శ్రీరామ్ ఎవరు?"
"రామ రామా..ఇదేం ప్రశ్నండీ..? once upon a time in mumbai...
మనం సోనీ చానల్ లో ఇండియన్ ఐడిల్ ప్రోగ్రాం మొదలైనప్పటీ నుంచీ ఇద్దరు ఐడిల్స్ సెలక్షన్స్ వరకూ అన్ని ఎపిసోడ్స్ చూసేవాళ్ళం...
అర్ధరాత్రి దాకా రిజల్ట్ చెప్పరు..మధ్యలో ఏడ్స్...నాన్పుడు, టైమ్ వేస్ట్ అని మీరు విసుక్కునేవారు గుర్తులేదా?"
"ప్చ్...!"
"అవునులెండి, మీకు గుర్తుంటే ఆశ్చర్యపడాలికానీ.....అయినా శ్రీరామ్ గురించి తెలియకపోవటమేమిటండీ..." అన్నాను నిరాశగా..
అప్పుడు ఓ నవ్వు నవ్వి చెప్పారు " నేను SMS చేసాను" అని.
ఈసారి నేను ఆశ్చర్యపోయాను..
"ఏమిటి? మీరేనా? SMS ఆ? అయితే ఆ కుర్రాడు ఖచ్చితంగా గెలుస్తాడు.." అన్నాను నవ్వుతూ.
"అవును మరి, మన తెలుగుఅబ్బాయిని మనమే గెలిపించాలి " అన్నారు.
FM లకు, టివీ ప్రోగ్రాములకు SMS లు పంపటం అనేది మా ఇద్దరికీ ఇష్టం లేని పని. మామూలు SMS కన్నా మూడు నాలుగు రెట్లు ఎక్కువ రేట్ అయినా సరే SMSలు చేసేస్తూ మనకు తెలియకుండానే మొబైల్ కంపెనీలను పోషిస్తూ, వాళ్ళ లాభాలను పెంచుతున్నాం అన్నది మా అభిప్రాయం. మా అత్తగారు ఏదన్నా కార్యక్రమానికి SMS పంపమని అడిగితే, నాకయితే ఛాయిస్ ఉండదు కానీ మా వారయితే బయటకు వెళ్తున్న మనిషి ఆగిపోయి, ఆవిడ "బాబూ, నేను SMS పంపనులే.నువ్విక వెళ్ళు" అనే దాకా ఆవిడకు ఓ క్లాస్ ఇచ్చి వదులుతూ ఉంటారు. అలాంటి మనిషి ఇవాళ తెలుగువాడిని గెలిపించాలి అనుకున్నారు. అందరూ అదే అనుకున్నారు.
సౌత్ ఇండియన్ అంటే మదరాసీ నా? అని అడిగే ప్రతివాడి నెత్తినా ఒక మొట్టికాయ కొట్టి "దక్షిణాదిన మిగిలిన వాటితో పాటూ ఆంధ్ర రాష్ట్రమొకటి ఉంది" అని వంద సార్లు ఇంపోజిషన్ రాయించాలి అనిపిస్తుంది నాకు. అలాంటిది ఒక తెలుగువాడిని గెలిపించాలి అని ఇవాళ రాష్త్రమంతా కలిగిన ఈ స్పృహ నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది.
శ్రీరామ్ లోని ప్రతిభ అతడిని చివరిదాకా నడిపించింది అనటంలో ఎటువంటి సందేహం లేదు. కానీ ఆ కార్యక్రమం గురించి తెలిసినా, తెలియకపోయినా; ప్రేక్షకుల్లో సంగీతం గురించిన అవగాహన ఎంత ఉందీ అన్న ప్రశ్న పక్కన పెడితే, తెలుగువాడిని గెలిపించాలి అనే స్పృహ వలన యావత్రాష్ట్రంలో కలిగిన ప్రకంపనల తరంగాలు అతడి విజయానికి కారణమయ్యాయి. కానీ ...ఒక సంగీత పోటీలో గెలుపు ఓటముల్ని SMSలు నిర్ణయించటమేమిటి? అన్న ఒక్క విషయమే నాకు మింగుడు పడని ప్రశ్న. మిగిలిన కార్యక్రమాలకీ సంగీత పోటీలకూ తేడా ఉంది కదా. ఇక్కడ గెలుపును సంగీతజ్ఞులు, విద్వాంసులు నిర్ణయిస్తే సమంజసంగా ఉంటుంది. విద్వాంసులు, సంగీతజ్ఞులైన జడ్జీలు ఉన్నా కూడా గెలుపు జనం ఇచ్చే తీర్పు పై ఆధారపడి ఉంటుంది అంటే అది నేను హర్షించలేను. ప్రాంతీయ,జాతి,మత భేదాలు లేకుండా ఎంత మంది జనం నిజమైన ప్రతిభకు ఓటు వేస్తారు? ఇలాంటి గెలుపు ను పాల్గొనేవాళ్ళు, ప్రేక్షకులు అందరూ ఎందుకు కోరుకుంటున్నారు? అన్నది నాకు అర్ధంకాని ప్రశ్న.
ఈ మధ్యన ఏ టివీ చానల్ చూసినా ప్రతి కార్యక్రమంలో ఈ మధ్యన ఈ SMSల జోరు బాగా పెరిగిపోయింది. ఏ కార్యక్రమమైనా సరే అసలు మన డబ్బు ఖర్చుపెట్టి ఎందుకు SMSలు చెయ్యాలి? పూర్వకాలం ఈ SMSలు ఉన్నాయా? అయినా "సురభి", "TVS Saregama", సిధ్ధార్ధబాసు క్విజ్ ప్రోగ్రామ్స్, ఇంటర్వ్యూ షోలు, సీరియల్స్ మొదలైన వన్నీ ప్రాముఖ్యతను పొందలేదా? ఎందుకు మొబైల్ కంపెనీవాళ్ళ ఆదాయాల్ని సామాన్య ప్రేక్షకుడు పెంచాలి? అన్నవి సమాధానం దొరకని ప్రశ్నలు. నాకనిపించేదేమిటంటే జనంలో పెరగాల్సింది SMSలు చెయ్యటం వల్ల మనకన్నా మొబైల్ కంపెనీలు బాగుపడుతున్నాయి, మనం వాటిని పెంచి పోషిస్తున్నాము అన్న స్పృహ. కాదంటారా?
*****
ఇవాళ పొద్దున్నే తనకు ఫోన్ చేసాను...
"శ్రీరామ్ గెలిచాడు తెలుసా. అర్ధరాత్రి దాకా కూర్చుని చూసాను.."
"తెలుసు...అతనిది మన ఏరియానేట. రాత్రి చాలా హంగామా చేసారు...ఆ టపాకాయలూ, ఫైవర్క్స్ సందడికి నాకు మెలుకువ వచ్చెసింది...నిద్రలో పిల్ల జడుసుకుంది కూడా..."
Subscribe to:
Posts (Atom)