సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Tuesday, March 23, 2010

శ్రీరామనవమి జ్ఞాపకాలు...


"ఆపదామపహర్తారం దాతారం సర్వ సంపదాం
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం.."


నాన్నకు కృష్ణుడంటే ఇష్టం. ఇంట్లో అన్ని కృష్ణుడు పటాలూ,పెద్ద విగ్రహం...!నల్లనయ్య ఇష్టమైనా రాముడంటే నాకు ప్రత్యేక అభిమానం. అదీకాక అమ్మానాన్నల పేర్లు సీతారాములవటం కూడా ఒక కారణం. 'సీతమ్మ మాయమ్మ, శ్రీరాముడు మాకు తండ్రి..." అని మేము పాడుతూ ఉంటాము.

శ్రీరామనవమికి అమ్మ చేసే వడపప్పు నాకు చాలా ఇష్టం. నానబెట్టిన పెసరపప్పులో కొబ్బరి కోరు,మావిడి కోరూ వెసి,చిన్న చిన్న పచ్చిమిర్చి ముక్కలు వేసి కాస్తంత ఆవాలు,ఇంగువ పొపు పెట్టి అమ్మ చేసే వడపప్పు ఇప్పటికీ నోరురిస్తుంది. ఇక పానకం సంగతి చెప్పక్కర్లేదు. తీపి ఇష్టం కాబట్టి చేసిన పెద్ద గిన్నెడు పానకం మధ్యాహ్న్నానికల్లా పూర్తయిపోయేది.

మా విజయవాడ బీసెంట్ రొడ్దులో పెద్ద పెద్ద కొబ్బరాకుల పందిరి వేసి సితారామ కల్యాణం చేసేవారు. ఒక సందు చివరలొ ఉన్న చిన్న రామాలయంలొ విగ్రహాలు ఎంత బాగుండేవో...

ఇక రేడియోలో పొద్దున్నే పదకొండింటికల్లా మొదలయ్యే భద్రాచల కల్యాణం తప్పక వినాల్సిందే...అందులోనూ "ఉషశ్రీ తాతగారి" గోంతులో వచ్చే వ్యాఖ్యానం వినితీరాలి. ఆయన గంభీరమైన గొంతుకు సాటి వేరే గొంతు ఇప్పటికీ లేదు.నాన్న రేడియోలోనే పని చేయటంవల్ల మాకు పరిచయమే కాక, మా నాన్నంటే ఉషశ్రీ తాతగారికి ప్రత్యేక అభిమానం ఉందేది. అమ్మని "అమ్మాయ్" అని పిలిచేవారు. మేము ఆయనను "తాతగారు" అని పిలిచేవాళ్ళం. ఎంతో మహోన్నతమైన వ్యక్తి ఆయన. రేడియో వినే వాళ్ళకు తెలవచ్చు ఆయన చెప్పిన "ధర్మ సందేహాలు" కార్యక్రమం ఎంత ప్రఖ్యాతి గాంచిందో..!

మేము క్వార్టర్స్ లోకి మారాకా అక్కడ ప్రతి ఏడు రామనవమికి పందిరి వేసి కల్యాణం చేసేవారు. సాయంత్రాలు పిల్లలందరం కార్యక్రమాలు...నేనూ ఒకటి రెండు సార్లు పాటలు పాడాను...

శ్రీరామనవమికి ప్రతిఏడు చిన్నపాటి చినుకు పడడం నా చిన్నప్పటినుంచీ చూస్తున్నా....రేపు కూడా మరి చిరుజల్లు పులకింపచేస్తుందని ఆశిస్తున్నాను..

బ్లాగ్మిత్రులందరికీ శ్రీరామనవమి సందర్భంగా రాములవారి ఆశీస్సులు లభించాలని మనసారా ప్రార్ధిస్తున్నాను.