సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Sunday, March 21, 2010

గాయం..



హృదయం ముక్కలవుతుంది
దెబ్బతిన్న ప్రతిసారీ..

మౌనం వెక్కిరిస్తుంది
మాటలు కరువైన ప్రతిసారీ..

మనసు విలవిలలాడుతుంది
అభిమానం అవమానింపబడిన ప్రతిసారీ..

గాయం మాననంటుంది
లోతుగా తగిలిన ప్రతిసారీ..

కన్నులు మసకబారతాయి
ఆరని మంటలు ప్రజ్వలించిన ప్రతిసారీ..

ఆత్మ ఆక్రోశిస్తుంది
చేయని తప్పుకు శిక్ష పడిన ప్రతిసారీ..

ఏదేమైనా లేవాటానికే ప్రయత్నిస్తాడు మనిషి
క్రిందపడిన ప్రతిసారీ..


ఒక అపార్ధం నుంచి వచ్చిన నిరసన, నిర్లక్ష్యం వల్ల కలిగిన ఆవేదనలోంచి వచ్చిన వాక్యాలు ఇవి...అవుట్లెట్ కోసం రాసినవి మాత్రమే! ఎందుకంటే మనిషికి కలిగే బాధ స్వయంకృతం. అది మనం ఎదుటి వ్యక్తికీ ఇచ్చే విలువను,ప్రాధాన్యతను బట్టి ఉంటుంది. ఈ ఇహలోకపు భ్రమల్లో సంచరిస్తూ ఉన్నంతకాలం మనకు మనం విధించుకునే సంకెళ్ళు ఈ భావోద్వేగాలు...వీటిని అధిగమించటానికి భగవదనుగ్రహం కావాలి...అంతవరకు తప్పవు ఈ గాయాలు..

*******************************************

నేను పరిచయం చేస్తున్న సీరియల్ చదువుతున్న ఒకరిద్దరు ఎవరన్నా ఉంటే వారికి ఈ గమనిక...

నిన్న కష్టపడి ఒక గంట కూర్చుని మూడవ భాగం రాసాను..కానీ రాస్తున్నది ఆన్లైన్లో అవటం వల్ల చివరి క్షణంలో కరెంట్ పోయి మొత్తం డిలిట్ అయిపోయింది. నా సిస్టం పాడయిపోవటం వల్ల కలుగుతున్న తిప్పలు... చదివేవారు కొందరైనా మొదలెట్టినది పూర్తి చేయాలి కదా..మళ్ళీ ఓపిక తెచ్చుకున్నాకా, ఈ బ్లాగ్లో టపాలు తాత్కాలికంగా ఆగిపోయేలోపు తప్పక పూర్తి చేయటానికి ప్రయత్నిస్తాను.

--తృష్ణ.