సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Tuesday, November 24, 2009

favourite flowers...


అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలలో రోడ్డు మీద....ఏదైనా సందులోకి అడుగుపెట్టగానే గుప్పని మత్తెక్కించే ఈ పూల పరిమళం ముక్కుపుటాల్లోంచి మనసులోకి జారుకుంటుంది...గుండెల నిండా ఈ వాసన పీల్చుకుని అబ్బా...అనుకోని వారుంటారా అనుకుంటూ ఉంటాము మేము. వాసన వచ్చిన మొదలు ఆసందులోనో..ఆ విధిచివరలోనో ఎక్కడో దాగున్న ఆ చెట్టు కోసం కళ్ళు వెతుకుతాయి...పొడుగాటి వృక్షాలు...వాటికి చిన్న చిన్న ముదురాకుపచ్చ ఆకులు...గుత్తులు గుత్తులుగా వేళ్ళాడుతున్న పొడుగు కాడలున్న తెల్లని పూలు....ఎన్నిసార్లు చూసినా కొత్తగానే అనిపించే అందం ఈ పువ్వులది.....

ఇవి మా ఇంట్లో అందరికీ ఇష్టమైన పువ్వులు...ఫోటో తీసుకోవటానికి ఆ చెట్లు ఎక్కడ దొరుకుతాయా అని ఇన్నాళ్ళూ వెతుకుతున్నాను...నిన్న అనుకోకుండా ఒకచోట దొరికాయి...వెంఠనే కెమేరాలో బంధించేసాను..!! కాడ చాలా పొడుగ్గా ఉంటుందని వీటిని మేము "కాగడామల్లి" అంటాము. ఆ మధ్య చిన్నిగారు ఒక టపాలో వీటిని "పొన్నాయి పూలు" అంటారని రాసారు. పేరు ఏదైనా మత్తెక్కించే వీటి సువాసన మాత్రం అమోఘం...!!

చిన్నప్పుడు మా తమ్ముడు, నేను ఈ పూలు ఎక్కద దొరికినా బోలెడు ఏరి తెచ్చేకునేవాళ్ళం...వాటిని నేను నీళ్ళు పోసిన పొడుగాటి గ్లాసులో వేసి ఫ్రిజ్ మీదో , టి.వి మీదో పెట్టేదాన్ని...రెండు మూడు రోజులు పాడవకుండా ఉండేవి అవి...నేనెక్కువ ఏరానంటే నేనెక్కువ ఏరానని గొప్ప చెప్పుకోవటం... అవన్నీ మధురస్మృతులు...

ఒకసారయితే రోడ్డు మీద ఎక్కడొ చిన్న చిన్న మొక్కలు చూసి తవ్వి తెచ్చి నాన్న,తమ్ముడూ వాటిని ఇంటి ముందు నాటారు. మేము ఆ ఊరు వదిలి వచ్చేసినా ఆ మొక్కలు ఇప్పుడు పెద్ద వృక్షాలయి వాటికి బోలెడు పువ్వులు పూస్తున్నాయిట...అవి పెద్దయ్యే సమయానికి అక్కడ లేమే అనుకుంటూ ఉంటాము...