సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||
Friday, October 16, 2009
దీపావళి జ్ఞాపకాలూ..
"దీపం పరంజ్యోతి కళాది నమో నమో
దీప మంగళ జ్యోతి నమో నమో.."
(పరం జ్యోతి అయిన దీపానికి నమస్కారం. శుభములను ఇచ్చే దీపానికి నమస్కారం)
****** *****
మీకు తెలిసిన పండుగ గురించి వ్రాయుము...
అని స్కూల్ పరిక్షల్లో ప్రశ్న ఉండేది...
ఆ తెలిసిన పండుగ తాలుకూ సమాధానం ఎప్పుడూ ఒకటే ...."దీపావళి అంటే దీపముల పండుగ.నరక చతుర్దశి రోజున నరకాసురుడు అనే రాక్షసుణ్ణి హతమార్చి.......etc..etc..etc.."
**** *****
"దుబ్బు దుబ్బు దీపావళి..మళ్ళీ వచ్చే నాగులచవితి.."
అంటూ గోగు కాడలతో(గోంగూర కొమ్మలు) మా పిల్లలతో అమ్మ దివిటీలు కొట్టించేది
(ఇది ఎందుకంటే దీపావళినాడు పితృదేవతలు సాయంసంధ్య తరువాత దక్షణ దిక్కు నుంచి వచ్చి తమ సంతానాల గృహాలను సందర్శిస్తారట .వారికి దారి కనిపించటం కోసం దివిటీలు కొడతారుట. దీనిని
"ఉల్కా దానం" అని కూడా అంటారుట.)
దివిటీలు కొట్టిన తరువాత చేతులు కాళ్ళూ కడుక్కుని, తీపి తినాలి. మేం గులాబ్ జామ్ ( ప్రతి దీపావళికి స్టేండెర్డ్ స్వీట్ ) తినేసి...బుద్ధిగా దేముడి దగ్గర కూర్చుని అమ్మతో పాటే "కర్మ అనే ప్రమిదలో, భక్తి అనే తైలం పోసి, ధ్యానమనే వత్తి వేసి, జ్ఞానమనే జ్యోతిని వెలిగిస్తున్నాను." అని చెప్తూ దీపాలను వెలిగించేవాళ్ళం.పల్చటి బట్టని చిన్న చిన్న వత్తులుగా చేసి, నువ్వులనునెలో ముందురోజు నానబెట్టి, వాటితో ప్రమిదలు వెలిగించేది అమ్మ.
ఇక ఆ తరువాత -- వారం రోజుల నుంచో, రెండు రోజులనుంచో...టపాకాయలు ఎండ పెట్టినప్పుడల్లా ఎప్పుడెప్పుడని తొందర పడే మనసు ఆగేది కాదు...నేనూ ,తమ్ముడు సుబ్భరంగా కొన్నవన్నీ కాల్చేసే వాళ్లం. నాగులచవితికి, కార్తీక పౌర్ణమికి కొన్ని దాచేది అమ్మ. కనబడితే వాటినీ కానిచ్చేస్తామని.
******** *********
ఎప్పుడన్నా అన్నయ్య దగ్గరకు ఊరు వెళ్తే, అక్కడ మా తాతమ్మ(నాన్నగారి అమ్మమ్మ) మతాబాలూ,చిచ్చుబుడ్లు, తారా జువ్వలు తయారు చేసేది. అబ్బురంగా ఆ చేసే విధానాన్ని చూసేవాళ్ళం.
************
కాలేజీ స్టేజి కొచ్చాకా కొంచెం జోరు తగ్గింది...ధరలు పెరిగాయి అని అర్ధం చేసుకుని ఏవో శాస్త్రానికి కొన్ని కొనుక్కునేవాళ్లం. చదువుల పేరుతో పిల్లలం దూరమయ్యాకా ఇక నే ఒక్కదాన్నే ఇంట్లో...ఏం కాలుస్తాంలే అనే నిస్తేజం వచ్చేసింది ఇంక. పైగా పెరుగుతున్న టపాసుల ధరలను చూస్తూంటే నోట్ల కట్టలను కాల్చుతున్నట్లే అనిపించేది నాకు. అంతకన్నా ఏదన్నా అన్నదానానికో, సేవా కేంద్రానికో ఇస్తే ఆ డబ్బు ఉపయోగపడుతుంది కదా అనే అభిప్రాయం ఏర్పడింది.
ఇప్పుడిక అదే భావం బలపడిపోయింది. వందకి ఓ చిన్న పెట్టెడు టపాసులు వచ్చిన రోజు నుంచి... ఒక కాకరపువ్వొత్తుల పెట్టె వందకి చేరుకున్న రోజులు వచ్చాయి. మూడంకెలు పెడితే గానీ ఓ మాదిరి బణాసంచా కొనుగోలు అవ్వదు ఇవాళ్టి రొజున. అయినా జనాలు వేలకి వేలు పెట్టి కొంటూనే ఉన్నారు..శాస్త్రానికి కొన్ని కాల్చవచ్చు.కానీ సరదాలకీ, ఆర్భాటాలకీ, పోటిలకీ పోయి వేలు ఖర్చుపెట్టి
స్కై షాట్స్, ఇతర ఔట్లు కొనటం కాల్చటం ఎంతవరకూ సమంజసమో మరి...
****** *******
ప్రస్తుతానికి మా పాప చిన్నదే కాబట్టి దాని సరదా అగ్గిపెట్టెలు,తుపాకీ రీలులతో పూర్తవుతోంది. రేపొద్దున్న అది పెద్దయ్యాకా అది కావాలి,ఇది కావాలి అంటే ఇప్పుడు ఇన్ని అనుకుంటున్న నేనే కొనాల్సిరావచ్చు....కాని ఏదన్నా చెప్తే విని అర్ధం చేసుకునే తెలివి దానికి ఉంది కాబట్టి నా అభిప్రాయానికి గౌరవం ఇస్తుందనే నమ్మకం. అంటే అసలు తపాసులే కొననని కాదండోయ్..మితంగా కొంటానని చెప్పటం.
***** *******
మనం ఒక్కరోజే చేసుకుంటాము కానీ శాస్త్రీయంగా దీపావళిని అయిదు రోజులు చేసుకోవాలి. ధనత్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి అమావాస్య, గోవర్ధన పూజ, భగినీ హస్త భోజనం. ఉత్తరాదిన ఐదు రొజులూ జరుపుకుంటారు.
**********
ఇక పెద్దయ్యాకా దీపావళి ఎందుకు చేసుకుంటాము,
పురాణాలలో ఈ పండుగ ప్రాముఖ్యత ఏమిటి అన్నది తెలిసింది...
పురాణాలలో దీపావళి గురించి రేపు...
బ్లాగ్మిత్రులందరికీ దీపావళి శుభాకాంక్షలు.
Subscribe to:
Posts (Atom)