సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||
Sunday, October 11, 2009
పుస్తకాలు..అభిరుచులు...
మద్రాసు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో "డిప్లొమో ఇన్ ఫిల్మ్ టెక్నాలజీ(1965-68)" చదివారు నాన్న. 1968లో "INDIAN FILM MUSIC" మీదThesis సమర్పించి ఆ ఏటి "Best student Award" కుడా సంపాదించుకున్నారు.Student best film "The House" కధా రచయితగా AVM చెట్టియార్ గారి హస్తాలమీదుగా ప్రధమ బహుమతి అందుకున్నారు. మనమొకటి తలిస్తే,దైవమొకటి...అన్నట్లుగా నాన్న సినీ ఫిల్డ్ లోకి అడుగు పెట్టడం కుదరలేదు...కానీ తాను అడుగు పెట్టిన ఫీల్డ్ లో మాత్రం "The best" గా తనదంటూ ఒక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. అడుగు పెట్టిన మాధ్యమం కోసం తన శక్తిని,మేధస్సుని,కష్టాన్ని ధారపోసారు...పది జాతీయ బహుమతులను అందుకున్నారు.ప్రసార మాధ్యమంలో తన డెసిగ్నేషన్లో అలా పది జాతియ బహుమతులు అందుకున్న ఏకైక వ్యక్తి నాన్న ఒక్కరే!!ఒక "ట్రెండ్ సెట్టర్"గా "ఉగాది తెలుగు పురస్కారాన్ని" కూడా అందుకున్నారు.
ఇప్పుడు నేను చెప్పబోయేది నాన్న గురించి కాదు...అది వేరే పెద్ద కధ.నాకు పుస్తకాలు,సంగీతం మొదలైన అభిరుచులు ఎలా వచ్చాయో,మా ఇంటి వాతావరణం ఎలా ఉండేదో చెప్పటానికి ఇదంతా రాసాను.మా ఇంట్లో ఉన్న ఇటువంటి వాతావరణం వల్ల, ఇంట్లో ఎప్పుడూ పుస్తకాలు, కేసెట్లు, సంగీతం, సినిమాలు ..ఇవే కబుర్లు.మాకింకో ప్రపంచం తెలియదు.ఇవే మా నేస్తాలు.నాన్న film institute లో ఉన్నప్పుడు కొనుక్కున్న పుస్తకాలు చాలా ఉండేవి మా ఇంట్లో..మేమెవరం ఇంట్లో లేనప్పుడు ఒకరోజు అనుకోకుండా ఒక అగ్ని ప్రమాదం జరిగి మొత్తం పుస్తకాల రేక్ మొత్తం తగలబడి పోయింది...అదృష్టవశాత్తు మా అమ్మ క్షేమంగా బయట పడింది.
ఆ తరువాత మళ్ళీ నెమ్మదిగా కొన్ని కొన్ని చప్పున కొన్నారు కానీ ఆ పోయిన పుస్తకాలు చాలా వరకు దొరకలేదు పాపం నాన్నకు.ఇప్పుడు మళ్ళీ కొన్ని వందల పుస్తకాలు పొగేసారు..!! అవన్నీ చదవటానికి నా జీవితకాలం సరిపొదు.అసలు నాన్న సంపాదించిన 3000 దాకా ఉన్న కేసట్లనే నేను ఇంతదాకా అన్నీ వినలేదు...తెలుగు, హిందీ, ఇంగ్లీషు, తమిళ్, instrumental, westren clasical, బీథోవెన్, వివాల్డి, కర్ణాటక్, హిందుస్తానీ.. ఇలా సంగీతంలో ఉన్న రకాలన్నీ మా నాన్న దగ్గర ఉన్నాయి.
ఇవే మా ఆస్తి...మేము ముగ్గురమూ అంటుంటాము..వీటి కోసమే మేము దెబ్బలాడుకుంటాము అని.మా అభిరుచులన్ని నాన్న నుంచి సంక్రమించినవే..తనకు తెలిసిన మంచి మంచి సినిమాలన్నీ, అన్ని భాషలవీ చూపించేవారు మాకు.ఇక ఇంట్లో ఉన్న రకరకాల పుస్తకాల వల్ల చదివే అలవాటు వచ్చింది నాకు.
నాకు చదవటం వచ్చాకా దొరికినవి, నాకు అర్ధమయ్యేవి చదువటం మొదలెట్టాను.చిన్నప్పుడు నవలలు చదువుతున్నాననీ మా అమ్మ అవన్నీ దాచేసేది.ఒక వయసు వచ్చేవరకు పిల్లలు ఆ పుస్తకాలు చదవకూడదు అని అమ్మ ఉద్దేశం. కానీ మనం ఆగిందెక్కడ..శెలవు రొజుల్లో అమ్మ నిద్రపోయినప్పుడు దాచిన చోట్లు కనిపెట్టి మరీ పుస్తకాలు చదవేసేదాన్ని.అందుకని వారపత్రికలు కొనటం ఆపేసింది.అయినా ఇంట్లో నవలలు తక్కువే.కృష్ణశాస్త్రి, చలం, శరత్ సాహిత్యం, శ్రీరమణ,బాపు-రమణల పుస్తకాలూ, తెలుగు భాష, సంస్కృతికి సంబంధించినవి, సినిమాలకు సంబంధించినవి, కొన్ని కవితా పుస్తకాలు..ఇలా కొన్ని సెలెక్టెడ్ పుస్తకాలు కొనేవారు నాన్న. కొన్ని సినిమా కధల పుస్తకాలు నవలల్లా ఉండేవి.సినిమాలు చూడకపోయినా ఆ పుస్తకాలు మళ్ళీ మళ్ళీ చదివేదాన్ని.బాగా డైలాగులతో సహా బట్టీ వచ్చేసేంతగా...!! ముత్యాల ముగ్గు, త్యాగయ్య, గోరంత దీపం, రాధా కల్యాణం, సీతాకోకచిలుక, శంకరాభరణం..మొదలైనవి.
ఇక శెలవుల్లో పిన్ని,పెద్దమ్మల ఇళ్ళకి వెళ్ళినప్పుడు కోడూరి కౌసల్య, యద్దనపూడి,యండమురి,మల్లాది మొదలైన వాళ్ళ రచనలు వాళ్ళిళ్ళలోనే చదివాను.కాలేజీలోకి వచ్చాకా నేనూ నా చిరు సంపాదనలవల్ల,విజయవాడ బుక్ ఫెస్టివల్స్ వల్ల నా సొంత మొదలైంది..నాన్నవి కాక నేనూ నాకిష్టమైన పాతల సేసెట్లు కొనటం మొదలుపెట్టాను...పెళ్లయాకా...అందరిలానే సంసారంలో మునిగిపోయాను..ఇప్పటిదాకా మళ్ళీ ఆ అభిరుచులకి బ్రేక్ పడింది...!మళ్ళీ ఇదిగో ఇన్నేళ్ల తరువాత ఈ బ్లాగ్ పుణ్యాన..నా ప్రియ నేస్తాలైన పుస్తకాలను మళ్ళీ తెరిచి చదవటం మొదలెట్టాను...!!
Subscribe to:
Posts (Atom)