నిన్న పొద్దున్నే పర్మిషన్ తీసేసుకున్నా.."ఇవాల్టితో పాప పరీక్షలయిపోతాయి.అట్నుంచటే అమ్మావాళ్ళింటికి వెళ్పోతానని..".శెలవలున్నా,మళ్ళీ పదిరోజులదాకా కుదరదు మరి.(రేపటి నుంచీ శరన్నవరాత్రులు కదా..నేను బిజీ)డ్రెస్స్ స్కూల్కి పట్టుకుపోయి,పాపకి అక్కడే డ్రెస్ మార్చేసి,బస్సెక్కేసా!ఇంటికి వెళ్ళగానే పాపకి అన్నం పెట్టే పంచవర్షప్రణాలిక పూర్తి చేసి, మెల్లగా కంప్యుటర్ దగ్గరికెళ్ళి బ్లాగు తెరిచా..."మాయ కంప్యూటర్ మళ్ళి తెరిచావా.. ఉన్న కాసేపు కబుర్లు చెప్పవే.."అని అమ్మ కేక..!లాభం లేదని సిస్టం ఆఫ్ చేసేసా.
కానీ మనకి ఖాళీగా ఉండటం రాదే..వంటింట్లో ప్రయోగాలుచేద్దామంటే అమ్మ ఒప్పుకోదు 'ఉన్న కాసేపూ..' డైలాగు వదుల్తుంది!!"సినిమాకు వస్తారా ఎవరన్నా?"..అడిగా..మేము రామన్నరు ఎవరూ."బజారు పనులున్నాయి వెళ్దామా?" "రాము..రాము" అన్నారు.ఇక ఆఖరి అస్త్రం "నాన్నా,విశాలాంధ్రకు వస్తావా..".ఐదు నిమిషాల్లో నాన్న రెడీ."అమ్మో మళ్ళీ పుస్తకాలు కొనేస్తారే బాబూ.."అంది అమ్మ.ఇంట్లో మరి రెండు బీరువాల పుస్తకాలు....
నాన్నతో సమయం గడిపి చాలా రొజులయ్యింది..!నాన్నంటే నాకు చాలా ఇష్టం.ఆయన విజ్ఞానానికి ఆయనంటే గౌరవం.ఎవరి నాన్నలు వాళ్ళకి గొప్ప.అలానే నాకునూ.ఏ విషయం గురించి అడిగినా చెప్పేస్తారు.ఆయన ఒక ఎన్సైక్లొపీడియా అనిపిస్తుంది నాకు.ఒక్క క్రీడా సంబంధిత విషయాలే ఆయనకు తెలియవు.బస్సులో ఆయన ఎక్కలేరని ఆటోలో బయల్దేరాం. ఆయన మిత్రుల కబుర్లు,ఆఫీసు కబుర్లు..సినిమాలూ,పాటలూ,కొత్త సింగర్లూ...అవీ ఇవీ చెప్పుకుంటూ..!నాన్న గురించి ఎక్కడ మొదలెట్టి ఎక్కడ ఆపాలో తెలీదు నాకు.జీవితమంతా వృత్తికే అంకితం చేసారు.వృత్తి పట్ల ప్రేమ ఉండటంతో చేస్తున్న దాంట్లో కావల్సినంత సంతృప్తినే పోగేసుకున్నారు.ధనార్జన ఆలోచనే లేదాయనకు.(నాన్న గురించి ప్రత్యేకం వేరే టపా రాయాలి.ప్రస్తుతానికింతే..)
చిన్న చిన్న మిగిలిన పనులు పుర్తి చేసుకుని షాపుకి చేరాం.పాత పరిచయాలవల్ల షాపువాళ్లకాయన పరిచయమే..!ఒక బీరువాడు పుస్తకాలు సేకరించాకా నేను పుస్తకాలు కొనటం మానేసాను..నా తదనంతరం పిల్లలకి ఈ అభిరుచి లేకపోతే ఇవన్నీ ఏం చేస్తారు..అన్న ఆలోచనవల్ల..!!మళ్ళీ నిన్నే చాలా రోజులకు పుస్తకాలు కొనటం.ఇద్దరం (అసంతృప్తిగా) ఒక సహస్రం బిల్లు చేసి బయటపడ్డాం.షాపులో నాన్న సంతకం పెడుతుంటే అన్నా..ఎన్నిరోజులయ్యిందో నీ సంతకం చూసి..అని!చిన్నప్పుడు నాన్న సంతకాన్ని కాపీ చెయ్యాలని ప్రయత్నించేవాళ్ళం కానీ వచ్చేది కాదు..!
ఎప్పుడొచ్చినా ఏదో హడావుడి..మాట్లాడటం కుదరదు..నిన్ననే చాలారోజులకి నాన్నతో అలా సాయంత్రం గడపటం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది..చిన్ననాటి రోజుల్ని గుర్తు చేసింది..ఒక్కో రోజున అర్ధరాత్రి ఒకటి,రెండింటి వరకు జిడ్డు కృష్ణమూర్తిగారి గురించో,గుంటూరు శేషేంద్ర శర్మగారి గురించో..కిషోర్ కుమార్ గురించో,సలీల్ చౌదరి గురించో....ఏవో డిస్కషన్లు,కబుర్లూ చెప్పుకుంటూ గడిపిన రోజులు ఉన్నాయి..!!రకరకాల కారణాల వల్ల నాన్నే నా "ఐడియల్ మేన్" మరి.