(ఫోటోలోని సాంబారు నేను చేసినది కాదు.అది మెంతికూర సాంబారు కుడా కాదు .)
ఈ వారం వంట -- మెంతికూర సాంబారు.
సాంబారు అందరూ చేసుకునేదే.కాని మెంతికూరతో సాంబారు చాలా బాగుంటుంది + ఆరోగ్యదాయకం.
మెంతికూరలో పోషకాలు:
1)దీనిలో potassium, calcium, iron వంటి మినరల్స్ ఉన్నాయి.
2)మెంతులు,మెంతికూర రెండూ శరీరానికి చలవ చేస్తాయి.
3)అరుగుదలను పెంచుతాయి.
4)రాత్రి పూట ఒక స్పూను మెంతులు మింగి పడుకుంటే,కాన్స్టిపేషన్ సమస్య ఉంటే;మెంతుల్లో ఎక్కువ శాతం ఫైబర్ ఉండటం వల్ల పొద్దుటికి సర్దుకుంటుంది.
5)పాలిచ్చే తల్లులకి పాలు పెంచుతాయి.
6)మధుమేహాన్ని అదుపు చేయటంలో కూడా ఉపయోగపడతాయి.
7)కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి.
సాంబారుకి కావాల్సిన పదార్ధాలు:
(ఇది ఐదారుగురికి సరిపోయే సామగ్రి)
* కందిపప్పు :3/4కప్పు
* సన్నగాతరిగిన మెంతికూర :1 కట్ట,చిన్న మెంతి అయితే 2 కట్టలు
(ఆకుకూర తరగకుండా రెండుమూడుసార్లు బాగా కడగాలి.తరిగాకా కడిగితే పొషకాలు ఉండవు.)
*సన్నగా పొడుగా తరిగిన పెద్ద ఉల్లిపాయ :1(చిన్నవి అయితే 2 )
*పచ్చిమెరప :2 or 3 (తినే కారాన్ని బట్టి)
*ఎండుమిర్చి :1
*చింతపండు పెద్ద నిమ్మకాయంత
*నెయ్యి 2 tsps
(చారులోకి,సాంబారులోకి పోపు నెయ్యితో వేసుకుంటే మంచి రుచి వస్తుంది)
*బెల్లం తరుగు 1 tsp (వద్దనుకుంటే ఇది మానేయచ్చు)
*సాంబారు పౌడర్ 2 1/2 tsps
* ఉప్పు 2 tsps(కావాలంటే తగ్గించుకోవచ్చు)
*ఆవాలు 1 tsp
*జీలకర్ర 1/2 tsp
*ఇంగువ 1/4 tsp
(*మెంతికూర వెయ్యని మామూలు సాంబారు పోపులో మెంతులు కూడా నేనైతే వేస్తాను)
మెంతికూర సాంబారు తయారీ :
1) రెండున్నర కప్పుల నీటితో పప్పుని చిటికేడు పసుపు(ఇలా వేయటం వల్ల పప్పుకి మంచి రంగు వస్తుంది,పసుపు ఆరోగ్యకరం కూడా) వేసి,ఒక గిన్నెలో మూత పెట్టి,కుక్కరులో ఉడికించుకుని,మెత్తగా పేస్టులా మాష్ చెసి పెట్టుకోవాలి.
2 ltrs ఉన్న బుల్లి కుక్కరులో అయితే డైరెక్ట్ గా పప్పు పెట్టేసుకోవచ్చు.
2)చింతపండుని 1 1/2 కప్పుల నీటిలో నానబెట్టి ,రసం తీసుకుని,వడబోసుకుని ఉంచుకోవాలి.
3)వెడల్పాటి kaDaiలో లేదా లోతున్న నాన్స్టిక్ పాన్ లో నెయ్యివెసి,ఆవాలూ,జీలకర్ర,ఇంగువ,ఎండు మిర్చి వేసి పోపు వేసుకోవాలి.
4)తరువాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి 2,3 నిమిషాల తరువాత సన్నగా తరిగిన మెంతి ఆకు వేసి వేయించాలి.
5)మెంతికూర వేగాకా మంచి వాసన వస్తుంది.అప్పుడు స్టవ్ ఆపేసి,వేగినదంతా వేరే ప్లేట్లోకి తీసిపెట్టుకోవాలి.
అదే ముకుడులో చింతపండు రసం,ఉప్పు,బెల్లం తరుగు వేసి మరగనివ్వాలి.
6)చింతపండు రసం తాలూకూ పచ్చివాసన పోయాకా,మెత్తగా చేసి పెట్టుకున్న పప్పు,సాంబార్ పౌడర్ వేసి బాగా కలపాలి.(సాంబార్ పౌడర్ ముందుగా కాస్త అర కప్పు చన్నీళ్లలో కలుపుకుని అప్పుడు వేసుకుంటే పౌడర్ ఉండలు కట్టకుండా ఉంటుంది)
7)తరువాత ఇందాకా వేయించి ఉంచుకున్న మెంతి ఆకుని ,ఉల్లిపాయ ముక్కలని అందులో కలుపుకోవాలి.
8)తగినన్ని నీళ్ళు కలుపుకోవచ్చు అవసరాన్ని బట్టి.సాంబారు చిక్కబడినట్టు అనిపించాకా దింపేసుకోవటమే.
ఇది అన్నంలోకీ,చపాతిల్లోకీ కూడా బాగుంటుంది.