సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Friday, August 28, 2009

వర్షం వెలిసిన సాయంత్రం....

(నిన్నటి సాయంత్రపు ఊసులివి...)
ఇప్పుడే వాన వెలిసింది...చెట్ల చివర్ల నుంచి వర్షపు బొట్లు ఒక్కొక్కటే నేల రాలుతున్నాయి..మెల్లగా వీస్తున్న గాలికి కొమ్మలు చిన్నగా తలలూపుతు తమ హర్షాన్ని వ్యక్తపరుస్తున్నాయి..రామచిలుకలు ఇళ్లకు వెళ్ళాలా వద్దా అని యోచిస్తున్నట్లు కొమ్మ కొమ్మకీ అటు ఇటు ఎగురుతున్నాయి...వాన కురిసేప్పుడు ఒకరకమైన అందమైతే,వాన వెలిసాకా ప్రకృతిది మరో రకమైన అందం!వాన వెలిసిన తరువాత అలసట తీర్చుకుంటున్నట్లు నిశ్సబ్దంగా పలకరించే నిర్మలమైన ఆకాశం ఒక మౌన మునిలా గోచరిస్తుంది!!ఈ నిశ్శబ్దంలో నాలో ఎన్నో ఆలోచనలు...వంట్లో బాలేకపోతే ముసుగుతన్ని పడుకోక ఎందుకొచ్చిన రాతలూ?అని మనసు కసురుతున్నా "తిరిగే కాలూ,తిట్టే నొరూ.."అన్నట్టు..రాసే చేతికి విశ్రాంతి ఉండదు...మనసులో అలలై ఎగసే భావాలను కాగితం పైనో,నోట్ ప్యాడ్ పైనో రాయకపోతే తొచదు...

ఒకప్పుడు 300పేజీల పుస్తకాన్నయినా ఒక్కపూటలో,ఇంకా మాట్లాడితే 3,4 గంటల్లో పూర్తి చెయ్యగల నేను,గత నెల రోజులుగా 170పేజీల పుస్తకాన్నిపూర్తి చెయ్యలేకపోవటం నాకే ఆశ్చర్యం.చూసే సినిమాకో,చదివే పుస్తకానికో మధ్యలో ఆటంకం వస్తే ఇల్లెగిరిరేలా నే చేసిన హాహాకారాలు,పెట్టిన పెడ బొబ్బలు చిన్ననాటి ముచ్చట్లుగా మిగిలిన జ్ఞాపకాలే! ఇప్పుడలాటి హా హాకారాలన్నీ గుండె గొంతుకలోనే నిలిచిపోతాయి...బాధ్యతతొ కూడిన పెద్దరికం మాట్లాడనివ్వదు మరి.అప్పుడు చివుక్కుమన్న అమ్మ మనసు ఇప్పుడు కనిపిస్తుంది..!కూరలు తరిగేప్పుడు వేలు కోసుకున్నా,పరధ్యానంలో వేడి కుక్కర్ తగిలి చేయి కాలినా,ఒళ్ళు వెచ్చబడినా అమ్మానాన్నల ఓదార్పుకై మనసు పరుగులు తీస్తుంది...ఇప్పుడు ఓదార్పు లేక కాదు,అమ్మానాన్నలు ప్రేమతో "అయ్యో" అంటే సగం తగ్గిపోయే నెప్పి గుర్తుకువస్తుంది!!కాలం పరుగులో వయసనే బంధనం శరీరానికే గానీ మనసుకు కాదు కదా.బాధ్యత,విధి నిర్వహణ లాంటి ఎన్ని బరువులు అది మోసినా,భార్యగా,కోడలిగా,తల్లిగా ఎన్ని కొత్త పదవుల్లో చేరినా...మనసులో ఎక్కడో మూలన దాగిఉన్న పసిమనసు ఇంకా "పుట్టింటికే పరుగులు" తీస్తూ ఉంటుంది సీతారామయ్యగారి మనవరాలు సినిమాలో పాటలాగ!!

ఇలా అలవాట్లలో మార్పులు,పనుల్లో తగ్గిన జోరు,ఆవేశంలో స్మరణకొచ్చే ఆలోచన,ఆలోచనల్లో వచ్చిన నెమ్మదితనం,వాదన స్థానంలో మౌనం...ఇవన్నీ పెళ్ళి తెచ్చిన మార్పులు అనటం కన్నా వయసు తెచ్చిన పెద్దరికపు లక్షణాలు అని మనసు తెలియచేస్తూ ఉంటుంది.కానీ కొన్ని విషయాల పట్ల మాత్రం విముఖత,అనాసక్తి రెండూ ఖచ్చితంగా ఏర్పడిపోయాయి.చిన్నతనపు అల్లరులూ,కేరింతల స్థానంలో ఏదో తెలియని నిశ్శబ్దం..!మనతో కలిసి నిన్నటివరకూ తిరిగిన దగ్గరి మనుషులు హఠాత్తుగా దూరమైనప్పుడు అర్ధమైన జీవనతత్వం. చివరికి మిగిలేదేమీ లేదని అర్ధమైనందువల్ల కలిగిన నిర్వేదం..!!

అన్ని భావాలకూ అతీతమైన నిర్లిప్తత..అది.

ఏమిటిది...ఎక్కడో మొదలై ఎక్కడికో వెళ్పోతున్నాయి ఆలోచనలు.....ఇలా పొంతనలేని గజిబిజి ఆలోచనలతో బుర్ర వేడేక్కినప్పుడు ఎప్పుడు చేసే పనే ఇప్పుడూ చేసాను....
మీడియ ప్లేయర్లో పాట పెట్టేసాను....
"మేంబో మామియా....ప్రేమ ఒక మాయ...
సునామి లాగ దాహమొచ్చినాది,వేగమొచ్చినాది...".
ఇలాటి హుషారైన పాటలు నాలుగు వింటే అంతుపట్టని ఆలోచనలన్నీ...ఢమాల్!!
తుక్కునంతా రీసైకిల్ బిన్లో పడేసినట్లు...కంప్యూటర్ లో రిఫ్రెష్ కొట్టినట్లు.....!!