సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Friday, August 21, 2009

తూ. గో. ప్రయాణం__ మూడవరోజు(ద్రాక్షారామ,కోటిపల్లి,యానాం)

మూడవరోజు పొద్దున్నే మేము వెళ్లవలసిన కొందరు పెళ్ళివారితో అమ్మ వచ్చింది.యానాం వెళ్ళే కారులో అమ్మతో పాటూ పాపని పంపేసాము.మాతో తిరిగి తిరిగి అలసిపోయిన దాన్ని ఇంకా ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక.హమ్మయ్యా!అనుకున్నాం.కాకినాడ నుంచి ఒక స్పెషల్ రైలు కోటిపల్లి దాకా ఉన్నదట.మూడే బోగీలతో ముచ్చటగా ఉన్న ఆ బుల్లి రైలు ఎక్కాం ఇద్దరం.తొమ్మిదిన్నరకి ఎక్కితే పదకొండింటికి "ద్రాక్షారామ" చేరాం.ఈ బుల్లిరైలు ప్రయాణాన్ని ఎంత ఎంజోయ్ చేసామంటే చెప్పలేను.మా ఎదురుగా ఒక స్కూలు పాప కూర్చుంది.మైత్రి !చక్కగా నవ్వుతూ కబుర్లు చెప్పింది.సార్ధక నామధేయం.ఆ మంచి,మర్యదా..సంస్కారం పెంపకం వల్లే కదా అబ్బుతాయి అనుకున్నాం.

"ద్రాక్షారామ" చేరాం.ఇది "ద్రాక్షారామం" అనుకునేవాళ్లం.కానీ ఇక్కడ అన్ని చోట్లా "ద్రాక్షారామ" అనే రాసి ఉంది.పాతబడిన చిన్న స్టేషన్.చుట్టూరా పొలాలూ,ఖాళీ స్థలాలూ..అక్కడక్కడ ఇద్దరుముగ్గురు మనుషులు..."ఎటెళ్ళాలి?"అని అడిగితే ఓ దారి చూపించి.."అటు" అన్నాడొకడు.ఆ నిశ్శబ్ద ప్రకృతిని ఆస్వాదిస్తూ పొలం గట్లమ్మట ఉన్న సన్నని కాలిబాటలో ఓ మైలు దూరం వెళ్ళాకా ఊరు వచ్చింది.ఇంకో మైలు దూరం వెళ్ళాకా మెయిన్ రోడ్దు వచ్చింది.అక్కడ ఓ షేర్ ఆటొ ఎక్కి ద్రాక్షారామ చేరాం.గుడి మూసే వేళవుతోందని త్వరగా లోనికి వెళ్ళాం.ఈ గుడి విశాలంగా అందంగా ఉంటుంది.పంచారామాల్లో అమరావతిలో అమరేశ్వరుడినీ,సామర్లకోటలో కుమారరామ-భీమేశ్వరుడినీ,భీమవరంలో సొమేశ్వరుడునీ, ద్రాక్షారం లోని ఈ భీమేశ్వరుడినీ చూసే సౌభాగ్యం చిన్నప్పుడే లభించింది.ఇక పాలకొల్లులోని రామలింగేశ్వరుడిని దర్శించుకోవాలి. ఈ ద్రాక్షారామ భీమేశ్వరాయల చరిత్రని,ఆలయపు ఫొటోలనూ ఈ క్రింద చూడచ్చు.

(ఇది ఆలయంలోని కోనేరు)




అదయ్యాకా "కోటిపల్లి" అక్కడికి 15నిమిషాలే అని తెలుసుకుని అక్కడికి బయల్దేరాం.."జోర్సై పార్సై...కోటిపల్లి రేవుకై..."అని పాడుకుంటూ...!మధ్యాహ్న్నం వేళైనా చల్లని గాలితొ గోదారమ్మ స్వాగతం పలికింది.గుడి చూసి మళ్ళి సాయంత్రానికి యానాం వెళ్ళాల్సి ఉండటంతో ఇంక పడవలో ఆ రేవు దాటే ప్రయత్నం విరమించుకున్నాం.కోటిపల్లి రేవు దాటిటే ముక్తేశ్వరం వస్తూంది.అక్కడ ముక్తేశ్వరాలయం ఉంది.అసలీ ప్రదేశం పేరు "కోటిఫలి"ట.అది కాలక్రమంలో "కోటిపల్లి" అయిపోయిందట."కోటిఫలి సొమేశ్వరాలయం" ఇక్కడ చూడవచ్చు...తరువాత రేవు ఫొటోలు..



ఇక అసలు వచ్చిన పని..."పెళ్ళి"కి బయల్దేరాం.యానాం చేరే సరికీ సాయంత్రం అయ్యింది.పుణ్యక్షేత్రాలు దర్శించుకుని వచ్చాం కదా అని ఇంక పెళ్ళివారేమనలేదు పాపం.అక్కడ ఉన్న గోదారి ఒడ్డుకి పెళ్లయ్యాకా బాగా రాత్రి వెళ్ళాం. పెద్ద పెద్ద ఏనుగు బొమ్మలు మధ్యలో ఉన్న శివలింగానికి అభిషేకం చేస్తున్నట్లుగా విగ్రహాలను ప్రతిష్టించారు అక్కడ.ఎంతో చూడ ముచ్చటగా ఉన్న ఆ ఫవూంటెన్ని చూసి, ఆ జల్లులో తడవకుండా అక్కడ నుంచి రాలేము.కానీ బాగా చీకటి పడిపోయి ఫొటోలు తీసుకోలేకపోయాం.అదొక్కటే ప్రయాణంలో లోటుగా మిగిడిపోయింది.

(రేపు ఆఖరు మజిలీ...యలమంచలి;హరిపురం లో ఒక "అగ్రికల్చరల్ ఫార్మ్" కబుర్లు)