మొన్నటి పరిమళంగారి "నా మొదటి వంట" టపా చూసినప్పుడు నాకు నా మొదటి ఉప్మా ప్రయోగం గుర్తు వచ్చింది.(మొదటి సారి చేసినదాన్ని "ప్రయోగం" అనటం నాకు అలవాటు.)ఆ కధ వ్యాఖ్యలో సరిపొదు వేరే టపా రాస్తానన్నాను.ఇదే ఆ కధ.. ఒకరొజు అనుకోకుండా ఊరు నుంచి చుట్టాలు వచ్చారు.అమ్మ ఇంట్లో లేదు.సాయంత్రానికి కానీ రాదు.వాళ్ళు సాయంత్రానికి మరో చోటకి వెళ్పోతారు.నాన్న లోపలికి వచ్చి అడిగారు"ఉప్మా చేయ్యగలవా?" అని.నేనప్పుడు ఎనిమిదవతరగతి.అమ్మ చేసినది తినటం తప్ప వండటం రాదు.వచ్చినవాళ్ళకి ఏదో ఒకటి పెట్టాలి పాపం.ఇంట్లో చిరుతిళ్ళు కూడ ఏమీ లేవు. అప్రయత్నంగా "సరే" అన్నా!!అమ్మ వంట చేస్తూంటే చూసే అలవాటుంది ;నీలం రంగు మూత ఉన్న సిసాలో రవ్వ ఉంటుందని తెలుసు కాబట్టి, ధైరంగా "ఉప్మా ప్రయోగం" మొదలేట్టా.
నెయ్యి వేసి,పోపు వేసి,జీడిపప్పు వేసి,రవ్వ వేసి,కొద్దిగా వేగాకా నీళ్లు పోసి...మొత్తానికి తయారయ్యింది.చూడ్దానికి బానే ఉంది.పట్టుకెళ్ళి పెట్టాను. "కుంచమంత కూతురుంటే మంచం మేదే కూడు. అప్పుడే అమ్మాయికి వంట వచ్చేసింది ఇంకేమిటి" అంటూ వాళ్ళు ఉప్మా తినటం ప్రారంభించారు.నెమ్మదిగా వాళ్ళ మొహాల్లో మార్పులు కనబడ్డాయి."బానే ఉందాండి?" అని అడిగాను."ఆ బానే ఉంది,బానే ఉంది.." అంటు పూర్తి చేసారు.కాస్త కాఫీ కలిపి ఇచ్చాను.బాగుందని తాగేసి ఇంకో అరగంట ఉండి వెళ్ళిపొయారు.
సాయంత్రం అమ్మ వచ్చింది.నాన్న ఉత్సాహంగా సంగతంతా చెప్పరు.అమ్మ కంగారుగా వంటింట్లోకి పరిగెత్తింది.వెనకాల మేమూ..
అమ్మ అడిగింది "ఈ నీలం రంగు మూత ఉన్న సీసాలో దానితోనే ఉప్మా చేసావా? " అని అడిగింది.
అవునని తల ఊపాను."వాళ్ళేమన్నారు?" అంది.
"బానే ఉంది..బానే ఉంది.. అని తిన్నారే " అన్నాను విసుగ్గా.
"పాపం! "అంది అమ్మ.
"ఖాళీగా ఉందని ఆ సీసాలో నిన్ననే ఇడ్లీ రవ్వ పోసాను అంది" (పోయ్...అని వెనకాల పెద్ద ట్రంపెట్ సౌండు వినిపించింది మా అందరికీ!!)
ఆ తరువాత నుంచీ వంటింట్లో అన్ని సీసాలకి పేర్లు రాసి పెట్టడం మొదలెట్టింది మా అమ్మ.
(డిగ్రీ అయ్యేదాకా పెద్దగా పనులేమి చెయ్యకపోయినా ,ఆ తరువాత మాత్రం వంటింటి ప్రయోగాల్లో ఎక్సపర్ట్ నయిపొయా.పనుల్లో అమ్మకి కుడిచెయ్యి అయిపోయా...)