ఇది చిన్నప్పుడు జరిగిన ఒక సంఘటన.అప్పుడు నా వయసు 18.వంటింట్లో 'ప్రయోగాల ' పేరుతో అప్పుడప్ప్పుడు చేతులు కాల్చుకోవటం తప్ప పెద్దగా వంట రాలేదింకా.ఆమ్మ ఊళ్ళో లేదు.కాలేజీ నుంచి వచ్చి నాన్నకి ఇష్టమైన బజ్జీలు చేయటంలో బిజీగా ఉన్నాను.నాన్న ఆఫీసు నుంచి వస్తూనే చెప్పిన వార్త విని గుండెల్లో అలజడి మొదలైంది.ఢిల్లీ నుంచి వస్తున్న ఒక పెద్ద ఆఫీసరు నాన్న మీద అభిమానం కొద్దీ మా ఇంట్లో దిగబోతున్నారని. పెద్దాయనకి ఏమి వండాలో అని కంగారు మొదలైంది.ఆయన రానేవచ్చారు."ఎక్కువగా ఏమీ వద్దమ్మా,లైటుగా ఉంటే మంచిది రాత్రి పూట" అన్నారు.ఏదో చేతనైన విధంగా గుత్తివంకాయ కూర,గోంగూర పచ్చడి,పొట్లకాయ పెరుగు పచ్చడి,సాంబారు,పరమాన్నం,ఆప్పడాలు మొదలైనవి చేసాను.'రాత్రిపూట అరగవు,ఇన్నెందుకమ్మా చేసావు" అంటూనే మళ్ళి మళ్ళీ వేయించుకుని భోజనం ముగించారు ఆఫీసరుగారు.!"అమ్మయి వంట బాగా చేసిందోయ్.మీ ఆవిడ అప్పుడప్పుడు ఊరు వెళ్తూ ఉండచ్చు ఇంక" అని ఒక ప్రశంస పడెసారు.హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నను. మర్నాడు ఆదివారం..షిరిడీ వెళ్తున్న ఒక ఫ్యామిలీకి మేము భోజనం ఇవ్వల్సి ఉంది.త్వరగా వంట మొదలెట్టాను.ఊళ్ళో ఉంటున్న మా పిన్ని ఫొన్ చేసింది నేను "పులిహోర" తెస్తున్నను.నువ్వు వేరేది వండు అని.ఇంతలో ఆఫీసరుగారు వంటింట్లోకి వచ్చారు "అప్పుడె వంట మొదలేట్టవేమి" అన్నరు.ఇలా రైల్వే స్టేషన్ కి భొజనం పట్టుకెళ్ళాలి అన్నాను.'యేమి వండుతున్నావు?" అన్నరు.కంగారులో 'పులిహోరండి ' అనేసాను.ఓహో అని వెళ్పోయి,5నిమిషాల్లో ఒక డబ్బాతో వచ్చారు."ఎటూ మీవాళ్ళ కోసం చేస్తున్నవుగా, నాకు కూడా ఈ డబ్బాలో కాస్త పెట్టియ్యి" అనేసి వెళ్ళిపోయారు.నాకు పులిహోర చేయ్యటం అప్పటికి ఇంకా రాదు.కంగారులో అబధ్ధం చెప్పినందుకు నన్ను నేనే తిట్టుకున్నాను. పిన్ని స్టేషన్ కి వచ్చేస్తానంది...గబగబా నాన్న దగ్గరకు వెళ్ళి జరిగినది చెప్పాను.ఆఫీసరుగారు బాత్ రూం లోకి వెళ్ళగానే ఫోను దగ్గరకు పరిగెట్టాము ఇద్దరం.పిన్నికి ఫొను చేసి ఇంటికి వచ్చేయమని ,కలిసి స్టేషన్ కి వెళ్దామని చెప్పము.ఈలోగా ఆఫీసరుగారు వచ్చి 'ఎక్కువ పెట్టకమ్మా.ఏదో చేస్తున్నానన్నావని అడిగాను" అన్నారు.నాకు కంగారు,నవ్వు రెండూ వచ్చాయి.ఇంకా నయం ఎలా చేస్తున్నావని వంటింట్లోకి తొంగి చూడలేదు అనుకున్నాను.బ్యాగ్గు సర్దుకుని ఆఫీసరుగారు హాలులో కూర్చున్నారు నేను పులిహోర డబ్బ ఎప్పుడు ఇస్తానా అని.నాన్నకి,నాకూ కంగారు పెరిగింది.ఆటొ తెస్తానుండండి అని నాన్న పిన్ని ఇంటికి బయల్దేరారు బండి వేసుకుని.సందు చివరకి వెళ్ళగానే పిన్ని కనిపించిందట,వెనుక కూర్చోపెట్టుకుని తీసుకు వచ్చారు.'దిగగానే వంటింట్లోకి వెళ్ళూ" అని బయటే మా పిన్నికి చెప్పారుట.ఏమీ అర్ధం కాని పిన్ని వంటింట్లోకి రాగానే ఒక్క ఉదుటన తన చేతిలోని పులిహోర బాక్సు లాక్కుని ఆఫీసరుగారి డబ్బా నింపి హాలులోకెళ్ళి ఆయనకు అందించాను.మరోసారి రాత్రి తిన్న వంటని పొగిడి ఆయన నాన్న తెచ్చిన ఆటోలో రైల్వే స్టేషన్ కి వెళ్ళిపోయారు.అయోమయంగా చూస్తున్న పిన్నికి విషయమంతా చెప్పి ఊపిరి పీల్చుకున్నం మేము.10రోజుల తరువాత ఢిల్లి నుంచి ఉత్తరం వచ్చింది "మీ అమ్మయి ఆవ పెట్టి చేసిన పులిహోర అద్భుతంగా ఉంది.ఈసారి అటువైపు వస్తే మా ఆవిడతో సహా మీ ఇంట్లోనే దిగుతాను మీ అమ్మయి చేతి పులిహోర తినటానికి" అని.'ఎందుకైనా మంచిది పిన్ని దగ్గర పులిహోర చెయ్యటం నేర్చుకోవే" అన్నారు నాన్న. వెంఠనే పిన్నికి ఫొను చేసాను."ఆ రోజు పులిహోర నేను చెయ్యలేదు.అప్పుడే నరసాపురం నుంచి వచ్చిన మా అత్తగారు చేసారు" అంది పిన్ని.ఇప్పుడు నరసాపురం వెళ్లాలా? అనుకున్నాము నేను,నాన్న!! ఇప్పటికీ ఈ సంగతి గుర్తు వచ్చినప్పుడల్లా నవ్వువస్తూఉంటుంది.