సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||
Showing posts with label devotional. Show all posts
Showing posts with label devotional. Show all posts

Tuesday, June 15, 2010

జయ జనార్ధనా కృష్ణా రాధికా పతే..

మూడేళ్ళ పాప పాడిన ఈ కృష్ణ భక్తిగీతం మా అమ్మాయితో పాటు నాకూ ఎంతో ఇష్టం. రెండేళ్ళ క్రితం ఎవరిదగ్గారో కాపి చేసుకుని మొబైల్లో మా వారు ఈ పాట తెచ్చారు. అప్పటి నుంచీ రాత్రిళ్ళు అన్ని జోలపాటలతో పాటూ మా పాప తప్పక వినే పాట ఇది.



సాహిత్యం:

జయ జనార్ధనా కృష్ణా రాధికా పతే
జనవిమోచనా కృష్ణా జన్మమోచనా((జయ))
గరుడవాహనా కృష్ణా గోపికాపతే
నయనమోహనా కృష్ణా నీరజేక్షణా
జయ జనార్ధనా కృష్ణా రాధికా పతే
జనవిమోచనా కృష్ణా జన్మమోచనా

సుజనబాంధవా కృష్ణా సుందరాకృతే
మదనకోమలా కృష్ణా మాధవాహరే
వసుమతీపతే కృష్ణా వాసవానుజా
వరగుణాకరా కృష్ణా వైష్ణవాకృతే
సురుచినాననా కృష్ణా సౌర్యవారిధే
మురహరా విభో కృష్ణా ముక్తిదాయకా
విమలపాలకా కృష్ణా వల్లభీపతే
కమలలోచనా కృష్ణా కామ్యదాయకా ((జయ))

విమలగాత్రనే కృష్ణా భక్తవత్సలా
చరణపల్లవం కృష్ణా కరుణకోమలం
కువలయేక్షణా కృష్ణా కోమలాకృతే
తవపదాంభుజం కృష్ణా శరణమాశ్రయే
భువననాయకా కృష్ణా పావనాకృతే
గుణగణోజ్వలా కృష్ణా నళినలోచనా
ప్రణయవారిధే కృష్ణా గుణగణాకరా
రామసోదరా కృష్ణా దీనవత్సలా ((జయ))

కామసుందరా కృష్ణా పాహిసర్వదా
నరకనాశనా కృష్ణా నరసహాయకా
దేవకీసుతా కృష్ణా కారుణ్యాంబుధే
కంసనాశనా కృష్ణా ద్వారకాస్థితా
పావనాత్మకా కృష్ణా దేహిమంగళం
తృత్పదాంభుజం కృష్ణా శ్యామకోమలం
భక్తవత్సలా కృష్ణా కామ్యదాయకా
పాలిశెన్ననూ కృష్ణా శ్రీహరీనమో((జయ))

భక్తదాసనా కృష్ణా హరసునీసదా
కాదునింతినా కృష్ణా సలహెయావిభో
గరుడవాహనా కృష్ణా గోపికాపతే
నయనమోహనా కృష్ణా నీరజేక్షణా
జయ జనార్ధనా కృష్ణా రాధికా పతే
జనవిమోచనా కృష్ణా జన్మమోచనా
గరుడవాహనా కృష్ణా గోపికాపతే
నయనమోహనా కృష్ణా నీరజేక్షణా((జయ))


(సాహిత్యంలో ఏవన్నా మార్పులు ఉంటే ఎవరన్నా తెలుపగలరు.)

Tuesday, May 18, 2010

ఆదిశంకరాచార్య విరచిత నిర్వాణ షట్కం




ఇవాళ ఆదిశంకరాచార్యులవారి జయంతి సందర్భంగా నాకు ఇష్టమైన ఈ నిర్వాణ షట్కం వినటానికి + సాహిత్యం:





ఆదిశంకరాచార్య విరచిత నిర్వాణ షట్కం :

మనో బుద్ధ్యహంకారచిత్తాణి నాహం
న చ శ్రోత్ర జిహ్వే న చ ఘ్రాణ నేత్రే
న చ వ్యోమ భూమిర్న తేజో న వాయు:
చిదానంద రూపః శివోహం శివోహం 1

న చ ప్రాణసంజ్ఞో న వై పంచవాయుః
న వా సప్తధాతుర్న వా పంచకోశాః
న వాక్పాణిపాదం న చోపస్థపాయు:
చిదానంద రూపః శివోహం శివోహం 2

న మే ద్వేష రాగౌ న మే లోభ మోహౌ
మదో నైవ మే నైవ మాత్సర్య భావః
న ధర్మో న చార్థో న కామో న మోక్షః
చిదానంద రూపః శివోహం శివోహం 3

న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం
న మంత్రో న తీర్థం న వేదా న యజ్ఞాః
అహం భోజనం నైవ భోజ్యం న భోక్తా
చిదానంద రూపః శివోహం శివోహం 4

న మృత్యుర్న శంకా న మే జాతి భేదః
పితా నైవ మే నైవ మాతా చ జన్మ
న బంధుర్న మిత్రం గురుర్నైవ శిష్య:
చిదానంద రూపః శివోహం శివోహం 5

అహం నిర్వికల్పో నిరాకారరూపో
విభుత్వాచ్చ సర్వత్ర సర్వేంద్రియాణాం
న చాసంగతం నైవ ముక్తిర్నమేయః
చిదానంద రూపః శివోహం శివోహం 6

ఈ స్తోత్రం అర్ధం ఇక్కడ చూడవచ్చు.


(సంస్కృతం కాబట్టి ఎక్కడైనా పొరపాట్లు దొర్లి ఉండవచ్చు. ఒకవేళ ఎవరికైనా తెలిస్తే సరిచేసినా సరే...)

Saturday, February 20, 2010

రాగ సుధారస



వాగ్గేయకారులలో నాకెంతో ఇష్టమైన "త్యాగయ్య" కృతులను కొన్నింటినైనా బ్లాగ్లో రాయాలని సంకల్పం. జనవరి నెలలో ఒకటి రాసాను. ఇది నాకు నచ్చిన మరొక కీర్తన...
బాలమురళిగారు పాడిన ఈ కీర్తన ఇక్కడ వినవచ్చు:




త్యాగరాయ కృతి
రాగం: ఆందోళిక
తాళం: ఆది

ప: రాగ సుధారస పానము చేసి - రంజిల్లవే ఓ మనసా (ప)
అ.ప : యాగ యోగ త్యాగ - భోగఫల మొసంగే (ప)

చ: సదాశివమయమగు - నాదోంకారస్వర
విదులు జీవన్ముక్తు - లని త్యాగరాజు తెలియు (ప)

నా కర్ధమైన అర్ధము:

ఓ మనసా! రాగమనెడి అమృతమును సేవించి రంజిల్లుము. ఇది యాగము, యోగము, త్యాగము, భోగము మొదలైన భోగముల ఫలములను అందిస్తుంది. నాదము సదాశివమయమైనది.ఓంకారూపమందు నిలిచిన ఆ నాదమే రాగమైయింది. ఈ సత్యానెరిగినవారంతా జీవన్ముక్తులు అన్నది త్యాగరాజు తెలుసుకున్న సత్యం.

Thursday, January 7, 2010

ఇక కావలసినదేమి...


వాగ్గేయకారుల్లో నాకు అత్యంత ఇష్టమైన "త్యాగయ్య" గురించి ప్రత్యేకం చెప్పటానికేముంది? పొద్దున్నే ఆయన కృతులు వింటుంటే ఈ కృతిని బ్లాగ్లో రాయాలనిపించింది..."బోంబే సిస్టర్స్"(సరోజ,లలిత)పాడిన కృతి వినటానికి పెడుతున్నను...




త్యాగరాజ కృతి, బలహంస రాగం, ఆది తాళం :

పల్లవి
: ఇక కావలసినదేమి మనసా సుఖముననుండవదేమి

అనుపల్లవి
: అఖిలాండ కోటి బ్రహ్మాండ నాథుడు
అంతరంగమున నెలకొనియుండగ (ఇక)

చ1: ముందటి జన్మములను జేసినయఘ బృంద విపినముల-
కానంద కందుడైన సీతా పతి నందక యుతుడైయుండగ (ఇక కావలసిన)

చ2
: కామాది లోభ మోహ మద స్తోమ తమమ్ములకును
సోమ సూర్య నేత్రుడైన శ్రీ రామచంద్రుడే నీయందుండగ (ఇక కావలసిన)

చ3: క్షేమాది శుభములను త్యాగరాజ కామితార్థములను
నేమముననిచ్చు దయా నిధి రామభద్రుడు నీయందుండగ (ఇక కావలసిన)


త్యాగరాజ కృతికి అర్ధాన్ని రాసేంతటి గొప్పదాన్ని కాదు కానీ నాకు అర్ధమైన అర్ధాన్ని కూడా రాయటానికి సాహసించాను...

అర్ధం:

ఓ మనసా, ప్రశాంతంగా ఎందుకుండవు? ఇంకేమికావాలి నీకు? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడే నీ మనసునందు నిండి ఉండగా ఇంకేమి కావాలి నీకు?

ఆనందకారకుడైన శ్రీరాముడు తన నందక ఖడ్గంతో పుర్వ జన్మలందు చేసిన పాపారణ్యములను నాశనం చేయటానికి సిధ్ధముగానుండగ ఇంకేమి కావాలి నీకు?

నీలోని కామము,లోభము,మదము,మోహమూ మొదలైన అంధకారములను తొలగించటానికి, సూర్య చంద్రాదులను తన నేత్రాలలో నింపుకున్న శ్రీరామచంద్రుడు నీలో కొలువై ఉండగా ఇంకేమి కావాలి నీకు?

ఈ త్యాగరాజాశించెడి క్షేమాది శుభములను నీకొసగ గలిగిన దయానిధి అయిన శ్రీరామభద్రుడు నీలో ఉండగా ఇంకేమి కావాలి నీకు?
ఓ మనసా....

Monday, November 16, 2009

నాలోన శివుడు కలడు..."

(Siva temple in coimbatore)
ఈ చివరి కార్తిక సొమవారం పరమ శివుణ్ణి ఇలా స్మరిస్తూ...
******

'పూర్తిగా తెలిసే వరకూ ఏ వ్యక్తి మీదా ఒక స్థిరమైన అభిప్రాయాన్ని ఏర్పరుచుకోకూడదు’ అన్నది నేను తెలుసుకున్న కొన్ని జీవిత సత్యాల్లో ఒకటి. ఒక మనిషిని మనం మొదట ఏ దృష్టితో చూస్తామో అదే అభిప్రాయం మనకి ఆ మనిషి గురించి ఇంకా బాగా తెలిసేవరకూ ఉండిపోతుంది. మెల్లగా, పూర్తిగా ఆ వ్యక్తి తెలిసాకా, మనకు గతంలో కలిగిన అభిప్రాయానికీ, కొత్తగా ఏర్పడిన అభిప్రాయానికీ ఎంత తేడా ఉందో తెలిసాకా ఆశ్చర్యం వేస్తుంది. అలా నాకు గతంలో ఉన్న అభిప్రాయం పూర్తిగా మారిపోయి ఒక వ్యక్తంటే అమితమైన అభిమానం ఏర్పడిపోయింది. అది "తనికెళ్ళ భరణి" గారు. ఆయనను సినిమాల్లో నెగటివ్ పాత్రల్లో చూసి చూసి చిన్నప్పుడు అంత మంచి అభిప్రాయం ఉండేది కాదు..

"హాసం" మాస పత్రిక మొదలైయ్యాకా దాంట్లో ఆయన రాసిన వ్యాసాలు చదివాకా నాకు ఆయనంటే చాలా గౌరవం ఏర్పడిపోయింది. ఇంత మంచి రచయిత ఉన్నాడా ఈ వ్యక్తిలో అని ఆశ్చర్యపోయాను. ఆ తర్వాత మిగతా రచనలు కుడా కొన్ని చదివాను. తర్వాత ఆయన ఒక డైలాగ్ రైటర్,నాటక రచయిత,కధా రచయిత అని కూడా తెలుసుకున్నాను. దాదాపు పదేళ్ల క్రితం ఇంకో కొత్త విషయం తెలుసుకున్నాను...ఆయన గొప్ప శివ భక్తుడని. ఆయన స్వయంగా రచించి, స్వరపరిచి, పాడిన "నాలోన శివుడు కలడు" అనే ఆల్బమ్ విన్నాకా. ఇది నాకు చాలా ఇష్టమైన భక్తి గీతాల ఆల్బమ్. మొత్తం ఐదు పాటలూ శివ తత్వాన్నీ, భరణి గారికున్న శివ భక్తినీ తెలుపుతాయి. అన్ని పాటలకూ ముందుమాట సామవేదం షణ్ముఖశర్మగారు చెప్తారు. అందులో నాకు బాగా నచ్చే మూడు పాటలు ఇక్కడ వినటానికి...మొదటి పాట మొత్తం సాహిత్యం కూడా....
--------------



నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు
నాలోన గల శివుడు నీలోన గల శివుడు లోకమ్ములేలగలడు
కోరితే సొకమ్ముబాపగలడు...((నాలోన))

నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు
నాలోన గల శివుడు నీలోన గల శివుడు గంగపైకెత్తగలడు
పాపులను తుంగలో తొక్కగలడు((నాలోన))

నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు
నాలోన గల శివుడు నీలోన గల శివుడు కొండపై ఉండగలడు
వరమిచ్చి గుండెలో పండగలడు((నాలోన))

నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు
నాలోన గల శివుడు నీలోన గల శివుడు ఒక కన్ను తెరవగలడు
ఒద్దంటే రెంటినీ మూయగలడు((నాలోన))

నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు
నాలోన గల శివుడు నీలోన గల శివుడు సగము పంచీయగలడు
తిక్కతో అసలు తుంచేయగలడు((నాలోన))

నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు
నాలోన గల శివుడు నీలోన గల శివుడు మనలోన కలవగలడు
దయతోటి తనలోన కలపగలడు((నాలోన))

నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు
నాలోన గల శివుడు నీలోన గల శివుడు
నాటకాలాడగలడు తెరదించి మూటగట్టేయగలడు(౩)

************

2) "హమ్మయ్య దొరికావా అర్ధానారీశ్వరుడా
విడి విడిగా వెతికాను ఒకచోటే కలిసారా..
అమ్మేమో విల్లంటా అయ్యేమో అమ్మంటా
గురి చూసి కొట్టేది మన కర్మ ఫలమంటా.."



************

3)"నువ్వైనా చెప్పవమ్మ సాంబ శివునికీ
నువ్వే కనువిప్పవమ్మ సాంబ శివునికి.." పాటలో

"బుసకొట్టే పాములేరా మీ కోరికలు
అట్టలు కట్టిన జడలే పాతకమ్ములు"

"కడకు వల్లకాడేగద మీ నివాసమూ
కపాలమే గదా కడకు మీ విలాసమూ.."
వాక్యాలు జీవన తత్వాన్ని ఎంతో సులభంగా తెలియపరుస్తాయి.





*************

4)"ఈ జన్మకింతేరా మల్లనా
ఇంకో జన్మ నాకీయి మల్లనా..""
పాటలో "జానకి"గారి గళంలో పలికే ఆర్ధ్రతను విన్నాకా కళ్లలోకి నీరు ఉబికి వస్తుంది...

5)"ఓ శివా నా శివా బజ్జోరా మా శివా
ముడు కన్నులు మూసి బజ్జోర మా శివా..."
పాటలో "సుశీల" గారి జోల వింటూంటే మనకూ నిద్దుర వచ్చేస్తుంది...

భక్తిగితాలపై ఆసక్తి ఉన్న ప్రతివారు కొనుక్కోవలసిన కేసెట్ ఇది. ఇప్పుడు సి.డి కూడా వచ్చిందేమో తెలీదు మరి.
*********************************************************

ఇక రేపు తెల్లవారు ఝాములో పెట్టే "పోలి స్వర్గం" దీపాలతో ఈ కార్తీకానికి "హర హర మహాదేవ.."