సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||
Showing posts with label ప్రదర్శనలు - సభలు -ఫోటోలు. Show all posts
Showing posts with label ప్రదర్శనలు - సభలు -ఫోటోలు. Show all posts

Monday, January 20, 2014

మన బాపు..





మన బాపు..  మన తెలుగువాళ్ళకి గొప్పే కదా! 

యాదృఛ్ఛికంగా ఇవాళ యూట్యూబ్ లో ఈ లింక్స్ దొరికాయి... 18నెలలుగా కేబుల్ కనక్షన్ పీకిపారేసి, హాయిగా కాలక్షేపం చేస్తున్న మాకు ఇటువంటివి చూడటమంటే పండగే మరి! 

మాకులాగ ఎవరన్నా మిస్సయినవాళ్ళు ఉంటే చూస్తారని లింక్స్ ఇక్కడ పెడుతున్నాను..


 మొదటి భాగం:


    


రెండవభాగం:

    


 ఫేస్బుక్ లో బాపూ గారి పేజీ...(తెలియనివాళ్ళకి..) 
https://www.facebook.com/pages/Bapu-ramana/134126756633596

Saturday, December 14, 2013

పుస్తకాల తీర్థం



ఈ మధ్యన ఇల్లు మారినప్పుడు పుస్తకాలు సర్ది సర్ది... 'ఇంక ఉన్నవి చాలు కొనకూడదు బాబూ..!' అనుకున్నా. పుస్తక ప్రదర్శన మొదలయ్యే ముందు రోజు కూడా అదే స్థిరంగా అనుకున్నా..'వెళ్ళకూడదూ వెళ్లకూడదూ...' అని!


ఏడో తారీఖు సాయంత్రం అయ్యేసరికీ మనసు కొట్టుకుంది... మానెయ్యడమా.. అందులోనూ మొదటిరోజు..! 'ఏమండీ...' అన్నా...! 'సరే పదమన్నారు' శ్రీవారు. అప్పటికప్పుడు అనుకున్నందువల్ల ట్రాఫిక్ జామ్ లో చిక్కుకుపోయాం. పదిహేనొ ఇరవయ్యొ కిలోమీటర్ల దూరం మరి! బుక్ ఫెయిర్ దగ్గరకి చేరేసరికీ ఏడుంపావు!! ఎనిమిదింటికి మూసేస్తారు కదా లోపలికి వెళ్దామా వద్దా అనుకుని.. సర్లే ఇంత దూరం వచ్చాం కదా అని లోపలికి దూరిపోయాం..


విజయవాడలో మా క్వార్టర్స్ పక్కనే ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఉండేది. పుస్తక ప్రదర్శన మొదలెట్టిన ఏడాది నుండీ అక్కడ ఉన్నన్నాళ్ళూ ప్రతి ఏడూ సాయంత్రమయ్యేసరికీ చటుక్కున వెళ్పోయి ఓ రౌండ్ వేసి వచ్చేదాన్ని.  ప్రదర్శన ఉన్న పదిరోజుల్లో  వీలయినన్ని విజిట్స్ తప్పక వేసేదాన్ని. కొత్త పుస్తకాల దొంతరలు.. ప్రింట్ వాసన.. తెల్లని పేజీలపై నల్లని ఆక్షరాలు.. ఏదో ఉత్తేజాన్ని పెంచుతూ, ఉత్సాహాన్ని రేకెత్తిస్తూ.. మహదానందంగా ఉండేదసలు. ఎన్నేళ్ళైనా అదే ఉత్సాహం ఇప్పటికీ. పుస్తకాలను చూస్తే మనసు చిన్నపిల్లై వాటివెంట పరిగెత్తుకుపోతుంది. 


సరే ఇప్పుడు ఈ యేటి బుక్ ఫెయిర్ కబుర్లలోకి వచ్చేస్తే.. లోపలికి అడుగుపెట్టగానే ప్రధాన ఆకర్షణ గ్రౌండ్ మధ్యలో కట్టిన ఎమెస్కో వాళ్ల స్టాల్. మొదటి రోజు కదా ఇంకా కడుతున్నారు. లోపల ఇంకా చిత్రాలను పేర్చుతున్నారు. క్రింద ఫోటోలో ఉన్న పుస్తకం లోని బొమ్మలే లోపల నలువైపులా గోడలకు అమర్చారు.










 స్టాల్స్ కి ఇంకా నంబర్లు మాత్రమే ఉన్నాయి. పేర్లు రాయలేదు. కొన్ని చోట్ల అట్టపెట్టేలు తెరవలేదు. ఇంకా సర్దుకుంటున్నారు. ఈ చిత్రం కూడా అందంగానే ఉంది. ఎంత కష్టపడతారో ఇక్కడకి ఈ బుక్సన్నీ చేర్చడానికీ అనిపించింది. ఇల్లు మారేప్పుడు నాలుగైదు అట్టపెట్టెల పుస్తకాలు సేఫ్ గా చేరేసేసరికే ఆపసోపాలు పడిపోయాం. మరి ఇన్ని వందల, వేల, లక్షల పుస్తకాలు ఒకచోట చేర్చడం..మళ్ళీ అయిపోయాకా అవన్నీ వెనక్కు తీసుకువెళ్లడం... నిజంగా ఎంత శ్రమతో కూడుకున్న పనో! 




ఈసారి స్టాల్స్ ఏ,బి,సి అని బ్లాక్స్ గా డివైడ్ చేసారు. ఒక బ్లాక్ లో ఒక సైడ్ తిరిగామంతే.. విజిల్ వేసుకుంటూ అబ్బాయి వచ్చేసాడు. మొదటిరోజు ప్రదర్శన అయిపోయింది....అయ్యో.. అని నాకు ఏడుపువచ్చినంత పనైంది. నే రాసుకున్న లిస్ట్ లోవి నాలుగంటే నాలుగు పుస్తకాలు కొన్నా అప్పటికి. 'పోన్లే మళ్ళీ వద్దాం.. నెక్స్ట్ వీకెండ్' అన్నారు మావారు. మళ్ళీ ఇంటికి రావడానికి రెండు గంటలు పట్టింది. ఎలాగైనా వెళ్లాలి అని నాలుగు గంటలు కష్టపడితే ముప్పావుగంట ఉండగలిగానా...:( అని ఆ పూటంతా మూడ్ ఆఫ్ అయిపోయింది. 


'మళ్ళీ వీకెండ్ కి ఏ అవాంతరమో వస్తే..వెళ్లడం కుదరకపోతే..' అని భయమేసి మొన్నగురువారం పొద్దున్నే బయల్దేరా ఒక్కదాన్నే. మా ఇంటి నుండి ఇరవై నిమిషాలు బస్టాప్ కి నడక, గంట బస్సు, మళ్ళీ ఓ ఐదారు కిలోమీటర్లు ఆటో.. అప్పుడు బుక్ ఫెయిర్ వస్తుంది. దారిలో ఉండగా నాన్న ఫోన్ చేసి ఎమెస్కొలో "తిలక్"గారి కలక్షన్ వచ్చేసిందిట  తీసుకోమని చెప్పారు. సరే, ఇంక మొదట ఎమెస్కో లోకి దూరాను.  ఆ తర్వాత మొదటిరోజు ఎక్కడ ఆపానో అక్కడి నుండీ మళ్ళీ చూడడం మొదలుపెట్టాను. నేషనల్ బుక్ ట్రస్ట్, I&B వాళ్ల పబ్లికేషన్స్ డివిజన్ స్టాల్, సాహిత్య అకాడమీ, తెలుగు బుక్ హౌస్, నవోదయా, విశాలాంధ్ర...ఆక్స్ఫార్డ్, బెంగుళూరు, ఢిల్లీ, చెన్నై నుండి వచ్చిన ఇంగ్లీష్ బుక్స్టాల్స్... ఈసారి క్రిందటేడు కనబడ్డ కొన్ని స్టాల్స్ కనపడ్లేదు. ఈలోపూ వెళ్పోవాల్సిన టైమ్ అయ్యింది. మళ్ళీ మా పాప స్కూల్ నుండి వచ్చేలోగా ఇల్లు చేరాలి.. అప్పటికి టాగూర్ పబ్లిషింగ్ హౌస్ లో ఉన్నా.. ఇంకా మూడవ block పూర్తిగా చూడాలి.. అయినా ఇక బయల్దేరాలి... జై సిండ్రిల్లా.. అనుకుని గబగబ బయట పడ్డా.. చేతుల్లో నిండుగా, బరువుగా ఉన్న సంచీలు సంబరపెడుతున్నా ఇంకా మొత్తం చూడలేదని అసంతృప్తి..!! లక్కీగా నేను ఇల్లు చేరాను.. అప్పుడే పాప ఆటో వచ్చింది. 




ఇంక మిగిలిన పార్ట్ చూట్టం వీకెండ్లో సరిగ్గా కుదరకపోతే తృప్తి ఉండదని.. మళ్ళీ మర్నాడు పొద్దున్నే బయల్దేరా.. అంచలంచలుగా తెరిచే టైమ్ కి చేరిపోయా. మళ్ళీ టాగూర్ పబ్లిషింగ్ హౌస్ దగ్గర నుండి మొదలుపెట్టి నాకిష్టమైన KFI పబ్లికేషన్స్, విజయవాడ స్టాల్స్... ఓ విజయవాడ స్టాల్లో సినిమా పుస్తకాలు బాగున్నాయి. వాటిల్లో ఆదుర్తి సుబ్బారావు గారి మీద పుస్తకమొకటి బాగుంది. షేక్స్పియర్ ప్లేస్ తెలుగులోకి అనువదించినవి ఆరో,ఏడో ఉన్నాయి. ఇవి కొనలేదు కానీ క్రిందటేడు బుక్ ఫెస్ట్ లో సోనెట్స్ కి ట్రాన్స్లేషన్ ఉంటే కొన్నాను. He is my most favourite!! ఎమ్మే ఫైనల్లో లాస్ట్ పేపర్ ఆప్షన్స్ లో "మోడర్న్ లిటిరేచర్" వదిలేసి "షేక్స్పియర్" తీసుకున్నా. ఫ్రెండ్సంతా నవ్వారు అబ్బా ఫోర్టీన్త్ సెంచరీ స్టఫ్ ఏం చదువుతావే అని. కానీ నాకెందుకో మొదట్నుండీ షేక్స్పియర్ అంటే ప్రాణం.......! ఓకె.. మళ్ళీ స్టాల్స్ దగ్గరకు వచ్చేస్తే, క్రితంసారి లాగానే ఈసారి కూడా ఓల్డ్ బుక్స్ కి డిస్కౌంట్ ఉన్న స్టాల్స్ ఉన్నాయి. ఏక్చువల్ గా సాహిత్య అకాడమీ స్టాల్ లో కొన్ని డిస్కౌంట్ బుక్స్ ఉన్నాయి. వీరలక్ష్మి గారు "భారతీయ నవల" లో మెన్షన్ చేసిన నవలలుచాలావరకూ! నేను భైరప్ప గారిదొకటి తీసుకున్నా. 


ఈసారి ఎక్కువగా రావూరి భరద్వాజ గారి పుస్తకాలు, చలం సమగ్ర సాహిత్యం, టాగూర్,శరత్ నవలల అనువాదాలు, ముళ్ళపూడివారి పుస్తకాలు, వంటల పుస్తకాలు ఎక్కువగా కనబడ్డాయి. ఎమెస్కో వాళ్ళు చాగంటివారి భాగవతం, రామాయణం, శివపురాణం ప్రవచనాలు కలిపి డిస్కౌంట్ పెట్టారు. అలానే తిలక్, గురజాడ, జాషువా ముగ్గురి సమగ్ర సాహిత్యంపై డిస్కౌంట్ పెట్టారు. పిల్లల పుస్తకాలు చాలా ఉన్నాయి + బాగున్నాయి కానీ రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. పిల్లల కోరికలను కాదనలేని పేరెంట్స్ వీక్నెస్ ని కనిపెట్టినట్లుగా పిల్లలు కావలనదగ్గ వస్తువులన్నీ స్టాల్స్ లో ఉన్నాయి..:) నే వరుసగా వెళ్ళిన రెండు రోజులూ రెండు మూడు స్కూళ్ళ వారు తమ పిల్లల్ని తీసుకొచ్చారు. ఛోటా భీమ్ స్టోస్ గురించి ఎంత తక్కువ చెప్తే అంత మంచిది.. మేము బలే..:)







చివరిగా నవోదయాకు మరోసారి వెళ్ళాను. నాకెప్పుడూ షాప్ లో కనబడే ఆయన ఉన్నారీసారి. అడిగిన బుక్సన్నీ గబగబా తీసిచ్చేసారు. నవోదయా కేటలాగ్ ఒకటిచ్చారు. అది ముందరే తీసుకుని ఉంటే వెతుక్కోవాల్సిన అవసరమయ్యేది కాదు. ఇంక లిస్ట్ లో రాసుకున్నవన్నీ దొరికేసాయనుకున్నాకా ఇంక బయల్దేరిపోయాను. రేపే ఆఖరిరోజు ఇంక..


ఈసారి కొన్న పుస్తకాలు..






ఇవండీ ఈయేటి 'పుస్తకాల తీర్థం' ఊసులు...!!!


Thursday, May 9, 2013

రజని గారి ఇటీవలి సన్మానం ఫొటోలు






ఆకాశవాణి ప్రముఖులలో రజని గారు మునిపుంగవులు లాంటివారు. అనేకమంది రేడియో కళాకారులకు ఆయన  భీష్మ పితామహులు. తెలుగు కార్యక్రమాలకు అంతర్జాతీయ ఖ్యాతిని సంపాదించిపెట్టిన తొలి కళాకారులు, వాగ్గేయకారులు రజని.

25-4-13 తేదిన 'మార్కోనీ' జయంతి సందర్భంగా కృష్ణవేణి క్రియేషన్స్ వారు విజయవాడలో ఆకాశవాణి మాజీ సంచాలకులు, కళాకారులు డాక్టర్ బాలాంత్రపు రజని కాంతారావు గారికి జీవన సాఫల్య పురస్కారం అందజేసారు. ప్రసార భారతి మాజీ అధికారి సాహితీవేత్త డాక్టర్ ఆర్.అనంత పద్మనాభ రావు అధ్యక్షతన ఈ పురస్కారం అందించబడింది.

సభ తాలుకు ఫోటోలు..









***


రజని గారి స్వీయ రచన "రజనీ ఆత్మ కథా విభావరి" పుస్తకం విడుదల సభ విశేషాలు, రెండు మంచి ప్రసంగాలు ఇక్కడ :
http://trishnaventa.blogspot.in/2012/05/blog-post_24.html

Sunday, March 31, 2013

Millet Fest - 2013





ఆహారం మరియు పౌష్ఠికాహారం బోర్డ్-భారత ప్రభుత్వం వారు, ఆచార్య ఎన్.జి.రంగా అగ్రికర్చరల్ యూనివర్సిటీ(ANGRAU) సహకారంతో  నెక్లెస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజా లో మూడు రోజులపాటు జరిగే "Millet Fest - 2013" ను నిన్న ప్రారంభించారు. ప్రజలు ఫాస్ట్ ఫుడ్స్ కి, ఇన్స్టెంట్ ఫుడ్స్ కి అలవాటు పడ్డం వల్ల చిరుధాన్యాలను కొనటం తగ్గిందని, అందువల్ల వాటి ఉత్పత్తి శాతం బాగా తగ్గిపోయిందట. రాగులు, జొన్నలు, కొర్రలు, సజ్జలు,సాములు మొదలైన చిరుధాన్యాలపై ప్రజల్లో తగ్గుతున్న ఆసక్తిని పెంచేందుకు, ఈ చిరుధాన్యాల పట్ల ప్రజల్లో మరింత అవగాహన, ఉపయోగాలూ తెలిపేందుకు ఈ ప్రదర్శనను క్రిందటేడు నుండీ నిర్వహిస్తున్నారుట. 





 యూనివర్సిటీ వాళ్ళు పరిశోధనల్లో భాగంగా చిరుధాన్యాలతో తయారు చేసిన పదార్థాలు, బిస్కెట్లు, మురుకులు మొదలైనవి ప్రదర్శనలో ఉంచారు. అవి ఇంకా కావాలంటే యూనివర్సిటీ స్టోర్స్ లో లభ్యమౌతాయని కూడా చెప్పారు. ఇవే కాక వివిధ సంస్థలు(NGOs) చిరుధాన్యాలతో తయారు చేసిన రకరకాల పదార్థాలూ, వారు పండించిన ఆర్గానిక్ చిరుధాన్యాలు మొదలైనవి అమ్మకానికి పెట్టారు. నేటితరం మగ్గు చూపుతున్న పీజాలు,బర్గర్లు మొదలైన ఫాస్ట్ ఫుడ్స్ ఆరోగ్యానికి ఎంత హానికరమో, మన పూర్వీకులు ఎంతగానో ఆస్వాదించిన ఈ చిరుధాన్యాలు, వాటితో ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుచుకోవచ్చునో కూడా ప్రదర్శనలో తెలుపుతున్నారు. నిజానికి ఆరోగ్యానికి హాని చేసే శనగపిండితో చేసిన పదార్థాలకన్నా ఆరోగ్యానికి మేలు చేసే జొన్న పిండి, రాగి పిండి మొదలైనవాటితో చేసిన పదార్థాలు ఎంతో మంచివి. ఎందుకంటే పిల్లలకు కావాల్సిన కేల్షియం, ఇనుము మొదలైనవి చిరుధాన్యాలలోనే ఎక్కువగా లభిస్తాయి.







 ఇంత చక్కని ప్రదర్శన నగరంలో జరగటం, మాకులాగానే ఎంతోమంది విచ్చేసి ఈ వివరాలన్నింటిని తెలుసుకోవటం నాకెంతో ఆనందాన్ని కలిగించింది. ఎందుకంటే గత ఏడాదిగా నేను ఈ చిరుధాన్యాలతో చేయగల వివిధ పదార్థాలను గురించి, వంటకాలను గురించీ విస్తృతమైన పరిశోధన జరుపుతున్నాను. జొన్న రవ్వ ఉప్మా, రాగి పిండి, సజ్జ పిండి, జొన్న పిండి, సోయా పిండి మొదలైనవి చపాతీ పిండి ఏ ఏ పాళ్ళలో కలిపితే చపాతీలు ఎలా వస్తాయో, అట్లల్లో మైదా బదులు జొన్న పిండి, పకోడీల్లో కూడా జొన్న పిండి కలపటం, రాగి పూరీలు మొదలైన ప్రయోగాలు చేస్తూ వస్తున్నా :) అందువల్ల వాళ్ళు అమ్మకానికి పెట్టిన మల్టీ గ్రైన్ ఆటా, మల్టీ గ్రైన్ రవ్వ, మల్టీ గ్రైన్ బ్రెడ్ నాకు కొత్తవి కాదు. కొన్నేళ్ళూగా నేను కొంటున్నవే. కొత్తగా నాకు తెలిసినవి ఏంటంటే మురుకులు, జంతికలు, ఖాక్రా లాంటివి కూడా జొన్న పిండితో చేసుకోవచ్చని. ఇలా కొత్తవి ఏం చేసుకోవచ్చో తెలుసుకోవటానికే మేము ఈ ప్రదర్శనకు వెళ్ళాం. కొన్ని రెసిపి బుక్స్ కూడా కొన్నాను. ఆర్గానిక్ చిరుధాన్యాలన్నింటినీ అమ్మే షాపు వివరాలు కూడా తెలుసుకున్నాం. బేగం పేటలో ఉందట వాళ్ళ షాపు.





మరోవైపున చిరుధాన్యాలతో చెసిన జొన్న రొట్టెలు, రగి రొట్టెలు మొదలైన వంటకాలను అమ్మకానికి పెడుతున్నారు. ఇంకా వంటకాలు తయారవుతున్నాయి. అవి సాయంత్రమే తింటానికి పెడతారుట. 



న్యూస్ పేపర్లో ప్రకటన అయితే వేసారు కానీ ప్రదర్శన సమయం రాయలేదు. మేము నిన్న మధ్యాహ్నం వెళ్ళాము. "స్టాల్స్ చూడండి కానీ అమ్మకాలు సాయంత్రమే" అన్నారు. మళ్ళీ పాతిక కిలోమీటర్లు రాలేము అని రిక్వెస్ట్ చేస్టే కొన్ని స్టాల్స్ లో పదార్థాలు కొనుక్కోనిచ్చారు. ఇటువంటి ఉపయోగకరమైన ప్రదర్శనలు నిర్వహించేప్పుడు  సరైన సమయం, ఎన్నాళ్ళు ఉండేది, ఇలాంటి ప్రదర్శనకు వెళ్ళటం వల్ల ఉపయోగాలు మొదలైనవాటి ప్రచారం సమంగా జరిపితే ప్రదర్శకుల శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. హోమ్ సైన్స్ స్టూడెంట్స్ ఎంతో ఉత్సాహవంతంగా తమతమ ప్రయోగాలను గురించిన వివరాలు తెలియజేసారు.

ప్రదర్శన తాలుకూ ఫోటోలు:




murukus with jowar


like khakhras


recipe books

Monday, January 28, 2013

Horti Expo 2013



ఇరవై మూడవ ఉద్యానవన ప్రదర్శన (Horti Expo 2013) jan26 న హైదరాబాద్ లో మొదలైంది. జనవరి30 వరకూ ఐదురోజులు కొనసాగుతుందీ ప్రదర్శన. మొదటిరోజూ, నిన్న రెండుసార్లూ వెళ్ళి కనులారా మొక్కలన్నీ చూసి వచ్చాను. 

ప్రదర్శన మొదట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆకారంలో ఆయా జిల్లాల్లో పండే పంటలతో, కూరగాయలతో నింపిన చిత్రం ఆకట్టుకుంది. ప్రదర్శన ఆకట్టుకున్నప్పటికీ ఈసారి కనబడ్డ మార్పులు, తగ్గిపోయిన పూలమొక్కలూ నన్ను నిరాశపరిచాయనే చెప్పాలి. కొత్తవాటికి చోటు పెరగటంతో పూలమొక్కలు తగ్గిపోయాయని కూడా నాకు అనిపించి ఉండచ్చు.





ఈసారి రంగురంగుల కాగితంపూల చెట్లు ఎక్కువగా కనబడ్డాయి. చిన్నపాటి కుండీ కూడా మూడువందల ఏభై చెప్తున్నా కూడా అవే ఎక్కువగా అమ్ముడుపోవటం ఆశ్చర్యపరిచింది. Feng shui పుణ్యమా అని చిన్నా,పెద్దా వెదురు చెట్లు, నీటిలో తాబేళ్ళు కూడా బాగానే కొంటున్నారు. ఫ్లవర్ ఎరేంజ్మెంట్ పోటిలు ఈసారి జరగలేదేమొ..ఆ స్టాల్ లేనేలేదు..:( బోన్సాయ్ విభాగంలో క్రిందటేడాది పెట్టిన చింతచెట్టునే మళ్ళీ పెట్టారు. కొత్తవాటిల్లో ఒక సీమ చీంతకాయ చెట్టు మాత్రం నాకు నచ్చింది. మొక్కలు పెంచేందుకు కొబ్బరిపీచుతో చేసే మట్టి, మరికొన్ని ఎరువులూ విడిగా కేజీలెఖ్ఖన అమ్ముతున్నారు ఒకచోట. ఇదే మట్టి పదికేజీలు పేక్ చేసి ఐదొందలు దాకా భర చెప్తున్నారు మరో చోట.










క్రిందటి ఏటికీ ఈ ఏటికీ ప్రధానంగా వ్యాపారాత్మకమైన మార్పు నాకు కనబడింది. మొదట్లో కేవలం రకరకాల మొక్కలు, పువ్వులు, చెట్లు మాత్రమే ప్రదర్శనలో ఉంచేవారు. తినుబండారాలు, హెర్బల్ టీ స్టాల్, స్టీవియా, హనీ, రకరకాల హోంమేడ్ వడియాలు, ఆమ్లా టీ, పుస్తకాల స్టాల్, గృహాలంకరణ సామగ్రీ, క్రోకరీ ఎప్పుడూ ఉండేవే. ఉద్యానవన పరికరాలు,  పొలాల్లో పనికొచ్చే పరికరాలు, సోలార్ ఎనర్జీ తో పనిచేసే వస్తువులు మొదలైన అభివృధ్ధి కారకాలైన ఎన్నో పరికరాలు,వస్తువులు కూడా కొన్నేళ్ళుగా ప్రదర్శనలో ఉంచుతున్నారు. 

అవన్నీగాక పెద్ద పెద్ద ఇళ్ళల్లో.. ఉద్యానవనాల్లో ఏర్పరుచుకుందుకు విగ్రహాలు, ప్రత్యేకంగా డిజైన్ చేసిన వృక్షాలు, కుర్చీలు, సెట్టింగ్స్, పంజరంలో పక్షులు మొదలైనవి కూడా ఈసారి ప్రదర్శనలో చోటు చేసుకున్నాయి. ఇది మంచి విషయమే కానీ ప్రదర్సనలో ఎక్కువగా ఉండే మొక్కలు, పువ్వులూ తక్కువయిపోయాయి. ఇంతదాకా  కన్నులపండుగగా సాగిన ఈ ప్రదర్శన ఇకమీదట వ్యాపారాత్మకమైన ప్రదర్శనగా మారిపోతుందని స్పష్టమైపోయింది.  










wheat grass




చివరిగా నాకు అర్థమైందేమిటయ్యా అంటే.. ఏ "ప్రదర్శన" అయినా అది జనాల జేబులు ఖాళీ చేసేందుకు మాత్రమే కనుగొనబడ్డ విజయవంతమైన వ్యాపారాత్మక వ్యవహారము అని !