సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||
Showing posts with label ప్రదర్శనలు - సభలు -ఫోటోలు. Show all posts
Showing posts with label ప్రదర్శనలు - సభలు -ఫోటోలు. Show all posts

Saturday, June 9, 2012

బాపు చిత్రకళా ప్రదర్శన 24-2-74



ఆ మధ్యన నాన్నగారి పుస్తకాలు సర్దుతూంటే ఈ ప్రత్యేక సంచిక దొరికింది. '74 లో రాజమండ్రి లో జరిగిన బాపూ బొమ్మల కొలువన్నమాట ! ఆ పుస్తకం ఇప్పుడు దొరకటం అరుదు కాబట్టి అందులోని చాలామటుకు చిత్రాలకు ఫోటోలు తీసాను బ్లాగ్మిత్రుల కోసం. క్రిందన ఉన్న ఆ చిత్రాలు మీరూ చూసి ఆనందించండి..




పుస్తకం ముందు భాగంలో ఆరుద్ర గారు రాసిన కవిత, శ్రీ ఎం.వీ.ఎల్ గారు బాపూ గారి గురించి రాసిన వ్యాసం కూడా ఫోటోల్లో పెడుతున్నాను. ఫోటో సైజ్ పెద్దగా చేసుకుని ఎం.వీ.ఎల్ గారి వ్యాసం చదవవచ్చు.





















Thursday, April 26, 2012

మార్కొనీ జయంతి సందర్భంగా నాన్నగారికి మరో సన్మానం



నిన్న(Apr 25th) రేడియోని కనిపెట్టిన "మార్కొనీ" జయంతి. ఈ "మార్కొనీ జయంతి" సందర్భంగా రేడియోకి విశిష్ఠ సేవలను అందించిన కొందరు రేడియో ప్రముఖులకు కొన్ని స్మారక అవార్డులను గత కొన్నేళ్ళుగా విజయవాడ కృష్ణవేణీ కియేషన్స్ వారు ఇస్తున్నారు. ఈ ఏటి మార్కొనీ జయంతి సందర్భంగా నిన్నటి రోజున ముగ్గురు రేడియో ప్రముఖులకు సన్మాన పురస్కారాలను అందజేసారు. విజయవాడ కృష్ణవేణీ కియేషన్స్, హైదరాబాదు త్యాగరాయ గాన సభ సంయుక్త ఆధ్వర్యంలో విజయవాడ ఎనౌన్సర్ శ్రీ బి.జయప్రకాష్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. హైదరాబాద్ చిక్కడపల్లిలోని త్యాగరాయగానసభ(కళాసుబ్బారావు వేదిక)లో నిన్న సాయంత్రం ఈ సన్మాన కార్యక్రమం జరిగింది.

ముగ్గురు రేడియో ప్రముఖులు - రేడియో నాటక కళాకారిణి శ్రీమతి శారదా శ్రీనివాసన్ గారికి, విశ్రాంత న్యూస్ రీడర్ శ్రీ ఏడిదగోపాల్రావు గారికీ, విశ్రాంత అనౌన్సర్ శ్రీ ఎస్.బి. శ్రీరామ్మూర్తి గారికి(మా నాన్నగారు) అవార్డులు అందజేసారు. మార్కొనీ వంటి గొప్ప వ్యక్తి జయంతి రోజున ఈ పురస్కారాలను అందుకోవటం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని పురస్కార గ్రహీతలు చెప్పారు.


అవార్డుల వివరాలు:

* విజయవాడ స్టాఫ్ ఆర్టిస్ట్, గాయని స్వర్గీయ వి.బి.కనకదుర్గ స్మారక అవార్డ్ - రేడియో నాటక కళాకారిణి శ్రీమతి శారదా శ్రీనివాసన్ గారికి,
* న్యూస్ రీడర్ తిరుమలశెట్టి శ్రీరాములు స్మారక అవార్డ్ - విశ్రాంత న్యూస్ రీడర్ శ్రీ ఏడిదగోపాల్రావు గారికీ,
* ఆకాశవాణి స్టాఫ్ ఆర్టిస్ట్ స్వర్గీయ శ్రీ గోపాల్ అవార్డ్ - విశ్రాంత అనౌన్సర్ శ్రీ ఎస్.బి. శ్రీరామ్మూర్తి గారికి(మా నాన్నగారు)


ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక సలహాదారు డా.కె.వి. రమణాచారి గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ రిటైర్డ్ ప్రిన్సిపల్ సెక్రటరీ రమణాచారి గారు ఇటీవలే "దేవస్థానం" సినిమాలో ఒక పాత్ర కూడా పోషించారుట. రచయిత, కవి, విమర్శకుడు, రిటైర్డ్ ఆకాశవాణి ప్రోగ్రాం ఎక్జిక్యూటివ్ శ్రీ సుధామ గారు(మన "సుధామధురం" బ్లాగర్) కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. శ్రీ సుధామగారు స్టేజ్ పై మాట్లాడుతూ మన తెలుగుబ్లాగులు గురించి కూడా చెప్పారు. అందులో వారు నా బ్లాగ్ గురించి కూడా ప్రస్తావించటం నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. దూరదర్శన్ సంచాలకులు శ్రీమతి శైలజా సుమన్ గారు కూడా తన ప్రసంగంలో పాత రేడియో రోజులను, తన రేడియో జ్ఞాపకాలనూ తలుచుకున్నారు.


ఈ కార్యక్రమానికి ఆత్మీయ అతిధులుగా హైదరాబాద్ ఆకాశవాణి సంచాలకులు శ్రీ పాలక రాజారావు, హైదరాబాద్ దూరదర్శన్ సంచాలకులు శ్రీమతి మల్లాది శైలజా సుమన్, ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ కార్యవర్గ సభ్యులు శ్రీ ఆలపాటి సురేష్ కుమార్, శ్రీ త్యాగరాయగానసభ అధ్యక్షులు శ్రీ కళా వెంకట దీక్షితులు, ING Life Insurance Co. Ltd బ్రాంచ్ మేనేజర్ శ్రీ వంకదారు హరికృష్ణ పాల్గొన్నారు.



సుధామ గారు :

శ్రీమతి శారదా శ్రీనివాసన్ గారు :

శ్రీ ఏడిదగోపాల్రావు గారు :

ఎస్.బి.శ్రీరామ్మూర్తి గారు(మా నాన్నగారు) :



మా నాన్నగారి గురించి నా బ్లాగ్ లో నేను అదివరకూ రాసిన టపాలు చదవనివారికి ఈ లింక్స్:

http://trishnaventa.blogspot.com/2010/10/blog-post_21.html

http://trishnaventa.blogspot.com/2010/10/2.html

http://trishnaventa.blogspot.com/2010/10/3.html

http://trishnaventa.blogspot.com/2010/10/4_26.html

http://trishnaventa.blogspot.com/2010/10/5.html

http://trishnaventa.blogspot.in/2010/10/6.html

http://trishnaventa.blogspot.com/2010/11/blog-post.html




Tuesday, April 24, 2012

MANGO MELA 2012


మామిడిపళ్ళు పండించటానికి ఎక్కువగా వాడుతున్న "కార్బైడ్" వల్ల ఆరోగ్యానికి ఎంతో హాని జరుగుతున్నందువల్ల కార్బైడ్ వాడకంపై నిషేధం విధించిన విషయం అందరికీ విదితమే. అందువల్ల ప్రతిఏడూ వేసవిలో ఎక్కడపడితే అక్కడ గుట్టలు గుట్టలుగా కనబడే మామిడిపళ్ళు కనబడ్డమే మానేసాయి. హార్టీకల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు హైదరాబాద్ సిటీ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఒక మామిడిపళ్ళ మేళా ఏర్పాటు చేసారు. రాష్ట్రంలోని వివిధప్రాంతాల నుంచి వచ్చిన "కార్బైడ్ రహిత మామిడిపళ్ల విక్రయం" ఈ మేళా లోని ప్రత్యేకత. ఈనెల 1౩ నుంచీ మే నెల పధ్నాలుగు వరకు ఒక నెల పాటు ఈ మామిడిపళ్ల మేళా జరుగుతుందిట.

పేపర్లో చదివి ఈ మేళా ప్రారంభించిన రోజు మేము వెళ్ళాము. అప్పటికి ఇంకా అన్ని ప్రాంతాల నుండీ పళ్ళు రాలేదు. మొదటిరోజు అయినా జనం కూడా బాగా ఉన్నారు. ఆ రోజు వచ్చినపళ్ళు వచ్చినట్లే అయిపోయాయి. కొందరు అక్కడికక్కడే మావిడిపళ్ళు కొనుక్కుని తినేస్తుంటే ఆశ్చర్యం కలిగింది కూడా.






మళ్లీ ఓ వారం తరువాత వెళ్ళాము. కాస్త అన్ని స్టాల్స్ రకరకాల మామిడిపళ్ళతో నిండి ఉన్నాయి. మామిడిపళ్ళ రకాలు కూడా ఎక్కువ కనబడ్డాయి. జిల్లాలవారీగా ఈ ఎగ్జిబిషన్ లో మామిడిపళ్ళ విక్రయం జరుగుతుందిట. ఒక వారం విశాఖ, ఉభయగోదావరి జిల్లాలు, విజయనగరం, కృష్ణా, ఖమ్మం మొదలైన జిల్లాల నుండి పళ్ళు వస్తాయిట. నిన్నటితో ఈ జిల్లాల అమ్మకం అయిపోతుందనుకుంటా.







మాకు బంగినపల్లి, చెరుకురసాలు, సువర్ణరేఖ, పంచదారకలస, భూలోకసుందరి(బాగా ఎర్రగా ఉన్న ఈ పళ్ల గురించి వినలేదు నేను..:)), పెద్దరసాలు,చిన్న రసాలు, పచ్చడి కాయలు మొదలైనవి కనబడ్డాయి. పచ్చడి కాయల కోసం మార్కెట్ లోకి ప్రత్యేకం వెళ్ళక్కర్లేదు మళ్ళీ అని అక్కడే పచ్చడి కాయలు కొనేసాను. ఆవకాయకు ముక్కలు కొట్టి ఇస్తున్నారు కూడా.






ఇవాళ్టి నుంచీ పదిరోజులు గుంటూరు, నెల్లూరు, మెదక్,నిజామాబాద్ మొదలైన జిల్లాల నుంచీ, ఆ తర్వాత చివరిలో నల్గొండ, అనంతపురం, చిత్తూరు, కడప, ప్రకాశం, నల్గొండ మొదలైన జిల్లాల నుండి వచ్చిన మామిడిపళ్ళ అమ్మకం జరుగుతుందిట. ఇక మేళా లో మొదట్లో ఓ పక్కగా తెర్రెస్ గార్డేన్ లో మొక్కలు ఎలా పెంచవచ్చు, ఏ ఏ రకాలు పెంచవచ్చు చెబుతు కొన్ని మొక్కలు పెట్టారు. విత్తనాలూ, గార్డెనింగ్ పరికరాలు కూడా అమ్మకానికి పెట్టారు. జనాలు చూడటానికి పెంచిన కొన్ని బుజ్జి బుజ్జి మొక్కలు భలే ముద్దుగా ఉన్నాయి. వంకాయ, మిరప, కాకర, క్యాబేజ్, ఇంకా ఆకుకూరల మొక్కలతో పాటుగా మామిడి,అరటి,నిమ్మ మొదలైన పెద్ద పెద్ద చెట్లు టెరెస్స్ పై ఎలా పెంచవచ్చో చూపెట్టారు.



















మేళా లో ఓ పక్క సమోసా,చాట్,టీ లాంటివి ఉన్న స్టాల్, మరోపక్క ఫ్రెష్ ఫ్రూట్ ఐస్క్రీం స్టాల్ కూడా ఉన్నాయి. ఇలాంటిదే ఫ్రూట్ ఐస్క్రీం స్టాల్ జనవరిలో జరిగిన హార్టికల్చర్ ఎగ్జిబిషన్ లో కూడా పెట్టారు. మేమూ సీతాఫలం ఐస్క్రీం తిన్నాం. చాలా బాగుంది ఫ్లేవర్.



ఇక్కడ మామిడిపళ్ళ ధరలు కూడా రీజనబుల్ గానే ఉన్నాయి. స్టాల్స్ వాళ్ళు ఇస్తున్న ఈ మేళా లోగోతో తయారు చేసిన ప్లాస్టిక్ కవర్లు కూడా బాగున్నాయి. ఈ మ్యాంగో మేళా ఇంకా మరో ఇరవై రోజుల పాటు ఉంటుంది కాబట్టి కార్బైడ్ రహిత మామిడిపళ్ళు కావాలంటే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో జరుగుతున్న ఈ మామిడి మేళాకి వెళ్ళి కొనుక్కోవచ్చు.


Friday, January 27, 2012

Horti Expo 2012


ఎప్పుడెప్పుడా అని ప్రతి ఏడూ ఎదురు చూసే రోజు నిన్న వచ్చింది. ఊళ్ళో హార్టీకల్చర్ ఎగ్జిబిషన్ మొదలయ్యింది. ప్రతి జనవరి చివరి వారంలో మూడు నాలుగుగురోజులు నగరంలో జరుగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి పూలమొక్కలు, కాయగూరలు, రకరకాల చెట్లూ, బోన్సాయ్ మొక్కలూ, ఎరువులూ, మొక్కల కుండీలు, వ్యవసాయానికి ఉపయోగపడే పరికరాలు మొదలైనవి ప్రదర్శనకూ, అమ్మకానికి పెడతారు. ఎప్పుడు మొదలుపెట్టారో తెలీదు కానీ నేను మొదటిసారి తొమ్మిది,పదేళ్ల క్రితం అనుకుంటా Hitex Exhibition Centre లో ఈ హార్టీకల్చర్ ఎగ్జిబిషన్ చూసాను. అప్పుడు కేవలం మొక్కలు మాత్రమే ప్రదర్శనకూ, అమ్మకానికి ఉండేవి.

పువ్వులు..పువ్వులు..పువ్వులు... 
రంగురంగుల పువ్వులు.. గులాబీలు..చామంతులు...మందారాలు...
రకరకాల ఆకులు... చుట్టూరా పచ్చదనం...
రకరకాల cactus లు, crotons, రంగురంగుల orchids..మత్తెక్కించే లిల్లీ పూలూ...
ఇంకా...గుబులంతా పోగొట్టి కబుర్లాడేవి..
నవ్వులు పూయించేవీ.. ఆహా అనిపించేవీ...
మైమరపించే పువ్వులు...అన్నీ చూసి మైమరచిపోయాను..!!





ఇప్పుడు మూడేళ్ళనుంచీ మిస్సవకుండా ఈ ప్రదర్శనకు వెళ్తున్నాను. ప్రదర్శన లోనూ చాలా మార్పులు వచ్చేసాయి. తినుబండారాల స్టాల్, ఓ పుస్తకాల స్టాల్,  ఓ ఐస్క్రీం స్టాల్.. ఇలా కొత్త కొత్తవి ఇందులో కలిసాయి. ఇంకా నయం natural flower colours తో డిజైన్ చేసిన బట్టలు అంటూ ఓ బట్టల కొట్టు కూడా పెట్టారు కాదు అనుకున్నా..! ఈసారి ప్రదర్శన కన్నా నిరుడు ఇంకాస్త బావుంది అనిపించింది. "ఫ్లవర్ ఎరేంజ్మెంట్" కి ప్రత్యేకం ఓ స్టాల్ ఉండేది. ఈసారి ఉండి కానీ చాలా చిన్నది. నాలుగైదు రకాలకన్నా ఎక్కువ లేవు. పైగా అన్నీ రొటీన్ గా ఉన్నాయి. ఏదేమైనా చుట్టూరా రకరకాల పువ్వులు, పచ్చదనం కాస్తంత ఉన్నా మనసుకు ఆహ్లాదం, చికాకుల్లోంచి కాస్తంత మైమరుపు పుష్కలంగా దొరుకుతాయి. అలా చూసుకుంటే ఈసారి కూడా ఆ ఆనందం నాకు దక్కింది.




ఈసారి బోన్సాయి విభాగంలో అందరి దృష్టినీ ఆకర్షించింది ఈ బుజ్జి చింత చెట్టు



క్రితం ఏడాది ఇలాంటి ఆర్టిఫీషియల్ పువ్వుల ఫోటోలు ఇక్కడ పెట్టాను.




 కూరగాయమొక్కలు పెంచే రకరకాల విధానాలు కూడా చూపెట్టారు ఇలా:




ప్రదర్శనలొ నాకు అస్సలు నచ్చనిది ఈ పూల మొక్కలను మోసే కూలీలు. ఆడవాళ్ళు కూడా బుట్ట కావాలా అని తిరుగుతు ఉంటారు పాపం. జనాలు శుబ్భరంగా మొక్కలు కొనేసుకుని ప్రదర్శన అంతా ఇలా వెనక్కాల తలలపై మొక్కలు మోసే కూలీలతొ తిరగటం నాకెందుకో నచ్చదు...పాపం అనిపిస్తుంది.







ఈసారి ఎక్కువ కూరగాయల మొక్కలకు ఫోటోలు తీశాను. రకరకాల కూరగాయమొక్కలను ఇంట్లో ఎలా పెంచుకోవచ్చునో చూపిస్తూ పెట్టిన స్టాల్స్ చాలా బాగున్నాయి. 





ఎండిపొయిన చెట్టు కొమ్మల్లో బుజ్జి బుజ్జి మొక్కలు ఎలా పెంచారో చూడండి...







అన్నింటికన్నా నచ్చిన మొక్క ఇది. క్రితం సారి ప్రదర్శనలోఇదే పేద్ద చెట్టు పెట్టారు .

ఈసారి ఎక్కువ కూరగాయల మొక్కలకు ఫోటోలు తీశాను. వీటిని చూస్తే నాకు కాకినాడలో చిన్నప్పుడు చూసిన "ఫలపుష్పప్రదర్శనే" గుర్తుకు వస్తుంది.







సజ్జలు



ఈ Expo లో జనాలను ఆకర్షిస్తున్న మరొక స్టాల్ "అరోవా" అనే హెర్బల్ టీ స్టాల్. ఈ హెర్బల్ టీ బాలాజీ ఆయుర్వేదిక్ ఫార్మసీ వాళ్లదిట. పాలు,పంచదార ,కెఫిన్,టీ ఆకులు లేకుండా కేవలం సొంఠి, మిరియాలు, పిప్పలి, జీరక, ధనియాలు,లవంగం, ఇలాచీ, దాల్చిన చెక్క, వాము, కుంకుమపువ్వు మొదలైనవాటితో ఈ హెర్బల్ టీ తయారు చేసారుట. నిమ్మరసం, తేనె కలిపి వేడి వేడిగా స్టాల్ వాళ్లు ఇచ్చిన ఈ టీ(Rs.5/-) నాక్కుడా బాగా నచ్చింది.



ఇంతకీ ఏమీ కొననేలేదు నిన్న. మళ్ళీ వెళ్ళాలి కొనటానికి...!!

క్రితం ఏడాది హార్టీకల్చర్ ఎగ్జిబిషన్ ఫోటోలు: