Wednesday, October 27, 2010

రావుడు నుంచీ "రామం" వరకూ... నాన్న కథ - 5 !!looking at his own creation at mutyalampaDu Art Gallery


Oct 27, 2:30p.m
విజయచిత్ర పత్రిక మొదలెట్టినప్పటి నుంచీ అప్టుడేట్ గా అన్ని సంచికలూ వరుస ప్రకారం క్రమం తప్పకుండా బైండ్ చేయించి పదిలపరిచేది రామం సతీమణి సీత. తన చిన్నప్పటినుంచీ సినిమా హాళ్ళలో రామం కొని పదిలపరిచిన రెండొందలకు పైగా సినిమా పాటల పుస్తకాలు కూడా సీతే బైండ్ చేయించిండి. ఇవన్నీ కాక రామం స్వయంగా వివిధభారతి పోగ్రామ్ల కోసం ఉద్యోగంలో చేరకముందే దాదపు మూడువేల తెలుగు సినిమాపాటల రెడీ రికనర్(జంత్రీ), సినీ సంగీతదర్శకుల వ్యక్తిగత జంత్రీ, గేయ రచయితల జంత్రీ, శీర్షిక గీతాల జంత్రీ ఇవన్నీ సర్వకాల సర్వావస్థల్లో రామం భుజానికి తగిలించుకునే సంచీలో సిధ్ధంగా ఉండేవి. "సీతామాలక్ష్మి" సినిమాలో "అలలు కదిలినా పాటే, ఆకు మెదిలినా పాటే.." అన్నట్టు ఆ ముఫ్ఫై సంవత్సరాలలో ఎప్పుడు రామాన్ని కదిపినా పాటే. హిందీ, తెలుగు సినిమా పాటల్లో ఓపినింగ్ మ్యూజిక్ బిట్ గానీ, చరణాల మధ్యన వచ్చే ఇంటర్ల్యూడ్ మ్యూజిక్ గానీ, ఏది చెప్పినా ఆ పాట మొత్తం చెప్పే చాకచక్యం ఆ రోజుల్లో(ఇప్పటికీ) రామం సొంతం. ఈ సంగీత పరిజ్ఞానమంతా రేడియో కార్యక్రమాల తయారీకి ఎంతో దోహదపడేది. సినిమాపాటలతోనేకాక సినీపరిశ్రమకు చెందిన సాంకేతిక సమాచారాన్ని కూడా తనను విశేషంగా అభిమానించే రేడియో శ్రోతలకు అందించాలనే సదుద్దేశంతో యువవాణి విభాగంలో కూడా "వెండితెర వెలుగు జిలుగులు" శీర్షికతో కొన్ని సీరీస్ ప్రసారం చేసాడు రామం.(తన రేడియో శ్రోతల్ని "శబ్దమిత్రులు" అని సంబోధించి, వారికి మొట్టమొదట ఆ పేరు పెట్టినవాడు రామమే). సినిమాలలో విశాల పరిధి, నిడివి గల చిత్రాలను ’సినిమా స్కోప” అని పిలిచినట్లే తను నూతనంగా ప్రయోగాత్మకంగా శ్రోతల కోసం ప్రత్యేకంగా రూపొందించిన కార్యక్రమానికి "రేడియోస్కోప్ మల్టి కలర్ ప్రోగ్రాం" అని నామకరణం చేసిందీ రామమే. వీటన్నింటిలోనూ ఈనాటి ప్రైవేట్ ఎఫ్.ఎమ్ ఏంకర్ల వడి వేగం ఆనాడే రామం గొంతులో పలకటం ఆశ్చర్యంగా ఉంటుంది. ఏ వినూత్న ప్రయోగాన్నైనా ఎంతో అభిమానంగా, ఆనందంగా స్వీకరించేవారు ఆనాటి రామం శ్రోతలు.


తన ముఫ్ఫై ఏళ్ళ రేడియో ప్రస్థానంలో వివిధ రంగాలకు చెందిన ఎందరో ప్రముఖులతో పరిచయ కార్యక్రమాలు చేయటానికి రామానికి అవకాశం వచ్చింది. అందునా సినీ, సాంస్కృతిక, సాహిత్య, కళారంగాలకు విజయవాడ కేంద్ర బిందువు కావటంతో ఎంతో మంది ప్రముఖులు విజయవాడ రేడియో కేంద్రానికి వస్తూ ఉండేవారు. రామం వివిధభారతి వాణీజ్యవిభాగంలో పనిచేయటం వల్ల ఇటువంటి ఎందరో ప్రముఖులను రేడియో శ్రోతలకు పరిచయం చేసే మహాభాగ్యం కలిగింది. అందులో కొన్ని వివిధభారతి కోసం మాత్రమే చేసిన ప్రత్యేక జనరంజని కార్యక్రమాలు. 1971లో రామం హైదరాబాద్ వివిధభారతి కేంద్రంలో కేజువల్ అనౌన్సర్గా చేస్తున్నప్పుడు "సంబరాల రాంబాబు" చిత్రం ప్రదర్శిస్తున్నకాలంలో గాయకుడు బాలు హైదరాబాద్ రావటం తటస్థించింది. ఆ సందర్భంగా గాయకుడు బాలుతో రామం చేసిన పరిచయ కార్యక్రమం(ప్రత్యేక జనరంజని) హైదరాబాద్ వాణిజ్యవిభాగంలో ప్రసరమైంది. ఒక రకంగా చెప్పాలంటే ఇద్దరికీ అదే మొదటి పరిచయకార్యక్రమం. బాలు రేడియోలో పాల్గొన్న తొలి తెలుగు పరిచయ కార్యక్రమం కూడా అదే.


interview with kamal hasan

interviews with Daasari, Bharani, Sirivennela, actress Roja


అలాగే తను విజయవాడ కేంద్రానికి మారాకా సినీరంగానికి చెందిన సావిత్రి, అంజలి, విజయ నిర్మల, కె.విశ్వనాథ్, జగ్గయ్య, ముళ్ళపూడి, కమల్ హాసన్, పద్మనాభం, సిరివెన్నెల, తనికెళ్ల భరణి, దాసరి, రోజా, సంగీతదర్శకులు పెండ్యాల, మాష్టర్ వేణూ; ఇతర కళారంగాలకు చెందినవారిలో కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు, ప్రముఖ నాట్యాచార్యులు నటరాజరామకృష్ణ, విజయచిత్ర కెమేరామేన్ కె.ఆర్.వి.భక్త("అందాలరాశి" చిత్రనిర్మాత) మొదలైన ఎందరెందరో ప్రముఖులతో ఇంటర్వ్యూ లు రికార్డ్ చేసి, ప్రసారం చేసే అవకాశం లభించింది. విజయవాడ కేంద్రానికి లేదా ఊళ్ళోకి ఏ ప్రముఖులొచ్చినా రేడియోలో వారిని పరిచయం చెయ్యటానికి రామానికే ఎక్కువ ఆహ్వానాలు లభించటం ఒక పక్క ఆనందాన్ని కలగజేసినా రాను రానూ శలవురోజు అయినా, డ్యూటీ ముగించికుని వచ్చి నిద్రోతున్నా కేంద్రానికి దగ్గరగా క్వార్టర్స్ లోనే ఉండటంవల్ల ఈ పిలుపుల తాకిడి మరీ ఎక్కువై, కొంత బాధాకరంగా పరిణమించాయి అనటం అతిశయోక్తి కాదు. దీనికి తోడు ప్రొఫెషనల్ జెలసీ ఉండనే ఉండేది. అందుకే కొన్నిసార్లు తప్పించుకోక తప్పేది కాదు.


interview with Sri V.A.K.Rangarao


*** *** ***

ఆకాశవాణి జాతీయ అవార్డ్ ల పరంపర లోకి రామం ప్రవేశించటం విచిత్రంగా జరిగింది. వారం వారం వివిధభారతి శ్రోతల కోసం అతను రూపొందించే ఒకానొక కార్యక్రమంలో "సినిమా ట్రైలర్" అనే వినూత్న ప్రయోగాన్ని రామం ఒకసారి చేసాడు. (ఈ "సినిమా ట్రైలర్" నే "సాహిత్యాభిమాని బ్లాగర్ "శివ"గారు ఆ మధ్యన వారి బ్లాగ్లో టపాగా పెట్టారు.) అది మొట్టమొదటిసారి రూపొందించినప్పుడు దానిలో వ్యాఖ్యానం ప్రముఖ రచయిత, కవి, రేడియోమిత్రులు ఇంద్రగంటి శ్రీకాంతశర్మగారు చదివారు. ఆ ప్రోగ్రాం ఎడిటింగ్ చేస్తూండగా అప్పట్లో హైదరాబాద్ స్టేషన్ డైరక్టర్ శ్రీనివాసన్ గారు అనుకోకుండా వచ్చి విని, "ఇదేదో ఇన్నోవేటివ్ ఐడియాలా ఉందయ్యా. దీన్ని నేషనల్ అవార్డ్ కు పంపకూడదు" అన్నరు. కానీ రామం పట్టించుకోలేదు. మళ్ళీ కొంతకాలం తరువాత ఆయనే వచ్చి "ఏం చేసావ్ నే చెప్పిన ఐడియా?" అని రెట్టించారు. ఇక తప్పదనుకుని ఆ చిన్న ఐడియా చుట్టూ మరికొన్ని నూతన ప్రయోగాలను జోడించి ఓ అరగంట ప్రోగ్రాం చేసాడు రామం. ఈసారి ఒక మార్పు కోసం సినిమా ట్రైలర్ వ్యాఖ్యానం కో-అనౌన్సర్, గాయకుడు, హాస్యప్రియుడు అయిన మల్లాది సూరిబాబుగారితో చదివించాడు. అదే రామానికి మొట్టమొదటి జాతీయ బహుమతి తెచ్చిపెట్టిన "నీలినీడలు". విజయవాడ కేంద్రానికి కూడా ఇన్నోవేటివ్(సృజనాత్మక) విభాగంలో తొలి జాతీయ బహుమతి.


రామానికి ఈ పంధా నచ్చి ఆ దారిలోనే అనేక సృజనాత్మక కార్యక్రమలకు రూపకల్పన చేసాడు రామం. ఇంచుమించు ప్రతిసారీ ఢిల్లీ న్యాయనిర్ణేతలకు(జ్యూరీకి) కూడా ఆ కాన్సెప్ట్ నచ్చి అవార్డ్లు ఇస్తూ వచ్చారు. మధ్య మధ్య రైతులు పంట మార్పిడీ చేసినట్లు ఒకోసారి మార్పు కోసం ఓ మంచి నాటకాన్నీ, మరోసారి మంచి సంగీతరూపకాన్ని, ఇంకోసారి మంచి ఇతివృత్తంతో ఉన్న డాక్యుమెంటరీనీ రూపొందించి పోటీలకు పంపేవాడు రామం. అన్ని విభాగాలలో బహుమతులను సొంతం చేసుకున్నాడు అతను. అవార్డ్ ఇచ్చిన ప్రతిసారీ 'for best sound recording and music mixing' అని సైటేషన్ చదివి అవార్డ్ ఇచ్చేవారు. దాని కోసమే తాను ఢిల్లీ దాకా వెళ్ళేవాడు. కేవలం రెండు మూడు మైకులతో రికార్డింగ్ చేసే చిరకాల ఆకాశవాణి పధ్ధతికి స్వస్తి చెప్పి ఏడెనిమిది చానల్స్లో మ్యూజిక్ రికార్డింగ్ చేసి, సింగిల్ ట్రాక్ పైనే మల్టీఛానల్ రికార్డింగ్ ఎఫెక్ట్ వచ్చేలాగ ఎంతో శ్రమించేవాడు సౌండ్ ఇంజినీర్ రామం. ఇందుకోసం రికార్డింగ్ స్టూడియోలో ఎన్నో మార్పులు చేర్పులూ, కొత్త పరికరాలు మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసాడు రామం. దానికి ప్రతిఫలం ఢిల్లోలో దక్కేది. 'ఇది ఆకాశవాణి రికార్డింగ్ కాదు, బయట కమర్షియల్ స్టూడియోలో రికార్డ్ చేసినది' అని ఢిల్లీ పెద్దలు అనుమానం వ్యక్తపరిచేవారు కూడా.


ఈ అవార్డ్ కార్యక్రమాల పరంపర 1980 నుంచీ 2000 వరకూ నిరవధికంగా కొనసాగింది. మిగిలిన అవార్డ్ ప్రోగ్రాముల వివరాలు....


(తదుపరి భాగంలో...)