సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||
Showing posts with label కొన్ని పుస్తకాలు. Show all posts
Showing posts with label కొన్ని పుస్తకాలు. Show all posts

Thursday, October 10, 2013

మట్టిమనిషి





"పుట్టినవాళ్ళందరూ ఎప్పుడో ఒకప్పుడు చచ్చిపోయేవాళ్ళేరా! అసలు మనం పుట్టింది ఏడవటానికంటరా? బతకటానికిరా! బతకటానికి. బతికినన్నాళ్ళూ మగసిరిగా బతకాలి! ఒకళ్ళను దేహీ అంటూ అడక్కూడదు. అడ్డం వచ్చిన వాటిని నరుక్కుంటూ వెళ్ళాలి! చేతగాని వాడే ఏడుస్తాడు. చేతుల్లో సత్తువ ఉన్న వాడెవ్వడూ ఏడవకూడదు. సంతోషంగా బతకాలి! మనిషికి సంతోషం ఎక్కడుందంటావా? కష్టపడి పని చెయ్యడంలో ఉంది. చెమటోడ్చి భూమి దున్నటంలో ఉంది. రెక్కల కష్టం అక్కరకు రావటంలో ఉంది. మన కష్టార్జితం మన చేతుల్లో కొచ్చినప్పుడు ఉండే ఆనందంలాంటిది ఈ భూమ్మీదే మరొకటి లేదురా బాబూ!"
అంటాడు సాంబయ్య మనవడితో! ఎంత చక్కని ఫిలాసఫీ! 

ఇది సాంబయ్య తనకు తానుగా గ్రహించుకున్న జీవనసారం. మట్టిలో పుట్టి మట్టిలో పెరిగి, మట్టినే నమ్ముకు బ్రతికిన ఓ 'మట్టిమనిషి' నేర్చుకున్న జీవన వేదాంతం. 


'సాంబయ్య' డా.వాసిరెడ్డి సీతాదేవి రచించిన "మట్టిమనిషి" నవల లో ప్రధాన పాత్రధారి(Protagonist). కథంతా అతని చుట్టూతానే అల్లుకుని ఉంటుంది. 'ఆంధ్రప్రభ' దినపత్రిక, ఆదివారం అనుబంధంలో ధారావాహికగా ప్రచురణ పొందిన ఈ నవల విశేషంగా పాఠకుల ఆదరణ పొందింది. 1972 లో పుస్తక రూపంలో వచ్చిన తరువాత మరో రెండుసార్లు పునర్ముద్రితమైంది. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వారి ఉత్తమ నవల పురస్కారాన్ని అందుకుంది. నేషన్ బుక్ ట్రస్ట్ వారు పధ్నాలుగు భాషల్లోకి అనువదించారు ఈ పుస్తకాన్ని. ఉస్మానియా విశ్వవిద్యాలయంవారు ఫైనల్ ఎం.ఎ. విద్యార్థులకు పాఠ్యగ్రంధంగా కూడా నిర్ణయించారు. ఇంతటి విశేష ప్రాముఖ్యత పొందిన ఈ సామాజిక నవలలో అప్పటి సమకాలీన సమాజంలోని దురన్యాయాలను, అప్పటికే పతనమవుతున్న భూస్వామ్య వ్యవస్థ లోటుపాట్లను కళ్లముందుంచారు సీతాదేవిగారు. తెలుగు నవలాసాహిత్యంలో ఎన్నదగిన పది ఉత్తమ నవలల్లో ఈ నవల కూడా చోటుచేసుకుని ఉంటుందని పుస్తకం పూర్తయ్యాకా నాకనిపించింది. 




 

సీతాదేవి గారి రచనా శైలి, సామాన్య రైతు జీవితాన్ని ఆవిష్కరించిన తీరు, పాత్రల చిత్రణ, నిశితమైన మనస్తత్వ చిత్రణ అన్ని ఎంతో వాస్తవికంగా, వివేచనాత్మకంగా ఉన్నయి. ఒకవైపు ప్రభుత్వోద్యోగం చేస్తునే సీతాదేవి గారు నవలలు, కథా సంపుటాలూ, వ్యాస సంకలనాలు, పిల్లల కథా సంపుటాలు, అనువాదాలు రాసారంటే నిజంగా అభినందనీయులు. ఆవిడ పలు జాతీయ పురస్కారాలు కూడా అందుకున్న వివరాలు, వాటి పేర్లు నవల వెనుకవైపు రాసారు.


సుమారు ఏడాదిన్నర క్రితం కొన్న ఈ పుస్తకాన్ని మొన్న ఓ వంద పేజీలు చదివాకా తప్పనిసరిగా మూసేయాల్సి వచ్చింది. మిగిలిన మూడొండల పేజీలూ నిన్న ఏకబిగిన మూడుగంటల్లో పూర్తిచేసానంటే క్రెడిట్ అంతా నా కళ్ళను పరిగెత్తించిన ఆ రచనా శైలిదే! ఇంతకు ముందు ఆవిడ పుస్తకాలేమీ చదవలేదు కానీ ఈ ఒక్క పుస్తకం మాత్రం నన్నెంతో ఆకట్టుకుంది. అసలు నిన్న రాత్రంతా కలత నిద్రలో సాంబయ్య, కనకయ్య, రామనాథబాబు, రవి, వరూధిని...అలా కదులుతూనే ఉన్నారు కళ్లముందు! ఎంతగానో కదిలించేసింది నన్నీ కథ..! విశృంఖల ప్రవర్తనతో జీవితాన్ని నాశనం చేసుకున్న వరూధిని చావుపై కూడా జాలి పుట్టించేంతటి పట్టు ఉన్న కథనం. కొన్ని పుస్తకాలింతే.. మనసునీ, ఆలోచనల్నీ తమ వశం చేసేసుకుంటాయి.


మూడు తరాల జీవితాలలో వివిధ పరిణామాలను సమర్థవంతంగా, ఎంతో దృశ్యాత్మకంగా అక్షరీకరించారు సీతాదేవి గారు. ప్రతి సన్నివేశం ఒక పుస్తకాన్ని చదువుతున్నట్లు కాక, మనోఫలకంపై ఒక దృశ్యాన్ని చూపెడుతూ ఉంటుంది పాఠకుడికి. ఉత్తరాది నుండి కట్టుబట్టలతో ఆ ఊళ్ళోకి వచ్చిన వెంకయ్య, మోతుబరి రైతు వీరభద్రయ్య దగ్గర పాలేరుగా కుదిరి, కష్టపడి కౌలు వ్యవసాయం చేసి, పదేళ్ళలో రెండెకరాల పొలం కొనే స్థాయికి ఎదుగుతాడు. కొడుకు సాంబయ్యకు దుర్గమ్మనిచ్చి పెళ్ళి చేస్తాడు. చమటోడ్చి సంపాదించిన ఐదెకరాల పొలాన్ని కొడుకుకి మిగిల్చి వెంకయ్య చనిపోతాడు. కొడుకు పుట్టేనాటికి సాంబయ్య ఏడెకరాల మాగాణి, మూడెకరాల మెట్ట ఉన్న చిన్నకారు రైతు. బడికి కాక, కొడుకు వెంకటపతిని తనతో పాటుగా పొలానికి తీసుకెళ్లటానికే నిర్ణయించుకుంటాడు సాంబయ్య. వెంకటపతి పెళ్ళిడుకొచ్చేసరికీ  ఎనభై ఎకరాల సుక్షేత్రమైన మాగాణి, సుమారు పాతికవేల కవిలె, దొడ్లూ దోవలు, కొత్తగా కట్టిన డాబాఇల్లు గల షావుకారవుతాడు
సాంబయ్య. ఊళ్ళో అతని పరపతి పెరుగుతుంది. అదృష్టం అందలం ఎక్కిస్తే బుధ్ధి బురదలోకి లాగిందన్నట్లు ఒక చిత్రమైన కోరిక పుడుతుంది సాంబయ్యకి. తన తండ్రి పాలేరుగా చేసిన వీరభద్రయ్య కొడుకు బలరామయ్య తో వియ్యమొందాలని! ఆస్తి హరించుకుపోయి అప్పుల్లో కూరుకుపోయి ఉన్న బలరామయ్య గత్యంతరం లేక ఆఖరి కుమార్తె వరూధినిని వెంకటపతికిచ్చి వివాహం జరిపిస్తాడు. ఈ వ్యవహారమంతటికీ ముఖ్యకర్త, మధ్యవర్తి గుంటనక్కలాంటి కనకయ్య!


 రైతులకూ పెట్టుబడిదారులకూ మధ్యవర్తిగా ఉంటూ, ఊరువాళ్ల దయాధర్మాలతో సంసారం నడుపుతూ, చిన్నచిన్న పెట్టుబడులతో వ్యాపారం ప్రారంభించి, ఏదో ఒక దోవన లాభాలార్జించి భూస్వామిగా మారిన ఊసరవెల్లి కనకయ్య. ఒకనాడు బక్కపలచగా,తొండిలేక ఆవురావురుమన్న కనకయ్య కాలువగట్టు క్రింద పదెకరాల పొలం, తాను రైతుల ధాన్యం అమ్మించిన మిల్లులోనే పావలా వాటాదారు అవుతాడు. నాలుగువేలతో ఇల్లు బాగుచేసుకుని మేడ కడతాడు. మోసాలతో ధనార్జన చేసి కొడుకునీ,అల్లుడ్నీ లాయర్లను చేస్తాడు. అక్రమార్జనతో బలరామయ్య మేడను కూడా కొని, చివరికి ఆ ఊరి సమితి ప్రెసిడెంట్ కూడా అవుతాడు. సమకాలీన వ్యవస్థలోని లోటుపాట్లకు ప్రతీక అతని పాత్ర.




పట్నవాసపు మోజుతో పల్లె వదిలిన సాంబయ్య కోడలు వరూధిని వెనకాల పెళ్లాం చాటు మొగుడిగా మారిన వెంకటపతి తండ్రిని వదిలేస్తాడు. తన మొండితనం వల్ల, అజాగ్రత్త వల్ల, అదుపులేని నడవడి వల్లా, జీవితాన్ని అభాసుపాలు చేసుకుంటుంది వరూధిని. కనకయ్య వంటి గుంటనక్కల వల్ల, రామనాధబాబు
వంటి మోసకారులవల్ల, వెంకటపతి చేతకానితనం వల్లా, సాంబయ్య చెమట చిందించి సంపాదించిన ఆస్తంతా కర్పూరంలా హరించుకుపోతుంది. ఓ దిబ్బ మీద పూరిపాకలో ఒంటరిగా మిగులుతాడు సాంబయ్య! 


భార్య హఠాన్మరణం తరువాత తండ్రికి మొహం చూపలేని వెంకటపతి కాన్వెంట్ లో చదువుతున్న తన కొడుకుని ఊరిపొలిమేరల్లో తాత వద్దకు వెళ్లమని వదిలి వేళ్పోతాడు. అదంతా ఎలా జరిగింది? అంత ఆస్తి ఎలా హరించుకుపోయింది? వరూధిని ఎలా మరణించింది? తన ఆస్థిని సర్వనాశనం చేసిన కొడుకు వారసుడైన తన మనవడు రవిని సాంబయ్య చేరదీస్తాడా? చివరికి ఏమవుతుంది? మొదలైన ప్రశ్నలకి సమాధానలు తెలుసుకోవాలంటే నవల చదవాల్సిందే మరి :)


పట్నానికి తీసుకెళ్ళి భార్య ప్రాణాలు కాపాడలేని పరమ పిసినారిగా సాంబయ్య పాత్రను చిత్రీకరించినప్పటికీ, ఎందుకో అతనిపై ద్వేషం, కోపం కలగవు. మట్టిని నమ్ముకున్న అతడి ఆత్మవిశ్వాసానికీ, వృధ్ధాప్యంలో కూడా ఓటమి అంగీకరించని అతని పట్టుదలకూ అతడ్ని మెచ్చకుండా ఉండలేము. ఓ సందర్భంలో "హౌ కౄయల్ యు ఆర్? తాతయ్యా!" అంటాడు మనవడు. అందుకు సమాధానం చెప్తూ, "దున్నుతూ దున్నుతూ కాడి మెడమీద వేసుకుని పోయిండిరా! దాని ఋణం అది తీర్చుకుని హాయిగా కన్నుమూసింది. అదృష్టం అంటే దాందేరా! మనుషులకు కూడా రాదురా ఆ అదృష్టం!" అంటాడు. ఎంతటి జీవనసత్యం దాగిఉందో ఆ మాటల్లో! 

మరోసారి - "తాతయ్యా నీకు చదువు రాదుగదా! ఇదంతా నువ్వెట్టా నేర్చుకున్నావ్?" అనడుగుతాడు మనవడు.. అప్పుడు..
"ఈ నేల నా పలక. నాగలే నా బలపం. పొలమే నా బడి! భూమ్మీద దిద్దాను. రోజుకి ఒక్కొక్కమాట ఈ భూమే నేర్పింది నాకు. నా తల్లీ,దైవం, గురువూ ఈ భూమేరా రవీ! ఇప్పుడు చెప్పరా మనవడా? నీ బడి గొప్పదో నా బడి గొప్పదో? నీచదువెక్కువో నా చదువెక్కువో?" అంటాడు సాంబయ్య! 

ఇతను కదూ జ్ఞాని !
చివర్లో మరోసారి  "ఈ నేలా, ఈ గాలీ, ఈ ఆకాశం చమటోడ్చేవాడి సొత్తురా! అందలమెక్కినోడిది కాదురా!" అంటాడు అతను.
నవలాసారం కూడా ఇదే!


ఇలా నాకనిపించడం యాదృచ్ఛికమో, ప్రేరణో ఉందోలేదో తెలీదు కానీ నాకీ నవల చదువుతూంటే రెండు  ఆంగ్ల నవలలు గుర్తుకు వచ్చాయి. ప్రఖ్యాత అమెరికన్ రచయిత్రి, నోబుల్ పురస్కార గ్రహీత 'Pearl Buck' రాసిన 'The Good Earth', Thomas Hardy నవల 'The Mayor of casterbridge'. 'The Good Earth'లో protaganist 'wang lung';  '
The Mayor of casterbridge' లో protaganist  'Henchard'. ఈ మూడు నవలల్లోనూ protaganist  ది ఒకటే దుస్థితి.. రెక్కల కష్టం వల్లనే సామాన్యుడి నుండి ధనికుడిగా ఎదగడం, ఆ తర్వాత మళ్ళీ ఏదో కారణాన పతనమైపోయి మళ్ళీ సామాన్యుడైపోవడం. కథ, కారణాలు మాత్రమే వేరు వేరు. ఒకవేళ ఎక్కడైనా వీటి ప్రేరణ ఉండిఉన్నా కూడా "మట్టి మనిషి"కి స్వాతంత్ర్యంగా నిలబడి ఒక గొప్ప నవల అనిపించుకోదగ్గ లక్షణాలన్నీ ఉన్నాయి. సాహిత్యాన్ని అభిమానించే ప్రతి పాఠకుడూ తప్పక చదవవలసిన నవల ఇది!

Wednesday, August 21, 2013

'మరువ’పు పరిమళాలకి ఆప్తవాక్కులు...


పుస్తకావిష్కరణకు వెళ్ళలేకపోయినా కాపీ పంపే ఏర్పాటు చేసి, నాకీ సదవకాశాన్ని ఇచ్చిన  స్నేహమాధురి ఉషగారికి బ్లాగ్ముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను..



అనుభూతులు అందరికీ ఉంటాయి. వాటికి అక్షరరూపాన్ని ఇవ్వటం కొందరికి సాధ్యమే కానీ ఆ అక్షరాలకు కవితారూపాన్నివ్వటం మాత్రం అతికొద్దిమందికే సుసాధ్యమౌతుంది. అందుకు భాష మీద పట్టు, భావావేశాలను అందమైన పదగుళికలుగా మార్చగల నేర్పూ అవసరం. ఉషగారి కవితలు చూసి అందమైన కవితాకదంబాలను నేర్పుగా అల్లగల అక్షర గ్రంధాలయమేదో ఈవిడ చేతుల్లోనో, వ్రేళ్ళలోనో ఉందేమో అనుకునేదాన్ని. జీవన రహస్యాలని కాచి వడబోసారేమో అని కూడా అనిపిస్తుంది ఉషగారి కవితలు చదివినప్పుడల్లా! తాత్విక చింతన, జీవితం పట్ల ప్రేమ, సున్నితమైన హృదయం, ప్రకృతారాధన, పుత్రవాత్సల్యం, మాతృభూమి పట్ల మమకారం.. అన్నింటినీ మించి తెలుగు భాష పట్ల అభిమానం కనిపిస్తాయి ఉషగారి రచనల్లో. వీటన్నింటికీ కవిత్వంలో తనకు గల అభినివేశాన్ని రంగరించి ఆమె అందించిన కవితాకదంబమాలల్ని రోజులు, నెలలు తరబడి ఆస్వాదించే అవకాశం బ్లాగ్లోకం ద్వారా మా మిత్రులందరికీ లభించింది. "మరువం" బ్లాగ్ ద్వారా తాను అందించిన ఈ కవితాసుమాలతో మరోసారి ఇలా మిత్రులందరికీ కనువిందు చేయాలని సంకల్పించటం ముదావహం.


అనుభవం నేర్పిన పాఠాలను మరువకుండా, బ్రతుకుబాటకు వాటిని నిచ్చెనగా చేసి విజయాలను అందుకున్న విజేత ఈమె. "లెక్కలు", "నిక్షిప్త నిధి", "బహుదూరపు బాటసారి", "జీవితం" మొదలైన కవితలు తన అనుభవసారాన్ని తెలుపుతాయి. "గమనాల గమకం", "గోడ మీద నీడలు", "కల కాలం", "శృతిలయలు", "నిను చేరక నేనుండలేను", "ఏకాకి", "నిర్వచనం", "గాయం" మొదలైన కవితలు అంతరాంతరాల్లోని అంతర్మధనానికి, తాత్విక దృష్టికోణానికీ ప్రతీకలు. "అక్షరమా నీకు వందనం" అని వాగ్దేవికి అక్షరాంజలి ఘటించి, "మహాశ్వేతం" అంటూ శ్వేతవర్ణాన్ని రారాణిని చేసి, "మంచుపూల పేరంటాన్ని" కళ్ళకు కట్టి, "పిచ్చుక"తో "ఆనందహేల" నందించిన కవితావాణి మా ఉషారాణి. "శీర్షిక పెట్టాలనిపించకపోయినా", "వలపుల వానచికులు" చిలకరించినా, "కవి హృదయాన్ని" ఆవిష్కరించినా ఈమెకే సాధ్యం అని తప్పక అనిపిస్తాయి ఆమె అక్షరాలు !


ఉషగారి కవిత్వంలో నచ్చనిదేదంటే చెప్పటం కష్టమే అయినా కవితాశీర్షికలు కొన్నింటికి వేరే పేరు ఉంటే ఇంకా బాగుండేదని అనిపిస్తుంది నాకు. రాయగలిగే అవకాశం, శక్తి ఉన్నంతవరకూ తను రాస్తూ ఉండాలని నా కోరిక.
అందరికీ సౌలభ్యం కాని ప్రతిభాపాటవాల్ని చేతిలో దాచుకోవటమే కాక తన బ్లాగ్ ను కూడా దాచేయటమే నాకు ఈవిడలో అస్సలు నచ్చని సంగతి! కవిత్వాన్ని చదివి ఆస్వాదించటమే తప్ప విశ్లేషించి, విమర్శించేంతటి జ్ఞానం లేకపోయినా ఈ నాలుగుమాటలు రాసే అవకాశాన్ని సహృదయతతో అందించిన స్నేహశీలి ఉషగారికి నా కృతజ్ఞతాభినందనలు.

- తృష్ణ.

Thursday, July 25, 2013

'తొవ్వ ముచ్చట్లు' - చిల్లోడి కొండప్ప




పొద్దుటి పేపరు ఇప్పుడు తిరగేస్తుంటే ఈ ఆసక్తికరమైన ఆర్టికల్ కనబడింది. జయధీర్ తిరుమలరావు గారు రాసిన "తొవ్వ ముచ్చట్లు" అనే పుస్తకం గురించిన వ్యాసం. అందులో అరకులోయ దగ్గరలో ఉన్న 'సొంపి' గ్రామానికి చెందిన "చిల్లోడి కొండప్ప" అనే గిరిజన వైద్యుడి గురించిన వివరాలు ఆసక్తికరంగా ఉన్నాయి. వ్యాసం చాలా నచ్చింది నాకు. వీలైతే ఈ పుస్తకం కొనుక్కోవాలి.

ఎవరికైనా ఉపయోగపడుతుందని లేదా నాలా ఆసక్తి ఉన్నవాళ్ళు చదువుతారని ఇక్కడ లింక్ ఇస్తున్నాను..

ఇవాళ్టి ఆంధ్రజ్యోతి అనుబంధం నవ్య మొదటి పేజీ ఆర్టికల్:
http://epaper.andhrajyothy.com/PUBLICATIONS/AJ/AJYOTHI/2013/07/25/ArticleHtmls/25072013101022.shtml?Mode=1

Monday, May 27, 2013

"త్రిపుర" గారి రేడియో ఇంటర్వ్యూ + ఒక కథానిక, వారి కథా రచనల మీద డా.వి.చంద్రశేఖరరావు గారి అభిప్రాయం


'ఇవి కథలా, కవితలా? కథల్లాంటి కవితలా? కవితల్లాంటి కథలా?'
'ప్రతి కథ గురించీ సమీక్షిస్తే పరిచయం అసలు కథ కన్నా పెద్దదవుతుంది.'
'ఈ కథలు చదువుతుంటే, నేను ఇలాంటివి రాయగలనా అనిపించింది.' 
అంటారు 'పాలగుమ్మి పద్మరాజు'గారు.. "త్రిపుర కథలు" పుస్తకంలోని తన పరిచయవాక్యాల్లో. 



పద్మరాజుగారి ప్రశంసను అందుకున్నది విలక్షణమైన కవీ, కథకుడు శ్రీ రాయసం వేంకట త్రిపురాంతకేశ్వరరావు. "త్రిపుర" పేరుతో అతి తక్కువ రచనలు చేసి ఎంతో ప్రత్యేకతను సొంతం చేసుకున్న నైరూప్య చిత్రకారుడు. ఒక తాత్విక రచయిత. ఇంతకు మించి వారి గొప్పతనం గురించి చెప్పేంత సాహసం చెయ్యను. ఎందుకంటే సాహిత్యం గురించి ఏమీ తెలియని చిన్నతనంలో మా ఇంట్లో ఉన్న త్రిపుర కథల పుస్తకం చదవడానికి ప్రయత్నించిన అజ్ఞానిని. ఇప్పుడు సాహిత్యసాగరం లోతులు తెలిసిన సంపూర్ణ అజ్ఞానిని. 


త్రిపుర గారి మరణవార్త తెలిసాకా, నా దగ్గర ఉన్న రెండు ఆడియో లింక్స్ బ్లాగ్ లో పెట్టాలని... రకరకాల సాంకేతిక ఇబ్బందుల తర్వాత ఇప్పటికి కుదిరింది. అవి.. త్రిపుర గారి రేడియో ఇంటర్వ్యూ ఒకటి, రెండవది ఆయన కథానిక + కథా రచనల మీద డా.వి.చంద్రశేఖరరావు గారి అభిప్రాయం.  


1) "త్రిపుర" గారితో పన్నాల సుబ్రహ్మణ్య భట్టు గారు చేసిన ఒక రేడియో ఇంటర్వ్యూ ఇక్కడ వినటానికి పెడుతున్నాను. ఇది 1999 march 20న విజయవాడ ఆకాశవాణి కేంద్రం ద్వారా ప్రసారమైంది. 

 



2) 'గొలుసులు-చాపం-విడుదల భావం' కథానిక + త్రిపుర కథా రచనల మీద 'డా.వి.చంద్రశేఖరరావు' గారి అభిప్రాయం:




***     ***

"త్రిపుర" గారి గురించి అంధ్రజ్యోతిలో ఇవాళ వచ్చిన వాడ్రేవు చినవీరభద్రుడుగారి వ్యాసం:

http://epaper.andhrajyothy.com/PUBLICATIONS/AJ/AJYOTHI/2013/05/27/ArticleHtmls/27052013004003.shtml?Mode=1


Vadrevu Ch Veerabhadrudu గారి మాటల్లో:
"త్రిపురగారి మీద నా వ్యాసం ఈరోజు ఆంధ్రజ్యోతి వివిధలో వచ్చింది. అయితే ఆ శీర్షిక 'విబంధుడు ' నేను పెట్టింది కాదు. ఆ పదానికి అర్థం నాకు తెలియదు. అలాగే ఆ వ్యాసంలో రెండు పేరాలు ఎడిట్ చేసారు. అందువల్ల పూర్తి వ్యాసాన్ని మిత్రులకోసం ఇక్కడ పొందుపరుస్తున్నాను."

పూర్తి పాఠంతో ఇక్కడ:
http://www.scribd.com/doc/143874732/The-legacy-of-Tripura-in-Telugu-Literature


Wednesday, May 22, 2013

జీవన రాగం




సుప్రసిధ్ధ సినీ గేయ రచయిత శ్రీ వేటూరి సుందరరామమూర్తి రాసిన ఏకైన నవల "జీవనరాగం". వారి తొలి రచన. 1959లో ఆంధ్ర సచిత్ర వారపత్రిక లో సీరియల్ గా ప్రచురితమైంది. తర్వాత 1970 లో పుస్తకరుపాన్ని దాల్చింది. నా దగ్గర ఉన్నది అప్పటి ప్రింట్. తర్వాత పున:ముద్రణ జరిగిందో లేదో తెలియదు. నాకు తెలుగు చదవడం వచ్చిన కొత్తల్లో ఇంట్లో చదవటానికి దొరికిన ప్రతి తెలుగు పుస్తకాన్ని వదలకుండా చదివేసేదాన్ని. అలా చిన్నప్పుడెప్పుడో చదివిన పుస్తకమిది. అప్పుడు వేటూరి ఎవరో కూడా తెలీదు నాకు. ఇవాళ వేటూరి వర్థంతి సందర్భంగా ఈ పుస్తకాన్ని గురించి రాయాలనిపించింది.


ఈ పుస్తకం మొదటి పేజీల్లో "పల్లవి" పేరుతో వేటూరి ఈ రచనలో సహకరించిన మిత్రులు పెండ్యాల నాగేశ్వరరావుగారికి ధన్యవాదాలు తెలుపుకుంటారు. పుస్తకమ్లో తెలిపిన కొండజాతివారి ఆచారాలు, అలవాట్లను గురించి తెలిపినవారు, తనకి గురుతుల్యులైన మల్లాది రామకృష్ణశాస్త్రి గారికి ధన్యవాదాలు తెలుపుకున్నారు. ఆ పక్కనే వేటూరి శ్రీ సాలూరి రాజేశ్వరరావు ప్రతిభను మెచ్చుతూ రాసిన ఒక కవిత(గేయం?) బావుంటుంది. క్రింద ఫోటోలో అది చదవవచ్చు..




"జీవన రాగం" కథ చాలా నాటకీయంగా, ఒక సినిమా కథలాగానే ఉంటుంది. పేరుప్రఖ్యాతలు బాగా సంపాదించిన ఒక ప్రఖ్యాత సంగీత దర్శకుడు రఘు ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తూ ఉంటుంది. విశ్రాంతి కోసం "నాగార్జున కొండ" దగ్గరకు వెళ్లవలసినదిగా స్నేహితురాలు రాగిణి సలహా మేరకు అక్కడకు బయల్దేరుతాడు. వెళ్ళే ముందు గాయని రాగిణి తన మనసు తెలుపగా, రఘు సంతోషంతో ఆమె ప్రేమనంగీకరిస్తాడు. ఆమె హృదయవీణపై తన అనురాగరాగాలను పలికిస్తాడతను. మీకై ఎదురుచూస్తానంటూ వీడ్కోలు చెప్తుంది రాగిణి.


నాగార్జున కొండపై విహార యాత్రికులకు వసతి కల్పించే ఒక సుందర ఆరామంలో ఒక కుటీరాన్ని అద్దెకు తీసుకుంటాడతను. వెంకన్న అనే వంటవాడిని పనిలో కుదుర్చుకుంటాడు. ఇక్కడ వేటూరి వర్ణించే నాగార్జున కొండ అందాలు వర్ణానాతీతం. ఒక్కసారిగా పరుగున వెళ్ళి ఆ రమణీయ ప్రదేశంలో సేదతీరాలనిపించేంతటి అందమైన వర్ణన అది. వేటూరి పెరిగినది ఆ ప్రాంతం చుట్టుపక్కల కాబట్టే అంత బాగా ఆ పరిసరాలను వర్ణించగలిగరేమో అనిపించింది నాకు.  నాగార్జునకొండకి చేరగానే అంతటి అందమైన ప్రశాంత వాతావరణం పరిచయం చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ రాగిణికి ఉత్తరం రాస్తాడతను. 



తర్వాత ఒక రోజు కోనలలో విహరిస్తుండగా ఒక పిట్టసవ్వడికి ఆకర్షితుడై వెతుకుతూ వెళ్ళి దారితప్పుతాడు. దారి వెతుక్కుంటూ వెళ్తున్న అతనికి ఒక కొండజాతి గుంపు ఎదురౌతుంది. దిగువన ఉన్న సెంద్రవంక కోనలో వాళ్ళదొక గూడెమని చెప్తారు వాళ్ళు. నెమ్మదిగా పరిచయం పెరిగి గూడానికి రాకపోకలు సాగిస్తుంటాడు రఘు. అక్కడ సుగాలి నాయకుడి కుమార్తె రజని అతని మనసులో అలజడి రేపుతుంది. రమ్యమైన రజని నాట్యానికి రఘు సంగీతం తోడౌతుంది. ఆమె రూపలావణ్యాలు, ఆమె సాంగత్యంలో తనను తానే మరిచిన రఘు రాగిణిని, ఆమె ప్రేమనూ కూడా మరుస్తాడు. ఆమె ఉత్తరాలకు జవాబులు కూడా సరిగ్గా రాయడు. రజని భౌతిక సౌందర్యంలో కొట్టుకుపోతున్న అతని మనసుని రాగిణి రాసిన ఆర్ద్రమైన ఉత్తరం కూడా కదిలించలేకపోతుంది. వెంకన్న జాబు వ్రాయగా రఘు పట్ల ఆదుర్దాతో ప్రక్కవాద్యం పద్మనాభాన్ని వెంటపెట్టుకుని రాగిణి అక్కడికి చెరుకుంటుంది.


రజని తలపులతో నిండిపోయిన రఘు ఏమౌతాడు? రజని ఏమౌతుంది? గూడెం నాయకుడు రఘు కళ్ళు ఎలా తెరిపించాడు? రఘుకి రాగిణి మళ్ళీ ఎలా చేరువౌతుంది? మొదలైన ప్రశ్నలకు మిగిలిన కథ సమాధానం చెప్తుంది. ఇది ఒక అతి మాములు కథే కానీ వేటూరి ఈ కథను మలిచిన తీరు, వాడిన భాష, ప్రకృతి వర్ణనా తెలుగు భాషకు సంబంధించి ఒక అపురూపమైన ఉదాహరణగా ఈ పుస్తకాన్ని నిలుపుతుంది. అసలు అంత చక్కని తెలుగు చదవటానికి ఎంత ఆనందం కలుగుతుందో! సినీ గేయరచయిత కాకపోయి ఉంటే, వేటూరి వల్ల స్వచ్ఛమైన తెలుగు పదాలతో కూడిన సాహిత్యసృజన జరిగి ఉండేదనిపిస్తుంది పుస్తకం చదివాకా.

నవలలో వేటూరి వాడిన కొన్ని హృద్యమైన పదాలు:

ఉత్తంగ పర్వత శ్రేణి, కాలాంభోధరాలు, శోభస్కరంగా, వియత్పురుషుని, అలౌకిక రస నిర్భరానందం, ఉద్విగ్నశోకావేశ స్ఫురణ, అంగుళీకిసలయంలా, అవనతముఖి, వినమితముఖి, శరత్కాలసితచంద్రికలు, సకృతి, ,గ్రీష్మాతపవహ్ని, కందళిస్తున్నది, హ్రస్వమైన, ఆనందతోరణం, ఉదాత్త లజ్జావివశత్వం, ప్రకృతిసహజ సంస్కారజ్యోతి, ఉద్విగ్నశోకావేశ స్ఫురణ, కొంకర్తవ్యతామూఢుడు, రాగ ప్రస్థారం, సితచంద్రికాహ్లాదరజన్నిటాల, జనమన:కేదారములు !



ఈ పుస్తకం గురించి గతంలో పుస్తకం.నెట్ లో వచ్చిన వ్యాసం ఇక్కడ చూడవచ్చు.

Wednesday, May 15, 2013

కథ నేపథ్యం - 1



కొన్ని కథలు చదివినప్పుడు, రచయిత ఈ కథను ఎందుకు రాయాలనుకున్నారో, ఏ సందర్భంలో ఇలాంటి ఆలోచన వచ్చిందో, ఎందుకని ఇలా రాసారో అన్న ప్రశ్నలు కలుగుతాయి మనకు. అలాంటి కొన్ని ప్రశ్నలకు మనకు "కథ నేపథ్యం" పుస్తకంలో సమాధానాలు దొరుకుతాయి. కొన్నేళ్ల క్రితం 'ఆంధ్రజ్యోతి ఆదివారం పత్రిక'లో చాలామంది రచయితలతో వారి కథల నేపథ్యాలను ప్రచురించారు. వాటికి మొత్తానికి మరికొన్ని కథా నేపథ్యాలు రచయితలతో రాయించి అవి అచ్చు వేసేసింది తానా ప్రచురణల సంఘం. అయితే అవి మొత్తం చాలా పేజీలు ఉండడం వల్ల రెండు భాగాలుగా ప్రచురించాలనుకున్నారుట. 25 కథలతో మొదటి భాగం 2013 జనవరిలో విడుదల చేసారు. ఈ పుస్తకానికి సంపాదకులు ఆర్. ఎమ్. ఉమామహేశ్వరరావు గారు, డా.జంపాల చౌదరి గారు, వాసిరెడ్డి నవీన్ గారు. ఔత్సాహిక రచయితలకు ఈ కథా నేపథ్యాలు ఉపయోగపడగలవని సంపాదకుల అభిప్రాయం.



కథ వెనుక కథను తెలిపే ఈ కథా నేపథ్యాలను చదువుతుంటే ఆయా కథల పట్ల మనకున్న దృక్కోణం మారుతుంది. ఇలా కథ వెనుక ఉన్న రచయిత ఉద్దేశాన్నో ,ఆలోచననో, అనుభూతినో తెలుసుకోవటం ఆసక్తికరమైన విషయం. మామూలుగా కథ చదివిన దాని కన్నా ఇలా కథానేపథ్యాన్ని తెలుసుకున్నాకా ఆ కథ మరింత అర్థమౌతోందనిపిస్తుంది. కొన్ని కథలకూ వాటి వెనుక కథకూ పెద్దగా సంబంధమేమీ కనబడదు కానీ ఇంత చిన్న ఆలోచన లోంచి ఈ కథ పుట్టిందా? అన్న ఆశ్చర్యం కలుగుతుంది.



వైవిధ్యమైన పాతిక కథలున్న ఈ పుస్తకంలో తమ కథానేపథ్యాలను తెలిపిన కథకుల పేర్లు క్రింద ఫోటోలో చూడవచ్చు:

 


సతి: అబ్బూరి చాయాదేవి కథ "సతి" తో మొదలౌతుందీ పుస్తకం. ప్రఖ్యాత కథకులుగా ఎదిగిన ఒక జంట కథ ఇది. "బీనాదేవి" పేరుతో రచనలు చేసిన దంపతుల్లో ఒకరైన బి.నరసింగరావుగారి మరణం తర్వాత జరిగిన సంతాప సభలూ, పరిస్థితులు "సతి" కథకు నేపథ్యం అని ఛాయాదేవి చెప్తారు. ఈ కథలో తాను పురుషాహంకారం నీడని నిరసించానని చెప్తారు.


చీకటి: బాతుల వేటకై బయల్దేరిన ఇద్దరు అపరిచితుల కలయిక, విరుధ్ధమైన వారి జీవననేపథ్యాలు, విభిన్న మనస్తత్వాలూ తెలిపే అల్లం శేషగిరిరావు కథానిక "చీకటి". ఈ కథ చదువుతుంటే ఎందుకో వంశీ మన్యంరాణి గుర్తుకొచ్చింది. కథలో డిబిరి గాడి జీవనగాధ విన్నప్పుడు జీవితం ఇంత దుర్భరంగా, హృదయవిదారకంగా కూడా ఉంటుందా.. అని విభ్రాంతి చెందుతాము. అతడి అవతారం గురించిన వర్ణన, అతడు ఎదుర్కొన్న సమస్యలు, పడిన బాధలూ వింటున్న వర్మ తో పాటు మన రోమాలూ నిక్కబొడుచుకుంటాయి. రచయిత ఏజన్సి ప్రాంతంలో పనిచేసినప్పుడు ఒక రిటైర్డ్ పెద్దాయన చెప్పిన విషయాల ఆధారంగా ఈ కథ రాసారుట. దానికి మూలం కూడా అతను చెప్పిన ఒక చిన్న సంఘటన. ఒకసారి ఉరిశిక్ష పడిన ఒక గిరిజన ఖైదీ తన కొడుకు తన కోసం వస్తాడనీ, ఆకలితో వచ్చే అతనికి పూరీకూర పెట్టమని, అదే అతన ఆఖరి కోరిక అనీ జైలర్ కు చెప్పాడుట. ఈ చిన్న సంఘటన ఆధారంతో ఈ కథ అల్లాననీ కథానేపథ్యంలో శేషగిరిరావు చెప్తారు. చదివిన చాలాసేపటి వరకూ మనల్ని ఆలోచనల్లో ముంచివేసే ఆర్ద్రమైన కథ "చీకటి".


సర్కస్ డేరా: ఊళ్ళోకి సర్కస్ రావటం, పబ్లిసిటి కోసం తిప్పే మోటారువేన్, సర్కస్ డేరాలూ, చుట్టూతా డబ్బారేకు అంచులు, ఏనుగులు, గుర్రాలు, పులులు, మనుషులూ... ఇవన్నింటితో చిన్నప్పుడు చూసిన సర్కస్ గుర్తుకు తెస్తారు ఈ కథలో మధురాంతకం రాజారాం. నాగులు దాబ్బులు తీసుకుపోయాడని రఘుపతి చింతిస్తూంటే, ఎందుకు నమ్మారని ఆరా తీసిన మనుషులే తీరా నాగులు చిల్లర డబ్బులతో తిరిగి వచ్చేసరికీ మాట మార్చేసి ఇంతోటి దానికే ఇంత హంగామానా అని వెటకారాలాడతారు. ఈ సంఘటన రెండునాల్కలతో మాట్లాడే సమాజానికి ప్రతీక. సర్కస్ లో ఆటగాళ్లాడే ఏ ఆటకీ పెద్దగా ఆశ్చర్యపడని నాగులు జీవన పోరాటానికి ప్రత్యక్ష్యసాక్షి. బ్రతుకువెళ్లదీయటం కోసం నిత్యం ఎన్నోపాట్లు పడుతూ ప్రమాదాల అంచున ప్రయాణించేవాడికి సర్కస్ ఫీట్లు ఉత్సుకతనూ, కుతూహలాన్నీ ఎలా కలిగిస్తాయి?
ఈ కథలో వాస్తవానికి కొంత కల్పన జోడించినట్లు నేపథ్యంలో చెప్తారు రాజారాం.


వారాల పిల్లాడు: అసాంతం గబగబా చదివించిన ఈ కథ నా కళ్ళల్లో నీళ్ళు తెప్పించింది. నాయినమ్మ చనిపోయినట్లు తెలీక ఆవిడని అందరూ ఏం చేసేస్తున్నారో అని బెంబేలెత్తిపోయే ఎనిమిదేళ్ల నారాయణ అమాయకత్వం మన పసితనాన్ని గుర్తుకు తెస్తుంది. వాళ్ళింట్లో వారాలు చేసుకుని చదువుకునే నరసింహ్వం ని చూసి తను కూడా వారాలు చేసుకుని చదువుకోవాలనుకునే నారాయణ అమాయకత్వానికి మరింత ముచ్చటపడేలోపే ఓళ్ళు బళ్ళవుతాయన్నట్లుగా వారి కుటుంబపరిస్థితి తలకిందులైపోతుంది. నిజంగా తల్లిని  వదిలి పొరుగూరెళ్ళి వారాలు చేసుకుంటూ చదువుకోవాల్సిన అతని పరిస్థితి, అతని ఆకలి బాధా జాలిగొలుపుతాయి. ముగింపు ఇంకా వేదన కలిగిస్తుంది. ఈ కథా నేపథ్యంలో ఇందులో ఉన్నది తన జీవన నేపథ్యమేననీ, తమ కుటుంబం దుర్దశలో ఉన్నప్పుడు తమను మేనమామలూ, తల్లి చేసిన అన్నదానాలు ఆదుకున్నాయని పరిస్థితులు చక్కబడ్డాయనీ, తమ తిరగబడ్డ పరిస్థితులను, కథా రచన కాలంలో తాను తిరిగిన కొన్ని ప్రాంతాల్లో చూసిన భీబత్సమైన చారిత్రక దృశ్యాల ఆధారంతో ఈ కథ రాసాననీ చెప్తారు రచయిత మునిపల్లెరాజు. కానీ ఈ కథ విషాదాంతమే నన్ను బాగా కదిలించివేసింది.


ధనలక్ష్మి: బిజినెస్ మేనేజ్మెంట్ స్టూడెంట్లకు కూడా పాఠాలు చెప్పగల నేర్పు ఉన్న వ్యాపారస్తురాలు కథ శ్రీరమణ గారి "ధనలక్ష్మి". వ్యాపారాభివృధ్ధికి తను తెలివితో చేసిన ఆలోచనలను, కాపురం బాగుండాలని భర్త రామాంజనేలు కి ఆపాదించి, అందరూ అతడిని మెచ్చేలా చేస్తుంది ధనలక్ష్మి. కథలో చివరిదాకా అదే నేర్పుతో నెట్టుకొచ్చి, నెగ్గుతుంది ఆమె. ఈ కథలో పాత్రలు తన క్లాస్మేట్స్ అనీ, వాళ్ల కథే ఈ కథకు నేపధ్యమనీ చెప్తారు శ్రీరమణ. అయితే, ఈ విజయగాథలో తన ఆత్మన్యూనతను ఆత్మవిశ్వాసంగా మార్చుకున్న తన మిత్రుడిదే గొప్ప పాత్ర అంటారు ఆయన.


ఇటువంటి మరికొన్ని వైవిధ్యభరితమైన కథలనూ, వాటి కథా నేపథ్యాలను "కథ నేపథ్యం - 1" పుస్తకంలో చదవవచ్చు.



Tuesday, May 7, 2013

భారతీయ నవల





ఏ దేశ సాహిత్యం ఆ దేశం యొక్క జీవనవిధానానికీ, సామాజిక పరిస్థితులకూ, మార్పులకూ అద్దం పడుతుంది. అయితే సాహిత్యం కేవలం వినోదసాధనం మాత్రమే కాదు మనుషులను చైతన్యవంతం కూడా చెయ్యగలదు. ప్రయోజనకారి కూడా. ఉద్యమాల వల్ల, విప్లవాల వల్ల, చట్టాల వల్ల, ఉపన్యాసల వల్లనే కాదు సాహిత్యం వల్ల కూడా సమాజోధ్ధరణ జరుగుతుంది. సామాన్యుడికి అందుబాటులో ఉండి, చదివినవారి ఆలోచనల్లో, వ్యక్తిత్వంలోను మార్పుని తేగల శక్తి సాహిత్యానికి ఉంది.  సాహిత్య ప్రక్రియలన్నింటిలోనూ ముఖ్యమైన “నవల”కి అటువంటి గొప్ప శక్తి ఎక్కువగా ఉంది.

 “చినుకు” మాసపత్రికలో “భారతీయ నవలా పరిచయాలు” పేరుతో నెలనెలా వీరలక్ష్మిగారు ఎంపిక చేసి పరిచయం చేసిన 25 భారతీయ భాషా నవలల్ని పుస్తకరుపంలో "భారతీయ నవల" పేరుతో మనకందించారు “చినుకు పబ్లికేషన్స్” వాళ్ళు. 

మిగిలిన పుస్తక పరిచయం పుస్తకం.నెట్ లో ఇక్కడ:
 http://pustakam.net/?p=14591



Friday, May 3, 2013

మా ఊళ్ళో కురిసిన వాన




"మన మానసిక స్థితికి సరిపోని పెద్ద సమూహంలో ఉన్నా పూర్తి ఒంటరి ఏకాకితనమే ఉంటుంది కదా! ఏకాంతంలో ఉంటూ కూడా ప్రపంచాన్నంతా అక్కున చేర్చుకుని మంతనాలాడగల సన్నివేశాన్ని అందించే పుస్తకం దొరికితే అంతకంటే గొప్ప ఎంజాయ్ మెంట్ మరేదయినా ఉందా?"
-- వాడ్రేవు వీరలక్ష్మి గారి 'మా ఊళ్ళో కురిసిన వాన' నుంచి.

 

ఆంధ్రప్రభ దినపత్రికలో వ్యాసాల ద్వారా నాకు పరిచయమైన రచయిత్రి వాడ్రేవు వీరలక్ష్మి గారు. తర్వత ఆ వ్యాసాలన్నీ 'ఆకులో ఆకునై' అనే పుస్తకంలో చేరాయి. ఆ మొదటి పరిచయంతోనే నాకు ప్రియమైన రచయితల జాబితాలో చేరిపోయారు. ఆ తరువాత 'ఉత్సవసౌరభం', 'కొండఫలం'  కథా సంపుటాలు, 'సాహిత్యానుభవం', 'మా ఊళ్ళో కురిసిన వాన' వ్యాస సంకలనాలు, 'చినుకు' మాస పత్రికలో 'భారతీయ నవలా పరిచయాలు', 'పాలపిట్ట' మాస పత్రికలో 'జాజిపూలపందిరి' మొదలైన రచనలు చేసారు. 


ఇరవై నాలుగు వారాల పాటు ఆంధ్రప్రభ దినపత్రిక(2003)లో వడ్రేవు వీరలక్ష్మి గారు రాసిన "వాన చినుకులు" కాలమ్ లోని వ్యాసాలను ఒకచోట చేర్చిన పుస్తకమే "మా ఊళ్ళో కురిసిన వాన". జులై 2012లో ప్రచురణ పొందిన ఈ పుస్తకం వెల 75/-.

గోపగారి రవీందర్ గారి ముందుమాట తో పాటుగా
"గురుపూర్ణిమ నాడు
అర్థరాత్రి దాటిన తరువాత
అదృష్టపశాత్తు కరెంట్ పోగా
తురాయిపూల చెట్ల గాలిలో
బాల్కనీలో  ఆకులనీడలో కూర్చొని
పున్నమివెన్నెలతో కబుర్లు మొదలు పెట్టిన దగ్గర్నుంచీ..."
అంటూ తల్లికి తక్క తనయుడు అనిపించేలా రాసిన వీరలక్ష్మి గారి అబ్బాయి రాజా సమీరనందన్ కబుర్లు, జ్ఞాపకాలు చదివి తీరాల్సిందే.



వీరలక్ష్మి గారి పుస్తకం చదివిన ప్రతిసారీ నాకు కొన్ని కొత్త పుస్తకాలో, రచయితలో తెలుస్తుంటారు. ఆవిడ చెప్పే రకరకాల రచయితల పేర్లూ, రిఫరెన్స్ లూ ఆహ్లాదకరంగా ఉంటాయి. ఎంత ఒరేషియస్ రీడరో కదా.. అనిపిస్తుంది. ఇదివరకూ "కొండఫలం" టపాలో చెప్పినట్లుగా ఈవిడ రచనల్లో నా ఆలోచనల్లో చాలావరకూ భావసారూప్యం కనబడుతుంది నాకు. ఫలానాప్పుడు నేను ఇలానే అనుకున్నా కదా అని ఆవిడ పుస్తకాలు చదివినప్పుడల్లా ఎక్కడో అక్కడ గుర్తు చేసుకుంటూంటాను. అందుకేనేమో ఆవిడ నాకు ప్రియమైన రచయిత్రి అయిపోయారు. వీరలక్ష్మిగారి రచనల్లో నాకు ఇంకా నచ్చేవి జీవితం గురించీ, మానవ స్వభావాల గురించిన ఆవిడ రాసే చక్కని విశ్లేషణాత్మక వాక్యాలు. ఈ పుస్తకంలోనివన్నీ వ్యాసాలే కాబట్టి, వీటిల్లో నాకు నచ్చిన కొన్ని వాక్యాలను రాస్తాను ...

* "మా మాష్టారు యశస్సుకీ కీర్తికి తేడా చెప్పేవారు. యశస్సు అంటే సహజంగా వచ్చేదని, కీర్తిని సంపాదించడానికి కొంత ప్రయత్నం అవసరం అంటూ. ఇప్పుడు కీర్తికీ, పాపులారిటికి తేడా చెప్పుకోవాలేమి! పూర్తిగా ప్రయత్నం చేసి సంపాదించే పాపులారిటీ కోసమే ఈ క్రేజ్ అంతాను."

*హఠాత్తుగా ఒక్కనాడు తెల్లవారేసరికి మనుషులు మారిపోతారని గానీ, సంఘంలో గాని, ఇంట్లొ గాని పరిస్థితులు ఒక "ఫైన్ మార్నింగ్" చక్కబడిపోతాయని గాని అనుకోవడమూ, నమ్మడము కూడా ఎంత బుర్ర తక్కువ సంగతో ఈ ప్రకృతి ఇలా ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంటుంది."

* "జీవితంలో ఏదైనా ఎంచుకునే స్వేచ్ఛ మనిషిని ఇంత అస్థిమితంగా మర్చుతుందా?"
"...ఎంచుకోగల స్వేచ్ఛ కావాలనే కదా మనిషి కోరేది. కానీ ఎంచుకోడానికి ఎంత మనోనిశ్చలత, నాణ్యతని గ్రహించటానికి ఎంత పదునైన బుధ్ధి ఉండితీరాలి! ఇవి లేని వాడి చేతిలో రిమోట్ పెడితే ఎలా?"

* మన ఆలోచనలకు దగ్గరగా ఉండే ఆలోచనలు చదివినప్పుడు పెద్ద సముహంతో కలిసిపోయి ఆనందిస్తున్న భావనే కలుగుతుంది.

* "మనిషి ఎదుటి మనిషిని రాగద్వేషమిశ్రితమైన మనిషిగా అంగీకరించగలగటం ఎంతో గొప్ప సంగతి. అదే జరిగితే ఈ వాదాలేవి అక్కర్లేదు. ఈ అర్ధం చేసుకోలేకపోవడాల దగ్గరే మానవ దు:ఖమంతా ఉంది."



Monday, April 29, 2013

పాలపిట్ట ప్రత్యేక కథల సంచిక





"మనుషులకి ఒకరి గురించి ఒకరికి ఎందుకింత ఎక్కువగా తెలియడం? తెలుసుకునే దాకా ఆగలేకపోవడం, తెలుసుకున్నాకా ఓస్ ఇంతేకదా! అనో లేదా ఛీ! ఇంత నీచంగానా? అనో అనుకోవడం ఎందుకు?"
"కిటికీ బయటి వెన్నెల" అనే కథలో మాటలు ఇవి. నాకు ప్రియమైన రచయితల్లో ఒకరైన వాడ్రేవు వీరలక్ష్మిగారు రాసిన  ఈ కథ 'పాలపిట్ట ప్రత్యేక కథల సంచిక'లోనిది.

ఏదైనా కథా సంకలనం తీసుకుంటే అందులో ఉన్న కథల్లో సగమే కథలు మనకు నచ్చుతుంటాయి. ఒకోసారి ఉన్నవాటిల్లో పావు వంతు కూడా నచ్చవు. పాటల సీడీలైనా అంతే. ఫలానావారి హిట్స్ అని సిడీ విడుదల చేస్తారు కానీ అందులో అసలైన హిట్స్ కొన్ని మిస్సయ్యాయి, లేదా అన్నీ మంచివి లేవు అనుకుంటాం కూడా. అన్ని నచ్చాయీ అంటే అది పుస్తకమయినా, సీడి అయినా అది అరుదైనదే. అలాంటి అరుదైన మంచి కథల పుస్తకమొకటి ఈమధ్యన చదివాను. ఇప్పటిదాకా నేను చదివిన కథా సంకలనాలన్నింటిలో నాకు బాగా నచ్చినది. మొదటి పదిహేను, పదహారు కథలదాకా చకచకా చదివేయగలము. ఆ తరువాత కథల్లోని మాండలీకాల వల్ల కాస్త సమయం ఎక్కువ పడుతుంది నెమ్మదిగా చదువుతాము కాబట్టి. 


'పాలపిట్ట ప్రత్యేక కథల సంచిక'లో మొత్తం 26 కథలు ఉన్నాయి. అన్నీ వేటికవే బావున్నాయి. ఒకో కథా మొదలుపెడితే అయ్యేదాకా పరిసరాలు మర్చిపోయేంతగా మనల్ని లీనం చేసుకోగల కథలు. అన్నీ వైవిధ్యభరితమైన కథాంశాలు. ఇంట్లోని చిన్న పిల్లల జగడాల దగ్గర నుండీ ఉద్యమాల వరకూ, జీవితంలో రకరకాల కోణాలను, పార్శ్వాలనూ స్పృశిస్తాయి ఈ కథలు. అన్ని కథల క్రిందన రచయితల సెల్ నంబర్లు ఇచ్చారు.

కథలు, కథా రచయితల పేర్లు : 

శాంతి పర్వం  -  ఏ.ఎన్.జగన్నథ శర్మ, 
వికృతి   - అట్టాడ అప్పల్నాయుడు, 
వైట్ బోర్డ్..  - జి.ఉమామహేశ్వర్, 
నిసర్గం  - కాశీభట్ల వేణుగోపాల్, 
కిటికీ బయటి వెన్నెల  - వాడ్రేవు వీరలక్ష్మి, 
బొమ్మలపెట్టె  - బి.మురళీధర్, 
చిరాగ్  -  మహమూద్, 
కప్పు కాఫీ - సలీం, 
నిర్ణయం -  సి.ఎస్.రాంబాబు, 
జలసేద్యం -  కాట్రగడ్డ దయానంద్, 
గాజు పెంకులు-దూదిపింజలు  -  డా. బి.వి.ఎన్.స్వామి, 
ఋతుసంహారం -  డా.వి.చంద్రశేఖరరావు,
వేమన్న గుర్రం -  డా. వి.ఆర్. రాసాని, 
విస్ఫోటనం  -  డా.ధేనువకొండ శ్రీరామమూర్తి, 
జింక డ్రామాలో మా ఏక్సను - ఎలికట్టె శంకర రావు, 
యజమాని - మధురాంతకం నరేంద్ర, 
రెండడుగుల నేల - పూడూరి రాజిరెడ్డి, 
ముసిలి - పద్దం అనసూయ, 
దాపటెద్దు - యెన్నం ఉపేందర్, 
సూదిగట్టు -  బి.పి.కరుణాకర్, 
ఒక శంకరం... ఒక శాంత - రామా చంద్రమౌళి, 
దేవుడు - నన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి, 
నిత్య కల్లోలం - ముదిగంటి సుజాతారెడ్డి, 
ఏక్ ముసాఫిర్... దో రాస్తే! - స్కైబాబ, 
కంబస్థం బల్లెడ - నారాయణమూర్తి, 
పతాక సందేశం దాట్ల - దేవదానం రాజు. 


ఈ కథలన్నీ నాకు అన్నీ నచ్చాయి కానీ ఒకటి రెండు కథలు బానే ఉన్నాయి అనిపించాయి. కారణం ఆ కథలోని విషయం పట్ల నాకు ఆసక్తి లేకపోవటమే. విభిన్నమైన కథాంశాల కారణంగా మాత్రం అన్ని కథలూ అందరికీ నచ్చకపోవచ్చు. చాలా నచ్చిన కొన్ని కథల గురించి క్లుప్తంగా నాలుగు మాటలు రాస్తాను.

కిటికీ బయటి వెన్నెల 
మనుషుల్లో సాధారణంగా కనబడే క్యూరియాసిటీ ఎలా ఉంటుందో ఓ తేలికైన ఉదాహరణతో చెప్తారు వాడ్రేవు వీరలక్ష్మి గారు. ఈ కథ చదువుతున్నంత సేపు మా కిటికీ లోంచి కనిపించే ఎదురింటివాళ్ల గురించి నేను అనుకునేవే ఈవిడ రాస్తున్నారా అనిపించింది. నాకు బాగా నచ్చింది కథ.



నిసర్గం:
స్త్రీ శరీరాన్ని మాత్రమే ప్రేమించటం కాదు ఆమె మనసుని కూడా అర్థం చేసుకున్నప్పుడే మాగవాడి ప్రేమ సంపూర్ణమవుతుంది అన్న సందేశాన్ని తెలిపే కథ నిసర్గం. తనదైన శైలిలో కాశీభట్ల వేణుగోపాల్ గారు రాసిన ఈ కథానిక మనసుని తడుతూ.. స్త్రీని అర్థంచేసుకోవాలంటే శరీరాన్నీ, మనసునీ విడదీసి చూడగలగాలనే ఆలోచనను మేల్కొలుపుతుంది. 



వైట్ బోర్డ్..  :
పిల్లలు రాసుకునే "వైట్ బోర్డ్" కొనటం, పిల్లల కొట్లాట, అది పరిష్కారమైన విధానం మనసుకి హత్తుకునేలా రాసారు ఉమామహేశ్వర్ గారు. ఏ గందరగోళాలూ లేని ఒక మంచి కథ చదివిన భావన మిగులుతుంది కథ చదివాకా.

బొమ్మలపెట్టె:
పల్లెల్లో, పట్నాల్లో పిల్లల పెంపకాల్లో కనబడే తేడాల్ని చెప్తూ, మన పెంపకాన్ని బట్టే పిల్లల మనస్తత్వం ఏర్పడుతుంది అని చెప్తారు బి.మురళీధర్ గారు.

ముసిలి: 
చిరాగ్:
ఈ రెండు కథలూ ఓ మరణంతో మొదలై, మరణించిన మనిషి యొక్క జ్ఞాపకాల చూట్టూ తిరుగుతాయి.

జింక డ్రామాలో మా ఏక్సను:
ఆద్యంతం నవ్వు తెప్పించే ఈ చిన్న కథ స్టేజి మీద వేసిన రాములోరి నాటకం ఎలా నవ్వులపాలైందో వివరిస్తుంది.

కప్పు కాఫీ:
కప్పు ఎలా ఉందనేది కాదు, అందులోని కాఫీ ఎలా ఉందనేది ముఖ్యం.. అంటూ రుచికరమైన కాఫీలాంటి జీవితాన్ని ఆస్వాదించటమెలాగో తండ్రికి నేర్పుతుంది ఓ కూతురు.

జలసేద్యం:
పౌరోహిత్యం మానుకుని రొయ్యల పెంపకం మొదలుపెట్టిన మాధవకి ఎదురైన కష్టనష్టాలను కళ్ళకు కట్టినట్లు చూపెడుతుండీ కథ.

యజమాని :
మధురాంతకం నరేంద్రగారు  రాసిన ఈ కథ గురించి జంపాల చౌదరి గారు ఈ వ్యాసం చివర్లో రాసారు. (http://pustakam.net/?p=13885) రచయిత అనుమతితో వారు ఇచ్చిన ఈ కథానిక లింక్ కూడా అక్కడ చూడవచ్చు.

దేవుడు:
అందరితో దేవయ్యా అని పిలిపించుకునే వాసుదేవయ్య ఊరోళ్లందరికీ దేవుడేలా అయ్యాడో ఈ కథ చెప్తుంది.

ఏక్ ముసాఫిర్... దో రాస్తే!
ఉద్యోగమా.. ఉద్యమమా.. అనే ఊగిసలాటలోంచి బయటపడిన సమీర్ చివరకు ఏం నిర్ణయం తీసుకున్నాడో ఈ కథలో చదవచ్చు. ఈ పెనుగులాటలో సమీర్ పడే మానసిక క్షోభ మన కళ్ళెదుట నిలబడుతుంది.

***

క్రిందటేడు విశాలాంధ్రలో యాదృచ్ఛికంగా కొన్న ఈ పుస్తకం నాకెంతో సంతృప్తినీ, ఎన్నోఆలోచనలనీ ఇచ్చింది. కొత్త విషయాలను తెలిపింది. మార్చి2011లో మొదటి ప్రచురణ పొందిన ఈ పుస్తకం వెల ఎనభై రూపాయిలు.




Thursday, April 18, 2013

WATER - A miracle Therapy





2002లో విజయవాడ పుస్తక ప్రదర్శనలో కొన్నాను ఈ పుస్తకాన్ని. అందరికీ ఎంతో ఉపయోగకరమైన ఈ పుస్తకం గురించి రాయాలనుకుంటూ ఉన్నా.. ఇవాళ మూడ్ కుదిరింది :) అప్పట్లో యోగా క్లాసెస్ కి వెళ్ళినప్పుడు పొద్దున్నే లీటర్ నీళ్ళు తాగే అలవాటు అయ్యింది. ఆ ఆసక్తి వల్ల ఈ పుస్తకం కొన్నాను. ఇంజినీర్, రచయిత అయిన ఏ.కె.హరి ఈ పుస్తకం రాసారు. మానవ జీవితంలో నీటి యొక్క ప్రాముఖ్యత గురించీ, నీళ్ళు తాగటం ఎంతో ఆరోగ్యకరం అనీ, ఆరోగ్యం బాగుండడానికీ, మెరుగుపడడానికీ నీళ్ళు తాగటం చాలా అవసరం అని రచయిత చెప్తారు. అందుకు రకరకాల ఉదాహరణలూ, ఏ రకమైన నీటిలో ఎంత ఎనర్జీ ఉంటుందో, ప్రపంచవ్యాప్తంగా నీళ్ళు తాగటం గురించి జరిగిన పరిశోధనలు మొదలైనవాటి గురించి వివరిస్తారు హరి గారు. మనం తాగే నీళ్లకు ఇంతటి శక్తి ఉందా అని ఆశ్చర్యం వేస్తుంది ఈ పుస్తకం చదివితే. 

"Having starved our body of nature's most precious liquid, water, we are beset with multiple ailments like headaches,arthritis,asthma,urinary problems, general debility, blood pressure etc. Missing the root cause of the problem, we rush to doctors - only to have antibiotics pumped into us that offer short-term 'relief' while turning into long-term nightmares." 

" The root cause of every disease is dehydration. Hydrate the body properly and you will recover without any medication."  అంటే మొక్క వాడిపోయిన కుండీలో నీళ్ళు పోస్తే ఎలాగైతే మళ్ళీ మొక్క చైతన్యవంతమైతుందో అలానే శరీరం కూడా సరిపడా నీరు అందితే బాగవుతుంది అంటారు ఆయన.

పుస్తకం లోని మరికొన్ని విశేషాలు:

* నీటిని ఒక క్రమ పధ్ధతిలో తాగుతూ ఉంటే మందులు అక్ఖర్లేకుండానే చాలా మటుకు రోగాలు నయమయిపోతాయి. వృధ్ధాప్యపు ఆనవాళ్లను కూడా నీరు తాగటం వల్ల దూరం చెయ్యగలం.

* శరీర బరువుని బట్టి ఎవరు ఎంత నీరు తాగాలి అన్నది నిర్ణయించుకోవాలి. సుమారు ఒకరు అరవై కేజీల బరువు ఉంటే, వాళ్ళు రోజులో కనీసం మూడున్నర లీటర్ల నీరు తాగాలి. పొద్దున్న లేవగానే 300ml, టఫిన్ కి అరగంట ముందు 300ml, భోజనానికి గంట ముందు 300ml, భోజనం మధ్యలో అస్సలు నీళ్ళు తాగకూడదు. (తప్పనిసరైతే కాసిని తాగచ్చు), భోజనం అయిన రెండున్నర గంటల తర్వాత 300ml, మళ్ళీ రాత్రి డిన్నర్ కి గంట ముందు, డిన్నర్ అయిన రెండున్నర గంటల తర్వాత 300ml తాగాలి. మధ్యలో కావాల్సినప్పుడు, రాత్రి పడుకునే తాగచ్చు. ఈ పధ్ధతి ప్రకారం చేస్తే ఎన్నో రోగాల నుండి బయటపడవచ్చుట. కానీ ఇదంతా ఫ్యామిలీ డాక్టర్ ని సంప్రదించి చెయ్యాలి.

* జలపాతాల్లో, పారే నదుల్లోనూ ఎక్కువ జీవశక్తి ఉంటుంది. ఏ ప్రాణినయినా సంపూర్ణ ఆరోగ్యవంతంగా చేయగల శక్తి ఈ జలపాతాల తాలుకూ నీటికి, ప్రవహించే నదుల్లోని నీటికీ ఉంది. రకరకాల పైపుల ద్వారా ఆ నీరు మన ఇళ్ళకి చేరేసరికీ అందులోని జీవశక్తి పూర్తిగా నశించిపోతుంది. నదీ స్నానాలకి అందుకే ఎంతో ప్రాధాన్యత ఉంది. 

* ఆగమశాస్త్రాల్లో మన పూర్వీకులు దేవతా విగ్రహాలకు వాడే రాళ్లను గురించి చెప్తారు. కొన్ని రాళ్లపై నీళ్ళు పోసినప్పుడు, ఆ నీరు బ్యాక్టీరియా రహితంగా మారి, మరింత ఎనర్జీని పొందుతుందిట. విగ్రహాలకు అభిషేకాలు చేసేప్పుడు శంఖంలోంచి పోసేవారు. శంఖంలో పోస్తే నీటికి ఎనర్జీ వస్తుంది. అది మళ్ళీ ప్రత్యేకమైన రాయితో తయారు చేసిన విగ్రహాల పై నుండి జారి మరింత శక్తివంతం అవుతుంది. అటువంటి జీవశక్తి గల నీటిని తీర్థ రూపంలో కాస్తైనా పుచ్చుకోవటం ఎంతో మంచిది. తీర్థ మిచ్చేప్పుడు చదివే మంత్రం,  (ప్రథమం కార్య సిథ్యర్థం, ద్వితీయం ధర్మ సిధ్యర్థం, తృతీయం మోక్షమాప్నోతి) + దేవతా విగ్రహం అభిషేకించిన నీళ్ళు రెండూ కలిసి భక్తునికి ఎంతో శక్తినిస్తాయి.

* సంధ్యావందనం  పూర్వం నది ఒడ్డున చేసేవారు. ప్రవహించే నదిలోని జీవశక్తి కాక, నీటితో శరీరంలోని రకరకాల చోట్ల తాకటం ’రీకీ’ లాంటి ప్రక్రియే, అది శరీరాన్ని ఎంతో శక్తివంతం చేస్తుంది. సంధ్య చేసే మూడు కాలాలు కూడా ఎంతో ముఖ్యమైనవి. ప్రకృతిలోని శక్తంతా సంపూర్ణంగా ఉండే సమయాలు అవి.






Dr.Fereydoon batmanghelidj అనే డాక్టర్ గారు నీటి వాడకం, ఉపయోగాలను గురించి చేసిన ప్రయోగాలను ఒక చాప్టర్ లో చెప్తారు హరి గారు. అందులో వారి వెబ్సైట్  కూడా ఇచ్చారు. ఆ వెబ్సైట్ లొ ఏ ఏ అనారోగ్యాలకు నీటి వాడకం పనిచెస్తుందో చెప్పారు ఆ డాక్టర్ గారు. ఇదే ఆ లింక్:
http://www.watercure.com/wondersofwater.html


నెట్లో ఈ పుస్తకం వివరాలకై వెతికితే, పుస్తకం తాలూకూ 29pages preview ఉన్న లింక్ ఒకటి దొరికింది. ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ తప్పక చదవండి:
http://books.google.co.in/books?id=JwhTgUMqeVoC&printsec=frontcover#v=onepage&q&f=false


11yrs క్రితం నే కొన్న ఈ పుస్తకం ఇప్పుడు షాపుల్లో దొరుకుతోందో లేదో తెలీదు కానీ amazon.com లో ఈ పుస్తకం అందుబాటులో ఉంది:
http://www.amazon.com/Water-Miracle-Therapy-R-Hari/dp/9381384800


***

అదండి సంగతి ! కాబట్టి అందరూ నీళ్ళు బాగా తాగటం మొదలుపెట్టండి. భోజనానికి మధ్యన ఎక్కువ నీళ్ళు తాగకండి, భోజనo అయ్యాకా కనీసం గంట తర్వాత నీళ్ళు తాగటానికి ప్రయత్నించండి. చక్కని ఆరోగ్యాన్ని, జీవశక్తినీ సొంతం చేసుకోండి. 


Tuesday, April 16, 2013

శరత్ పూర్ణిమ



అభిమానులెవరైనా "ఏమండీ ఈ మధ్య మీరేమీ రాయడం లేదే?" అని అడిగితే "ఏం, ఎందుకు రాయాలి? పద్యం రాస్తే విశ్వనాథతో సమానంగా, లిరిక్ రాస్తే కృష్ణ శాస్త్రి స్థాయిలో, గేయం రాస్తే శ్రీశ్రీ లాగా, వచనం రాస్తే వేలూరి, శ్రీపాదల్లాగా, కథలు రాస్తే చలం లాగా రాయగలిగినప్పుడే రాస్తాను. అలా రాయలేనప్పుడు అస్త్రసన్యాసం చేసి హాయిగా చదువుతూ కూచుంటాను" అని జవాబు చెప్పేవారుట. ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ, అద్దం మీద ఆవగింజలా అందకుండా జారిపోయే చాతుర్యం వారి స్వార్జితమట. 

ఇంతకీ వారెవరూ..... అంటే, మిత్రులతో రుక్కాయి, జలాలుద్దీన్ రూమీ, రుక్కుటేశ్వరుడు అని పిలిపించుకుంటూనే, జయంతి కుమార స్వామి, వెల్లటూరి సోమనాథం, చలికాలం మార్తాండరావు.. ఇలా లెఖ్ఖలేనన్ని మారుపేర్లు పెట్టుకున్న బహుముఖప్రజ్ఞాశాలి జలసూత్రం రుక్మిణీనాథశాస్త్రి ! పేరడీ శాస్త్రి, జరుక్ శాస్త్రి గా పేరొంది, సాహిత్యాభిమానుల అభిమానాన్ని దండిగా పొందిన మహా మనీషి! అయితే ఇన్ని మారుపేర్లతో రాయటం వల్లనే చాలా రచనలు వెలుగులోకి రాలేకపోయాయని అంటారు. 


శ్రీశ్రీగారిలా అన్నారుట "నిజమైన పేరడి ఒరిజినల్ ను జ్ఞాపకం తెస్తుంది. మాతృకలాగనే ఉంటూ అర్థాన్ని లఘువు చేస్తూ అపహసిస్తూ తల్లివేలితో తల్లికన్నే పొడిచేలా రూపొందే రచనాపత్రికను 'పేరడీ' అనవచ్చు. అలా పేరడీలు రచించడంలో జలసూత్రం రుక్మిణీశానాథశాస్త్రి సిధ్ధహస్తుడు." అని.

తాను రాసిన పేరడీల వల్ల "పేరడీశాస్త్రి" అని పేరుపొందినా, జీవించిన ఏభైనాలుగేళ్ళలో ఎన్నో రకాల రచనలు చేసారు. కథలు, నాటికలూ, విమర్శలూ, కవిత్వం అన్నింటా వారి ప్రవేశం ఉంది. జరుక్ శాస్త్రి గారి కథల సంకలనమే "శరత్ పూర్ణిమ". 1981లో ప్రధమ ముద్రణ అయ్యింది .మళ్ళీ ఇన్నాళ్ళకి ఈ జనవరిలో రెండవ ముద్రణ వెలువడింది. 




1981లో "శరత్ పూర్ణిమ", 1982 లో "జరుక్ శాస్త్రి పేరడీలు" వచ్చాకా, వారి నాటికలు,వ్యాసాలు,వచన రచనలు,సమీక్షలు మూడవ సంపుటిగా వస్తే శాస్త్రి గారి పూర్ణవ్యక్తిత్వానికి సూర్యలోకం కలుగుతుందని రమణారెడ్డిగారు పేరడీలు పుస్తకం ముందుమాటలో అన్నారు. అదే పుస్తకంలో ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి గారు రాసిన "జలసూత్రం అంతస్సూత్రం" లో జరుక్ శాస్త్రి గారి గురించి చెప్పిన విశేషాలు ఆసక్తికరంగా ఉంటాయి. రుక్ గారు సంస్కృతం,తెలుగు,ఇంగ్లీషు సాహిత్యాలు కలగలిపి మాట్లాడేవారుట. ఆ సాహిత్య దాహానికి అంతులేదుట. సాహిత్యం మీద అంత ప్రాణం పెట్టే మనిషి కనిపించరట. ఇక కొన్ని వాక్యాలు ఇక్కడ యథాతథం దించకపోతే నాకు తోచదు..
"మంచి కథలు(కొంచమైనా) వ్రాశాడు.
కణకణాలాడే పేరడీలు చేశాడు.
చుర్రుమనే పద్యాలు పలికాడు.
గొప్ప వ్యాసాలు రాసాడు.
విశ్వనాథ మీద వ్యాసం అతడే వ్రాయగలడనిపించాడు. శ్రీ సుబ్రహ్మణ్య శాస్త్రి గారి 'అనుభవాలు-జ్ఞాపకాలు' చదివి చారిత్రాత్మకమైన ఉత్తరం వ్రాసాడు.
కంకంటి-తిక్కన ఉత్తర రామాయణాల గురించి చేసిన తులనాత్మక ప్రసంగం అతని విమర్శనా నైశిత్యానికి నిదర్శనం.
సాహిత్యమే తిండి అదే పాన్పు అదే పానీయము. కానీ దేని మీదా స్థిరంగా నిలబడక, ఏదీ సమృధ్ధిగా ఇవ్వక ఆకస్మికంగా తెర వెనుకకు వెళ్పోయాడు. చెప్పినంత వరకూ, వ్రాసినంత మేరకు తనది తనదిగా ముద్ర వేసి పోయాడు."

'సాహిత్యమే తిండి అదే పాన్పు అదే పానీయము.' అంటే, eat books-drink books-sleep books అన్నమాట :-))
హనుమచ్ఛాస్త్రి గారి వాక్యాలు, పేరడీలు పుస్తకంలో జరుక్ గారి జీవన విశేషాలు చదివాకా ఆయనంటే అపారమైన గౌరవాభిమానాలు కలుగుతాయి పాఠకులకు. 


"జరుక్ శాస్త్రి పేరడీలు"  పుస్తకం చిన్నప్పటి నుండీ ఇంట్లో చూస్తున్నదే. "శరత్ పూర్ణిమ" మాత్రం ఈ మధ్యనే కొన్నాను. మొత్తం ఇరవై కథలున్న ఈ పుస్తకం పూర్తయ్యేసరికీ జరుక్ గారికి అభిమానినైపోయాను. వీరి మిగతా రచనలు మూడవ సంపుటిగా వస్తే చాలా బాగుంటుంది  కానీ వారి మారు పేర్ల సరదా వల్ల సాహిత్యాభిమానులకు అవి చేరలేవేమో! ఈ కథలే అతి కష్టం మీద సేకరించారుట నవోదయా పబ్లిషర్స్. ఇంత ప్రజ్ఞాశాలి రచనలు సాహితీలోకానికి సంపూర్ణంగా లభ్యం కాకపోవటం దురదృష్టకరమే!


'ఒక్క మెతుకు చూస్తే చాలు..' అన్నట్లు ఒక్క కథ చదవగానే వారి మేధస్సు ఎంతటిదో అర్థమైపోయింది. పుస్తకంలో నేను మొదట చదివిన కథ "ఒక్ఖ దణ్ణం". తర్వాత చివరి కథ "హోమగుండం" చదివాను. మనసంతా బరువెక్కిపోయింది. ఈ నరసమ్మ కథను దు:ఖ్ఖాంతం చెయ్యకుంటే బాగుండేది అని పదే పదే అనిపించింది. ఈ హాస్య వ్యంగ్య రచయితకు ఇంతటి ఆర్ద్రమైన కథలు రాసేంటటి మెత్తని మనసు ఉందని, ఆ మెత్తటి మనసు వెనకాల ఎంతటి బడబాగ్ని దాగి ఉండేదో కదా అనీ అనిపించింది ! అప్పట్లో స్త్రీలకు జరిగే అన్యాయాల పట్ల వారికెంతటి వ్యతిరేకత, సానుభూతి ఉండేవో అర్థం అయ్యింది. ఈ రెండు కథలూ పుస్తకంలో కెల్ల గొప్ప కథలు. అవి చదివాకా, స్త్రీ హృదయాన్ని ఈయన ఎంత బాగా అర్థం చేసుకున్నరో.. అనిపించక మానదు. 


కేవలం సంభాషణలతోనే కథంతా నడిచే "పెంకిపిల్ల" ఒక ప్రయోగమయితే, చక్కని అందమైన సంసారానికి ప్రతీక "శరత్ పూర్ణిమ". "యశోద" కథ తల్లి హృదయాన్ని తెలియచెప్పే interior monologue ! కవీంద్రుడు "రవీంద్రుడు" చనిపోయాకా రాసిన "నాలో నేను" డైరీలో ఒక పేజీలా ఉంది. టాగూర్ పట్ల ఆయనకెంత ప్రేమాభిమానాలున్నాయో చెబ్తుంది. టాగూరు 
"Do not go, my love, without asking my leave.
i have watched all night, and now my eyes heavy with sleep" అంటే, 

"ఏను నిద్దుర వోదునో, యేమొ, కరుణ
సెలవు గై కొనకేగగా వలదు; ఇన్ని
నాళ్ల యెడలేని యెడబాటు నా నిరీక్ష
ణమ్ము బరువులు బరువిలై నయన యుగళ
మయ్యొ దిగలాగు నిద్దర మరపులకును"
అని కృష్ణశాస్త్రి అన్నారుట.

ఇంకా.. బీదరికం, అనుమానం, స్వోత్కష, ప్రేమ, అహంకారం, దురాభిమానం, వ్యంగ్యం.. ఒకటేమిటి అన్ని రకాల సామాజిక, మానసిక అంశాలూ జరుక్ గారి కథాంశాలే ! ఒకో కథా ఒకో జీవితాంశాన్ని స్పృశిస్తుంది. ఆంగ్ల సాహిత్యంలో వీరికి ఉన్న అనుబంధ గాఢత కొన్ని కథల్లో మనకు కనిపిస్తుంది. ఈ కథల్లోని సరళమైన తెలుగు, సులువైన మాటలు, సూటైన వాక్యాలు, అక్షర సత్యాలు పాఠకహృదయాల్లో నిలిచిపోయాయి అనటం ఎంతమాత్రం అతిశయోక్తి కాదు.


ఈ కథల్లో నాకు బాగా నచ్చిన కొన్ని వాక్యాలు...

* ఈ ఆడపిల్లలది మరీ విచిత్రం. నీ దగ్గర నువ్వు అరచేతిలో ఆడిస్తూ, తల్లో పువ్వులాగ చూశినా సరే, ఎంత సొతంత్రo ఇచ్చినా సరే. పంజరంలో చిలకలగా ఉంటారు. పుట్టింటికంటూ వెళ్లారో - నీటిలో చేపల్లాగా తిరుగుతారు.

* వీరుడంటే..?
కత్తి పుచ్చుకుని కదనకుతూహల రాగం రైట్,లెఫ్ట్ చిందుల్లో రంగరిస్తు యుధ్ధరంగానికి పోయిన మగాడు...... పనిలోకి వెళ్ళిన వాడల్లా వీరుడే కత్తి పుచ్చుకోకపోయినా - గరితటెను గాండీవంలాగు పుచ్చుకున్నవాడూ? వీరుడే.

* ఈ కాస్త సుఖం గూడా భగవంతుడు దక్కనీడు. నాకు తెలుసు. చూస్తున్నాగా. ఏది తలపెట్టు - భగవంతుడూ ఎగస్పార్టీ?

* అడ్రస్ దొరుకుతుందేమో అని సూట్కేస్ అంతా గాలించాడు....అన్నీ తీశాడు. అవన్నీ మల్లెపూలలాగ పరిమళించడమే గాని, ఏమీ చెప్పవు. మల్లెపూలైనా మేలే - తర్వాత కథ చెబ్తే.

* స్వార్థం వల్లనేనేమో "లోకాస్సమస్తా స్సుఖినోభవంతు" అని నిత్యం కోరుకోటం...గడియారంలో ఈ చక్రం సరిగా తిరగాలంటే అవతలి అన్ని చక్రాలూ, అన్ని పళ్ళూ ఉండి సమంగా తిరిగితేనే గదా ఇది తిరగడం. మన తిప్పట కోసమే, మన సుఖం కోసమే, అందరినీ సుఖపడామంటున్నామేమో..

*తనలాగే అందరూ అనుకోవడం మానవస్వభావం. ఇది అమాయకత్వపు చిహ్నం. అమాయకత్వం యింకా ఎంత ప్రక్షాళన కాదో అంత సూటిదనం ఉంటుంది. పసిపిల్లల్లో ఇది మరీనూ. 

*పేచీ వస్తుందనుకున్న చోట పేచీ రాకపోవటం ఎంతో నిరాశను కలగిస్తుంది. ఎంతో ప్రేమైనా ఉండాలి; కావలసినంత అసహ్యం అన్నా వుండాలి పేచీ రాకపోవటానికి.

*వెలుతురూ,చీకటీ పోట్లాడుకుంటున్నై. బొద్దింకలు తప్పుకు పారిపోతున్నాయి, పొయ్యిలో మంతలు గమ్మత్తుగా లేస్తున్నై. అగ్నిహోత్రుడికీ, ఆలోచనలకీ సయోధ్యల్లేవుంది. జ్వాలలు ఆదుతున్న కొద్ది ఆలొచనలు ఆడుతై.

*ప్రేమ ఉంటే ఏమైనా అనవచ్చు. పడవచ్చు గానీ, ప్రేమ కరువైన చోట 'ఆc' అంటం అన్యాయం. 'నారాయణా' బూతుమాటే !

* కొన్ని ప్రాణాలు సంతోషించటానికీ, సుఖపడటానికీ పుట్తవు. సంఘానికై వెంపరలాడతాయి గానీ, సుఖమ్ అనేది దక్కదు. ఆరాటమే మిగుల్తుంది.

*సాటి మనిషిని హింసించి, హింసించి చంపి, ఎన్ని యజ్ఞాలు చేస్తే ఏం...

*ఆకాశానా, యింట్లో, మాలో. మృతమౌనం! సప్తమహర్షులు పక్కన. సీరియస్ నాలోలాగా నిమిషనిమిషం రంగులు మారుస్తోంది. దూరాన కుజుడు మునిగోఇంట పువ్వులాగ.

*ఈ ఋషులు మౌనంగా ఉంటారు గానీ, ఎలా ఉంటారో... రాళ్ళలాగ, చెట్లలాగా.

* మన ఆశయాలు, అభిరుచులు ఎంత ఉన్నతాలైనా సరే - చేతిలో దబ్బులేకపోతే మనం ఏమీ సాధించలేం.

* నీ ప్రేమ ఎంత మధురమైనదో, నీ జాలి అంత బాధాకరం..

*"ఇదిగో బాయ్..అండీ గిండీ జాంతా నై. మనం భాయీ అంటే..భాయీ. లౌకిక మర్యాదలు వొద్దు. శుష్క ప్రియాలు వొద్దు. హృదయాలు విప్పి మాట్లాడుకుందాం."
నాకు వికరంతో కూడిన నవ్వు వచ్చింది. ఇలా లోగడ నేను చవకగా హృదయం విప్పి, విప్పమనీ అన్నప్పుడల్లా ఎందరు నవ్వుకున్నారో?

*పళ్ళాల చప్పుడులోనూ, మాలాంటివాళ్ళ బాతాఖానీ మహాభాష్యపురొదలో కళకళాలాడుతున్న వెయ్యి సంతర్పణల గలాభాలో అక్కడక్కడ వినబడుతోంది.

*ప్రేమా - సింగినాదం జీలకర్రాను; తోటి మనుష్యులా?జలగలు! తెలీకుండా నెత్తురు పిలుస్తారు! స్వేచ్ఛా..? ఆఘప్రసూనాలు తలలో తురుముకోడం; ఆశా? - కన్నీటిబొట్టుపైని సూర్యకిరణం తెప్పించే ఇంద్రధనువు! ఎందుకులెండి ఇప్పుడు వాటి స్మరణ - మీ పనేదో మీరు చూసుకోండి!!

* వెధవ నాగరికత. ఉన్నదున్నట్లు అని బతకలేమాయె.

*లోని నిజం పైకి చెబితే - విషం కాదా?

* ...నవ్వాను. ఆ ఒక్కనవ్వూ నా జీవితాన్నంతనూ పట్టి ఇవ్వవచ్చు.

* "దాందుంపతెగా - కళ్లకనపట్టం భయమాయె. తే. తే. ఎక్కణ్ణుంచి తెస్తారు? కుప్పలు పోసుక్కూర్చున్నారా? ఇలా సతాయించే బదులు ఏ అచ్చాఫీసులోనైన్నా పని కుదుర్చుకోరాదు? దేశబాధ తప్పుతుందీ. ధనుకులు, ధనికులు! వీళ్ల దుంపతెగా - పని చూపించి తిండి పెట్టే బదులు, కోర్తి కోసం - బిచ్చం వేసి - పొమ్మంటారు. ఈ దోపిడీగాళ్ళు జట్టుని తయారుచేసింది మహాదాతలే."

*మనసుకు నొప్పి కలక్కపోతే - మనం ముందుకు పోం. చలిమిడి సుద్దగా ఉన్నట్టుగానే ఉంటాం: మానవ మానసికవేదనకు ఖరీదు లేదు, నిజం. తల్లీ, తండ్రీ, భార్య, స్నేహితులు, సంఘం కట్టుకట్టి పోరి మొహాన వుమ్మేసి గెంటకపోతే, మానవమాత్రుడు సంపాదనకు దిగడు. సోమరిపోతు ఔతాడు నిజం.

* "మార్పు లేని మజా లేని, విశ్రాంతి గృహం ఆ స్వర్గం! నేను అనేది సమృధ్ధిగా వుండి ఏదో సాధించడానికి వీలైన స్థలo వొదులుతావు, ఎంత పిచ్చివాడవయ్యా నాయనా !"




Thursday, April 4, 2013

"కవులమ్మ ఆడిదేనా?" కథా పరిచయం



"సారంగ సాహిత్య వారపత్రిక " లో నేను రాసిన కథా పరిచయం క్రింద లింక్ లో చదవవచ్చు:
http://www.saarangabooks.com/magazine/?tag=%E0%B0%A4%E0%B1%83%E0%B0%B7%E0%B1%8D%E0%B0%A3

తాయమ్మ కరుణ గారు రచించిన "కవులమ్మ ఆడిదేనా?" కథానికను కుడా అక్కడ చదవవచ్చు. నా కథాపరిచయాన్ని ప్రచురించిన సారంగ పత్రిక వారికి బ్లాగ్ముఖంగా ధన్యవాదాలు.


మొన్నొకరోజు "కొత్త పుస్తకాలు" టపాలో నవోదయా ఆయన ఒక పుస్తకం కొనమన్నారనీ, అందులో కథఒకటి చాలా బావుందన్నారని రాసా కదా.. ఆ కథే ఈ కథ..! ఈ కథ “మధురాంతకం రాజారాం సాహిత్య సంస్థ” ప్రచురించిన “కథావార్షిక 2004″ కథా సంకలనం లోనిది.


Sunday, March 24, 2013

కొత్త పుస్తకాలు

(కొత్త పుస్తకాలకింకా ఫోటో తియ్యలే..ఇది పాత ఫోటోనే)


అప్పుడప్పుడు దాచుకున్న కాయితం ముక్కలతో పర్సు నిండగానే మనసు పుస్తకాల షాపు వైపు పరుగులు తీస్తుంది. గత ఏడాది మూడు దఫాలుగా కొన్న పుస్తకాలన్నీ చదవటం అవ్వనేలేదు.. మళ్ళీ కొనటం ఎందుకని కాస్త ఆగాను. పది పదిహేను రోజుల క్రితం ఒక కొత్త పుస్తకం గురించి విన్నాకా శ్రీవారికి ఫోన్ చేసి అడిగితే, పాపం ఆఫీసు నుండి రెండు ప్రముఖ షాపులకూ వెళ్ళి ఇంకా రాలేదన్నారని వచ్చేసారు. కాస్తాగి మళ్ళీ ఇవాళ చేస్తే నవోదయాలో ఉందని చెప్పారు. సరే పదమని శ్రీవారిని బయల్దేరదీసా. " ఆ పుస్తకమేదో మొన్ననే దొరికి ఉంటే బావుండేది... నువ్వు బయల్దేరితే..." అని పాపం భయపడ్డారు. "అబ్బే మీ జేబుకేం భయంలేదు.. నా పర్సు ఈమధ్యన కాస్త బరువెక్కిందిలెండి" అని అభయమిచ్చాను :)


ఎవరెంత దూరంలో ఉండాలో దేవుడంతే దూరంలో ఉంచుతాడుట. అందుకేనేమో పుస్తకాల షాపులకీ నాకూ మధ్యన  మైళ్ళు బాగా ఎక్కువైపోయాయి. అంచేత బండి పక్కనబెట్టి బస్సు మార్గాన్నేఎంచుకున్నాం. ఎర్రని ఎండలో రెండు బస్సులు మారి గమ్యం చేరాం. పుస్తక ప్రదర్శన తర్వత మీరు మళ్ళీ రాలేదేం అని ఆప్యాయంగా పలుకరించారు షాపులో ఆయన. "మొన్న మిమ్మల్ని ఖాళీ చేతులతో పంపించామని మేము బాగా ఫీలయ్యామండీ.." అంటూ మావారి చేతిలో నాక్కావాల్సిన పుస్తకాన్ని పెట్టారు ఆయన. "అక్కడివ్వండి.. ఈసారి ఆవిడదే బిల్లు.." అంటూ దొరికిందే ఛాన్సని మరో నాలుగు ఛలోక్తులు విసిరారు అయ్యగారు. "అబ్బే ఆవిడ ఖచ్చితంగా అలా అని ఉండరు.." అని షాపాయన నాకు సపోర్టందించారు. నేను తీసుకున్న పుస్తకాలు కాక మరో ఐదారు పుస్తకాలు బిల్లు జాబితాలో చేర్పించాకా "ఈ కథలు కూడా బావుంటాయి చూడండి.." అని మరో పుస్తకాన్ని అందించారు. వద్దు మహాప్రభో...ఇక చాలన్నాను. ఆయన వెంఠనే పుస్తకాన్ని తెరిచి ఓ కథ చూపెట్టి, "ఈ కథ చదవండి. నచ్చకపోతే పుస్తకం వెనక్కి తెచ్చి ఇచ్చేయండి. ఈ ఒక్క కథ కోసం ఈ పుస్తకం కొనచ్చు" అన్నారు. ఇహ అది కూడా కలిపి ఓ పదిపదిహేను పుస్తకాలు రెండు క్లాత్ కవర్లల్లో నింపుకుని, తృప్తిగా మిగతా పనులు ముగించుకుని ఇల్లు చేరేసరికీ రాత్రి భోజనసమయం దాటిపోయింది. 


ఇంటికొచ్చి గబగబా వంటచేసి, తిని, పిల్లని పడుకోబెట్టి, అన్ని పనులూ పూర్తి చేసుకునేసరికీ గడియారం ముల్లు ఇవాళ్టి తేదీ చూపించేసింది. కొత్తగా కొన్నపుస్తకాలు ఇంటికొచ్చాకా ఓసారి మళ్ళీ అన్నీ తిరగేసి, అన్నింటిపై కొన్నతేదీ వేసి, సంతకం పెట్టుకోవటం నాకు అలవాటు. రేపు ఆదివారమే కదా అందుకని లేటయినా తీరుబడిగా అన్నీ ఓసారి తిరగేసి, షాపాయన బాగుంటుందన్న కథ చదువుతూ లోకం మర్చిపోయినా, మధ్యలో ఓసారి తలెత్తి 'నాకు లేటవుతుంది.. మీరు నిద్రోండి..' అని చెప్పేసా! మనసు బరువైపోయినా వెంఠనే రెండవసారి మళ్ళీ చదివా! కథయ్యేసరికీ ఈ సమయమైంది. అసలు ఆ కథ గురించి రాద్దామని బ్లాగు తెరిచా.. కానీ ఈ కథంతా రాయాలనిపించి రాసేసా :) ఎందుకనో ఈసారి కొన్న పుస్తకాలన్నీ చాలా ఆనందాన్నీ, మంచి పుస్తకాలు కొన్నానన్న తృప్తినీ కలిగించాయి. వీటిల్లో ఎన్నింటి గురించి టపాలు రాయగలనో... చూడాలి మరి !


వచ్చేప్పుడు దారిలో నాన్న డాక్టరు దగ్గరకు వెళ్తే, పుస్తకాలు చూపించచ్చు అని అక్కడికి వెళ్ళా. నాన్న అన్నీ చూసి "బావున్నాయే.." అని "మరి చిరిగిన చొక్కా ఏదీ.." అన్నరు :-)

Wednesday, December 19, 2012

ఈ సంవత్సరం కొన్న పుస్తకాల కబుర్లు



ఉన్నవి చాలు ఇక కొత్తవి ఎందుకని పుస్తకాలు కొనటం మానేసి, సంసార సాగరంలో పడ్డాకా ఖాళీ దొరక్క సినిమాలు చూడ్డం మానేసి ఏళ్ళు గడిచాయి. అయితే బ్లాగ్లోకంలోకి అడుగుపెట్టాకా మళ్ళీ ఈ రెండు అభిరుచులకీ సమయం కేటాయించటం మొదలయ్యింది. ప్రస్తుతానికి ఈ టపాలో పుస్తకాల గురించి చెప్తానేం.. బ్లాగుల్లో అక్కడా అక్కడా రకరకాల పుస్తకాల గురించి చదువుతుంటే మళ్ళీ విజయవాడ పుస్తకప్రదర్శన రోజులూ, మొదలుపెట్టింది మొదలు ప్రతి ఏడూ విడువకుండా వెళ్లటం అన్నీ గుర్తొచ్చి... మళ్ళీ పుస్తకాలు కొనాలనే కోరిక బయల్దేరింది. బుర్రలో ఆలోచన పుట్టిందే మొదలు పుస్తకాల షాపులవెంట పడి తిరగటం మళ్ళీ అలవాటైపోయింది. చిన్నప్పటి నుండీ ఎవరు ఎప్పుడు బహుమతిగా డబ్బులు ఇచ్చినా దాచుకుని, వాటిని పుస్తకాల మీద ఖర్చుపెట్టడం నాకు అలవాటు. ఇప్పటికీ అదే అలవాటు. ఇప్పుడు పెద్దయ్యాం కాబట్టి బహుమతులు కూడా కాస్త బరువుగానే ఉంటున్నాయి నే కొనే పుస్తకాలకు మల్లే..:)

క్రిందటేడు పుస్తక ప్రదర్శనలో పెద్ద పెట్టున పుస్తకాలు కొన్నాననే చెప్పాలి. క్రింద ఫోటొలోవి మొదటి విడతలో కొన్నవి. చివర్లో మరోసారి వెళ్ళినప్పుడు మరికాసిని అంటే ఓ ఐదారు పుస్తకాలు కొన్నా. వాటికి ఫోటో తియ్యనేలేదు :( వాటిల్లో ఓ పది పుస్తకాలు చదివి ఉంటాను. మిగిలినవి అలానే ఉన్నాయి..




ఆ తర్వత ఓసారి మార్చిలొనొ ఏప్రిల్ లోనో విశాలాంధ్రలో క్రింద ఫోటోలో పుస్తకాలు కొన్నా..



అవి సగమన్నా చదవకుండా మళ్ళీ ఎవరికోసమో పుస్తకాలు కొనటానికి వెళ్ళి అప్పుడు మరో పదో ఎన్నో తీసుకున్నా. ఓసారి ఏదో గిఫ్ట్ కొందామని Landmarkకి వెళ్ళి అక్కడ "త్రీ ఫర్ టూ" ఆఫర్ నడుస్తోందని మూడు కాక మూడు కాక మరో రెండు కలిపి ఐదు బుక్స్ కొనేసా. వాటిల్లో ఓ మూడు చదివా. 





మా అమ్మావాళ్ళింటి ముందరే కోటి వెళ్ళే బస్సులు ఆగుతాయి. కోటికి గంట ప్రయాణమైనా అక్కడికి వెళ్తే ఈజీగా కోటీ వెళ్ళొచ్చని నాకు సంబరం. ఓసారి ఇంటికెళ్ళినప్పుడు ఏం తోచక కోటీ వెళ్ళొస్తానని బయల్దేరి మళ్ళీ కొన్ని పుస్తకాలు వెంటేసుకొచ్చా. ఇల్లు మారేప్పుడు అట్టపెట్టిలోకెళ్ళిన ఈ కొత్త పుస్తకాలన్నీ ఇంకా వాటిల్లోనే ఉన్నాయి. మళ్ళీ ఇల్లు మరినప్పుడే అవి బయటకు వస్తాయి. అన్ని పేర్లు గుర్తులేవు కానీ కొన్ని పేర్లు గుర్తున్నాయి.. గోదావరి కథలు, ఓహెన్రీ కథలకి తెలుగు అనువాదం, సోమరాజు సుశీల గారి దీపశిఖ, కొత్తగా ప్రచురించిన రవీంద్రుడి కథలు, రవీంద్రుడి నవలలకు తెలుగు అనువాదాలు కొన్ని..  

ఆ తర్వాత ఇటీవలే మావారు ఎవరికోసమో పుస్తకం కొనటానికి వెళ్తూ పొరపాటున నన్ను కూడా నవోదయాకు తీసుకువెళ్ళారు. అప్పటికే నన్ను గుర్తుపట్టడం వచ్చేసిన షాపులో ఆయన "మేడం ఇవొచ్చాయి.. అవొచ్చాయి.." అని నాతో ఓ సహస్రం బిల్లు కట్టించేసుకున్నారు. అగ్రహారం కథలు, ఏకాంత కోకిల, వాడ్రేవు వీరలక్ష్మి గారి మా ఊళ్ళో వాన, ఒరియా కథల పుస్తకం ఉల్లంఘన, మొదలైనవి కొన్నా.  అప్పుడే నవోదయా ఆయన చెప్పారు పుస్తకప్రదర్శన డిసెంబర్ పధ్నాలుగు నుండీ అని. ఎందుకు సామీ ఈవిడకు చెప్తారు...అని పాపం మావారు అదోలా చూసారు నన్ను :))




ఇక ఈ ఏడు పుస్తక ప్రదర్శన కబుర్లు:

డిసెంబరు వచ్చింది.. ఈ ఏడు పుస్తక ప్రదర్శన కూడా వచ్చింది. కాకపోతే ఇప్పుడున్న ఇల్లు ఊరికి చాలా దూరం. ఎలా వెళ్ళాలా అని మధనపడుతుంటే క్రితం వారాంతంలో అమ్మావాళ్ళింటికి వెళ్ళాల్సిన పని వచ్చింది. ఐసరబజ్జా దొరికింది ఛాన్స్ అని అయ్యగారిని గోకటం మొదలెట్టా..:) పాపం సరేనని మొన్నాదివారం  తీస్కెళ్ళారు. పన్నెండింటికి వాళ్ళు ప్రదర్శన ప్రారంభించగానే దూరేసాం లోపలికి. 


గేట్లో న్యూ రిలీజెస్ అని రాసిన పేర్లు చదువుతూంటే మావారు ఎవరినో చూసి నవ్వుతు చెయ్యి ఊపటం గమనించి ఎవరా అని చూస్తే ఎవరో చైనీస్ అమ్మాయి చేతిలో ల్యాప్టాప్ పట్టుకుని చూసుకుంటోంది. నేను పెళ్ళిపుస్తకంలో దివ్యవాణిలా మొహం పెట్టాను. "ఆ అమ్మాయి తన ల్యాపి లోంచి నీకు ఫోటో తీస్తోంది..అందుకే నవ్వుతూ చెయ్యి ఊపాను" అన్నారు తను. అప్పుడు మళ్ళీ ఆ అమ్మాయిని చూసా.. అప్పుడా అమ్మాయి కూడా నవ్వుతు నాకు చెయ్యి ఊపి లోపలికి వెళ్ళిపోయింది. తర్వాత చూసాం లోపల "Falun Dafa"  అనే సెల్ఫ్ కల్టివేషన్ ప్రాక్టీస్ తాలుకూ స్టాల్ ఉంది. అందులో బోలెడుమంది చైనీస్ అమ్మాయిలు సీరియస్గా మెడిటేషన్ చేసేస్తున్నారు. ఈ 'కల్టివేషన్ ప్రాక్టీస్' వివరాలు కూడా ఆలోచింపజేసేవిగానే ఉన్నాయి. ఆ వెబ్సైట్లో వివరాలు చదవాలి.


పైన రాసినట్లు ఈ ఏడాదంతా పుస్తకాలు కొంటూనే ఉన్నా కాబట్టి కొత్తగా కొనాల్సినవి చాలా తక్కువగా కనబడ్డాయి. అయినా పుస్తకాల కొనుగొలుకు అంతం ఎక్కడ? కనబడ్డవేవో కొన్నాను.. క్రితం ఏడు కొనలేకపోయిన "Living with the Himalayan Masters"కి తెలుగు సేత దొరికింది. అమ్మకు గిఫ్ట్ ఇద్దామని వి.ఎస్.ఆర్ మూర్తి గారి "ప్రస్థానమ్" కొన్నాను.




నవోదయా షాపాయన హలో మేడమని పలకరిస్తే ఆ స్టాల్లో దూరి మృణాళినిగారు తెలుగులోకి అనువదించిన "గుల్జార్ కథలు", నా దగ్గర లేని శరత్ నవల "చంద్రనాథ్", ఎప్పటి నుంచో కొందామనుకున్న "స్వేచ్ఛ", పిలకా గణపతి శాస్త్రి గారి "ప్రాచీనగాథాలహరి" కొన్నా. తర్వాత ఓ చోట కొన్ని ఆరోగ్య సంబంధిత పుస్తకాలూ తీస్కున్నా. వీటిలో "చిరుధాన్యాల" గురించిన చిన్న పుస్తకం బావుంది.





"హాసం" పత్రికలో తనికెళ్ల భరణి గారివి "ఎందరో మహానుభావులు" పేరుతో వ్యాసలు వచ్చేవి. అవి చదివాకే నాకు ఆయనపై మరింత గౌరవాభిమానాలు పెరిగాయి. ఆ ఆర్టికల్ కట్టింగ్స్ అన్నీ దాచుకున్నా కూడా. ఆ సంకలనం కనబడగానే తీసేస్కున్నా. తర్వాత అమ్మ బైండింగ్ చేయించి దాచిన పత్రికల్లోని నవలలో "ఉదాత్త చరితులు" అన్న పేరు బాగా గుర్తు నాకు. ఈ నవల ఆ బైండింగ్స్ లోనిదే అనిపించి అది కూడా కొన్నా.



స్కూల్లో ఉండగా నా ఫ్రెండ్ ఒకమ్మాయి ఇంగ్లీష్ నవలలు బాగా చదివేది. స్కూల్ బస్సులో రోజూ వెళ్ళేప్పుడు వెచ్చేప్పుడు బస్సులోకూడా చదువుతూ ఉండేది. అలా ఓసారి తను "రూట్స్" అనే నవల చదివింది. చాలా గొప్ప నవల చదువు అని అప్పుడప్పుడు కథ చెప్పేది. అప్పట్లో నాకు పుస్తక పఠనం పై పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. ఆ తర్వాత చాలా సార్లు "రూట్స్" కొనాలనుకున్నా కానీ కొననేలేదు. హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలో రెండు మూడేళ్ల నుండీ రూట్స్ కి తెలుగు అనువాదం చూస్తున్నా కానీ కొనలేదు. అందుకని ఈసారి తెలుగు అనువాదం "ఏడు తరాలు" కొన్నా.



Oxford University Press వాళ్ల స్టాల్లో పిల్లలకి మంచి పుస్తకాలు దొరుకుతాయి. క్రితం ఏడాది కొన్న మేథమేటిక్స్ వర్క్బుక్స్ మా పాపకి చాలా పనికివచ్చాయి. అందుకని ఈసారి కూడా ఇంగ్లీష్ + మేథ్స్ బుక్స్ కొన్ని తీసుకున్నాము. వాటితో పాటు లోపల సీడిలు కూడా ఉన్నాయి. ఇవి కాక పిల్ల కోసమని మరికొన్ని కొన్నా నేను. "ఫన్నీ కార్టూన్ ఏనిమల్స్" అనే పుస్తకంలో పెన్సిల్ స్కెచెస్ బాగా నచ్చి, పిల్లతో పాటు నేను వేద్దామని కొన్నా :) క్రింద ఫోటోలో బుక్స్ లో "పారిపోయిన బఠాణీ" అనే పిల్లల నవల మా చిన్నప్పుడు మా ఇంట్లో ఉండేది. చిన్నప్పుడు బోలెడన్ని సార్లు అదే కథ చదివేదాన్ని నేను. కథ గుర్తుండి ఎప్పుడూ పాపకి చెప్తూంటాను కానీ అసలు పుస్తకం ఇంట్లో కనబడట్లేదు. ఒక చోట పిల్లలపుస్తకాల మధ్యన "పారిపోయిన బఠాణీ" కనబడగానే పట్టలేని ఆనందం కలిగింది.




పుస్తక ప్రదర్శనలో ఏదో ఒక పోస్టర్ కొనటం చిన్నప్పటి నుండీ నాకు అలవాటు. ఒక చోట త్రీడీ పోస్టర్స్ అమ్ముతున్నారు. రాథాకృష్ణులది ఒకటి కొన్నా. క్రింద ఉన్న మూడు ఫోటోలూ ఒకే పోస్టర్ వి.





ఇంకా కొత్తగా నాకు పింగళి గారి పాటలపై రామారావుగారు రాసిన రెండవ భాగం కనబడింది. మొదటిది ఎప్పుడో వచ్చింది. ఈ రెండూ మాత్రం కొనాల్సిన జాబితాలో ఉన్నాయి..:) ఎప్పుడో తర్వాతన్నా తీసుకోవచ్చు కదా అని ఊరుకున్నా.


ఇంకా.. పాత ఇంగ్లీష్ నవలలు ఏభైకి, అరవైకి రెండు చోట్ల అమ్ముతున్నారు. మంచివి ఎన్నుకుని టైమ్ పాస్ కీ, ప్రయాణాల్లో చదవటానికి కొనుక్కోవచ్చు. పిల్లల పుస్తకాలు కూడా ఓల్డ్ స్టాక్ అనుకుంటా తక్కువ ధరకి అమ్ముతున్నారు. అవి కూడా కొన్ని కొంటే,  ఇంటికి పిల్లలెవరైనా వస్తే ఇవ్వటానికి పనికివస్తాయి అనిపించింది.

చివరాఖరుగా పుస్తకాల షాపువాళ్ళిచ్చిన తాలుకూ రంగురంగుల క్లాత్ కవర్లు..బిల్లులు, ప్రదర్శన టికెట్లు :-)



Tuesday, November 20, 2012

ఏకాంతకోకిల






అడవి యాకులందు నలరుల రేకుల
నీటి చినుకులెల్ల నిలిచి, గాలి
వీచినంత తెరలి, విచ్చలవిడి తోడ
మబ్బులేని వాన మరియు కురియు

కొండపైని వాన గుడి ముంగిటనువాన
చెరువు తమ్మిపూల చెంత వాన
పల్లెటూరి వరినాట్ల పై వాన
విరహిజనుల మనసు బరువు, వాన

***     ***       *** 

తనువులోపల జేరగ తపనపడుట
వెలుపలికి ముక్తి గోరుచు వెతలcబడుట
అక్షరమ్ముల మిగులు నా యనుభవములు
పుస్తకము వంటి బ్రదుకులో పుటలనడుమ

***      ***      *** 

తరిమి మూసిన రాతిరి తరిగిపోని
దిగులు నదివో లెవ్యాపించు, దెసలనడుమ
ఎన్ని నిట్టూర్పు పొగ మబ్బులిచటc గురిసి
తడియు, స్పర్శయులేనిదై సుడులు రేపు!

***      ***       *** 

రేయి నాకసమ్ము చేయి విదల్చుచు
ఆసవంపుపాత్ర నవని పైకి
వంపినప్పు డాసవమ్ము తొణికె నేమొ
తరువు తరువు తడిసి యరుణమాయె !



***       ***       *** 

 అనుభవమ్ము నాకు ఆప్తప్రమాణమ్ము
కవితకైన, బ్రతుకుకథలకైన;
అంతరంగ శుక్తి హత్తుచు, మేలైన
స్వాతి వాన చినుకు వ్రాలవలయు !


***     ***        *** 

తెలియబడనిది, తెలియగా విలువగలది
తెలిసి తెలియని వేళలొ తీపుc గలది,
మదికి తహతహ పుట్టించు మహిమcగలది
మనిషి యనుభూతి, కవితకు మర్మశక్తి !


***     ***        *** 


"ఏకాంతకోకిల" శ్రీకాంతశర్మ గారి కొత్త పుస్తకం
తన మిత్రులు, కథారచయిత తల్లావజ్ఝుల పతంజలిశాస్త్రి గారికి అంకితం చేసారు.
కవర్ బొమ్మ: బాపూ
కవర్ డిజైన్: చంద్ర
నవోదయా పబ్లికేషన్స్
వెల: నలభై రూపాయిలు