సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||
Showing posts with label కవిత. Show all posts
Showing posts with label కవిత. Show all posts

Tuesday, July 21, 2009

నేను-తాను...





నిన్నలొ ఉన్నది నేను
నేడులొ ఉన్నది తాను
తానెవరో తెలియదు నాకు
నేనెవరో తెలియదు తనకు


గడిచిపోయిన నిన్నలలో నిలిచిపోయిన నన్ను
పరిచయమే లేదంటూ పరిశీలిస్తుందా కన్ను
నువ్వెవరని ప్రశ్నిస్తూ నిలేస్తుంది నన్ను
ఆ శోధనలో నిరంతరం ముఖాముఖి మాకు

కలలలో నిదురలో కలతలో తానే నా తోడు
నేను లేని తానెవరని అచ్చెరువే నాకు
సంసార మధనమే నిరంతర ధ్యానం తనకు
తనతొ చెలిమికై ప్రయత్నమే ప్రతినిత్యం నాకు

నేనే నువ్వంటూ కవ్విస్తుంది నన్ను
నీ నేడే నేనంటూ తడుతుంది వెన్ను
ఒక్క క్షణం కళ్లలోకి సూటిగా చుసి
కనుపాపలో దాగిన రూపు తనదంటుంది

ఆ కొత్త రూపాన్ని నేనేనని నమ్మాలి
నాకై నా వెతుకులాటనికనైనా ఆపాలి
ఈ నిరంతర అన్వేషణకిక స్వస్తి పలకాలి
ఇదే నా అస్థిత్వమని మళ్ళి మళ్ళి నమ్మాలి !!


(నిరంతరం వివాహానంతరం ప్రతి స్త్రీలో జరిగే మధనమే ఇదని నా అభిప్రాయం...)

Saturday, June 20, 2009

అంతర్మధనం...


మధనం...అంతర్మధనం....

వైరాగ్యం యదార్ధమైనప్పుడు జీవితాన్ని ఆస్వాదించేదెలా?

కర్తవ్యం నిర్దేశింపబడిఉన్నప్పుడు కోరికల్ని నశింపజేసేదెలా?

చేయూత ఉన్నా చుట్టూరా ఒంటరితనమే ప్రజ్వలిస్తూంటే

మౌనమే ఆధారమని మనసుకి నచ్చచేప్పేదెలా?

తడిఆరని కన్నులు చీకట్లని చూస్తూంటే వెలుగునకై వెతికేదెలా?

బాధ్యతల నడుమ ప్రాణం గిలగిలలాడుతూంటే స్వేచ్చగా అది ఎగిరేదెలా?


Saturday, May 30, 2009

మనసంతా నువ్వైనా వేళ







మనసంతా నువ్వైన వేళ ..
ప్రణయమో
విరహమో
తాపమో
ఇది ఏమో నాకు తెలియదులే
మది నిండా పులకింతేలే

ఎదురు చూపులో
కలవరింతలో
మైమరపులో
తనువంతా కనులాయనులే
ఇది వింతైన అనుభూతేలే

రాగంలో
అనురాగంలో
హృదయనాదంలో
అన్నింటా ఉన్నది నీవేలే
నేనన్నది ఇక నీవేలే

మాటలో
పాటలో
ప్రతి పిలుపులో
వినిపించే నీ పిలుపేలే
నీ మాయే ఇదియని తెలిసెనులే

నీ గమనంలో
ఆ మౌనంలో
ప్రతి కదలికలో
ఉన్నదంతా అనురాగమని
తెలుపకనే తెలిపినవి నీ కనులేలే !!

Thursday, May 28, 2009

మనసులో మెదిలాయి ...


మనసులో మెదిలాయి ...
మనసులో మెదిలాయి ఆనాటి ఆశలు...
కలలు కన్నఆ కళ్లు
రాగం పలికిన ఆ స్వరం
రంగులు పరిచిన కుంచలు
రంగవల్లులు వేసిన వాకిళ్ళు
ఆట పాటల కేరింతలు
ఘుమఘుమల రుచులు
ఆత్మీయుల మన్ననలు
స్నేహితుల అభిమానాలు
పుస్తకాలకే పరిమితమైన పరిధులు ...
మనసులో మెదిలాయి ఏవో మధురానుభూతులు !!
ఆదర్శాలు ఆలోచనలు
నిర్ణయాలు వాటి నిమజ్జనాలు
ఆవేశాలు ఉద్వేగాలు
నిరాశలు వాటి నిట్టూర్పులు ...
మనసులో మెదిలాయి ఆ నిస్సహాయతలు !!

కలల నుంచి కాగితం పొరల్లోకి జారి
అక్షరం నుంచి ఆవిరైన ఆశలవైపు
జాలిగ చూసాయి కనుమరగైన సంకల్పాలు
నిలకడ లేని నిశ్చయాలను వెక్కిరించాయి
వివేచన చేయగల అంతరంగాలు
చేవలేని ఆక్రోశాలని చీత్కరించాయి
ఆలోచనల హ-హ కారాలు..
మనసులో మెదిలాయి నా పిరికితనపు కసరత్తులు...!!