సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Thursday, July 17, 2025

OTT Entertainment - 3 : 8 వసంతాలు

                                                    


నాలుగైదు సినిమాలు కలిపి ఒక టపా రాద్దామనుకుంటాను. ఈలోపూ మొత్తమంతా ఒకే సినిమా గురించి చెప్పాలనిపించేలాంటి సినిమా ఒకటి వస్తోంది. ఇది అలాంటి ప్రత్యేకమైన సినిమా! ఇంతకు ముందు ఏమి సినిమాలు తీశారో తెలీదు కానీ ఇంత గొప్ప సినిమా తీసిన దర్శకుడు ఫణింద్ర నర్సెట్టి గారికి అభినందనలు. ఇటువంటి మంచి తెలుగు సినిమాలు ఇంకా ఇంకా రావాలని మనస్ఫర్తిగా కోరుకుంటున్నాను. 


పదేళ్ళక్రితం నిత్య బంగారం నటించిన "మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు" అని ఒక సినిమా వచ్చింది. యువతి యువకుల మధ్య ప్రేమ ఇలా ఉండాలి అనే ఒక గొప్ప నిర్వచనాన్ని చూపెట్టిందా కథ. మళ్ళీ ఇన్నేళ్లకు అటువంటి మరో గొప్ప నిర్వచనాన్ని ప్రేమకు ఆపాదించిన కథ ఈ ఎనిమిది వసంతాలు. ఒక ఆంగ్లపత్రికవారు ఎందుకనో మనస్ఫూర్తిగా మెచ్చుకోలేకపోయారు కానీ నాకయితే ఏ వంకా కనిపించలేదు. మూస సినిమాల నుంచి భిన్నంగా, ఆదర్శవంతంగా, పోజిటివ్ గా, ఉన్నతంగా ఉన్న సినిమాలని ప్రోత్సహించాలి. మెచ్చుకోవాలి. ఈకలు పీకకూడదు. హీరోయిన్ తల్లి చెప్పినట్లు ఈ "..కథలో రెక్కల గుర్రాల్లేవు, రాక్షసులతో యుధ్ధాల్లేవు, ఐనా ఇది చందమామ కథకు ఏ మాత్రం తీసిపోని కథ. మనిషి మీద, ప్రేమ మీద గౌరవాన్ని పెంచే కథ".


ఆ రోజు రిలీజయిన ఇంకేదో సినిమా కోసం ఓటీటీలో వెతుకుతూ ఉంటే ఇది కనిపించింది. ట్రైలర్ ఆ మధ్యన చూశాను. ఆసక్తికరంగా ఉంది. సరే ఇది చూసేద్దాం అని మొదలుపెట్టాము. చివరి దాకా కదిలితే ఒట్టు. ఆ అమ్మాయి..అదే హీరోయిన్ పిల్లని ఇదివరకూ MAD సినిమాలో చూశాం. ఈ సినిమాలో ఇంకా బాగుంది. ముఖ్యంగా ఆ పాత్రను మలిచిన తీరు అద్భుతం. సావిత్రి పాత్ర కోసమే కీర్తి సురేష్ పుట్టిందనుకున్నాం మహానటి చూశాకా. అలా ఈ పాత్ర కోసమే ఈ పిల్ల పుట్టిందేమో అన్నట్లుంది. జీవితంలో evolutionతో ఎదిగే పాత్ర కాదు. మొదటి నుంచీ ఒకటే రకం. గొప్ప విలువలు ఉన్న గట్టి పిల్ల. మంచి పిల్ల. అందమైన పిల్ల. బహుశా ఈ పాత్ర దర్శకుడి dream girl అయ్యింటుంది. నాకయితే ఈ పిల్ల చాలా చాలా నచ్చేసింది. Pure Gold. ఎందుకంటే మన తెలుగు సినిమాల్లో తొంభై ఐదు శాతం హీరోయిన్లకి పాపం వంటి నిండా వేసుకోవడానికి బట్టలు ఉండవు. నోటి నిండా మాట్లాడడానికి రెండు లైన్ల డైలాగులు ఉండవు. గుర్తుంచుకోవడానికి సమమైన పాత్ర ఉండదు. వేస్తే నాలుగు డాన్సులు ఉంటాయి లేదా జీవితంలో మరో ధ్యేయం లేనట్లు హీరో చూట్టూరా తిరగడాలు ఉంటాయి. రుద్రవీణలో డైలాగ్ లాగ అంత చక్కని రూపేంటీ? ఆ పాత్రేంటి? అని వాపోయే స్టేజ్ మన తెలుగు హీరోయిన్ ది.(మిగతా భాషల్లో కూడా దాదాపు ఇదే పరిస్థితి కానీ ప్రస్తుతానికి తెలుగు సినిమా గురించే మాట్లాడుకుందాం). అటువంటి poor state నుంచి ఇంతటి elivated state లో ఈ సినిమాలో హీరోయిన్ పాత్రని చూస్తే నిజంగా కడుపు నిండిపోయింది. "ప్రేమ" అంటే అబ్బాయి లేదా అమ్మాయి ఒకరి కోసం ఒకరి జీవితాలను ఒకరు పాడు చేసుకోవడం, చంపుకోవడాలు, హత్యలు, గొడవలు, మొదలైన చెత్త కాకుండా "ప్రేమించడం" అంటే జీవితాన్ని ఎలా జీవించాలో తెలుసుకోవడం కూడా అనే గొప్ప సందేశాన్ని ఇచ్చినందుకు నాకు ఈ సినిమా నచ్చింది. ఈమధ్య ఇలాంటి బరువైన కంటెంట్ ఉన్న కొన్ని మంచి సినిమాలు ఓటీటీ ప్లాట్ఫార్మ్ లో చూశాము. అసలు ఓటీటీ వల్లనే ఇంకా down to earth సినిమాలు, మంచి సినిమాలు, కుటుంబ సమేతంగా కూర్చుని చూసే సినిమాలు వస్తున్నాయేమో అనడం అతిశయోక్తి కాదేమో.


సినిమాలో అందరూ బాగా చేశారు కానీ ఆ రెండవ హీరో హెయిర్ స్టైల్ బాలేదు. ఏమిటో విగ్గు పెట్టినట్లు.. నచ్చలేదు. బహుశా డీ గ్లామరైజ్డ్ గా చూపించాలనేమో మరి. ఇంకా చాలా రాయాలని ఉంది కానీ ఏమీ రాయాలని కూడా లేదు.  సినిమా చూసి రేపటికి వారమేమో. అయినా ఆ అమ్మాయి వాయిస్, ఆ డైలాగ్స్ వినిపిస్తూనే ఉన్నాయి - 


"నిజానికి ఎవ్వరి వల్లా ఎవ్వరూ ఏమీ అయిపోరు. ఏదో దాస్తూ, బయటకు నిజం చెప్పే ధైర్యం లేక నిందలు మోపేసి, చెడ్డోళ్లని చేసేసి, వదిలించేసుకుంటారు". 

"my mom raised me like a Queen and a Queen even at a funeral mourns with dignity. కన్నీళ్ళలో కూడా తన హుందాతనాన్ని కోల్పోదు"
ఈ సీన్ దగ్గర కళ్ళల్లోంచి నీళ్ళు జలజలా రాలాయి!!


"ఎవరు తుఫాన్లు వాళ్లకుంటాయి. కొందరు బయటపడతారు. ఇంకొందరు ఎప్పటికీ బయటపడరు"


"పుస్తకం పూర్తిచేసే పాఠకుడి గుండెల్లో గుప్పెడు ఆశను నింపకపోతే మన చేతిలో అక్షరం ఉండీ ఎందుకండీ?"


చివరిగా సర్కులేట్ అవుతున్న, నాకు బాగా నచ్చిన రెండు వీడియో బిట్స్ పెడుతున్నాను. మంచి కంటెంట్ ఉన్న సినిమాలు ఇష్టపడేవారు నెట్ఫ్లిక్స్ లో ఎనిమిది వసంతాలు సినిమా (ఇంకా చూడకపోయి ఉంటే) తప్పకుండా చూడండి.



 


ఎంతో అందమైన ఫోటోగ్రఫీ కూడా ఉన్న ఈ చిత్రం నిజంగా ఒక దృశ్యకావ్యమే!

Saturday, March 29, 2025

ఒక కలయిక




ఐదున్నర ఏళ్ల క్రితం విజయవాడలో కొందరు కాలేజీ మిత్రులను కలిసినప్పుడు ఎంతో ఆనందంతో ఒక టపా రాసాను. ప్రతి ఏడాది తప్పకుండా కలుద్దాం అని ఆ రోజున గట్టిగా అనేసుకున్నాం కానీ మళ్ళీ ఎన్నిసార్లు ప్లాన్ చేసినా కొందరికి కుదరక మేము మళ్ళీ కలవనే లేదు :( అదే సంసార సాగరం మహిమ!


రెండేళ్ళ క్రితం ఒక స్నేహితురాలు అమ్రీకా నుంచి వస్తే ఇదే ఊళ్ళో ముగ్గురం స్నేహితురాళ్లము కలిసాము. మళ్ళీ ఇన్నాళ్లకు మరొక స్నేహితురాలిని ముఫ్పై ఏళ్ల తరువాత మొన్న కలిసాను. శైలూని!! వాళ్ళబ్బాయి ఉద్యోగం నిమిత్తం కొన్నాళ్ళు ఇక్కడ ఉంటూంటే, అబ్బాయికి కొన్నాళ్ళు వండిపెట్టడం కోసం అమ్మగారు వచ్చింది. మా ఇద్దరి ఇంటి మనుషులూ ఆశ్చర్యపోతున్నారు.. ముఫ్ఫై ఏళ్ల నుంచీ మళ్ళీ కలవనే లేదా? హౌ? వై? కై కు? అంటూ ప్రశ్నలు... అవి సమాధానాల్లేని ప్రశ్నలు. ఐదేళ్ల క్రితం బెజవాడలో కొందరం కలిసినప్పుడు మాత్రం మిగతావారితో ఫోన్లో మాట్లాడాము. అప్పుడు శైలూతో కూడా మాట్లాడాను. వాట్సప్ లో కూడా అప్పుడప్పుడు పలకరింపులే!


కానీ మొన్న చూడగానే అసలు అన్నేళ్ళు గడిచినట్లు మాకు అనిపించనేలేదు. నేనేమీ మారలేదు అంది శైలూ. చిత్రం ఏమిటంటే శైలూ, నేను పక్కపక్కనే కర్చునేవాళ్ళం. పి.జి అవ్వగానే తన మేరేజ్ అయిపోయి దూరం వెళ్పోయింది. ఆ తర్వాత కాంటాక్ట్ లేదు. పలు రాష్ట్రాలు మారుతూ ప్రస్తుతం గుజరాత్ లో ఉన్నారు. ఎలా గడిచాయో తెలీకుండా ఇన్నేళ్ళు గడిచిపోయాయి.. అని వాపోయాము ఇద్దరం. మేమే కాదు సగం మంది ఆడవాళ్ల జీవితాలు ఇలానే గడిచిపోతాయేమో. పెళ్ళయిన కొత్తల్లో అత్తవారింట్లో అడ్జెస్ట్మెంట్లు... సంసార తాపత్రయాలు.. పిల్లల చదువులు.. తర్వాత పెళ్ళిళ్ళు.. మధ్యలో ఎక్కడో కాస్త రిలీఫ్... అప్పుడు వెనక్కి తిరిగి చూసుకుని.. అయ్యో సగం పైగా జీవితం అయిపోయిందే అని కాస్త మన గురించి మనం ఆలోచించుకునే లోపూ.. ఇదిగో మేం ఉన్నాం అని చిన్నా చితకా అనారోగ్యాలు, చికాకులు..! ఇంకెక్కడ రెస్ట్? మన దేశంలో అయితే ఎనభై శాతం స్త్రీల జీవితాలు ఇంతే. ఉద్యోగాలు చేసే మహిళలకు మరిన్ని ఎక్కువ బాధ్యతలు, మరిన్ని ఎక్కువ తలనెప్పులు.


గుండ్రాల్లోంచి మళ్ళీ మొన్నట్లోకి వచ్చేస్తే - శైలూ, నేనూ అలా కాసేపు మంచి చెడూ మాట్లాడుకుని, మొక్కలు,పువ్వులు,చెట్లు గురించి ముచ్చట్లు చెప్పుకుని మురిపెంగా వీడ్కోలు తీసుకున్నాం. వాళ్ళు అస్సాం లో ఉన్నప్పుడు తను కూడా నా లాగే బోలెడు మొక్కలు పెంచింది. అన్నీ కాలనీలో దానం చేసి వచ్చింది. ఇప్పుడు నేను కూడా ఇక్కడ నుంచి కదిలితే అదే చెయ్యాలి. ఇంకా ఫ్లాట్ దగ్గర కింద వేసిన మొక్కలు, పది, పదిహేను కుండీలు వదిలేయగా ఇక్కడ ఓ నూట ఏభై కుండీల దాకా ఉంది నా వృక్ష సంసారం! ఏ నర్సరీ వాళ్ళకో ఇచ్చేయడమే అని ఇంటాయన తేలిగ్గా అనేస్తారు కానీ పిల్లల్లా పెంచుకున్న మొక్కల్ని వదిలెయ్యాలంటే చాలా కష్టమే మరి..!


ఇక ఇంటికి వచ్చాకా కూడా తనని కలిసిన ఆనందం తాలూకూ ట్రాన్స్ లో చాలాసేపు ఉన్నాకా ఎందుకింత సంబరం అని ఆలోచిస్తే ఒక సమాధానం తోచింది - ఓల్డ్ ఫ్రెండ్స్ తో ఏ బెంగ, భయం లేదు. మనల్ని మనం ప్రూవ్ చేసుకోనఖ్ఖర్లేదు. వీళ్ళు మన గురించి ఏమనుకుంటారో అని బెంగ పడక్ఖర్లేదు. ఎందుకంటే మాకు ఒకరి గురించి ఒకరికి బాగా తెలుసు. పక్కపక్కనే కూచునేవాళ్ళం. కలిసిమెలసి గడిపాం. అయినా ఆ కాలంలో స్నేహాలే వేరు. ఇప్పటిలా ప్లాస్టిక్ స్నేహాలు కావు. యే ఫెవికాల్ కా జోడ్ హై అన్నట్లు.. ఇన్నాళ్ల తరువాత కలిసినా ఆ ఆనందం, ఆ సంతృప్తి.. మాటల్లో చెప్పలేనివి. ఈ తరువాత కూడా ఎక్కువ కలవకపోయినా ఈ ఒక్క కలయిక తాలుకూ ఆనందపు మత్తులో మరి కొన్నేళ్ళు గడిపేయచ్చు. 

మా గ్రూప్ లో ఎవర్ని కలిసినా ఇదే ఫీలింగ్ అందరికీ కూడా. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని ఊరికే అన్నారా మరి :)