Linda Goodman పూనిన కాలేజీ రోజుల్లో ఇంటికొచ్చినవారందరినీ మీ sunsign ఇదేనా? అని అడగటం హాబిగా ఉండేది. అలా ఒకానొకరోజున భట్టు మావయ్యగారిని మీరు Sagittarius ఏనా? అనడగటం, ఆయన 'ఓసినీ...బానే చెప్పావే' ఆశ్చర్యపోవటం నాకింకా గుర్తే. అప్పటి నుంచీ ప్రతి ఏడూ నేనెక్కడ ఉన్నా డిసెంబర్ 6thన పొద్దున్నే భట్టుమావయ్యగారికి శుభాకాంక్షలు చెప్తూ ఫోన్ చెయ్యటం, 'నేను మర్చిపోయినా నువ్వు మర్చిపోవే..' అనే ఆయన పలకరింపు వినటం నాకు అలవాటైపోయింది. ఇవాళ పొద్దున్న ఒక విచిత్రం జరిగింది. ఎప్పుడూ మూడు నిమిషాల్లో టాక్ ముగించే భట్టుమావయ్యగారు ఇవాళ పన్నెండు నిమిషాలు మాట్టాడారు. ఆ కాసేపులో ఎన్ని విషయాలు చెప్పారో...చాలా ఆనందమైంది. రాబోయే తరానికి చెందిన ఆలోచనలు ఈనాడు చేయగల గొప్ప మేధావి భట్టుమావయ్యగారు. ఇవాళ ఎలాగోలా టైం కుదుర్చుకుని మావయ్యగారి గురించి బ్లాగ్లో రాయాలని అనుకున్నా...!
భట్టుమావయ్య గారు ఎవరు?
మా చిన్నప్పుడు "భాస్కరమ్మగారింట్లో" ఉండగా మా వాటాలోని రెండు గదులు అద్దెకిచ్చినప్పుడు, అందులో నాలుగైదేళ్ళు ఉన్నారు. అప్పటి నుంచీ నాకు భట్టుమావయ్యగారు తెలుసు. భట్టుమావయ్యగారి పూర్తి పేరు "పన్నాల సుబ్రహ్మణ్య భట్టు". ఒక్కమాటలో చెప్పాలంటే "బహుముఖప్రజ్ఞాశాలి". విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో అనౌన్సర్ గా రిటైరయ్యారు. అనౌన్సర్ గా రిటైరయి ప్రస్తుతం విజయవాడలో విశ్రాంతి జీవితం గడుపుతున్నారు భట్టుమావయ్యగారు. పరిస్థితులు మరోలా ఉండుంటే స్టేషన్ డైరెక్టర్ గా రిటైరవ్వాల్సినవారు. అయినా ఆ చింత ఏ కోశానాలేని విశాల దృక్పధం ఆయనది.
70s,80s లోని రేడియో శ్రోతలకు ఈయన భట్టుగారి పేరు సుపరిచితం. చాలా కొత్తకార్యక్రమాలకు ఈయన నాంది పలికారు. శ్రీరజనీకాంతరావుగారు బెజవాడ రేడియోస్టేషన్ డైరెక్టర్ గా ఉన్న సమయంలో, వ్యంగ్య రచనలు రాయటంలో దిట్ట అయిన భట్టుగారు "చెళుకులు" అనే రేడియో ప్రోగ్రాం ఒకటి చేసారు. ఉదయం ఏడున్నర ప్రాంతంలో వచ్చే ఈ కార్యక్రమం అప్పట్లో ఎంతో పేరు తెచ్చుకుంది. ధ్వని మాధ్యమంలో ఇలాంటి కార్టూన్ కార్యక్రమం రావటం అదే ప్రధమం. భట్టుగారు రేపు ఉదయం ఎవరి మీద చెళుకులు పేలుస్తారో అని ఊరంతా ఎదురుచూసేది. విజయవాడ నవోదయ పబ్లిషర్స్ వారీ చెళుకులకు పుస్తకరూపాన్ని కూడా అందించారు. మాగంటి వెబ్సైట్లో ఉన్న ఈ పుస్తకం తాలూకూ పిడిఎఫ్ లింక్:
http://www.maganti.org/air/chelukulu.pdf
తరువాత "అనుభవ దీపం" అనే ప్రతీక నాటకం(symbolic play) ఒకటి భట్టుగారు రాసి, ప్రొడ్యూస్ చేసారు. రేడియో చరిత్రలో ఇలాంటి కార్యక్రమం రావటం అదే ప్రధమం. ఈ కార్యక్రమంలోకి శ్రీమతి వి.బి.కనకదుర్గ, శ్రీరంగం గోపలరత్నం గార్లతో పాడించిన పాటలు చాలా బావుంటాయి. "నాదబంధం" అని సంగీత వాయిద్యాల మీద చేసిన కార్యక్రమానికీ, "మార్గ బంధం" అని రోడ్లు తమ స్వగతాలు చెప్పుకుంటున్నట్లుగా చేసిన కార్యక్రమానికీ సృజనాత్మక విభాగంలో జాతీయ పురస్కారాలు వచ్చాయి భట్టుగారికి. హాస్య వ్యంగ్య రచనల్లో దిట్ట భట్టుగారు. "వీరపాండ్య పెసర బొమ్మన్" అనే కధానికను రాసి తరువాత నాటకంగా కూడా తయారుచేసారు. "పెసరల్ ఇన్సైడ్" అని పెసరట్టు + సాఫ్ట్వేర్ నూ కలిపి ఒక వ్యంగ్య కథ పత్రికకు రాసారు. ఈ కథ "ఆహా... ఓహో !" (ఆధునిక హాస్య వ్యంగ్య రచనలు) అనే పుస్తకంలో ప్రచురితమైంది. రేడియోలో పండుగల రోజుల్లో "ప్రత్యేక జనరంజని" ప్రసారం అవుతూ ఉండేది. అలాగ ఒకసారి ఓ పత్రికలో "ఆవు జనరంజని" అని పేరడీ రచన చేసారు. అంటే ఒక ఆవు తాను ఏన్ని సినిమాల్లో ఉన్నదీ, ఏ ఏ పాటలు తన పేరు మీద ఉన్నాయో ఇంటర్వ్యూలో చెప్తున్నట్లుగా అన్నమాట.
నాకు తెలిసిన భట్టుమావయ్యగారు :
రేడియో స్నేహం కాక భట్టుమావయ్యగారితో మరో స్నేహం ఉండి మాకు. అది అమ్మావాళ్ళ పుట్టిల్లు రాజమండ్రి స్నేహం. మా పెద్దమ్మ భట్టుమావయ్యగారి చెల్లెల్లు స్కూల్లో క్లాస్మేట్స్. తర్వాత కాలేజీలో నాకు బాగా మిత్రురాలైన "జయ" పెద్దమ్మ ఫ్రెండ్ వాళ్ల అమ్మాయి, అంటే భట్టుగారి మేనకోడలు అని తెలుసుకుని మరీ సంబరపడిపోయా. జయ కూ నాకూ ఇరవైఏళ్ళుగా గాఢమైన స్నేహం.
కార్టూన్లు, హాస్య రచనలు, పత్రికలలో ఎన్నోవ్యాసాలు, నాటకాలు, వ్యంగ్య రచనలు ఎన్నో చేసిన భట్టుమావయ్యగారు సరదగా బోలెడు డిగ్రీలు కూడా సంపాదించారు. హిందీలో ఎం.ఏ, జర్నలిజం కోర్స్, ఫిల్మ్స్ కి రిలేటెడ్ డిప్లొమా(పేరు గుర్తులేదు)...మొదలైన కోర్సులు చేసారు. ఆయన చేయటమే కాక ఎంతో మందికి ఫ్రీ కెరీర్ కౌన్సిలింగ్ చేసేవారు. ఆయన జేబులో ఎప్పుడూ ఏవో పేపర్ కట్టింగ్లు ఉంటూండేవి. "ఇవి మీ అబ్బాయికి ఇవ్వు" అనో, "ఇవి మీ అమ్మాయికి ఉపయోగపడతాయి ఇదిగో" అనో అవసరం ఉన్నవాళ్ల చేతుల్లో పెట్టేసి వెళ్పోతూ ఉండేవారు. తాను చేయటమే కాక ఎంతో మంది ప్రోగ్రాం అఫీసర్లకీ, రేడియో స్టాఫ్ కీ ప్రోగ్రాములు చేయటానికి కొత్త కొత్త ఐడియాలు చాలా ఇస్తూండేవారు.
ఆయనతో మాట్లాడిన ప్రతిసారీ ఈయనకు తెలీని విషయాలు ఉన్నాయా అని అశ్చర్యపోతూనే ఉంటాను. భట్టుగారితో పది నిమిషాలు మాట్లాడితే చాలు ఎవరికైనా రెండు విషయాలు ఇట్టే అర్ధమవుతాయి; ఆయనకు తెలియని విషయం ఏదీ లేదని, ఆయనతో మాట్లాడేప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలనీ. ఎందుకంటే వాటిలోని నిజాన్ని తట్టుకునే శక్తి అందరికీ ఉండదు మరి. అందువల్ల భట్టుగారు సూటిగా మాట్లాడే మాటల్లోని వ్యంగ్యాన్ని మంచి సలహాగా తీసుకుని, ఆయన మాటల్లో దాగున్న ఆప్యాయతని అర్ధం చేసుకున్నవారికన్నా వారి మాటల్ని అపార్ధం చేసుకున్నవారి సంఖ్యే అధికం ఇప్పటికీ...!!
భట్టుగారు మంచి రచయిత, విమర్శకుడు, సంగీతజ్ఞుడు, హాస్య-వ్యంగ్య రచయిత అని చాలామందికి తెలుసు. కానీ ఆయన నలభీములని బహు తక్కువ మందికి తెలుసు. నాకు తెలిసీ పెసరట్లు వేయటంలో ఆయన్ను మించిన స్పెషలిస్ట్ మరొకరుండరు. పెసలతో, పెసర పప్పుతో పాటు ఎన్ని రకాలుగా పెసరట్లు వేయవచ్చో చెప్పటం వెనుక ఆయన చేసిన ఎన్నో పరిశోధనలు ఉన్నాయి. మినపప్పు నానబెట్టి, రోట్లో స్వయంగా రుబ్బి, గారెలు ఆవడలు చేసి మిత్రులందరినీ ఆహ్వానీంచి మరీ జనాలతో తినిపించేవారు. మినపప్పు ఎంతసేపు నానితే గారెలు ఏ విధంగా వస్తాయో ఇట్టే చెప్పగలరు భట్టు గారు. ఒకసారి నాకు చేగోణీలు ఎలా చెయ్యాలో కూడా చెప్పారు.
భట్టుగారి పెసరట్ల ప్రతిభ గురించి ముళ్ళపూడి వెంకట రమణగారు "కోతికొమ్మచ్చి" పుస్తకంలో కూడా (30వ పేజి దగ్గర) ప్రస్తావించారు. ఓ పద్యం కూడా రాసారు ఇలా :
"పొట్టు పప్పు రుబ్బి మిర్చి గిర్చీ చేర్చి
భక్తి శ్రద్ధ కలిపి పోయునట్టి
భట్టుగారి అట్టు బహుగొప్ప హిట్టురా
విశ్వదాభిరామ వినుమ రమణ "
ఈ పద్యానికి బాపూ గారు వేసిన బొమ్మతో సహా ఉన్న లేమినేషన్ వీరింట్లో ఉంటుంది.
భట్టుమావయ్యగారి సతీమణి కృష్ణకుమారక్క(ముంజులూరు కృష్ణకుమారి). ప్రస్తుతం బెజవాడ రేడియో స్టేషన్లో 'అసిస్టెంట్ స్టేషన్ డైరెక్టర్'. మావయ్యగారు, అక్క...ఇదేం వరస అని విన్నవాళ్లంతా అడిగేవారు. వారి పెళ్ళికి మునుపే కృష్ణక్క మాకు తెలియటం వల్ల తనను కృష్ణకుమారక్క అని పిలిచేవాళ్ళం. ఆ పిలుపు ఇప్పటికీ అలానే ఉండిపోయింది. తను అంత పెద్ద ఆఫీసరయినా నాకు మాత్రం ఎప్పటికీ తను చిన్నప్పటి కృష్ణకుమారక్క. ఆ దంపతులు ఇద్దరిపై నాకు చాలా ప్రత్యేక అభిమానం. వారిద్దరిని గురించిన ఓ బేతాళప్రశ్న మత్రం ఎప్పుడూ నన్ను దొలిస్తూఉంటుంది...కృష్ణకుమారక్క దొరికిన భట్టుమావయ్యగారు అదృష్టవంతులా? భట్టుమావయ్యగారు దొరికిన కృష్ణక్క అదృష్టవంతురాలా..? అని !!
హమ్మయ్య సాహసం చేసేసా ! నాకు తెలిసినది, తోచినదీ రాసేసాను. ఇప్పుడిక నాకు భట్టుమావయ్యగారు ఎన్ని మార్కులు వేస్తారో వేచి చూడాల్సిందే !
19 comments:
చాలా బాగా చెప్పారు.... పాత రేడియో రోజులు గుర్తుకొచ్చాయి.....ధన్యవాదాలు....
భలే భలే భట్టు 'మావయ్య' గురించి భలే రాశారు!
భట్టు గారి అట్టే కాదు ఆయన మీద మీ పోస్టూ సూపర్ హిట్టే :). చాలా బాగా రాశారు.
మొన్న ఆదివారం హిందు పేపర్ లొ కేజ్డ్ ఇన్ ఎ మేచ్ బాక్స్ అపార్ట్మెంట్ అన్న శీర్షికన పాతరోజుల్లో ఇంటివాకిటి అరుగు గురించి ముత్తు అనే ఆయన రాసిన ఆర్టికల్,ముఖ్యంగా దానికి వేసిన బొమ్మ నాకెంతగానో నచ్చాయి.ఆరోజు మీ భాస్కరమ్మ గారి ఇల్లు ని తల్చుకున్నాను.భట్టుగారి చెళుకులు గురించి తెలుసు కాని వారింత బహుముఖ ప్రజ్ఙావంతులని మీద్వారానే తెలిసింది.
మా ఇంటికి కూత వేటు దూరం లో ఉండే భట్టు మావయ్య గారు, అక్కయ్యగారు, నాకు తరచు తారసపడతారు రోడ్ మీద.
కొండొకచొ పలకరిస్తుంటాను .అయినా ఆయన పుట్టినరోజు నాకు తెలీదు, తెలిస్తే ఇంటికెళ్ళి శుభాకాంక్షలు చెప్పేవాడిని .
ఇప్పటికయినా మీ బ్లాగ్ ముఖంగా ఆలీసపు పుట్టిన రోజు శుభాకాంక్షలు..
మీ సందేహానికి సమాధానం నేను చెప్పనా..
ఆ పుణ్యదంపతుల చెలిమి దొరికిన మీరు అదృష్టవంతులు తృష్ణ గారు :-) భట్టుగారి గురించి వివరాలను పంచుకున్నందుకు ధన్యవాదాలు. పధ్యం చదివిన్ గుర్తుంది కోతికొమ్మచ్చిలో..
..తృష్ణ గారు.. అందరికి అభిమాన పాత్రులైన మా పన్నాల సుబ్రహ్మణ్య భట్టు గారి పరిచయం చాలా మురిపంగా చెప్పారండీ! వారికి మీ బ్లాగ్ ముఖంగా జన్మదిన శుభాకాంక్షలు ..అందిస్తూ.. వారినుంది ఇంకా విలువైన విమర్శనా వ్యాసాలు రావాలని కోరుకుంటూ
ఇందాక అసలు విషయం చెప్పడం మర్చిపోయానండీ.. మీ భట్టుమావయ్య గారికి జన్మదిన శుభాకాంక్షలు..
అయ్యో నాకు తెలియనే లేదూ. రేపైనా ఫోను చేసి చెప్తాను! శ్రీ భట్టు గారిని ప్రత్యక్షంగా కలియకపోయినా, ఆయనతో నాకు ఫోను పరిచయం ఉంది. అడిగీ అడగ్గానే, శ్రీ పుచ్చా పూర్ణానందం గారి పుస్తకాలూ, వారి కుమారుడు వ్రాసిన పుస్తకాలూ నాకు, మా మేనకోడలి ద్వారా పంపారు. ఈసారి అటువైపు వెళ్ళినప్పుడు తప్పకుండా కలవాలి.
HAPPY BIRTHDAY to Sri Bhattu gaaru
wow...మీ భట్టు మావయ్య గారు మా చిన్న తాతగారు...మా తాతగారు పన్నాల భట్టా శర్మ గారి బాబయ్య గారి అబ్బాయి...మా తాతగారూ వాళ్ళ ఇంటి పక్కిల్లే చిన్నతాతగారూ వాళ్ళది. చిన్నప్పుడు సెలవల్లో బాగానే కలిసే వాళ్ళం...నాకు మాత్రం ఆయనంటే బలే భయం వుండేది...కృష్ణమ్మమ్మ...(వరస అదే అయినా ఆంటీ అనే సంబోధిస్తాను...మా అమ్మగారి వయసే మరి...:)) నా బ్లాగు చూసి రెండు మూడు సార్లు మెచ్చుకునేసరికి చాలా సంతోషించాను.
ఆయన పెసరట్ల ప్రతిభ గురించి అమ్మా, నాన్నగారూ కధలు కధలు గా చెప్పేవారు...:)
మీ టపా చూశాక ఆయన స్పందన కూడా మాకు తెలియజెయ్యండి...
తాతగారూ పుట్టినరోజు శుభాకాంక్షలు...
Written Very Nicely.
చిన్నప్పుడు మీరు రేడియోమింగుంటారు. అందుకే ఇన్ని చక్కని వ్రాతలు, జ్ఞపాకాలూనూ!!
అట్టుమావయ్యగారేమోకానీ, నేమాత్రం నూటికి నూరు వేసాను మీకు!
తృష్ణ గారూ !
భట్టు గారి గురించి చాలా బాగా రాశారు. ఆమధ్య ఒక సందర్భంలో వారింటికి వెళ్ళడం, ఆరోజు ఆయనతో సుమారు అరగంట సేపు గడపడం, అనేక విషయాల మీద చర్చించగలగడం నేను మర్చిపోలేని విషయాలు. ఆయన్ని మరోసారి గుర్తుచేసినందుకు ధన్యవాదాలు.
చాలా సంతోషం. రెండేళ్ళ కిందట నవోదయలో ఒకసారి యధాలాపంగా కలిశాము గానీ ముచ్చటించే భాగ్యం కలగలేదు.
@పిఆర్ తమిరి: ధన్యవాదాలు.
@afsar: చాలామంది "భట్టు మావయ్య" అనే పిలిచేవాళ్ళు...
ధన్యవాదాలు.
@శంకర్.ఎస్: ధన్యవాదాలు.
@ఇందిర: అవునా...భలే...
భట్టుగారి ప్రతిభను గురించి ఇంకా నాకు తెలియని విషయాలు చాలా ఉన్నాయండీ...
ధన్యవాదాలు.
@ఆత్రేయ: పోనీలెండీ తెలియకపోవటమే మంచిదైంది. అలా విషెస్ చెప్పించుకోవటం అవీ వారికి ఇష్టం ఉండదు.
ధన్యవాదాలు.
@వేణు శ్రీకాంత్: మీ జవాబు బావుందండీ...ధన్యవాదాలు.
@వనజ వనమాలి: భట్టు గారు బాగా తెలిసినవాళ్ళే వ్యాసం ఎలా ఉందో చెప్పగలరు...thanks for the comment.
@హరేఫల: మీ బ్లాగ్ లో ఆ టపా చదివిన గుర్తు...ఫోన్ చేసేసారా? ఇప్పుడు నన్ను తిట్టుకుంటారు భట్టుమావయ్యగారు.. అందరికీ డప్పుకొట్టేసావా అని..:))
ధన్యవాదాలు.
@స్ఫురిత: నేను ఒక వావ్ !! నిజమ్గా మీఋ చుట్టాలా? అయితే వారి మేనకోడలు "జయ" తెలుసా? నాకు బాగా స్నేహితురాలు...
ధన్యవాదాలు.
@రావు ఎస్.లక్కరాజు: ధన్యవాదాలు.
@భాస్కర్ రామరాజు: అబ్బా..ఎన్నాళ్ళకు మీ వ్యాఖ్య....! ఆ స్టూడియోలలో తిరుగుతూనే పెరిగాను కదండి...ఏదో కాస్తంత పుణ్యం పోగేసుకున్నా మరి !!
ధన్యవాదాలు.
@నాగేస్రావ్: చాలా థాంక్సండి..:)
ఎస్.ఆర్.రావు: మీరూ చాలా రోజులకు కనబడ్డారు...:)
ధన్యవాదాలు.
@మౌని: ఈసారి కుదిరితే మాట్టాడండి...విజయవాడ బుక్ ఫెస్టివల్ లో దొరకచ్చు.
ధన్యవాదాలు.
Post a Comment