సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Monday, February 28, 2011

వంటరాని మగాడు (Just for fun..)


"వంటొచ్చిన మగాడు" అని మా అన్నయ్యను దృష్టిలో పెట్టుకుని చాలా కాలం క్రితం ఒక టపా రాసాను. ఆ తరువాత "వంటరాని మగాడు" అని రెండవ భాగం రాస్తానని అన్నాను కానీ అది రాయటం కుదరనేలేదు. కొందరు బ్లాగ్మిత్రులు రెండవభాగం ఏదని అడిగారు అప్పట్లో.. అయినా ఎందుకనో ఆ రెండవభాగం రాసే మూడ్ అప్పుడు పోయింది. ఇన్నాళ్ళకు మళ్ళీ ఆ రెండవ భాగం రాయాలని సంకల్పం కలిగింది. రెంటికీ లింక్ అయితే లేదు కానీ మొదటిది చదవనివారు అక్కడకు వెళ్ళి ఓ లుక్కేస్తే బాగుంటుందని అభిప్రాయం.
( http://trishnaventa.blogspot.com/2009/10/just-for-fun.html )
************
వంటరాని మగాడు:

వంటరాని మగవాళ్ళలో నాకు తెలిసినంతలో ముఖ్యంగా మూడు రకలవాళ్ళు ఉన్నారు. ఇంకా కూడా ఉంటారేమో నాకైతే తెలీదు..:))

1) కొందరికి వండటం రాదు కానీ వారు పెట్టినది తిని ఎంజాయ్ చెయ్యగలరు. వీరితో ఏ ఇబ్బందీ ఉండదు.

2)మరొకరకం వారు వండటం రాకపోయినా వంటలకు వంకలు పెడుతూ ఉంటారు వండిపెట్టేవారి ఒళ్ళుమండెలా. భోజనం తింటున్నంతసేపూ వారి సాధింపుల రికార్డ్ మోగుతూనే ఉంటుంది. ఆ వంకలన్నీ టేస్ట్ లు తెలియటం వల్ల కదా అని ఈ రకం వారితో కూడా కాస్తంత సర్దుకుపోవచ్చు అని నా అభిప్రాయం.

3)కానీ మూడో రకం వారున్నారే వారితోనే మహా కష్టం. వాళ్ళకు వండటమూ రాదు. తినటమూ రాదు. అసలు ఫలానాది తినాలన్న కోరికా ఉండదు. పదార్ధాల్లో ఉప్పు కారాలు ఎక్కువయ్యాయో, తక్కువయ్యాయో తెలియదు. ఏం వండాలో, ఎంత వండాలో, వండితే తింటారో తినరో కూడా తెలీని ఈ రకం వారితోనే అసలైన తంటాలన్నీ!!

ఇప్పుడు ఈ మూడు రకాలవాళ్లతో భార్యల సంభాషణలు ఎలాగుంటాయంటే : (ఇది ఎవరినీ నొప్పించటానికి కాదు...కేవలం సరదాకే అని మరొకసారి మనవి)

1) వండటం రాకపోయినా తినేవారు:


"ఇవాళ ఏం వండను?"
"ఏదో నీకు తోచినది వండు. ఏదైనా పరవాలేదు."

"ఆహా చారు అదిరింది. ఎంత బాగుందో"
"ఈ కూర కూడా సూపర్. అసలు నీ వంటే వంట. ఉండు ఈసారి మా బాస్ ను భోజనానికి పిలుస్తాను"

"ఏమిటీ ఊరు వెళ్తావా? మరి నా భోజనం? అసలే నాకు బయట తిండి పడదు. త్వరగా వచ్చేయ్..."
" ...?? మీకు వండి పెట్టడం కోసం నేను వచ్చేయాలా? అంటే మీకు మీ తిండిని గురించిన జాగ్రత్తే తప్ప నా మీద బెంగ ఉండదన్న మాట...."

******* ********** ********
2) వండటం రాకపోయినా తింటున్నంత సేపూ వంకలు పెట్టేవారు:

"ఏమండీ ఇవాళేం వండమంటారు?"
"గుత్తివంకాయ కూర , కొబ్బరి పచ్చడి చేసి, పప్పుపులుసు పెట్టు"

"ఏమిటిది? ఇదసలు గుత్తివంకాయ కూరేనా? అసలు మసాలా ఏది? ఏమేం వేసావిందులో..?
ఇది కొబ్బరి పచ్చడా? దీన్నిండా కొబ్బరి ముక్కలే కనబడుతున్నాయి. మెత్తగా గ్రైండ్ చెయ్యటం రాదా నీకు? మా అమ్మయితే రోట్లో కూడా ఎంత మెత్తగా రుబ్బేదనుకున్నావు"
(ఇలా ఎవరితోనన్నా కంపారిజన్ లు చేసినప్పుడు సదరు అమ్మగారికి రోకలి తెచ్చి అయ్యగారి నెత్తిన ఒక్కటిచ్చుకోవాలన్నంత కోపం వస్తుంది.)

"ఇది పప్పు పులుసా? చారా? తేడా ఏం కనబడటం లేదు. ఈ పోపేమిటి ఇలా మాడిపోయింది? మాడిపోయిన పోపుని చూస్తే నాకెంత ఒళ్ళుమంటో నీకు తెలుసుకదా? అయినా మాడిస్తే ఏమిటర్ధం?...."
"అయితే మీకు నచ్చేట్టు మీరే వండుకోండి. వండిన ప్రతిదానికీ వంక పెడితే నేను వండలేను.."
"నాకు వంటొస్తే నిన్నెందుకు చేసుకోవటం? హాయిగా నాక్కావాల్సిన పదార్ధం నేనే వండుకుని తినేవాడిని"
"అంటే కేవలం వండిపెట్టడానికే నన్ను చేసుకున్నారా..?"

****** ******* ******

3) వండటమూ రాదు. తినటమూ రాదు :

"ఏమండీ ఇవాళ ఏం వండను?"
" రోజూ ఎందుకలా అడుగుతావు? ఏదో ఒకటి వండు."
"ఇవాళ ఇది చెయ్యి అని అసలెప్పుడూ అడగరా?"
"ఏమో నాకు అలా అడగాలని అనిపించదు.."

**** ***** ******

"కూర బాగుందా?"
"బానే ఉంది."
"పప్పు?"
"బానే ఉంది"
"రాత్రికి మొన్న చేసిన కూర చెయ్యనా?"
"ఏ కూర? నాకు గుర్తులేదు.."

**** **** *****
"ఎందుకు కూర ఉంచేసారు? మొన్న తిన్నారు కదా?"
"ఆ రోజు నచ్చింది. ఇవాళ నచ్చలేదు. ఎప్పుడు వండినా తినితీరాలని రూల్ లేదుగా.."

"ఈ పచ్చడెందుకు వదిలేసారు?"
"నేనెప్పుడూ తినలేదిది"
"ఓసారి టేస్ట్ చేసి చూడచ్చు కదా నచ్చుతుందేమో..?"
"ఎప్పుడూ తినని కొత్త పదార్ధాలు నేను తినను"

**** ***** *****

"ఇది మీరు చిన్నప్పటినుంచీ బాగా తినే కూర అన్నరు కదా..వదిలేసారేం?"
"చూడటానికి బాలేదు"
"తింటే బాగుంటుందేమో...ట్రై చేయచ్చు కదా.."
"ఇదివరకూ చెప్పను నీకు చూడగానే బాగుంటే తప్ప నేను ఏదీ తిననని"
"మరి ఇక ఏం వండాలి నేను?"
"......."
"ఏరోజూ ఇది కావాలని అడగరు. కొత్త పదార్ధాలు తినరు. పాత పదార్ధాలు ఒకోసారి తింటారు. ఒకోసారి తినరు. మీతో వేగటం నావల్ల కాదు బాబూ.."
"చేసుకున్నాకా తప్పదు మరి...ఈ జన్మకిలాక్కానీ..."

********** ******** *********

విశ్లేషణ:వంట రాని మగవాళ్ళలో మొదటి కేటగిరీనే బెస్ట్. అవసరార్ధం తప్పదనో, నిజంగానే భార్య వంట నచ్చో మెచ్చుకుంటూ తినేస్తారు. ఎవర్నన్నా భోజనానికి పిలిచినా, పిలవకపోయినా భార్య వంట మెచ్చుకుంటారు.

ఇక రెండో రకం వారితో సర్దుకుపోవచ్చు. వంకలు పెడ్తున్నారని కోపం వచ్చినా ఫలానాది తినాలని ఉందనీ, ఫలానాది బాలేదనీ చెప్పటం వల్ల కాస్త తినటం పట్ల ఆసక్తి ఉందని గమనించొచ్చు. వంట వచ్చిన ఇల్లాలికి మనశ్శాంతి.

కానీ ఆ మూడో రకం వాళ్ళతో మాత్రం చాలా కష్టం.

ఏమైనా నా ఓటు మాత్రం వంటొచ్చిన మగవాళ్ళకే. వీరి తాలూకూ భార్యలు చాలా అదృష్టవంతులు అని నా అభిప్రాయం.(ఇక్కడ మా అన్నయ్యకూ జై...!!)అదేం లేదు.దూరపు కొండలు నునుపు.. అంటారా?

Sunday, February 27, 2011

మా వీధిలో "కూరల సంత"


"సంత" అంటే కొన్ని చిన్న చిన్న దుకాణాల సముదాయం...అంటే మార్కెట్ అనుకోవచ్చు. అన్నిరకాల వస్తువులు దొరికే సంతలు ఉంటాయి. మల్టీపర్పస్ అన్నమాట. అలా కాకుండా కొన్ని ప్రత్యేకమైన సంతలు కూడా ఉంటూంటాయి. అక్కడ దొరికే వస్తువుని బట్టి ఆ సంతకు ఆ పేరు ఉంటుంది. పూల సంత, పుస్తకాల సంత, కూరల సంత, పశువుల సంత...అలా అన్నమాట. పూర్వం పల్లెటూర్లలో, గ్రామాల్లో ఊరి చివరలో వారంలో ఒక రోజున, ఎక్కువగా ఆదివారాలు ఈ సంతలు ఏర్పాటు చేసేవారు. పట్టణాల్లో కూడా సంతలు పెడుతూంటారు. మా అత్త, నాన్న, నాన్నమ్మ మొదలైనవారు చెబితే వినటమే కానీ నేనెప్పుడూ ఏ సంతా చూడలేదు. ఈ మధ్యనే ఓ నెల నుంచీ మా వీధిలో కూరల సంత పెడుతున్నారు కొత్తగా.

ఇక కూరలమార్కెట్ కో, రిలయన్స్ కో వెళ్ళాల్సిన అవసరం లేకుండా ప్రతి శనివారం హాయిగా ఇంటి దగ్గరే తక్కువ రేట్లకు కూరలు కొనేసుకుంటున్నాను. అసలు మార్కెట్ కు వెళ్ళి కూరలు కొనటం అనేది నాకు చాలా ఇష్టమైన పనుల్లో ఒకటి. ఆకుపచ్చగా, తాజాగా ఉన్న కూరలను చూస్తూంటే ఉత్సాహం పెరిగిపోయి, చేతిలోని సంచీ నిండి, చెయ్యి ఆ బరువును మొయ్యలేకపోతోంది అన్న స్పృహ కలిగేదాకా కూరలు కొనేస్తునే ఉంటాను. ఒకటా రెండా? దాదాపు పధ్ధెనిమిది,ఇరవైఏళ్ల అలవాటు. పైగా నాకు కరివేపాకు కోసమో,కొత్తిమీర కోసమో అడుగడుక్కీ వీధిలోకి పరుగెట్టడం ఇష్టం ఉండదు. వారనికి సరిపడా కూరలతో పాటూ కర్వేపాకు, కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, నిమ్మకాయలు మొదలైన "కుక్కింగ్ ఏక్సెసరీస్" అన్నీ మర్చిపోకుండా తప్పనిసరిగా కొనేస్తాను. మా వీధిలోని సంత పుణ్యమా అని అన్నీ అందుబాటులోకి వచ్చేసరికీ అసలా కూరల్ని చూడగానే ఆనందతాండవమే. మొదటి రెండువారాలూ భారీజనాలను చూసి భయపడి నేను అటుకేసి వెళ్ళలేదు కానీ ప్రతి శనివారం "కూరల సంత" పెట్టడం చూసి రెండువారాల నుంచీ నేనూ కొనటం మొదలెట్టా.


సాయంత్రం ఆరుదాటితే జనం పెరిగిపోతారని గమనించి మూడూ నాలుగు మధ్యన వెళ్ళి తెచ్చేసుకుంటున్నాను. కూరలే కాక ఉసిరి కాయలు, చింతకాయలు, పండు మిర్చి, పెద్ద మిరపకాయలు మొదలైనవి కూడా ఉంటున్నాయి. క్రితం వారం పండు మిర్చి ఓ పావు కొని కొరివికారం, పెద్ద మిరపకాయలతో ఊరు మిరపకాయలు పెట్టాను. నిన్న ముద్దుగా బొద్దుగా ఉన్న చింతకాయలు కొన్నా. ఇంకా పచ్చడి పెట్టాలి. అప్పుడే తోటలోంచి కోసుకొచ్చినట్లు ఉన్న ఆకుకూరలు, తాజా కూరలు భలే ముచ్చటగా ఉన్నాయి. కూరలు అమ్మే ఒకమ్మాయి నన్ను గుర్తుపట్టి "అమ్మా నువ్వు మార్కెట్టుకు వస్తూంటావు కదా" అని అడిగింది. "ఎలా తెలుసు నేను?" అనడిగాను. మేము అక్కడివాళ్ళమే. జనాలు ఎక్కువరావట్లేదని ఇలా ఒకో వారం ఒకో వీధిలోకీ వచ్చి అమ్ముతున్నామమ్మా. ఇలా వస్తే మాకూ బేరాలు బాగా అవుతున్నాయి. నువ్వు వస్తూంటావు కదా నిన్ను గుర్తుపట్టా" అంది. "జనాల దగ్గరకు మీరు వెళ్లండి..."అన్న "మిష్టర్ పెళ్ళాం" సినిమాలో ఆమని డైలాగ్ గుర్తు వచ్చింది.

మధ్యాన్నం ఒంటిగంట నుంచీ రాత్రి తొమ్మిదింటిదాకా ఉంటున్నారు వీళ్ళంతా. ధరలన్నీ కూడా చాలా తక్కువగానే ఉంటున్నాయి. పావుకేజీలు కావలన్నా ఇస్తున్నారు. ముఖ్యంగా ఎవరి జాగాల్లో తుక్కు వారే క్లీన్ చేసుకుని తీసుకెళ్ళిపోవాలని రూల్ కూడా పెట్టడంవల్ల మర్నాడు పొద్దున్నే వీధంతా సంత మొహం ఎరుగనట్లు మామూలుగా కూడా ఉంటోంది. అది మరీ నచ్చేసింది నాకు. ధరలు ఆకాశాన్నంటుతున్న ఈ కాలంలో ఇలాంటి సంతలు ఎంత అవసరమో అనిపించింది. కూరల మార్కెట్ రేట్లకు డబుల్ రేటు పెంచేసి అమ్మే వీధుల్లోని కూరల కొట్లువాళ్ళకీ, సూపర్ మార్కెట్ల వాళ్లకీ ఇలాంటి సంతలే తగిన సమాధానం.



Saturday, February 26, 2011

కుంపటి


"కుంపటి". నాకు భలే ఇష్టమైన వస్తువుల్లో ఒకటి. పైన ఫోటోలోది మొన్న అమ్మ దగ్గర నుంచి నేను తెచ్చుకున్న బుజ్జి కుంపటి.కుంపటి పై ఉన్న ఆ ట్రయాంగిల్ చట్రం గిన్నె నిలబడటానికి వాడేది. దీనితో నాకు బోలెడు జ్ఞాపకాలు ఉన్నాయి. మా ఇంట్లో పెద్దది, చిన్నది రెండు కుంపటిలు ఉండేవి. గ్యాస్ స్టౌ మీద వంట చేసినా కూడా కిరోసిన్ స్టవ్, బాయిలర్ స్నానానికి నీళ్ళు కాచేందుకు, కొన్ని పదార్ధాలు చేసేందుకు కుంపటి వాడేది అమ్మ. వంకాయ కాల్చి పచ్చడి చేయటానికీ, తేగలు కాల్చటానికీ, మొక్కజొన్నపొత్తులు కాల్చటానికీ వాడేది. దోసకాయ కూడా కుంపటి మీద కాల్చి పచ్చడి చేస్తారని విన్నాను. అరటికాయ కాల్చి పొడి కూర కూడా చేస్తారు. ఇలా రకరకాలుగా కుంపటి వాడుతూండేది అమ్మ.

మాఘమాసంలో గుండ్రని ఇత్తడిగిన్నెలో పాలు,బియ్యం వేసి కుంపటి మీద అమ్మ చేసే అన్నం పరమాన్నం ఎప్పుడు నైవేద్యం పెడుతుందా అని ఎదురు చూసేదాన్ని...త్వరగా తినేయటానికి. చిక్కుడు కాయలకు పుల్లలు గుచ్చి రథంలా తయారుచేసి, చిక్కుడాకుల మీద వండిన పరమాన్నం పెట్టి నైవేద్యం పెట్టాకా తినటానికి ఇచ్చేది...ఆ రుచే రుచి. గ్యాస్ స్టౌ మీద అన్నం పరమాన్నం చేసినా కుంపటి మీద అమ్మ వండిన ఆ రుచి రాదు. ఇంకా ఉల్లిపాయలు కాల్చి పెట్టేది కుంపటి మీద. గోంగూర పచ్చడి చేసుకుని, కుంపటి మీడ కాల్చిన ఉల్లిపాయలు నంచుకుని తింటే ఉంటుందీ...ఆహా ఏమి రుచీ అని పాడుకోవాల్సిందే.


ఏదైనా చేసే ముందు కుంపటి వెలిగించే డ్యూటీ నాకిచ్చేది అమ్మ. బొగ్గులు వేసి, కాస్తంత కిరసనాయిలు పోసి, కాగితం ముక్కలూ అవీ వేసి కుంపటి వెలిగించి, విసనకర్రతో బొగ్గులు మండేలా చేయటం ఎంత కష్టమైన పనో అసలు. అయినా సరదా కొద్దీ ఎప్పుడూ ఆ పని తమ్ముడికి ఇవ్వకుండా నేనే చేసేదాన్ని. మధ్యలో ఆరిపోతూ ఉండే బొగ్గుల్ని మళ్ళీ మండించటం కూడా ఓ పెద్ద పనే. చాలా రోజుల్నుంచీ అమ్మ దగ్గర నుంచి కుంపటి తెచ్చుకోవాలని. ఇన్నాళ్ళకు కుదిరింది. ఇనుము ఊరికే తీసుకోకూడదని కాస్తంత డబ్బులు ఇచ్చి, అటక పైకెక్కి వెతుక్కుని మరీ అమ్మ దగ్గర నుంచి (పెద్దది అమ్మకు ఉంచేసి)ఈ బుజ్జి కుంపటి తెచ్చుకున్నాను. "తాతా చూడు, బయటవాళ్ళకు ఇచ్చినట్లు అమ్మ అమ్మమ్మకు డబ్బులు ఇస్తోంది" అని మా అమ్మాయి నవ్వు. ప్రస్తుతం బొగ్గులు, కిరసనాయిలు సంపాదించే మార్గం చూడాలి. వీధి చివరి ఇస్త్రీ వాళ్ళని అడిగితే ఇస్తారేమో మరి.

"స్వర్ణకమలం"లో "ఇదేంటి సార్, మీ మొహం ఇలా కుంపట్లో కాలిన కుమ్మొంకాయలాగ అయిపోయింది" డైలాగ్, మొన్న మొన్నటి "అష్టాచెమ్మా" సినిమాలో తనికెళ్ళభరణిగారు స్వయంగా కుంపటిపై వంకాయ కాల్చి పచ్చడి చేసే సీన్ మర్చిపోగలమా? గ్యాస్ స్టౌ లు, కనీసం కిరసనాయిలు స్టౌ లు కూడా లేని పూర్వం మన అమ్మమ్మలు, బామ్మలూ మరి అద్భుతమైన వంటలన్నీ ఈ కుంపటి పైనే చేసేవారు. అంతటి ప్రశస్తమైన చరిత్ర కలిగిందీ కుంపటి. ఐదు నిమిషాల్లో కుక్కర్ కూత రాకపోతే గాభరా పడే మనం అసలు వాళ్ళు అలా ఎలా వండేవారా అని వండరవ్వక మానం. తల్చుకుంటే అమ్మో అనిపిస్తుంది. ఓర్పూ, సహనం అనేవి ఇలా నెమ్మదిగా కుంపటిపై వండటం వల్లనే వాళ్ళకి అలవడేవేమో అని నాకో అనుమానం. అసలు ఇప్పటికీ ప్రతీ ఇంట్లోనూ ఒక కుంపటి ఉండాలని నా అబిప్రాయం. ఏమంటారు?

Friday, February 25, 2011

ప్రేమించి చూడు(1965)


బాపు దర్శకత్వంలో వచ్చిన సినిమాలు కాక ముళ్ళపూడి వెంకటరమణగారు మూగమనసులు, దాగుడుమూతలు, నవరాత్రి, రక్త సంబంధం, ప్రేమించి చూడు వంటి సుపర్ హిట్ చిత్రాలకు కూడా "మాటలు" రాసారు. అందులో నాకు బాగా ఇష్టమైన సినిమా "ప్రేమించి చూడు". హాస్యరసం ప్రధానాంశమైన ఈ చిత్రం సంగీతభరితంగా, ఆనందకరంగా ఉంటుంది. "కాదలిక్క నేరమిల్లై" పేరుతో తమిళంలో వచ్చిన ఈ సినిమాకు కథ, దర్శకత్వం సి.వీ. శ్రీధర్ అందించారు. ఈ చిత్రానికి తెలుగులో దర్శకులు పి.పుల్లయ్య. ముళ్ళపూడివెంకటరమణగారు మాటలు(డైలాగులు) రాసారు.

సినిమాలో ముఖ్యంగా రేలంగి పాత్ర నాకు చాలా నచ్చేస్తుంది. రేలంగి చెప్పే ప్రతి డైలాగూకూ మనం నవ్వకుండా ఉండలేము. బుచ్చబ్బాయ్ పాత్రలో రేలంగి జీవించారనే చెప్పాలి. "పెద్దమ్మాయ్ బిఎస్సీ , చిన్నమ్మయ్ పి.యు.సీ" డైలాగ్; డైరెక్టర్ అవ్వాలనుకునే కొడుకు చెప్పే సినిమా కథ విని భయపడే సీన్; కూతుళ్ళు ఏదంటే అది ఒప్పేసుకునే ఆ వల్లమాలిన ప్రేమ, పేద్ద ధనవంతుడిలాగ మారువేషం వేసుకొచ్చిన జగ్గయ్యను నమ్మి కాకాపట్టి ఎలాగైనా ఒక కుమార్తెను అతనికి కోడల్ని చేయాలని పడే తాపత్రయం, ఆ క్రమంలో జగ్గయ్యకి తందానతాన అంటూ చెప్పే డైలాగులు నవ్వు తెప్పిస్తాయి.

కథలోకి వస్తే, బుచ్చబ్బాయ్(రేలంగి) ఒక ఎస్టేట్ యజమాని. లక్షల ఆస్తి, అందమైన బంగ్లా ఉంటాయి. ఒక కుమారుడు(చలం), ఇద్దరు కుమార్తెలు(కాంచన, రాజశ్రీ) ఉంటారు. తన వెనుక తండ్రి ఆస్తి ఉందన్న ధీమాతో ఎలాగైనా సినిమాకి దర్శకత్వం వహించాలనే కోరిక అతని కుమారుడిది. కుమార్తెలు అంటే బుచ్చబ్బయ్ కి వల్లమాలిన ప్రేమ. వాళ్ళు ఎంతంటే అంత. పట్నంలో చదువుకుంటున్న వాసూ, కాంచనమాల ప్రేమించుకుంటారు. బుచ్చబ్బాయ్ ఎస్టేట్లోనే అసిస్టెంట్ మేనేజర్ గా చేరతాడు రంగారావు(నాగేశ్వరరావు). ఒక చిన్న తగాదాతో అతనికి పరిచయమౌతుంది బుచ్చబ్బాయ్ చిన్న కూతురు రత్నమాల. కోపంతో అతన్ని ఉద్యోగంలోంచి డిస్మిస్ చేయిస్తుంది. స్నేహితుల సాయంతో బుచ్చబ్బాయ్ బంగ్లా ముందు డేరా వేసి ధర్నాకి దిగుతాడు రంగడు. ఈ సీన్లో వచ్చే "మేడ మీద మేడ కట్టి కోట్లు కూడబెట్టినట్టి కామందు..." పాటను ముళ్ళపూడి గారే రాసారు. బుచ్చబ్బాయ్ పని కావాలోయ్...అంటూ సాగే ఈ పాట ఎంతో ప్రజాదరణ పొందింది.

ఈ జగడంలో రత్నమాల, రంగారావు ల మధ్య ప్రేమ చిగురిస్తుంది. కానీ ఒక మామూలు స్కూలు టీచర్ కుమారుడైన రంగడి పేదరికం పెళ్ళికి అడ్డంకిగా నిలుస్తుంది. అందుకని రంగా తన స్నేహితుడైన వాసు(జగ్గయ్య)కి గడ్డం తగిలించి కోటీశ్వరుడైన శ్రీనివాస భూపతిగా బుచ్చబ్బాయ్ కి పరిచయం చేస్తాడు. ధనాశాపరుడైన బుచ్చబ్బాయ్ ఆస్తి కలిసి వస్తుందని ఒక కుమార్తెను శ్రీనివాసభూపతి తన కొడుకుగా నమ్మించిన రంగాకి ఇచ్చి వివాహం జరిపించాలని తాపత్రయపడుతూ ఉంటాడు. అనుకోకుండా బుచ్చబ్బాయ్ ను కలుస్తాడు అతని బాల్య మిత్రుడు సుబ్బారాయుడు. ఇద్దరు కలిసి సుబ్బారాయుడి కుమారుడికి బుచ్చబ్బాయ్ పెద్ద కుమార్తె కాంచనమాలను ఇచ్చి వివాహం చేయాలని నిశ్చయిస్తారు. సుబ్బారాయుడు కుమారుడే వాసు అని కాంచనకు తెలిసి వివాహానికి ఒప్పుకుంటుంది ఆమె. కానీ శ్రీనివాస భూపతి వేషంలో ఉన్న వాసు గడ్డం తీసివేస్తే రత్నమాల, రంగల పెళ్ళి ఆగిపోతుంది. ఉంచితే వాసు,కాంచనల పెళ్ళి అవ్వదు.

ఈలోపూ పట్నంలో ఒక ఇంట్లో రంగా ఫోటో చూసిన సుబ్బారాయుడు ఆ సంగతి బుచ్చబ్బాయ్ కి చెప్తాడు. రంగా, వాసుల నాటకం బయటపడిపోతుందా? వాళ్ల పెళ్ళిళ్ళు అవుతాయా? బుచ్చబ్బయ్ కుమారుడు సినిమా తీసాడా? మొదలైన ప్రశ్నలకు సినిమా చూడటమే సమాధానం. సినిమాలో చలం,గిరిజల జంట, గిరిజ తండ్రి పాత్ర, వాళ్ల ముగ్గురి సంభాషణలు హాస్యాన్ని పండిస్తాయి. మాస్టర్ వేణూ సంగీతం సినిమాకు సగం విజయాన్నందించింది. "దొరికేరూ దొరగారూ", "వెన్నెల రేయీ ఎంతో చలీ చలీ", "అందాలే తొంగి చూసే హా హా హా..", నాయికానాయకులు నలుగురూ కలిసి పాడే "ప్రేమించి చూడు పిల్లా పెళ్ళడుదాము మళ్ళా" అనే టైటిల్ సాంగ్, ఏ.ఎన్.ఆర్ ఇద్దరు అక్కచెల్లెళ్ళనూ ఏడిపిస్తూ పాడే "మీ అందాల చేతులు కందేను పాపం ఎందుకు ఈ బెడద", పైఅన్ చెప్పుకున్న "మేడ మీడ మేడ కట్టి", చలం, గిరిజల పాట "కళ కళాలాడే కన్నులు" , అన్నింటిలోకీ రొమాంటిక్ అయిన "అదిఒక ఇదిలే" పాట Bésame Mucho అనే Spanish song నుంచి ఇస్పైర్ అయ్యింది. (ఈ సంగతి అదివరకూ ఓ టపాలో రాసాను.) నాకు కూడా అన్నింటిలోకీ "మీ అందాల చేతులు", "అది ఒక ఇదిలే" రెండూ ఇష్టమైన పాటలు.
రమణగారి గుర్తు చేసుకుంటూ ఆయన ఈ సినిమాకి రాసిన పాట మరోసారి చూసేద్దామా మరి..

ఏం రాయను...?



అవును..ఏం రాయను..? ముళ్ళపూడి వెంకటరమణ గారి గొప్పతన్నాని నేను అక్షరాల్లోకి ఒదిగించగలనా? అసాధ్యం. నిన్న పొద్దున్నే పూజకు కూర్చున్నాను.. టివీలో స్క్రోలింగ్ వెళ్తోంది అని "ముళ్లపూడిగారి వార్త" చెప్పారు తను. గబుక్కున లేచి రాబోయాను. "ఇంకేమీ చూపించటం లేదు. పూజ పూర్తి చేసుకుని రా. కంగారు పడకు" అన్నారు తను. స్తోత్రాలేవో చదువుతున్నాను కానీ స్థిమితం లేదు. ధ్యాస అక్కడ లేదు. నిన్న దేవుడికి పువ్వులు తేవటం కుదరలేదు. మందిరం బోసిగా ఉంది నా మనసులాగే..అనుకున్నా. అయ్యో, బాపూ గారు ఎలా ఉన్నారో...అని అలోచన. యాంత్రికంగా పూజ అయ్యిందనిపించి, పాపను స్కూలుకు పంపించాకా టీవీ ముందుకు చేరా. స్క్రోలింగ్స్ లో తప్ప ఎక్కడా ఎవరు ఈ సంగతి మాట్లాడటంలేదు. ఇక బ్లాగులు తెరిచను. వరుసగా అన్నీ రమణగారిపై టపాలు...! ఆఫీసుకి వెళ్తూ తను చెప్పారు.."ఆ టివీ చూసి, బ్లాగులు చదివి బాధపడుతూ కూర్చోకు. అవన్నీ కట్టేసి ఏ పుస్తకమో చదువుకో.." అని.

టీవీ అయితే కట్టేసాను కానీ బ్లాగులు మూయలేదు. పనుల మధ్యన తెరుస్తూ మూస్తూ ముళ్ళపూడిగారిపై వచ్చిన ప్రతి టపా చదువుతూ పొద్దంతా గడిపేసాను. మధ్యలో బాపూరమణల సినిమానవల ఒకటి పూర్తిచేసేసాను. చాలా రోజులకు ఒకపూటలో మొత్తం పుస్తకాన్నిచదివేసాను మునుపటిలా. మొన్ననే వస్తూ వస్తూ నాన్న దగ్గర నుంచి కొన్ని సినిమా నవలలు తెచ్చుకున్నాను. విచిత్రమేమిటంతే వాటిల్లో మూడు బాపూరమణల సినిమాలే. వాటి గురించి వీలు చూసుకుని రాయాలి. అయితే వీటి సినిమా సీడీలు మాత్రం దొరకలేదు. ఇటీవలే ఒక ప్రముఖ మ్యూజిక్ స్టోర్స్ లో సీడీలు వెతుకుతూ అక్కడ నించిన్న అమ్మాయిని బాపూ సినిమాలేమైనా ఉన్నాయా అంటే "బాపూ" ఎవరు? అంది. ఓసినీ నీకిక్కడ నించునే అర్హత ఉందా అసలు? అని మనసులో తిట్టుకుని, గొప్ప తెలుగు సినిమాలు తీసిన డైరెక్టర్ అమ్మా అని మాత్రం చెప్పి ముందుకెళ్ళిపోయా. ఇంకేం చెప్పాలి?

ఏమాటకామాటే చెప్పాలి. తమిళులకున్న భాషాభిమానం తెలుగువాళ్లకు లేదు. బొంబాయిలో Matunga road ఏరియా దగ్గరకు వెళ్లినప్పుడలా అనుకునేదాన్ని ఇలాంటి మహా నగరంలో చిన్న తమిళ్నాడును సృష్టించగల ప్రాంతీయాభిమానం తమిళులకే ఉంది అని. కాలేజీ రోజుల్లో కలకత్తా వెళ్ళినప్పుడు "శాంతినికేతన్" చూడటానికి వెళ్ళం. బోల్ పూర్ స్టేషన్లో దిగి అక్కడ నుంచి రిక్షాలో వెళ్ళాలి శాంతినికేతన్ కి. (ఇప్పుడు ఆటోలు గట్రా వచ్చాయేమో తెలీదు) వెళ్తూంటే ఆ రిక్షానడిపే అతను దారి పొడుగునా అక్కడి విశేషాలు, రవీంద్రుడు చేసిన పనులు, శాంతినికేతన్ ఎలా కట్టారు? టాగూర్ ఏం ఏం చేసారు మొదలైన డీటైల్స్ అన్నీ ఎంతో చక్కగా హిందీలో వివరించాడు మాకు. రిక్షా అబ్బాయికి కూడా ఎంత శ్రధ్ధా? అని ఆశ్చర్యపోయాం మేము. మన తెలుగువారికా శ్రధ్ధ ఉందా?

తెలుగు సాహితీ ప్రపంచానికి రమణగారు చేసిన సేవ తక్కువా? సినీ ప్రపంచంలో బాపూరమణ ద్వయం తీసిన సినిమాలకే కాక రక్త సంబంధం, మూగ మనసులు, ప్రేమించి చూడు మొదలైన మంచి మంచి సినిమాలకు రమణగారు అందించిన "మాటలు" ఎంత అద్భుతమైనవి? ఇవాళ్టికీ ఇంట్లో మాటల్లో వాడుకునే "బుడుగు" డైలాగ్స్ కు పోటీ ఏవైనా ఉన్నాయా? అసలు "బుడుగు"లాంటి గొప్ప కేరెక్టర్ ను తెలుగు సాహిత్య ప్రపంచంలో మరెవరైన సృష్టించగలిగారా? మరి అటువంటి మహానుభావులకు తెలుగువారు ఏమి అవార్డులు ఇచ్చారు? ప్రభుత్వం ఏమి చేసింది? మనిషి పోయిన తరువాత ఎన్ని గౌరవాలు ఇస్తే మాత్రం ఏం లాభం? వారసులు తడిమి చూసుకోవటానికి తప్ప అవి ఎందుకైనా పనికివస్తాయా? బ్రతికి ఉండగా వారి గౌరవాన్ని వారికి అందిస్తే అది వారి ప్రతిభకు గుర్తింపు అవుతుంది. వారు చేసిన సాహిత్యసేవకు, కళా సేవకూ విలువనిచ్చినట్లౌతుంది. రమణగారూ దూరమైపోయినా కనీసం బాపూగారికయినా ప్రభుత్వం ఏదైనా ప్రతిష్ఠాత్మకమైన అవార్డుని ఇప్పటికైనా అందిస్తే బాగుంటుంది అనిపిస్తోంది.

సినీజగత్తులో పేరు పొందిన వ్యక్తులెవరైనా పోయినప్పుడు దూరదర్శన్ వాళ్ళు(DD-1) వారి తాలూకూ సినిమాలను వరుసగా ఓ పదిరోజులనుకుంట టివీలో వేసేవారు. నేను స్కూల్లో ఉన్న రోజుల్లో అలా ఎన్ని మంచి మంచి హిందీ సినిమాలు చూసానో. అంతా దూరదర్శన్ పుణ్యమే. హృషీకేష్ ముఖర్జీ, గురుదత్, రాజ్ కపూర్, బిమల్ రాయ్ మొదలైనవారి మేటి సినిమాలన్నీ నేను చూసినది టీవీలోనే. నాన్నతో పాటూ అర్ధ్రరాత్రి దాటినా ఆ సినిమాలన్నీ వదలకుండా చూసేదాన్ని. అది మన తెలుగువాళ్ళు ఎందుకు చెయ్యరో నాకు అర్ధమే కాదు. పోయినప్పుడనే కాదు, ఫలానావారి స్మృత్యార్ధం అని ఎస్.వీ.రంగారావు, నాగయ్య, సావిత్రి మొదలైన గొప్పనటులు నటించిన సినిమాలు, విఠలాచార్య, ఆదుర్తి సుబ్బారావు మొదలైన గొప్ప దర్శకులు తీసిన చిత్రాలు ఓ వారం రోజులపాటు వేయచ్చు కదా. లేకపోతే ఇప్పటి తరానికి పూర్వసినీవైభవం తెలిసేది ఎలా? కొన్ని ఛానల్స్ వాళ్లు ఏ.ఏన్.ఆర్ హిట్స్ అనీ, ఎన్.టీ.ఆర్ హిట్స్ అనీ వేస్తున్నట్లున్నారు. ఇప్పుడిక టివీ పెద్దగా చూడను కాబట్టి నాకు సరిగ్గా ఐడియా లేదు. ఇప్పుడు ఇన్ని ఛానల్స్ లో ఏదైనా ఓ ఛానల్ వాళ్ళైనా బాపూరమణల సినిమాలు ఓ వారం రోజులు చక్కగా వేస్తే ఎంత బాగుంటుంది? కనీసం వారు తీసిన సినిమాలన్నీ సీడీల రూపంలోనో డివీడీల రూపంలోనో బయటకు వస్తే ఎంత బాగుంటుంది? ఆ మ్యూజిక్ స్టోర్స్లో అమ్మయికి బాపూగారి గొప్పతనం అర్ధమైతే ఎంత బాగుంటుంది?

"అంతులేని ఆవేదన ఎందుకే కడలీ" అని ఓ ప్రైవేట్ సాంగ్ ఉంది. అలాగ ఏదో రాయాలని తాపత్రయం తప్ప ఏం రాసి ఏం ప్రయోజనం? నేను రాస్తే ప్రభుత్వం అవార్డులిచ్చేయదు. పోయిన మనిషి తాలూకూ ఎడబాటుని బాపుగారు, ఆయన మనుషులు అనుభవించకా తప్పదు. ఏదో హృదయ ఘోష ఇలా అక్షరాలోకి మార్చి నే "తుత్తి"పడ్డం తప్ప...! వెళ్పోయినవాళ్ళు బానే ఉంటారు స్వర్గంలో. ఉన్నవాళ్ళకే బాధ. ఆ ఎడబాటులోని వ్యధ, లోటు మరెవరూ పూడ్చలేనివీ. బ్రతికి ఉన్నంతకాలం అనుభవించవలసినవీనూ.

ఆత్రేయగారి మాటల్లో అందంగా చెప్పాలంటే "పోయినోళ్ళందరూ మంచోళ్ళు...ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గురుతులు"...అంతే కదా..