"రెస్ట్ తీసుకుంటాను కొన్నాళ్ళు రాయనన్నావు...మళ్ళీ ఎందుకు రాస్తున్నావు?" అడిగాడు గత పది రోజులుగా నేను రాస్తున్న టపాలు చూసిన మా అన్నయ్య(తను నా బ్లాగ్ రెగులర్ రీడర్). కొన్నాళ్ళుగా నత్త నడక నడుస్తున్న నా బ్లాగ్ను ఒకరోజు చూసుకుంటూంటే, 187 వ టపా నంబరు చూసాను...మేనెల చివరకు బ్లాగ్ తెరిచి ఒక సంవత్సరం అవుతుంది...ఈ లోపూ 200 టపాలన్నా పూర్తి చేస్తే...ఏదో కాస్త "తుత్తి"గా ఉంటుందనిపించింది....కానీ ఆ నిర్ణయం ఎంత కష్టమైనదో తర్వాత కానీ తెలియలేదు.
బ్లాగ్ మొదలెట్టిన దగ్గరనుంచీ నెలకి 20,25 తక్కువ కాకుండా టపాలు రాసిన నాకు ఈ చివరి 10,15 రాయటం ఎంత కష్టమైందో... అది నాకే తెలుసు ! కంప్యూటర్ లేక కొన్నాళ్ళు, ఓపిక లేక కొన్నాళ్ళూ జాప్యం జరుగుతూ వచ్చింది. ...సంవత్సరం లోపూ 200టపాలు పూర్తి అవ్వాలని రూలేం లేదు...రాస్తే ఏ అవార్డులూ రావు. రాయకపోయినా ఎవరూ పట్టించుకోరు. కానీ ఏ ఛాలెంజ్ లేకపోతే జీవితం చప్పగా ఉంటుంది. అన్నీ వీలుగా ఉన్నప్పుడు టపాలు రాయటం గొప్పేమీ కాదు...పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు కూడా ఇలా రాయగలగటం నా మనసుకైతే సంతృప్తినే ఇచ్చింది. నిన్నటి టపాతో డబుల్ సెంచరీ పూర్తయ్యింది. రాయాలనుకున్నవి రాసాను.
బ్లాగుల గురించి ఏమీ తెలియకుండా సంవత్సరం క్రితం మే28న "తృష్ణ..." మొదలెట్టాను.ఈ సంవత్సర కాలంలో ఎన్నో అనుభవాలు, అనుభూతులూ, పాఠాలూ...!! మరో పది రోజులకు కూడలిలో నా బ్లాగును లంకె వేయగలిగాను. మరో నెలకు "విజిటర్స్ కౌంటర్" పెట్టడం తెలిసింది. "తృష్ణ వెంట" నడుచుకుంటూ వెళ్ళాను... ఇవాళ్టికి 47,500 పై చిలుకు అతిధులు బ్లాగు చూశారు, ఎవరన్నా ఫాలో అవుతారా? అనుకున్న నా బ్లాగుకు 45 మంది నాతో నడిచేవాళ్ళు చేరారు. సుమారు 760 పైగా వ్యాఖ్యలు సంపాదించగలిగాను. వ్యాఖ్యలు రాయకపోయినా కొత్తగా టపా రాస్తే, రెగులర్గా చదివే 150 పై చిలుకు అతిధులను సంపాదించుకోగలిగాను. ఈ లెఖ్ఖలూ, పద్దులూ ఎందుకు? నా తృప్తి కోసమే. ఏ పేపర్లోనూ పడకపోయినా, ఏ బ్లాగర్ చేతా పొగడబడకపోయినా నాలాంటి సాధారణ గృహిణికి ఒక సంవత్సరం లో ఈ మాత్రం అభిమానాన్ని సంపాదించుకోవటం ఆనందం కలిగించే విషయమే.
నాకు తెలిసిన, అనుభూతికి అందిన ఎన్నో విషయాలను మరికొందరితో పంచుకోవాలని, ఇంకా ఇంకా రాయాలని ఉన్నవి... ఎన్నో ఉన్నాయి...కానీ ఇక తొందర లేదు కాబట్టి అవి మెల్లగా ఎప్పుడో....! ఎందుకంటే బ్లాగ్ వల్ల నేనెంత ఆనందాన్ని,తృప్తినీ పొందానో, అంతే సమానమైన బాధనూ, వేదననూ కూడా పొందాను. ఎందుకు బ్లాగ్ తెరిచాను? ఈ బ్లాగ్ వల్ల కదా ఇంత దు:ఖ్ఖాన్ని అనుభవిస్తున్నాను... అని బ్లాగ్ మూసేయాలని చాలాసార్లు ప్రాయత్నించాను. విరామం కూడా ప్రకటించాను. కానీ ఎప్పుడూ పదిరోజులకన్నా బ్లాగ్కు దూరంగా ఉండలేకపోయాను. ఎప్పటికప్పుడు ఏదో శక్తి నాకు అనుకున్నది రాసే అవకాశాన్ని ఇస్తూనే ఉంది. బహుశా నాలో అంతర్లీనంగా అనుభవాలనూ, సంగతులనూ పంచుకోవాలని ఉన్న తపన దానికి కారణం అయి ఉండవచ్చు. అందుకనే నేను రాసేవి ఉపయోగకరమైనవి, ఎవరినైనా ఎన్టర్టైన్ చేసేవీ అయితే మళ్ళీ మళ్ళీ రాసే అవకాశాన్ని భగవంతుడు తప్పకుండా నాకు ఇస్తాడనే నా నమ్మకం. అందుకే ఈసారి విరామాన్నీ, శెలవునీ ప్రకటించట్లేదు...:)
ఇంతకాలం ప్రత్యక్ష్యంగా వ్యాఖ్యలతో, పరోక్షంగా మౌనంతో నా బ్లాగ్ చదివి నన్ను ముందుకు నడిపించిన బ్లాగ్మిత్రులందరికీ మరోసారి హృదయపూర్వక కృతజ్ఞతలు...!!జీవితంలో ఏనాడూ ఉద్దేశపూర్వకంగా ఎప్పుడూ నెనెవరినీ ఇబ్బంది పెట్టి ఎరుగను. ఒకవేళ పొరపాటుగా ఎవరికైనా ఎప్పుడైనా వ్యాఖ్యల వల్ల కానీ, టపా వల్ల కానీ ఇబ్బందిని కలిగించి ఉంటే క్షమించగలరు.
"..But I have promises to keep,
And miles to go before I sleep,
And miles to go before I sleep. "