సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||
Wednesday, April 14, 2010
ఏమిటో ఈ ఆట..?!
తీరిక దొరికితే పుస్తకాలు చదవటం,ఎదన్నా రాసుకోవటం లేక నెట్ లో కొత్త కొత్త విషయాలేమైనా తెలుసుకోవటం నాకు అలవాటు. బాగా ఖాళీగా ఉంటే తప్ప టి.వీ.జోలికి పోను. ఒకప్పుడు బాగా చూసేదాన్ని కానీ ఇప్పుడు మాత్రం తీరిక సమయాల్లో టి.వీ.చూడటం టైంవేస్ట్ చేసుకోవటమే అనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ టివీ చూసినా తెలుగు చానల్స్ చూసే ధైర్యం చేయను.అవంటే నాకు భయం. కానీ ఈమధ్యన చానల్స్ తిప్పుతుంటే అనుకోకుండా ఏవో కొన్ని తెలుగు డాన్స్ ప్రొగ్రాంస్ చూడటం జరిగింది. 3,4 సార్లు ఇలా ఈ మధ్యన చూసాను.అవి కూడా చిన్న పిల్లలు చేసే డాన్స్ లు.
2008 జూన్ లో అనుకుంటా నేను నవ్య లో పడిన "నా కోసం నేను కాదు" అనే ఆర్టికల్ లింక్ ఇచ్చాను బ్లాగ్లో.. అందులో పోటీ ప్రపంచంలో తమ పాప ముందు ఉండాలని తల్లిదండ్రుల ఫోర్స్ చేయటం వల్ల తాను చిన్నతనానికి ఎలా దూరంఅవుతోందో... ఒక పాప తన మనసులోని వ్యధ చెప్పుకుంటుంది.
టి.వీ.లో ఆ డాన్స్ లు చూస్తే నాకు ఆ ఆర్టికల్ గుర్తు వచ్చింది. ఇంకా అసలు వీళ్ళు పిల్లలేనా అని డౌట్ వచ్చింది. వాళ్ళు చేస్తున్నది మామూలు పాటలకు కాదు వాంప్ పాటలకు,క్లబ్ పాటలకూ. అసలు ఆ తల్లిదండ్రులు అలాంటి పాటలకు డాన్స్ చేయటానికి చిన్న చిన్న పిల్లలను ఎలా ప్రోత్సాహించగలుగుతున్నారు అని సందేహం కలుగుతోంది నాకు. చిన్న పిల్లలు ఆ పెదవి విరిపులూ,మొహంలో అసహ్యకరమైన భావాలు ఒలికిస్తూ గంతులు వేస్తూంటే చూడటానికి నాకు విరక్తి కలిగింది. వీళ్ళా దేశ భవిష్యత్తు? వీళ్ళా మన భావి తరం? ఇదా మనం పిల్లలకు నేర్పించవలసింది? అని బాధ వేసింది.
గత నవంబర్ 14న నాకిష్టమైన ఒక " పిల్లల పాట" సాహిత్యం,ఆ పాట ఒక టపాలో రాసాను.
"పిల్లల్లారా పాపల్లారా...
రేపటి భారత పౌరుల్లారా
పెద్దలకే ఒక దారిని చూపే పిల్లలారా..."
అని దాశరధి గారు రాసిన ఎంతో అందమైన సాహిత్యం అది.పిల్లలు అలా ఉండాలని, అలా పెరగాలని నేను అభిలషిస్తూ ఉంటాను...కానీ ఏమిటో సినిమా పాటలే భక్తి గీతాలూ, సినిమా డైలాగులే వేదవాక్కులూ అవుతున్నాయి ఇవాళ పిల్లలకు. మా బాబు ఫలానా హీరోలా
డైలాగు భలే చెప్తాడు తెలుసా అని మురిసిపోయే వాళ్ళనూ, మా పాప "ఆ అంటే అమలాపురం.." "రింగా రింగా .." పాటకూ ఎంతబాగా dance చేస్తుందో అని చెప్పుకునే వాళ్ళనూ, "అమ్మా లేదు,నాన్నా లేడు..." అంటూ పాడుతూ తిరిగే పిల్లలనూ ఇవాళ చూస్తున్నాం.
ఏమిటి ఈ ఆట? ఈ తరం ఎటు పోతుంది..? అనే ప్రశ్నలు మనసును వేధిస్తున్నాయి. అందరూ అలా ఉంటున్నారని నేను అనటం లేదు. కానీ చాలా వారకు పిల్లలు అలానే ఉంటున్నారు. ముఖ్యంగా టి.వీలో జరుగుతున్న పొటీ డాన్సులలో వాళ్ళు ఎన్నుకునే పాటలు మరీ కలవర పెడుతున్నాయి. అవి ఈ మధ్యన చూసి చూసీ ఆవేదనతో ఈ టపా రాయాలని మొదలుపెట్టాను..
నేను ఈ టపా రాయటం అనేది మార్పులు తెచ్చేయాలనో, ఎవరినో ఎత్తిపొడవాలనో కాదు. నేను రాయటం వల్ల ఏమీ జరగదని కూడా తెలుసు. ఇది కేవలం నా వ్యధనూ,భావితరం పట్ల నాకున్న ఆశనూ తెలపటానికే...! కనీసం నా పాపనైనా ఈ గందరగోళాలకు దూరంగా ఉంచుకోగలుగుతున్నాను...ప్రస్తుతానికి.అదే కాస్త తృప్తి.
Subscribe to:
Post Comments (Atom)
13 comments:
మంచిని పెంచే ప్రోగ్రాంలు చూసి "అబ్బ ఇవి బోరండీ అదుగో ఆట లాంటివయితే టైంపాస్ కి బాగుంటాయ్" అని అనే ప్రేక్షకులు. ఆ పోటీలకు పంపించే తలిదండ్రులు ఉన్నంతవరకూ ఎవరెన్ని చెప్పినా ఇలాంటివి వర్ధిల్లుతూనే ఉంటాయ్.
Nice
తృష్ణ గారూ !
వాంప్ పాటలకే కాదండి. సినిమాల్లో చక్కగా చిత్రీకరించబడిన పాటలకి కూడా పిల్లల చేత అలాంటి డాన్సులే చేయిస్తున్నారండీ ! చానల్స్ వాళ్ళు డబ్బులు కోసం అలాంటి కార్యక్రమాలను ప్రసారం చేస్తున్నారు, అది తమ వృత్తి అనుకుని. కానీ కొంతమంది తల్లిదండ్రులు మాత్రం తమ పిల్లల్ని తాత్కాలికంగా వచ్చే డబ్బు, కీర్తి కోసం వీటి వైపు మళ్ళిస్తున్నారు. ఇది ఒకరకంగా తల్లిదండ్రుల బలవంతంమీదే జరుగుతోందంటే నమ్ముతారా ! బాల కార్మిక చట్టం పరిధిలోకి వస్తుందో లేదో తెలీదుకానీ ఈ బాలలు మాత్రం వారి తల్లిదండ్రుల దగ్గర కార్మికులే ! మరి ఏ చట్టాలు వారిని ఈ హింస నుండి రక్షిస్తాయో !
Very nicely written
superb
మీరు చెప్పింది అక్షరాలా నిజం . ఈ వ్యథ మీ ఒక్కరిదే కాదు.సమాజం లో దిగజారిపోతున్న నైతిక విలువలు మీద చింతిస్తున్న ప్రతి ఒక్కరిది..పిల్లలకు మంచి శ్రావ్యమైన సంగీతం,నాట్యం లాంటివి నేర్పించడం మానేసి ఇలాంటి అధ్వాన్నమైన సాహిత్యం ఉన్న డాన్సులు నేర్పించడం తల్లి తండ్రుల తప్పిదాలే.అందుకే టీవీ మన సంస్కృతికి చేసిన
వినాశం అంతా ఇంతా కాదు.కాని మీ లాగ ఆలోచించే తల్ల్లి తండ్రులు చాలా తక్కువ .మీ పాపను వీటికి దూరంగా
పెంచాలనుకోవడం నిజంగా అభిలషణీయం.
ఏమిటోనండీ... రోజూ ప్రొద్దున్న లేచి చుట్టూ జరిగేవి చూస్తుంటే మనం జనం మధ్యలో వున్నమో జంతువుల మధ్యలో వున్నామో అర్థం కావటం లేదు. ఇప్పటి చదువు అసలైన చదువు కాదు. పిల్లల పెంపకం సరైనది గా లేదు. ఎంతసేపూ" నాకు ఇది బాగుంది కనుక ఇలా చేస్తున్నాను" అనెవారే కాని దానివల్ల ఎదుటి మనిషికి ఎంత అన్యాయం జరిగిపోయినా పట్టించుకోవటంలెదు. ఎలాగోలాగ డబ్బు సంపాదించడం తెలీనివాడు చేతకానివాడు, ఎలాగోలాగ ఆ పిచ్చి టివీ లో గంతులెయ్యకపోతే ఆ పిల్ల ఇంకెందుకూ పనికిరాదు. ఇంకోటి చూసేరో లేదో.. ఆ పిల్లలు ఒకళ్ళ నొకళ్ళు తిట్టుకుంటారండీ అందరిముందూనూ.. అది మరీ ఘోరం. ఎంత ఎక్కువగా తిడితే అంత గొప్ప. ఈ రోజుల్లో పిల్లల్ని జాగ్రత్తగా పెంచుకోవడం చాలా కష్టమండీ...
మీరు చెప్పింది అక్షరాలానిజం .ఆరు, ఏడు సంవత్సరాల పిల్లలను వాళ్ళ తల్లి తండృలే అలా ప్రోత్సాహిస్తుంటే చాలా బాద గా ఉటుంది.
ఆ ప్రోగ్రాములు ఎప్పుడైనా చూడటము తటస్తితే , నాకూ చాలా బాధ కలుగుతుంది . ఏమిటో ఈ తల్లితండ్రులు అనిపిస్తుంది .
తృష్ణ గారూ !
మీ టపా చూసాక ఈ విషయం మీద నాకు తెలిసిన విషయాలను చెబుతూ ఎప్పటినుండో రాయాలనుకుంటున్న టపా ఇప్పుడు రాసేసాను. ఒక్కసారి ఇక్కడ చూడండి.
trishna gaaru,
chaala correct ga raasarandi, ilaanti programs valla naaku T.V antene virakthi kalugindi, anduke nenu paadutha theeyaga tappithe inka e program choodanu, na pillalu T.V ekkuva sepu choosthunnarante bayamesthuntundi
aparna
trishna gaaru,
nenu oka blog start chesaanu, meeku veelaithe okkasaari choosi chadivi emaina salahaalu soochanalu ivvaraa, please!
http://paatenaapraanam.blogspot.com/2010/04/blog-post_15.html
aparna
తమ ప్రోగ్రాంల పాపులారిటీ కోసం ఎంతకైనా తెగించే వాళ్ళు ఉన్నంత వరకు ఇంతే
బాగా బుద్ధి చెప్పారు
త్రిష్ణ గారు,
మీలో ఒక గొప్పరచయిత్రి వున్నారు !!! బ్లాగుల లోకానికేకాదు.. అందరికీ అందుబాటులోకి రండి...ఇండియాలో అందరూ...ఇంటెర్నెట్లో లేరు ....మీభావాలు ఇంకెందరో పంచుకొవచ్హు...ఆలోచించండి ...ఒక బామ్మగా చెబుతున్నాను
Post a Comment