సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Friday, July 26, 2013

నాగార్జున కొండ - ఎత్తిపోతల జలపాతం



నాగార్జున సాగర్ వెళ్ళొచ్చి దాదాపు నెల అయిపోతోంది. ఇప్పటికన్నా బ్లాగ్ లో రాసుకోపోతే మర్చిపోతాను కూడా! జూన్ నెలాఖరులో వరంగల్ ట్రిప్ కన్న ముందరే సాగర్ వెళ్ళాము. వేటూరి గారి "జీవన రాగం" లో నాగార్జున కొండ వర్ణన చదివినప్పటి నుండీ అక్కడికి వెళ్ళాలని నా కోరిక. ఒకానొకరోజు పొద్దున్న ఎనిమిదింటికి బస్సు ఎక్కాం. మంచి డీలక్స్ బస్స్ దొరికింది. ఓ రెండు సిన్మాలు కూడా చూసాం. ఇప్పుడు ఆర్.టి.సి. బస్సులో శాటిలైట్ మూవీసేట. సరే, పన్నెండింటికి నాగార్జునసాగర్ చేరాం. బస్సు దిగాకా, చుట్టుపక్కల తిరగటానికి ఓ ఆటో మాట్లాడుకున్నాం. నాగార్జున కొండ కి వెళ్ళే మోటర్ బోటు రోజుకి రెండు ట్రిప్లు వేస్తుందిట. మధ్యాహ్నం రెండింటికి వేసేది లాస్ట్ ట్రిప్ ట. మేం చేరేసరికీ పన్నెండయ్యింది కాబట్టి భోజనం చేసి ముందు నాగార్జున కొండ కి వెళ్ళే రెండింటి బోటు ఎక్కుదామనుకున్నాం. దారిలోనే నాగార్జున డామ్ చూసేసాం. అప్పటికింకా వర్షాలు ఎక్కువగా పడట్లేదు కనుక రిజర్వాయిర్ లో నీళ్ళు లేవు.






బోట్ ఎక్కే ప్రదేశం దగ్గరే ఏ.పి.టూరిజం ఆఫీసు,గెస్ట్ హౌస్ ఉన్నాయి. ముందు కాస్త టిఫిన్ తినేసి టికెట్ కొనటానికి నుంచున్నాం. వీకెండ్స్ లొ బిజీగా ఉండే ఈ ప్రాంతానికి జనం లేకపోతే అప్పుడప్పుడు ట్రిప్ కాన్సిల్ చేస్తుంటారుట. జనాన్ని చూసే ట్కెట్లివ్వడం మొదలుపెడతారు కాబోలు. రెండున్నరకేమో టికెట్ళుచ్చారు కానీ బోట్ మూడింటికి గానీ రాలేదు. ఈలోపూ అక్కడే ఉన్న బెంచీల మీద కృష్ణమ్మని, నీలాకాశాన్ని, తెల్లని మబ్బుల్నీ చూస్తూ కూచున్నాం. మూడేళ్ళ తర్వతేమో కృష్ణమ్మని దగ్గరగా చూడ్డం.. ఆ నోళ్లని అలా చూస్తూంటే ఏదో కొత్త ప్రాణం నాలో ప్రవేశించినట్లు అనిపించింది. నాకు గోదారమ్మ దేవకి,  కృష్ణమ్మ యశోద మరి ! నల్లని నీళ్ళు..చూట్టూరా కొండలు.. ఎండవేళైనా ప్రశాంతంగా ఉంది అక్కడ. మూడింటికి మోటార్ బోటు వచ్చింది. పాపికొండలు బోట్ ట్రిప్ లాగానే ఈ నాగార్జున కొండ బోట్ రైడ్ కూడా ఎంజాయ్ చేసాం. ఇక్కడ స్పీకర్లు,పాటలు మొదలైన హంగామా కూడా లేదు. బోటు, నీళ్ళు, గాలి హోరు, దురంగా కనబడే కొండలు, వాటిపై పచ్చదనం, ఆకాశం, మనం అంతే.






 బోటు స్టార్ట్ అయిన కాసేపటికి మా పక్కగా ఎగురుతున్న ఓ పక్షిని చూసి చాలా సరదాపడ్డాం. చూడ్డానికి గోరింకలాగ ఉంది. తెల్లని పక్షి, నల్లని తల, పొడుగాటి పసుపచ్చ ముక్కు. కానీ ఒడ్డుకి దూరంగా ఈ నీళ్ళలో అంత కష్టపడి ఎందుకు వస్తోందో తెలీలా. నీళ్ల దగ్గరగా రావడం మళ్ళీ పైకెగిరిపోవడం. తమాషా అనిపించింది. కాసేపటికి మరో నాలుగు పక్షులు కనబడ్డాయి ఇలానే ఎగురుతూ.. వాటికి ఫోటోలు తీస్తూ అలా కాసేపు గడిచాకా అవి నోళ్లు తెరుచుకు ఎగరడం గమనించాను. అప్పుడు అర్థమైంది అవి చేపల కోసం వస్తున్నాయని. నోరు తెరుచుకుని నీళ్ళ దగ్గరగా వచ్చి ఠక్కున చేపను పట్టుకుని వెళ్పోతున్నాయి. వాలటానికి ఏమీ లేని నీటి మధ్యకు వచ్చి వెతికి వెతికి అలా చేపను పట్టడం ఎంత కష్టమో అసలు..! అలా వాటిని చూస్తూండగానే నాగార్జున కొండ దగ్గర పడింది. టైం నాలుగైంది. కృష్ణానది మధ్యలో ఉన్న ఆ చిన్నద్వీపం లో ఏముందో చూడాలని మనసు తొందరపడింది.


నాగార్జునకొండ:

ఈ నాగార్జున కొండ ప్రాంతంలోనే "మహాయాన బుధ్ధిజ"మనే బౌధ్ధమత శాఖ పుట్టి పెరిగిందట. కనిష్కుల పాలనలో మహాయానబౌధ్ధమతానికి బాగా ఆదరణ ఉండేదిట.  తర్వాత ప్రముఖ బౌధ్ధాచార్యుడు 'ఆచార్య నాగార్జున' పర్యవేక్షణాలో ఈ మతం బాగా ప్రచారాన్ని పొందిందని, పూర్వం 'శ్రీపర్వత'మని పిలిచే ఈ కొండ ప్రాంతంలోనే ఆచార్యుడు నివసించారు కాబట్టి ఆయన పేరుపైనే ఈ ప్రాంతాన్ని నాగార్జున కొండ అనే పిలుస్తారు. ఈయన శాతవాహనుల కాలం వారని అంటారు. బౌధ్ధమతం బాగా ప్రాచుర్యంలో ఉన్న రోజుల్లో ఈ ప్రాంతంలో చాలా బౌధ్ధారామాలు ఉండేవిట. కాలక్రమంలో ఆ నిర్మాణాలన్నీ కృష్ణమ్మఒడిలో చేరిపోగా కొన్ని కట్టడాలనూ, వస్తువులనూ పురావస్తు శాఖవారు త్రవ్వకాల ద్వారా వెలికి తీసి ఈ నాగార్జున కొండ మీద మ్యూజియంలో భద్రపరిచారు.


పెద్ద పెద్ద వృక్షాలతో ఉన్న అందమైన ఉద్యానవనం దాటి వెళ్తే లోపల మ్యూజియం ఉంది. రాతి యుగానికీ, కనిష్కులకాలానికీ ,శాతవాహనుల కాలానికి చెందిన కట్టడాల నమూనాలూ, శిల శాసనాలు, విగ్రహాలు, బౌధ్ధ నిర్మాణాలు, శకలాలు మొదలైనవి అక్కడ ఉన్నాయి. ఎప్పటివో కదా..చాలా వరకు విగ్రహాలు శిధిలమైపోయి ఉన్నాయి:( ఎంతో శ్రమ కూర్చి ఆ శిధిలాలన్నీ అక్కడికి చేరవేసినట్లు తెలుస్తోంది. లోపల కొందరు విద్యార్థులు అక్కడ కూచుని ఏవో వివరలు రాసుకుంటున్నారు కూడా. గబ గబా మ్యూజియం చూసేసి చుట్టూరా ఉన్న ఉద్యానవనం కూడా చూద్దామని బయల్దేరాం. ఓ పక్కగా మూలకి క్యాంటీన్ ఉంది. అక్కడ నుంచి కృష్ణానది వ్యూ ఎంత బాగుందంటే మాటల్లో చెప్పలేను. సూర్య కిరణాలూ, మబ్బుల వెలుగునీడలతో మిలమిలా మెరుస్తున్న నీళ్ళు, చుట్టూరా గీత గీసినట్లు ఒకే హైట్ లో ఉన్న కొండలు.. మనోహరమైన ఆ దృశ్యాన్ని చూస్తూ అక్కడ ఉన్న బెంచి మీద చాలా సేపు కూర్చుండిపోయాం.




 ఆ తర్వాత దిగువన కనబడుతున్న స్నానాలరేవు కి చేరాం. రాజుల కాలంనాటి ఆ కట్టడాలు పాడవకుండా పైన కాస్తంత ఫినిషింగ్ వర్క్ చేసి ఉంచారు మెట్లని. చాలా బాగుంది ఆ కట్టడం. అక్కడ దిగువగా ఉన్న పెద్ద పెద్ద బండరాళ్ళపై కూర్చుని కృష్ణమ్మనీ, ఆకాశాన్నీ, వెండిమబ్బులనీ చూస్తుంటే ఎంతసేపైనా గడిపేయచ్చనిపించింది. తిరిగి వెళ్ళేప్పుడు మాతో పాటూ మ్యూజియం సిబ్బంది కూడా వచ్చేసారు. రాత్రికి అక్కడ ఇద్దరు గార్డులు ఉంటారుట అంతే. మరి వానా వరదా వస్తే మీరంతా ఇక్కడికి ఎలా వస్తారు  అని సిబ్బందిని అడిగాం.  ఉద్యోగాలు కదా వీలయినంతవరకూ మానకుండా అలానే వస్తాం.. అన్నారు వాళ్ళు. ఐదున్నరకి బయల్దేరితే ఆరున్నరకి మళ్ళీ ఒడ్డు చేరాం.


ఎత్తిపోతల జలపాతం:


ఎలాగైనా ఈ ట్రిప్ లో ఎత్తిపోతల జలపాతం దగ్గరకు వెళ్ళాలని. బోట్ లేటుగా ప్రయాణమైనందున అన్నీ లేటయిపోయాయి. సాగర్ దగ్గర్లో ఉన్న "అనుపు" అనే ప్రదేశాన్ని కూడా చూడాలని కోరిక. కానీ చీకటి పడుతోందని ముందు ఎత్తిపొతల బయల్దేరాం. మాకు దొరికిన ఆటో అతను కూడా ఎన్నో విషయాలు చెప్పాడు. అరగంటలో ఎత్తిపోతల జలపాతం వద్దకు చేరాం. ఖాళీగా ఉంది ప్రదేశం. కోతులు మాత్రం విపరీతంగా ఉన్నాయి. ప్రతి కోతీ విచిత్రంగా పిల్లకోతుల్ని వీపుపైనో, పొట్టక్రిందో అంటిపెట్టుకుని నడుస్తున్నాయి. చంద్రవంక కొండల్లో నుండి ఈ జలపాతం ప్రవహిస్తూ వచ్చి, ఇక్కడి నుంచి కిందకు జారి కృష్ణానదిలో కలుస్తుందిట. మేం వెళ్ళేసరికీ సరిగ్గా సూర్యాస్తమయం అయ్యి చీకట్లు ముసురుతున్నాయి. గలగల మనే నీటి చప్పుడు.. జలపాతం దగ్గరపడేకొద్దీ హోరు ఎక్కువైంది. తెల్లని నీళ్ళు అలా పైనుండి జలజల పడుతుంటే భలేగా అనిపిచింది. కొద్దిగా పక్కగా మరొక చిన్న జలపాతం ఉంది. అసలు జలపాతాలే చాలా అద్భుతమైన దృశ్యాలు. ఇంతకు మునుపు చిన్న చిన్న జలపాతాలని చూశాను. అన్నింటికన్నా ఇదే పెద్దది. ఇప్పుడు అనుమతివ్వట్లేదుట గానీ ఇదివరకూ క్రిందకు వెళ్లనిచ్చేవారుట.



అక్కడ కొద్ది దురంలో దత్తాత్రేయుడి గుడి ఉంది. క్రిందకు బాగా నడవాలి. మీకు ఆలస్యమైపోతుంది పైగా చీకట్లో పాముపుట్ర ఉంటాయి. వద్దన్నాడు ఆతోఅతను. సర్లేమ్మని ఇక బస్టాండ్ కు బయల్దేరాం. మధ్యలో సత్యనారాయణస్వామి గుడి ఉంది. అక్కడ ఆగి స్వామిని దర్శించుకుని, బస్టాండ్ చేరేసరికీ ఎనిమిదవుతోంది. పొద్దున్న వచ్చేప్పుడు దొరికినట్లు డీలక్స్ బస్ దొరుకుతుందేమో అని ఎదురుచూస్తు కూర్చున్నాం. మధ్యలో రెండు మామూలు బస్సులు వచ్చాయి కానీ మేం ఎక్కలేదు. ఖాళీ అయిపోతున్నా ఆ ప్రాంతంలో కూర్చోటానిక్కూడా భయమేసింది నాకు. తొమ్మిదిన్నర దాటి పదవుతూండగా వచ్చింది డీలక్స్ బస్సు. ఊరు చేరేసరికీ ఒంటిగంట. అక్కడ్నుంచీ ఎం.బి.ఎస్ వచ్చేసరికి రెండు. మధ్యలో రెండు మూడు పోలీస్ స్టేషన్లు వస్తాయి.. భయం లేదని తను చెప్తున్నా, పార్క్ చేసిన బండి తీసుకుని ఇంటికి వెళ్తుంటే భలే భయమేసింది నాకు. దారి పొడుగునా క్షణక్షణంలో శ్రీదేవిలా దేవుడా దేవుడా.. అనుకుంటూ కూర్చున్నా:) ట్రాఫిక్ లేకపోవడం వల్ల మామూలుగా గంటపట్టే రూట్ లో అరగంటకే ఇల్లు చేరాం! 'అనుపు', ఎత్తిపోతల దగ్గరున్న 'దత్తాత్రేయస్వామి గుడి' చూట్టానికి మళ్ళీ వెళ్ళాలి.. ఎప్పటికవుతుందో...!!


ఈ ట్రిప్ తాలూకూ మరికొన్ని ఫోటోలు ఇక్కడ చూడచ్చు:


5 comments:

phaneendra said...

గోదారమ్మ దేవకి కృష్ణమ్మ యశోద... ఈ ఒక్క వాక్యం చాలు గుండె నిండిపోడానికి.

Anil Dasari said...

అక్కడి దాకా వెళ్లి మాచర్ల చెన్నకేశవస్వామి గుడి చూడకపోతే ఎలా? కుదిరితే ఈసారి వెళ్లండి. సాగర్ నుండి అరగంటే.

ranivani said...

బాగా వివరించారు తృష్ణ గారూ .మీ ప్రయాణాల బ్లాగులు చదువుతుంటే రండు రకాల .భావాలు కలుగుతాయండీ 1ఇంత బాగా చెప్పారు .ఇంక మనం వెళ్లి చూడక్కర్లేదులే అన్పించేంతగా .2మీ వర్ణన చూసి ఒకసారి వెళ్ళి చూడాలి అనపిస్తుంది .నేను చూసి .20 సంవత్సరాలు అయ్యింది . చాలా మారి ఉంటుంది . మరలా చూడాలి .

జయ said...

నా చిన్నప్పుడు నేను తిరిగిన ఆ ప్రాంతాలన్నీ మీరు చూపించి చెప్తుంటే....మీతోటే వెళ్ళిపోయినట్లుంది నాక్కూడా. మరి, మా స్కూల్ చూసారా లేదా:)

తృష్ణ said...

@phaneendra: thanks a lot :)
@అబ్రకదబ్ర: మాచర్ల వెళ్దామనుకున్నాం కానీ ఇంకా లేట్ అయిపోతోందని వెళ్లలేదండి. వీరభద్రస్వామి గుడి కూడా ఉందన్నారక్కడ. ఆ రెండూ బాకీ ఉన్నాయి..
ధన్యవాదాలు.
@ahmed chowdary:thanks for the link ahmed gaaru.
@nagarani yerra:thanks for the compliment..అంతా మీ అభిమానం..
@జయ: దారిలో ఒక రెసిడెన్షియల్ స్కూల్ చూసిన గుర్తు. మీస్కూల్ పేరు తెలీదండి.. మీ బ్లాగ్లో ఎప్పుడన్నా రాసారేమో మరి గుర్తులేదు :(
ధన్యవాదాలు.