సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Friday, July 1, 2011

ఇంద్రగంటి శ్రీకాంతశర్మగారి "తిరునాళ్ళకు తరలొచ్చే కన్నెపిల్లలా.."


వర్షంలో ఇంటికి నడిచి వస్తూంటే శ్రీకాంతశర్మగారి "తిరునాళ్ళకు తరలొచ్చే.." పాట గుర్తుకు వచ్చింది. ఎంతో అందమైన సరళ పదాలతో పాట చదువుతుంటేనే ఒక అందమైన చిత్రం కళ్లకు కనబడేలా రాయటం శర్మగారి ప్రత్యేకత. నాన్నకు మంచి మిత్రులుగా కన్నా ఒక కవిగానే నాకు ఆయన పట్ల చాలా అభిమానం. ఈ పాటలో శర్మగారు ఉరుములు మెరుపులతో వచ్చే వర్షాన్ని తిరునాళ్ళకు వెళ్ళే కన్నెపిల్లతో పోలుస్తూ రాసిన ఈ పాట చాలా బావుంటుంది.

ఈ పాటను ఇక్కడ వినచ్చు:






రచన: శ్రీ ఇంద్రగంటి శ్రీకాంతశర్మ
సంగీతం: శ్రీ విజయరాఘవరావు
పాడినది: శ్రీరంగం గోపాలరత్నం గారు

తిరునాళ్ళకు తరలొచ్చే కన్నెపిల్లలా(౨)
మెరుపులతో మెరిసింది వానకారు

నీలి మొయిలు వాలు జడకు చినుకే చేమంతి(౨)
కట్టుకున్న పచ్చదనం పట్టుపరికిణీ..
((తిరునాళ్లకు))


తెలివెన్నెల వేకువలో తానమాడి
అడవిదారి మలుపుల్లో అదరి చూసీ
కొండ తిరిగి కోన తిరిగి గుసగుసలాడి(౨)
తరగల మువ్వల గలగల నాట్యమాడి..
((తిరునాళ్లకు))


చిగురేసిన చిరుకొమ్మలు ఊగిఊగిపోతే
చిలిపిగ జడివాన వేళ చక్కిలిగిలి పెట్టి
పకపక పువ్వుల నవ్వుల నవ్విస్తూ వస్తూ(౨)
బాటవెంట సంబరాలు వంచి పంచిపెడుతూ..
((తిరునాళ్లకు))


కొంటెకుర్రకారు వెనక జంట నడక నడిచి
విరహంతో వేదనతో వారి మనసు కలచి
అంతలోన మంచి కలలు కనుల చిలకరించి
జరిగి జరిగి దౌదౌవ్వుల పిలిచి పిలిచి - నిలిచి..
((తిరునాళ్లకు))




ఈ పాటను పాడినది ప్రముఖ సంగీత విద్వాంసురాలు శ్రీరంగం గోపాలరత్నం గారు. సంగీతం సమకూర్చినది అప్పట్లో బొంబాయిలో ఫిలిం డివిజన్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఉన్న మన తెలుగువారైన విజయరాఘవరావు గారు. ఈ పాట గురించిన చిన్న కథ శ్రీకాంతశర్మగారి మాటల్లో:
"సుప్రసిధ్ధ వేణు విద్వాంసులు ఏల్చూరి విజయరాఘవరావుగారు ఒక కచేరీ కోసం విజయవాడ వస్తున్నారని తెలిసీ, నన్ను పిలిచి ఒక పాట రాయించి బొంబాయిలో ఉన్న వారికి పంపారు మా డైరెక్టర్ శ్రీనివాసన్ గారు. దానికి బాణీ ఏర్పరిచి విజయరాఘవరావు గారు ఈ మాసపుపాట కార్యక్రమం కోసం విజయవాడలో మా స్టూడియో లోనే రికార్డ్ చేసారు. దీని కోసం ప్రత్యేకంగా గోపాలరత్నం గారిని హైదరాబాదు నుంచి పిలిపించి శ్రీనివాసన్ గారు పాడించారు. ఈపాట రాయటం మొదలు చివరి రికార్డింగ్ వరకూ నడిచిన అన్ని దశలనూ రికార్డ్ చేసిన శ్రీ ఎస్.బి.శ్రీరామ్మూర్తి అనే మా సహచర రేడియో ప్రయోక్త 'ఒక పాట పుట్టింది' అనే రేడియో డాక్యుమెంటరీ తయారు చేసారు. ఆ రోజుల్లో ఈ పాట రేడియో ద్వారా బాగా ప్రచారం పొందింది." ("పరిపరి పరిచయాలు" పుస్తకం నుండి).

పది గంటలకు మొదలై రాత్రి ఎనిమిదింటిదాకా నడిచిన ఈ పాట తాలూకు సుదీర్ఘమైన రికార్డింగ్ ను నలభై ఐదు నిమిషాల "ఒక పాట పుట్టింది" అనే కార్యక్రమంగా రూపొందించారు నాన్న. సామన్య శ్రోతకు కూడా ఒకపాట తయారీ ఎలా ఉంటుందో సులువుగా అర్ధమయ్యేలా రుపొందించిన ఈ కార్యక్రమం చాలా మన్ననలు పొందింది. ఆ రికార్డింగ్ ను బొంబాయిలో ఉన్న విజయరాఘవరావు పంపిస్తే, విని "out of a labourious process of 10hrs recording, i wonder how you could produce this programme..' అని ఆనందాన్ని వ్యక్తపరుస్తూ రెండు పేజీల ఉత్తరం . అది అవార్డులు రావటం కన్నా గొప్ప ప్రశంస అని నాన్న అనుకుంటూ ఉంటారు.