సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Wednesday, April 14, 2010

ఏమిటో ఈ ఆట..?!


తీరిక దొరికితే పుస్తకాలు చదవటం,ఎదన్నా రాసుకోవటం లేక నెట్ లో కొత్త కొత్త విషయాలేమైనా తెలుసుకోవటం నాకు అలవాటు. బాగా ఖాళీగా ఉంటే తప్ప టి.వీ.జోలికి పోను. ఒకప్పుడు బాగా చూసేదాన్ని కానీ ఇప్పుడు మాత్రం తీరిక సమయాల్లో టి.వీ.చూడటం టైంవేస్ట్ చేసుకోవటమే అనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ టివీ చూసినా తెలుగు చానల్స్ చూసే ధైర్యం చేయను.అవంటే నాకు భయం. కానీ ఈమధ్యన చానల్స్ తిప్పుతుంటే అనుకోకుండా ఏవో కొన్ని తెలుగు డాన్స్ ప్రొగ్రాంస్ చూడటం జరిగింది. 3,4 సార్లు ఇలా ఈ మధ్యన చూసాను.అవి కూడా చిన్న పిల్లలు చేసే డాన్స్ లు.

2008 జూన్ లో అనుకుంటా నేను నవ్య లో పడిన "నా కోసం నేను కాదు" అనే ఆర్టికల్ లింక్ ఇచ్చాను బ్లాగ్లో.. అందులో పోటీ ప్రపంచంలో తమ పాప ముందు ఉండాలని తల్లిదండ్రుల ఫోర్స్ చేయటం వల్ల తాను చిన్నతనానికి ఎలా దూరంఅవుతోందో... ఒక పాప తన మనసులోని వ్యధ చెప్పుకుంటుంది.

టి.వీ.లో ఆ డాన్స్ లు చూస్తే నాకు ఆ ఆర్టికల్ గుర్తు వచ్చింది. ఇంకా అసలు వీళ్ళు పిల్లలేనా అని డౌట్ వచ్చింది. వాళ్ళు చేస్తున్నది మామూలు పాటలకు కాదు వాంప్ పాటలకు,క్లబ్ పాటలకూ. అసలు ఆ తల్లిదండ్రులు అలాంటి పాటలకు డాన్స్ చేయటానికి చిన్న చిన్న పిల్లలను ఎలా ప్రోత్సాహించగలుగుతున్నారు అని సందేహం కలుగుతోంది నాకు. చిన్న పిల్లలు ఆ పెదవి విరిపులూ,మొహంలో అసహ్యకరమైన భావాలు ఒలికిస్తూ గంతులు వేస్తూంటే చూడటానికి నాకు విరక్తి కలిగింది. వీళ్ళా దేశ భవిష్యత్తు? వీళ్ళా మన భావి తరం? ఇదా మనం పిల్లలకు నేర్పించవలసింది? అని బాధ వేసింది.


గత నవంబర్ 14న నాకిష్టమైన ఒక " పిల్లల పాట" సాహిత్యం,ఆ పాట ఒక టపాలో రాసాను.
"పిల్లల్లారా పాపల్లారా...
రేపటి భారత పౌరుల్లారా
పెద్దలకే ఒక దారిని చూపే పిల్లలారా..."
అని దాశరధి గారు రాసిన ఎంతో అందమైన సాహిత్యం అది.పిల్లలు అలా ఉండాలని, అలా పెరగాలని నేను అభిలషిస్తూ ఉంటాను...కానీ ఏమిటో సినిమా పాటలే భక్తి గీతాలూ, సినిమా డైలాగులే వేదవాక్కులూ అవుతున్నాయి ఇవాళ పిల్లలకు. మా బాబు ఫలానా హీరోలా
డైలాగు భలే చెప్తాడు తెలుసా అని మురిసిపోయే వాళ్ళనూ, మా పాప "ఆ అంటే అమలాపురం.." "రింగా రింగా .." పాటకూ ఎంతబాగా dance చేస్తుందో అని చెప్పుకునే వాళ్ళనూ, "అమ్మా లేదు,నాన్నా లేడు..." అంటూ పాడుతూ తిరిగే పిల్లలనూ ఇవాళ చూస్తున్నాం.

ఏమిటి ఈ ఆట? ఈ తరం ఎటు పోతుంది..? అనే ప్రశ్నలు మనసును వేధిస్తున్నాయి. అందరూ అలా ఉంటున్నారని నేను అనటం లేదు. కానీ చాలా వారకు పిల్లలు అలానే ఉంటున్నారు. ముఖ్యంగా టి.వీలో జరుగుతున్న పొటీ డాన్సులలో వాళ్ళు ఎన్నుకునే పాటలు మరీ కలవర పెడుతున్నాయి. అవి ఈ మధ్యన చూసి చూసీ ఆవేదనతో ఈ టపా రాయాలని మొదలుపెట్టాను..

నేను ఈ టపా రాయటం అనేది మార్పులు తెచ్చేయాలనో, ఎవరినో ఎత్తిపొడవాలనో కాదు. నేను రాయటం వల్ల ఏమీ జరగదని కూడా తెలుసు. ఇది కేవలం నా వ్యధనూ,భావితరం పట్ల నాకున్న ఆశనూ తెలపటానికే...! కనీసం నా పాపనైనా ఈ గందరగోళాలకు దూరంగా ఉంచుకోగలుగుతున్నాను...ప్రస్తుతానికి.అదే కాస్త తృప్తి.