సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Saturday, August 29, 2009

తేనె కన్నా తీయనిది..

(Hindu i Images లో తెలుగు తల్లి)

తెలుగు భాషా దినోత్సవవం సందర్భంగా ఇవాళ నాకు చాలా ఇష్టమైన ఈ పాట రాస్తున్నాను....చిన్నప్పుడు ఈపాటని స్కూల్లో మా మ్యూజిక్ టీచరు నేర్పించి మా చేత(మా స్కూల్ కోయిర్ గ్రూప్లో నెనొకత్తెని) ఒక సభలో పాడించారు.(ఆ సభ అయ్యి స్కూలువాళ్ళు మమ్మల్ని స్కూల్ బస్సులో ఇళ్ళకి చేర్చేసరికీ రాత్రి పదయ్యింది.ఇంట్లో కంగారు,అక్షంతలూ....అది వేరే కధ..!)ఆ పాట పాడుతూంటే ఇప్పటికీ నా కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి...ఒక అమర గీతం ఇది...
శంకరంబాడి సుందరాచారిగారు రచించిన ఈ గీతాన్ని మన రాష్ట్రప్రభుత్వం రాష్ట్రగీతంగా స్వీకరించింది.

మా తెలుగు తల్లికీ మల్లెపూదండ
మా కన్న తల్లికీ మంగళారతులు
కడుపులో బంగారు కనుచూపులో కరుణ
చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి

గలగలా గోదారి కదిలిపొతుంటేను
బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను
బంగారు పంటలే పండుతాయి
మురిపాల ముత్యాలు దొరలుతాయి

అమరావతీ నగర అపురూప శిల్పాలు
త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు
తిక్కయ్య కలములో తియ్యందనాలు
నిత్యమై నిఖిలమై నిలిచి ఉండేదాక
రుద్రమ్మ భుజశక్తి, మల్లమ్మ పతి భక్తి
తిమ్మరసు దీయుక్తి, కృష్ణరాయని కీర్తి

మా చెవులు రింగుమని మారుమ్రోగేదాక
నీ ఆటలే ఆడుతాం, నీ పాటలే పాడుతాం
జై తెలుగు తల్లీ! జై తెలుగు తల్లీ!


ఆత్రేయగారు రాసిన,ఇళయరాజాగారు స్వరపరిచిన మరొక తెలుగు వైభవ గీతం
"తేనె కన్నా తియనిది, తెలుగు భాష
దేశ భాశలందు లెస్స,తెలుగు భాష !"
ఈ పాత సాహిత్యం,ఆడియో క్రింది లింక్ లో__
http://www.teluguvaibhavam.com/2009/02/literature-aathreya-songs-tene-kanna.html

ఈ సందర్భంగా నే గమనించిన కొన్ని విషయాలు--
ఎందుకనో కొందరు తల్లిదండ్రులు నాలుగైదేళ్ల పిల్లలతో ఆంగ్లంలో మాట్లాడేస్తు ఉంటారు.."hey,dont go that way" "why are you doing like that" "sit there.dont move' 'talk in english' అని గదమాయిస్తు ఉంటారు.నేర్చుకోవాల్సినంత భాషనీ,పరిజ్ఞానాన్ని స్కూల్లో నేర్పనే నేర్పుతారు. ఇంట్లోనైనా మాతృభాషను నేర్పితే తప్పేమిటో అర్ధం కాదు.కొన్ని అంతర్జాతీయ సభల్లో,అంతర్జాతీయ సినిమా అవార్డ్ ఫంక్షన్స్ లో కొందరు ఆంగ్లేతరదేశస్తులు ఇంగ్లీషులో కాక, తమ తమ భాషల్లోనే ఉపన్యాసాలిస్తూంటారు.మరి మన తెలుగు వాళ్ళకు తెలుగువాళ్ళమని చెప్పుకోవటానికే నామోషీ.

ఇంకొందరు స్టైల్ గా "షివుడు"(శివుడు), "దేషం"(దేశం),"ఆష"(ఆశ),"అవకాషం"(అవకాశం) అని అవలీలగా పలికేస్తూంటారు.కొన్ని సినిమాపాటల్లో కూడా ఇలాగే పదాల్ని వాడేస్తూ,సరి చెయ్యకుండా మనవాళ్ళు అలానే రిలీజ్ చేసేస్తారు పాటల్ని.అనుకరించేవాళ్ళు అలానే నేర్చేసుకుని పాడేస్తు ఉంటారు కూడా.సొంతభాషపై అంత చిన్నచూపు ఎందుకో అర్ధం కాదు...!

మన దేశంలోని మిగతా రాష్ట్రాల వాళ్లకి తమతమ భాషలపై ఉన్న గౌరవం,ప్రేమ మన తెలుగు వాళ్ళకి లేవు.ఉన్నా అది చాలా తక్కువనేచెప్పాలి.అందుకే దేశంలో హిందీ తరువాత ఎక్కువగా మాట్లాడే భాష అయిఉండి కూడా అనామకంగానే మిగిలిపోతోంది మన తెలుగుభాష.ఉత్తర హిందూ ప్రాంతాలకి వెళ్తే, సౌత్ ఇండియా నుంచి అంటే, మదరాసీలా అనడుగుతారే తప్ప ’ఆంధ్రా నుంచి తెలుగువారమంటే’ వింత జాతీయులను చూసినట్లు చూస్తారు...!!

ఎన్.టి.ఆర్ గారి పుణ్యమా అని తెలుగు భాషకు జాతీయస్థాయిలో కాసింత గుర్తింపు వచ్చిందనే చెప్పాలి.ఇప్పుడు హైటెక్ సిటీ పుణ్యాన అది ఇంకాస్త పెరిగింది.కానీ కొన్ని విషయలు చూసినప్పుడు,విన్నప్పుడు మాత్రం...ఎప్పటికో మన భాషకు పూర్తి స్థాయి గుర్తింపు అనిపిస్తూ ఉంటుంది.మా మటుకుమేము మా ఉడుతా ప్రయత్నంగా, మా పాపకి నర్సరిలో ఉన్నప్పుడు "London bridge is falling down',"pussycat pussycat.."అని స్కూల్లో నేర్పిస్తూంటే...ముందు దానికి తెలుగు వారాలూ,మాసాలూ,అ,ఆలూ నేర్పాము ఇంట్లో!!