సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Thursday, June 9, 2011

బాపు 'బొమ్మల కొలువు' చిత్రాలు - 2


వంశీ కోసం వేసిన చిత్రాలు:

 
గ్యాలరీ లోపల లైట్లు పడటం వల్ల ఫోటోలు కొద్దిగా క్లారిటీ తగ్గాయి. కొన్నింటి మీద బాగా లైట్ పడిపోవటం వల్ల బావున్నా ఇక్కడ పెట్టటం లేదు.



 








అదివరకూ విజయవాడలో బాపూ బొమ్మల ప్రదర్శన పెట్టినప్పుడు సినిమాల సెట్ల కోసం వేసుకున్న బొమ్మలు కూడా పెట్టారు. (వాళ్ళ సినిమాల్లో ప్రతి ఫ్రేం ముందుగానే బొమ్మ గీసేసి పెట్టుకుంటారుట బాపుగారు. అచ్చం బొమ్మలాగానే ఉండేలా సెట్ తయారుచేస్తారుట.) ఈ ప్రదర్శనలో అలా సినిమాలకు వేసినవి పెట్టలేదు. అవి భలేగా ఉంటాయి. తదుపరి టపాలో దేవుళ్ళ బొమ్మలు...

Wednesday, June 8, 2011

బాపు 'బొమ్మల కొలువు' చిత్రాలు - 1





పైన ఫోటోలోని పుస్తకాలు చాలా అపురూపమైన పుస్తకాలు. నాన్న కలక్షన్ లోవి. వాటిల్లో మొదట కనబడుతున్న బొమ్మల కథలు అనే లావుపాటి పుస్తకం లో మొట్టమొదటి పాత రోజుల్లో పత్రికలలో పడిన బాపురమణల రచనలు, కార్టూన్లు అన్నీ ఉంటాయి. ఆ ఫోటోలోని అన్ని పుస్తకాల్లో ఉన్న బాపూ బొమ్మలే మూడొంతులు దాకా ఇటీవలి బాపూ బొమ్మల కొలువులో ఉన్నాయి. అయినా వీలయినన్ని ఫోటోలు అపురూపంగా ఫోటోలు తీసుకుని వచ్చాను. ఇంట్లో ఉన్నవే అయినా, నా కెమెరాతో ఆ ఒరిజినల్ బొమ్మల ఫోటోలు తీసుకోవటం ఒక అలౌకిక ఆనందం.


కాసంత కలాపోసన , మూడొచ్చినప్పుడు బొమ్మలేసే చీమంత ఆర్టిస్ట్ పనితనం చిటికెడు ఉండటం వల్ల చిత్రకారుడిగా బాపూ పై అభిమానం పాళ్ళు మరింత ఎక్కువనే ఉండటం వల్ల గేలరీలో తీసిన ఫోటోలను కొన్ని కేటగిరీల్లోకి విభజించాను. ( ఆసక్తి ఉంటే "క్రియేటివ్ వర్క్స్" లేబుల్ లో నా ఫ్యాబ్రిక్ పైంటింగ్ వర్క్స్ , చిన్నప్పుడు వేసిన బొమ్మలు గట్రా చూడచ్చు.) నాలుగైదు కలిపి తీసుకున్నవాటిని కట్ చేసి సింగిల్ ఫోటోలుగా మార్చుకున్నాను. నేను చేసుకున్న విభాగాలేమిటంటే,

* గేట్లోంచి మొదలు లోపలిదాకా ఇరుపక్కలా పెట్టిన చిత్రాలు, లోపల గేలరీలో గుండ్రని స్థంభాలకు కూడా కట్టిన బేనర్ల తాలూకూ ఫోటోలు
* వంశీ కోసం వేసిన చిత్రాలు
* దేవుళ్ళ తాలూకూ చిత్రాలు
* పత్రికలకూ, నవలలకూ, కథలకూ వేసిన బ్లాక్ అండ్ వైట్ చిత్రాలు
* రకరకాల సుందరీమణులు, మిగిలినవి


ఇలా చేసుకున్న విభాగాల్లో ఆయా చిత్రాలను ఎడిట్ చేసుకుంటూ ఉన్నా. ఇంకా అవ్వలేదు..:) ఇలా ఫోటోలు తీసుకోనివ్వటం ఒక వరమైతే, తీసుకునేందుకు మంచి కెమేరా ఉండటం నా అదృష్టం అనుకున్నా. తీసుకుంటున్నంత సేపూ ఓ సందర్భంలో ఆ కెమేరా నాకు బహుకరించిన నాన్నకు బోలెడు థాంక్సులు చెప్పేసుకున్నా. సరే ఇప్పుడు బ్లాగ్ లో ఏవి పెట్టాలి? అన్న ప్రశ్న చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంది. ఆ కుంచె నుంచి రూపుదిద్దుకున్న ప్రతీ బొమ్మా ఒక అపురూపమే. అందువల్ల ఏవి పెడితే మిగతా బొమ్మలకి కోపాలొస్తాయో అని భయం.


సరే మరి చూడనివాళ్లకి బొమ్మల కొలువు చూపించెయ్యనా? ముందుగా గేట్లోంచి వేళ్దాం.. క్రిందివన్నీ బేనర్ల తాలూకూ ఫోటోలే.














తదుపరి టపాలో వంశీ కోసం వేసిన చిత్రాలు చూద్దాం. సరేనా?


Monday, June 6, 2011

ఆహా ఏమి నా భాగ్యం..



ఎంత ఆనందం
ఎంత తన్మయత్వం
ఎంత మధురానుభూతి
ఎంత తాదాత్మ్యం
ఆహా ఏమి నా భాగ్యం
ఆన్ని బొమ్మలు చూడగలిగిన నా జన్మ ధన్యం !!
ఈ చివరాఖరు రోజైనా వెళ్ళి బాపు బొమ్మల కొలువు చూడగలిగాను.
మనసరా..
కనులారా..
తృప్తిగా !!

మూడు బస్సులు మారి దాదాపు ముఫ్ఫై కిలోమీటర్లు ప్రయాణం చేసి మండుటెండలో నడిచి నడిచి డస్సిపోయా !

అయినా కలిగిన ఆనందం ముందర ఈ కష్టం ఏపాటి?

"ఎండలో కాకిలా తిరిగి వస్తున్నావా? పిచ్చిదానా" అని అమ్మ మందలిస్తూంటే చెవులకు వినబడతాయా?

తెలుగువాళ్ళు ధన్యులు "బాపూ" మనవాడైనందుకు.

అయినా ఏమిటో అలా ఊరి చివర పెడితే ఎలా వెళ్ళేది? నాలుగు చక్రాలున్నవాళ్ళు తప్ప రెండు కాళ్ళతో నడిచే సామాన్యులు ఎలా వెళ్తారు?
ఏమో ప్రదర్శకుల సాధక బాధకాలు ఎవరికి ఎరుక?
వళ్ళంతా కళ్ళు చేసుకుని ప్రతి బొమ్మా చూశేసి...ప్రతి బొమ్మా ఆబగా ఫోతోలు తీసేసుకున్నాను. ఈ అవకాశం కల్పించిన ప్రదర్శకులకు ధన్యవాదాలు.
ఎంత అలసిపోయినా ఈ నాలుగు వాక్యాలైనా రాసి ఆనందం పంచుకోకపోతే ఇవాళ రాయకపోతే నాకు నిద్ర పట్టదు మరి..:)
ఫోటోలన్నీ ఎడిట్ చేసాకా రేపు వీలైతే మరిన్ని ఫోటోలు పెడతాను..!!

Rock to raagas


"Rock to raagas (Traditional krithis to Western Orchestration)"
అని ఎప్పుడో కొన్న ఒక కేసెట్ కనబడింది వేరే కేసెట్ కోసం వెతుకుతూంటే. రెండ్రోజుల నుంచి అదే వింటున్నా. వినటానికి చాలా బాగుంది. ఫ్యూజన్ మ్యూజిక్ నచ్చేవారికి ఈ కేసెట్ నచ్చుతుంది. రఘువంశ సుధాంబుది, పలుకే బంగార మాయెనా, కిష్ణా నీ బేగనే, మామవ రఘురామ, స్వాగతo కృష్ణా, బ్రోవభారమా, నగుమోము, పిబరే రామరసం..మొత్తం ఎనిమిది కృతులు. వీటికి వెస్ట్రన్ ఇన్స్ట్రుమెంట్స్ జోడించి రాగం పాడవకుండా k.krishna kumar, naveen పాడారు.1997లో వచ్చిన ఆల్బం Magnasound వాళ్లది.
.


కేసెట్ లో అన్ని కృతులు కలిపి ఒక బిట్ తయారు చేసాను. ఆసక్తి ఉన్నవాళ్ళు వినవచ్చు:



Sunday, June 5, 2011

దర్గామిట్ట కతలు






సరిగ్గా ఒక సంవత్సరం క్రితం మే నెల్లో సాక్షి (ఆదివారం పుస్తకం)లో అచ్చయిన ఖదీర్ బాబు గారి కథ "రాత్రిపూట" చదివి చాలా నచ్చేసి, బ్లాగ్ లో రాసాను. అప్పటికి ఆయన పుస్తకాల్లో నేను చదివినది "మన్ చాహే గీత్ " ఒక్కటే. ఆ టపా కోసం ఖదీర్ బాబుగారి గురించి చేసిన గూగులింగ్ లో "దర్గామిట్ట కతలు" మొదలైన ఇతర పుస్తకాల గురించి తెలిసింది. తరువాత పేపరు లో ధారావాహికగా పడిన వారి "బాలీవుడ్ క్లాసిక్స్" కూడా పుస్తకరూపంలో వచ్చింది. అయితే నాకు ఎంత వెతికినా ఆయన పుస్తకాలు కొంటానికి దొరకలేదు. ఇటీవలి పుస్తకాల ఎగ్జిబిషన్ లో అనుకుంటా "దర్గామిట్ట కతలు" పుస్తకం దొరికింది. కొన్న ఇన్నాళ్ళకి నిన్న రాత్రి చదవటం పూర్తయ్యింది. ఇప్పటికి రాయటానికి కుదిరింది.




ఈ కథలు చదువుతూంటే రెండు పుస్తకాలు నాకు గుర్తుకొచ్చాయి. రహమతుల్లా గారి కథలపుస్తకం "బా", డా.సోమరాజు సుశీల గారి "ఇల్లేరమ్మ కతలు". "బా" కథల్లోని ఆర్తి, ఆవేదన; ఇల్లేరమ్మ కతల్లోని చలాకీతనం, సంతోషం కలిపితే "దర్గామిట్ట కతలు" అవుతాయి. నామిని గారి రచనా శైలి ని అనుకరించారా అనిపించింది కూడా. కానీ "కతల వెనుక కత" లో ఖదీర్ బాబు గారు చెప్పినదాని బట్టి చూస్తే నామినిగారి అనుగ్రహం వల్లనో, వారి "పచ్చనాకు సాక్షిగా" బాగా చదవటం వల్లనో ఆయన శైలిని అనుకరించి ఉండవచ్చు అనిపించింది. ఏ పుస్తకమైనా, అందులో ఎవరు ఎవరిని అనుకరించినా నాకు తప్పనిపించదు. ఎందుకంటే చదవతగ్గ పుస్తకాల్లో చూడవలసినది అనుకరణలను కాదు...రచయిత చెప్పదలచుకున్న అంశాన్ని అన్నది నా అభిప్రాయం. ఇక ఈ పుస్తకం చదుతున్నంత సేపు నేను లోనైన భావోద్వేగాలను మాటల్లో చెప్పలేను అనిపిస్తోంది. ఎందుకంటే ఇవి కేవలం కథలు కావు...ఒక జీవితకాలం గుర్తుండిపోయే మధురమైన బాల్యపు స్మృతులు. నాకు నా చిన్నతనాన్ని, ఆ మధురానుభూతులనూ మళ్ళీ గుర్తుచేసిన నవరసభరితమైన అనుభవాల గుళికలు.




ఈ కథల్లో ఖదీర్ బాబు గారు "అమ్మ" గురించి, "నాన్న" గురించి రాసిన ప్రతి ఘట్టంలోనూ తన తల్లిదండ్రులతో ఆయనకున్న అప్యాయతానురాగాలు కనిపిస్తాయి. "ప్రెతొక్కడూ వాళ్ళమ్మ గురించి, వాళ్ల నాన్న గురించి, చిన్నప్పుడు గురించి రాయాలబ్బా. అట్టా రాస్తేనే మనకు తెలియని జీవితాలు బయట పడతాయి. ఆ జీవితాల్లోని బ్యూటీ తెలుస్తుంది" అన్న నామినిగారి మాటలు, "బాధపడాలి, నలగాలి జీవిత రధచక్రాల క్రింద...కలం లోంచి నెత్తురు ఒలకాలంటే అక్షరాలా? పాండిత్యమా?...కాదు... సంవత్సరాల మూగ వేదన " అన్న చలం గారి మాటలు గుర్తుకొస్తాయి ఈ కథలు చదువుతూంటే. అసలు ఏ కథ గురించి ముందు రాయాలో అర్ధం కావట్లేదు. ముళ్ళపూడివారి ముందుమాటలో లాగ "మచ్చుకి నాలుక్కధలని మెచ్చుకుంటే మిగతా ఇరవయ్యీ...కోప్పడవు; నవ్వుతాయి". అన్ని కథలలో ఒకటో రెండో తప్ప ఏవీ బోరుకొట్టించవు. తెలుగు ప్రాంతాల్లో నివసించే ముస్లిం కుటుంబాల జీవితాలను, నెల గడపటానికి ఆర్ధికంగా ఇబ్బందులు పడే సాధారణ మనిషి జీవితాన్ని, బాల్యపు అమాయకత్వాన్ని, చిన్నతనపు మధుర స్మృతులను, సున్నితమైన మానవ సంబంధాలనూ అన్నింటినీ స్పృశిస్తాయి ఈ దర్గామిట్ట కతలు.




ముఖ్యంగా నా మనసుకు బాగా నచ్చిన కథల గురించి చెప్పాలంటే "నా పేరు పెట్టింది మీసాల సుబ్బారావు", "కసబ్ గల్లీలో సేమ్యాల ముగ్గు", "బులుగంటే బులుగా పలావెంకారెడ్డా", "నేను నేలలో మా అమ్మ బెంచిలోనూ", "ఇది మా నాయినిచ్చిన ఆస్తి", "మా అన్నేగాని చదివుంటే", "నేరేళ్ల మస్తాన్ సురేష్ నా దేవుడు", "పల్లెటూరి షాదీ జజ్జనక" మొదలైనవి నన్ను ఆకట్టేసుకున్నవి. ఇలా రాస్కుంటూ పోతే అన్ని కథల గురించీ రాయాల్సి వస్తుందేమో. ముఖ్యంగా "మా అమ్మ పూలయాపారం" కథ పూర్తయ్యేసరికీ నా కళ్ళలో నీటి చుక్క మెరిసింది. నన్ను ఏవో జ్ఞాపకాల్లోకి తీసుకుపోయింది. "है सब सॆ मधुर वॊ गीत जिन्हॆ हम दर्द कॆ सुर मॆ गातॆ हैं.."అని పాడినట్లుగా కొన్ని జ్ఞాపకాలు చేదైనవే అయినా గుర్తొస్తే మాత్రం మధురంగా ఉంటాయి.


మరి మీరూ ఈ పుస్తకం కొనేసుకుని కథలను చదివేసి మీ మీ బాల్య కౌమారాల్లోకి వెళ్పోయి అలా విహరించి రండి..



Saturday, June 4, 2011

"మనోనేత్రం " - నా కొత్త బ్లాగ్


"మనోనేత్రం " -- looking with the heart !!


ఇది నా కొత్త బ్లాగ్.

ఫోటో బ్లాగ్.

నాకు ఫోటోలు తియ్యటం అంటే చాలా ఇష్టం. నేను అప్పుడప్పుడు సరదా కొద్ది తీసిన ఫోటోలు పెట్టాలని ఈ బ్లాగ్ మొదలుపెట్టాను. ఎలా ఉందో చెప్పండేం..!

Friday, June 3, 2011

ప్రియమైన నాన్నకు మా ముగ్గురి తరఫునా...




ఒక పువ్వుని చూసి సంతోషించటం నేర్పావు
ఒక పాట విని ఆస్వాదించటం నేర్పావు
వర్షపు జల్లుల్లో పులకించటం నేర్పావు


పుస్తకంలో ఆప్తమిత్రుడ్ని చూపెట్టావు
ఎదుటి మనిషి బాధను గుర్తించటం నేర్పావు
తల వంచుకోవటంలోని ఉపయోగాలు చెప్పావు


మనిషిలానే కాక మనసుతో కూడా బ్రతకాలని చూపెట్టావు
బ్రతుకుబడిలో నువు నేర్చుకున్న పాఠాలు మాకూ నేర్పావు


అన్యోన్యతకు ఉదాహరణై నిలిచావు
ఆప్యాయతకు అర్ధాన్ని చూపెట్టావు

ఇంతకంటే విలువైన ఆస్తులు ఎవరివ్వగలరు?
ఇంతకు మించిన విలువలు ఎవరు నేర్పగలరు?

ప్రియమైన నాన్నకు మా ముగ్గురి తరఫునా...
పుట్టినరోజు శుభాకాంక్షలు.






Thursday, June 2, 2011

"ఇళయ్" పాటల్లో ఏ పాటని గుర్తు చేసుకోను..??


(అమావస్య చంద్రుడు నుంచి వయోలిన్ కాన్సర్ట్ బిట్)
ఇవాళ ఇళయరాజా పుట్టినరోజు అని తెలిసి ఆయనపై నా ఉడతాభిమానం చూపెట్టుకుందాం అని దురద పుట్టింది. "మణిరత్నం" పుట్టినరోజూ ఇవాళే. ఇద్దరు నాకు ఇష్టమైన కళాకారులే. కానీ నేను ఎక్కువ పాటల మనిషిని కనుక ఇళయరాజానే ఎక్కువ తలుచుకుందామని నిర్ణయించేసుకున్నా ! ఇళయరాజా స్వరపరిచిన ఒకప్పటి "How to name it", 'Nothing but wind" కేసెట్ అరిగిపోయేదాకా వినటానికీ, మొన్నటి The music MEssiah" అబ్బురంగా వినటానికీ కారణం నాన్న .



"How to name it" లో నాకు బాగా నచ్చిన ఒక బిట్:



"Nothing but wind" నాకు బాగా నచ్చిన ఒక బిట్:





అయితే, అసలు "ఇళయరాజా సినిమాపాటల పిచ్చి" నాకు ఎక్కించింది మాత్రం మా అన్నయ్యే. ఇళయరాజా తెలుగు సినిమాలకి చేసిన హిట్ సాంగ్స్ అన్నీ నాకు రికార్డ్ చేసి ఇచ్చేవాడు. "నాయకుడు" సినిమాలో "నీలాల కన్నుల్లో కన్నీటి ముత్యాలు" పాట అదే ట్యూన్లో వేరు వేరు సాహిత్యాలతో సినిమాలో చాలా చోట్ల వస్తూ ఉంటుంది. కొన్న కేసెట్లో ఒక వర్షనే ఉండేది. అన్ని కావాలి ఎలారా? అని అడిగితే అన్నయ్య నాకోసం అన్ని వర్షన్స్ సంపాదించి రికార్డ్ చేసి పంపించాడు. కాకినాడ వెళ్ళినప్పుడు, ఉత్తరాల్లోనూ కూడా ఇళయరాజా గొప్పతన్నాన్ని నొక్కి వక్కాణిస్తూ ఉండేవాడు. "స్వర్ణకమలం" వచ్చినప్పుడూ "శివ పూజకు" పాట మొత్తం సాహిత్యం ఎంత బావుందో చూడు, దీనికి ఇళయ్ సంగీతం కూడా ఎంత బాగా చేసాడో విను.. అంటూ ఉత్తరం రాసాడు.

ఇళయరాజా పాటల్లో ఏవి మంచివి, ఏవి గొప్పవి అని చెప్పటం చాలా కష్టం. 'ఇళయరాజా' అనగానే నాకు గబుక్కున గుర్తొచ్చే పాటలు:


సుందరమో సుమధురమో (అమావస్య చంద్రుడు)
పూమాల వాడెనుగా పుజ సేయకే(సింధు భైరవి)
ఇలాగే ఇలగే సరాగమాడితే(వయసు పిలిచింది)
జాబిల్లి కోసం ఆకాశమల్లె(మంచి మనుషులు)
ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది(నిరీక్షణ)
మల్లెపూల చల్లగాలి(మౌనరాగం)(ఇదే "చీనీకమ్" సినిమాలో వాడుకున్నారు మళ్ళీ)
ఇళయరాజా స్వయంగా పాడిన 'కలయా నిజమా'(కూలీ నం.వన్)


ఇళయరాజా స్వయంగా పాడిన పాటలు తమిళం అర్ధం కాకపోయినా కొన్ని వింటానికి బాగున్నాయని రికార్డ్ చేసుకున్నాను. పెక్యూలియర్ ఉండే ఆ గొంతు కూడా నాకు నచ్చుతుంది.
"అవతారం" తమిళ్ సినిమాలోని ఈ పాట ఏ రాగమో కానీ నాకు భలే నచ్చుతుంది:


'నాయకుడు' తమిళ సినిమాలో ఇళయ్ పాడిన ఈ పాటలో ముఖ్యంగా నాకు నచ్చేది బీట్ కు సరిపోయేలా ఇళయరాజా గొంతులోని హుషారు :


ఇళయరాజా స్వయంగా పాడిన కొన్ని తమిళ్ పాటలు క్రింద లింక్లో డౌలోడ్ చేస్కోవచ్చు:
http://www.freedownloadpond.com/ilayaraja-collection-%E2%80%93-2/



***** ***** *****

ఇంక ఇళయరాజా స్వరపరిచిన సినిమాల్లో అన్ని పాటలూ బావుండి, వినీ వినీ జీర్ణించేసుకున్న పాటల కేసెట్ల తాలూకు తెలుగు సినిమా పేర్లు:

స్వాతిముత్యం
మౌనరాగం
మౌనగీతం
సితార
అభినందన
పల్లవి అనుపల్లవి
స్వర్ణకమలం
స్వాతిముత్యం
ఓ పాపా లాలి
శ్రీకనకమహా లక్ష్మి డాన్స్ ట్రూప్
రుద్రవీణ
ప్రేమించు పెళ్ళాడు
ప్రేమ
సింధు భైరవి
దళపతి
కిల్లర్
ఆదిత్య 369
గుణ
సూర్య ఐపిఎస్
అల్లుడుగారు
శృతిలయలు
ఘర్షణ
మహర్షి
నాయకుడు
ఆరాధన
మంత్రిగారి వియ్యంకుడు
కొండవీటి దొంగ
రాక్షసుడు

అంజలి
ఆఖరిపోరాటం
డాన్స్ మాస్టర్
అభిలాష
బొబ్ల్లిలి రాజా
చైతన్య
గీతాంజలి
లేడీస్ టైలర్
రుద్రనేత్ర
శివ
ఇంద్రుడు చంద్రుడు
మరణ మృదంగం
అన్వేషణ
కోకిల
ఆత్మ బంధువు
చెట్టుకింద ప్లీడర్
cheeni kum
paa

ఇంకేమన్నా మర్చిపోతే గుర్తుచేయండి..:)))

Wednesday, June 1, 2011

బాబోయ్ వర్షం !!


ఋతుపవనాలు వచ్చేసాయి వచ్చేసాయి...అని తెగ చెప్పేస్తున్నారు వార్తల్లో. వర్షాలు కూడా అలానే మొదలైపోయాయి. ఇప్పుడే ఓ అరగంట జల్లు కురిసింది. "వాన" అంటే ఇష్టం లేనివారు అరుదుగా కనిపిస్తారు. నాకూ ఇష్టమే. కానీ వానా కాలం అంటేనే భయం. గృహిణి అవతారం ఎత్తాకా మాత్రం ఎందుకనో ఇదివరకూలా ఆస్వాదించలేకపోతున్నాను. వర్షాకాలం వచ్చేసిందంటే "బాబోయ్ వర్షం.." అని భయమేస్తోంది.



ఒకప్పుడు వర్షమంటే..
కాగితం పడవలు చేసి సందంతా నిండిన వాననీటిలో వెసి ఆడుకోవటం...
చిన్నగదిలో కిటికీ గూటిలోకెక్కి సన్నటి జల్లు మీద పడుతూంటే పుస్తకం చదువుకోవటం...


ఎప్పుడెప్పుడు వర్షంలో తడుద్దామా అని ఆత్రుత..


ఆ తర్వాత..
బాల్కనీలో ఉయ్యాలలో ఊగుతూ వేడి వేడి కాఫీ తాగటం..
ఊయ్యాల ఊగుతూనే మంచి మ్యూజిక్ వినటం..
వర్షం పడినప్పుడల్లా వేడి వేడి ఉల్లిపాయ పకోడీలు వేసుకోవటం..
వానవల్ల కాలేజీకి శెలవు దొరికితే ఆనందంతో గంతులెయ్యటం..
ఇంకా తరువాత..
హాల్లోంచి వర్షం చూస్తూ మంచి బొమ్మ వేసుకోవటం..
గుమ్మంలో కుర్చీ వేసుకుని వాన పడుతున్నంతసేపు చూస్తూ కూచోవటం..
మళ్ళీ ఎప్పుడు వాన పడుతుందా అని ఎదురుచూడటం..


కాలం గడిచే కొద్దీ మన అభిప్రాయాల్లో, ఆలోచనల్లో కూడా మార్పులు వచ్చేస్తూ ఉంటాయి. అలానే వర్షం గురించిన అభిప్రాయాలు కూడా మారిపోయాయి.
ఇప్పుడు వర్షమంటే..
అమ్మో మళ్ళీ వచ్చేసింది వాన... ఆరేసిన బట్టలు ఆరతాయా?
ఆరీ ఆరని తడిపొడీ బట్టలతో ఇల్లంతా కంపు కంపు ! మయదారి వాన..
పొద్దున్నే మొదలయ్యిందివాళ వాన..పనమ్మాయి వస్తుందో రాదో...రాకపోతే చచ్చానే..
వర్షం వల్ల స్కూల్ వాన్ రాకపోతే పిల్లని స్కూలుకి ఎలా దింపాలో?
ఇవాళ ముఖ్యమైన పని మీద వెళ్దాం అనుకున్నాను...మొదలైపోయింది వాన..ఎలా వెళ్ళేది?
వాన వల్ల ట్రాఫిక్ జామ్లు ఇంకా పెరిగిపోతాయి..తను ఇంటికి ఎప్పుడొస్తారో...
వేసంకాలమే నయం ఎండలు భరించాలే తప్ప అన్ని పళ్ళు దొరుకుతాయి...
వాన వాన వాన...వీధంతా కాలవలా ఉంది. దీన్ని దాటుకుని బయటకు వెళ్లటం ఎలా?

ఇలా సాగిపోతాయి ఆలోచనలు. ఇప్పుడు కాసేపు కుర్చీ వేసుకుని కూచుని వర్షాన్ని చూస్తూ ఆనందించాలని అనిపించదు. పనులాగిపోతాయని భయం వేస్తుంది. అప్పుడప్పుడు వస్తేనే వాన బావుంటుంది. రోజూ వచ్చేస్తే ఏం బావుంటుంది? ఎప్పుడెప్పుడు వర్షాకాలం అయిపోతుందా అనే అనిపిస్తుంది. కానీ నాకు వర్షం ఇష్టమే. కానీ వానాకాలం అంటేనే భయం.

ఎప్పుడెప్పుడా అని మేం ఎదురుచూస్తూంటే, ఇంకా వర్షాలు మొదలవ్వకుండానే నీ గోలేంటమ్మా चुप रहो ! అంటారా? సరే నేను गायब అయితే..!!

Tuesday, May 31, 2011

"వివేకానంద ఎక్స్ ప్రెస్"

భారతదేశం గొప్పతనాన్ని ప్రపంచమంతటా చాటడానికి భగవంతుడు పుట్టించిన అరుదైన రత్నాలలో ఒకరు స్వామి వివేకానంద. జీవించిన అతి చిన్న జీవితకాలంలో ఆయన సాధించినది అనంతం. భారతదేశానికే కాక ప్రపంచమంతటికీ అందించిన జ్ఞాన నిధి అపారమైనది. యువతరానికి వారు అందించిన సందేశం, ఆయన టీచింగ్స్ ప్రతి కాలేజ్ వాళ్ళు ఓ కంపల్సరీ సబ్జక్ట్ గా పెట్టి పిల్లలకి బోధించగలిగితే బావుంటుంది అనిపిస్తుంది నాకు. నాకా మహానుభావుని పై అభిమానం ఎలా మొదలైందంటే, మా ఇంట్లో "శ్రీ రామకృష్ణ జీవిత చరిత్ర" పుస్తకం ఉండేది. అది చదివినప్పుడు వివేకానందుడి గురించి కొంత తెలుసుకున్నాను. ఆ తరువాత విజయవాడ బుక్ ఎగ్జిబిషన్ లో రామకృష్ణామఠ్ స్టాల్లో కొన్ని పుస్తకాలు కొనేదాన్ని. వాటివల్ల కొంత తెలుసుకున్నాను.

ఆ తరువాత కాలేజ్ లో నా క్లోజ్ ఫ్రెండ్ ఇంట్లోవాళ్ళు రామకృష్ణ మఠంలో సభ్యులు. ఆంటీ రెగులర్ గా భజన్స్ కీ వాటికీ వెళ్ళేవారు. తను నాకు చాలా సంగతులు చెప్తూండేది. "Strength is life, weakness is death." అని ఉన్న ఒక పెద్ద పోస్టర్ నాకు ఇచ్చింది . నా పెళ్ళి అయేవరకు నా గదిలో ఆ పోస్టర్ ఉండేది. ఉదాసీనంగా ఉన్నప్పుడు ఆ పోస్టర్ ను చూసి ధైర్యం తెచ్చుకునేదాన్ని. "Take the responsibility on your own shoulders, and know that you are the creator of your own destiny." అన్న వివేకానందుడి మాటలు ఒక స్టిక్కర్ రూపంలో మొన్నమొన్నటిదాకా మా గదిలో ఉండేది. ఇల్లుమారినప్పుడు అది పీకటం ఇష్టం లేక అలా ఉంచేసి వచ్చేసా.

వివేకానందుని 150వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని రైల్వే శాఖ ప్రారంభించిన "వివేకానంద ఎక్స్ ప్రెస్" బోయిగూడా మార్గంలో మూడురోజులు ఉంచారు. ఆయన జీవిత విశేషాలను వివరిస్తూ దేశవ్యాప్తంగా ఈ రైలు పర్యటిస్తోంది. గతంలో రవీంద్రనాథ్ ఠాగూర్ 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా కూడా ఇలానే రైలును దేశవ్యాప్తంగా తిప్పారు. రైల్వేశాఖ వారి ఈ ప్రయత్నాన్ని అభినందించాలి. నేను నిన్న వెళ్ళి చూసి, కొన్ని ఫోటోలు తీసుకుని వచ్చాను. నిజానికి కొన్ని మేము కలకత్తా వెళ్ళినప్పుడు బేలూర్ మఠ్ లో చూసినవే. బేలూర్ మఠ్ సందర్శనం ఒక మరపురాని అనుభూతి. అక్కడ గార్డెన్ లో ఒక వింత చెట్టు ఉంది.ఇప్పుడు ఉండో లేదో మరి. చెట్టు ఆకులు దొన్నెల్లా ఉన్నాయి. కృష్ణుడికి యశోద వెన్న పెట్టేదిట ఆ ఆకుల్లో. అందుకని ఆ పేరు వచ్చిందని చెట్టు కేదో పేరు చెప్పారు అప్పుడు. మర్చిపోయా. ఆక్కడ రాలిన ఒక ఆకు తెచ్చి పుస్తకంలో ప్రెస్ చేసి దాచాం కూడా. ఇంకా నాన్న దగ్గర ఉంది అది.

నిన్న "వివేకానంద ఎక్స్ ప్రెస్"లో తీసిన ఫోటోలలో కొన్ని:
ఈ ఫోటోలో కుడివైపు చివర ఉన్నది సిస్టర్ నివేదిత :




చికాగో నుంచి వచ్చినప్పుడుట:


కన్యాకుమారి లోని వివేకానంద రాక్ మెమోరియల్ :




వివేకానందుని చేతి గుర్తు:

belur math view:

వివేకానంద టీచింగ్స్ లో నాకు బాగా నచ్చినది:
Strength, strength it is that we want so much in this life, for what we call sin and sorrow have all one cause, and that is our weakness. With weakness comes ignorance, and with ignorance comes misery.

Monday, May 30, 2011

Kung Fu Panda 2

For success in life or any other achievement all that you need is "inner peace" అన్న సూత్రాన్ని చెప్పింది " Kung Fu Panda 2 ". ఇవాళ నేను చూసిన ఈ ఏనిమేటేడ్ మూవీ నాకు తెగ నచ్చేసింది. నేను 2D మాత్రమే చూశాను. కానీ ఊళ్ళో ఆడుతున్న 3D వెర్షన్ చూస్తే ఇంకా బాగుంటుందేమో. వీలైతే మళ్ళీ చూడాలి. Summer special movie, good entertainer మొదలైన అవార్డులన్నీ ఈ సినిమాకే ఇచ్చేస్తా నేను.





సీక్వెల్ సినిమాల్లో మొదటి భాగం మాత్రమే బాగుంటుంది అనే నానుడిని ఈ సినిమా బ్రేక్ చేసేసింది. నాకుమటుకు మొదటి దాని కన్నా ఈ రెండోది ఇంకా బావుంది అనిపించింది. అసలు ప్రపంచంలో అన్నీ యేనిమేషన్సే తీయాలి అని రూలు కూడా పెట్టాలనిపించేసింది. అంత హాయిగా, ఉల్లాసంగా ఉంది సినిమా. ముఖ్యంగా కంప్యూటర్ గ్రాఫిక్స్ అద్భుతంగా ఉన్నాయి. అమెరికాలో రిలీజైన మొదటి వారంలోనే బోలెడు లాభాలార్జించిందట ఈ సినిమా.




చిన్నప్పుడు ఊళ్ళోకి ఏ animated movie వచ్చినా నాన్న మమ్మల్ని తీసుకువెళ్ళేవారు. అందువల్ల చిన్నప్పటి నుంచీ animations పట్ల ఒక ప్రత్యేకమైన అభిమానం ఏర్పడింది. దానితో పాటుగా "డ్రీమ్ వర్క్స్ ప్రొడక్షన్ " వాళ్లవి అయితే బావుంటాయని ఒక నమ్మకం కూడా ఏర్పడింది. రెండేళ్ళ క్రితం మా తమ్ముడు తెచ్చిన " Kung Fu Panda" సీడీ చూసి తెగ నచ్చేసి కాపీ కూడా చేస్కున్నాను. ఆ సినిమా గురించి బ్లాగ్ లో రాద్దాం రాద్దాం అనుకుంటూండగానే దాని సీక్వెల్ కూడా వచ్చేసింది. నిన్న "వైశాలి" చూసి వస్తుంటే దారిలో ఉన్న హాల్లో " Kung Fu Panda 2 " కనబడింది. చూసేద్దామనుకుంటే పొద్దుటే ఉందిట షో. రాత్రి లేదుట. అందుకని నిన్న చూడలేదు. మన జనాలు చూస్తారో లేదో.. వారాంతం దాకా ఉంటుందో వెళ్పోతుందో.. అని ఇవాళే చూసేసా.


అద్భుతమైన డైలాగులు ఈ సినిమాకు పెద్ద ఎసెట్స్. కొన్ని గుర్తున్నాయి..

*The only thing that matters is what you choose now.
* The Cup you choose to fill has no bottom.
*Anything is possible when you have inner peace.
* మళ్ళీ ఒకచోట villioness "Shen" హీరో "Po" తో " your stupidity is mildly amusing " అంటే Po ఏమో Shen తో "your wikidity is wildly amusing " అంటాడు. ఆ డైలాగ్ భలే ఉంది.




ఈ సినిమా లోని పాత్రలకు Jack black, angelina jolie, jackie chan మొదలైన అగ్ర తారలు గళాలనందించారు.

ఈ సినిమా దర్శకురాలు "Jennifer yuh nelson". ఈవిడ "kung Fu panda" (మొదటిది) సినిమా ప్రొడక్షన్లో కూడా కీలకపాత్ర వహించి ఒక అవార్డ్ ను కూడా పొందారు. ఇప్పుడీ రెండవ సీక్వెల్ కు పూర్తి దర్శకత్వ బాధ్యతను చేపట్టి తన సత్తా నిరూపించుకున్నారు. ఈ చిత్రంలో మార్షల్ ఆర్ట్స్ సీక్వెన్సెస్ కూడా అద్భుతంగా ఉన్నాయి. గ్రాఫిక్స్ అసలు యేనిమేషన్ సినిమలా కాక చాలా రియలిస్టిక్ గా అనిపించాయి. సినిమా చివరలో మూడవ భాగం కూడా తీస్తారేమో అన్న హింట్ ఇచ్చారు...!





ఈ సినిమా మాలూలు హాల్స్ లో ఇచ్చి ఉంటే ఈ వేసవిలో అందరు పిల్లలూ చూసి ఆనందించగలరు. కానీ మల్టీప్లెక్సులకే పరిమితం చేస్తే ఎందరు చూడగలరు? అన్నది ప్రశ్న. అదీగాక ఈ మధ్యన పోగో, కార్టూన్ నెట్వర్క్ మొదలైన ఛానల్స్ పుణ్యమా అని కాస్తంత ఎవేర్నెస్ వచ్చింది కానీ మన దేశంలో యేనిమేషన్స్ పట్ల ఆసక్తి తక్కువనే చెప్పాలి. ఏదేమైనా ఈ టపా చదివినవారంతా వీలైతే ఈ సినిమాను కుటుంబంతో తప్పక చూడండి. ముద్దుగా, బొద్దుగా, తెలివిగా, కాస్తంత అమాయకత్వంతో నవ్వుతెప్పించే panda హీరో "Po" ను ప్రేమించకుండా ఉండలేరు.