సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Tuesday, April 30, 2013

బాలరాజు కథ(1970)




1970 లో బాపూ దర్శకత్వంలో వచ్చిన సినిమా "బాలరాజు కథ". 1971లో ఉత్తమ జాతీయ
తెలుగు చిత్రం పురస్కారాన్ని అందుకుంది. 'ఏ.పి.నాగరాజన్' గారి కథకు, 'ముళ్ళపూడి' మాటలు రాసారు. ఈ సినిమా బాలల చిత్రమనిపించినా, పెద్దవారిని కూడా ఆకట్టుకునే చిత్రమిది. ఇప్పటి పిల్లలకూ చూపిస్తే కూడా ఎంతో ఆసక్తికరంగా చూస్తారీ సినిమాని అనిపిస్తుంది చూసినప్పుడల్లా. 


బాలరాజుగా మాష్టర్ ప్రభాకర్, అతని చిట్టిచెల్లిగా బేబీ సుమతి ఉత్సాహవంతంగా నటించారు. మిగతా పాత్రల్లో నాగభూషణం, అల్లు రామలింగయ్య, సూర్యాకాంతం, మిక్కిలినేని, హేమలత, ధూళిపాళ, పుష్పకుమారి మొదలైనవారు నటించారు. ఏనిమేషన్ తో రూపొందించిన సినిమా టైటిల్స్ ఓ ప్రత్యేక ఆకర్షణ. పిల్లల సినిమా కాబట్టి లా తీసారేమో కానీ మొత్తం సినిమా కథంతా క్లుప్తంగా ఈ టైటిల్స్ లోనే మనకు చూపెడతారు బాపూ.



చిన్నప్పుడు అమ్మ మమ్మల్ని హాలుకు తీసుకువెళ్ళి చూపించిన నలుపు తెలుపు చిత్రాల్లో పాటలతో సహా బాగా గుర్తుండిపోయిన చిత్రం ఇది. ఆరుద్ర, కొసరాజు రాసిన పాటలకు కె.వి.మహదేవన్ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రాన్ని మ్యూజికల్ హిట్ అనవచ్చు. మొత్తం ఆరు పాటలూ ఎంతో పాపులర్ అయ్యాయి. అన్ని పాటలు వినడానికీ, చూడటానికీ కూడా భలే సరదాగా ఉంటాయి.

* మహా బలిపురం మహా బలిపురం మహా బలిపురం...
* అడిగానని అనుకోవద్దు చెప్పకుండా దాటేయద్దు..(క్రింద సినిమా లింక్లో 1:53:14
వద్ద ఈపాట  చూడవచ్చు)
* హిప్పి హిప్పీ హిప్పీ హిప్పీ ఆడపిల్లలు
* ఒకటి రెండు మూడైతే ముద్దు ముద్దు
* చూడు చూడు తమాషా భలే తమాషా
* చెప్పు చెప్పు భాయ్

వీటిల్లో మొదటి రెండూ నాకు బాగా నచ్చుతాయి. మొదటి పాట యూట్యుబ్ లో దొరికింది. చూడండి..


* మహా బలిపురం మహా బలిపురం మహా బలిపురం...


  


కథలోకి వస్తే, బాలరాజు అనే కుర్రవాడు "మహా బలిపురం "లో టురిస్ట్ గైడ్ లా ఉంటూ కుటుంబాన్ని పోషిస్తూ ఉంటాడు. అనారోగ్యంతో తల్లి చనిపోతే మిగిలిన ఒకేఒక తోడైన చెల్లెల్లితో మేనమామ ఇంట్లో ఉంటుంటాడు. మేనమామ కుటుంబానికి కూడా అతని సంపాదనే ఆధారం. మావయ్య పిల్లలు ముగ్గురు, వీళ్ళిద్దరూ.. మొత్తం అయిదుగురూ అన్యోన్యంగా ఉంటుంటారు. బాలరాజు ఉత్సాహం, తెలివితేటలు, చురుకుదనం ఊరు చూట్టానికి వచ్చిన టూరిస్టులందరినీ ఆకట్టుకుంటుంటాయి. 


ఒకరోజు ఒక ధనిక వ్యాపారవేత్త భార్యతో మహాబలిపురం వస్తాడు. సంతానం లేని ఆ జంట బాలరాజునీ, అతని చెల్లినీ చూసి ముచ్చటపడి వెంట తీశుకువెళ్ళి దత్తత చేసుకోవాలనుకుంటారు. రాజు మేనమామ ధనికుడితో బేరం కూడా కుదుర్చుకుంటాడు. కానీ అనుకోకుండా ఒక అవాంతరం ఎదురౌతుంది.


ధనికుడి ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం జరిగిందని,నష్టం వచ్చిందని తెలిసి పిల్లల అదృష్టంపై అతనికి అనుమానం వ్యక్తపరుస్తాడు. దంపతుల వాగ్వివాదం విన్న బాలరాజు చెల్లెలితో కలిసి వాళ్ల గెస్ట్ హౌస్ నుండి వెళ్పోతాడు కానీ తాము దురదృష్టవంతులమన్న మాట ఆ పిల్లవాడి మనసుని గాయపరుస్తుంది. చిత్రం మొదట్లో గురువుగారు చెప్పిన
'సప్త సూత్ర శాస్త్రం'లో మొదటి వాక్యం నిజమైందని అనుకుంటాడు బాలరాజు.



'సప్త సూత్ర శాస్త్రం' అంటే ఏడు నీతులు. ఈ ఏడు నీతులూ ఇటీవలే బయటపడ్డాయి.  ఇవన్నీ ఎప్పుడో అప్పుడు అందరికీ జీవితంలో అనుభవమౌతాయి అని ఇలా రాతిపై చెక్కించి ఉంచాను అని చెప్తాడు గురువుగారు. అవేమిటంటే -

* ఆశ కొలదిగ పెరుగు అవనిలో నిరాశ (ఎంత ఎక్కువ ఆశ పడితే అంత ఎక్కువగా నిరాశ కలిగి బాధ పడతావు)
* ఒక్క వేలు జూపి ఒరులను నిందించ, వెక్కిరించు నిన్ను మూడు వేళ్ళు(ఒకరి తప్పును ఎత్తిచూపేముందు నీ తప్పులు మూడుంటాయని తెలుసుకో)
* తెలుపు క్షీరము కాదు నలుపు నీరము కాదు.( తెల్లనివన్ని పాలు కాదు, నల్లనివన్నీ నీళ్ళు కాదు)
* చెడ్డవారలకెపుడు చేదోడు కావలదు. (చెడ్డవారికి సహకరించకూడదు)
* అలయు మీరిన వేళ అమృతము విషమగును.(మితిమీరిపోతే ఎంత ఇష్టమైనదైనా వెగటౌతుంది)
* తాడు పామవగలదు, పాము తాడవగలదు (తొందర పడి దేన్ని నమ్మకూడదు)
* కలసివచ్చిననాడు కడుపేద రాజగును.



రకరకాల సంఘటనల ద్వారా ఈ ఏడు సూత్రాలూ బాలరాజుకి ఏ విధంగా అనుభవంలోకి వచ్చాయి? చివరికి బాలరాజు కథ ఏమైంది? అన్నది మిగిలిన సినిమా. ఈ పిల్లవడు ఎవరో గానీ మహా చురుకుగా ఉన్నాడు. సినిమాలో టూరిస్ట్ లకే కాదు ప్రేక్షకులకు కూడా నచ్చేలాగ ! పూర్వంలో వచ్చిన ప్రతి నలుపు-తెలుపు సినిమా చక్కని సందేశాన్ని ఇచ్చేది. ఫలానా సినిమా చూశాం అంటే ఏదో ఒక నీతి, లేక సత్యాన్ని తెలుసుకున్నం అని అనిపించేది. చూసిన ప్రతి ఒక్కరికీ అలా అనిపించే చిత్రమే ఈ బాపు రమణల "బాలరాజు కథ". అన్ని ప్రముఖ వీడియో కేసెట్ షాపుల్లోనూ ఈ సీడి లభ్యమౌతోంది.





పూర్తి సినిమా క్రింద ఉన్న యూట్యుబ్ లింక్ లో చూడవచ్చు: 
http://www.youtube.com/v/rdr5XxQLyKA?hl

Monday, April 29, 2013

పాలపిట్ట ప్రత్యేక కథల సంచిక





"మనుషులకి ఒకరి గురించి ఒకరికి ఎందుకింత ఎక్కువగా తెలియడం? తెలుసుకునే దాకా ఆగలేకపోవడం, తెలుసుకున్నాకా ఓస్ ఇంతేకదా! అనో లేదా ఛీ! ఇంత నీచంగానా? అనో అనుకోవడం ఎందుకు?"
"కిటికీ బయటి వెన్నెల" అనే కథలో మాటలు ఇవి. నాకు ప్రియమైన రచయితల్లో ఒకరైన వాడ్రేవు వీరలక్ష్మిగారు రాసిన  ఈ కథ 'పాలపిట్ట ప్రత్యేక కథల సంచిక'లోనిది.

ఏదైనా కథా సంకలనం తీసుకుంటే అందులో ఉన్న కథల్లో సగమే కథలు మనకు నచ్చుతుంటాయి. ఒకోసారి ఉన్నవాటిల్లో పావు వంతు కూడా నచ్చవు. పాటల సీడీలైనా అంతే. ఫలానావారి హిట్స్ అని సిడీ విడుదల చేస్తారు కానీ అందులో అసలైన హిట్స్ కొన్ని మిస్సయ్యాయి, లేదా అన్నీ మంచివి లేవు అనుకుంటాం కూడా. అన్ని నచ్చాయీ అంటే అది పుస్తకమయినా, సీడి అయినా అది అరుదైనదే. అలాంటి అరుదైన మంచి కథల పుస్తకమొకటి ఈమధ్యన చదివాను. ఇప్పటిదాకా నేను చదివిన కథా సంకలనాలన్నింటిలో నాకు బాగా నచ్చినది. మొదటి పదిహేను, పదహారు కథలదాకా చకచకా చదివేయగలము. ఆ తరువాత కథల్లోని మాండలీకాల వల్ల కాస్త సమయం ఎక్కువ పడుతుంది నెమ్మదిగా చదువుతాము కాబట్టి. 


'పాలపిట్ట ప్రత్యేక కథల సంచిక'లో మొత్తం 26 కథలు ఉన్నాయి. అన్నీ వేటికవే బావున్నాయి. ఒకో కథా మొదలుపెడితే అయ్యేదాకా పరిసరాలు మర్చిపోయేంతగా మనల్ని లీనం చేసుకోగల కథలు. అన్నీ వైవిధ్యభరితమైన కథాంశాలు. ఇంట్లోని చిన్న పిల్లల జగడాల దగ్గర నుండీ ఉద్యమాల వరకూ, జీవితంలో రకరకాల కోణాలను, పార్శ్వాలనూ స్పృశిస్తాయి ఈ కథలు. అన్ని కథల క్రిందన రచయితల సెల్ నంబర్లు ఇచ్చారు.

కథలు, కథా రచయితల పేర్లు : 

శాంతి పర్వం  -  ఏ.ఎన్.జగన్నథ శర్మ, 
వికృతి   - అట్టాడ అప్పల్నాయుడు, 
వైట్ బోర్డ్..  - జి.ఉమామహేశ్వర్, 
నిసర్గం  - కాశీభట్ల వేణుగోపాల్, 
కిటికీ బయటి వెన్నెల  - వాడ్రేవు వీరలక్ష్మి, 
బొమ్మలపెట్టె  - బి.మురళీధర్, 
చిరాగ్  -  మహమూద్, 
కప్పు కాఫీ - సలీం, 
నిర్ణయం -  సి.ఎస్.రాంబాబు, 
జలసేద్యం -  కాట్రగడ్డ దయానంద్, 
గాజు పెంకులు-దూదిపింజలు  -  డా. బి.వి.ఎన్.స్వామి, 
ఋతుసంహారం -  డా.వి.చంద్రశేఖరరావు,
వేమన్న గుర్రం -  డా. వి.ఆర్. రాసాని, 
విస్ఫోటనం  -  డా.ధేనువకొండ శ్రీరామమూర్తి, 
జింక డ్రామాలో మా ఏక్సను - ఎలికట్టె శంకర రావు, 
యజమాని - మధురాంతకం నరేంద్ర, 
రెండడుగుల నేల - పూడూరి రాజిరెడ్డి, 
ముసిలి - పద్దం అనసూయ, 
దాపటెద్దు - యెన్నం ఉపేందర్, 
సూదిగట్టు -  బి.పి.కరుణాకర్, 
ఒక శంకరం... ఒక శాంత - రామా చంద్రమౌళి, 
దేవుడు - నన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి, 
నిత్య కల్లోలం - ముదిగంటి సుజాతారెడ్డి, 
ఏక్ ముసాఫిర్... దో రాస్తే! - స్కైబాబ, 
కంబస్థం బల్లెడ - నారాయణమూర్తి, 
పతాక సందేశం దాట్ల - దేవదానం రాజు. 


ఈ కథలన్నీ నాకు అన్నీ నచ్చాయి కానీ ఒకటి రెండు కథలు బానే ఉన్నాయి అనిపించాయి. కారణం ఆ కథలోని విషయం పట్ల నాకు ఆసక్తి లేకపోవటమే. విభిన్నమైన కథాంశాల కారణంగా మాత్రం అన్ని కథలూ అందరికీ నచ్చకపోవచ్చు. చాలా నచ్చిన కొన్ని కథల గురించి క్లుప్తంగా నాలుగు మాటలు రాస్తాను.

కిటికీ బయటి వెన్నెల 
మనుషుల్లో సాధారణంగా కనబడే క్యూరియాసిటీ ఎలా ఉంటుందో ఓ తేలికైన ఉదాహరణతో చెప్తారు వాడ్రేవు వీరలక్ష్మి గారు. ఈ కథ చదువుతున్నంత సేపు మా కిటికీ లోంచి కనిపించే ఎదురింటివాళ్ల గురించి నేను అనుకునేవే ఈవిడ రాస్తున్నారా అనిపించింది. నాకు బాగా నచ్చింది కథ.



నిసర్గం:
స్త్రీ శరీరాన్ని మాత్రమే ప్రేమించటం కాదు ఆమె మనసుని కూడా అర్థం చేసుకున్నప్పుడే మాగవాడి ప్రేమ సంపూర్ణమవుతుంది అన్న సందేశాన్ని తెలిపే కథ నిసర్గం. తనదైన శైలిలో కాశీభట్ల వేణుగోపాల్ గారు రాసిన ఈ కథానిక మనసుని తడుతూ.. స్త్రీని అర్థంచేసుకోవాలంటే శరీరాన్నీ, మనసునీ విడదీసి చూడగలగాలనే ఆలోచనను మేల్కొలుపుతుంది. 



వైట్ బోర్డ్..  :
పిల్లలు రాసుకునే "వైట్ బోర్డ్" కొనటం, పిల్లల కొట్లాట, అది పరిష్కారమైన విధానం మనసుకి హత్తుకునేలా రాసారు ఉమామహేశ్వర్ గారు. ఏ గందరగోళాలూ లేని ఒక మంచి కథ చదివిన భావన మిగులుతుంది కథ చదివాకా.

బొమ్మలపెట్టె:
పల్లెల్లో, పట్నాల్లో పిల్లల పెంపకాల్లో కనబడే తేడాల్ని చెప్తూ, మన పెంపకాన్ని బట్టే పిల్లల మనస్తత్వం ఏర్పడుతుంది అని చెప్తారు బి.మురళీధర్ గారు.

ముసిలి: 
చిరాగ్:
ఈ రెండు కథలూ ఓ మరణంతో మొదలై, మరణించిన మనిషి యొక్క జ్ఞాపకాల చూట్టూ తిరుగుతాయి.

జింక డ్రామాలో మా ఏక్సను:
ఆద్యంతం నవ్వు తెప్పించే ఈ చిన్న కథ స్టేజి మీద వేసిన రాములోరి నాటకం ఎలా నవ్వులపాలైందో వివరిస్తుంది.

కప్పు కాఫీ:
కప్పు ఎలా ఉందనేది కాదు, అందులోని కాఫీ ఎలా ఉందనేది ముఖ్యం.. అంటూ రుచికరమైన కాఫీలాంటి జీవితాన్ని ఆస్వాదించటమెలాగో తండ్రికి నేర్పుతుంది ఓ కూతురు.

జలసేద్యం:
పౌరోహిత్యం మానుకుని రొయ్యల పెంపకం మొదలుపెట్టిన మాధవకి ఎదురైన కష్టనష్టాలను కళ్ళకు కట్టినట్లు చూపెడుతుండీ కథ.

యజమాని :
మధురాంతకం నరేంద్రగారు  రాసిన ఈ కథ గురించి జంపాల చౌదరి గారు ఈ వ్యాసం చివర్లో రాసారు. (http://pustakam.net/?p=13885) రచయిత అనుమతితో వారు ఇచ్చిన ఈ కథానిక లింక్ కూడా అక్కడ చూడవచ్చు.

దేవుడు:
అందరితో దేవయ్యా అని పిలిపించుకునే వాసుదేవయ్య ఊరోళ్లందరికీ దేవుడేలా అయ్యాడో ఈ కథ చెప్తుంది.

ఏక్ ముసాఫిర్... దో రాస్తే!
ఉద్యోగమా.. ఉద్యమమా.. అనే ఊగిసలాటలోంచి బయటపడిన సమీర్ చివరకు ఏం నిర్ణయం తీసుకున్నాడో ఈ కథలో చదవచ్చు. ఈ పెనుగులాటలో సమీర్ పడే మానసిక క్షోభ మన కళ్ళెదుట నిలబడుతుంది.

***

క్రిందటేడు విశాలాంధ్రలో యాదృచ్ఛికంగా కొన్న ఈ పుస్తకం నాకెంతో సంతృప్తినీ, ఎన్నోఆలోచనలనీ ఇచ్చింది. కొత్త విషయాలను తెలిపింది. మార్చి2011లో మొదటి ప్రచురణ పొందిన ఈ పుస్తకం వెల ఎనభై రూపాయిలు.




Friday, April 26, 2013

ఉరకలై గోదావరీ..




పొద్దున్న రేడియోలో ఒక మంచి పాట విన్నా. ఇళయరాజాదని అర్థమైపోయింది. జానకి, బాలు పాడుతున్నారు. ఇంత చక్కని పాట ఏ సినిమాలోదో అని నెట్లో వెతికితే "అభిలాష" లోదని తెలిసి ఆశ్చర్యపోయా..! "అభిలాష" పేరు వినగానే "బంతి-చామంతి" పాట, ఆ తర్వాత జానకి నవ్వుతో పాటూ "నచ్చింది గాళ్ ఫ్రెండు..", "సందె పొద్దులకాడ" మొదలైన పాటలు గుర్తుకొస్తాయి. ఈ పాట ఇదివరకు విన్న గుర్తు ఉంది కానీ ఈ సినిమాలోదని తెలీదు. ఫోల్డర్లోని ఇళయరాజా పాటల్లో వెతికితే నా దగ్గర ఉన్నదే..!

వేటూరి సాహిత్యం. ఎంత చక్కగా ఉందో గోదావరంత చల్లగా. అయిపోగానే మళ్ళీ మళ్ళీ వినాలనిపించింది. మీరూ ఓసారి ఈ పాట వినేసి ఆనందిచేయండి..

పాట: ఉరకలై గోదావరీ..
చిత్రం: అభిలాష
రచన: వేటూరి
పాడినది: ఎస్.పి.బాలు, ఎస్.జానకి





సాహిత్యం:

ఉరకలై గోదావరీ, ఉరికె నా ఒడి లోనికీ
సొగసులై బృందావనీ, విరిసె నా సిగ లోనికీ 
జత వెతుకు హృదయానికీ శృతి తెలిపె మురళీ
చిగురాకు చరణాలకీ సిరిమువ్వ రవళీ
రసమయం జగతి 
ఉరకలై గోదావరీ ఉరికె నా ఒడి లోనికీ 

నీ ప్రణయ భావం నా జీవ రాగం(2)
రాగాలు తెలిపే భావాలు నిజమైనవి 
లోకాలు మురిసే స్నేహాలు ఋజువైనవి 
అనురాగ రాగంలో స్వరలోకమే మనదైనది 
ఉరకలై గోదావరీ ఉరికె నా ఒడిలోనికీ 
జత వెతుకు హృదయానికీ శృతి తెలిపె మురళీ 
చిగురాకు చరణాలకీ సిరిమువ్వ రవళీ
రసమయం జగతి 

నా పేద హృదయం నీ ప్రేమ నిలయం (2)
నాదైన బ్రతుకే ఏనాడో నీదైనది 
నీవన్న మనిషే ఈనాడు నాదైనది 
ఒక గుండె అభిలాష పదిమందికి బ్రతుకైనది 
ఉరకలై గోదావరీ ఉరికె నా ఒడిలోనికీ
సొగసులై బృందావనీ విరిసె నా సిగ లోనికీ
జత వెతుకు హృదయానికీ శృతి తెలిపె మురళీ 
చిగురాకు చరణాలకీ సిరిమువ్వ రవళీ
రసమయం జగతి

**   ***   **  ***  ** 


"అభిలాష" చిత్రంలో పాటలన్ని ఇక్కడ వినవచ్చు..
http://www.raaga.com/channels/telugu/album/A0000004.html


Tuesday, April 23, 2013

లాల్గుడికి స్వర నివాళి




గొప్పగొప్ప విద్వాంసులందరూ ఒక్కొక్కరే వెళ్పోతున్నారు...:( వాళ్ళు మనకు మిగిల్చిన స్వరాలను వినటమే వారికి మనమిచ్చే స్వరనివాళి అనిపిస్తుంది నాకు. నా చిన్నప్పుడు లాల్గుడి జయరామన్ గారి తిల్లానాల కేసెట్ తరచూ వింటూండేవారు నాన్న. అలా నాకు పరిచయమయ్యాయి లాల్గుడి స్వరాలు.. 

యూ ట్యూబ్ లో దొరికిన కొన్ని కృతులనూ, రాగాలనూ ఒక స్వర నివాళిగా ఇక్కడ పొందుపరుస్తున్నాను..

దేశరాగం
  

 ఎందరో మహానుభావులు..  


మరుగేలరా..
   


రష్యా లో లాల్గుడి..(రెండవ భాగం..)  

మోహనకల్యాణి రాగంలో తిల్లానా  

ఈ లింక్ లో మొత్తం పన్నెండు కృతులను వరుసగా వినవచ్చు..  


 ఈ క్రింద లింక్ లో మరో ఐదు కృతులను వినవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు: http://musical-vibrations.blogspot.in/2012/08/violin-lalgudi-gjayaraman.html


Monday, April 22, 2013

పి.బి.శ్రీనివాస్ రచించి, పాడిన ఇంగ్లీష్ పాటలు..

గ్రాంఫోన్ కవర్ పైన ఉన్న పిక్చర్


క్రితం వారం పి.బి.శ్రీనివాస్ గురించి రాసిన టపాలో పి.బి. రచించి, పాడిన ఇంగ్లీష్ పాటల గురించి రాసా కదా.. ఆ పాటలు.. 


1968 లో Neil Armstrong చంద్రుడి మీద కాలు పెట్టాకా, శ్రీ పి.బి.శ్రీనివాస్ గారు రెండు పాటలు రాసి, వాటిని సంగీత దర్శకులు ఏం.ఎస్.శ్రీరాం గారు స్వరపరచగా, ఓ గ్రామ్ఫోన్ రికార్డ్(45 RPM)ను 1970లో రిలీజ్ చేసారు. బి.రాథాకృష్ణ గారు ఈ గ్రామ్ఫోన్ రికార్డ్ స్పాన్సర్ చేసారు. ఈ రికార్డ్ లో ఒక వైపు పి.బి. సోలో "Man to Moon", రెండో వైపు ఎస్.జానకి తో కలిసి పాడిన "Moon to God" అనే పాట ఉంటాయి. ఈ రికార్డ్ ను ఆయన Armstrong కు, అప్పటి అమెరిన్ ప్రెసిడెంట్ కు పంపగా, అమెరిన్ ప్రెసిడెంట్ వద్ద నుండి జవాబు కూడా వచ్చిందట. ఎం.ఎస్. శ్రీరాం గారు నాన్నగారికి స్వయంగా ఇచ్చిన ఈ రికార్డ్ కాపీ ఒకటి మా ఇంట్లో ఉండేది. ఇప్పుడు కూడా నాన్నగారి వద్ద ఉంది. గ్రామ్ఫోన్ రికార్డ్ లోని ఆ పాటలు ఇవే....


1. Man to moon - P.B.Srinivas song (1970) 
 Music: M.S.Sriram
   


2. Moon to God -P.B.Srinivas & S.Janaki (1970) 
 Music: M.S.Sriram

 

గ్రాంఫోన్ కవర్ వెనకాల ఉన్న రెండు పాటల సాహిత్యం:


Friday, April 19, 2013

శ్రీ భద్రాచల రామదాసు కీర్తనలు





ప్రముఖ వాగ్గేయకారుడు రామదాసు(కంచర్ల గొపన్న) కీర్తనలు కొన్ని శ్రీబాలమురళి గారు పాడగా "శ్రీ భద్రాచల రామదాసు కీర్తనలు" పేరుతో కేసెట్,సీడీ రూపంలో చాలాకాలం క్రితం విడుదల అయ్యాయి. మొత్తం పది కీర్తనలు ఉన్న ఈ ఆల్బం నాకు చాలా ఇష్టం. మనసు బాలేనప్పుడల్లా ఈ సిడి వింటే.. ఉత్సాహంతో మనసు మళ్ళీ ఉత్తేజితమౌతుంది. "శ్రీరామనవమి" సందర్భంగా ఆ ఆల్బంలోని కీర్తనలు ఇక్కడ.. 


1)ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి..

 .  


2)పాహి రామ ప్రభో..

   


3)పలుకే బంగారమాయెనా..

   


4)ఏ తీరుగ నను  దయ చూసెదవో..

   



5) తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకూ ..

 


6)తారక మంత్రము కోరిన దొరికెను..

   


7) నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి...

.  


8) ఇక్ష్వాకు కుల తిలకా..

  


9)రామచంద్రులు నాపై..

   


10) రామచంద్రాయ జనక రాజజా మనోహరాయ ..
 


***   ***
 ఒక ముఫ్ఫై రామదాసు కీర్తనలు http://www.bhadrachalarama.org లో డౌన్లోడ్ కి పెట్టారు. 
ఆసక్తి ఉన్నవాళ్ళ కోసం లింక్: 
http://www.bhadrachalarama.org/ramadasukeerthnaas.html



Thursday, April 18, 2013

WATER - A miracle Therapy





2002లో విజయవాడ పుస్తక ప్రదర్శనలో కొన్నాను ఈ పుస్తకాన్ని. అందరికీ ఎంతో ఉపయోగకరమైన ఈ పుస్తకం గురించి రాయాలనుకుంటూ ఉన్నా.. ఇవాళ మూడ్ కుదిరింది :) అప్పట్లో యోగా క్లాసెస్ కి వెళ్ళినప్పుడు పొద్దున్నే లీటర్ నీళ్ళు తాగే అలవాటు అయ్యింది. ఆ ఆసక్తి వల్ల ఈ పుస్తకం కొన్నాను. ఇంజినీర్, రచయిత అయిన ఏ.కె.హరి ఈ పుస్తకం రాసారు. మానవ జీవితంలో నీటి యొక్క ప్రాముఖ్యత గురించీ, నీళ్ళు తాగటం ఎంతో ఆరోగ్యకరం అనీ, ఆరోగ్యం బాగుండడానికీ, మెరుగుపడడానికీ నీళ్ళు తాగటం చాలా అవసరం అని రచయిత చెప్తారు. అందుకు రకరకాల ఉదాహరణలూ, ఏ రకమైన నీటిలో ఎంత ఎనర్జీ ఉంటుందో, ప్రపంచవ్యాప్తంగా నీళ్ళు తాగటం గురించి జరిగిన పరిశోధనలు మొదలైనవాటి గురించి వివరిస్తారు హరి గారు. మనం తాగే నీళ్లకు ఇంతటి శక్తి ఉందా అని ఆశ్చర్యం వేస్తుంది ఈ పుస్తకం చదివితే. 

"Having starved our body of nature's most precious liquid, water, we are beset with multiple ailments like headaches,arthritis,asthma,urinary problems, general debility, blood pressure etc. Missing the root cause of the problem, we rush to doctors - only to have antibiotics pumped into us that offer short-term 'relief' while turning into long-term nightmares." 

" The root cause of every disease is dehydration. Hydrate the body properly and you will recover without any medication."  అంటే మొక్క వాడిపోయిన కుండీలో నీళ్ళు పోస్తే ఎలాగైతే మళ్ళీ మొక్క చైతన్యవంతమైతుందో అలానే శరీరం కూడా సరిపడా నీరు అందితే బాగవుతుంది అంటారు ఆయన.

పుస్తకం లోని మరికొన్ని విశేషాలు:

* నీటిని ఒక క్రమ పధ్ధతిలో తాగుతూ ఉంటే మందులు అక్ఖర్లేకుండానే చాలా మటుకు రోగాలు నయమయిపోతాయి. వృధ్ధాప్యపు ఆనవాళ్లను కూడా నీరు తాగటం వల్ల దూరం చెయ్యగలం.

* శరీర బరువుని బట్టి ఎవరు ఎంత నీరు తాగాలి అన్నది నిర్ణయించుకోవాలి. సుమారు ఒకరు అరవై కేజీల బరువు ఉంటే, వాళ్ళు రోజులో కనీసం మూడున్నర లీటర్ల నీరు తాగాలి. పొద్దున్న లేవగానే 300ml, టఫిన్ కి అరగంట ముందు 300ml, భోజనానికి గంట ముందు 300ml, భోజనం మధ్యలో అస్సలు నీళ్ళు తాగకూడదు. (తప్పనిసరైతే కాసిని తాగచ్చు), భోజనం అయిన రెండున్నర గంటల తర్వాత 300ml, మళ్ళీ రాత్రి డిన్నర్ కి గంట ముందు, డిన్నర్ అయిన రెండున్నర గంటల తర్వాత 300ml తాగాలి. మధ్యలో కావాల్సినప్పుడు, రాత్రి పడుకునే తాగచ్చు. ఈ పధ్ధతి ప్రకారం చేస్తే ఎన్నో రోగాల నుండి బయటపడవచ్చుట. కానీ ఇదంతా ఫ్యామిలీ డాక్టర్ ని సంప్రదించి చెయ్యాలి.

* జలపాతాల్లో, పారే నదుల్లోనూ ఎక్కువ జీవశక్తి ఉంటుంది. ఏ ప్రాణినయినా సంపూర్ణ ఆరోగ్యవంతంగా చేయగల శక్తి ఈ జలపాతాల తాలుకూ నీటికి, ప్రవహించే నదుల్లోని నీటికీ ఉంది. రకరకాల పైపుల ద్వారా ఆ నీరు మన ఇళ్ళకి చేరేసరికీ అందులోని జీవశక్తి పూర్తిగా నశించిపోతుంది. నదీ స్నానాలకి అందుకే ఎంతో ప్రాధాన్యత ఉంది. 

* ఆగమశాస్త్రాల్లో మన పూర్వీకులు దేవతా విగ్రహాలకు వాడే రాళ్లను గురించి చెప్తారు. కొన్ని రాళ్లపై నీళ్ళు పోసినప్పుడు, ఆ నీరు బ్యాక్టీరియా రహితంగా మారి, మరింత ఎనర్జీని పొందుతుందిట. విగ్రహాలకు అభిషేకాలు చేసేప్పుడు శంఖంలోంచి పోసేవారు. శంఖంలో పోస్తే నీటికి ఎనర్జీ వస్తుంది. అది మళ్ళీ ప్రత్యేకమైన రాయితో తయారు చేసిన విగ్రహాల పై నుండి జారి మరింత శక్తివంతం అవుతుంది. అటువంటి జీవశక్తి గల నీటిని తీర్థ రూపంలో కాస్తైనా పుచ్చుకోవటం ఎంతో మంచిది. తీర్థ మిచ్చేప్పుడు చదివే మంత్రం,  (ప్రథమం కార్య సిథ్యర్థం, ద్వితీయం ధర్మ సిధ్యర్థం, తృతీయం మోక్షమాప్నోతి) + దేవతా విగ్రహం అభిషేకించిన నీళ్ళు రెండూ కలిసి భక్తునికి ఎంతో శక్తినిస్తాయి.

* సంధ్యావందనం  పూర్వం నది ఒడ్డున చేసేవారు. ప్రవహించే నదిలోని జీవశక్తి కాక, నీటితో శరీరంలోని రకరకాల చోట్ల తాకటం ’రీకీ’ లాంటి ప్రక్రియే, అది శరీరాన్ని ఎంతో శక్తివంతం చేస్తుంది. సంధ్య చేసే మూడు కాలాలు కూడా ఎంతో ముఖ్యమైనవి. ప్రకృతిలోని శక్తంతా సంపూర్ణంగా ఉండే సమయాలు అవి.






Dr.Fereydoon batmanghelidj అనే డాక్టర్ గారు నీటి వాడకం, ఉపయోగాలను గురించి చేసిన ప్రయోగాలను ఒక చాప్టర్ లో చెప్తారు హరి గారు. అందులో వారి వెబ్సైట్  కూడా ఇచ్చారు. ఆ వెబ్సైట్ లొ ఏ ఏ అనారోగ్యాలకు నీటి వాడకం పనిచెస్తుందో చెప్పారు ఆ డాక్టర్ గారు. ఇదే ఆ లింక్:
http://www.watercure.com/wondersofwater.html


నెట్లో ఈ పుస్తకం వివరాలకై వెతికితే, పుస్తకం తాలూకూ 29pages preview ఉన్న లింక్ ఒకటి దొరికింది. ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ తప్పక చదవండి:
http://books.google.co.in/books?id=JwhTgUMqeVoC&printsec=frontcover#v=onepage&q&f=false


11yrs క్రితం నే కొన్న ఈ పుస్తకం ఇప్పుడు షాపుల్లో దొరుకుతోందో లేదో తెలీదు కానీ amazon.com లో ఈ పుస్తకం అందుబాటులో ఉంది:
http://www.amazon.com/Water-Miracle-Therapy-R-Hari/dp/9381384800


***

అదండి సంగతి ! కాబట్టి అందరూ నీళ్ళు బాగా తాగటం మొదలుపెట్టండి. భోజనానికి మధ్యన ఎక్కువ నీళ్ళు తాగకండి, భోజనo అయ్యాకా కనీసం గంట తర్వాత నీళ్ళు తాగటానికి ప్రయత్నించండి. చక్కని ఆరోగ్యాన్ని, జీవశక్తినీ సొంతం చేసుకోండి. 


Tuesday, April 16, 2013

శరత్ పూర్ణిమ



అభిమానులెవరైనా "ఏమండీ ఈ మధ్య మీరేమీ రాయడం లేదే?" అని అడిగితే "ఏం, ఎందుకు రాయాలి? పద్యం రాస్తే విశ్వనాథతో సమానంగా, లిరిక్ రాస్తే కృష్ణ శాస్త్రి స్థాయిలో, గేయం రాస్తే శ్రీశ్రీ లాగా, వచనం రాస్తే వేలూరి, శ్రీపాదల్లాగా, కథలు రాస్తే చలం లాగా రాయగలిగినప్పుడే రాస్తాను. అలా రాయలేనప్పుడు అస్త్రసన్యాసం చేసి హాయిగా చదువుతూ కూచుంటాను" అని జవాబు చెప్పేవారుట. ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ, అద్దం మీద ఆవగింజలా అందకుండా జారిపోయే చాతుర్యం వారి స్వార్జితమట. 

ఇంతకీ వారెవరూ..... అంటే, మిత్రులతో రుక్కాయి, జలాలుద్దీన్ రూమీ, రుక్కుటేశ్వరుడు అని పిలిపించుకుంటూనే, జయంతి కుమార స్వామి, వెల్లటూరి సోమనాథం, చలికాలం మార్తాండరావు.. ఇలా లెఖ్ఖలేనన్ని మారుపేర్లు పెట్టుకున్న బహుముఖప్రజ్ఞాశాలి జలసూత్రం రుక్మిణీనాథశాస్త్రి ! పేరడీ శాస్త్రి, జరుక్ శాస్త్రి గా పేరొంది, సాహిత్యాభిమానుల అభిమానాన్ని దండిగా పొందిన మహా మనీషి! అయితే ఇన్ని మారుపేర్లతో రాయటం వల్లనే చాలా రచనలు వెలుగులోకి రాలేకపోయాయని అంటారు. 


శ్రీశ్రీగారిలా అన్నారుట "నిజమైన పేరడి ఒరిజినల్ ను జ్ఞాపకం తెస్తుంది. మాతృకలాగనే ఉంటూ అర్థాన్ని లఘువు చేస్తూ అపహసిస్తూ తల్లివేలితో తల్లికన్నే పొడిచేలా రూపొందే రచనాపత్రికను 'పేరడీ' అనవచ్చు. అలా పేరడీలు రచించడంలో జలసూత్రం రుక్మిణీశానాథశాస్త్రి సిధ్ధహస్తుడు." అని.

తాను రాసిన పేరడీల వల్ల "పేరడీశాస్త్రి" అని పేరుపొందినా, జీవించిన ఏభైనాలుగేళ్ళలో ఎన్నో రకాల రచనలు చేసారు. కథలు, నాటికలూ, విమర్శలూ, కవిత్వం అన్నింటా వారి ప్రవేశం ఉంది. జరుక్ శాస్త్రి గారి కథల సంకలనమే "శరత్ పూర్ణిమ". 1981లో ప్రధమ ముద్రణ అయ్యింది .మళ్ళీ ఇన్నాళ్ళకి ఈ జనవరిలో రెండవ ముద్రణ వెలువడింది. 




1981లో "శరత్ పూర్ణిమ", 1982 లో "జరుక్ శాస్త్రి పేరడీలు" వచ్చాకా, వారి నాటికలు,వ్యాసాలు,వచన రచనలు,సమీక్షలు మూడవ సంపుటిగా వస్తే శాస్త్రి గారి పూర్ణవ్యక్తిత్వానికి సూర్యలోకం కలుగుతుందని రమణారెడ్డిగారు పేరడీలు పుస్తకం ముందుమాటలో అన్నారు. అదే పుస్తకంలో ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి గారు రాసిన "జలసూత్రం అంతస్సూత్రం" లో జరుక్ శాస్త్రి గారి గురించి చెప్పిన విశేషాలు ఆసక్తికరంగా ఉంటాయి. రుక్ గారు సంస్కృతం,తెలుగు,ఇంగ్లీషు సాహిత్యాలు కలగలిపి మాట్లాడేవారుట. ఆ సాహిత్య దాహానికి అంతులేదుట. సాహిత్యం మీద అంత ప్రాణం పెట్టే మనిషి కనిపించరట. ఇక కొన్ని వాక్యాలు ఇక్కడ యథాతథం దించకపోతే నాకు తోచదు..
"మంచి కథలు(కొంచమైనా) వ్రాశాడు.
కణకణాలాడే పేరడీలు చేశాడు.
చుర్రుమనే పద్యాలు పలికాడు.
గొప్ప వ్యాసాలు రాసాడు.
విశ్వనాథ మీద వ్యాసం అతడే వ్రాయగలడనిపించాడు. శ్రీ సుబ్రహ్మణ్య శాస్త్రి గారి 'అనుభవాలు-జ్ఞాపకాలు' చదివి చారిత్రాత్మకమైన ఉత్తరం వ్రాసాడు.
కంకంటి-తిక్కన ఉత్తర రామాయణాల గురించి చేసిన తులనాత్మక ప్రసంగం అతని విమర్శనా నైశిత్యానికి నిదర్శనం.
సాహిత్యమే తిండి అదే పాన్పు అదే పానీయము. కానీ దేని మీదా స్థిరంగా నిలబడక, ఏదీ సమృధ్ధిగా ఇవ్వక ఆకస్మికంగా తెర వెనుకకు వెళ్పోయాడు. చెప్పినంత వరకూ, వ్రాసినంత మేరకు తనది తనదిగా ముద్ర వేసి పోయాడు."

'సాహిత్యమే తిండి అదే పాన్పు అదే పానీయము.' అంటే, eat books-drink books-sleep books అన్నమాట :-))
హనుమచ్ఛాస్త్రి గారి వాక్యాలు, పేరడీలు పుస్తకంలో జరుక్ గారి జీవన విశేషాలు చదివాకా ఆయనంటే అపారమైన గౌరవాభిమానాలు కలుగుతాయి పాఠకులకు. 


"జరుక్ శాస్త్రి పేరడీలు"  పుస్తకం చిన్నప్పటి నుండీ ఇంట్లో చూస్తున్నదే. "శరత్ పూర్ణిమ" మాత్రం ఈ మధ్యనే కొన్నాను. మొత్తం ఇరవై కథలున్న ఈ పుస్తకం పూర్తయ్యేసరికీ జరుక్ గారికి అభిమానినైపోయాను. వీరి మిగతా రచనలు మూడవ సంపుటిగా వస్తే చాలా బాగుంటుంది  కానీ వారి మారు పేర్ల సరదా వల్ల సాహిత్యాభిమానులకు అవి చేరలేవేమో! ఈ కథలే అతి కష్టం మీద సేకరించారుట నవోదయా పబ్లిషర్స్. ఇంత ప్రజ్ఞాశాలి రచనలు సాహితీలోకానికి సంపూర్ణంగా లభ్యం కాకపోవటం దురదృష్టకరమే!


'ఒక్క మెతుకు చూస్తే చాలు..' అన్నట్లు ఒక్క కథ చదవగానే వారి మేధస్సు ఎంతటిదో అర్థమైపోయింది. పుస్తకంలో నేను మొదట చదివిన కథ "ఒక్ఖ దణ్ణం". తర్వాత చివరి కథ "హోమగుండం" చదివాను. మనసంతా బరువెక్కిపోయింది. ఈ నరసమ్మ కథను దు:ఖ్ఖాంతం చెయ్యకుంటే బాగుండేది అని పదే పదే అనిపించింది. ఈ హాస్య వ్యంగ్య రచయితకు ఇంతటి ఆర్ద్రమైన కథలు రాసేంటటి మెత్తని మనసు ఉందని, ఆ మెత్తటి మనసు వెనకాల ఎంతటి బడబాగ్ని దాగి ఉండేదో కదా అనీ అనిపించింది ! అప్పట్లో స్త్రీలకు జరిగే అన్యాయాల పట్ల వారికెంతటి వ్యతిరేకత, సానుభూతి ఉండేవో అర్థం అయ్యింది. ఈ రెండు కథలూ పుస్తకంలో కెల్ల గొప్ప కథలు. అవి చదివాకా, స్త్రీ హృదయాన్ని ఈయన ఎంత బాగా అర్థం చేసుకున్నరో.. అనిపించక మానదు. 


కేవలం సంభాషణలతోనే కథంతా నడిచే "పెంకిపిల్ల" ఒక ప్రయోగమయితే, చక్కని అందమైన సంసారానికి ప్రతీక "శరత్ పూర్ణిమ". "యశోద" కథ తల్లి హృదయాన్ని తెలియచెప్పే interior monologue ! కవీంద్రుడు "రవీంద్రుడు" చనిపోయాకా రాసిన "నాలో నేను" డైరీలో ఒక పేజీలా ఉంది. టాగూర్ పట్ల ఆయనకెంత ప్రేమాభిమానాలున్నాయో చెబ్తుంది. టాగూరు 
"Do not go, my love, without asking my leave.
i have watched all night, and now my eyes heavy with sleep" అంటే, 

"ఏను నిద్దుర వోదునో, యేమొ, కరుణ
సెలవు గై కొనకేగగా వలదు; ఇన్ని
నాళ్ల యెడలేని యెడబాటు నా నిరీక్ష
ణమ్ము బరువులు బరువిలై నయన యుగళ
మయ్యొ దిగలాగు నిద్దర మరపులకును"
అని కృష్ణశాస్త్రి అన్నారుట.

ఇంకా.. బీదరికం, అనుమానం, స్వోత్కష, ప్రేమ, అహంకారం, దురాభిమానం, వ్యంగ్యం.. ఒకటేమిటి అన్ని రకాల సామాజిక, మానసిక అంశాలూ జరుక్ గారి కథాంశాలే ! ఒకో కథా ఒకో జీవితాంశాన్ని స్పృశిస్తుంది. ఆంగ్ల సాహిత్యంలో వీరికి ఉన్న అనుబంధ గాఢత కొన్ని కథల్లో మనకు కనిపిస్తుంది. ఈ కథల్లోని సరళమైన తెలుగు, సులువైన మాటలు, సూటైన వాక్యాలు, అక్షర సత్యాలు పాఠకహృదయాల్లో నిలిచిపోయాయి అనటం ఎంతమాత్రం అతిశయోక్తి కాదు.


ఈ కథల్లో నాకు బాగా నచ్చిన కొన్ని వాక్యాలు...

* ఈ ఆడపిల్లలది మరీ విచిత్రం. నీ దగ్గర నువ్వు అరచేతిలో ఆడిస్తూ, తల్లో పువ్వులాగ చూశినా సరే, ఎంత సొతంత్రo ఇచ్చినా సరే. పంజరంలో చిలకలగా ఉంటారు. పుట్టింటికంటూ వెళ్లారో - నీటిలో చేపల్లాగా తిరుగుతారు.

* వీరుడంటే..?
కత్తి పుచ్చుకుని కదనకుతూహల రాగం రైట్,లెఫ్ట్ చిందుల్లో రంగరిస్తు యుధ్ధరంగానికి పోయిన మగాడు...... పనిలోకి వెళ్ళిన వాడల్లా వీరుడే కత్తి పుచ్చుకోకపోయినా - గరితటెను గాండీవంలాగు పుచ్చుకున్నవాడూ? వీరుడే.

* ఈ కాస్త సుఖం గూడా భగవంతుడు దక్కనీడు. నాకు తెలుసు. చూస్తున్నాగా. ఏది తలపెట్టు - భగవంతుడూ ఎగస్పార్టీ?

* అడ్రస్ దొరుకుతుందేమో అని సూట్కేస్ అంతా గాలించాడు....అన్నీ తీశాడు. అవన్నీ మల్లెపూలలాగ పరిమళించడమే గాని, ఏమీ చెప్పవు. మల్లెపూలైనా మేలే - తర్వాత కథ చెబ్తే.

* స్వార్థం వల్లనేనేమో "లోకాస్సమస్తా స్సుఖినోభవంతు" అని నిత్యం కోరుకోటం...గడియారంలో ఈ చక్రం సరిగా తిరగాలంటే అవతలి అన్ని చక్రాలూ, అన్ని పళ్ళూ ఉండి సమంగా తిరిగితేనే గదా ఇది తిరగడం. మన తిప్పట కోసమే, మన సుఖం కోసమే, అందరినీ సుఖపడామంటున్నామేమో..

*తనలాగే అందరూ అనుకోవడం మానవస్వభావం. ఇది అమాయకత్వపు చిహ్నం. అమాయకత్వం యింకా ఎంత ప్రక్షాళన కాదో అంత సూటిదనం ఉంటుంది. పసిపిల్లల్లో ఇది మరీనూ. 

*పేచీ వస్తుందనుకున్న చోట పేచీ రాకపోవటం ఎంతో నిరాశను కలగిస్తుంది. ఎంతో ప్రేమైనా ఉండాలి; కావలసినంత అసహ్యం అన్నా వుండాలి పేచీ రాకపోవటానికి.

*వెలుతురూ,చీకటీ పోట్లాడుకుంటున్నై. బొద్దింకలు తప్పుకు పారిపోతున్నాయి, పొయ్యిలో మంతలు గమ్మత్తుగా లేస్తున్నై. అగ్నిహోత్రుడికీ, ఆలోచనలకీ సయోధ్యల్లేవుంది. జ్వాలలు ఆదుతున్న కొద్ది ఆలొచనలు ఆడుతై.

*ప్రేమ ఉంటే ఏమైనా అనవచ్చు. పడవచ్చు గానీ, ప్రేమ కరువైన చోట 'ఆc' అంటం అన్యాయం. 'నారాయణా' బూతుమాటే !

* కొన్ని ప్రాణాలు సంతోషించటానికీ, సుఖపడటానికీ పుట్తవు. సంఘానికై వెంపరలాడతాయి గానీ, సుఖమ్ అనేది దక్కదు. ఆరాటమే మిగుల్తుంది.

*సాటి మనిషిని హింసించి, హింసించి చంపి, ఎన్ని యజ్ఞాలు చేస్తే ఏం...

*ఆకాశానా, యింట్లో, మాలో. మృతమౌనం! సప్తమహర్షులు పక్కన. సీరియస్ నాలోలాగా నిమిషనిమిషం రంగులు మారుస్తోంది. దూరాన కుజుడు మునిగోఇంట పువ్వులాగ.

*ఈ ఋషులు మౌనంగా ఉంటారు గానీ, ఎలా ఉంటారో... రాళ్ళలాగ, చెట్లలాగా.

* మన ఆశయాలు, అభిరుచులు ఎంత ఉన్నతాలైనా సరే - చేతిలో దబ్బులేకపోతే మనం ఏమీ సాధించలేం.

* నీ ప్రేమ ఎంత మధురమైనదో, నీ జాలి అంత బాధాకరం..

*"ఇదిగో బాయ్..అండీ గిండీ జాంతా నై. మనం భాయీ అంటే..భాయీ. లౌకిక మర్యాదలు వొద్దు. శుష్క ప్రియాలు వొద్దు. హృదయాలు విప్పి మాట్లాడుకుందాం."
నాకు వికరంతో కూడిన నవ్వు వచ్చింది. ఇలా లోగడ నేను చవకగా హృదయం విప్పి, విప్పమనీ అన్నప్పుడల్లా ఎందరు నవ్వుకున్నారో?

*పళ్ళాల చప్పుడులోనూ, మాలాంటివాళ్ళ బాతాఖానీ మహాభాష్యపురొదలో కళకళాలాడుతున్న వెయ్యి సంతర్పణల గలాభాలో అక్కడక్కడ వినబడుతోంది.

*ప్రేమా - సింగినాదం జీలకర్రాను; తోటి మనుష్యులా?జలగలు! తెలీకుండా నెత్తురు పిలుస్తారు! స్వేచ్ఛా..? ఆఘప్రసూనాలు తలలో తురుముకోడం; ఆశా? - కన్నీటిబొట్టుపైని సూర్యకిరణం తెప్పించే ఇంద్రధనువు! ఎందుకులెండి ఇప్పుడు వాటి స్మరణ - మీ పనేదో మీరు చూసుకోండి!!

* వెధవ నాగరికత. ఉన్నదున్నట్లు అని బతకలేమాయె.

*లోని నిజం పైకి చెబితే - విషం కాదా?

* ...నవ్వాను. ఆ ఒక్కనవ్వూ నా జీవితాన్నంతనూ పట్టి ఇవ్వవచ్చు.

* "దాందుంపతెగా - కళ్లకనపట్టం భయమాయె. తే. తే. ఎక్కణ్ణుంచి తెస్తారు? కుప్పలు పోసుక్కూర్చున్నారా? ఇలా సతాయించే బదులు ఏ అచ్చాఫీసులోనైన్నా పని కుదుర్చుకోరాదు? దేశబాధ తప్పుతుందీ. ధనుకులు, ధనికులు! వీళ్ల దుంపతెగా - పని చూపించి తిండి పెట్టే బదులు, కోర్తి కోసం - బిచ్చం వేసి - పొమ్మంటారు. ఈ దోపిడీగాళ్ళు జట్టుని తయారుచేసింది మహాదాతలే."

*మనసుకు నొప్పి కలక్కపోతే - మనం ముందుకు పోం. చలిమిడి సుద్దగా ఉన్నట్టుగానే ఉంటాం: మానవ మానసికవేదనకు ఖరీదు లేదు, నిజం. తల్లీ, తండ్రీ, భార్య, స్నేహితులు, సంఘం కట్టుకట్టి పోరి మొహాన వుమ్మేసి గెంటకపోతే, మానవమాత్రుడు సంపాదనకు దిగడు. సోమరిపోతు ఔతాడు నిజం.

* "మార్పు లేని మజా లేని, విశ్రాంతి గృహం ఆ స్వర్గం! నేను అనేది సమృధ్ధిగా వుండి ఏదో సాధించడానికి వీలైన స్థలo వొదులుతావు, ఎంత పిచ్చివాడవయ్యా నాయనా !"




Monday, April 15, 2013

అది ఒక ఇదిలే.. అతనికె తగులే..



తెలుగువాడు, మనవాడు అని మనం గర్వించదగ్గ గొప్ప గాయకుల్లో ఒకరు 
శ్రీ పి.బి. శ్రీనివాస్. నిన్న మరణించారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన కాకినాడ కు చెందిన పి.బి. శ్రీనివాస్ గారి పూర్వీకులు "పసలపూడి" గ్రామానికి చెందినవారని వికీ చెప్తోంది. దక్షిణాది భాషల్లోనే కాక హిందీ లో కూడా పాటలు పాడిన శ్రీ పి.బి. శ్రీనివాస్ ఎనిమిది భాషల్లో బహుభాషా కోవిదుడు. తెలుగులో బోలెడు గజల్స్ కూడా రాసారు. తెలుగులో కంటే తమిళంలో జెమినీ గణేశన్ కూ, కన్నడంలో రాజ్ కుమార్ కూ ఎక్కువ సినిమా పాటలు పాడిన నేపధ్యగాయకుడు. పి.బి.శ్రీనివాస్ సినీ ప్రస్థానం ఒక హిందీ చిత్రం ద్వారా మొదలైంది. ఎంతో ప్రఖ్యాతి గాంచి ఇతర రాష్ట్రాల, దేశాల ద్వారా అవార్డులు పొందిన ఈ గాయకునికి మన రాష్ట్రప్రభుత్వం ద్వారా ప్రత్యేక పురస్కారాలేమీ అందకపోవటం బాధాకరం.


తనదైన ఒక ప్రత్యేకతను, ముద్రను పొందిన పి.బి గానాన్ని ఇట్టే గుర్తుపట్టగలం మనం. బాధ, ఆనందం, హాస్యం..ఇలా ఏ రకమైన అనుభూతినయినా అవలీలగా ఒలికించగల బహుముఖప్రజ్ఞాశాలి పి.బి. అటువంటి ప్రత్యేకమైన కొన్ని పి.బి పాటలను ఇవాళ ఆయన జ్ఞాపకాలుగా గుర్తు చేసుకుందాం.. ఆయన పాడిన కొన్ని వందల పాటల్లో కొన్నింటిని ఎంపిక చేయటం కష్టమే అయినా నాకు బాగా తెలిసిన కొన్ని పి.బి పాటలను ఈ టపాలో సమావేశపరిచే ప్రయత్నం చేస్తాను.


1968 లో Neil Armstrong చంద్రుడి మీద కాలు పెట్టాకా, శ్రీ పి.బి.శ్రీనివాస్ గారు రెండు పాటలు రాసి, వాటిని సంగీత దర్శకులు ఏం.ఎస్.శ్రీరాం గారు స్వరపరచగా, ఓ గ్రామ్ఫోన్ రికార్డ్(45 RPM)ను 1970లో రిలీజ్ చేసారు. బి.రాథాకృష్ణ గారు ఈ గ్రామ్ఫోన్ రికార్డ్ స్పాన్సర్ చేసారు. ఈ రికార్డ్ లో ఒక వైపు పి.బి. సోలో "Man to Moon", రెండో వైపు ఎస్.జానకి తో కలిసి పాడిన "Moon to God" అనే పాట ఉంటాయి. ఈ రికార్డ్ ను ఆయన Armstrong కు, అప్పటి అమెరిన్ ప్రెసిడెంట్ కు పంపగా, అమెరిన్ ప్రెసిడెంట్ వద్ద నుండి జవాబు కూడా వచ్చిందట. ఎం.ఎస్. శ్రీరాం గారు నాన్నగారికి స్వయంగా ఇచ్చిన ఈ రికార్డ్ కాపీ ఒకటి మా ఇంట్లో ఉండేది. ఇప్పుడు కూడా నాన్నగారి వద్ద ఉంది. గ్రామ్ఫోన్ రికార్డ్ లోంచి ఎం.పి ౩ చేసాకా త్వరలో అది కూడా వినిపిస్తాను.


పి.బి. డ్యూయెట్స్ లో నాకు బాగా ఇష్టమైనదీ పాట. ప్రేమించి చూడులో "అది ఒక ఇదిలే" ! ఈ పాట "Bésame Mucho" అనే Spanish song నుంచి ఇస్పైర్ అయ్యింది. ఈచిత్రంలో మిగిలిన పి.బి. పాటలు(బుచ్చబ్బాయ్ పని కావాలోయ్, మీ అందాల చేత్రులు కందేను పాపం, వెన్నెల రేయి) ఇక్కడ వినవచ్చు: 
http://gaana.com/music-album/preminchi-choodu-14747 

1) పాట: అది ఒక ఇదిలే 
సంగీతం: మాష్టర్ వేణు 
రచన: ఆత్రేయ

 


2) "చౌదవీ కా చాంద్ హొ" అనే ప్రఖ్యాత హిందీ పాట బాణీని "మదనకామరాజు కథ" చిత్రానికి వాడుకున్నారు. "నీలి మేఘమాలవో నీలాల తారవో" అనే ఈ పాటను అద్భుతంగా పాడారు పి.బి. 
జి.కె.మూర్తి రచన, 
సంగీతం: రాజన్ నాగేంద్ర 

   

 3) ఈ పాట సాహిత్యం చాలా బావుంటుంది.. 
"తనువుకెన్ని గాయాలైనా మాసిపోవునేలాగైనా 
మనసుకొక్క గాయమైనా మాసిపోదు చితిలోనైనా.." 

చిత్రం: ఆడ బ్రతుకు 
రచన: ఆత్రేయ 
సంగీతం: విశ్వనాథన్ రామ్మూర్తి


   


4) ఓహో గులాబి బాలా 
చిత్రం: మంచి మనిషి 
రచన: సి.నారాయన రెడ్డి 
సంగీతం: ఎస్.రాజేశ్వరరావు

   


5) "మనసులోని కోరిక తెలుసు నీకు ప్రేమికా.." 
భీష్మ 
ఆరుద్ర 
ఎస్.రాజేశ్వరరావు

   


6) "ఆడబ్రతుకు" సినిమాలొ ఆత్రేయ పాట 
"బుజ్జి బుజ్జి పాపాయి 
 బుల్లి బుల్లి పాపాయి 
నీ బోసి నవ్వులలో 
పూచే పున్నమి వెన్నెల లోనే "

 

7) ప్రఖ్యాత హిందీచిత్రం "దిల్ ఏక్ మందిర్ " ఆధారంగా తీసిన "మనసే మందిరం" చిత్రంలోని ఈ సాహిత్యం కూడా ఆత్రేయ గారిదే ! 
 "తలచినదే జరిగినదా దైవం ఎందులకు 
జరిగినదే తలచితివా శాంతి లేదు నీకు" 

 సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్ 
చిత్రం: మనసే మందిరం 
http://www.raaga.com/play/?id=356479 


8) పి.బి. పాటల్లో నాకు బాగా నచ్చే మరో పాట "ఇంటికి దీపం ఇల్లాలు" చిత్రంలో 
" ఎవరికి ఎవరు కాపలా" బంధాలన్నీ నీకేలా 
 రచన: ఆత్రేయ 
సంగీతం: విశ్వనాథన్ రామ్మూర్తి 
http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=18317 


9) చిగురాకుల ఊయలలో 
అనిశెట్టి 
ఆర్.గోవర్ధన్ 
కాన్స్టేబుల్ కూతురు


 


10) వెన్నెలకేలా నాపై కోపం 
ఆర్.గోవర్ధన్ 
కాన్స్టేబుల్ కూతురు


 

11)  "కాన్స్టేబుల్ కూతురు" లోదె మరో పాట.. 
రచన: ఆత్రేయ 
"పూవు వలే విరిబూయవలె 
నీ నవ్వు వలే వెలుగీయవలె 
తావి వలే మురిపించవలలె 
మనమెవ్వరము మరిపించవలె "
http://www.raaga.com/play/?id=356478


12) "ఋణానుబంధం" సినిమాలో ఎస్.జానకి తో కలిసి పాడిన "అందమైన బావా ఆవుపాలకోవా" హాస్య గీతం చాలా సరదాగా ఉంటుంది. 
రచన: సముద్రాల జూనియర్ 
సంగీతం: పి.ఆదినారాయణరావు http://www.sakhiyaa.com/runanubandham-1960-%E0%B1%A0%E0%B0%A3%E0%B0%BE%E0%B0%A8%E0%B1%81%E0%B0%AC%E0%B0%82%E0%B0%A7%E0%B0%82/ 



13) "దేవా.. లోకములోని చీకటులన్నీ తొలగించే వెలుగువు నీవే.." 
రచన: దాశరథి 
చిత్రం: అత్తగారు కొత్తకోడలు 
http://www.raaga.com/play/?id=235587 


14) అనురాగము ఒలికే ఈ రేయి 
మనసారగ కోర్కెలు తీరేయి 

చిత్రం: రాణీ రత్నప్రభ 
కొసరాజు 
ఎస్.రాజేశ్వరరావు 
http://www.sakhiyaa.com/rani-ratnaprabha-1960-%E0%B0%B0%E0%B0%BE%E0%B0%A3%E0%B0%BF-%E0%B0%B0%E0%B0%A4%E0%B1%8D%E0%B0%A8%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%AD/ 


15) శ్రీకృష్ణ పాండవీయం"లో పి.బి. పాడిన పోతన పద్యం "నల్లనివాడు..పద్మనయనంబులవాడు కృపారసంబు పై జల్లెడువాడు" క్రింద లింక్ లో ఆ పద్యం వినవచ్చు: 
http://www.sakhiyaa.com/sri-krishna-pandaveeyam-1966-%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B0%E0%B1%80-%E0%B0%95%E0%B1%83%E0%B0%B7%E0%B1%8D%E0%B0%A3-%E0%B0%AA%E0%B0%BE%E0%B0%82%E0%B0%A1%E0%B0%B5%E0%B1%80%E0%B0%AF%E0%B0%82/ 


16) "అసాధ్యుడు" చిత్రంలో "చిట్టెమ్మా చిన్నమ్మా చూడవమ్మా, నన్ను అవునన్నా కాదన్నా వీడనమ్మా నిన్ను" 

 సంగీతం: టి.చలపతిరావు 
రచన: సి.నారాయణ రెడ్డి 
http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=3005 


17) రామసుగుణధామ రఘురామసుగుణధామ 
దశరథరామ తారకనామ రవికులసోమా రాజచంద్రమా 
చిత్రం: మాయామశ్చీంద్ర 
సంగీతం: సత్యం 
రచన: దాశరథి 
http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=8368 


18) "అందాల ఓ చిలకా "
movie: లేత మనసులు

 













19) "రంగుల రాట్నం" సినిమాలో నారాయణ రెడ్డి రాసిన ఈ పాట కూడా బావుంటుంది. 
"మనసు మనసు కలిసే వేళ మౌనమేలనే ఓ చలియా 
కలలు నిలిచి పలికే వేళ పలుకలేనురా చెలికాడా.. 
కన్నుల దాగిన అనురాగం పెదవులపై విరబుయాలి 
పెదవులకందని అనురాగం మదిలో గానం చెయాలి 
http://mp3scorner.com/download-rangula-raatnam-1966-old-telugu-mp3-songs/ 



20) "అందమంటే నువ్వే ఆనందమంటే నువ్వే 
నువ్వంటే నువ్వే నీవంటిది నువ్వే నువ్వే "

lyrics: ఆత్రేయ 
movie: ఇల్లాలు 
http://www.sakhiyaa.com/illalu-1965-%E0%B0%87%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81/



21)  "పవ మన్నిపు" అనే తమిళ సినిమాలో పి.బి.శ్రినివాస్ కు ఎంతో పేరు తెచ్చిన పాట.."Kalangalil Aval Vasantham". కణ్ణాదాసన్ రాసారు. తెలుగులో ఈ చిత్రాన్ని "పాప పరిహారం" అనే పేరుతో డబ్బింగ్ చేసారు.

 

22) "మంటలు రేపే నెలరాజా.. ఈ తుంటరితనము నీకేలా" అని "రాము" సినిమాలో ఘంటసాల పాడిన పాటను తమిళంలో పి.బి పాడారు. 
ఆ పాట :

 


పి.బి ఎక్కడ ఉన్నా ఇంత చక్కని పాటల రూపంలో వారు మన మధ్యనే ఎప్పటికీ చిరస్మరణీయులై ఉంటారు. 

ఎవరికి ఎవరు కాపలా..




పి.బి. శ్రీనివాస్ పాడిన సోలో పాటల్లో ఆత్రేయ రాసిన "ఎవరికి ఎవరు కాపలా" గీతం నాకు బాగా నచ్చుతుంది...



ఈ పాటను ఇక్కడ వినవచ్చు:
http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=18317


movie: ఇంటికి దీపం ఇల్లాలు
lyrics: ఆత్రేయ
music: విశ్వనాథన్ రామ్మూర్తి


lyrics:
ప: ఎవరికి ఎవరు కాపలా
 బంధాలన్నీ నీకేలా
 ఈ బంధాలన్నీ నీకేలా

 1చ: తనువుకు ప్రాణం కాపలా
 మనిషికి మనసే కాపలా
 తనువును వదిలి తరలే వేళ
 మన మంచే మనకు కాపలా

 2చ: కంటికి రెప్పు కాపలా
 కలిమికి ధర్మం కాపలా
 కలిమి సర్వము తొలిగిన వేళ (2)
 పెట్టినదేరా గట్టి కాపలా

 3చ: చిన్నతనాన తల్లి కాపలా
 వయసున వలచిన వారు కాపలా
 ఎవరి ప్రేమకున నోచని వేళ
 కన్నీరేరా నీకు కాపలా



Saturday, April 6, 2013

వ్యంగ్యాత్మక హాస్యం - JOLLY LLB





ప్రేక్షకులకి రెండో ఆలోచనను రానివ్వకుండా చివరిదాకా వాళ్ల ఆసక్తిని పట్టి ఉంచగలిగిన ప్రతి సినిమా మంచి సినిమానే! అలాంటి మంచి సినిమా ఒకటి ఇవాళ చూసాం. దర్శకుడిగా మారిన ఒకప్పటి జర్నలిస్ట్ 'సుభాష్ కపూర్' తీసిన "JOLLY LLB". ఇది అతని మూడవ సినిమా. కథ, దర్శకత్వం రెండూ సుభాష్ కపూర్ వే. ఎక్కువ భాగం కోర్ట్ లోనే నడిచే ఈ సినిమాను కోర్ట్ రూం కామెడీ అనవచ్చు. ఈ చిత్రం హాస్యప్రధానమైనదే కానీ ఆ హాస్యం ముసుగుతో వ్యవస్థలోని లోటుపాట్లను, పేదల పట్ల ధనిక వర్గాల దాష్టీకం మొదలైవవాటిని ఎత్తిచూపే వ్యంగ్యాత్మక చిత్రం ఇది. 

అర్షాద్ వర్సి, బొమన్ ఇరానీ, సౌరభ్ షుక్లా ముగ్గురూ కూడా అత్యుత్తమ నటన చూపెట్టారు. ముఖ్యంగా జడ్జీ పాత్రలో సౌరభ్ షుక్లా నాకు భలేగా నచ్చాడు. అర్షాద్ వర్సి "జాలీ" పాత్రలో ఇమిడిపోయినా, ఇటువంటి పాత్ర కాస్తంత ముందుగా వచ్చిఉంటే బావుండేదేమో అనిపించింది. ఎందుకంటే హీరోయిన్ అమృతా రావు అసలే సన్నమేమో, ఆమె పక్కన మరీ పెద్దగా కనిపించాడు. చక్కనినటి అయిన అమృత కి పెద్ద పాత్ర ఏమి లేదు :( బొమన్ ఇరాని గురించి ప్రత్యేకంగా చెప్పేదేమీ లేదు. ఎటువంటి పాత్రలో అయినా ఇమిడిపోయే చక్కని నటుడు.


కథలోకి వస్తే జగ్దీష్ త్యాగీ(అర్షాద్ వర్సి) ఒక చిన్నపాటి లాయర్. అతని ప్రేమికురాలు స్కూల్ టీచర్ సంధ్య. ప్రఖ్యాత లాయర్ అవ్వాలన్నది అతని కలను నిజం చేసుకోవటం కోసం అతను ఢిల్లీ చేరతాడు. అక్కడ ఇంచుమించుగా మూసేసిన ఒక రోడ్ ఏక్సిడేంట్ కేసును తిరగతోడతాడు. మద్యం మత్తులో ఫుట్ పాత్ పై నిద్రిస్తున్న ఆరుగురు శ్రమజీవులపై కారు ఎక్కించిన ఒక డబ్బు, పలుకుబడి ఉన్న కుర్రవడిపై కేసు అది. ఆ కేసుపై PIL(public-interest litigation ) వేసి మళ్ళీ తెరిపిస్తాడు జగ్దీష్. ధనికవర్గం కుర్రాడి తరఫున దేశంలో అత్యంత పేరుప్రఖ్యాతలున్న లాయర్ తేజేందర్ రాజ్పాల్(బొమన్ ఇరాని) వాదిస్తుంటాడు. గెలవటానికి ఎటువంటి ఆధారం, ఆస్కారం రెండూ లేని ఈ కేసు తాలూకూ చిక్కుముడులన్నీ జగ్దీష్ త్యాగీ ఎలా విడతీసాడన్నది మిగిలిన సినిమా. 


ఇప్పుడేమి చేస్తాడా అనిపించేంత పెద్ద పెద్ద ఇబ్బందులు ఏమీ ఎదురవవు జగ్దీష్ కి. కానీ చక్కని స్క్రీన్ ప్లే, ఆలోచింపజేసే సంభాషణలు ఈ చిత్రంలో ముఖ్యమైన అంశాలు. ఒకటి రెండు అనవసరమైన పాటలు తప్ప ఎక్కడా విసుగు రాకుండా, ఆసక్తికరంగా మలుపులు తిరుగుతూ ముందుకు వెళ్తుంది కథ. కోర్ట్ సన్నివేశాలూ అందులో వాదోపవాదాలు ఎలా ఉంటాయి, డబ్బుకలవారిదే రాజ్యంగా మరిన వ్యవస్థలో ఎలాంటి లోటుపాట్లు ఉంటాయి, కొన్ని పోలీస్ నియామకాలు ఎలా జరుగుతాయి మొదలైన సంగతులు తెలుసుకోవాలంటే ఈ చిత్రం చూసి తీరాలి. 


కృష్ణ సంగీత దర్శకత్వంలో సినిమాలో ఒక పాటను బప్పీ లహరి పాడారు. 
http://www.youtube.com/watch?v=n_hlvIp8cds 

మోహిత్ చౌహాన్, శ్రేయా ఘోషాల్ పాడిన మరో సరదా పాట కాస్తంత ఇక్కడ:
   


ఈ సినిమా ట్రైలర్ ఇక్కడ: 
   


Thursday, April 4, 2013

"కవులమ్మ ఆడిదేనా?" కథా పరిచయం



"సారంగ సాహిత్య వారపత్రిక " లో నేను రాసిన కథా పరిచయం క్రింద లింక్ లో చదవవచ్చు:
http://www.saarangabooks.com/magazine/?tag=%E0%B0%A4%E0%B1%83%E0%B0%B7%E0%B1%8D%E0%B0%A3

తాయమ్మ కరుణ గారు రచించిన "కవులమ్మ ఆడిదేనా?" కథానికను కుడా అక్కడ చదవవచ్చు. నా కథాపరిచయాన్ని ప్రచురించిన సారంగ పత్రిక వారికి బ్లాగ్ముఖంగా ధన్యవాదాలు.


మొన్నొకరోజు "కొత్త పుస్తకాలు" టపాలో నవోదయా ఆయన ఒక పుస్తకం కొనమన్నారనీ, అందులో కథఒకటి చాలా బావుందన్నారని రాసా కదా.. ఆ కథే ఈ కథ..! ఈ కథ “మధురాంతకం రాజారాం సాహిత్య సంస్థ” ప్రచురించిన “కథావార్షిక 2004″ కథా సంకలనం లోనిది.


Wednesday, April 3, 2013

500 !






మేనెల చివరకి నాలుగేళ్లవుతాయి బ్లాగ్ మొదలుపెట్టి. నా జీవితంలో దాదాపు నాలుగేళ్ళ కాలాన్ని తన సంచీలో వేసేసుకుందీ బ్లాగ్లోకం :)
నాలుగేళ్ల ముందు దాకా నా జీవితం ఒక ఎత్తు. ఇక్కడ అడుగుపెట్టాకా మారిన జీవితం ఒక ఎత్తు ! 
ఈ నలభై ఆరు నెలల్లో ఎన్నో మార్పులు వచ్చాయి నా జీవితంలో... ఆరోగ్యంలో.. మనస్తత్వంలో... !!
ఏదెలా జరిగినా, నేను ఎప్పుడూ - ఎప్పటికీ నమ్మేది ఒక్కటే... "ఏది జరిగినా మన మంచికే" అని. 

ఈ బ్లాగ్జీవనయానంలో, జీవితపు ఒడిదొడుకుల మధ్యన నాకు ఆటవిడుపుని అందించిన ప్రత్యేక నేస్తం నా "తృష్ణ". నాలో జరుగుతూ వచ్చిన మార్పులకి ఒక స్పెక్టేటర్ అన్నమాట. 

"ఈ బ్లాగ్ నా సొంతం. నాకు తోచిన రాతలు రాసుకుంటాను.." అని ఆనందించినంత సేపు పట్టలేదు ఇక్కడ కూడా జీవితంలో మాదిరి ఎంత చీకటి దాగుందో తెలియటానికి. బ్లాగ్లోకంలో ఆనందించిన క్షణాల కన్నా నేర్చుకున్న పాఠాలే ఎక్కువ. ఇక్కడందరు మంచివాళ్ళే! కానీ మంచివాళ్ళు ఇన్నిరకాలుగా  ఉంటారని ఇక్కడే తెలిసింది ! 

ఏదేమైనా నా లోకం నాది. నా లోకంలోకి తొంగి చూసే అవకాశాన్ని మాత్రం నా బ్లాగ్ ద్వారా ఇస్తున్నాను. నచ్చితే చదవండి. లేకపోతే ముందుకి సాగిపొండి. ఈ టపాతో "తృష్ణ" బ్లాగ్లో 500 టపాలు పూర్తవుతాయి! ఎవరికైనా సమయం ఎంతో విలువైనది. నా సమయాన్ని వెచ్చించి రాసిన ఈ టపాలన్నీ మీ విలువైన సమయాన్ని వెచ్చించి చదివి, నన్ను ప్రోత్సహించిన బ్లాగ్మిత్రులకూ, శ్రేయోభిలాషులకూ హృదయపూర్వక ధన్యవాదాలు. 


Tuesday, April 2, 2013

"హమ్ నే దేఖీ హై.. "




హేమంత్ కుమార్ చిరస్మరణీయమైన నేపథ్యసంగీతాన్ని అందించిన "ఖామోషీ" సినిమాకు ప్రముఖ కవి, గేయ రచయిత "గుల్జార్" రాసిన పాటలు బహుళజనాదరణ పొందాయి. హేమంత్ స్వయంగా పాడిన "తుమ్ పుకార్ లో" హాంటింగ్ మెలొడీ ఐతే, "వో షామ్ కుచ్ అజీబ్ థీ", "దోస్త్ కహా కోయి తుమ్ సా.." , "ఆజ్ కి రాత్.." అనే చిన్ని కవితాగానం మూడూ కూడా సంగీతపరంగా, సాహిత్యపరంగా ఆకట్టుకుంటాయి. ఇవి కాక ప్రత్యేకంగా చెప్పుకోవల్సినది "హమ్ నే దేఖీ హై.. " గీతాన్ని గురించి. 

కథలో రోగి(అరుణ్)కి పూర్వ స్మృతి గుర్తుకు తెచ్చే ప్రయత్నంలో, నర్స్(రాధ) గతంలో అరుణ్ రాసిన ఈ పాటను వినిపిస్తుంది. ఈ పాటలో ప్రేమ యొక్క లక్షణాలను తెలిపే ప్రయత్నం చేస్తాడు కవి. లతా మంగేష్కర్ పాడిన అపురూపమైన గీతాల్లో ఒకటైన ఈ గీతార్థాన్ని ఈ నెల "వాకిలి" పత్రికలో చూడండి..
http://vaakili.com/patrika/?cat=28