సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Saturday, June 9, 2012

బాపు చిత్రకళా ప్రదర్శన 24-2-74



ఆ మధ్యన నాన్నగారి పుస్తకాలు సర్దుతూంటే ఈ ప్రత్యేక సంచిక దొరికింది. '74 లో రాజమండ్రి లో జరిగిన బాపూ బొమ్మల కొలువన్నమాట ! ఆ పుస్తకం ఇప్పుడు దొరకటం అరుదు కాబట్టి అందులోని చాలామటుకు చిత్రాలకు ఫోటోలు తీసాను బ్లాగ్మిత్రుల కోసం. క్రిందన ఉన్న ఆ చిత్రాలు మీరూ చూసి ఆనందించండి..




పుస్తకం ముందు భాగంలో ఆరుద్ర గారు రాసిన కవిత, శ్రీ ఎం.వీ.ఎల్ గారు బాపూ గారి గురించి రాసిన వ్యాసం కూడా ఫోటోల్లో పెడుతున్నాను. ఫోటో సైజ్ పెద్దగా చేసుకుని ఎం.వీ.ఎల్ గారి వ్యాసం చదవవచ్చు.





















Tuesday, June 5, 2012

Oats Oats...


ఈమధ్య అన్ని సూపర్మార్కెట్ల లో, చాలా మంది ఇళ్ళల్లో కనబడుతున్న Oatsను చూస్తుంటే "అంతా ఓట్స్ మయం..జగమంతా ఓట్స్ మయం..." అని పాడాలనిపిస్తూ ఉంటుంది నాకు. నా కాలేజీ చదివే రోజుల్లో చపాతీలే ఆరోగ్యకరం అని అంతా చపాతీల్లోకి దిగారు. రెండో పూట భోజనం మానేసి చాలా మంది చపాతీలు చేసుకునేవారు. అప్పట్లో రోటీ మేకర్లు విరివిగా అమ్ముడుపోయాయి. నంబర్ వన్ స్థానాన్ని కోల్పోయిన హీరోయినయిపోయింది చపాతీ. ఆ ప్లేస్ ని ఇప్పుడు ఓట్స్ భర్తీ చేసింది. ఇవి నిజంగా ఉపయోగకరమే కానీ మార్కెట్లో వస్తున్న రకరకాల ఓట్స్ చూస్తూంటే జనాలకి ఏ పిచ్చి పడితే పిచ్చే అన్నట్లుగా ఉంది పరిస్థితి.


మొదట్లో క్వేకర్స్ ఓట్స్ మాత్రం దొరికేవి. ఇప్పుడు ఐదారు రకాల ఓట్స్ పేకెట్లు బజార్లో లభ్యమౌతున్నాయి. కొన్ని కంపెనీలవాళ్ళు ఓట్స్ రెసీపీలు ఏకంగా వాళ్ల వెబ్సైట్స్ లో పెట్టేసారు. క్రింద ఉన్న "సఫోలా" వాళ్ల లింక్ లో ఏ వంటకం తాలూకూ బొమ్మపై క్లిక్ చెస్తే ఆ రెసిపీ నిమిషంలో మనకు కనబడుతుంది.
http://www.saffolalife.com/saffola-oats/do-more-with-saffola-natural-oats

క్రింద ఉన్న క్వేకర్స్ ఓట్స్ వాళ్ల లింక్లో ఏకంగా ఓట్స్ రెసిపిల పి.డిఎఫ్.ని డౌలోడ్ కి పెట్టేసారు.
http://www.quakeroats.com/cooking-and-recipes.aspx

కొన్ని ఓట్స్ పేకెట్లతో పాటూ రెసిపీ బుక్స్ ఉచితంగా అందజేస్తున్నారు. ఆ పుస్తకాల్లో అదీ ఇదీ అని లేదు.. ఇడ్లీ దగ్గర నుండీ లడ్డూ వరకూ అన్నీ ఓట్స్ తో చేసేస్కోండి..సింపుల్ అంటాడు. రెగులర్ గా కాకపోయినా అప్పుడప్పుడు నేను ఓట్స్ ఉప్మా తింటూంటాను. ఎవరికి తెలీకుండా కాస్త ఓట్స్ దోశల పిండిలో, చపాతి పిండిలో కలిపేస్తూ ఉంటాను..:) సరదాగా ఈ రెసిపి బుక్స్ లోంచి ఏవైనా ట్రై చెయ్యనా అంటే "తల్లీ, నీ ఓట్స్ కీ నీకూ ఓ దణ్ణం..నన్నొదిలెయ్..ఏం పెట్టినా తింటా ఈ ఓట్స్ తప్ప " అంటారు శ్రీవారు.



ఇప్పుడు చిన్న చిన్న 20gms ఓట్స్ పేకెట్లు వస్తున్నాయి. పొద్దున్నే పాలల్లో కలుపుకునేవీ, లేదా ఇన్స్టెంట్ ఉప్మా చేసుకునేవీ. వీటిలో కూడా రకరకాల ప్లేవర్లు. మసాలా, వెజిటబుల్, చిల్లీపెప్పర్ మొదలైన ఇన్స్ టెంట్ ఉప్మా రకాలు నాకంతగా నచ్చలేదు కానీ పాలల్లో కలుపుకునే పోరిడ్జ్ మిక్స్ లు నాకు బాగా నచ్చాయి. వాటిల్లో కేసర్, ఏపిల్ కిస్మిస్, స్ట్రాబెర్రీ ఇలా రకరకాల ఫ్లేవర్స్ ఉన్నాయి. పొద్దున్నే టీ, కాఫీ లేదా టిఫిన్ లేటయితే ఆకలి వేయకుండా ఈ చిన్నపేకెట్ అర గ్లాసుడు పాలల్లో వేసుకుని తినేయచ్చు. కాస్త ఆకలి ఆగుతుంది. ఆ వేసుకునే అరగ్లాసుడూ డైట్ పాలు అయితే ఇంకా మంచిది.


 
ఏదైనా నచ్చితే మనం తింటే పర్వాలేదు. కానీ ఇంట్లో అందరూ అదే తినాలంటే కష్టం కదా. మా కజిన్ వాళ్ల ఆఫీసులో బాసుగారికి బొజ్జెక్కువైందని వాళ్ళావిడ ఇంట్లో అందరికీ ఓట్స్ మాత్రమే టిఫిన్ పెడుతుందిట. సాయంత్రం కూడా ఓట్స్ టిఫినేట. ఆయన ఇంట్లో విధేయంగా ఓట్స్ తినేసొచ్చి, ఆఫీసులో ఎవరు దొరికితే వాళ్ళని అలా సమోసా తినొద్దాం వస్తావా? అని తీస్కెళ్ళి బయట దొరికిన నానారకాలూ తినేసి, తినిపించేసి వచ్చేస్తుంటాడుట. సాయంత్రం వాళ్ళావిడకు ఫోన్ చేసి "డార్లింగ్ బోలెడు ఆకలివేసేస్తోందిరా... పొద్దున్న నువ్వు పెట్టిన టిఫినే.. ఇంకేమీ తిన్లేదు.." అంటాడుట. పాపం వాళ్ళావిడ నమ్మేస్తూ ఉంటుందిట. మా కజిన్ కలిసినప్పుడల్లా ఆ బాసు గురించి చెప్పనూ నవ్వనూ..:) నెయ్యి వాడకం కూడా మాననివారు సైతం పాలల్లో ఓట్స్, మజ్జిగలో ఓట్స్ వేసుకుని తాగేయ్యటం ఆశ్చర్యకరమైనా ఇది ఖచ్చితంగా ఓట్స్ వ్యాపారస్తుల ప్రకటనాఫలితమే.


ఫైబర్ ఎక్కువగా ఉండే ఈ ఓట్స్ ఆరోగ్యానికి మంచివే. ఓట్స్ తింటే సన్నబడటం నిజమే కావచ్చు కానీ ఓట్స్ మాత్రమే శరీరాన్ని ఆరోగ్యమయం చేసేస్తాయన్నది కేవలం భ్రమ. వ్యాపార చిట్కా అంటే. ఆహార నియమాలతో పాటూ శరీరానికి వ్యాయామం కూడా అవసరమన్న సంగతి ఓట్స్ ని అమ్మేవాళ్ళూ, వాటిని నమ్ముకున్నవాళ్ళు మరిచిపోతున్నారేమో !!








Saturday, June 2, 2012

Songs of Cliff Richard



ప్రఖ్యాత బ్రిటిష్ పాప్ గాయకుడు
క్లిఫ్ రిచార్డ్(Cliff Richard) పేరు తెలియని వారు ఉండరు. గాయకుడు, స్వరకర్త, నటుడు, మానవతావాది అయిన క్లిఫ్ రిచార్డ్ పాటంటే చెవికోసుకునేవారు అరవైల్లో కుర్రకారు. పాట పాడటంలో అతనిది ఒక విలక్షణమైన శైలి. అతని మెత్తనిగళం నుండి జాలువారిన ఏ పాటైనా జనాదరణ పొందేసేదిట అప్పటి రోజుల్లో. చిన్నప్పుడు నాన్న కేసెట్ పెట్టుకుని వింటుంటే మేం కూడా తనతో పాటే శ్రధ్ధగా అతని పాటలు వింటూ ఉండేవాళ్ళం.

ప్రఖ్యాతి గాంచిన క్లిఫ్ రిచార్డ్ పాడిన మెస్మరైజింగ్ పాటలు కొన్ని...


1)Evergreen tree



--------

2)congratulations


-------------

3)fall in love with you



-----------

4) The twelfth of never


------------

5) miss you nights


-------------
6) spanish harlem


----------

7)we don't talk anymore



-----------------

8)the bachelor boy


---------------------

9)all my love




-------------------

10)Constantly

Wednesday, May 30, 2012

నీరాజనం(1988)

1988లో వచ్చిన "నీరాజనం" సినిమాలో పాటలన్నీ ఇప్పటికీ గుర్తుండిపోయేంత మధురంగా ట్యూన్ చేసారు ఓ.పి.నయ్యర్. ఈ సినిమాలో ఏ పాట వింటున్నా మొత్తం ఇంటర్లూడ్ మ్యూజిక్ తో సహా మనం పాడేసుకునేంత దగ్గరయిపోయాయీ పాటలు. నేనీ సినిమా ఇంతవరకూ చూడలేదు కానీ పాటలన్నీ కంఠస్థం. పాటలు హిట్ అయ్యాకా చివరలో శ్రీ ఎమ్.ఎస్.రామారావు గారితో మళ్ళీ ఓ పాట పాడించారు అని గుర్తు. అందుకే మొదటి కేసెట్ ఎడిషన్ లో ఈ పాట ఉండదు. ఈ పాట విడిగా రికార్డ్ చేసుకున్నాం మేము అప్పట్లో.

కేసెట్ లో అన్ని పాటలు ఒక ఎత్తు ఐతే "
ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధంలో " పాట ఒక ఎత్తు. నాకు చాలా ఇష్టమైన పాటల్లో ఇదీ ఒకటి. నిజంగా షాజహాన్ అంత హాయిగా నిదురించాడో లేదో తెలీదు కానీ ఈ పాట వింటున్నంత సేపు మనం మాత్రం హాయిగా సేదతీరుతాము.



ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధంలో
నిదురించు జహాపనా..



పండు వెన్నెల్లో వెండీ కొండల్లే
తాజ్మహల్ ధవళ కాంతుల్లో
నిదురించు జహాపనా నిదురించు జహాపనా ..



నీ జీవితజ్యోతీ నీ మధురమూర్తి
ముంతాజ్ సతిసమాధి సమీపాన
నిదురించూ జహాపనా..
ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధంలో
నిదురించు జహాపనా..

----------------


ప్రేమ వెలిసింది మనసులోనే మౌన దేవతలా
ప్రేమ కురిసింది కనుల ముందే నిండు దీవనలా







------------------

మమతే మధురం మరపే శిశిరం
ఎదకూ విధికీ జరిగే సమరం..



-------------------

ఘల్లు ఘల్లున గుండె ఝల్లునా
పిల్లఈడు తుళ్ళిపడ్డదీ
మనసుతీరగా మాటలాడక మౌనం ఎందుకన్నదీ




-------------------

మనసొక మధుకలశం
పగిలే వరకే అది నిత్యసుందరం
మరిచిన మమతొకటి
మరి మరి పిలిచినది
ఒక తియ్యనీ పరితాపమై




---------------------

నాప్రేమకే శలవు నా దారికే శలవు
కాలానికే శలవు దైవానికే శలవు
ఈ శూన్యం నా గమ్యం ఈ జన్మకే శలవు
మదిలోని రూపం మొదలంట చెరిపి
మనసారా ఏడ్చానులే ((నాప్రేమకే))

కనరాని కసితీర కుదిపి కడుపారా నవ్వానులే
అనుకున్న దీవి అది ఎండమావి
ఆ నీరు జలతారులే
నను నీడ తానే ననువీడగానే
మిగిలింది కన్నీరులే ((నాప్రేమకే))



---------

నిను చూడక నేనుండలేను
ఈ జన్మలో మరి ఆ జన్మలో
ఇక ఏజన్మ కైనా ఇలాగే..





----------------

మమతే మధురం మరపే శిశిరం
ఎదకూ విధికీ జరిగే సమరం



------------------


ఇంకా "ఊహల ఊయలలో", "నేనే సాక్ష్యాము", "నీ వదనం విరిసే కమలం" పాటలు దొరకలేదు...:(
కానీ రాగా.కాం లింక్ లో మొత్తం పది పాటలూ వినచ్చు:






Tuesday, May 29, 2012

ऎ दिलॆ नादान..


కొన్ని పాటలు వింటూంటే మనకు తెలియకుండానే ఆ ట్యూన్ కి మనం ట్యూన్ అయిపోతాం. అలా మనల్ని తన లోకంలోకి తిసుకువెళ్పోయే ఈ పాట "రజియా సుల్తానా" సినిమా లోని "ఏ దిలే నాదాన్..". ఖయ్యాం సమకూర్చిన అద్భుతమైన సంగీతం ఈ పాట సాహిత్యపు అందాన్ని ఇంకా పెంచుతుంది. మొదట్లో వినిపించే సంతూర్, ధుమ్.. ధమ్.. అని వినిపించే ఢోలక్(?), మధ్య మధ్య వినిపించే సెకెన్ నిశ్శబ్దం మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాయి.



movie: Razia Sultan(1983)
singer : Lata Mangeshkar
music: khaiyyam
lyrics: jan nisar akhtar

Lyrics:

ऎ दिलॆ नादान
आरजू क्या है
जुस्तजु क्या है

हम भटकतॆ है ..क्यॊं भटकतॆ है
दश्ता-ऒ-सेहरा मॆं
ऐसा लगता है .. मौज प्यासी है
अपनी दरिया मॆं
कैसी उल्झन है..क्यॊं यॆ उल्झन है..
एक साया सा रूबरु क्या है
ऎ दिलॆ नादान(२)



क्या कयामत है..क्या मुसीबत है
केह नही सकतॆ..किस्का अरमा है
जिंन्दजी जैसॆ खॊयी खॊयी है
हैरा हैरा है..
यॆ जमी चुप है..आस्मा चुप है
फिर ये धड्कन सी चारसू क्या है
ऎ दिलॆ नादान(२)




Monday, May 28, 2012

పుచ్చా పూర్ణానందం గారూ - మీసాల సొగసులు



ఒకప్పుడు మనకున్న అతితక్కువ హాస్య రచయితల్లో ఒకరు పుచ్చా పూర్ణానందంగారు. మేము వారిని పూర్ణానందంతాతగారు అనేవాళ్ళం. విజయవాడలో పేరుమోసిన లాయరైన వీరు నటులు, హాస్యరచయిత కూడానూ. పూర్ణానందం గారి అల్లుడు శ్రీ జె.వి.నారయణమూర్తిగారు నాన్నకు ప్రాణ స్నేహితుడు. ఇప్పటికి ఏభైఏళ్ళు వాళ్ల స్నేహానికి. ముందర అలా పూర్ణానందంగారు పరిచయంట. తర్వాత నాన్న రేడియోలో చేరాకా వారితో స్నేహం బలపడిందిట. విజయవాడలో వాళ్ళ పెద్దబ్బాయి ఇల్లు మా ఇంటి దగ్గర ఉండేది. వాళ్ళ అబ్బాయి ఇంటికి వెళ్ళినప్పుడల్లా అటువైపే ఉన్న మా ఇంటికి వస్తూండేవారు పూర్ణానందంతాతగారు మా చిన్నప్పుడు. అప్పటికి గుబురు మీసాల తాతగారిలానే తెలుసు. పూర్ణానందం గారు గొప్ప హాస్య రచయిత అనీ, ఎంతో సాహితీవిజ్ఞానం గల సరస్వతీపుత్రులని పెద్దయ్యాకా వారి పుస్తకాలు చదివాకా కానీ తెలీలేదు. "మీసాల సొగసులు" ఇంకా 'ఆవకాయ - అమరత్వం', ’ఆషాఢపట్టి’ మొదలైనవి వీరి ప్రముఖ రచనలు. జంధ్యాల సినిమాలైన ఆనందభైరవి, రెండు రెళ్ళు ఆరు, హైహై నాయికా, శ్రీవారి శోభనం మొదలైన సినిమాల్లో కూడా నటించారు.





విజయవాడ ఆకాశవాణి కోసం ఆయన రాసి, చదివిన హాస్య ప్రసంగాలను ఒకచోట చేర్చిన పుస్తకమే "మీసాల సొగసులు". అన్నింటికన్నా ముందు ఈ పుస్తకానికి వారు రాసిన మున్నుడి(ముందుమాట) చాలా బావుంటుంది. మనిషి జీవితంలో హాస్యం ఎంత ప్రధానమైనదో, హాస్యం వాల్ల కలిగే ఉపయోగాలేమిటో..అన్నింటి గురించీ ఎందరో మహానుభావుల ఆంగ్ల ఉల్లేఖనాలతో చక్కగా చెప్తారు పూర్ణానందంగారు. పుస్తకం చదువుతుంటే సార్ధక నామధేయులు అనిపించకమానదు. మొత్తం పదిహేను వ్యాసాలు ఉన్న ఈ పుస్తకంలో ప్రతి వ్యాసం కూడా ఒక విజ్ఞానగని అనిపిస్తుంది నాకు. వ్యాసాల్లో ఉదహరించిన పద్యాలూ, ప్రాచీన కవుల,రచయితల ఉల్లేఖనాలు.. అన్నీ కూడా వారికున్న విద్వత్తునీ, సాహితీ జ్ఞానాన్నీ తెలుపుతాయి. తాంబూలమ్, అతిథుల బెడద, పిల్లి ఎదురొచ్చింది, కాకిగోల, నల్లకోటు, భార్యతో బజారుకెళ్ళకు - మొదలైన ఈ వ్యాసాల పేర్లన్నీ కూడా హాస్యభరితమైనవే. ఈ పుస్తకం ముఖ చిత్రం బాపూ వేసినది. పుస్తకంలోని బొమ్మలు వేసినది కార్టునిస్ట్ శ్రీ బాలి. పుస్తకంలో అక్కడక్కడా చెప్పిన కొన్ని జోక్స్ క్రింద రాస్తున్నాను.. భలే ఉంటాయి..

1) ఒక శిష్యుడు గురువుగారిని భోజనానికి పిలిచాడట. ఎందుకో అతని గయ్యాళి పెళ్ళానికి పులుసుకుండ అతని నెత్తినకొట్టి పగులకొట్టి, కుండ ఖరీదు కుడా ఇమ్మన్నదట.అప్పుడా గురువుగారు
"భాండాని శతసహస్రం భగ్నాని మమ మస్తకే,
అహో గుణవతి భార్యా భాండమూల్యంన యాచతే"
అన్నాడట.
అంటే 'నా నెత్తిన లక్ష కుండలు పగిలాయి కానీ, మా ఆవిడే గుణవంతురాలు,కుండ ఖరీదు అడగలేదూ అని.


2)ఓ గృహస్తు తనని కుమ్మిందని కోపం వచ్చి వాళ్ల పాడి ఆవుని అమ్మేసాడుట భార్య ఊళ్ళో లేనప్పుడు. వాళ్లావిడ వచ్చాకా "ఇదేమిటండి,కొమ్ము విసిరినంత మాత్రాన రెండుపూటలా పాలిచ్చి ఇల్లు గడుపుతున్న పాడిగేదెను అమ్ముకుంటారా? నేను మీతో సర్దుకుపోవటం లేదు?" అందట.


3)పండక్కి వచ్చిన కొత్త అల్లుడ్ని అత్తగారు, "నాయనా, భోజనం పొద్దు పోతుందేమో. అరిశెలు,మినపసున్నుందలూ తీసుకుంటావా?పిల్లలతో చద్ది అన్నం తింటావా? లేదా మీ మామగారి దేవతార్చన అయ్యేసరికీ పన్నెండు దాటుతుండి..వారి పంక్తిన భోంచేస్తావా? అని అడిగితే, "అత్తగారు, మూడూ చేస్తాను" అన్నాడట.


4)ఒక పిచ్చాసుపత్రి సూపరింటెండెంట్ ఓ విజిటర్ కి హాస్పటల్ చూపిస్తున్నాడట.వీళ్ళు వెళ్ళిన చోటికల్లా ఓ ఆడమనిషి వచ్చి చేతులు ఊపుతూ,భయంకరమైన చూపులతో వెంబడిస్తోందట. అప్పుడా విజిటర్ "ఏమండి, ఈమె కొత్త పేషంతా? వాలకం చూస్తే భయమేసేలా ఉంది..ఈమెపై మీకు కంట్రొలు లేదా? " అనడిగాడుట.
అప్పుడు సూపరింటేండెంట్ "లేదండి" అన్నాడుట. విజిటర్ ఏం? అని ప్రశ్నించాడుట..
"ఆమె నా భార్యండి" అన్నాడుట సూపరింటేండెంట్.


*************************************************


"మీసాల సొగసులు" పుస్తకంలో ప్రతీ వ్యాసానికి మొదట్లో ఒక కార్టూన్ ఉంది. ఆ కార్టూన్లు చాలా బాగున్నాయి. వ్యాసాల సారాంశం తెలపటం కన్నా ఈ కార్టూన్లు పెడితే బావుంటుందనిపించింది నాకు. మొత్తం పదిహేను కార్టూన్లు చూసి ఆనందించండి..

































*** *** ***


రేడియోకి పూర్ణానందంగారు చదివిన ఈ పుస్తకంలోని వ్యాసాలు రెండింటిని ఆయన సొంత గళంలో ఇక్కడ వినేయండి:

తాంబూలమ్ :


పిల్లి ఎదురొచ్చింది:


*** *** ***

పూర్ణానందంగారి శత జయంతి సందర్భంగా శ్రీ సుధామ గారు రాసిన వ్యాసం ఇక్కడ చూడవచ్చు.






Thursday, May 24, 2012

"రజనీ ఆత్మకథా విభావరి" - రెండు మంచి ప్రసంగాలు



రేడియో చరిత్ర తెలిసిన నిన్నటితరం వారందరికీ
శ్రీ బాలాంత్రపు రజనీకాంతరావు గారు చిరపరిచితులు. సహస్రచంద్ర దర్శన సౌభాగ్యం కలిగిన వీరు వేంకట పార్వతీశకవులలో ఒకరైన శ్రీ వేంకటరవుగారి కుమారులు. రజనిగారి గొప్పతనం గురించి నేనెంత చెప్పినా చంద్రునికో నూలుపోగు చందానే ఉంటుంది. అంతటి అత్యుత్తమ ప్రతిభాశాలి మన తెలుగువారవ్వటం మన అదృష్టం. ఆయన ఏ బెంగాలీవారో అయ్యుంటే ఇంతకు నాలుగురెట్లు ఆయన ప్రతిభకు తగ్గ గుర్తింపు వచ్చి ఉండేదేమో కూడా..! నా దృష్టిలో రజని గారి సేవలను అందుకున్న "ఆకాశవాణి" అదృష్టవంతురాలు. రేడియోలో ఉదయం ప్రసారమయ్యే "భక్తిరంజని"ని వీరి పేరున "భక్తరజని" అనేవారంటే అందుకు వారి కృషే కారణం. ఇక లలిత సంగీతానికీ, గేయరూపకాలకూ రజనిగారి చేసిన సేవ అనంతం. ఒక్కమాటలో చెప్పాలంటే సంగీతసాహిత్యాలు ఆయన ఉఛ్వాసనిశ్వాసాలు ! సంగీతంలో ఎన్నో రకాల పరిశోధనలూ, ప్రయోగాలు చేసారు. రజనిగారు రవీంద్రసంగీతాల్ని తెలుగులోకి అనువదించి, స్వరపరిచిన విశేషాలు, వారికి సంగీత నాటక అకాడమీ వాళ్ళు చెన్నై లో "టాగూర్ రత్న అవార్డు " ఇచ్చిన విషయం సంగీతప్రియ బ్లాగ్లో ekla chalo re పాట గురించి రాసినప్పుడు రాసాను.


రజని గారి గురించిన మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకోవచ్చు:
http://en.wikipedia.org/wiki/Balantrapu_Rajanikanta_Rao




కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్న
"ఆంధ్ర వాగ్గేయకారుల చరిత్ర", "శతపత్ర సుందరి", "మువ్వగోపాలపదావళీ", పిల్లల కోసం రాసిన "జేజిమావయ్య పాటలు" మొదలైనవి రజనిగారు సాహిత్య ప్రపంచానికి అందించిన కలికితురాయిలు. "కొండ నుండి కదలి దాకా" అని గోదావరీనది మీద రజనిగారు చేసిన సంగీత రూపకం జపాన్ దేశ పురస్కారాన్ని అందుకుంది. ఇంతటి గొప్ప వ్యక్తి తన స్వీయచరిత్రను ఇంత ఆలస్యంగా రాయటమేమిటో అని ఆశ్చర్యం వేసినా ఇప్పటికైనా వారు పుస్తకం రాసినందుకు చాలా సంతోషించాను నేను.


ఈ ఏటి ఉగాది నాడు(23-3-12) రజనిగారి స్వీయ చరిత్ర "రజనీ ఆత్మకథా విభావరి" సభాముఖంగా విడుదల చేసారు. పుస్తకంలో రజనిగారు తన బాల్యం, పిఠాపురం కవిపండితులు, రేడియో అనుబంధాలు అనుభవాలూ; సాలూరి రాజేశ్వరరావు, శ్రీ గోపీచంద్, బాల సరస్వతి, ఓలేటి, చలం, విశ్వనాథ, శ్రీపాద పినాకపాణి మొదలైన మహామహులతో తనకున్న జ్ఞాపకాలు, తన రచనలు, సత్కారాలూ పురస్కారాలు మొదలైన అంశాలను గురించి తెలిపారు. రేడియో పట్ల ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరూ కొని దాచుకోవాల్సిన పుస్తకం ఇది.

ఎంతో వైభవంగా జరిగిన ఈ పుస్తకావిష్కరణ సభ తాలూకూ ఆడియో వీడియోలు నేను విని, చూడటం జరిగింది. అందులో ఇద్దరు వక్తల ప్రసంగాలు విని నేనెంతో ముగ్ధురాలినయ్యాను. శ్రీ గొల్లపూడి మారుతీరావుగారు, శ్రీ పన్నాల సుబ్రహ్మణ్య భట్టు గారూ తమ ప్రసంగాల్లో ఎన్నో కబుర్లను, విశేషాలనూ తెలిపారు. అవి బ్లాగ్మిత్రులకు అందించాలని ఈ టపా...! వీడియో పెట్టడం కష్టమైనందువల్ల ఆడియో మాత్రం అందించగలుగుతున్నాను. ఈ ప్రసంగం విని గొల్లపూడి గారు "గొప్ప వక్త" అని మరోసారి అనుకున్నాను.



గొల్లపూడి మారుతీరావుగారి ప్రసంగం:




భట్టుగారి ప్రసంగం:




చిన్ననాటి నుండీ ఇంట్లో మనిషిలాగ రజనిగారి చుట్టు తిరిగగలగటం, ఇవాళ ఆయన స్వీయచరిత్రను గురించి బ్లాగ్లో రాయ గలగటం నా అదృష్టంగా భావిస్తున్నాను.


ఈ పుస్తకం కాపీల కోసం అడ్రస్:

సత్యం ఆఫ్సెట్ ఇంప్రింట్స్
బృందావనం,డో.నం.49-28-5,
మధురానగర్, విశాఖపట్నం -16.
ph-0891-2735878,9849996538


Wednesday, May 23, 2012

"అప్పుడప్పుడు"



దర్శకుడు చంద్ర సిధ్ధార్థ తీసిన "అప్పుడప్పుడు" సినిమా ఆడలేదు కానీ ఆర్.పి.పట్నాయక్ సంగీతం సమకూర్చిన పాటలు బావుంటాయి. అప్పట్లో SSmusic channel లో విజె గా చేసిన శ్రియ రెడ్డి, రాజా('ఆనంద్'ఫేం) ఈ సినిమాలో ప్రధాననటులు. సిడి మీద గీతరచయితలుగా చైతన్య ప్రసాద్, పెద్దాడ మూర్తి పేర్లు ఉంటాయి కానీ ఏ పాట ఎవరు రాసారో తెలీదు..:(

మొత్తం ఆరు పాటల్లో నాలుగు పాటలు నాకు బాగా నచ్చుతాయి. పిక్చరైజేషన్ కూడా అంతగా బావుండదు కానీ వినటానికీ పాటలు బావుంటాయి.


1) ఇదిగో ఇపుడేపెరిగిన ప్రేమో
ఆర్.పి, ఉష




------------------

2)నీ కలలు కావాలి
ఆర్.పి, సునీత




-------------------
3) నీకెంతెల్సు
ఆర్.పి, ఉష




---------------------

4) గుడుగుడు గుంచెం
ఉష,లెనిన్,గాయత్రి,రవివర్మ








Monday, May 21, 2012

కొండఫలం


"మంచి కథ రాసిన తర్వాత ఒక పూలతోటని పెంచి పూలు పూయించినంత ఆనందం కలుగుతుంది" అంటారు వీరలక్ష్మి గారు. పుస్తకం .నెట్ కి నేను రాసిన మొదటి వ్యాసం వాడ్రేవు వీరలక్ష్మిగారి పుస్తకం “ఆకులో ఆకునై….” (http://pustakam.net/?p=2204) అప్పుడు ఈ కథల పుస్తకం గురించి తెలీదు. మొన్నటి పుస్తకప్రదర్శనలో కనబడితే కొనుక్కున్నా. ఇటీవలి కాలంలో నేను చదివిన పుస్తకాలన్నింటిలోకీ బాగా ఆస్వాదించిన పుస్తకం ఇది. కొన్ని రచనలు చదివినప్పుడు ఆ రచయిత ఎవరో మనకి తెలియకపోయినా అవి మన హృదయానికి దగ్గరగా అనిపిస్తాయి. బహుశా మన ఆలోచనల్లో తిరగాడే కొన్ని భావాలకు, అభిప్రాయాలకు భావ సారూప్యం ఉన్న రచనను చదివితే కలిగే ఆనందం ఆ దగ్గరతనానికి కారణం కావచ్చు. అలాంటి దగ్గరితనాన్ని నాకు ఈ "కొండఫలం" కథలు అందించాయి. రచయిత్రి పట్ల అభిమానాన్ని మరింత పెంచాయి.

"నేను చూస్తున్న జీవితంలోని సమస్యల మూలాలను వివరించే ప్రయత్నం నా కథల రూపంలో చేసాను" అంటారు రచయిత్రి. ప్రపంచీకరణ వల్ల సమాజంలో తగ్గిపోతున్న మానవీయ విలువలను నిలబెట్టాల్సినవారు కవులు రచయితలే అనీ, తన ఆలోచన కూడా అదే అని, ఆ విషయమై ఇంకా కథలు రావాల్సి ఉందని వాడ్రేవు వీరలక్ష్మి గారు తన 'ముందుమాట'లో అంటారు. స్త్రీ వాదాన్ని సమగ్రంగా అర్ధం చేసుకోగలిగితే స్త్రీపురుషుల జీవితాలు ఎంతో ఉన్నతంగా మారగలవనీ, ఒక వంద సంవత్సరాల పాటు ఈ విషయమై కథలు,నవలలు వస్తే తప్ప స్త్రీపురుషుల మధ్య ఉన్న అసమానతలు తీరవంటారు ఆవిడ.

ఈ పుస్తకంలోని కథలన్నీ ఎనభై,తొంభైలలో వివిధ పత్రికలలో ప్రచురితమైనవే. "కొండఫలం"లో మొత్తం పన్నెండు కథలు ఉన్నాయి. తన అభిమాన రచయిత్రి ఇంటికి వచ్చిన ఒక అమ్మాయి కథ "ఒక రాత్రి గడవాలి". ఆవిడ రచనలు చదివి తాను ఊహించుకున్నట్లుగా కాక ఒక సాధారణ గృహిణి బాధ్యతలు నెరవేస్తున్న తన అభిమాన రచయిత్రిని చూసి అంతవరకు తెలియని ఎన్నో విషయాలతో పాటూ జీవన విధానంలో స్వేచ్ఛ ఎంత ముఖ్యమో తెలుసుకుంటుంది వినీల. గిరిజనుల భూమి సమస్య, వాటివల్ల గిరిజన మహిళలు ఎదుర్కుంటున్న సమస్యలు ఇతివృత్తంగా తీసుకున్న కథ "కొండఫలం". ఇదీ, ఇలాంటి గిరిజన నేపథ్యంలో సాగే "బినామీ" కథా, మరో గిరిజన స్త్రీ కథ "పేరెంట్" మూడూ చదువుతూంటే నాకు వంశీ రాసిన "
మన్యంరాణి" గుర్తుకు వచ్చింది.





ప్రపంచీకరణ వల్ల స్వాతంత్ర్య దినోత్సవమంత ఉధృతమైన ఉద్యమంగా మారిన ప్రేమికుల దినోత్సవం గురించీ, ఇటువంటి దినోత్సవాల ఆకర్షణ వల్ల యువత ఎలా తప్పటడుగు వేస్తోందో తెలియచెప్పే కథ "ప్రేమికుల దినం". ప్రేమ వివాహం చేసుకుని, సంసారంలో ఎదురైన ఒడిదొడుకులను తట్టుకుని, తన అస్థిత్వాన్ని కాపాడుకంటూ, జీవితాన్ని ఒక ఉపయోగకరమైన పనివైపు నిర్దేశించుకున్న ఒక ఉద్యోగిని కథ "జ్ఞానప్రసూన". వివేక్ ఎదురుచూసీ, వెంటపడి పెళ్ళి చేసుకున్న తృషిత తన వైవాహిక జీవితంలో నేర్చుకున్న జీవితపాఠాలు గురించిన కథ "తృషిత" అయితే, ప్రేమవివాహం చేసుకుని ఒకరికొకరు అర్థంకాకున్నా ఒకరినొకరు వదలలేక సంఘర్షణతోనే బ్రతికేస్తున్న మరో జంట సమీర-ప్రమోద్ ల కథ "తెలుసుకొనవె యువతా..."
మావయ్య ఇంట్లో వంటమనిషీ పనిమనిషీ అయిన సత్యవతి ఆత్మవిశ్వాసం, చిన్నప్పుడు కుటుంబం కోసం తన అమ్మమ్మ పడ్డ కష్టాల వెనుక ఉన్న మనోధైర్యం, విలాసవంతమైన జీవితం గడిపే వదిన సువర్చల, రోడ్డు మీద చెప్పులు కుట్టుకునే వృత్తి చేసుకుంటున్న స్త్రీ పట్ల ఆశ్చర్యం - వీటన్నింటి గురించీ ఆలోచిస్తూ, ఎవరినీ కాదనలేని తన బలహీనమైన స్వభావాన్ని తరచుకునే ఒక యువతిలో జరిగే మనసికసంఘర్షణ "ఆ పిలుపు ఇంకా అందలేదు" కథానిక. "కూటి కోసం కూలి కోసం" కథ రకరకాల ఉద్యోగాలు చేసే యువతుల సంఘర్షణ, అమ్మ నుంచి 'అనిమిష' నేర్చుకున్న జీవిత పాఠాలేమిటో తెలుపుతుంది.

ఈ పుస్తకంలో అన్నింటికన్నా నాకు బాగా నచ్చిన కథ "ఇలా... ఉన్నాం". డాక్టర్లు, కార్పొరేట్ ఆసుపత్రుల పనితీరు; ఇంకా కొలీగ్ శారద, పక్కింటి విజయ, పనిమనిషి నూకాలమ్మా, ఆమె కూతురు రామలక్ష్మి నుండి లలిత ఏం నేర్చుకుందో తెలుసుకోవాలంటే ఈ కథ చదవాల్సిందే. ఈ కథలో లలితకు వ్యక్తపరిచే సందేహాలూ, ప్రశ్నలు ప్రతిఒక్కరూ తమలో తాము వేసుకునేవేనేమో అనిపిస్తాయి.

పుస్తకంలో కథలన్నీ విభిన్న అంశాలను స్పృశించినా, స్త్రీవాద కథలు అనిపించినా, అంతర్లీనంగా ఇవన్నీ సమకాలీన సమాజంపై రచయిత ఎక్కుపెట్టిన బాణాలు అనిపించింది నాకు. చక్కని శైలి, రచన ద్వారా చెప్పదలుచుకున్న విషయంపై స్పష్టత, అందమైన భావాలు, సున్నితమైన అంశాలపై ప్రశ్నలు ఇవన్నీ ఈ పుస్తకాన్ని ఆద్యంతం చదివించేలా చేస్తాయి. "The pen is mightier than the sword" అన్న వాక్యాన్ని బలపరిచేలా మనలోని ఆలోచనలను ప్రభావితం చేయగల శక్తి ఉన్న వీరలక్ష్మి గారి కలం నుండి ఇంకా ఎన్నెన్నో ఆలోచనాత్మకమైన కథలు, వీలైతే నవలలు చదివే అవకాశం రావాలని ఈ పుస్తకం చదువుతున్నంత సేపూ అనిపించింది.

Thursday, May 10, 2012

ఏక్లా చలో రే... ఒకడవే పదవోయ్ !


రవీంద్రగీతాల్లో చాలా ప్రఖ్యాతి గాంచిన పాట " ఏక్లా చలో రే... ". ఉదాసీనంగా ఉన్నప్పుడు ఎంతో ఉత్తేజాన్నీ, ఉత్సాహాన్నీ ఇచ్చే ఈ పాట నాకు చాలా ఇష్టం. ఈ గీతాన్ని తెలుగులోకి అనువదించినవారు శ్రీ రజనీకాంతరావుగారు. సంగీతానికీ,సాహిత్యానికీ,రేడియోకీ వీరు చేసిన సేవ అనంతమైనది. వీరికి సంగీత నాటక అకాడమీ వాళ్ళు గతవారం చెన్నై లో "టాగూర్ రత్న అవార్డు " ఇచ్చారు.



మొన్న ఉగాదినాడు రజనిగారి స్వీయ చరిత్ర "రజనీ ఆత్మకథా విభావరి" సభాముఖంగా విడుదల చేసారు కూడా. నా పేరుకి రజనిగారు రాసిన ఒక పాటే ప్రేరణ అని నాన్న చెప్తూంటారు. నాన్న వారికి అత్యంత సన్నిహితులవ్వటం, తద్వారా అంతటి గొప్ప వ్యక్తి గురించి మాకు బాగా తెలియటం నా అదృష్టంగా భావిస్తాను.

రజని గారి గురించిన మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకోవచ్చు:
http://en.wikipedia.org/wiki/Balantrapu_Rajanikanta_Rao


ఇంతకీ ఈ ఏక్లా చలో పాట అనువాదం వెనుక కథ ఏంటంటే . రజనిగారు 1961 లో టాగూర్ సెంటినరీ సెలబ్రేషన్స్( 1861- 1961) సందర్భంగా కలకత్తా వెళ్ళి రవీంద్ర సంగీతం పాటలు కొన్నింటి నొటేషన్స్ రాసుకుని వచ్చి, హైదరాబాద్లో వాటికి తాన అనువాదాలతో పాటూ మల్లవరపు విశ్వేశ్వర్రావుగారు, డా.బెజవాడ గోపాలరెడ్డి తదితరులతో అనువాదాలు చేయించి, నొటేషన్స్ ఉన్నాయి కాబట్టి ఈ తెలుగు అనువాదక రవీంద్రగీతాలను రవీంద్రుడు కూర్చిన అవే బాణీలలో ఆకాశవాణిలో రికార్డ్ చేసారు. ఎక్లా చలో పాటను "ఎవరూ కేక విని రాకపోయినా" అంటూ రజని గారు అనువదిస్తే, చిత్తరంజన్ గారి సోదరి శాంతాచారి గారు పాడారు. క్రింద లింక్ లో ఆ పాట వినవచ్చు..



Evaru keka vini raakapoyinaa.ravindrasangeetam by Trishnaventa

ఎవరూ కేక విని రాకపోయినా సరే ఒకడవే పదవోయ్
అపుడు ఒక్కడవే ఒక్కడవే ఒక్కడవే ఒకడవే పదవోయ్

మరుమాట లేకున్నా ఓరీ..ఓ అభాగ్యుడా మరి మాటలేకున్నా
మరి భయము చెంది జనమంతా పెడమొగమైనా
నీ మనసు విప్పి నీవే మర్మమేదో తెల్లముగా ఒకడవే అనవోయ్
ఎవరూ కేక విని రాకపోయినా సరే ఒకడవే పదవోయ్
అపుడు ఒక్కడవే ఒక్కడవే ఒక్కడవే ఒకడవే పదవోయ్


మరి తోడు లేకున్నా ఓరీ..ఓ అభాగ్యుడా తోడులేకున్నా
,మరి అడవి దారిపొయ్యేవేళ ఎవరు రాకున్నా
ముళ్లబాటలోనా నీవే అడుగుల రక్తమ్ము చిమ్మ ఒకడవే పదవోయ్
ఎవరూ కేక విని రాకపోయినా సరే ఒకడవే పదవోయ్
అపుడు ఒక్కడవే ఒక్కడవే ఒక్కడవే ఒకడవే పదవోయ్

మధుర గాయని Shreya Ghosal బెంగాలీలో పాడిన Ekla Chalo:

Tagore's English translation for this song:
If they answer not to thy call walk alone,
If they are afraid and cower mutely facing the wall,
O thou unlucky one,
open thy mind and speak out alone.

If they turn away, and desert you when crossing the wilderness,
O thou unlucky one,
trample the thorns under thy tread,
and along the blood-lined track travel alone.

If they do not hold up the light when the night is troubled with storm,
O thou unlucky one,
with the thunder flame of pain ignite thy own heart
and let it burn alone.

*** **** ****
అమితాబ్ కూడా పాడినది ఈ లింక్ లో వినవచ్చు:
http://www.youtube.com/embed/fNPxEH_qMWc

Thursday, May 3, 2012

వెతుకుతున్న కథ దొరికింది !


ఎప్పుడో ఓ ఈనాడు ఆదివారం పుస్తకంలో పడిన ఒక కథ నాకు బాగా నచ్చింది. దాచానని బాగా గుర్తు. ఎంత వెతికినా కనపడనంత జాగ్రత్తగా వస్తువులు దాచేయటం నాకో దురలవాటు. ఈనాడు లో పడిన కథ అని గుర్తు కానీ నెల , సంవత్సరం గుర్తులేవు కాబట్టి నెట్లో వెతకలేను. కొన్ని కథల తాలూకూ కట్టింగ్స్ దాచిన చోట్లో కూడా దొరకలేదు. ఇన్నాళ్ళూ వెతికివెతికి ఇక పోయిందనే అనుకున్నా. అలమార్ల నిండా నేను నింపిన చెత్త తగ్గించాలనే ఉద్దేశంతో "ఈ పేపర్ కట్టింగ్స్ అన్నీ ఎన్నాళ్ళు దాస్తావు? కాయితాలు కూడా పాతవయిపోతున్నాయి... స్కేన్ చేసేసుకుని సిస్టంలో సేవ్ చేసేస్కొమ్మని" సలహా ఇచ్చారు శ్రీవారు. ఇదేదో ఐడియా బానే ఉంది అనుకుని అలమారలోని నా ఖజానా అంతా ముందర వేసుకుని కూచుని చూస్తూంటే నిన్న కనబడింది 2008 జులై 6 ఈనాడు ఆదివారం పుస్తకం ! పుస్తకంలో "ఆనందమె జీవితమకరందం" కథ ! ఎప్పటిలా నేను కథ పేజీలు కట్ చేయకుండా నేనేకంగా పుస్తకం మొత్తం దాచేయటంతో నాకిన్నాళ్ళు ఈ కథ కాయితాలు దొరకలేదన్నమాట..:)


సరే నాకంతగా నచ్చిన ఆ కథ వివరాల్లోకి వెళ్తే.. రచయిత పేరు "వేదార్థం జ్యోతి". కథ పేరు "ఆనందమె జీవితమకరందం".
ఈనాడు కథల పోటిలో కాన్సొలేషన్ బహుమతి లభించిందట. శాంత, మూర్తి అనే దంపతుల కథ. పెళ్లై అత్తవారింటికి వచ్చిన శాంత ఇంటి ఆవరణలోని పులమొక్కలు, జాజిపులు, వీధి చివరి గుడి, ఉదయమే వినిపించే సుప్రభాతం..గుడిగంటలు... అన్నీ చూసి మురిసిపోతుంది. కానీ ఇద్దరాడపడుచులు, మరిది - వాళ్ల పెళ్ళిళ్ళు పేరంటాలు , అత్తమామలు, అనారోగ్యాలు, ఇద్దరు మగపిల్లలు - వాళ్ల చదువులు మొదలైన బాధ్యతల మధ్యన సతమతమౌతుంది శాంత. మౌనంగా తన పని తాను చేసుకుపోయే భర్త "నేను ఆఫీసు నుంచి రాగానే నవ్వుతూ ఎదురు రావాలి, సపర్యలు చేయాలి అనే కోరికలు లేవు కానీ, లేనిపోని గొడవలు సృష్టించి ఇంటిని మాత్రం అల్లకల్లోలం చెయవద్దు. డబ్బు లేకపోయినా మనిషి తట్టుకోగలడు కానీ మనశ్శాంతి లేకపోతే చాలా కష్టం" అని మొదట్లోనే శ్రీకృష్ణునిలా కర్తవ్య బోధ చేస్తాడు. మూర్తితో కలిసి కాఫీ తాగుతూ పేపర్ చదవాలనీ, ఒక్క ఆదివారం అయినా భర్తతో ఏకాంతంగా గడపాలనీ, ఘంటసాల పాటలు వింటు నిద్దరోవాలనే చిన్నచిన్న కోరికలన్నీ ఆమెకు అసాధ్యాలయిపోతాయి. ఇంటెడు జనం, వారి అవసరాలు తీర్చటంతోనే రోజులెలా గడిచాయో తెలియనంత వేగంగా ఆమె నలభై ఏళ్ళ కాపురం గడిచిపోతుంది. అయితే ఏనాడు తన అసంతృప్తిని బయటపడనివ్వదు శాంత. మంచి భర్త, సూటిపోటి మాటలతో సాధించని అత్తగారు దొరకటమే అదృష్టం అనుకుంటుంది.


అత్తగారు, మామగారు ఒకరి తర్వాత ఒకరు కాలం చేసినా పెళ్ళిళ్లై వెళ్ళిన ఆడపడుచులు, మరిది వారివారి సహాయానికి రమ్మని అడిగినప్పుడల్లా వెళ్లక తప్పదు శాంతకు. ముంబై వెళ్ళి పెద్ద కోడలికి పురుడు పోసి ఆ బాధ్యత కూడా తీర్చుకుంటుంది. చిన్న కొడుకు అమెరికాలో స్థిరపడి, తమను రమ్మన్నా ఆ యాంత్రిక జీవితానికి భయపడి తమ ఇంట్లోనే ఉండిపోతారు శాంత, మూర్తి. అలా అన్ని బాధ్యతలు తీరాకా పొద్దుటే పూజ చేసుకుని, మూర్తి ఆఫీసుకి వెళ్లగానే పులమాలలు కట్టి వీధి చివరి గుళ్ళో ఇవ్వటం, సాయంత్రం మూర్తి కోసం ఎదురు చూస్తూ ఇంటి ఆవరణలోని పూలసౌరభాలలో మునిగిపోవటం ఎంతో ప్రశాంతతనిస్తాయి శాంతకి. "వృధ్ధాప్యం శరీరానికే కానీ మనసుకు కాదు శాంతా. నిజానికి మనిషికి తోడు అవసరమయ్యే అసలైన వయస్సు ఇదే. ఇప్పుడు మనం ఎవ్వరి గురించీ ఆలోచించక్కర్లేదు. నాకు నువ్వు, నీకు నేను..అంతే" అన్న మూర్తి మాటలతో సంతృప్తి చెందుతుంది ఆమె. భర్త రిటైర్మెంట్ రోజున మూర్తి చెల్లెళ్ళు, తమ్ముడు, పిల్లలు అంతా వచ్చి మూర్తికి సత్కారం చేసేసరికీ పొంగిపోతారు వారిద్దరూ.


ఆ మర్నాడు అంతా కూచుని చెప్పిన మాటలకి ఆ దంపతులిద్దరి ఆనందం ఆవిరైపోతుంది. భార్యాభర్తలిద్దరు ఉద్యోగాలు చేసుకునే చిన్నాడపడుచు తమ వద్దకు వచ్చి ఉండమంటుంది. వాళ్లాయన కొత్తగా పెట్టే షాపులో నమ్మకంగా పనిచేసేవాడు కావాలనీ రిటైరయిపోయాడు కాబట్టి అన్నగారిని తమతో రమ్మని అడుగుతుంది పెద్దాదపడుచు. తాము జీతమీయక్కర్లేని పనిమనుషులమా? అనుకుంటుంది శాంత. మీ పిల్లలు మంచి ఉద్యోగాల్లో ఉన్నారు కదా ఇక్కడ ఉండేంచేస్తారు? ఇల్లమ్మేసి నా వాటా ఇచ్చేసి పిల్లలవద్దకు వెళ్ళిపొండన్న మరిది మాటలు అభ్యర్ధనో, ఆర్డరో అర్ధం కాదు వాళ్ళకు. ఇన్నేళ్ళుగా ఇంట్లో జరిగిన శుభాశుభాలకు డబ్బెలా వచ్చిందో పట్టించుకోని మరిది ఇప్పుడు వాటా అడగటం చూసి ఆశ్చర్యపోతుంది శాంత. ఇంతలో చిన్నకొడుకు కల్పించుకుని అమ్మానాన్నలు కుటుంబం కోసం తమ జీవితాలను హారతి కర్పూరాలను చేసారనీ, వాళ్ళేం పోగొట్టుకున్నరో,ఎన్ని త్యాగాలు చేసారో ఎవరికీ తెలియని విషయాలు కావనీ, ఎవరి పంచనో ఉండాల్సిన అగత్యం వాళ్ళకు లేదనీ, ఇల్లు అమ్మే ప్రసక్తే లేదనీ గట్టిగా చెప్తాడు. అంతగా అయితే ఇంటికి లెఖ్ఖగట్టి ముగ్గురి వాటాల ధర అన్నదమ్ములమిద్దరం ఇచ్చేస్తామనీ చెప్తాడు. ఇంతలో పెద్దకొడుకు కూడా లేచి తమ ఇంటి పక్క ఉన్న ఖాళీ స్థలం కొని మ్యూజిక్ స్టోర్స్ పెడుతున్నామనీ, తన స్నేహితుడు అన్నీ చూసుకుంటాడనీ, తండ్రి పర్యవేక్షణ చేస్తే చాలనీ, అలా వారిద్దరూ ఎవరిపై ఆధారపడకుండా ప్రశాంతమైన జీవితం గడపవచ్చనీ చెప్తాడు. ఎంతో ఎత్తుకు ఎదిగిపొయినట్లు కనబడుతున్న పిల్లలిద్దరినీ చూసి మురిసిపోతారు శాంత, మూర్తి.


ఈ కథ అంతం కాస్త నాటకీయంగా అనిపించినా కథకు ఎన్నుకున్న అంశం, పాత్రల మధ్యన జరిగే సంభాషణలూ, రచయిత కథ రాసిన విధానం నాకు నచ్చాయి. జీవితంలో దశలవారిగా స్త్రీ ఆలోచనల్లో వచ్చే మార్పుల్ని చక్కగా రాసారు రచయిత. ఎవరో మరి..