సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Thursday, May 3, 2012

వెతుకుతున్న కథ దొరికింది !


ఎప్పుడో ఓ ఈనాడు ఆదివారం పుస్తకంలో పడిన ఒక కథ నాకు బాగా నచ్చింది. దాచానని బాగా గుర్తు. ఎంత వెతికినా కనపడనంత జాగ్రత్తగా వస్తువులు దాచేయటం నాకో దురలవాటు. ఈనాడు లో పడిన కథ అని గుర్తు కానీ నెల , సంవత్సరం గుర్తులేవు కాబట్టి నెట్లో వెతకలేను. కొన్ని కథల తాలూకూ కట్టింగ్స్ దాచిన చోట్లో కూడా దొరకలేదు. ఇన్నాళ్ళూ వెతికివెతికి ఇక పోయిందనే అనుకున్నా. అలమార్ల నిండా నేను నింపిన చెత్త తగ్గించాలనే ఉద్దేశంతో "ఈ పేపర్ కట్టింగ్స్ అన్నీ ఎన్నాళ్ళు దాస్తావు? కాయితాలు కూడా పాతవయిపోతున్నాయి... స్కేన్ చేసేసుకుని సిస్టంలో సేవ్ చేసేస్కొమ్మని" సలహా ఇచ్చారు శ్రీవారు. ఇదేదో ఐడియా బానే ఉంది అనుకుని అలమారలోని నా ఖజానా అంతా ముందర వేసుకుని కూచుని చూస్తూంటే నిన్న కనబడింది 2008 జులై 6 ఈనాడు ఆదివారం పుస్తకం ! పుస్తకంలో "ఆనందమె జీవితమకరందం" కథ ! ఎప్పటిలా నేను కథ పేజీలు కట్ చేయకుండా నేనేకంగా పుస్తకం మొత్తం దాచేయటంతో నాకిన్నాళ్ళు ఈ కథ కాయితాలు దొరకలేదన్నమాట..:)


సరే నాకంతగా నచ్చిన ఆ కథ వివరాల్లోకి వెళ్తే.. రచయిత పేరు "వేదార్థం జ్యోతి". కథ పేరు "ఆనందమె జీవితమకరందం".
ఈనాడు కథల పోటిలో కాన్సొలేషన్ బహుమతి లభించిందట. శాంత, మూర్తి అనే దంపతుల కథ. పెళ్లై అత్తవారింటికి వచ్చిన శాంత ఇంటి ఆవరణలోని పులమొక్కలు, జాజిపులు, వీధి చివరి గుడి, ఉదయమే వినిపించే సుప్రభాతం..గుడిగంటలు... అన్నీ చూసి మురిసిపోతుంది. కానీ ఇద్దరాడపడుచులు, మరిది - వాళ్ల పెళ్ళిళ్ళు పేరంటాలు , అత్తమామలు, అనారోగ్యాలు, ఇద్దరు మగపిల్లలు - వాళ్ల చదువులు మొదలైన బాధ్యతల మధ్యన సతమతమౌతుంది శాంత. మౌనంగా తన పని తాను చేసుకుపోయే భర్త "నేను ఆఫీసు నుంచి రాగానే నవ్వుతూ ఎదురు రావాలి, సపర్యలు చేయాలి అనే కోరికలు లేవు కానీ, లేనిపోని గొడవలు సృష్టించి ఇంటిని మాత్రం అల్లకల్లోలం చెయవద్దు. డబ్బు లేకపోయినా మనిషి తట్టుకోగలడు కానీ మనశ్శాంతి లేకపోతే చాలా కష్టం" అని మొదట్లోనే శ్రీకృష్ణునిలా కర్తవ్య బోధ చేస్తాడు. మూర్తితో కలిసి కాఫీ తాగుతూ పేపర్ చదవాలనీ, ఒక్క ఆదివారం అయినా భర్తతో ఏకాంతంగా గడపాలనీ, ఘంటసాల పాటలు వింటు నిద్దరోవాలనే చిన్నచిన్న కోరికలన్నీ ఆమెకు అసాధ్యాలయిపోతాయి. ఇంటెడు జనం, వారి అవసరాలు తీర్చటంతోనే రోజులెలా గడిచాయో తెలియనంత వేగంగా ఆమె నలభై ఏళ్ళ కాపురం గడిచిపోతుంది. అయితే ఏనాడు తన అసంతృప్తిని బయటపడనివ్వదు శాంత. మంచి భర్త, సూటిపోటి మాటలతో సాధించని అత్తగారు దొరకటమే అదృష్టం అనుకుంటుంది.


అత్తగారు, మామగారు ఒకరి తర్వాత ఒకరు కాలం చేసినా పెళ్ళిళ్లై వెళ్ళిన ఆడపడుచులు, మరిది వారివారి సహాయానికి రమ్మని అడిగినప్పుడల్లా వెళ్లక తప్పదు శాంతకు. ముంబై వెళ్ళి పెద్ద కోడలికి పురుడు పోసి ఆ బాధ్యత కూడా తీర్చుకుంటుంది. చిన్న కొడుకు అమెరికాలో స్థిరపడి, తమను రమ్మన్నా ఆ యాంత్రిక జీవితానికి భయపడి తమ ఇంట్లోనే ఉండిపోతారు శాంత, మూర్తి. అలా అన్ని బాధ్యతలు తీరాకా పొద్దుటే పూజ చేసుకుని, మూర్తి ఆఫీసుకి వెళ్లగానే పులమాలలు కట్టి వీధి చివరి గుళ్ళో ఇవ్వటం, సాయంత్రం మూర్తి కోసం ఎదురు చూస్తూ ఇంటి ఆవరణలోని పూలసౌరభాలలో మునిగిపోవటం ఎంతో ప్రశాంతతనిస్తాయి శాంతకి. "వృధ్ధాప్యం శరీరానికే కానీ మనసుకు కాదు శాంతా. నిజానికి మనిషికి తోడు అవసరమయ్యే అసలైన వయస్సు ఇదే. ఇప్పుడు మనం ఎవ్వరి గురించీ ఆలోచించక్కర్లేదు. నాకు నువ్వు, నీకు నేను..అంతే" అన్న మూర్తి మాటలతో సంతృప్తి చెందుతుంది ఆమె. భర్త రిటైర్మెంట్ రోజున మూర్తి చెల్లెళ్ళు, తమ్ముడు, పిల్లలు అంతా వచ్చి మూర్తికి సత్కారం చేసేసరికీ పొంగిపోతారు వారిద్దరూ.


ఆ మర్నాడు అంతా కూచుని చెప్పిన మాటలకి ఆ దంపతులిద్దరి ఆనందం ఆవిరైపోతుంది. భార్యాభర్తలిద్దరు ఉద్యోగాలు చేసుకునే చిన్నాడపడుచు తమ వద్దకు వచ్చి ఉండమంటుంది. వాళ్లాయన కొత్తగా పెట్టే షాపులో నమ్మకంగా పనిచేసేవాడు కావాలనీ రిటైరయిపోయాడు కాబట్టి అన్నగారిని తమతో రమ్మని అడుగుతుంది పెద్దాదపడుచు. తాము జీతమీయక్కర్లేని పనిమనుషులమా? అనుకుంటుంది శాంత. మీ పిల్లలు మంచి ఉద్యోగాల్లో ఉన్నారు కదా ఇక్కడ ఉండేంచేస్తారు? ఇల్లమ్మేసి నా వాటా ఇచ్చేసి పిల్లలవద్దకు వెళ్ళిపొండన్న మరిది మాటలు అభ్యర్ధనో, ఆర్డరో అర్ధం కాదు వాళ్ళకు. ఇన్నేళ్ళుగా ఇంట్లో జరిగిన శుభాశుభాలకు డబ్బెలా వచ్చిందో పట్టించుకోని మరిది ఇప్పుడు వాటా అడగటం చూసి ఆశ్చర్యపోతుంది శాంత. ఇంతలో చిన్నకొడుకు కల్పించుకుని అమ్మానాన్నలు కుటుంబం కోసం తమ జీవితాలను హారతి కర్పూరాలను చేసారనీ, వాళ్ళేం పోగొట్టుకున్నరో,ఎన్ని త్యాగాలు చేసారో ఎవరికీ తెలియని విషయాలు కావనీ, ఎవరి పంచనో ఉండాల్సిన అగత్యం వాళ్ళకు లేదనీ, ఇల్లు అమ్మే ప్రసక్తే లేదనీ గట్టిగా చెప్తాడు. అంతగా అయితే ఇంటికి లెఖ్ఖగట్టి ముగ్గురి వాటాల ధర అన్నదమ్ములమిద్దరం ఇచ్చేస్తామనీ చెప్తాడు. ఇంతలో పెద్దకొడుకు కూడా లేచి తమ ఇంటి పక్క ఉన్న ఖాళీ స్థలం కొని మ్యూజిక్ స్టోర్స్ పెడుతున్నామనీ, తన స్నేహితుడు అన్నీ చూసుకుంటాడనీ, తండ్రి పర్యవేక్షణ చేస్తే చాలనీ, అలా వారిద్దరూ ఎవరిపై ఆధారపడకుండా ప్రశాంతమైన జీవితం గడపవచ్చనీ చెప్తాడు. ఎంతో ఎత్తుకు ఎదిగిపొయినట్లు కనబడుతున్న పిల్లలిద్దరినీ చూసి మురిసిపోతారు శాంత, మూర్తి.


ఈ కథ అంతం కాస్త నాటకీయంగా అనిపించినా కథకు ఎన్నుకున్న అంశం, పాత్రల మధ్యన జరిగే సంభాషణలూ, రచయిత కథ రాసిన విధానం నాకు నచ్చాయి. జీవితంలో దశలవారిగా స్త్రీ ఆలోచనల్లో వచ్చే మార్పుల్ని చక్కగా రాసారు రచయిత. ఎవరో మరి..



7 comments:

SHANKAR.S said...

ఈ కథ చదివినట్టు గుర్తుంది. కథ మాట ఎలా ఉన్నా ఎప్పటినుంచో వెతుకుతున్న పుస్తకమో, పాటో, సినిమానో అనుకోకుండా దొరికితే ఆ ఫీలింగ్ మాత్రం భలే ఉంటుందండీ.

anrd said...

నేను కూడా ఈ కధ చదివానండి. చిన్న కధలోనే మొత్తం జీవితాన్ని చక్కగా వ్రాసారు.

Indira said...

డియర్ తృష్ణా,ఈ కధ చదివిన గుర్తు.జీవితంలో వివాహమైన తరువాత రకరకాల బాధ్యతలతో 20,25 సంవత్సరాలు తెలియకుండా గడిచిపోతాయి.బాధ్యతలు తీరి అప్పుడే మనదైన జీవితం మొదలౌతుంది.మన చిన్నప్పటి గ్నాపకాలు,హైస్కూలు స్నేహితులు,మరుగునపడిన మన అభిరుచులు ఒక నొస్టాల్జియా,పొగడపూల పరిమళంలాగా అప్పుడప్పుడు మనల్ని చుట్టుముడుతుంటాయి.ఆర్ధికంగానూ,ఆరోగ్యంగానూ ఎలాంటి ఇబ్బందులు లేకపోతే,ఇదే బెస్టు పీరియడ్.

జ్యోతి said...

శంకర్ గారి మాటే నా మాట కూడా. కథ సంగతి ఎలా ఉన్నా మీరిన్నాళ్ళుగా వెతుకున్న కథ దొరికినందుకు.. :D

పూర్వ ఫల్గుణి (poorva phalguni) said...

తృష్ణ గారు

మీ లాగే నేను కూడా ఒక కధ గురుంచి వెతుకుంటున్నాను. అది మా నాన్న
గారు పోయినప్పడు పక్క వాటా లోనే వున్న" తల్లవజ్జుల పతంజలి శాస్త్రి" గారు మా నాన్నగారి గురుంచి
రాసింది. అయితే ఆ కధ 1989 లో రాసినది. అప్పుడు నాకు అంత సాహిత్య సాన్నిహిత్యం లేదు. కధ పేరు కూడా గురుతులేదు.
కానీ ఆ కధ పేపర్ కటింగ్ దాచాను. మీరు అన్నట్లు ఎప్పుడో మా ఇంట్లోనే దొరుక్తుందని ఆశ. సాహిత్య సాన్నిహిత్యం లేదు గానీ
కధలు ,సేరియల్స్ బౌండ్ చేసి వుంచాను. మళ్ళి వెతుకుతాను. మీ తోటి ఈ విషయం పంచుకోవాలని
అనిపించింది.

munjulurikrishna said...

nee blog themes are very nice. i feel like starting a feature on blog broadcast.

munjulurikrishna said...

your blog themes are very interesting.