సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Wednesday, May 2, 2012

ఒంటరి మరణం..





ఒంటరి జననం.. ఒంటరి మరణం. ఇది మనిషి ప్రతి నిత్యం గుర్తుంచుకోవాల్సిన సత్యం. మరణమెంత అనివార్యమో తన రాక కూడా అంత ఊహింపరానిది. తెలివిలో ఉన్నా తెలివిలో లేకపోయినా ఎవరు తోడుగా కానీ పక్కనగానీ లేని ఒంటరి మరణం దుర్భరం. ఇవాళ న్యూస్ పేపర్లో బాలీవుడ్ సినిమాల్లో ఒకప్పటి ప్రఖ్యాత తల్లి పాత్రధారి "అచలా సచ్ దేవ్" మరణవార్త విని మనసు చిన్నబోయింది.. !


బాల నటిగా నటన ప్రారంభించిన ఆమె ఆమె పెద్ద హీరోయిన్ ఏమీ కాదు కానీ చాలా మంది హీరోలకు తల్లిగా నటించింది. అయితే చివరి రోజుల్లో ఇంట్లో కాలుజారి పడిపోయాకా తెలివి కోల్పోయి తెలియని స్థితిలోకి వెళ్పోయిందిట. మరణ సమయంలో అమెకు తోడుగా బంధువులు ఎవరూ లేరుట. కొడుకు,మనవలు..అంతా ఎక్కడో ఇతర దేశంలో ఉన్నాడుట. గతంలో తమకు ఆమె పెద్ద మొత్తాని డొనేట్ చేసినందుకో ఏమో ఒక సంస్థవారు ఓ మనిషిని తోడుగా పెట్టారుట ఆమెను చూసుకోవటానికి. ఆమె ఇచ్చిన డబ్బుతో ఆ సంస్థ "అచలా సచ్ దేవ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యూకేషన్" పేరుమీద ఒక ఇన్స్టిట్యూట్ నడుపుతున్నారుట. అందులో గిరిజన విద్యార్ధులకు హాస్పటల్లో రోగులను ఎలా చూసుకోవాలో నేర్పిస్తారుట. ఒక రకంగా నర్స్ కోర్స్ లాంటిదన్నమాట. ఇటువంటి మంచి పనికి శ్రీకారం చుట్టిన శ్రీమతి సచ్ దేవ్ కు చివరిలో అదే ఇన్స్టిట్యూట్ నుండి వచ్చిన మనిషి తోడుగా నిలబడింది.


పేపర్లో ఈవిడ గురించి చదవగానే నాకు మా నాన్నమ్మ గుర్తుకు వచ్చింది. తనూ అలానే బాత్రూమ్ లో రెండవసారి జారిపడిన తర్వాత నెమ్మది నెమ్మదిగా తెలివిలేని స్థితికి వెళ్పోయి కోమాలోనే పది పదిహేను రోజులు హాస్పటల్లో ఉంది. అయితే అప్పుడు మేమంతా నాన్నమ్మ పక్కనే ఉన్నాము. నేను రోజూ వాక్ మాన్ లో భజనలు పెట్టి ఇయర్ ఫోన్స్ తన చెవిలో పెట్టేదాన్ని. రౌండ్స్ కి వచ్చిన డాక్టర్ నవ్వుతూ ఉండేవారు.. "ఆవిడ వింటారనేనా పెడుతున్నారు?" అని. తను సబ్కాన్షియస్ గా వింటుందని ఏదో పిచ్చి నమ్మకం నాకు. చివరివరకు అలానే పెట్టాను. తనకు చేయాల్సిన మిగతా పనులన్నీ అమ్మ ఎంతో జాగ్రత్తగా చేసేది. అదో చేదు జ్ఞాపకం..
చివరి క్షణాల్లో మా నాన్నమ్మకు మేమున్నాము. పాపం ఆవిడకు ఎవరూ లేరే అని బాధ కలిగింది ఇవాళ ఈ వార్త చూడగానే.

to lighten the heavy mood.. 'అచలా సచ్ దేవ్' గుర్తుగా చాలా పాపులర్ అయిన ఈ పాట విందామేం..

Monday, April 30, 2012

ఏం పెళ్ళిళ్ళో...!!


ఈ ఏడు బొత్తిగా పెళ్ళిళ్ళకే వెళ్ళకపోవటానికి నేనేమీ గ్రహాంతరవాసిని కాదు కానీ మా ఇరుపక్షాల కజిన్స్ అందరి పెళ్ళిళ్ళూ అయిపోయి వాళ్లంతా పిల్లల్ని ఎత్తే స్టేజ్ కి వచ్చేయటంతో ఈ సీజన్లో బొత్తిగా పెళ్ళిపిలుపులే లేకుండా పోయాయి. ఈ ఏడు అసలు ఏ పెళ్ళికీ వెళ్లలేదు అని మేమిద్దరమూ చింతింస్తూ ఉండగా ఒక్కసారిగా ఇదేనెలలో ఐదారు తప్పనిసరిగా వెళ్ళాల్సిన పెళ్ళిళ్ళు తగిలాయి. ఏ పెళ్ళిపిలుపూ రాకపోతే రాలేదని బాధ...తీరా ఎవరన్నా పిలిస్తే వెళ్ళాలని బాధ. బాధ ఎందుకంటే దూరాలు వెళ్ళాలని. ఇప్పుడు చాలామటుకు అన్నీ ఎక్కడో ఊరి చివర ఉండే సువిశాలమైన ఏసీ కల్యానమంటపాల్లో పెళ్ళిళ్ళు. అక్కడికి వెళ్తే బానే ఉంటుంది కానీ వెళ్ళేదెలా? ఆటోల్లో వెళ్ళేదూరాలు కూడా కాదు, పట్టుచీరలూ గట్రా కట్టుకుని బస్సుల్లో ఎక్కలేము. కనీసం అక్కడికి వెళ్ళేదాకా అన్నా కట్టుకున్న బట్టలు నలక్కుండా ఉండాలి కదా ! ఏదో ఈ సిటీలో ఉన్న పుణ్యానికీ, అదృష్టవశాత్తూ మేం బస్టాపులో నించున్న సమయానికి ఏసీ బస్సులో, లేక డీలక్స్ బస్సులో రాబట్టి మా గండం గడిచింది.


ఆ విధంగా ఏవో తంటాలు పడుతూ ఈ ఒక్క వారంలోనే ముచ్చటగా మూడు పెళ్ళిళ్ళు చూసివచ్చాం. నిన్నరాత్రి కూడా ఒక రిసెప్షన్కి వెళ్ళి వచ్చాం. (పెళ్ళి వేరే ఊళ్ళో అయ్యింది) నేను సిటీలో పెళ్ళిళ్ళకి వెళ్ళి రెండేళ్ళు పైనే అయ్యింది. క్రిందటేడు గుడివాడలో ఓ పెళ్ళివాళ్ళు చాలా సాంప్రదాయకుటుంబానికి చెందినవాళ్ళవటంతో చక్కగా పందిళ్ళు వేయించి, బఫేల జోలికి పోకుండా హాయిగా బల్లలు అవీ వేసి కూచోపెట్టి అరిటాకులో భోజనాలు పెట్టారు. నాకసలు ఈ బఫే భోజనాలంటే పరమ చిరాకు. క్యూలో నిలబడి ప్లేటిచ్చుకుని అడుక్కుని తినటం ఏంటో.. అనుకుంటూ ఉంటాను. నా పెళ్ళిలో కూడా ఆఫీసువాళ్లకి బఫే పెట్టినా, చుట్టాలందరికీ చక్కగా టేబుల్స్ వేసి కూచోబెట్టి టిఫిన్, భోజనం పెట్టాలని ఖచ్చితంగా నాన్నతో చెప్పేసాను. సరే ఇంతకీ నే వెళ్ళిన పెళ్ళిళ్ళ గురించి కదా చెప్తున్నాను...ఈ సిటీల్లో పెళ్ళిళ్లు చూసి కాస్త ఎక్కువకాలమే అవ్వటం వల్ల నాకు ప్రతి చోటా ఆశ్చర్యమే ఎదురైంది.


ఓ మోస్తరు మామూలు పెళ్ళిళ్ళలో కూడా అలంకరణలకీ, ఆర్భాటానికీ జనాలు పెడుతున్న ఖర్చు విపరీతంగా తోచింది. వేలంవెర్రిలా కూడా అనిపించింది. వాళ్ల సరదా కోసం అనుకుందామంటే అసలు లోపలున్నవాళ్లకి బయటకు వచ్చి కల్యాణమంటపానికి ఏం అలంకరణ చేసారో చూసుకునే సమయమే ఉండదు. మరి ఈ బయట రోడ్డు పొడుగునా ఉన్న విపరీతమైన అలంకరణ,చెట్లకీ పుట్టలకీ లైటింగులు ఎవరికోసం? దారేపొయేవాళ్లకు చూపించుకోవటానికా? వీధిలో వెళ్ళేవాళ్ల కోసమా? తెలీదు. ఇక లోపల పెళ్ళి జరుగుతున్నంత సేపు సన్నాయి, బాజాభజంత్రీలు ఎప్పుడో పోయాయి...పాట కచేరీలు కొత్త ఫేషన్. సినిమా పాటలు కొందరైనా వింటారు. కానీ శాస్త్రీయంగా త్యాగరాజ కీర్తనలు, అన్నమాచార్య కీర్తనలు , వాద్య సంగీతం పెట్టుకునేవారు కొందరుంటారు. అవి ఎంతమంది వింటారు అన్నది వాళ్లకి అప్రస్తుతం. పాడేవాళ్లకీ, వాయిద్యకారులకీ పైకమందుతుంది. వాళ్లపని వారు చేసుకుపోతారు. కానీ నాలాంటి ప్రాణులు కొందరు మాత్రం అయ్యో ఈ సంగీతాన్ని ఎవరూ విని ఆస్వాదించటంలేదే అని వాపోతారు. మొన్నటి పెళ్ళిలో ఇద్దరు ఆడపిల్లలు చక్కగా పట్టుపరికిణీ,ఓణీలు వేసుకుని కీర్తనలు పాడారు. ఎంతబాగా పాడుతున్నారో...కానీ పట్టుమని పదిమందైనా వింటున్నారోలేదో అని బాధ వేసింది నాకు. విలువ తెలియని చోట కళను ప్రదర్శించటం ఆ కళకు అవమానం కాదా.. అనిపించింది.



ఇక భోజనాల సంగతి తలుచుకోకపోతేనే మంచిదేమో. అక్కడ జరిగే వేస్టేజిని తలుచుకుంటే ఎంతో బాధ కలుగుతుంది. చిన్న పెళ్ళి అయినా పెద్ద పెళ్ళి అయినా ఐటెమ్స్ తగ్గుతున్నాయి కానీ అందరి భోజనాలు దాదాపు ఇదే స్టైల్లో ఉంటున్నాయి. ముందర స్టార్టర్స్ లో పానీపురీ, చాట్లు, రగడాలు, మంచూరియాలు, నూడిల్స్, సూప్ మొదలైనవి తిన్నాకా ఇక భోజనం ఎందుకో నాకు అర్ధం కాదు. సరే భోజనం తినాలి కదా అని ఆ వైపుకి వెళ్ళాం. దోశ, పూరీ, పెసరట్టు ఉప్మా మొదలైన టిఫిన్స్ అన్నీ ఒకవైపు వేడివేడిగా వేసేసి నాలుగురకాల చట్నీలతో వడ్డించేస్తున్నారు. ఆ తర్వాత రోటిలు, నాన్లు, పూరీలూ వాటికో ఐదారురకాల కూరలు; ఆ తర్వాత వైట్ రైస్, సాంబార్, కూరలు మొదలైనవి. అవి అయ్యాయా, ఇక ఓ ఐదారు రకాల స్వీట్స్ ఓ పక్క, నాలుగైదు రకాల ఐస్క్రీంలు ఒకపక్క. ఇవన్ని అయ్యాయ అంటే ఓ పది రకాల ఫ్రూట్స్ వరుసగా ! అసలు మనిషన్నవాడెవడన్నా ఇన్ని రకాలూ ఒకేసారి తినగలడా? లేదు కదా. అయినా కొందరు జనాలు ఆతృత కొద్దీ చాలా రకాలు ప్లేట్లో వేసుకోవటం సగం తిని పడేయటం చేస్తున్నారు. ప్లేట్స్ పడేసే డస్టబిన్ దగ్గర, తినటానికి మధ్యలో వేసిన గుండ్రని టేబుల్స్ మీదా సగం సగం తిని వదిలేసిన ప్లేట్సే. అసలు ఎంత తింటారో తెలీకుండా అలా అన్నేసి ప్లేట్లలో ఎందుకు పెట్టించుకుంటారో, పెట్టించుకున్నది ఎందుకు పడేస్తారో వాళ్లకే తెలవాలి. కొందరమో తగుమోతాదుల్లో ఈ నానారకాల చెత్తల్నీ కడుపులో నింపేసుకుని కదల్లేక మెదల్లేక పాపం కూర్చుండిపోయేవారు కొందరు. ఏవి తినాలో, ఏవి తినకూడదో తెలీకుండా ఇలా పెళ్ళి భోజనాలు తినేయటం వల్ల ఆనక ఎసిడిటీలు, ఇన్డైజెషన్ లు !! వీటన్నింటికన్నా భోజనాల దగ్గర జరిగే వేస్టేజే నాకు బాధను కలిగించింది. దేశంలో తిండిలేక మలమల మాడేవారు కొందరైతే, ఇలా పెళ్ళిళ్ళ పేరుతో భోజనపదార్ధాలను వ్యర్ధపరిచేది ఇంకొందరు.

జీవితాంతం గుర్తుంపోయే మధురక్షణాలను పదిలపరుచుకోవటం చాలా మంచిదే. ఎవరి తాహతను బట్టి వారు ఖర్చు చెయ్యటం కూడా సరదానే. కాదనను. కానీ అది శృతి మించితే... నష్టం ఎవరికి? పులిని చూసి నక్క వాత పెట్టుకుందన్నట్లు ఒకళ్లను చూసి ఒకళ్ళు తాహతకు మించి ఆర్భాటాలకు పోవటం ఎంతవరకు సమంజసం..? ఈ ఖర్చుల్లో సగమైనా వధువరుల పేరున దాచితే వాళ్లకు అత్యవసర పరిస్థితుల్లోనో లేదా ఏ ఫర్నిచర్ కొనుక్కోవటానికో ఉపయోగపడుతుంది కదా..! ఏంపెళ్ళిల్లో ఏమిటో...!

Thursday, April 26, 2012

మార్కొనీ జయంతి సందర్భంగా నాన్నగారికి మరో సన్మానం



నిన్న(Apr 25th) రేడియోని కనిపెట్టిన "మార్కొనీ" జయంతి. ఈ "మార్కొనీ జయంతి" సందర్భంగా రేడియోకి విశిష్ఠ సేవలను అందించిన కొందరు రేడియో ప్రముఖులకు కొన్ని స్మారక అవార్డులను గత కొన్నేళ్ళుగా విజయవాడ కృష్ణవేణీ కియేషన్స్ వారు ఇస్తున్నారు. ఈ ఏటి మార్కొనీ జయంతి సందర్భంగా నిన్నటి రోజున ముగ్గురు రేడియో ప్రముఖులకు సన్మాన పురస్కారాలను అందజేసారు. విజయవాడ కృష్ణవేణీ కియేషన్స్, హైదరాబాదు త్యాగరాయ గాన సభ సంయుక్త ఆధ్వర్యంలో విజయవాడ ఎనౌన్సర్ శ్రీ బి.జయప్రకాష్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. హైదరాబాద్ చిక్కడపల్లిలోని త్యాగరాయగానసభ(కళాసుబ్బారావు వేదిక)లో నిన్న సాయంత్రం ఈ సన్మాన కార్యక్రమం జరిగింది.

ముగ్గురు రేడియో ప్రముఖులు - రేడియో నాటక కళాకారిణి శ్రీమతి శారదా శ్రీనివాసన్ గారికి, విశ్రాంత న్యూస్ రీడర్ శ్రీ ఏడిదగోపాల్రావు గారికీ, విశ్రాంత అనౌన్సర్ శ్రీ ఎస్.బి. శ్రీరామ్మూర్తి గారికి(మా నాన్నగారు) అవార్డులు అందజేసారు. మార్కొనీ వంటి గొప్ప వ్యక్తి జయంతి రోజున ఈ పురస్కారాలను అందుకోవటం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని పురస్కార గ్రహీతలు చెప్పారు.


అవార్డుల వివరాలు:

* విజయవాడ స్టాఫ్ ఆర్టిస్ట్, గాయని స్వర్గీయ వి.బి.కనకదుర్గ స్మారక అవార్డ్ - రేడియో నాటక కళాకారిణి శ్రీమతి శారదా శ్రీనివాసన్ గారికి,
* న్యూస్ రీడర్ తిరుమలశెట్టి శ్రీరాములు స్మారక అవార్డ్ - విశ్రాంత న్యూస్ రీడర్ శ్రీ ఏడిదగోపాల్రావు గారికీ,
* ఆకాశవాణి స్టాఫ్ ఆర్టిస్ట్ స్వర్గీయ శ్రీ గోపాల్ అవార్డ్ - విశ్రాంత అనౌన్సర్ శ్రీ ఎస్.బి. శ్రీరామ్మూర్తి గారికి(మా నాన్నగారు)


ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక సలహాదారు డా.కె.వి. రమణాచారి గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ రిటైర్డ్ ప్రిన్సిపల్ సెక్రటరీ రమణాచారి గారు ఇటీవలే "దేవస్థానం" సినిమాలో ఒక పాత్ర కూడా పోషించారుట. రచయిత, కవి, విమర్శకుడు, రిటైర్డ్ ఆకాశవాణి ప్రోగ్రాం ఎక్జిక్యూటివ్ శ్రీ సుధామ గారు(మన "సుధామధురం" బ్లాగర్) కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. శ్రీ సుధామగారు స్టేజ్ పై మాట్లాడుతూ మన తెలుగుబ్లాగులు గురించి కూడా చెప్పారు. అందులో వారు నా బ్లాగ్ గురించి కూడా ప్రస్తావించటం నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. దూరదర్శన్ సంచాలకులు శ్రీమతి శైలజా సుమన్ గారు కూడా తన ప్రసంగంలో పాత రేడియో రోజులను, తన రేడియో జ్ఞాపకాలనూ తలుచుకున్నారు.


ఈ కార్యక్రమానికి ఆత్మీయ అతిధులుగా హైదరాబాద్ ఆకాశవాణి సంచాలకులు శ్రీ పాలక రాజారావు, హైదరాబాద్ దూరదర్శన్ సంచాలకులు శ్రీమతి మల్లాది శైలజా సుమన్, ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ కార్యవర్గ సభ్యులు శ్రీ ఆలపాటి సురేష్ కుమార్, శ్రీ త్యాగరాయగానసభ అధ్యక్షులు శ్రీ కళా వెంకట దీక్షితులు, ING Life Insurance Co. Ltd బ్రాంచ్ మేనేజర్ శ్రీ వంకదారు హరికృష్ణ పాల్గొన్నారు.



సుధామ గారు :

శ్రీమతి శారదా శ్రీనివాసన్ గారు :

శ్రీ ఏడిదగోపాల్రావు గారు :

ఎస్.బి.శ్రీరామ్మూర్తి గారు(మా నాన్నగారు) :



మా నాన్నగారి గురించి నా బ్లాగ్ లో నేను అదివరకూ రాసిన టపాలు చదవనివారికి ఈ లింక్స్:

http://trishnaventa.blogspot.com/2010/10/blog-post_21.html

http://trishnaventa.blogspot.com/2010/10/2.html

http://trishnaventa.blogspot.com/2010/10/3.html

http://trishnaventa.blogspot.com/2010/10/4_26.html

http://trishnaventa.blogspot.com/2010/10/5.html

http://trishnaventa.blogspot.in/2010/10/6.html

http://trishnaventa.blogspot.com/2010/11/blog-post.html




Tuesday, April 24, 2012

MANGO MELA 2012


మామిడిపళ్ళు పండించటానికి ఎక్కువగా వాడుతున్న "కార్బైడ్" వల్ల ఆరోగ్యానికి ఎంతో హాని జరుగుతున్నందువల్ల కార్బైడ్ వాడకంపై నిషేధం విధించిన విషయం అందరికీ విదితమే. అందువల్ల ప్రతిఏడూ వేసవిలో ఎక్కడపడితే అక్కడ గుట్టలు గుట్టలుగా కనబడే మామిడిపళ్ళు కనబడ్డమే మానేసాయి. హార్టీకల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు హైదరాబాద్ సిటీ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఒక మామిడిపళ్ళ మేళా ఏర్పాటు చేసారు. రాష్ట్రంలోని వివిధప్రాంతాల నుంచి వచ్చిన "కార్బైడ్ రహిత మామిడిపళ్ల విక్రయం" ఈ మేళా లోని ప్రత్యేకత. ఈనెల 1౩ నుంచీ మే నెల పధ్నాలుగు వరకు ఒక నెల పాటు ఈ మామిడిపళ్ల మేళా జరుగుతుందిట.

పేపర్లో చదివి ఈ మేళా ప్రారంభించిన రోజు మేము వెళ్ళాము. అప్పటికి ఇంకా అన్ని ప్రాంతాల నుండీ పళ్ళు రాలేదు. మొదటిరోజు అయినా జనం కూడా బాగా ఉన్నారు. ఆ రోజు వచ్చినపళ్ళు వచ్చినట్లే అయిపోయాయి. కొందరు అక్కడికక్కడే మావిడిపళ్ళు కొనుక్కుని తినేస్తుంటే ఆశ్చర్యం కలిగింది కూడా.






మళ్లీ ఓ వారం తరువాత వెళ్ళాము. కాస్త అన్ని స్టాల్స్ రకరకాల మామిడిపళ్ళతో నిండి ఉన్నాయి. మామిడిపళ్ళ రకాలు కూడా ఎక్కువ కనబడ్డాయి. జిల్లాలవారీగా ఈ ఎగ్జిబిషన్ లో మామిడిపళ్ళ విక్రయం జరుగుతుందిట. ఒక వారం విశాఖ, ఉభయగోదావరి జిల్లాలు, విజయనగరం, కృష్ణా, ఖమ్మం మొదలైన జిల్లాల నుండి పళ్ళు వస్తాయిట. నిన్నటితో ఈ జిల్లాల అమ్మకం అయిపోతుందనుకుంటా.







మాకు బంగినపల్లి, చెరుకురసాలు, సువర్ణరేఖ, పంచదారకలస, భూలోకసుందరి(బాగా ఎర్రగా ఉన్న ఈ పళ్ల గురించి వినలేదు నేను..:)), పెద్దరసాలు,చిన్న రసాలు, పచ్చడి కాయలు మొదలైనవి కనబడ్డాయి. పచ్చడి కాయల కోసం మార్కెట్ లోకి ప్రత్యేకం వెళ్ళక్కర్లేదు మళ్ళీ అని అక్కడే పచ్చడి కాయలు కొనేసాను. ఆవకాయకు ముక్కలు కొట్టి ఇస్తున్నారు కూడా.






ఇవాళ్టి నుంచీ పదిరోజులు గుంటూరు, నెల్లూరు, మెదక్,నిజామాబాద్ మొదలైన జిల్లాల నుంచీ, ఆ తర్వాత చివరిలో నల్గొండ, అనంతపురం, చిత్తూరు, కడప, ప్రకాశం, నల్గొండ మొదలైన జిల్లాల నుండి వచ్చిన మామిడిపళ్ళ అమ్మకం జరుగుతుందిట. ఇక మేళా లో మొదట్లో ఓ పక్కగా తెర్రెస్ గార్డేన్ లో మొక్కలు ఎలా పెంచవచ్చు, ఏ ఏ రకాలు పెంచవచ్చు చెబుతు కొన్ని మొక్కలు పెట్టారు. విత్తనాలూ, గార్డెనింగ్ పరికరాలు కూడా అమ్మకానికి పెట్టారు. జనాలు చూడటానికి పెంచిన కొన్ని బుజ్జి బుజ్జి మొక్కలు భలే ముద్దుగా ఉన్నాయి. వంకాయ, మిరప, కాకర, క్యాబేజ్, ఇంకా ఆకుకూరల మొక్కలతో పాటుగా మామిడి,అరటి,నిమ్మ మొదలైన పెద్ద పెద్ద చెట్లు టెరెస్స్ పై ఎలా పెంచవచ్చో చూపెట్టారు.



















మేళా లో ఓ పక్క సమోసా,చాట్,టీ లాంటివి ఉన్న స్టాల్, మరోపక్క ఫ్రెష్ ఫ్రూట్ ఐస్క్రీం స్టాల్ కూడా ఉన్నాయి. ఇలాంటిదే ఫ్రూట్ ఐస్క్రీం స్టాల్ జనవరిలో జరిగిన హార్టికల్చర్ ఎగ్జిబిషన్ లో కూడా పెట్టారు. మేమూ సీతాఫలం ఐస్క్రీం తిన్నాం. చాలా బాగుంది ఫ్లేవర్.



ఇక్కడ మామిడిపళ్ళ ధరలు కూడా రీజనబుల్ గానే ఉన్నాయి. స్టాల్స్ వాళ్ళు ఇస్తున్న ఈ మేళా లోగోతో తయారు చేసిన ప్లాస్టిక్ కవర్లు కూడా బాగున్నాయి. ఈ మ్యాంగో మేళా ఇంకా మరో ఇరవై రోజుల పాటు ఉంటుంది కాబట్టి కార్బైడ్ రహిత మామిడిపళ్ళు కావాలంటే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో జరుగుతున్న ఈ మామిడి మేళాకి వెళ్ళి కొనుక్కోవచ్చు.


Friday, April 20, 2012

పిచ్చి పిచ్చి పిచ్చి రకరకాల పిచ్చి - భానుమతి పాట



మా చిన్నప్పుడు నాన్నగారు రేడియోకి చేసిన కార్యక్రమాలు కొన్ని ఇంట్లో కూడా వింటూ ఉండేవారు. అలా మేము బాగా విన్న కార్యక్రమాల్లో బాగా గురుండిపోయిన పాటలు కొన్ని ఉన్నాయి. వాటిల్లో ఒకటి "పండంటి సంసారం" చిత్రానికి భానుమతి పాడిన పాట. ఎంతో వేదాంతం నిండిన ఈ పాటను ఆత్రేయ రాసారు. కె.వి.మహాదేవన్ సంగీతం. ఈ సినిమా కథ తెలీదు కానీ, ఆస్తి కోసం భానుమతిని పిచ్చిదని నమ్మించటానికి చూపే సందర్భంలో భానుమతి ఈ పాట పాడుతుంది అని అమ్మ చెప్పిన గుర్తు. చక్కని అర్ధం ఉన్న ఈ పాట విని మీరూ ఆనందించేయండి... 


 పాట: పిచ్చి పిచ్చి పిచ్చి రకరకాల పిచ్చి 
 సినిమా: పండంటి సంసారం 
సాహిత్యం: ఆత్రేయ సంగీతం: 
కె.వి.మహదేవన్ 
పాడినది: భానుమతి
 


సాహిత్యం:


చావే ఎరుగని ఇంటినుంచి ఆవాలు తెమ్మన్నాడుట బుద్ధుడు 
అలాగే మచ్చుకు ఏ పిచ్చిలేని ఒక మనిషిని చూపండి ఈనాడు 


ప: పిచ్చి పిచ్చి పిచ్చి రకరకాల పిచ్చి 
ఏ పిచ్చీ లేదనుకుంటే అది అచ్చమైన పిచ్చి 
((పిచ్చి)) 

1చ: మనసుంటేనే పిచ్చి, మతి ఉంటేనే పిచ్చి(2) 
మంచితనం అన్నింటిని మించిన పిచ్చి ((పిచ్చి)) 


2చ: వెర్రిమొర్రిగా ప్రేమించడమూ కుర్రవాళ్ల పిచ్చి 
కస్సుబుస్సుమని ఖండించటమూ కన్నవాళ్ళ పిచ్చి 
భక్తి పిచ్చి, ముక్తి పిచ్చి, విరక్తి పిచ్చి, 
పదవుల పిచ్చి, పెదవుల పిచ్చి, మధువుల పిచ్చి... ((పిచ్చి)) 


3చ: చీకటివెలుగులు కష్టసుఖాలు సృష్టించటమే దేవుడి పిచ్చి 
ఆ దేవుడి కోసం దేవులాడటం మనుషుల పిచ్చి ((పిచ్చి)) 


4చ: ఉన్నవాడికి ఇంకా ఇంకా కావాలని పిచ్చి 
వాడ్ని లేనివాడిగా చేయాలని లేనివాడికి పిచ్చి 
ఉన్నది లేదు లేనిది ఉంది అన్నది పిచ్చి 
నేనన్నది పిచ్చని అన్నవారికే ఉన్నది పిచ్చి ((పిచ్చి))



బాపూ ప్రాణం పోసిన "మన్యంరాణి"






పుస్తకాల షాపులో ఏవో పుస్తకాలు వెతుకుతుంటే ఒకచోట కనబడింది తెల్లని అట్టమీద అందమైన బాపూ బొమ్మ. ఏమిటా అని చూస్తే అది సినీదర్శకుడు వంశీ రాసిన "మన్యంరాణి" నవల. పుస్తకం తెరిచి, లోపల ఉన్న బొమ్మలు చూసి ఆశ్చర్యపోయాను. అవన్నీ నేను గత ఏడాది "బాపు బొమ్మల కొలువు"లో తీసిన ఫోటోల్లోవి. "మన్యంరాణి" నవల ఏదో పత్రికలో సీరియల్ గా వచ్చినట్లు, ఆ తర్వాత పుస్తకంగా రిలీజయినట్లు తెలుసుగానీ ఈ బొమ్మలు ఆ నవల తాలూకూ అని ఆ ఫోటోలని తీసినప్పుడు నాకు తెలీదు. పుస్తకం ఖరీదు చూస్తే 250/- ! కొనాలా వద్దా అని ఆలోచన... కాసేపు మిగతా పుస్తకాలు చూసేసి, కావాల్సినవి కొనేసాకా మళ్ళీ "మన్యంరాణి" దగ్గరకు వెళ్ళా. ఆర్ట్ పేపర్ మీద అందమైన ప్రింట్ తో బాపూ గీసిన అందమైన రంగురంగుల బొమ్మలు.. ప్రతి పేజీకీ సైడ్ బార్(మార్జిన్లా) గీసి అందులో కూడా చిన్న చిన్న బొమ్మలతో ఎంతో ఆకర్షణీయంగా ఉన్న ఆ పుస్తకాన్ని ఆఖరుకి కొనేసాను. అంతగా కొనుక్కోవాలనిపించేలా ఆకర్షణీయంగా డిజైన్ చేసిన అక్షర క్రియేషన్స్ వారు అభినందనీయులు.


గత ఏడాది "బాపు బొమ్మల కొలువు"లో నే తీసిన ఈ నవల తాలూకూ ఫోటోలు:










ఇక ఈ నవల కథా కమామిషు ఏంటా అని అంతర్జాలంలో వెతికితే, పుస్తకం.నెట్లో జంపాల గారు రాసిన వ్యాసం , ఈ పుస్తకఆవిష్కరణ సమయంలో వంశీ చెప్పిన మాటలు కనబడ్డాయి. తాను చిన్నప్పటినుండి `తిరిగిన రంపచోడవరం,మారేడుమిల్లి, గోకవరం మొదలైన ప్రాంతాలలో తనకెదురైన అనుభవాలను అక్షరీకరించి మన్యంరాణి నవల రచించినట్లు; రంపచోడవరం దగ్గర ఉన్న తన సొంతఊరు చుట్టుపక్కల పలు ప్రాంతాలలో,ఎన్నో మారుమూల ప్రాంతాలలో, ట్రైబల్‌ ఏరియాలో కూడా తాను తిరిగాననీ, ఆ అడవి చూస్తుంటే...ఈ నవల ఆలోచన కలిగాయి అని వంశీ చెప్పారు.




వంశీ చేసిన ఈ పరిశోధనాత్మక ప్రయాణాల వల్లనే ఈ నవలలో గిరిజనుల జీవన విధానం, కట్టుబాట్లు, ఆచారాలు,నమ్మకాలు మొదలైనవాటి గురించిన మంచి వివరణాత్మక వర్ణన సాధ్యమైంది అనిపించింది. ఈ నవల ద్వారా గిరిజనుల గురించి, ఆయా పల్లెల గురించీ ఎన్నో విషయాలు తెలిసాయి. కథ చదువుతుంటే అడవుల్లో నానాటికీ అంతరించిపోతున్న వృక్షసంపదల గురించి, మాయమౌతున్న అరుదైన పశుపక్ష్యాది జాతుల గురించి రచయిత పడే ఆవేదన స్పష్టంగా కనబడుతుంది. నవలలో చెప్పిన రకరకాల పక్షి జాతులు, ఎన్నో రకాల చెట్లు, పూతీగెలు, వివిధరకాల పళ్ళ గురించిన వివరాలు ఎంతో పరిశోధన చేస్తేనే తెలుస్తాయి. అరుదైన ఇంతటి విషయ సేకరణ చేయటం సామాన్యమైన విషయం కాదు. ముఖ్యంగా వంశీ వర్ణించిన అడవి అందాలు కళ్ళకు కట్టినట్లుగా, ఆ ప్రాంతానికి వెళ్ళి చూడాలి అనిపించేలా ఉన్నాయి. ఈ విషయంలో మాత్రం వంశీని అభినందించకుండా ఉండలేము.





అయితే, బాపూ గీసిన ఇంత అందమైన చిత్రాలకు సరిపోయే దీటైన కథ కూడా ఉంటే మన్యంరాణి ఒక అద్భుతమైన నవలగా మిగిలిపోయేదే. కానీ కథలో ఎక్కువైన నాటకీయత, చివర్లో అతకలేదనిపించిన ముగింపు కథను తేల్చేసాయి. కథకు ప్రాణంపోసేంతటి అందమైన బొమ్మలను బాపూ గీసినా, వాటికి దీటుగా నిలబడేంతటి గొప్ప కథ నవలలో లేకపోవటం నన్నెంతో నిరాశకు గురిచేసింది. కథలో ఎంతో ప్రాముఖ్యత ఇచ్చిన అందమైన నాయిక "కొమరం రాజమ్మ"కు ప్రత్యేకమైన వ్యక్తిత్వమేమీ లేకపోవటం, తన అందాన్ని అద్దంలోనో, కొలనులోనో చూసుకోవటం తప్ప కథనంలో ఆమె పాత్ర పెద్దగా ఏమీ లేకపోవటం ఆశ్చర్యం కలిగించింది. నవలలో నాకు నచ్చిన ఏకైక పాత్ర "కొమరం లచ్చన్న". ఈ లచ్చన్న మావే కథలో హీరో ! అడవితల్లిపై ఆ ముసలిగిరిజనుడికి ఉన్న ప్రేమాభిమానాలు, వన సంపదను రక్షించాలనే అతని తాపత్రయం, తోటి గిరిజనులకు అతను అందించే ఉచిత వైద్యసేవ అతడిని గుర్తుంచుకునేలా చేస్తాయి. ఇంతకు మించి కథలో చెప్పుకోదగ్గ పాత్రలేమీ లేవు.






పేజీల్లో మధ్య మధ్య ముఖ్యమైన సన్నివేసాలకు బాపు వేసిన అద్భుతమైన బొమ్మలే ఈ నవలకి ప్రాణం పోశాయి. ఆ బొమ్మలే నేనీ పుస్తకం కొనుక్కునేలా చేసాయి. ఇంతటి పరిశోధన జరిపాకా తనకు లభించిన సమాచారాన్ని ఇలా నవలలా కాకుండా, గిరిజనుల జీవనాన్ని గురించిన ఒక సమాచారాత్మక పుస్తకంగా వంశీ రాసి ఉంటే ఎంతో బాగుండేది. ఆయన సేకరించిన వివరాలకు సాహిత్యంలో సుస్థిర స్థానం దొరికిఉండేది అనిపించింది నాకైతే..!

Wednesday, April 4, 2012

ऐसा कॊई जिंदगी सॆ.. (vaadaa)




"వాదా" అని 2000 లో ఒక హిందీ ప్రైవేట్ ఆల్బం వచ్చింది. "రూప్ కుమార్ రాథోడ్" పాడిన పాటలకు, గుల్జార్ సాహిత్యాన్ని అందించారు. గాయని సాధనా సర్గమ్ కూడా కొన్ని పాటలు పాడారు. ఈ ఆల్బంలో "రూప్ కుమార్" పాడిన అన్ని పాటలూ వినటానికి బావుంటాయి.


అన్నింటిలోకీ ముఖ్యంగా మొదటి పాట "ఐసా కోయీ జిందజీ సే వాదా తో నహీ థా.." అనే పాట చాలా బావుంటుంది. గుల్జార్ అందించిన సాహిత్యం కూడా గుర్తుండిపోతుంది. ఈ పాట మధ్యలో వచ్చే ఫ్లూట్ బిట్స్ పాట యొక్క మూడ్ తాలుకు ఇంటెన్సిటీకి బాగా సరిపోతాయి.


album: Vaada
lyrics: Gulzar
singer: Roop Kumar Rathod



సాహిత్యం:


ऐसा कॊई जिंदगी सॆ वादा तो नही था
तॆरॆ बिन जीनॆ का इरादा तो नही था


तॆरॆ लियॆ रातों मॆं चंदनी उगाई थी
क्यारियॊं में खुशबू की रॊशनी लगाई थी
जानॆ कहां टूटी है डॊर मेरॆ ख्वाबों की
ख्वाब सॆ जागॆंगॆ सॊचा तॊ नही था


शामियानॆ शामॊं कॆ रॊज ही सजायॆ थॆ
कितनी उम्मीदॊं कॆ मेहमान बुलायॆ थॆ
आकॆ दरवाजॆ सॆ लौट गयॆ हो
यू भी कॊई आयॆगा सोचा तो नही था






ఈ ఆల్బంలోని కొన్ని పాటలను ప్రఖ్యాత సరోద్ వాదకుడు ఉస్తాద్ అంజద్ అలీఖాన్ సరోద్ పై వాయించటం ఈ ఆల్బంలో ప్రత్యేకత. ఈ కేసెట్ లోని మొత్తం పాటలను క్రింద లింక్ లో వినవచ్చు:


http://www.dhingana.com/hindi/vaada-roop-kumar-rathod-songs-roop-kumar-rathod-ghazals-3c295d1

Sunday, April 1, 2012

పండిట్ రోనూ మజుందార్




'వీరు మన భారతీయులు' అని మనం గర్వపడదగ్గ భారతీయ సంగీత కళాకారుల్లో ఒకరు "పండిట్ రోనూ మజుందార్". ప్రసిధ్ధ వేణుగాన విద్వాంసులు. మొదట తండ్రి డా.భాను మజుందార్ వద్ద, ఆ తర్వాత మరి కొందరు ప్రసిధ్ధ వేణుగాన విద్వాంసుల వద్ద అభ్యసించాకా రోనూ మజుందార్ మన తెలుగువారైన
ప్రసిధ్ధ వేణుగాన విద్వాంసులు పం.ఏల్చూరి విజయరాఘవరావు గారి వద్ద కూడా వేణుగానాన్ని అభ్యసించారు. "A Travellers Tale", "Bansuri", "Breathless Flute", "Hollow Bamboo" మొదలైనవి రోనూ చేసిన పాపులర్ ఆల్బంస్ లో కొన్ని.


జాకీర్ హుసేన్, విశ్వమోహన్ భట్ మొదలైన కళాకరులతో కలిసి కచేరీలు చేసారు రోనూ. రోనూ మజుందార్ గురించిన మరిన్ని వివరాలు వారి వెబ్సైట్ లో చూడవచ్చు.


వింటున్నంత సేపూ మనోహర లోకంలో విహరింపజేసే రోను మజుందార్ వేణుగాన నైపుణ్యాన్ని తెలిపే కొన్ని బిట్స్:


1) breathless flute:




2) Dreams - Pt Ronu Majumdar





3) Encounter at Madurai




4)Pandit Ronu Majumdar- Flute - Miya Malhar





6) Raag Pahadi by Pandit Ronu Majumdar

Saturday, March 31, 2012

శ్రీ దువ్వూరి వేంకటరమణశాస్త్రి గారి "జానకితో జనాంతికం" ఆడియో



శ్రీ దువ్వూరి వేంకటరమణశాస్త్రి గారి రచన "జానకితో జనాంతికం" ఒక అద్భుతమైన వాక్ చిత్రం. 1975లో ఆయనే సొంతంగా చదవగా విజయవాడ ఆకాశవాణి ద్వారా ప్రసారమైంది. ఒకసారి దువ్వూరివారు విజయవాడ రేడియోస్టేషన్ కి విచ్చేసిన సందర్భంలో ఏదైనా మాట్లాడవలసిందిగా వెంకటరమణశాస్త్రిగారిని కోరితే, ముందస్తు తయారి లేకపోయినా అప్పటికప్పుడు "జానకితో జనాంతికం" స్క్రిప్ట్ చదివారిట వారు. రికార్డింగ్ సదుపాయాలు సరిగ్గాలేని అప్పటి పాత విజయవాడ ఆకాశవాణి స్టూడియోలో రికార్డింగ్ జరిగిందిట.


అప్పటికే పెద్ద వయసు అయినా, ఇందులో దువ్వూరి వారు తన స్వరంలో కనబరిచిన ఆర్ద్రత, సీతమ్మవారిపై కనబరిచిన గౌరవాభిమానాలు, వాయిస్ మాడ్యులేషన్ ఎంతో అద్భుతంగా ఉంటాయి. ఒక వాక్యాన్ని ఎలా పలకాలి, మైక్ ముందర ఎలా మాట్లాడాలి అని కొత్తగా ఆకాశవాణిలో చేరినవారికి చెప్పటానికి టేపుని వినిపిస్తూ ఉండేవారుట.

రేపటి శ్రీరామనవమి సందర్భంగా దువ్వూరివారి స్వరంలో ఉన్న వాక్ చిత్రాన్ని టపాలో అందించాలని ప్రయత్నం. చాలా పాత రికార్డింగ్ అవటం వల్ల స్పష్టత కాస్త తక్కువైంది.. ! దువ్వూరివారి స్వరంలో ఉన్న పాత రికార్డింగ్ క్రింద లింక్లో వినవచ్చు.

 

పదిహేనేళ్ల క్రితం ఒక శ్రీరామనవమి సందర్భంలో ఆంధ్రప్రభ పత్రిక వారు వాక్ చిత్రాన్ని అక్షరరూపంలో ప్రచురించారు. కాపీ ఇక్కడ చూడవచ్చు.


దువ్వూరి వారి స్వీయ చరిత్ర ( కళాప్రపూర్ణ దువ్వూరి వేంకటరమణశాస్త్రి స్వీయచరిత్ర ) గురించి పుస్తకం.నెట్ లో ప్రచురితమైన 'మెహెర్'గారి వ్యాసం ఇక్కడ చూడవచ్చు.


Friday, March 30, 2012

మోరీ పళ్ళు - Chironji






నిన్న ఒక టపా రాసాను "ఈ పళ్ళు ఏమిటో తెలుసా? " అని. పైన ఫోటో లోనిది ఆ పళ్ళు కాసే చెట్టు.నిన్నటి టపాలో ఇద్దరు(కృష్ణ గారు, సైలజ గారు) సరైన సమాధానం రాసారు.





ఇది ఒక ఔషధవృక్షం. ఈ పళ్ళను "మోరీ పళ్ళు" అంటారు. ఇవి ఈ సీజన్లోనే దొరుకుటాయి. చెట్టు నిండా పళ్ళు విరగ కాస్తాయి.జనవరి ఫిబ్రవరిల్లో ఈ చెట్టు నిండా పువ్వులతో నిండిపోతుందిట. ఇలా







మార్చి, ఏప్రిల్ నెలల్లో పళ్ళు కాస్తాయిట. గుండ్రంగా, ఆకుపచ్చ గా ఉండి తర్వాత నల్లగా మారిపోతాయి ఈ పళ్ళు. అచ్చం నేరేడు పళ్లలాగే వగరుగా,తియ్యగా,పుల్లగా ఉంటుందీ పళ్ళ రుచి.






వీటిలోపల గింజలను ఎండబెట్టి ఓపిగ్గా కొట్టుకుంటే లోపల పప్పు ఉంటుంది. ఆ పప్పునే మనం "సారపప్పు" అంటాం. ఇంగ్లీషు లో chironji అంటారు. స్వీట్స్ లోనూ, ఖీర్ లోనూ వేస్తారు.







ఈ చెట్టు వివరాలు, సారపప్పు వివరాలూ ఆసక్తి ఉన్నవారు క్రింద వెబ్సైట్ లింక్స్ లోకి వెళ్ళి చూడవచ్చు.











Thursday, March 29, 2012

ఈ పళ్ళు ఏమిటో తెలుసా?


చిన్నగా, గుండ్రంగా, నల్లగా ఉన్న ఈ పళ్ళ పేరు తెలుసా?
నేరేడుపళ్ల రుచి కలిగి ఉంటాయి ఈ పళ్ళు. అన్నికాలాల్లోనూ రావు ఇవి.

బహుశా ఇది ఈ పళ్ళు దొరికే సీజనేమో మరి.. నిన్నను దొరికాయి.

పళ్ల క్రింద ఉన్నవి ఆ చెట్టు ఆకులే.


ఈ ఫొటోలోవి ఈ పండు లోపల ఉన్న గింజలు.

ఇవి ఎండబెట్టి లోపల ఉన్న పప్పు కూడా తింటారు.







Monday, March 26, 2012

తిరుపతి - శ్రీకాళహస్తి

 







మేం నడిచివచ్చిన దారి - పైనుంచి


సుమారు నాలుగైదేళ్ల తరువాత తిరుమలేశుని దర్శనానికి రెండువారాల క్రితం వెళ్ళి వచ్చాం. రెండుమూడు సార్లు అనుకున్న ప్రయాణం ఆగిపోయి ఇప్పటికి కుదిరింది. పరీక్షల సమయంలో రద్దీ తక్కువ ఉంటుందని ఇప్పుడు పెట్టుకున్నాం. సావకాశంగా రాయాలనుకోవటం వల్ల వెళ్ళొచ్చిన పదిహేనురోజులకి ఇప్పటికి టపా రాయటం అవుతోంది. తిరుపతి చాలామంది చాలాసార్లు వెళ్ళి వస్తుంటారు. ఇదేమీ అరుదైన ప్రయాణం కాదు కానీ మేము గత నాలుగుసార్లుగా కొండపైకి నడిచి వెళ్తున్నాము. అలా నడిచివెళ్ళాలనుకునేవారికి ఏదైనా వివరాలు తెలిపినట్లుంటుందని ఈ టపా.

 
తిరుమలకి మెట్లు ఎక్కివెళ్ళిన గత మూడుసార్లు కూడా మేము అలిపిరి వద్ద నున్న మెట్ల దారి మీదుగానే వెళ్ళాం. ఆ దారి మొదట్లో లగేజ్ ఇచ్చేస్తే మనం వెళ్ళే సమయానికి పైకి తెచ్చేస్తారు. దారి పొడుగునా ఏవో స్టాల్స్, తినుబండారాలు అమ్ముతూనే ఉంటారు. ఉదయంపూట బయల్దేరితే ఈ మెట్లదారి అనువుగా ఉంటుంది. ఎండపెరిగే సమయనికి పైకి చేరిపోవచ్చు. మధ్య మధ్య ఉండే కాలి బాట, రోడ్డు, డీర్ పార్క్లోని లేళ్ళు, చుట్టూ ఉండే చెట్లు, కొండలతో చాలా ఆహ్లాదకరంగా ఉంటుందీ దారి. ముఖ్యంగా వర్షాకాలంలో వెళ్తే మంచి అనుభూతులను సొంతం చేసుకోవచ్చు. నాలా ఫోటోల పిచ్చి ఉన్నవాళ్ళు అయితే కొత్తగా కనబడిన ప్రతి చెట్టుకి,పుట్టకి ఫోటోలు తీసుకోవచ్చు. సగం దారికి వెళ్ళేసరికీ వేడి వేడి మిర్చి బజ్జీలు మొదలైనవి మనల్ని వాటివైపుకి లాగుతూ ఉంటాయి.

 
కానీ ఈ దారిలో వెళ్ళినప్పడల్లా నాకొక సందేహం వచ్చేది.. ఇలా కులాసాగా తింటూ, టీలు, కూల్డ్రింకులూ తాగుతూ, కావాల్సినంత సేపు ఆగుతూ కష్టం తెలీకుండా మెట్లు ఎక్కితే పుణ్యమేనా? అని. కొందరయితే చెప్పులు కూడా వేసుకుని ఎక్కేస్తారు. ఈ మెట్ల దారికిరువైపులా రాసి ఉండే గోవిందనామాలు చదువుకుంటూ ఎక్కటానికి వీలుగా బావుంటాయి. మాకు మొదటిసారి అమ్మనాన్న కూడా ఉండటంతో వాళ్లతో నెమ్మదిగా ఎక్కటం వల్ల ఐదు గంటలు పట్టిది. తర్వాత రెండుసార్లు కూడా మూడున్నర, నాలుగు గంటల్లో ఎక్కేసాం. ఒక్కళ్లం వెళ్ళేకన్నా నలుగురితో కలిసి వెళ్తే కబుర్లలో అలుపు తెలియదు. రెండవసారి వెళ్ళినప్పుడూ మొక్కులేకపోయినా వీలయినన్నిసార్లు మెట్లదారిలోనే వచ్చే శక్తిని ఇమ్మని వెంకటేశ్వరుడికి దణ్ణం పెట్టేసుకున్నా. అలా ఇప్పటికి అలిపిరి దగ్గరి మెట్లదారిలో మూడు సార్లు వెళ్లివచ్చాం. 








మేం వెళ్ళిన మెట్లదారి మొదలు


మళ్ళీ నాలుగైదేళ్ల తరువాత పదిహేనురోజులక్రితం తిరుపతి వెళ్ళివచ్చాం. అయితే ఈసారి అలిపిరి దారి కాక శ్రీనివాస మంగాపురం నుండి ఐదారు కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీవారి మెట్టు వద్ద ఉన్న మెట్ల దారి గురించి తెలిసింది. ఈ కొత్తదారిలో వెళ్దాం అని బయల్దేరాం. ఏడాది క్రితమే ఈ దారిని బాగుచేసారని ఆటో అబ్బాయి చెప్పాడు. సుమారు రెండువేలనాలుగొందల మెట్లు ఉంటాయి ఈ దారిలో. అన్ని మెట్లే. మధ్యలో రోడ్డు ఉండదు. సమంగా ఎక్కగలిగితే రెండుగంటల్లో చేరిపోవచ్చు అని చెప్పారు. అయితే ఇక్కడ దారిలో ఏ విధమైన తినుబండారాలు అమ్మరుట. దారిపొడుగునా టిటిడి వాళ్ళు పెట్టిన పంపుల్లో మంచినీళ్ళు, వాష్ రూమ్స్ మాత్రం ఉంటాయని చెప్పారు.
 









నడకదారిలో ధ్యానముద్రతో దర్శనమిచ్చిన శంకరుడు


అందువల్ల క్రిందనే ఓ రెండులీటర్ల బిస్లరీ వాటర్ బాటిల్ కొనేసుకుని బయల్దేరాం. మెట్లకు పసుపు-కుంకుమ పెట్టి ఎక్కేవారు ఇటు ఎక్కువగా వెళ్తూంటారేమో అనుకున్నాం. నయనానందకరంగా లేకపోయినా అలిపిరి మెట్లదారి కన్నా ఈ మెట్ల దారి మాకు బాగా నచ్చింది. అడుగడుక్కీ తినుబండారాల కొట్లు లేకపోవటం మరీ నచ్చింది. అటుఇటు గోవిందనామాలు రాసి ఉంచారు. మెట్లు కూడా ఏంతో పరిశుభ్రంగా ఉండటం ఆశ్చర్యం కలిగించింది. ఎక్కడికక్కడ టిటీడి సిబ్బంది మెట్లు తుడుస్తూ కనబడ్డారు. అడుగడుక్కీ మంచినీళ్ల పంపులు కూడా బాగా పెట్టారు. దారిపొడుగునా మెట్లపైన షెల్టర్ వేడి తగలకుండా కాపాడుతుంది.

మొదట్లో త్వరగా మెట్లు ఎక్కేస్తే త్వరగా అలసిపోతాము. అలాకాకుండా మొదటి నుంచీ నెమ్మదిగా ఎక్కితే త్వరగా అలసట రాదు. మేము అలా నెమ్మదిగా రెండున్నర గంటల్లో ఈ మెట్లన్ని ఎక్కేసాము. ఇక్కడ మధ్యలో మెట్లదారిలో వచ్చేవారికి "దివ్య దర్శనం" టికెట్లు ఇస్తున్నారు. ఆ టికెట్ ద్వారా శ్రీవారి దర్శనం కూడా మామూలు కన్నా త్వరగా అయిపోతుందిట.









దారిలో విచిత్రంగా తోచిన చెట్టుకాయలు


మెట్లు ఎక్కగానే వెళ్పోయి ఉంటే మాకూ అలా రెండుగంటల్లో దర్శనం అయిపోయేది. కానీ మా పాపను క్రిందన ఉంచాము. తను వచ్చి మేము క్యూలో చేసేసరికీ బ్రేక్ దర్శనం టైమ్ అయిపోయి లోపల జైల్లో ఇరుక్కుపోయాం. జైల్లా ఉండే ఆ కంపార్టుమెంట్లలో గంటల తరబడి కూచోవటం ఓ పెద్ద శిక్ష. ఈ పధ్ధతిని మార్చే ప్రయత్నం ఏదైనా టిటిడి వాళ్ళు చేస్తే బావుంటుంది. ఆ జనాల్లో ఏ హార్ట్ పేషంట్ కో ఏదైనా జరిగితే పట్టించుకునే దిక్కు, బయటపడే మార్గం కూడా లేవక్కడ. ఇది చాలదన్నట్లు క్యూల్లో జనాలకు కంట్రోల్, సహనం ఉండవు. తలుపు తియ్యగానే పొలోమని తోసేసుకుంటారు. ఏ గుడిలో చూసినా ఇదే తోపులాట. శిరిడి వెళ్ళినా, వేరే ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా దైవదర్శనం జరిగిందన్న ఆనందం కన్నా ఈ తోపులాటల వల్ల పెరిగే అశాంతే ఎక్కువౌతోంది. అలా నాలుగుగంటలు పట్టినా తిరుమలేశుని దర్శనం బాగా జరిగింది.

శ్రీకాళహస్తి:

తిరుపతికి సుమారు నలభై కిలోమీటర్ల దూరంలో "శ్రీకాళహస్తి" ఉంది. "శ్రీ" అనగా సాలెపురుగు, "కాళము" అంటే పాము, "హస్తి" అంటే ఏనుగు. ఈ మూడు ప్రాణులూ ఈ చోట పరమేశ్వరుడిపై తమకున్న భక్తిని చాటుకుని మోక్షాన్ని పొందాయి కాబట్టి ఈ ప్రాంతానికి "శ్రీకాళహస్తి" అని పేరు వచ్చింది. ఈ ప్రాంత మహత్మ్యం గురించి "శివపురాణం", "శ్రీ కళహస్తి మహత్మ్యం " మొదలైన పురాణాల్లో తెలుపబడింది. స్వయంభూలింగంగా భావించే ఈ కాళహస్తీశ్వరుడిది వాయులింగ స్వరూపమట. కాళహస్తి ఆలయానికి దగ్గరలో "స్వర్ణముఖి" నది కూడా ప్రవహించేదిట...ఇప్పుడు ఎండిపోయింది. ఈ నదిలో నీరు లేకపోవటానికి అగస్త్యుడి శాపమే కారణమని కొందరు చెప్తారు.








శ్రీకాళహస్తి గుడి


ఊహ తెలిసాకా శ్రీకాళహస్తి వెళ్లలేదు నేను. అందుకని ఈసారి ప్రత్యేకం శ్రీకాళహస్తి వెళ్లాం. లక్కీగా అక్కడ శ్రీకాళహస్తీశ్వర స్వామికి, అమ్మవారు జ్ఞానప్రసూనాంబల దర్శనం బాగా జరిగింది. మేం వెళ్ళిన సమయంలో బయటకు పల్లకీ ఊరేగింపుకి వచ్చారు స్వామివారు. గుడి తాలూకూ కట్టడం, ప్రాకారాలు అన్నీ బాగున్నాయి. అయితే ఇక్కడ కూడా చాలా చోట్లలాగ గుడి ఆవరణంలో పసుపు కుంకుమ ఇచ్చి డబ్బులడిగే అర్చకులను చూడ్డం విచారకరంగా తోచింది.



తిరుగుప్రయాణంలో తిరుపతి స్టేషన్లో నాకు ఇష్టమైన సన్నజాజుల చిక్కటిమాల దొరకటం సంతోషాన్నిచ్చింది.








సన్నజాజులు తురిమిన మా చిన్నది



Friday, March 23, 2012

బ్లాగ్మిత్రులందరికీ ఉగాది శుభాకాంక్షలు




శ్రీ నందననామ నూతన సంవత్సరం ప్రతి ఇంటా విజయాన్నీ, ఆనందాన్నీ నింపాలని,
అందరికీ ఆయురారోగ్యాలను అందివ్వాలని మనసారా కోరుకూంటూ...
బ్లాగ్మిత్రులందరికీ ఉగాది శుభాకాంక్షలు.