సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Wednesday, November 21, 2012

షిర్డి - ఘృష్ణేశ్వర్ - ఎల్లోరా - 2





ఎల్లోరా గుహలు: 

ఘృష్ణేశ్వరుడి దర్శనం అయ్యాకా "ఎల్లోరా" గుహలకి తీసుకువెళ్ళాడు. బౌధ్ధ, జైన, హిందూ మతాలకి స్మారక చిహ్నాలు ప్రపంచ ప్రసిధ్ధి గాంచిన ఈ ఎల్లోరా నిర్మాణాలు. ఈ మూడు మతా వ్యవస్థలనూ ప్రతిబింబించే శిల్పకళారీతులు ఈ గుహల్లో మనకు కనబడతాయి. అతిప్రాచీనమైన ఈ గుహల నిర్మాణం క్రీ.శ.500 మరియు 700 మధ్యన జరిగిఉంటుందని అంచనా. న్యాయంగా చెప్పాలంటే ఒక రోజంతా తీరుబడిగా ఉండి మొత్తం ముఫ్ఫైనాలుగు గుహలూ చూడాల్సిన మాట. అంత అద్భుత కట్టడాలు ఇవి. అన్నింటిలో ముఖ్యమైనవి పదహారవ గుహ, ముఫ్ఫై రెండవ గుహా ట. మాతో వచ్చిన ఢిల్లీ వాళ్ళు డిస్కవరి ఛానల్లో ఎల్లోరా గుహలను గురించిన కార్యక్రమం చూసారుట. వాళ్ళే మాకు ఏ గుహలో ఏమున్నాయో అన్నీ చెప్పారు. సో, మేము సైతం ఎల్లోరా గుహల విశేషాలను పరోక్షంగా డిస్కవరి ఛానల్ ద్వారా తెలుసుకున్నామన్న మాట :౦  ముఫ్ఫైదాకా గుహలన్నీ చూసాం. ఆ పై దారి మూసేసారు. మరమత్తు జరుగుతోంది. వేరే రోడ్డు మార్గం ఉంది ఆ ముఫ్ఫై రెండవ గుహకు తీసుకెళ్లవయ్యా అంటే మా వాన్ డ్రైవర్ ఒప్పుకోలేదు :( ఇక next  tripలో అజంతా గుహలతో పాటూ మిగిలినవీ చూడాలి అనుకున్నాం.








"శిలలపై శిల్పాలు చెక్కినారు...మనవాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు...",  "ఈ నల్లని రాలలో ఏ కన్నులు దాగెనో.." అని పాడుకుంటూ, చాలామటుకు శిధిలమైపోయిన ఆ శిల్పకళాసృష్టిని చూస్తూ ఉద్వేగపడుతూ.. ఏవో ఆలోచనల్లోకి వెళ్పోయా నేను. ఎందుకనో ఈ చారిత్రాత్మక కట్టడాలంటే నాకు చాలా ఇష్టం. కోటలూ, మ్యూజియమ్స్, గుహలు, పురాతనమైన ఆలయాలూ.. ఇలాంటివన్నీ వీలయినన్ని చూడాలని నా కోరిక. ఎప్పుడో.. ఏ గతజన్మలోనో ఏదో ఒక చరిత్రతాలుకూ పుటల్లో నేనూ ఓ భాగమై ఉంటానని నాకో పిచ్చి విశ్వాసం..:) ఆలోచిస్తూ కంటికి నచ్చిన ప్రతిశిల్పాన్నీ ఫోటో తీసాను.

అసలు మన దేశ కళాత్మక చరిత్రకూ, అద్భుత శిల్పకళా నైపుణ్యానికీ ప్రతీకలైన ఇటువంటి చారిత్రాత్మక కట్టడాలను గూర్చిన చరిత్రను తెలుసుకుంటూ, చాలా పరిశీలించి, అనుభూతి పొందుతూ, గర్వపడుతూ చూడాలి. కానీ చెప్పుల్లో కాళ్ళు పెట్టుకుని వచ్చే మాబోటి యాత్రికులకు ఈ దొరికే గంటా, రెండుగంటల సమయమే మహాప్రసాదం.










భద్ర మారుతీ సంస్థాన్: 
ఆ తర్వాత  "భద్ర మారుతీ మందిర్" అనే హనుమంతుడి గుడికి తీసుకువెళ్లాడు. అక్కడ గుడి తాలూకూ కథ ఒక చోట రాసి ఉంది. భద్రసేనుడనే రాజు కి ఇచ్చిన మాటపై హనుమంతుడు అక్కడ వెలసాడుట. ఇక్కడి విశేషం ఏమిటంటే ఎప్పుడూ చూడనటువంటి రీతిలో మారుతి పవళించి ఉన్న విగ్రహం అక్కడ ఉంది.  గుడి లోపల అద్దాలతో చేసిన నిర్మాణం ముచ్చటగొలిపేలా ఉంది. అక్కడ కూచున్న కాసేపూ అలౌకికమైన ప్రశాంతతతో మనసు ఆహ్లాదంగా మారిపోయింది.



ఆ తర్వాత దేవగిరి కోట మీదుగా "బీబీ కా మక్బరా" కు తీసుకువెళ్లాడు డ్రైవర్. దౌలతాబాద్ కోటే శివాజీ రాజయ్యాకా దేవగిరి కోట అయ్యిందిట. "మినీ తాజ్ మహల్" అంటూ ఔరంగజేబ్ భార్య గోరీపై అతని కుమారుడు తల్లి స్మృత్యర్థం కట్టిన "బీబీ కా మక్బరా" కు తీసుకువెళ్ళాడు. ఆ నిర్మాణానికి అప్పట్లోనే ఆరులక్షల అరవైఎనిమిదివేల రెండువందల చిల్లర అణాలు ఖర్చు అయ్యిందిట. నవ్వు తెప్పించిన విషయం ఏంటంటే కట్టడం లోపల ఉన్న మక్బరా పై జనాలు చిల్లర విసిరి దణ్ణం పెడుతున్నారు. ఆవిడ ఓ రాజుకి భార్య తప్ప దేవత కాదు కదా.. ఒకళ్ళు చేస్తే అందరూ చేస్తారు.. అలా ఎందుకు చెయ్యాలి అని ఆలోచించరేమిటో ! బయట వాటర్ బాటిల్ కొంటూంటే చిల్లర లేదంటే కొట్టువాడు కూడా "జనాలు చిల్లరంతా లోపలికి తీశుకువెళ్ళి వ్యర్థంగా వేసేస్తారు. మాకేమో ఇవ్వరు..’ అన్నాడు. అతనికున్న ఆలోచన లోపల చిల్లరవేసేవాళ్ళకి కలగదో ఏమో! ఆ చిల్లర నిండిన మక్బరాకి ఫోటో తియ్యబోతూంటే ఇకచాలన్నట్లు బ్యాటరీల్లో ఛార్జ్ కూడా అయిపోయింది. ఇంతకన్నా దేవగిరి కోట చూపించమని అడగాల్సింది అనుకున్నాం.



మేము ఎక్కిన వాన్ లో మాతో పాటూ మరో నాలుగు కుటుంబాలవారు ఎక్కారు. ఒక తెలుగు, ఒక ఢిల్లీ, ఒక ఒరియా, మరొక మరాఠీ. డైవరు మరాఠీ. ఒరియావాళ్ళు నదిలో వదలాల్సినదేదో ఉందనీ, ఏదైనా ప్రవహించే నది వద్ద వాన్ ఆపమనీ బండాగిన ప్రతి చోటా డ్రైవర్ని అడుగుతున్నారు. ఎక్కిన దగ్గర్నుంచీ "పానీవాలా జగహ్..పానీ వాలా జగహ్.." అని చంపుతున్నారు అని డ్రైవర్ విసుక్కున్నా, చివర్లో చీకటిపడినా గోదావరి ప్రవహించే ఓ చోట ఆపాడు.

మళ్ళీ శిర్డీ:
ఆ రాత్రి తొమ్మిదిన్నరకి మమ్మల్ని శిర్డీ లో దింపాడు డ్రైవర్. రూంకెళ్ళి ఫ్రెష్ అయ్యి, రాత్రి హారతికి మందిరంలోకి వెళ్లాం. బాబా విగ్రహం ముందర ఉన్న హాలుదాకా వెళ్ళాకా లైన్ ఆపేసారు. అక్కడే కూచోబెట్టేసారు అందరినీ. ఆ విధంగా హాయిగా బాబాగారి ముందర కూచుని రాత్రి హారతి కూడా తిలకించాం. ఇదివరకూ హారతి అయ్యాకా దర్శనానికి పంపేవారు. కానీ ఇప్పుడు హారతి అయ్యాక తలుపులు మూసేసి, హాల్లోవాళ్లని బయటకు పంపేస్తున్నారు. క్లీనింగ్ కి టైం దొరకట్లేదుటవాళ్లకి. అందుకని మర్నాడు పొద్దున్నే మళ్ళీ దర్శనానికి వెళ్ళాం మేము. అప్పటికి జనాలు పెరగటం గమనించాం. ఇక ఆదివారం నుండీ దీపావళి శెలవులయ్యేదాకా బాగా జనం ఉంటారుట. పొద్దున్నే వెళ్ళాం కాబట్టి జనం ఉన్నా గంటన్నరలో మరో మంచి అద్భుతమైన, ప్రశాంతమైన దర్శనం చేసుకుని బయటకు వచ్చేసాం.


శిర్డి దగ్గర్లోని పంచముఖ గణపతి గుడి ఈమధ్యన బాగా పేరుపొందిందిట. అక్కడికి వెళ్లాం. అక్కడ పక్కనే ఉన్న హనుమంతుడి గుడి, అన్నపూర్ణాదేవి గుడీ బాగున్నాయి.









అనుకున్న దర్శనాలు, సందర్శనాలు అయిపోయాయి కాబట్టి ఇక రిటర్న్ బస్సు టికెట్ల కోసం ప్రయత్నాలు మొదలెట్టాం. ఏడొందల బస్సు టికెట్లు పదమూడొందలు పలికాయి ఆరోజు. లక్కీగా మాకు కాస్త తక్కువకే దొరికాయి. మందిరం పక్కనే షాపింగ్ కాంప్లెక్స్ కట్టాకా నేను మిస్సవ్వని "రాజధాని" భోజనం చేసేసి, కాస్త షాపింగ్ చేసేసి, సాయంత్రం బస్సెక్కేసాం. అలా మూడురోజులు పడుతుందనుకున్న ప్రయాణం బాబా దయవల్ల  రెండ్రోజుల్లోనే దిగ్విజయంగా పూర్తయిపోయింది.



ఈ ప్రయాణం తాలుకూ మరికొన్ని ఫోటోలు ఇక్కడ:
http://lookingwiththeheart.blogspot.in/2012/11/1.html
http://lookingwiththeheart.blogspot.in/2012/11/2.html



సర్వేజనా:సుఖినోభవంతు!