సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Tuesday, February 18, 2020

కుసుమత్త

                                         
                                


మొన్న ఆదివారం పొద్దున్నే అన్నయ్య ఫోన్ చేసాడు. "కుసుమత్త ఫోన్ చేసిందే. వాళ్లమ్మాయి పెళ్ళట. అందరూ తప్పకుండా రావాలని చెప్పింది. పిల్లాడి పెళ్ళికి ఎవరూ రాలేదు. అమ్మయి పెళ్ళికి తప్పకుండా రావాలని మరీ మరీ చెప్పింది" అన్నాడు. ఉత్సాహంగా వెళ్దామంటే వెళ్దాం అనేసుకుని కాసేపు కుసుమత్త కబుర్లు చెప్పుకున్నాం. కానీ తారీఖు చూస్తే పరీక్షల సమయంలో.. కుదురుతుందో లేదో తెలీదు! కుసుమత్త ని తల్చుకుంటే చల్లని తెమ్మెర మొహాన్ని తాకినట్లుంటుంది. అంత హాయి కలుగుతుంది మనసుకి. ఇన్నేళ్ళు గడిచిపోయినా అదే ఆప్యాయత, అదే అభిమానం!! ఈనాటి పరిచయాలకి అటువంటి విలువ ఎక్కడ..?!

కొన్ని కారణాల వల్ల ప్రతి రెండు మూడు నెలలకి ఓసారి కాకినాడ వెళ్ళివచ్చిన చిన్ననాటి రోజులు అవి. ఇరుగుపొరుగువాళ్లని అత్త, పిన్ని, అక్క అంటూ వరసలతో ఆప్యాయంగా పిలుచుకునే రోజులు! ఐదో, ఆరో క్లాసు. మా కాకినాడ ఇంట్లో నాలుగు వాటాలు, ముందర వైపు రెండు గదుల చిన్న షెడ్డు ఉండేవి. షేడ్ లోనూ, మూడు వాటాల్లోనూ అద్దెకు ఉండేవారు. చాలా కుటుంబాలవారు ఉద్యోగ రీత్యా మారుతూ ఉండేవారు. ఒకసారి మేము కాకినాడ వెళ్ళినప్పుడు పొద్దున్నే రోజూ వచ్చే కూరలబ్బాయి సైకిల్ మీద వచ్చాడు. ఆ రోజు నాకు బాగా గుర్తు! మా మామ్మయ్య కూరలు తీసుకుంటూ నన్ను పిలిచింది. "ఒసేయ్ పైకి వెళ్ళి కుసుమత్తని కూరలబ్బాయి వచ్చాడని పిలుచుకురా" అంది. "కుసుమత్త ఎవరు?" అన్నాన్నేను. "ఈమధ్య కొత్తగా వచ్చారు. వెళ్ళు త్వరగా" అంది మళ్ళీ. "కొత్తవాళ్ళా.. నాకు తెలీదుగా...అత్తా అని ఎందుకు పిలవాలి.." అని నేను నసిగాను. "నోరుమూసుకుని వెళ్ళూ...కుసుమత్తా అని పిలువు" అని మామ్మయ్య గట్టిగా ఆర్డర్ వేసింది. ఇంక పిల్లిలా నెమ్మదిగా మెట్లెక్కి వెళ్తే తలుపు వేసి ఉంది. సందులో బట్టలు ఆరేసి ఉన్నాయి, అవి తోసుకుంటూ వెళ్తే వంటింటివైపు తలుపు తీసి ఉంది. ఒకావిడ కనబడింది. "కుసుమత్తా..." అని కిటికీలోంచి పిలిస్తే ఇటు చూసింది. "కూరలబ్బాయి వచ్చాడని మామ్మయ్య చెప్పమంది" అనేసి పరిగెత్తుకుని వచ్చేసా. తను కిందకి వచ్చి కూరలు కొంటూంటే మామ్మయ్య తనతో చెప్పింది.. "మా అబ్బాయివాళ్ళు వస్తారని చెప్పా కదా...ఇది నా మనవరాలు" అని చెప్పింది.

టి.వి లేని రోజులు అవి. అన్నయ్య స్కూలుకి వెళ్పోయాడు. దోడ్లో మొక్కల్లో తిరగడం అయిపోయింది. ఇంక ఏమీ తోచట్లేదు అని పేచీ పెడుతుంటే "పైకి వెళ్ళు..కుసుమత్తతో కబుర్లు చెప్పిరా.." అంది మామ్మయ్య. చేసేదేమీ లేక మళ్ళీ పైకి వెళ్ళాను. తలుపు వేసి ఉంది. కొట్టాలా వద్దా అనుకుంటూ సందులోకి వెళ్తే కిటికీ తలుపు తీసి ఉంది. కుసుమత్త ఏదో కుట్టుకుంటోంది. నన్ను చూసి వచ్చి తలుపు తీసింది నవ్వుతూ. చక్కగా చీర కట్టుకుని అమ్మంత పెద్ద బొట్టు పెట్టుకుని ఉంది. అది మా మొదటి పరిచయం. అలా భయపడుతూ వెళ్ళినదాన్ని, కాకినాడ వెళ్ళినప్పుడల్లా అన్నానికి తప్పించి మిగతా సమయం అంతా మేడ మీద కుసుమత్త ఇంట్లోనే పొద్దున్నుంచీ సాయంత్రం దాకా గడపడం వరకూ మా స్నేహం పెరిగింది. కుసుమత్తకి అప్పటికి పాతికేళ్ళు ఉంటాయేమో. కొత్తగా పెళ్ళయిన జంట. ఇద్దరే ఉండేవారు. మావయ్యగారికి బ్యాంక్ లో పని. "మావయ్యగారు రాగానే వచ్చేయాలి. అల్లరి చేయకూడదు." అని చెప్పి పైకి పంపించేవారు ఇంట్లో. మావయ్యగారు కూడా చాలా మంచాయన. మాతో(నేను ,తమ్ముడు) బాగా ఆడేవారు. కబుర్లు చెప్పేవారు. మా ఇద్దరికీ చెస్, పేక ఆడటం రెండూ వాళ్ళే నేర్పించారు. నలుగురం కలిసి ఇవే మార్చి మార్చి ఆడుతూ ఉండేవాళ్ళం. బెజవాడ వచ్చాకా కూడా చెస్ బోర్డ్ కొనుక్కుని నేనూ, తమ్ముడూ అడుతూ ఉండేవాళ్ళం. వెళ్ళినప్పుడల్లా మరో కొత్త పేకల సెట్ కూడా ఇచ్చేది కుసుమత్త. 

కుసుమత్తావాళ్ళింట్లో నాకు మరో అట్రాక్షన్ ఉండేది. పుస్తకాలు, వార పత్రికలు. నాకు తెలుగు చదవడం వచ్చాకా అదీ, ఇదీ అని లేదు పుస్తకం, కాయితం  ఏది దొరికితే అది చదివేసేదాన్ని. బజ్జీలు, పిడతకింద పప్పు కట్టి ఇచ్చే కాయితాలు కూడా తిన్నాకా చదివేసి పాడేసేదాన్ని. మా ఇంట్లో వారపత్రికలు ఉండేవి కావు. కాబట్టి అదో కొత్త సరదా నాకు. అన్నీ కాదు కానీ బావున్న సీరియల్స్ చదివేదాన్ని కుసుమత్త ఇంట్లో. వెళ్ళినప్పుడల్లా పాతవి  వెతుక్కుని ఐదారు పుస్తకాలు తెచ్చుకుని సీరియల్ భాగాలన్నీ ఒకేసారి చదివేదాన్ని. ఎదురుచూడక్కర్లేకుండా ఒకేసారి అంత కథ తెలిసిపోతే భలే ఉంటుంది. ఓ పక్క అమ్మ తిడుతూ ఉండేది. నీకెందుకే ఆ పత్రికలు అని. అప్పుడేమో పైనే కుసుమత్త ఇంట్లోనే అన్నీ చదివేసి వచ్చేసేదాన్ని. సాయంత్రాలు పార్క్ కో, ఎగ్జిబిషన్ ఉంటే అక్కడికో మమ్మల్ని వాళ్లతో పాటూ తీసుకెళ్ళేవారు కుసుమత్తా వాళ్ళు. 

ఒకసారి అమ్మావాళ్లు  బెజవాడ వెళ్పోయారు. ఎందుకో నేనూ, తమ్ముడూ ఉండిపోయాం కాకినాడలో. కుసుమత్తా వాళ్ళింట్లో చుట్టాల పిల్లలెవరో ఉన్నారు అప్పుడు. వాళ్ళని దింపడానికి బెజవాడ వచ్చారు వాళ్ళు. మమ్మల్ని కూడా తీసుకువచ్చేసారు. వేసవి సెలవలు. సర్కార్ ఎక్స్ప్రెస్ లో ప్రయాణం. విపరీతమైన ఎండ. వేడి. కుసుమత్త తన చీరొకటి తీసి, తడిపి కిటికీలకు,సీట్లకూ అడ్డుగా కట్టింది. చల్లగా భలే బావుంది. నలుగురు పిల్లలం,వాళ్ళిద్దరూ - మొత్తం ఆరుగురం పేకాట ఆడుకుంటూ, రకరకాల చిరుతిళ్ళు తింటూ బెజవాడ వచ్చేసాం. ఇలాంటి చిన్న చిన్న జ్ఞాపకాలు ఎప్పటికీ మర్చిపోలేము.

ఒక అబ్బాయి మా ఇంట్లో ఉండగానే పుట్టాడు. తర్వాత మావయ్యగారికి ట్రాన్ఫర్ అయి వేరే ఊరు వెళ్పోయారు. తర్వాత అమ్మాయి కూడా పుట్టిందని తెలిసింది. అప్పుడు ఫోన్లు కూడా లేవుగా. అప్పుడప్పుడూ ఉత్తరాలు ఉండేవి. తర్వాత ఏ కబురూ తెలీదు. చాలా ఏళ్ల తర్వాత మాకు బెజవాడలో తెలిసినవాళ్ల అబ్బాయి పెళ్ళి కుదిరితే, ఆ పెళ్ళికూతురు ఫలానా బ్యాంక్ అని తెలిసి, కుసుమత్త మావయ్యగారు కూడా అదే బ్యాంక్ కదా అని అమ్మ ఆ పెళ్ళికూతురుని అడిగి ఎలాగైతేనేం వాళ్ల అడ్రస్ సాధించింది. మా తమ్ముడి పెళ్ళి సమయం అది. శుభలేఖ వేస్తే మొత్తం నలుగురూ వచ్చారు. పెద్దవాళ్ళయి ఇంజినీరింగ్ చదువుతున్న కుసుమత్త పిల్లల్ని చూస్తే చాలా ఆనందం వేసింది. కుసుమత్త ఏ మాత్రం మారలేదు. అదే చిరునవ్వు, అదే ఆప్యాయత. నా చేతులు పట్టుకుని ఎంత సేపో కబుర్లు చెప్పింది. పిల్లల చదువుల వివరలు అడుగుతూ అమ్మాయి పేరేమిటి అని అడిగాను. చెప్పింది. "అయ్యో... నా పేరు.." అన్నాను. అవునంది. ఆశ్చర్యంతో "నా పేరని తెలుసా?" అన్నాను. "అందుకే పెట్టుకున్నాం." అంది. "నిజమా" అన్నాను. నిజమే అంది. మళ్ళీ అడిగాను "నిజంగానా" అని. "నిజమేరా" అంది. నా జీవితంలోని మెమొరబుల్ ఎమోషనల్ మోమెంట్స్ లో అదీ ఒకటి!! 

రెండుమూడేళ్ళ క్రితం వాళ్ల అబ్బాయి పెళ్ళని పిలిచింది కుసుమత్త. ఫోన్ చేసి మాట్లాడింది కూడా. ముఫై ఏళ్ల తర్వాత కూడా అదే ప్రేమ నిండిన స్వరం. అదే అభిమానం..! కానీ అప్పుడు మా అత్తయ్యగారికి ఒంట్లో బాలేక నేను వెళ్ళలేకపోయాను. ఇప్పుడు వాళ్ల అమ్మాయి పెళ్ళి. నా పేరు పెట్టిన అమ్మాయి పెళ్ళి! కానీ మా అమ్మాయి పరీక్షల సమయం, వేరే పనులు కూడా ఉన్నాయి.. వెళ్లలేనేమో..:( 

అన్నయ్య తప్పకుండా వెళ్తాడు. వెళ్లలేకపోయినా కుసుమత్త అర్థం చేసుకుంటుంది అని నమ్మకం. ఆనాటి ఆప్యాయతల గట్టిదనం అలాంటిది.

****  ****

వెళ్ళాను. వెళ్లగలిగాను! ఫంక్షన్ హాల్ గుమ్మంలో కుసుమత్త మావయ్యగారు కనబడ్డారు. "ఎవరో చెప్పుకోండి..." అనడిగాను. గుర్తుపట్టలేదు. అన్నయ్యని చూసి గుర్తుపట్టారు. అది కూడా వాట్సప్ లో వాడి ఫోటో చూశారుట, అలా గుర్తుపట్టారు. కుమత్తేదీ అని అడిగితే, ఎటో వెళ్తున్న తనని చూపించారు. గభాలున వెనక్కి వెళ్ళి, భుజాలు పట్టుకుని " నేనెవరో చెప్పుకో" అన్నాను.. నవ్వుతూనే ఆలోచిస్తూ చూసింది.. మళ్ళీ అడిగాను "నేనెవరో చెప్పుకో.." అని...హా...అనేసి గుర్తుపట్టేసిందిభలే అనిపించింది. "హ్మ్మ్...నువ్వు గుర్తుపట్టావు. మావయ్యగారు గుర్తుపట్టలేదు" అన్నాను. "ఎంత మారిపోయావూ.. పదేళ్లవుతోంది నిన్ను చూసి.."అంది. 


పెళ్ళి బాగా జరిగింది. మధ్యాన్నం, రాత్రి రెండు భోజనాలూ బాగున్నాయి. పొద్దున్నేమో చక్కగా సొజ్జప్పం వేశారు. వంకాయ పులుసు పచ్చడి కూడా. ఈ రెండు ఐటెమ్స్ నేనైతే పెళ్ళిళ్ళలో చూడలేదు.  రాత్రి టిఫిన్స్ తో పాటూ లక్కీగా నేను తినదగ్గ ఐటెమ్ దొరికింది -"కొర్రలతో బిసిబెళెబాత్". పెళ్ళయ్యాకా, టైమైపోతోందని పరుగులెడుతూ స్టేషన్ కి వెళ్ళాం. ఎక్కి కూర్చున్నాం. రైలు కదిలింది.